శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము

Table of Contents

6 - ఋషభదేవుడు అవతారమును చాలించుట

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- పూజనీయుడవగు ఓ శుక మహర్షీ! మహాత్ములకు కర్మయోగముచే ఆత్మజ్ఞానము కలిగి, దానిచే వారీ కర్మఫలములన్నియు దహించివేయబడును. కొత్తగా కర్మలను చేయుటకు ప్రేరణనిచ్చే రాగద్వేషములు కూడ వారియందు ఉండవు. తమ స్వరూప మునందు మాత్రమే రమించే అట్టి మహాత్ములకు అనుకోకుండా ఈశ్వరే చ్చ చే యోగసిద్దులు లభించినచో, అవి వారికి మరల అజ్ఞానము, అస్మిత, రాగము, ద్వేషము, మరణభయము అనే చిత్త క్లేశములను కలిగించలేవు. ఇది నిశ్చయము.

            శుక మహర్షి ఇట్లు పలికెను --- నీవు చెప్పినది వాస్తవమే. కాని, ఈ లోకములో నమ్మించి మోసము చేయువానిని, క్రూర స్వభావము గల వానిని విశ్వసించరు. అదే విధముగా, కొందరు మహాత్ములు మిక్కిలి చప లమగు మనస్సును సాక్షాత్తుగా విశ్వసించరు.

ఈ విషయములో ఇట్లు చెప్పబడినది --- మనస్సు చంచలమైన ది. ఈ సంగతిని గుర్తించి, సాధకుడు ఏ కాలమునందైననూ ఆసక్తిని పెంచు కొనరాదు (మనస్సుతో స్నేహమును చేయరాదు). గొప్పవారలు కూడ మనస్సును నమ్మి, చిరకాలము కష్టపడి చేసిన తపస్సును పోగొట్టుకొనిరి.

వ్యభిచారిణియగు భార్య భర్త నమ్మియుండగా, జారులు ప్రవేశిం చుటకు అవకాశమునిచ్చును. అదే విధముగా, సాధకుడు మనస్సును నమ్మి యున్నచో, ఆ మనస్సు కామనకు, దాని వెంట వచ్చే కోపము మొదలగు అంతశ్శత్రువులకు లోపల ప్రవేశించే అవకాశమునిచ్చును.

మనస్సు మూలకముగనే సాధకునకు కామన, కోపము, గర్వము, పిసినారి తనము, శోకము, వ్యామోహము, భయము, మాత్సర్యము మొద లగు అవలక్షణములు ఉదయించును. మనస్సు మూలకముగనే వ్యక్తి కర్మ లయందు బద్ధుడై యుండును. అట్టి మనస్సును వివేకియగు సాధకుడు ఎవ్వాడు విశ్వసించును? (ఎవ్వరైననూ విశ్వసించరు).

ఋషభదేవుడు లోకపాలకుందరికీ అలంకారము వంటి వాడే. కానీ, ఆయన తన ఈశ్వరీయమగు మహిమ ప్రకటము కాకుండా, లోకవీరు ద్ధములైన వేషము, భాష, చేష్టలతో జడుడు వలే కానవచ్చెను. అపుడా యన దేహత్యాగము చేయగోరి, సాధకులకు మరణించే పద్ధతిని నేర్ప దలచేను. ఆయన దేహాభిమానమును విడిచి పెట్టి, భేదదృష్టికి నిలయమగు బుద్దిని ఆత్మ చైతన్యమునందు విలీనము చేసి, ఆత్మనిష్ఠుడై నిలిచెను. ఈ విధముగా ఆయన ప్రపంచవ్యవహారములనుండి విరమించెను.

ఈ విధముగా ఋషభదేవునకు నిశ్చయముగా దేహాభిమానము లేకుండెను. అయిననూ, యోగమాయయొక్క వాసనచే ఆయన దేహము బాధితమైననూ ఛాయామాత్రముగా మిగిలియున్న అహంవృత్తిని బట్టి నడ చుచుండెను. ఈ విధముగా ఆయన ఈ లోకములో తిరుగుతూ, అనుకో కుండగనే ఈశ్వరేచ్చచే కోంకము, వేంకము, కుటకము, దక్షిణదేశము, కర్ణా టకము మొదలగు ప్రాంతములలో తిరిగెను. ఒకనాడాయన కుటకపర్వత ముయొక్క ఉద్యానమునందు నోటియందు రాతిముక్కనుంచుకొని, పిచ్చివాడు వలే జుట్టు విరబోసుకొని, దిగంబరుడుగనే తిరుగాడెను.

