శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము
16 - భువనకోశమును వర్ణించుట
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఎంతవరకైతే సూర్యుడు ప్రకాశించునో మరియు నక్షత్రగణములతో కూడియున్న చంద్రుడు కానవచ్చునో, అంతవరకు భూమండలముయొక్క విస్తారమును మీరు వివరముగా చెప్పియుంటిరి.
ఆ భూమండలమునందు ప్రియవ్రతుని రథము త్రవ్వబడిన ఏడు అగడ్తలచే ఏడు సముద్రములు రచించబడినవనియు, ఆ సముద్ర ముల వలన ఈ భూమియందు ఏడు ఖండముల విభాగము జరిగినదనియు తమరు సూచన ప్రాయముగా చెప్పియుంటిరి. నేను ఈ ఏడు ఖండముల కొలతలను, లక్షణములను కూడ పూర్తిగా తెలియ గోరుచున్నాను.
ఓ గురూ! ఏలయనగా, భగవానుని త్రిగుణాత్మకము మరియు స్థూలము అగు ఈ విరాడ్రూపమునందు ఏకాగ్రము చేయబడిన మనస్సును, ఆ భగవానుని మిక్కిలి సూక్ష్మమగు నిర్గుణపరబ్రహ్మస్వరూపము నందు కూడ లగ్నము చేయుట సంభవమగును. వాసుదేవుడు అనే పేరు గల ఆ స్వయంప్రకాశస్వరూపము ప్రాణులలో ఆత్మచైతన్యము రూపముగా ప్రకాశించుచున్నది. కావుననే, ఈ విషయమును తమరు వర్ణించ తగుదురు.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మహారాజా! మానవునకు దేవ తల ఆయుష్టును ఇచ్చినా, భగవానుని మాయాశక్తిలోని గుణముల మహి మయొక్క సీమను వాక్కుతో వర్ణించలేడు; మనస్సుతో ఊహించుటకైననూ సమర్థుడు కాడు. ఇది నిశ్చయము. కావున, మేము భూగోళముయొక్క వివిధభాగముల పేర్లను, రూపము (రచన) లను, పరిమాణములను, వాటి లక్షణములను ప్రధానమైనవాటిని మాత్రమే వివరించి చెప్పెదము.
మనముండే ఈ జంబూద్వీపము భూమండలముయొక్క కోశముల లోపలి కోశము. లక్ష యోజనముల విస్తీర్ణము గల ఈ ద్వీపము తామరాకు వలే సమముగా గుండ్రముగా నున్నది.
జంబూద్వీపమునందు తొమ్మిది వేల యోజనముల నిడివి గల - తొమ్మిది వర్షములు (అవాంతర ఖండములు) గలవు. వీటిని హద్దుల యందు పర్వతములు చక్కగా విభాగము చేయుచున్నవి.
వీటి మధ్యలో ఇలావృతమనే లోపలి వర్షము గలదు. దానికి మధ్యలో అంతటా బంగారమే అయిన మేరు పర్వతము ఉన్నది. కులపర్వతములలో శ్రేష్టమైన మేరువు జంబూద్వీపముయొక్క నిడివితో సమానమైన ఎత్తు (లక్ష యోజనములు) కలిగియున్నది. భూమండలమనే కమలమునకు దుద్దువలె నున్న మేరువు శిఖరమునందు ముప్పది రెండు వేల యోజనములు, పాదము వద్ద పదహారు వేల యోజనములు, భూమి లోపల ప్రవేశించిన భాగము పదహారు వేల యోజనములు నిడివి కలదు.
ఇలావృతవర్షమునకు తరువాత ఉత్తరాన వరుసలోనుండే రమ్యక, హిరణ్మయ, కురు వర్షములకు క్రమముగా నీలము, శ్వేతము, శృంగవంతము అనే పర్వతములు హద్దును నిర్ధారించుచుండును. ఇవి తూర్పు నుండి పడమరకు రెండు వైపులా రెండు వేల యోజనముల వెడల్పు గల వై, ఉప్పు సముద్రము వరకు విస్తరించి యున్నవి. పొడవు మాత్రము నీలము కంటే శ్వేతము, శ్వేతము కంటే శృంగవంతము దశాంశముకంటె కొంచెము అధికమైన అంశము తక్కువ. ఎత్తు సమానమే.
ఇదే విధముగా, ఇలావృతమునకు దక్షిణాన హరివర్షము, కింపురుషవర్షము, భారతవర్షము గలవు. నిషధము, హేమకూటము, హీమాలయము అనునవి క్రమముగా వాటి హద్దులు. ఈ పర్వతములు నీలము మొదలగు పర్వతముల వలెనే తూర్పునుండి పడమరకు వ్యాపించి యున్నవి. వీటి ఎత్తు పదివేల యోజనములు.
