శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము

Table of Contents

24 - రసాతలము మొదలగు లోకముల వర్ణనము

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- వత్సా! సూర్యునకు పదివేల యోజనముల క్రింద రాహువు నక్షత్రము వలె తిరుగుచుండునని కొందరు చెప్పుచున్నారు. సింహిక పుత్రుడగు ఈ రాహువు తాను అసురులలో అధ ముడు. ఈతడు దేవత అగుటకు తగడు. అయిననూ, భగవానుని అనుగ్ర హముచే ఈతడు దేవత అయినాడు. వాని జన్మను, చేష్టలను కూడ తరు వాత వర్ణించెదను.

            గట్టిగా తపించే సూర్యుని ఈ మండలముయొక్క వైశాల్యము పది వేల యోజనములు. చంద్రమండలము పన్నెండు వేలు, రాహుమండ లము పదమూడు వేలు యోజనముల వైశాల్యమును కలిగియున్నవి. రాహువు అమావాస్యనాడు పూర్ణిమ నాడు సూర్యునకు, చంద్రునకు మధ్యలో అడ్డు తగులుచుండును. తనకు వారితో గల వెరమును స్మరించి, ఈతడు ఆ రోజులలో వారివైపు పయనించి, అడ్డు తగులును (గ్రహణము).

 ఆ విషయమును తెలుసుకున్న శ్రీహరి భగవానుడు సూర్యచం ద్రుల రక్షణ కొరకై వారిద్దరి వద్ద తనకు ప్రియమగు ఆయుధమైన చక్ర మును నియోగించెను. సుదర్శనమని ప్రసిద్ది గాంచిన భగవానుని ఆ చక్రము ఆ భగవానుని తేజస్సు గలదగుటచే, దానిని సహించుట శక్యము కాదు. నిరంతరముగా తిరుగుచున్న ఆ చక్రమునకెదురుగా రాహువు సుమారు గంట సేపు నిలిచి, కలవరపడి, వణికిపోయే హృదయముతో దూరమునుండియే వెనుకకు మరలును. దీనికే గ్రహణము అని లోకములో ప్రసిద్ధి.

                 తతోఽధస్తాత్సిద్ధచారణవిద్యాధరాణాం సదనాని తావన్మాత్ర ఏవ ।

            ఆ రాహువుకంటే అంతే (పదివేల యోజనముల) క్రింద సిద్దులు, చారణులు, విద్యాధరుల స్థానములు గలవు.

వాటి క్రింద వాయువు వీచేటంతవరకు, మేఘములు కనబడేటంత వరకు అంతరిక్షము. అది యక్షులు, రాక్షసులు, పిశాచములు, భూతము లు, ప్రేతముల గణములకు విహారస్థానము.

అంతరిక్షము క్రింద వందయోజనముల దూరమునందు ఈ భూమి గలదు. హంసలు, రాబందులు, గ్రద్దలు, గరుడపక్షులు మొదలగు ప్రముఖములైన పక్షులు ఎంతవరకు ఎగురునో, అంతవరకు పృథివియ నియే గ్రహించవలెను.

 భూమి ఎట్టి సంరచనతో నిలిచియున్నదో వర్ణించబడినది. ఈ భూమికి క్రింద కూడ ఒక్కొక్కటి పదివేల యోజనముల తేడాలో, అత లము వితలము సుతలము తలాతలము మహాతలము రసాతలము మరియు పాతాలము అనే ఏడు భూవివరములు (భూమి లోపలి లోక ములు) ఈశ్వరునిచే రచించబడి యున్నవి. వీటి పొడవు మరియు వెడల్పు కూడ పదివేల యోజనముల చొప్పున ఉండును.

