శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము

Table of Contents

19 - శ్రీరామ మంత్ర స్తోత్రములు - భారతదేశ మహిమ

            శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కింపురుషవర్షమునందు భగవ ద్బక్తులలో ఉత్తముడగు హనుమంతుడు కింపురుషులతో గూడి అచంచల మగు భక్తితో శ్రీరామ భగవానుని ఉపాసించుచున్నాడు. జగత్కారణుడు, పూర్ణుడు, లక్ష్మణునకు అన్నగారు, సీతాదేవికి మిక్కిలి ప్రియమైనవాడు అగు శ్రీరాముని పాదముల సన్నిధి హనుమంతునకు చాల ప్రీతికరమైనది.

అచట గంధర్వులు మిక్కిలి మంగళకరమగు శ్రీరామ భగవానుని గాథను గానము చేయుచుందురు. హనుమంతుడు ఆర్ష్టి షేణుడనే కింపు రుషనాయకునితో గూడి, తన ప్రభువుయొక్క గాథను సావధానముగా వినుటయే గాక, తాను కూడ ఈ క్రింది మంత్రమును జపించి, స్తోత్రమును పఠించుచుండును.

భగవానుని అవతారమగు శ్రీరాముని కీర్తి గొప్పది. మనోనిగ్ర హము గల ఆయనయందు, శ్రేష్ఠపురుషుల లక్షణములు, స్వభావము మరియు ఆచరణము కూడ గలవు. ఆయన తాను పాలించే 'జనులనే దైవ ముగా 'ఉపాసించిన చక్రవర్తీ.! వేదవేత్తలయెడల 'భక్తి గల ఆయన, మంచి వాడు అనే మాటకు గీటురాయి. ఆ పురుషోత్తమ దేవునకు అనేక నమస్కా రములు, అని ఆయన జపించెను.

అద్వయపరబ్రహ్మ వ్యక్తియొక్క అంతరతమస్వరూపమగు ఆత్మయై ఉన్నది. సాధకుడు పరిశుద్ధమగు అంతఃకరణములో బ్రహ్మను కర్తృత్వభోక్తృత్వములు గాని, అహంకారము గాని లేని స్వానుభవరూప ముగా మాత్రమే పొందగల్గును. నామరూపములకు అతీతమైన అట్టి ఆత్మ తత్త్వముయొక్క నిరంజనమగు స్వరూపముయొక్క ప్రకాశము చేతనే, క్రమముగా సత్త్వరజస్తమోగుణముల కార్యములైన స్వప్నజాగ్రత్సుషుపు లనే అవస్థల సంసర్గము నిరాకరించబడినది. నిర్వికారమగు అట్టి ఆత్మత త్వమును నేను శరణు పొందుచున్నాను.

పరమేశ్వరుడు కేవలము రాక్షససంహారము కొరకు మాత్రమే గాక, మానవులకు ఆచరణ ద్వారా బోధించుటకై ఈ లోకములో మానవుడై అవ తరించెను. అట్లు గానిచో, ఆత్మారాముడు మరియు ఆత్మరూపుడు అగు ఈశ్వరునకు సీత కారణముగా దుఃఖములు కలుగుట ఎట్లు పొసగును?

            సర్వజగన్నివాసుడు, స్వయంప్రకాశ స్వరూపుడు 'అగు ఆ శ్రీహరి భగవానుడు సకలప్రాణులలో ఆత్మరూపుడై యున్నాడు. జితేంద్రియులకు గొప్ప హితకారియగు ఆ శ్రీహరికి ముల్లోకములలో దేనిపైననూ నిశ్చయ ముగా ఆసక్తి లేదు. భార్య కారణముగా ఆయన యథార్థముగా దుఃఖము లను పొందినాడనుట గాని, లక్ష్మణుని విడిచి పెట్టినాడనుట గాని పొసగదు. ( ఒక సందర్భములో రాముడు లక్ష్మణుని పరిత్యజించినాడని కథ గలదు ).

            మహాత్మునకు సంతోషము కలిగించేవి గొప్ప వంశములో జన్మిం చుట గాని, అందము గాని, మాటకారి తనము గాని, పాండిత్యము గాని, జాతి గాని కావు. ఇది నిశ్చయము. ఏలయనగా, అడవిలో బ్రతికే మాలో ఈ లక్షణములు ఏవీ లేవు. అయిననూ, లక్ష్మణుని అన్నగారగు ఆ శ్రీరా ముడు మమ్ములను తన మిత్రులుగా స్వీకరించేను. ఆశ్చర్యము!

