శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము

Table of Contents

23 - జ్యోతిశ్చక్రము - శిశుమార వర్ణనము

శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను --- సప్తర్షిమండలమునకు పద మూడు లక్షల యోజనముల పైన ధ్రువమండలము గలదు. అది విష్ణువు యొక్క సర్వోత్కృష్టమైన ధామమని మహాత్ములు చెప్పుచున్నారు. అచట ఉత్తానపాదుని పుత్రుడు, గొప్ప భగవద్బక్తుడు అగు ధ్రువుడు ఉండును. అగ్ని, ఇంద్రుడు, కశ్యప ప్రజాపతి మరియు ధర్ముడు నక్షత్రరూపులై ఏకకా లములో ఆ మండలమును సాదరముగా ప్రదక్షిణము చేయుచుందురు. కల్పాంతము వరకు నిలిచి ఉండే జీవులకు ధ్రువుడే ఆశ్రయము. ఈ లోక ములో ఆ ధ్రువుని ప్రభావమును నేనిదివరలో వర్ణించియుంటిని.

రెప్పపాటు నేరుగని ఈ కాలము భగవానుని శక్తి. దాని వేగము ఇంద్రియగోచరము కాదు. అట్టి కాలము గ్రహములు, నక్షత్రములు మొద లగు కాంతిమండలముల సమూహములనన్నింటినీ గిర గిర త్రిప్పుచున్న ది. అట్లు తిరుగుచున్న మండలములకు ఈశ్వరుడు ధ్రువలోకమును ఆధా రస్తంభమువంటి ఊతముగా నిర్మించినాడు. ఆ లోకము అన్ని కాలములలో ప్రకాశించుచుండును.

కృషీవలుడు ధాన్యమును నూర్చుటకై కళ్లము మధ్యలో గుంజను పాతి, దానికి పశువులను కట్టును. వాటిలో కొన్నింటిని పొడవైన త్రాళ్లతో, కొన్నింటిని పొట్టి త్రాళ్లతో, మరి కొన్నింటిని మధ్యమ పరిమాణము గల త్రాళ్లతో కట్టుట వలన, అవి - గుంజకు చాల దూరములో, చాల దగ్గరగా మరియు మధ్యమదూరములో ఉంటూ, గుంజ చుట్టూ తమ తమ స్థానము, లలో మాత్రమే తిరుగుచుండును. అదే విధముగా, కాలచక్రమునందు నక్ష త్రముల గణములు మరియు గ్రహములు మొదలైనవి క్రింద మరియు పైన అనే విధముగా స్థానభేదముచే, మరియు ఉత్తరాయణ-దక్షిణాయన-విషువ త్తులనే కాలభేదముచే ఈశ్వరునిచే స్థాపించబడి యున్నవి. వాయువుచే ప్రేరితములై ఆ గ్రహాదులు ధ్రువమండలమునే ఆధారముగా చేసుకొని, ఆకాశములో వాయువుచే ప్రేరితములైన మేఘములు మరియు తమ ప్రయత్నమే ముందుకు నడుపగా తిరుగాడే గ్రద్దలు మొదలగు పక్షులు వలె, కల్పము అంతమయ్యే వరకు పరిభ్రమించుచుండును. ఈ నక్షత్రగణ ములన్నియు ప్రకృతిపురుషుల సంయోగముచేతనే నిర్మాణమైనవి. వాటి గమనమును పూర్వకర్మలే నిర్ధారించినవి. అవి అట్లు తిరుగుచుండుట చేతనే భూమిపై పడిపోకుండా ఉన్నవి.

 ఈ నక్షత్రమండలము వాసుదేవ భగవానునియొక్క త్రిగుణాత్మిక యగు మాయాశక్తిచే నీటి కోతి రూపములో నిలబెట్టబడి యున్నదని కొందరు వర్ణించుచున్నారు.

