శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము

Table of Contents

25 - శ్రీ సంకర్షణ దేవుని స్తోత్రము

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- పాతాళమునకు ముప్పది వేల యోజనముల దూరములో మూలస్థానమునందు శ్రీహరి భగవానుని తమోగుణప్రధానమగు కళ గలదు. దానికి అనంతుడు అని పేరు. ఇది అహంకారరూపమగుటచే ద్రష్ట (చూచువాడు) మరియు దృశ్యము (చూడ బడేది) లను ఏకము (భోగ్యమగు దీనిని భోగించే భోక్తను నేను అనే అభి మానము) చేయును. సత్త్వగుణప్రధానుడగు శ్రీహరి భక్తులు ఈ కళను సంకర్షణుడు (ఏకము చేయువాడు) అని వ్యవహరించెదరు.

వేయి తలల అనంతుని రూపములోనున్న భగవానుని ఒకే ఒక తలపై మోయబడే ఈ భూమండలము అచట ఆవగింజవలె కనబడును.

            ప్రళయకాలమునందు ఈ జగత్తును ఉపసంహరించగోరే ఆ సంక ర్షణుడు కోపముతో అందమగు కనుబొమలను విరిచి త్రిప్పగా, వాటి మధ్య నుండి ముక్కంటి రుద్రుడు ఆవిర్భవించెను. పదకొండు రూపములు గల ఆయనకు సాంకర్షణుడు (సంకర్షణునినుండి పుట్టినవాడు) అనే పేరు ప్రసిద్ధ మయ్యెను. ఆయన త్రిశూలమును ఎత్తి పట్టుకొని యుండెను.

సంకర్షణుని పాదపద్మముల జంటయొక్క గుండ్రని ఎర్రని స్వచ్ఛ మైన గోళ్ల పంక్తి మణుల వరుసను పోలియుండును. భక్తవరేణ్యులతో బాటుగా నాగరాజులు కూడ అనన్యమగు భక్తియోగముతో తలలను వంచి సంకర్షణునకు నమస్కరించెదరు. ఆ సమయములో వారికి ఆ గుండ్రని గోళ్లయందు మిక్కిలి సుందరమగు తమ ముఖములు కనబడుచుండును. వారి చెక్కిళ్లకు అధికముగా ప్రకాశించే కుండలముల కాంతియే భూషణము గుచుండును. ఆ విధముగా తమ ముఖములను చూచుకున్న వారి మన స్సులు ఆనందముతో నిండిపోవుచుండును.

తమ కామనలు సఫలము కావాలనే ఆకాంక్షతో నాగరాజకన్యలు సంకర్షణుని వెండి స్తంభములవలె తెల్లనైన భుజములయందు, అగరు చందనము కుంకుమలతో చేసిన పైపూత ముద్దను పూయుచుందురు. స్వచ్చములు, మనోహరములు అగు ఆయన విశాలభుజములు అంద "మగు అవయవమండలమునందు విలసిల్లుచుండును. ఆ విధముగా పైపూత పూయునప్పుడు ఆయనను స్పృశించుటచే వారి హృదయములు కల్లోలితములై మన్మథావేశమును పొంది, వారి అందమగు చిరునవ్వులు మరింత మనోహరముగా నుండును. ఆ సంకర్షణుడు పద్మమువంటి ముఖ మునందలి మదవిహ్వలములై గిరగిర తిరిగే ఎర్రని కన్నులతో అనురాగము తో, ఆనందముతో, దయతో నిండిన చూపులను వారిపై బరపగా, వారు సిగ్గుతో ఆయనను చూచుచుందురు.

 

అనంతములగు గుణములకు నిధి, జగత్కారణుడు, ప్రకాశస్వరూ పుడు అగు ఆ అనంత భగవానుడు తన అసహనమును, కోపవేగమును ఉపసంహరించుకొని, లోకకల్యాణము కొరకై అచట నిలిచియున్నాడు.

నిరంతరముగా మత్తుతో ఆనందిస్తూ, చంచలమై స్వాధీనత తప్పి ఉండే కన్నులు గల అనంత భగవానుని దేవతలు, రాక్షసులు, నాగులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మహర్షుల గణములు ధ్యానము చేయుచుందురు. నల్లని వస్త్రమును, ఒకే కుండలమును దాల్చియుండే ఆయన మిక్కిలి మధురమగు అమృతమువంటి మాటలతో తన అనుచరు లను, దేవనాయకులను ఆనందింప జేయుచుండును. నాగలి పైభాగము నందు తన సుకుమారమైన అందమగు భుజమును ఉంచియున్న అనం తుడు వైజయంతి (రంగురంగుల పువ్వులతో గ్రుచ్చినది) అనే తన అడవి పువ్వుల మాలను, మహేంద్రుని గొప్ప ఏనుగు బంగరు గొలుసును వలె, ధరించియుండును. వాడిపోని తాజా తులసియొక్క సుగంధము గల ఆ మాల చుట్టూ తేనెను త్రాగి మత్తెక్కియున్న తుమ్మెదల గుంపులు ఝంకా

రము చేస్తూ తిరిగి, దాని శోభను ఇనుమడింప జేయుచుండును. ఆయన భక్తుల కోరికలను తీర్చుట కొరకై లీలలను ప్రకటించును.

మోక్షమును కోరు సాధకులు అనంత భగవానుని గురించి శ్రవ ణము చేసి, ఆయనను ధ్యానించినచో, ఆయన వారి హృదయము లోపల సాక్షాత్కరించి, అజ్ఞానరూపములోనుండే హృదయపు ముడిని శీఘ్రముగా నిర్మూలించును. సత్త్వరజస్తమోగుణముల వికారమగు ఈ అజ్ఞానము అనాది కాలమునుండి వచ్చుచున్న కర్మవాసనలచే కూర్చబడి యున్నది. ఒకసారి పూజనీయుడు, బ్రహ్మపుత్రుడు అగు నారదుడు తుంబురునితో కలిసి, అనంతభగవానుని ప్రభావములను బ్రహ్మగారి సభలో గొప్పగా కీర్తించెను.

మాయాశక్తియొక్క సత్త్వరజస్తమోగుణములు పరబ్రహ్మ సంక ల్పము చేతనే ఈ జగత్తును సృష్టించి పాలించి ఉపసంహరించుటలో సమ ర్ణములగుచున్నవి. అనాది, అనంతము, అద్వయము అగు ఆ పరబ్రహ్మ తనయందు అనేక నామరూపములతో గూడిన ప్రపంచమును ధరించియు న్నాడు. అట్టి పరబ్రహ్మను పొందే మార్గమును, తత్త్వమును ఎవ్వాడు తెలి యగల్గును?

అనంత భగవానుడు మాయందలి గొప్ప దయతో సత్త్వగుణప్రధా నమగు విశుద్ద (రజస్తమోమిశ్రణము లేని) రూపమును దాల్చినాడు. ఈ కార్యకారణాత్మకమగు జగత్తు ఆయనయందే భాసించుచున్నది. తనవారి మనస్సులను వశము చేసుకొనుటకై ఆయన నెరపిన పవిత్రమగు లీలను, గొప్ప పరాక్రమము గల సింహము నేర్చుకోనెను.

అకస్మాత్తుగా గాని, పరిహాసమునకు గాని, కష్టములో నున్నవాడు గాని, పతితుడే గాని, ఆ అనంత భగవానుని నామమును విని కీర్తించిననూ, ఆ నామము వెంటనే అట్టి మానవుని సకలపాపములను నశింప జేయును. మోక్షమును కోరే సాధకుడు అనంత భగవానుని తప్ప, మరియొకనిని ఎవ నిని ఆశ్రయించును?

వేయి తలలు గల శేషుడు అనంతుడగుటచే ఆయన పరాక్రమము లకు సీమలు లేవు. పర్వతములు, నదులు, సముద్రములు, ప్రాణులతో కూడియున్న భూమండలము సర్వవ్యాపకుడగు ఆ శేషుని తలపై ఒక కణ మువలె నిలిచియున్నది. అట్టి ఆ శేషుని పరాక్రమములను వేయి నాలుకలు ఉన్ననూ, ఎవడు అధికముగా లెక్కించగల్గును?

ఇట్టి మహిమ గలవాడు, అనంతబలశాలి, అనేకములగు దయాది గుణములు గలవాడు, శక్తిశాలి, స్వతంత్రుడు అగు అనంత భగవానుడు భూమికీ మూలములోమన్నవాడై భూమిని అవలీలగా మోస్తూ- రక్షించుచు న్నా డు.

భోగ్యములను కోరుతూ ఉండే మానవులు మరణానంతరము పొందే లోకములు ఇవి మాత్రమే. ఇవి ఆయా జీవులకు తమ తమ కర్మలన తిక్రమించకుండగా లభించును. నేను వీటిని గురువు ఉపదేశమునతిక్రమిం చకుండగా శాస్త్రముననుసరించి వర్ణించితిని.

ఓ పరీక్షిన్మహారాజా! మానవులు కర్మలనాచరించుట అనే రూప ములోనుండే ధర్మమునాచరించి, ఆ కర్మల ఫలరూపముగా పొందే లోక  ములు ఇవి మాత్రమే. వీటిలో కొన్ని గొప్పవి, మరికొన్ని తక్కువ స్థాయికి చెందినవి. వీటిలో ఒకదానితో మరియొకదానికి పోలిక లేదు. నేనీ వివరము లను నీ ప్రశ్నకు తగ్గట్లుగా చెప్పితిని. ఇంకనూ నేనేమి చెప్పవలెను? అని శుకమహర్షి పలికెను.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో  సంకర్షణదేవుని స్తోత్రమును వర్ణించే ఇరువది ఐదవ అధ్యాయము ముగిసినది .