దేవత గాని, అసురుడు గాని, వానరుడు గాని, మానవుడు గాని ఎవ్వరైననూ ఆ శ్రీరాముని సేవించవలెను. పురుషోత్తముడగు శ్రీహరియే మానవుడై శ్రీరాముడుగా అవతరించెను. శ్రీరాముడు ఇతరులు చేసిన చిన్న ఉపకారమునైననూ చక్కగా గుర్తులో నుంచుకొనెడివాడు. ఆయన ఉత్తరకోసలదేశవాసులకు స్వర్గముననుగ్రహించెను, అని హనుమంతుడు స్తుతించెను.

            భారతఖండమునందు కూడ భగవానుడు దయతో జితేంద్రియుల ననుగ్రహించుటకొరకై నరనారాయణులు అనే పేరుతో అవతరించి, కంటికి కానరాకుండా కల్పాంతము వరకు తపస్సు చేయుచున్నాడు. ఇట్టి తప స్సుచే ధర్మము జ్ఞానము వైరాగ్యము ఇంద్రియవశీకరణము మనశ్శాంతి మరియు క్రియలనుండి విరమించుట అనే లక్షణములు వర్ధిల్లి, సాధకునకు ఆత్మజ్ఞానము ఉదయించును.

పూజనీయుడగు నారదుడు భగవానునిచేతనే ఉపదేశించబడిన ఆత్మజ్ఞానమును, దానికి ఉపాయమగు కర్మయోగమును, వాటితో బాటుగా భగవానుని మహిమను వర్ణించే ఆగమమును సావర్ణి మనువునకు ఉపదేశిం చగోరెను. అపుడాయన వర్ణాశ్రమవంతులగు భారతదేశ ప్రజలతో గూడి ఆ నరనారాయణుని సేవించి, గొప్ప భక్తితో నిండిన మనస్సుతో ఈ మంత్ర మును జపించును.

ఓమ్. శాంతస్వభావముగల నరనారాయణ మూర్తికి అనాత్మలగు దేహాదులపై ఆత్మభావము లేదు. దరిద్రులకు నిధియగు ఆ భగవానుడు మహర్షులలో శ్రేష్ఠుడు, పరమహంసలకు పరమగురువు, ఆత్మారాములగు మహాత్ములకు అధీశ్వరుడు. ఆ భగవానునకు అనేక నమస్కారములు.

 నారదుడు ఈ క్రింది స్తోత్రమును కూడ గానము చేయుచున్నాడు --- ఆ జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను చేసేది భగవానుడే. కాని, ఆయనకు కర్తృత్వము (చేసేవాడను నేనే అనే ధారణ) అనే బంధము లేదు. ఆయన ప్రాణుల దేహములలో ఆత్మరూపముగా నున్నాడు. కాని, ఆయనకు దేహధర్మములగు పుట్టుక, మరణము మొదలగు వాటిచే తీర స్కారము లేదు. ప్రాణులయందలి ద్రష్ట ఆయనయే. కాని, శుద్ధచైతన్యస్వ రూపుడగు ఆయనకు చైతన్యముచే ప్రకాశింప జేయబడే మనోవృత్తులలోని

సత్త్వరజస్తమోగుణములతోడి కాలుష్యము లేదు. ఆయన ప్రాణులలో ఆత్మరూపముగా దేహేంద్రియాదులకంటే విలక్షణుడై వాటితోడి సంగము లేకుండా సాక్షియై నిలిచియున్నాడు. ఆయనకు నమస్కారము.

                        ఓ యోగేశ్వరా! సాధకుడు చెడ్డదైన దేహాభిమానమును విడిచి పెట్టి మరణించే సమయములో మనస్సును భక్తితో నిర్గుణుడవగు నీయందు నిలుపవలెను. ఇదియే యోగములోని కౌశలము. దీనినే పూజనీయుడగు హిరణ్యగర్భుడు కూడ బోధించెను.

అజ్ఞాని ఇహపరలోకములయందలి సుఖములయందు ఆసక్తి కలిగి యుండును. అట్టివాడు చెడు దేహమునందు అభిమానము గలవాడై మర ణమునకు భయపడుతూ, భార్య పిల్లలు సంపదల గురించి చింతిల్లుచుం డును. వివేకవంతుడు కూడ అదే విధముగా భయపడే పక్షములో, వాని సాధన కేవలము శ్రమ మాత్రమే యగును.

ఓ ప్రభూ! నీవు ఇంద్రియశక్తుల మూలములో ఆత్మరూపుడవై యున్నావు. మాకు నీ మాయచే ఈ చేడు దేహమునందు భేదించ శక్యము కాని అహంకార మమకారములు స్థిరపడి యున్నవి. కావున, నీవు మాకు సహజమగు భక్తియోగమును కలిగించుము. దాని ప్రభావముచే మేమీ అహంకార మమకారములను శీఘ్రముగా పోగొట్టుకోనేదము, అని హను మంతుడు ప్రార్థించును.

