శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము
3 - నాభి మహారాజుయొక్క చరితము
శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను --- ఆగ్నీధ్రుని పుత్రుడగు నాభికి భార్యయగు మేరుదేవియందు సంతానము కలుగలేదు. అపుడాయన సంతానమునందు కోరిక గలవాడై, భార్యతో గూడి యజ్ఞేశ్వరుడగు శ్రీహ రిని ఏకాగ్రమగు చిత్తముతో ఆరాధించెను.
ఆ నాభి నిశ్చితమగు శ్రద్దతో పరిశుద్దమగు అంతఃకరణముతో యజ్ఞమును చేయుచుండెను. ఆ యజ్ఞములో పదార్థములు, దేశము, కాల ము, మంత్రములు, ఋత్విక్కులు, దక్షిణలు, విధి అనే ఏడు అంగములు సుసంపన్నములుగా నుండెను. కావుననే, శ్రీహరి భగవానుడు పొంద శక్యము కానివాడే అయిననూ, తన భక్తులు కోరే విషయములను అనుగ్ర హించవలెననే కోరికకు తన హృదయము వశమై పోగా, సుందరమగు అవ యవములు గల ఆ భక్తవత్సలుడు ప్రకటమయ్యెను. ఆయన అవయవ ములు మనస్సునకు, కన్నులకు ఆనందమును గొల్పుచుండెను. అట్టి సర్వ స్వతంత్రమగు ఆయన రూపము అతిసుందరమగు అవయవములతో మనోహరముగా, సుఖకరముగా నుండెను.
అప్పుడు నాలుగు భుజములను కలిగియున్న ఆ పురుషోత్తముని ఋత్విక్కులు, సభాసదులు మరియు యజమానియగు నాభి చూచిరి. కాంతిపుంజమువలెనున్న ఆయన పచ్చని పట్టు వస్త్రములను దాల్చెను. ఆయన రొమ్ము పై శ్రీవత్సము (మచ్చ) ప్రకాశించుచుండెను. గొప్ప శంఖ ము, పద్మము, వనమాల (పుష్పముల మాల), చక్రము (శూరులను సంహరించేది), కౌస్తుభమాణిక్యము (అమృతముతో బాటు పుట్టినది), గద మొదలగువాటిని ఆయన ధరించియుండెను. ఆయన అవయవముల కాంతిని ఇనుమడింపజేసే గొప్ప మణులతో కూర్చబడిన కిరీటము, కుండలములు, కంకణములు, మొలత్రాడు, హారము, అంగదములు, కాలియం దేలు మొదలగు ఆభరణములను అలంకరించుకొనెను. గొప్ప ధనమును పొందిన నిర్దినులు వలే, సాదరముగా అర్ఘ్యమును తీసుకొని, వారాయనను తలలను వంచి, స్తుతించిరి.
ఋత్విక్కులు ఇట్లు పలికిరి --- ఓ శ్రీహరీ! పూజించదగినవారిలో నీవు ఉత్తముడవు. సేవకులమగు మేము నిన్ను మరల మరల పూజించవల సిన వారము. కాని, పలుమార్లు నమస్కారమును చేయుట మాత్రమే మాకు తెలియును. మహాత్ములు మాకు అంతవరకే నేర్పిస్తారు. నీవు ప్రకృతికంటే, జీవులకంటె అతీతుడవగు ఈశ్వరుడవు. ప్రకృతికి వశుడైయున్న మానవుని బుద్ధి ప్రకృతియొక్క గుణముల (సత్త్వరజస్తమస్సులు) నుండి పుట్టిన ప్రపంచమునందు తగుల్కొనియుండును. అట్టి మానవుడు ప్రపంచ స్థాయికి మాత్రమే చెందియున్న నామము, రూపము మరియు ఆకారము లతో నీ స్వరూపమును ఎట్లు నిరూపించగల్గును?
సకలజననికాయవృజిననిరసనశివతమప్రవరగుణగణ-ఏకదేశకథ సౌత్ మొతే - సర్వమానవసమూహముల పాపములను పోగొట్టే పరమ మంగళములగు చాల గొప్ప గుణముల సమూహముల ఒక అంశమును చెప్పుట మినహాయించి.
నీ గుణముల సమూహములు సకలమానవ సముదాయముల పాపములను పోగొట్టజాలి యున్నవి. అట్టి పరమమంగళకరములగు చాల గొప్ప గుణములలో కొన్నింటిని వర్ణించుట మినహాయిస్తే, అంతకు మించి మేమేమి చేయగలము?