స్వర్గమువంటి ఈ బిలములయందు స్వర్గముకంటె కూడ అధిక మగు ఇంద్రియభోగములు, ఐశ్వర్యము, ఆనందము, ప్రభావము, సంప దలు గలవు. వీటితో మిక్కిలి సమృద్ధములైయుండే భవనములలో దితి-ద ను-కద్రు వంశములకు చెందిన రాక్షసులు నివసిస్తూ ఉద్యానవనములలో, క్రీడాస్థానములలో మరియు విహారస్థలములయందు విహరించుచుందురు. వారు అనురాగముతో కూడిన భార్యలతో పిల్లలతో బంధుమిత్రులతో మరియు అనుచరులతో గూడి, సర్వకాలములలో ఉల్లాసముగానుండే గృహస్థజీవనమును గడుపుచుందురు. మాయామయమగు క్రీడలతో వినో దించే వారి కామనలను లోకపాలకులు కూడ అడ్డుకొనలేరు.

ఓ పరీక్షిన్మహారాజా! ఈ లోకములలో మాయావియగు మయు నిచే నిర్మించబడిన నగరములలో రంగురంగుల భవనములు, ప్రాకారము లు, గోపురములు, సభామండపములు, గుడులు, కూడళ్లు, విశ్రాంతిగృహ ములు మొదలగునవి, మరియు రాతికట్టడపు నేలలు, ఆ లోకముల ప్రభు వుల గొప్ప గృహములు ప్రకాశించుచుండును. ఆ నగరములకు అలంకార ములైన ఈ కట్టడములను మయుడు అనేకములైన శ్రేష్ఠములగు మణు లలో ముఖ్యమగు వాటితో పొదిగి నిర్మించేను. ఆ రాతికట్టడపు నేలల యందు నాగుల మరియు అసురుల జంటలు, పావురములు, చిలుకలు, మైనాలు ఎడము లేకుండా వ్యాపించియుండును.

ఉద్యానవనములలో చెట్లు అందమైన చిగుళ్లతో, పువ్వుల పళ్ల గుత్తులతో వంగిన అందమైన కొమ్మలతో, తమను వాటేసుకొనియున్న లతాభాగములతో, మనస్సునకు ఇంద్రియములకు మిక్కిలి ఆహ్లాదమును కలిగించుచుండును. వాటిలో స్వచ్చమగు నీటితో నిండియున్న సరస్సు లలో పలురకముల పక్షుల జంటలు శోభిల్లుచుండును. ఆ సరస్సులలో వట్టి వేరు, నాచు, కలువ, సౌగంధికము, నల్ల కలువ, ఎర్ర తామర మొదలగు మొక్కలు గుంపులుగా పెరిగియుండును. చేపల గుంపులు పైకి ఎగు రుతూ నీటిని కల్లోలితము చేయుచుండగా, ఆ నీటి మొక్కల గుంపులలో నివాసమేర్పరచుకుని పక్షులు అడ్డు ఆపు లేకుండా విహరిస్తూ, పలువిధ ముల మధురమైన కూతలను కూయుచుండ, ఆ సంకులమగు ధ్వని చూప రుల ఇంద్రియములకు ఉత్సవమును చేయుచుండును. ఈ విధముగా ఆ ఉద్యానవనములు స్వర్గలోక శోభను తలదన్ని యుండును.

                యత్ర హ వావ న భయమహోరాత్రాదిభిః కొలవిభాగైరుపల క్ష్యతే ॥

            అక్కడ సూర్యచంద్రులు లేకుండుటచే, రాత్రింబగళ్లు మొదలైన కాలవిభాగము గాని, దాని వలన కలిగే తలనొప్పులు గాని ఉండవు.

అక్కడి గొప్ప పెద్ద నాగుల పడగలయందలి మణులే చీకటినం తనూ పారద్రోలుచుండును.

ఈ లోకములలో నివసించువారు దివ్యములగు ఓషధులను, రస ములను, రసాయనములను, ఆహారమును, పానీయమును సేవిస్తూ, దివ్య జలములలో స్నానము మొదలగునవి చేయుటచే, వారికి మానసికమగు చింతలు గాని, వ్యాధులు గాని ఉండవు. వయస్సు మీదబడి ముసలిదనము వలన శరీరము ముడుతలు పడుట, జుట్టు తెల్లబడుట అనే స్థితి వీరికి ఉండదు. మరియు, దేహము పాలిపోవుట, దుర్గంధమును కలిగి యుండుట, చెమట పట్టుట, బడలిక, నిరుత్సాహము అనే పెద్ద వయస్సు లోని లక్షణములు కూడ వీరికి నిశ్చయముగా కలుగవు.