ఈ భారతఖండమునందు అనేకములగు పర్వతములు, నదులు కూడ కలవు. మలయము, మంగలప్రస్థము, మైనాకము, త్రికూటము, ఋషభము, కూటకము, కోల్లకము, సద్యము, దేవగిరి, ఋష్యమూకము, శ్రీశైలము, వేంకటము, మహేంద్రము, వారిధారము, వింధ్యము, శుక్తిమం తము, ఋక్షగిరి, పారియాత్రము, ద్రోణము, చిత్రకూటము, గోవర్ధనము, రైవతకము, కకుభము, నీలము, గోకాముఖము, ఇంద్రకీలము, కామగిరి అనునవి మాత్రమే. గాక పర్వతములు వందల వేల సంఖ్యలో గలవు. వాటి నడుమ భాగములనుండి లెక్క లేనన్ని నదములు (పడమరగా పారే యేరు లు), నదులు పుట్టుచున్నవి.

            పేర్లను స్మరించినంత మాత్రాన పవిత్రులను చేసే ఈ నదుల జల ములలో భారతీయులు స్నానములను చేయుచుందురు.

చంద్రవశ, తామ్రపర్ణి, అవట్లోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణ, వేణ్య, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్టి, తాపి, రేవ, సురస, నర్మద, చర్మణ్వతి, సింధువు, మహానది, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసొము, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయు, రోధస్వతి, సప్తవతి, సుషోమ, శత ద్రు, చంద్రభాగ, మరుద్వృధ, వితస్త, అసిక్ని, విశ్వ అనే గొప్ప నదులు, అంధము మరియు శోణము అనే నదములు గలవు.

ఈ ఖండమునందు జన్మించిన మానవులకు మాత్రమే తాము చేసుకున్న సాత్త్విక రాజస తామస కర్మలను బట్టి క్రమముగా దేవలోక మనుష్యలోక నరకలోకములయందు పలువిధముల జన్మలు కలుగును. ఏలయనగా, సకలజీవులకు సకలగతులు కర్మానుసారముగా సంభవమగు ను. వివిధవర్ణములకు చెందిన జనులు తమ తమ కర్తవ్యములను చేసి, మోక్షమును కూడ పొందవచ్చును.

సాధకునకు పురుషోత్తముని భక్తులతో దృఢమగు సంగము కలిగిన ప్పుడు, ఆతనిలో వాసుదేవ భగవానునియందలి భక్తియోగము ఇతరఫల ముల తృష్ణ లేని విధముగా స్థిరమగును. అదియే మోక్షముయొక్క లక్షణ ము. సర్వభూతములలో అంతరతమమగు ఆత్మరూపముగా నుండే భగవా నునియందు ప్రాణుల మనస్సులలోని రాగద్వేషముల సంపర్కము ఉండ దు. వాక్కులకు గోచరము కానివాడు, సర్వాధారుడు, మరియొక ఆధా రము లేనివాడు, వినాశము లేనివాడు అగు భగవానునియందలి భక్తి సాధ కుని హృదయములోని అజ్ఞానము అనే పీటముడిని తొలగించును. జీవు నకు పలువిధముల జన్మలనిచ్చేది ఈ అజ్ఞానమే. ఈ తీరున అజ్ఞానము తొలగి సాధకుడు మోక్షమును పొందును.

దేవతలు ఈ విధముగా గానము చేయుచుందురు --- ఆశ్చ ర్యము! వీరు ఎట్టి పుణ్యమును చేసిరి? లేక, శ్రీహరి స్వయముగనే వీరి యందు ప్రసన్నుడైనాడా? ఏలయనగా, వీరు భారతప్రాంగణములో మను ష్యులై పుట్టినారు. ఇది మోక్షమునిచ్చే శ్రీహరిని సేవించుటకు సాధనమైన జన్మ. ఇట్టి జన్మ మనకు కేవలము కోరికగా మాత్రమే మిగిలి పోయినది.

మనము చేయుటకు కఠినమైన యజ్ఞములను, తపస్సును, ప్రత ములను, దానములను, లేక ఇతరసాధనములను అనుష్టించి, అల్పమగు స్వర్గమును సంపాదించితిమి. కాని, మనకు దీనితో ప్రయోజనమేమున్నది? ఏలయనగా, ఈ స్వర్గములో ఇంద్రియభోగముల ఉత్సవము అతిశయముగా నుండుటచే, నారాయణుని పాదపద్మముల స్మరణము తుడిచి పెట్టబడినది.