అదే విధముగా, ఇలావృతమునకు పడమరలో మాల్యవంతము, తూర్పున గంధమాదనము అనే పర్వతములు గలవు. ఇవి రెండు వేల యోజనముల నిడివి గలవియై, క్రమముగా ఉత్తరమున నీల పర్వతము వరకు, దక్షిణమున నిషధ పర్వతము వరకు వ్యాపించి యున్నవి. ఇవి క్రమముగా కేతుమాల భద్రాశ్వవర్షముల హద్దులను నిర్ధారించుచున్నవి.
మేరు పర్వతమునకు ఆధారముగా నాలుగు దిక్కులయందు మందరము, మేరుమందరము, సుపార్శ్వము, కుముదము అనే పర్వతములు ఈశ్వరునిచే రచించబడినవి. అవి పదివేల యోజనముల నిడివి, అంతే ఎత్తు గలవి.
ఈ నాలుగు పర్వతములయందు క్రమముగా మామిడి, నేరేడు, కడిమి, మర్రి అనే గొప్ప చెట్లు గలవు. పర్వతములకు జెండాలను బోలి యున్న ఆ చెట్లు పదకొండువేల యోజనముల ఎత్తుతో, అంతే దూరము వ్యాపించిన కొమ్మలతో, వంద యోజనముల చుట్టు కొలత కలిగియున్నవి.
భరతవంశీయులలో శ్రేష్టుడవగు ఓ రాజా! ఆ నాలుగు పర్వతము లపై నాలుగు సరస్సులు గలవు. వాటిలో క్రమముగా పాలు, తేనె, చెరుకు రసము మరియు తియ్యని నీరు ఉండును. ఆ సరస్సులను గంధర్వులు మొదలగు ఉపదేవతల గణములు సేవించును. వాటి వలన వారికి యోగసిద్ధులు సహజసిద్ధములగును.
ఆ పర్వతములపై నందనము, చైత్రరథము, వైభ్రాజకము, సర్వతో భద్రము అనే నాలుగు దేవతల ఉద్యానములు గలవు.
ఆ ఉద్యానవనములయందు గొప్ప గొప్ప దేవతలు గుమిగూడి విహరించెదరు. గంధర్వులు మొదలగు ఉపదేవతల గణములు వారి మహిమను కీర్తించుచుందురు. వారికి దేవతాస్త్రీలకే అలంకారమనదగిన గొప్ప సుందరయువతులు చాలమంది భార్యలు.
మందరపర్వతశిఖరముపై పదకొండు వందల యోజనముల ఎత్తు గల మామిడి చెట్టు గలదు. అది దేవలోకములో పుట్టినది. దాని చిటారు కొమ్మనుండి పర్వతశిఖరములంత పెద్ద పళ్లు పడును. వాటి రుచి అమృ తము వలె నుండును.
ఆ పళ్లు పగిలి, వాటినుండి సహజపరిమళము గల మిక్కిలి తియ్యని ఎర్రని రసము పెద్ద మొత్తములో ప్రవహించును. ఇతరసుగంధ ములు తోడైన ఆ రసమే నదియై ప్రవహించును. ఆ నది అరుణోద (ఎర్రని నీరు గలది) అని ప్రసిద్దిని బడసెను. అది మందరపర్వత శిఖరమునుండి క్రింద పడుతూ, ఇలావృత వర్షముయొక్క తూర్పు భాగమునందు ప్రవ హించుచుండును.
ఆ నదీజలములను పార్వతీదేవి చెలికత్తెలగు యక్షస్త్రీలు సేవించేదరు. దానిచే వారి అవయవములు సుగంధభరితములై, వారి మీదుగా వీచే గాలి చుట్టు ప్రక్కల పది యోజనముల వరకు పరిమళమును వ్యాపింప జేయును.
ఇదే విధముగా, మేరుమందర పర్వతము మీద నేరేడు పళ్లు పడుచుండును. మిక్కిలి చిన్న గింజ కలిగిన ఆ పళ్లు ఏనుగు శరీరముతో సమా నమైన ఆకారమును కలిగియుండును. పెద్ద ఎత్తునుండి పడుటచే అవి పగిలి ఆ రసము నదిగా ప్రవహించును. ఆ నదియే జంబూనది అని ప్రసిద్ధిని గాంచినది. ఆ నది పదివేల యోజనముల ఎత్తు గల శిఖరమునుండి భూతలముపై పడుచుండును. అది ఆ పడిన చోటునుండి దక్షిణముగా ఇలావృత వర్షము వరకు ప్రవహించుచుండును.
ఆ నదియొక్క రెండు ఒడ్డులయందు కూడ మట్టి అంతటా నది నీటితో తడిసి, గాలికి సూర్యరశ్మికి ఎండి, రసాయనచర్య జరిగి, జాంబూనదమని ప్రసిద్ధి గాంచిన బంగారము తయారగును. ఆ బంగారము దేవతాగణములకు అన్ని కాలములలో ఆభరణమగుచున్నది.
ఆ బంగారమును దేవతలు, గంధర్వులు మొదలగువారు. తమ భార్యలతో గూడి, కిరీటము కంకణము మొలత్రాడు మొదలగు ఆభరణముల రూపముగా ధరించుచుందురు.