ఓ పరమేశ్వరా! నీ భక్తులు ప్రేమతో తడబడుతూ నిన్ను చక్కగా స్తుతించెదరు. నీకు నీటితో, స్వచ్చమగు చిగుళ్లతో, తులసి దళములతో, గరిక. పరకలతో చక్కగా పూజ చేసెదరు. నీవు ఇంతమాత్రము చేతనే సంతోషించేదవు గదా!
మా భక్తిని ప్రక్కన బెట్టినచో, విస్తృతమగు సాధనసంపత్తితో నిర్వ హించబడేదైననూ, మా దృష్టిలో ఈ యజ్ఞమునుండి నీవు అపేక్షించే ప్రయోజనము ఏదీ లేదు.
నీ స్వరూపమగు ఆనందమునందు నిరంతరముగా సాక్షాత్తుగా విచ్ఛేదము లేని విధముగా పురుషార్థములన్నియు (ధర్మార్థకామమోక్షములు) అతిశయించి అంతర్గతమై యున్నవి. (కావున, ఈ యజ్ఞాదులచే నీవు పొందదగిన ప్రయోజనమేమియు లేదు). ఓ ప్రభూ! కానీ, ఏవో భోగము లను కోరుకునే మావంటి వారలకు మాత్రము ఈ యజ్ఞము నిన్ను ఆరా ధించి మనోరథములను పొందుటకు యోగ్యమగు సాధనమగుచున్నది.
ఓ పురుషోత్తమా! సర్వాధికులగు బ్రహ్మాదులకంటే కూడ నీవు ఉత్కృష్టుడవు, కావుననే, తమంత తాముగా తమకు సర్వోత్తమమగు హిత మైన మోక్షమును గురించి తెలియని వారలకు -- ఏమీ తెలియని పిల్లల మంచిని తండ్రి చూచే విధముగా -- నీవే గొప్ప దయతో కోరికలను మాత్రమే గాక, మోక్షమనే ఆత్మానందమును కూడ అనుగ్రహించెదవు. అందుకొరకు మాత్రమే నీవీ యజ్ఞములో స్వయముగా పూజాదికము యొక్క అ పేక్ష లేనివాడవే అయిననూ, వాటితో సంబంధము ఉన్నవానివలె స్వీకరించ బడుచున్నావు.
ఓ శ్రీహరీ! పూజ్యులలో నీవు ఉత్తముడవు, వరములనిచ్చువా రిలో శ్రేష్టుడవు. నీకు పూజాదికముయొక్క అపేక్ష లేకున్ననూ, రాజర్షి యగు ఈ నాభియొక్క యజ్ఞములో నీ భక్తులమగు మాకు కంట బడినావు. ఇదియే మాకు వరము.
ఓ శ్రీహరీ! భక్తులు అభ్యాసముచే నీ గుణముల సమూహమును నిరంతరముగా గానము చేయుదురు. మునులు వైరాగ్యముచే తీక్ష్ణము చేయబడిన ఆత్మజ్ఞానము అనే అగ్నిచే దోషములనన్నింటినీ నశింప జేసుకొని, నీతో సమానమగు స్వభావమును కలిగియుందురు. అట్టి ఆత్మారా ములగు మునులు గొప్ప మంగళములనిచ్చే నీ గుణగణముల వర్ణనను చేయుచునే యుందురు.
నీ గుణవర్ణనము చాల పావనము. కావున, జారుట, పడుట, తుమ్ముట, ఆవులించుట, సంకటములో పడుట, జ్వరములో నుండుట, మరణావస్థ మొదలగు అవస్థలయందు కూడ మేము నిన్ను స్మరించ వలసి యున్నది. కాని, అట్లు చేయుటకు మాకు శక్తి ఉండుట లేదు. నీ గుణములను ప్రకటించే నీ నామములు (భక్తవత్సల మొదలగునవి) పాపములన న్నింటినీ పోగొట్టును. కావున, ఏదో విధముగా అట్టి దురవస్థలయందు కూడ మా నోరు నీ నామములను ఉచ్చరించునట్లు అనుగ్రహించుము.