            స్వర్గాది పుణ్యలోకములో కల్పము (వేయి మహాయుగములు) ఆయుర్దాయము కలిగి మరల జన్మించుట కంటె, భారతభూమిలో పుట్టి అల్పమగు ఆయుర్దాయమును కలిగియుండుటయే మేలు. ఏలయనగా, భారతభూమిలో పుట్టిన వివేకవంతులు ఆ నశ్వరమగు దేహముతోనే ఆ అల్పకాలములోనే చేసిన కర్మను ఒక్క క్షణములో శ్రీహరికి సమర్పించి, భయరహితమగు శ్రీహరిపదము (మోక్షము) ను చక్కగా పొందెదరు.

ఎక్కడనైతే శ్రీహరియొక్క గాథలు అనే అమృతనదులు లేవో, భగవంతుని శరణు వేడిన భగవద్భక్తులగు సాధు పురుషులు లేరో, ఆ యజేశ్వరుని ఆరాధించే యజ్ఞములు మరియు కీర్తించే గొప్ప ఉత్సవ ములు లేవో, అట్టి స్థానము ఇంద్రలోకమే అయిననూ, దానికి దూరముగా నుండదగును. ఇది నిశ్చయము.

మనుష్యదేహము జ్ఞానేంద్రియములతో, కర్మేంద్రియములతో మరియు పంచభూతములతో సంపన్నమై యున్నది. అట్టి దేహముతో ఈ భారతదేశములో పుట్టిన జనులు మరల పుట్టుక లేని మోక్షము కొరకు ప్రయత్నించవలెను. అట్లు చేయనిచో, వేటగాని వలనుండి విడుదల అయిన పిదప కూడ మరల నూకల లోభముతో వానికే చిక్కే పక్షులు వలే, ఆ జనులు మరల సంసారబంధమునే పొందెదరు. ఇది నిశ్చయము.

భారతీయులు యజ్ఞములో ఖచ్చితముగా నిర్దేశించబడిన హోమ ద్రవ్యములను ఆయా దేవతలకు భాగములను విడదీసి, ఆ దేవతలను వేర్వేరు నామములతో ఆహ్వానించి, యథావిధిగా మంత్రములతో శ్రద్ధగా హోమము చేసెదరు. అపుడు అద్వితీయుడు (సర్వదేవతాస్వరూపుడు), పూర్ణుడు, పురుషార్థములను అనుగ్రహించువాడు అగు ఆ శ్రీహరియే స్వయముగా ఆనందముతో ఆ హోమద్రవ్యమును స్వీకరించును.

మానవులు కోరికతో భగవానుని సేవించినచో, వారికి ఆయన ఆ కోరికను తీర్చును. ఇది యథార్థము. కాని, ఆ విధముగా కోరికను తీర్చు టలో భగవానుడు పరమార్థమగు మోక్షమునిచ్చినట్లు అగుట లేదు. ఏలయ న, ఆ భోగము క్షయమైన తరువాత ఆ భక్తుడు మరల మరియొక కోరికతో ముందుకు వచ్చును. కాని, కోరికలు లేకుండా భగవానుని సేవించువార లకు ఆయన స్వయముగా తన చిగురువలె సుకుమారమైన పాదము ననుగ్రహించును. ఆ అనుగ్రహము వలన వారి సకలకామనలు ఈడేరినట్లే యగును.

మేము చక్కటి యజ్ఞములను మరియు ఇతరకర్మలను చేసి, మంచి పలుకులను పలికి, ఆ పుణ్యముచే స్వర్గసుఖమును అనుభవించు చుంటిమి. ఇంకనూ ఆ పుణ్యము ఈ నాటివరకు మిగిలియున్నచో, దాని ప్రభావముచే మాకు అజనాభ వర్షము (భారత దేశము) నందు శ్రీహ రియొక్క స్మృతితో కూడిన మనుష్యజన్మ కలుగుగాక! ఏలయనగా, శ్రీహరి తన భక్తులకు ఆత్మానందమును అనుగ్రహించును.

 శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! సగరుని పుత్రులు యజ్ఞాశ్వమును వెదుకుతూ భూమిని చుట్టూ త్రవ్వినారు. ఆ సమ యులో జంబూద్వీపమునందు ఎనిమిది ఉపద్వీపములు ఏర్పడినవని కొందరు వర్ణించుచున్నారు.

ఆ ఉపద్వీపములు పేర్లు ఇవి --- స్వర్ణప్రస్థము, చంద్రశుక్లము, ఆవర్తనము, రమణకము, మందరహరిణము, పాంచజన్యము, సింహళము మరియు లంక.

భరతవంశీయులలో ఉత్తముడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధ ముగా నేను నీకు జంబూద్వీపములోని ఖండముల విభాగమును మా గురువు గారు చెప్పిన విధముగా వర్ణించి చెప్పితిని, అని శుకుడు పలికెను.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో శ్రీరామ మంత్రస్తోత్రములను, భారతదేశ మహిమను వర్ణించే పంతొమ్మిదవ అధ్యాయము ముగిసినది.