సుపార్శ్వ పర్వతముపై పెద్ద కడిమి చెట్టు గట్టిగా పాతుకొని యున్నది. దాని తొర్రలనుండి అయిదు బారల చుట్టుకొలత గల అయిదు తేనె ధారలు ప్రవహించుచున్నవి. అవి సుపార్శ్వ పర్వత శిఖరమునుండి పడుతూ, అచటకు పడమర దిశగానున్న ఇలావృత వర్షమునకు శోభను ఇనుమడింపజేసి, అచట సుగంధమును నింపి, అచటి ప్రాణులకు ఉల్లాస మును కలిగించుచున్నవి.
ఆ తేనెలను ఆస్వాదించు జనుల ముఖమునుండి వచ్చే గాలి చుట్టు ప్రక్కల వంద యోజనముల దూరము వరకు సుగంధమును వ్యాపింప జేయుచున్నది.
ఇదే విధముగా, కుముద పర్వతముపై శతవల్శము (వంద కొమ్మలు గలది) అని ప్రసిద్ధి గాంచిన మర్రి చెట్టు గట్టిగా పాతుకొని యున్న ది. దాని కొమ్మల ఊడలనుండి క్రిందకు ప్రవాహములు వచ్చుచున్నవి. అవి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లము, అన్నము, ఇతరములగు ఆహా ర పదార్థములు, వస్త్రములు, శయ్యలు, ఆసనములు, ఆభరణములు మొదలగు పదార్థములను కోరినవాటిని ఇచ్చుచుండును. ఆ ప్రవాహ ములు కుముద పర్వత శిఖరమునుండి పడి, అచటకు ఉత్తరాన ఉన్న ఇలావృత వర్షమును సంపన్నము చేయుచున్నవి.
ఆ ప్రవాహములలోని పదార్థములను సేవించే జనులకు ఏనాడైననూ, ఒళ్లు ముడుతలు పడుట, జుట్టు తెల్లబడుట, అలసట, చెమట, శరీర మునుండి దుర్గంధము వచ్చుట, ముసలితనము, రోగము, మరణము, చలి, వేడి, శరీరము పాలిపోవుట, అవయవములు విరుగుట మొదలగు వివిధపీడలు ఉండవు. పైగా, వారికి జీవించి యున్నంత కాలము సర్వో త్కృష్టమగు సుఖమే సుఖము ఉండును.
దుద్దునకు చుట్టూ జూలు ఉన్నట్లే, మేరు పర్వతమునకు చుట్టూ మూలస్థానమునందు ఇరువది పర్వతములు ఈశ్వరునిచే రచించబడినవి. ఆ పర్వతములు కురంగము, కురరము, కుసుంభము, వైకంకము, త్రికూట ము, శిశిరము, పతంగము, రుచకము, నిషధము, శినీవాసము, కపిలము, శంఖము, వైదూర్యము, జారుధి, హంస, ఋషభము, నాగము, కాలంజర ము, నారదము, ఆది అనునవి.
మేరు పర్వతమునకు తూర్పున జఠర దేవకూటములనే పర్వతములు గలవు, ఇవి ఉత్తరమునుండి దక్షిణమునకు పదునెనిమిది వేల యోజనముల పొడవున వ్యాపించి యున్నవి. వీటి వెడల్పు రెండు వేల యోజనములు కాగా, ఎత్తు కూడ అంతే. ఇదే విధముగా, మేరువునకు పడమరగా పవన పారియాత్ర పర్వతములు గలవు. మేరువునకు దక్షిణముగా కైలాస కరవీర పర్వతములు తూర్పు వైపునకు విస్తరించియున్నవి. ఇదే విధముగా, మేరువునకు ఉత్తరముగా త్రిశృంగ మకర పర్వతములు గలవు. ఈ విధముగా బంగరు పర్వతము చుట్టూ ఎనిమిది పర్వతములచే ఆవరించబడి, ఎనిమిది సమిధలచే మరియు దర్భలచే చుట్టువారబడియున్న అగ్ని వలె ప్రకాశించుచున్నది.
స్వయంభువుడగు బ్రహ్మగారి నగరము మేరుపర్వతశిఖరము పై మధ్యలో బంగారముతో నిర్మించబడినదని మహాత్ములు చెప్పెదరు. సమ తుర్భుజాకారములోనుండే ఆ నగరము కోటి యోజనముల నిడివి కలిగి యుండును.
ఆ బ్రహ్మపురి రచనను పోలి దాని చుట్టూ ఎనమండుగురు లోక పాలకులకు ఆయా దిక్కులలో ఎనిమిది నగరములు గలవు. అవి బ్రహ్మపు రములో నాల్గవ వంతు నిడివి కలిగియున్నవి. ఆ నగరములు ఆయా లోక పాలకుల స్థాయికి తగ్గట్లు ఉన్నవి.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో భువనకోశ వర్ణనమనే పదునారవ అధ్యాయము ముగిసినది (16).