పుణ్యపురుషులగు వారికి భగవంతుని తేజోరూపమగు సుదర్శన చక్రమును మినహాయిస్తే, ఇతరము ఏదైననూ మృత్యువును కలిగించలేదు.

            ఆ చక్రము ప్రవేశించగానే భయము వలన అసురస్త్రీలకు వెంటనే గర్భస్రావములు మరియు గర్భపాతములు కలుగును.

 

            మరియు అతలమునందు మయుని పుత్రుడగు బలాసురుడు గల డు. ఈ లోకములోని మాయలలో తొంభై ఆరింటిని నిశ్చయముగా. ఆతడే సృష్టించెను. కొందరు మాయావులకు ఆ మాయలలో కొన్ని ఇప్పటికీ తెలి యును. ఒకసారి ఆతడు ఆవులించినప్పుడు, స్వైరిణులు (యథేచ్చగా సంచరించువారు), కామినులు (కామాధిక్యము గలవారు), పుంశ్చలులు (చంచలమైన మనస్సు గలవారు) అనే మూడు స్త్రీగణములు ఉదయించే ను. ఆ బిలలోకములోని పురుషులకు వారు హాటకము అనే రసమును త్రాగించి, సంభోగసమర్థులుగా తయారు చేయుదురు. అపుడు వారా పురు  షుని తమ విలాసలు, చూపులు, అనురాగముతో కూడిన చిరునవ్వులు, కబుర్లు, కౌగిలింతలతో యథేచ్ఛగా రమింప జేసెదరు. ఆ రసమును త్రాగిన వ్యక్తి, నేనే ప్రభుడను అనియు, నేనే సిద్దుడను అనియు బీరము లను పలుకుచుండును. ఆతడు గర్వముచే కన్ను మిన్ను గానని వాడు వలె, తనకు పదివేల గొప్ప ఏనుగుల బలము గలదనే అభిమానముతో విర్రవీగుచుండును.

అతలముకంటె క్రింద వితలమునందు పాపములను పోగొట్టే హాట కేశ్వరుడని ప్రసిద్ధి గాంచిన శివ భగవానుడు, బ్రహ్మగారి సృష్టిని వర్ధిల్ల జేయుట కొరకై, పార్వతితో కలిసి నివసించును. ఆయన అనుచరులగు భూతగణములు ఆయనను చుట్టువారి యుందురు. శివపార్వతుల తేజ స్సుచే అక్కడనుండి హాటకి అనే గొప్ప నది ప్రవహించినది. వాయువుచే ప్రజ్వరిల్ల జేయబడే అగ్ని ఆ నీటిని ఉత్సాహముతో త్రాగి ఉమియగా, అదియే హాటకము అనే బంగారము అయినది. అసురప్రభువుల అంతఃపుర ములలో పురుషులు స్త్రీలతో గూడి ఆ బంగారముతో చేసిన ఆభరణము లను ధరించెదరు.

వితలముకంటె క్రింద సుతలము గలదు. విరోచనుని పుత్రుడైన, గొప్ప పవిత్రమైన కీర్తి గల బలి ఇప్పటికీ ఆ సుతలమునందే ఉన్నాడు. మహేంద్రునకు ప్రియమును చేయగోరిన భగవానుడు అదితి కడుపున పుట్టి, బ్రహ్మచారియగు వామనుని రూపముతో ముల్లోకములను బలివద్ద నుండి లాగుకొనెను. కాని, ఆయనయే బలిపై అనుగ్రహమును చూపి సుత లమునందు ప్రవేశ పెట్టెను. ఇంద్రుడు మొదలగువారికి కూడ లేని మిక్కిలి సమృద్ధమగు సంపద బలికి గలదు. ఆయన ఆరాధ్యుడగు ఆ భగవానుని మాత్రమే స్వధర్మమునాచరిస్తూ ఆరాధించుచున్నాడు. ఇప్పుడు ఆయనకు ఇంద్రాదుల వలన భయము లేదు.