 

ఈ నక్షత్రమండలము, తలను క్రిందకు పెట్టి వలయాకారపు దేహము గల శిశుమారము (నీటి కోతి) ను పోలియుండును. దాని తోక చివర ధ్రువమండలము, తోక మధ్యలో కశ్యప ప్రజాపతి, ఇంద్రుడు, అగ్ని, ధర్ముడు అనే నక్షత్రములు, తోక మొదట్లో ధాత, విధాత అనే నక్షత్రములు ఉండును. ఆ రచన కుడివైపు వలయముగా చేయబడిన శరీరము గల శిశు మారమును పోలియుండును. ఒక వలయము లోపల మరియొక వలయ ముగా చుట్టుకొనియున్న శిశుమారమునకు రెండు వైపులా అవయవములు సమసంఖ్యలో నుండును. ఈ నక్షత్రమండలముయొక్క రచన కూడ అటు లనే యుండును. ఉత్తరాయణ నక్షత్రములను (అభిజిత్ నుండి పునర్వసు వరకు పదునాలుగు) దానికి కుడివైపున, దక్షిణాయన నక్షత్రములను (పు. ష్యమునుండి ఉత్తరాషాడ వరకు పదునాలుగు) దానికి ఎడమ వైపున సరిస మానముగా ఉన్న శిశుమారముగా మనము నక్షత్రముల అమరికను భావన చేయవచ్చును. దాని వీపుపై అజవీథి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢల గుంపు), పొట్టయందు ఆకాశగంగ (పొడవాటి నక్షత్రసమూహము) గలవు.

 ఆ శిశుమారమునకు కుడి ఎడమ నడుము భాగములయందు క్రమముగా పునర్వసు పుష్యమి నక్షత్రములను, వెనుకనుండే కుడి ఎడమ పాదములయందు ఆర్ద ఆశ్రేషలను, కుడి ఎడమ ముక్కు పుటముల యందు అభిజిత్ ఉత్తరాషాడలను, కుడి ఎడమ కన్నులయందు శ్రవణము పూర్వాషాఢలను, కుడి ఎడమ చెవులయందు ధనిష్ఠ మూలలను, ఎడమ ప్రక్కటెముకలయందు మఘతో మొదలిడి ఎనిమిది దక్షిణాయన నక్షత్రము లను, అదే విధముగా కుడి ప్రక్కటెముకలయందు మృగశీర్షతో మొదలిడి తల్లక్రిందులుగా ఎనిమిది ఉత్తరాయణ నక్షత్రములను, కుడి ఎడమ భుజ ములయందు శతభిష జ్యేష్ఠలను భావన చేయవలెను.

శిశుమారరూపములో కనబడే నక్షత్రమండలములో అగస్త్యుని పై దవడగను, యముని క్రింది దవడగను, అంగారకుని నోరుగను, శనిని గుహ్యస్థానముగను, బృహస్పతిని మూపురముగను, సూర్యుని వక్షఃస్థల ముగను, నారాయణుని హృదయముగను, చంద్రుని మనస్సుగను, శుక్రుని నాభిగను, అశ్వినీ నక్షత్రములను స్తనములుగను, బుధుని ప్రాణాపానము లుగను, రాహువును కంఠముగను, ధ్వజాకారములోనుండే నక్షత్రములను వివిధములైన అవయవములుగను దర్శిస్తూ, సకల నక్షత్ర గణములను ఆ రూపముయొక్క రోమకూపములుగా ఊహించవచ్చును. -

విష్ణు భగవానుని సర్వదేవతామయమగు రూపము నిశ్చయముగా, నిదియే. సాధకుడు సంధ్యాకాలమునందు పవిత్రుడై మౌనముగానుంటూ నక్షత్రమండలమును చూస్తూ, నిలబడి ఇట్లు ప్రార్థించవలెను --- నక్షత్ర ములకు ఆశ్రయమైనవాడు, కాలచక్రరూపుడు, దేవతలకు ప్రభువు అగు పురుషోత్తముని నమస్కరించి ధ్యానించుచున్నాము.

గ్రహములు నక్షత్రములు తారామండలములతో కూడియున్న ఈ శిశుమారము దేవుని రూపమే. దీనికి సంబంధించి పైన చెప్పిన మంత్ర మును మూడు పూటలా జపించువారలకు పాపములు పోవును. ఈ రూప మునకు మూడు పూటలా నమస్కరించినా, లేక ఈ రూపమును స్మరించి నా, మానవులకు ఆ కాలమునందు చేసిన పాపము వెంటనే తొలగిపోవును.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో జ్యోతిశ్చక్రము  శిశుమారము అనే ఇరవై మూడవ అధ్యాయము ముగిసినది.