తరువాత, గాలి వేగమునకు కదలాడే వెదుళ్ల రాపిడికి పుట్టిన భయంకరమగు కార్చిచ్చు ఆ అడవిని పూర్తిగా కబళిస్తూ కాల్చివేసెను. ఋషభదేవుడు దానిలో చిక్కుకొని మరణించెను.

కోంక వేంక కుటక ప్రాంతములకు అర్హన్ అని ప్రసిద్దిని చెందిన రాజు ఉండగలడు. ఆయన ఋషభదేవుని ఈ వృత్తాంతమును విని, ఆ ఆచరణను తాను కూడ నేర్చుకొని, తన బుద్దిచే అయోగ్యమగు పాఖండ (పాపపు గురుతులు గలది, వేదములను దూషించునది) పూర్ణమైన చెడు మార్గమును నిర్మించి ప్రచారము చేయగలడు. మానవులు తమ ధర్మ మును తామాచరించినచో, వారికి ఏ విధముగనూ భయము కలుగదు. కాని, విధివిధానము అట్లుండుటచే, కలియుగమునందు అధర్మము వర్ధిల్లి, ఆ రాజు వ్యామోహముచే స్వధర్మమును విడిచి పెట్టగలడు.

ఈ పాఖండమతముయొక్క ప్రభావముచే కలియుగమునందు కొందరు మానవాధములు నిశ్చయముగా ఈశ్వరమాయచే వ్యామోహి తులై యుందురు. వారు స్వధర్మమును విధించే వేదముల ఆదేశములను, బాహ్య-ఆంతరశౌచము (పవిత్రత) లను విడిచి పెట్టి, స్వకపోలకల్పితమగు గ్రంథములలోని విధులనే ఆచరిస్తూ, సచ్చీలమును కోల్పోయి ఉందురు. వారు తమకు నచ్చిన విధముగా, దేవతలను హేళన చేసే పాఖండవ్రతము లను చేస్తూ, స్నానము ఆచమనము పరిశుద్దతలను విడిచి పెట్టి, జుట్టు పెరుకుకొనుట మొదలగు పనులను చేసెదరు. కలియుగములో అధర్మము అధికముగా నుండును. దాని ప్రభావముచే వారు నశించిన వివేకము గల వారై, వేదములను బ్రాహ్మణులను యజ్ఞేశ్వరుడగు శ్రీహరిని భగవద్భక్తు లను తరుచుగా దూషించెదరు.

వారు ఈ నవీనమైన పాఖండమార్గమును విశ్వసించి, తమ ఇచ్చ వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ, దేహయాత్రను నిర్వర్తించెదరు. వీరి పరంప రలో ఒక అజ్ఞాని తన అజ్ఞానమును మరియొకనికి అందజేయుచుండును. దీనిచే వారు తమంత తాముగా ఘోరమగు నరకములో పడిపోయెదరు. (అజ్ఞానమనే ఈ నరకములో వివేకమునకు అవకాశమే లేదు).

రజోగుణముచే నిండిన మనస్సు గల మానవులకు మోక్షమార్గము నందు శిక్షణనిచ్చుటయే ఈ అవతారమునకు ప్రయోజనము. ఆ ప్రయోజ నమునకు తగిన శ్లోకములను జనులు ఈ విధముగా గానము చేసెదరు.

            ఆశ్చర్యము! ఏడు సముద్రములతో చుట్టువారబడియున్న ఈ భూమండలములోని ఖండములు మరియు దేశములు అన్నింటిలో భారత దేశము చాల పవిత్రమైనది. ఏలయనగా, ముర అనే రాక్షసుని సంహరిం చిన శ్రీహరియొక్క అవతారములను, ఆయా అవతారములయొక్క మంగ ళకరములగు లీలలను అక్కడి జనులు గానము చేయుచుందురు.