సకలప్రాణిసమూహములయందు వాసుదేవ భగవానుడే జీవుడై, అంతరతమమగు ఆత్మరూపుడై ఉన్నాడు. మిక్కిలి పవిత్రుడగు ఆయనయే దానమునకు పాత్రుడై రాగా, బలి పరమశ్రద్దతో, గొప్ప ఆదరముతో, ఏకాగ్ర మగు చిత్తముతో ఆయనకు భూమిని సమర్పించెను. అయిననూ, సుతల మునందలి ఐశ్వర్యము ఈ దానముయొక్క ఫలము కానే కాదు. ఈ దానము మోక్షమునకే ద్వారమై యున్నది.

            తుమ్ముట, పడుట, జారుట మొదలగు సందర్బములలో వ్యక్తి స్వాధీనత తప్పియున్ననూ, ఆ భగవానుని పేరును ఒక్కసారి పలికి, కర్మ బంధనమగు సంసారమును తేలికగా అతిక్రమించును. ఇది నిశ్చయము. మోక్షమును కోరు సాధకులు ఇతరములైన యోగము మొదలగు ఉపాయ ములచే మాత్రమే సంసారమును దూరము చేసుకొనగల్గుచున్నారు.

            కావున, భక్తులకు ఆత్మజ్ఞానులకు తనను తానే సమర్పించువాడు, సర్వప్రాణులకు ఆత్మరూపుడు అగు శ్రీహరియందు ఆత్మభావముతో చేయబడిన దానమునకు ఫలము మోక్షమే యగును.

శ్రీహరి భగవానుడు ఈ ఇంద్రుని అనుగ్రహించనే లేదు. ఇది నిశ్చయము. ఏలయనగా, ఆయన ఇంద్రునకు మిథ్యాభూతములగు (ప్రకృ తికార్యములగు) భోగముల ఐశ్వర్యమును మాత్రమే విస్తరింప జేసినాడు. ఆ భోగములు వ్యక్తికి శ్రీహరిని స్మరించే అవకాశమును అపహరించును.

            ఏలయనగా, అప్పుడు శ్రీహరి భగవానునకు మరియొక ఉపా యము తోచక పోవుటచే, యాచించుట అనే నెపముతో, బలినుండి ఆతని శరీరము తప్ప, ముల్లోకములను కూడ అపహరించి వేసెను. అపుడాయన బలిని వరుణుని పాశములతో బంధించి, పర్వతగుహయందు పారవైచెను. అపుడు బలి ఇట్లు పలికెను.

అయ్యో! ఈ -ఇంద్రుడు నిశ్చయముగా పూజనీయుడే; కాని, ఈతడు తన హితమును సాధించుకొనుటలో నేర్పరి కాదు. ఏలయనగా, ఈతడు బృహస్పతిని అనన్యభావముతో సలహాలనిచ్చే మంత్రిగా ఏరి కోరి  తెచ్చుకున్నాడు. కాని, ఆయన మాటను కాదని త్రోసిపుచ్చి, తాను వాము నుని ద్వారా నావద్దనున్న సంపదలనే కోరుకొనెను. అంతేగాని, ఆ శ్రీహరి యొక్క దాస్యమును కోరనే లేదు. ఈ కాలము అనంతము. దీనికి మన్వం తరకాలముచే అంతమయ్యే ఈ ముల్లోకములు ఎంత?

ప్రహ్లాదుడు మా తాత. ఆయన తండ్రియగు హిరణ్యకశిపుని శ్రీహరీ సంహరించి, భయరహితమగు ఆ రాజ్యాధికారమును ప్రహ్లాదునకు ఇచ్చుచుండెను. కాని, తన తండ్రికి చెందిన ఆ అధికారము భగవానుని కంటే భిన్నమైనదగుటచే, ప్రహ్లాదుడు దానిని ఇచ్చగించనేలేదు. ఆయన భగవానుని భక్తుల దాస్యమునే వరముగా కోరుకొనెను గదా!

ప్రహ్లాదుడు గొప్ప ప్రభావము గలవాడు. రాగద్వేషములు తొలగిం చుకోకుండా, భగవానుని అనుగ్రహము నిండా లేకుండా, నావంటి వాడు ఎవడు ఆయన మార్గమును అనుసరించి వెళ్ల గోరును? అని బలి పలికెను.