మరియు, రాజర్షియగు ఈ నాభి సంతానమే పురుషార్థమని భావిం చుచున్నాడు. ఈయన తనకు నీవంటి కొడుకు కలగాలని కోరుచున్నాడు. నీవు ఐహికసుఖములకే గాక, స్వర్గమునకు మోక్షమునకు కూడ ప్రభుడవు. నిర్ధనుడు ధనికుని (కుబేరుని) ఊక కొరకు ప్రార్థించినట్లుగా, ఈతడు నిన్ను సంతానము కొరకు ఆరాధించుచున్నాడు.
నీ మాయను తరించుట శక్యము కాదు. నీ మాయయొక్క స్వరూ పము, లేక మార్గము ఇట్టిదని నిర్ధారించుట సంభవము కాదు. మహాత్ముల పాదములను ఉపాసించకుండగా, అట్టి నీ మాయచే పరాభూతుడు కాని వాడు గాని, నీ మాయచే కప్పివేయబడని బుద్ధి గలవాడు గాని, ఇంద్రియ భోగములనే విషముయొక్క వేగముచే కలుషితము కాని స్వభావము గల వాడు గాని ఈ లోకములో ఎవరు గలరు? (లేనే లేరు). మహాత్ముల పాద సేవనముచే మాత్రమే మాయను తరించుట శక్యమగునని అభిప్రాయము.
ఓ దేవదేవా! నీవు గొప్ప గొప్ప కార్యములను చేయుదువు. మందబుద్దులము, అజ్ఞానులము అగు మేము నిశ్చయముగా ఒక చిన్న ఫలమునందు బుద్ధిని నిలిపి, నిన్ను ఇచటకు ఆహ్వానించితిమి. ఆ విధ ముగా మేము దేవుడవగు నిన్ను అమర్యాద చేసితిమి. కాని, నీవు అందరి విషయములో సమచిత్తము గలవాడవు. కావున, మా దోషమును నీవు సహించ తగుదువు.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- దేశాధిపతియగు నాభిచే పూజ లనందుకొనే ఆ ఋత్విక్కులు దేవదేవుడగు శ్రీహరి భగవానుని పాదములకు నమస్కరించి, ఈ విధముగా గద్యరూపములోనున్న స్తోత్రముతో స్తుతించిరి. అపుడాయన దయతో నిట్లనెను.
శ్రీభగవానుడిట్లు పలికెను --- ఆహా! ఆశ్చర్యము! ఓ మహర్షు లారా! పొల్లు పోని వాక్కులు గల మీరు నన్ను, ఈ రాజునకు నన్ను పోలిన కొడుకు కలగాలని, దుర్లభమగు వరమునే కోరితిరి. అద్వితీయుడనగుట వలన, నన్ను పోలినవాడను నేను మాత్రమే. అయినప్పటికీ, బ్రహ్మవేత్తల మాట అసత్యము కారాదు. ఏలయనగా, ఉపనయన సంస్కారము గలవా రిలో బ్రహ్మవేత్తలు దేవతల వంటి వారు. నా ముఖము వారే (అనగా, వారి పలుకునకు నా పలుకునకు తేడా లేదు).
అందువలన, నేనే స్వయముగా నా అంశచే ఆగ్నీధ్రుని పుత్రుడగు నాభికి పుత్రుడనై అవతరించెదను. ఏలయనగా, నాతో సమమైనవాడు నాకు మరియొకడు కానరాడు.
శ్రీశుక మహర్షి ఇట్లు చెప్పెను --- మేరుదేవి వినుచుండగా ఆమె భర్తయగు నాభితో ఈ విధముగా చెప్పి, శ్రీహరి భగవానుడు అంతర్ధాన మాయెను.
విష్ణువుచే రక్షించబడిన ఓ పరీక్షిన్మహారాజా! ఆ యజ్ఞమునందు మహర్షులు శ్రీహరిని ప్రసన్నము చేసుకొనిరి. ఆయన నాభికి ప్రీతిని కలిగించ గోరెను. పైగా, దిగంబరులు తపశ్శాలురు అగు సన్న్యాసులకు, ఊర్ధ్వరేతస్కులగు మహర్షులకు ఆయన ధర్మములను ప్రకటించ గోరెను. ఆయన నాభియొక్క అంతఃపురములో మేరుదేవియందు సత్త్వగుణప్రధాన మగు శరీరముతో అవతరించెను.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమ స్కంధములో నాభి మహారాజుయొక్క చరితము అనే మూడవ అధ్యాయము ముగిసినది (3).