ఆశ్చర్యము! ప్రియవ్రతుని వంశము పవిత్రమైనది, గొప్ప కీర్తి గల ది. ఏలయనగా, సర్వాంతర్యామి, సర్వకారణుడు, పురాణపురుషుడు అగు శ్రీహరి మనుష్యరూపముతో ఆ వంశమునందు అవతరించి, మోక్షమునకు దారి తీసే ధర్మము నాచరించెను. మోక్షస్వరూపమగు ఆత్మయందు కర్మ సంబంధము ఉండదు.

ఋషభదేవుడు సంసారమునకు అతీతుడు. ఆయన అనుసరించిన మార్గమును మరియొక యోగి ఎవ్వడైననూ ఊహచేనైననూ అనుసరించ గల్గునా? ఏలయనగా, సామాన్యముగా యోగులు యోగసిద్దులను కోరు చుందురు. కాని, ఋషభ దేవుడు తమను స్వీకరించవలెనని ఆ సిద్దులు ప్రయత్నించినా, మిథ్యాభూతములగుటచే వాటిని ఆయన నిరాకరించెను.

అన్ని వేదములను, లోకములను, దేవతలను, బ్రాహ్మణులను, గోవులను ఋషభదేవుడు రక్షించెను. ఆయన పరమగురువు. ఆయన యొక్క పావనమగు చరితమును నేను చెప్పితిని. ఇది మానవుల సకలపా పములను పోగొట్టును. మిక్కిలి దుర్లభమగు గొప్ప కల్యాణములకు ఈ చరితము నిధానము. సాధకుడు దీనిని ఏకాగ్రమగు చిత్తముతో ప్రతిదినము ప్రవచనము చేయవలెను. లేదా, అట్టి ప్రవచనమును వినవలెను. అట్లు ప్రవ చనము చేయువాడు, మరియు వినువాడు అనే ఇద్దరికీ కూడ ఆ వాసుదేవ భగవానునియందు ఏకాంతమగు (ఫలాభిసంధి లేని) భక్తి కుదురును.

జ్ఞానులు ప్రతిదినము నిరంతరముగా తమ అంతఃకరణమును ఆ భక్తియందు మాత్రమే స్నానము చేయించెదరు. అనేకదుఃఖములతో నిండి యున్న జన్మమరణప్రవాహరూపమగు సంసారముయొక్క అధికమగు తాపము వారికి ఆ విధముగా ఉపశమించును. ఆ భక్తిచే వారికి పరమానం దము కలుగును. మేము భగవద్భక్తులము అనే భావన చేతనే వారికి పురు షార్థములు (మనోరథములు) అన్నియు పరిపూర్ణములగును. వినాశము లేనిది, పరమపురుషార్థము అగు మోక్షము తనంత తానుగా వచ్చినా, వారు దానియందు ఆదరమును చూపనే చూపరు.

ఓ రాజా! శ్రీకృష్ణ భగవానుడు మీకు, యాదవులకు స్వయముగా రక్షకుడు, మార్గదర్శి, దైవము, ప్రియుడు మరియు కులమునకు ప్రభువు. ఇంతేగాక, ఆయన కొన్ని సందర్భములలో మీరు చెప్పిన పనులను కూడ చేసి పెట్టినాడు. ఇదే విధముగా ఆయన ఇతరభక్తులకు కూడ చేయవచ్చు ను. మోక్షప్రదాతయగు ఆ భగవానుడు భక్తులకు మోక్షమును కూడ ఇచ్చు ను. కాని, ఏ కాలమునందైననూ భక్తియోగమును సరళముగా నీయడు.

ఋషభదేవుడు అన్ని కాలములలో ఆత్మస్వరూపమునందు నిలి చియున్నవాడగుటచే ఆయనకు కామనలు ఏవియు లేవు. కొని, దీనికి భిన్న ముగా మానవుడు అనాత్మభూతములగు దేహాదులయందు ఆత్మభావ ముతో వ్యవహరిస్తూ, పరమహితము మరియు మోక్షరూపము అగు ఆత్మ స్వరూపము విషయములో అజ్ఞానియై యున్నాడు. అట్టి మానవునకు అభ యస్థానమగు ఆత్మతత్త్వమును ప్రకటించిన ఆ ఋషభదేవుని కొరకు నమస్కారము.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో ఋషభదేవుడు అవతారమును చాలించుట అనే ఆరవ అధ్యాయము ముగిసినది (6).