            ఆ బలి వృత్తాంతమును మున్ముందు విస్తారముగా చెప్పగలను. సకలలోకములకు తండ్రియగు నారాయణ భగవానుని హృదయము తన భక్తుల యెడల దయతో నిండియుండును. ఆయన స్వయముగా బలి ద్వారము వద్ద గద చేతబట్టి నిలిచి యుండును. దిగ్విజయము కొరకై అచ టకు వచ్చిన దశకంఠుని ఆయన కాలి బొటన వేలితో పది కోట్ల యోజన ముల దూరము విసరివైచెను.

సుతలము క్రింది లోకము తలాతలము. దానిలో మయుడని ప్రసిద్ధి గాంచిన రాక్షసప్రభుడు ఉన్నాడు. మాయావులకు ఆచార్యుడగు ఆ మయుడు మూడు నగరములకు అధిపతి. కాని, మహాదేవుడు ముల్లోకము లకు సుఖమును కలిగించ గోరి, ఆ మూడు నగరములకు శత్రువు అయినా డు. ఆయన ఆ మూడు నగరములను పూర్తిగా తగులబెట్టెను. కాని, ఆయన అనుగ్రహించి మయునకు ఇచట స్థానమును కల్పించి, ఆతనిని అన్ని విధములుగా రక్షించెను. మయుడు ఈ లోకములో సుదర్శనచక్రము వలని భయము లేనివాడై, పూజలనందు కొనుచున్నాడు.

 తలాతలమునకు క్రింది లోకము మహాతలము. దానియందు కద్రువు సంతానమైన సర్పముల గణము గలదు. అనేకములగు తలలు గల ఆ సర్పముల గణమునకు క్రోధవశము అనే పేరు ప్రసిద్ధి. పెద్ద పడగలు గల కుహకుడు, తక్షకుడు, కాలియుడు, సుషేణుడు మొదలగువారు ఆ గణములోని పెద్దలు. వీరు అన్ని కాలములలో పక్షి శ్రేష్ఠములకు రాజు, పురుషోత్తముని వాహనము అగు గరుత్మంతుని వలన కలవర పడుచుందు రు. కాని, ఒక్కొక్కప్పుడు తమ భార్యలు, పిల్లలు, మిత్రులతో బాటు కుటుంబమంతయు కలిసియుండుట వలన వారు ఆ భయమును ప్రక్కన బెట్టి ఒళ్లు మరచి విహరించుచుందురు.

మహాతలముకంటె క్రింది లోకము రసాతలము. అచట పణులు, నివాతకవచులు, కాలేయులు, హిరణ్యపురవాసులు అని ప్రసిద్ధి గాంచిన దైత్యదానవగణములు పుట్టలలోని పాములు వలె నివసించును. దేవశత్రు వులగు ఆ దైత్యదానవులు పుట్టుక తోడనే గొప్ప బలము మరియు గొప్ప సాహసము గలవారు. అన్ని లోకములలో మహిమాన్వితుడైన శ్రీహరి భగ వానుని తేజస్సుచే మాత్రమే, తాము బలవంతులమనే వారి గర్వము అణ చబడినది. ఇంద్రుని దూతయగు సరమ (దేవతల కుక్క) మంత్రరూపము లగు వాక్కులు కారణముగా, వారు ఇంద్రునకు భయపడుచుందురు.

రసాతలమునకు క్రింది లోకము పాతాళము. దానిలో శంఖుడు, కులికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖ చూడుడు, కంబలుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలగు పెద్ద పడగలు గల సర్పములు నివసించును. గొప్ప కోపము గల ఆ సర్పములలో వాసుకి ప్రముఖుడు. వారికి అయిదు, ఏడు, పది, వంద, లేక వేయి తలలు ఉండును. ఈశ్వరుడు వారి పడగలలో గొప్పగా ప్రకాశించే గొప్ప మణు లను పెట్టినాడు. వాటి కాంతులు బిలలోకమగు పాతాళమునందలి చీకట్ల సమూహములను పారద్రోలుచుండును.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో

రసాతలము మొదలగు లోకములను వర్ణించే ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది .