శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము
1 - ప్రియవ్రతోపాఖ్యానము
పరీక్షిన్మహారాజు శుకమహర్షిని ఇట్లు ప్రశ్నించెను --- ఓ మహర్షీ! ప్రియవ్రతుడు గొప్ప భగవద్బక్తుడనియు, తన స్వరూపమునందు తాను రమించువాడు (ఆత్మానంద భరితుడు) అనియు చెప్పితిరి. అట్టి మహా త్ముడు గృహస్థాశ్రమమునందు ఎట్లు ఇమిడెను? ఏలయనగా, గృహస్థాశ్ర మమునందు మునిగిపోయిన జనులు తమ స్వరూపమును గురించి విస్మ రించి, కర్మల బంధములో చిక్కుకొని యుందురు గదా!
ఓ మహర్షీ! నీవు బ్రహ్మవేత్తలలో అగ్రేసరుడవు. భోగాసక్తిని విడిచి పెట్టిన అట్టివారికి ఈ విధముగా గృహస్థాశ్రమమునందు అధికమగు ఆసక్తి ఉండుట తగదు గదా! ఇది నిశ్చయము.
ఓ మహర్షీ! నీవు వేదముల సారమునెరింగిన వాడవు. పుణ్యకీర్తి యగు శ్రీహరియొక్క - పాదముల నీడను ఆశ్రయించిన మహాత్ముల మనస్సు శాంతముగా నుండును. అట్టి వారి బుద్ధిలో సంసారమునందు తృష్ణ ఉండదు గదా!
ఓ మహర్షీ! నాకు పెద్ద సందేహము గలదు. భార్య, ఇల్లు, కొడు కులు మొదలగువాటియందు తగుల్కొనియున్న ప్రియవ్రతునకు శ్రీకృష్ణునియందు దృఢమగు భక్తి నెలకొని ఆత్మజ్ఞానము ఉదయించుట ఎట్లు సంభవమయ్యెను?
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- నీవు చక్కగా చెప్పితివి. కాని, పవిత్రకీర్తియగు శ్రీహరిభగవానుని పాదపద్మముల ధ్యానామృతరసాస్వాద నమునందు నిమగ్నమైన మనస్సు గల మహాత్ములు శ్రీహరి గాథను స్వీయసాధనగా ఎన్నుకొనియుందురు. భగవద్భక్తులగు ఆత్మజ్ఞానులకు శ్రీహరి చాల ప్రియుడు. ఆ పరమమంగళకరమగు మార్గములో వారికి కొద్దిపాటి విఘ్నములు వచ్చినా, వారా మార్గమును విడిచి పెట్టరు.
రాజపుత్రుడగు ఆ ప్రియవ్రతుడు భగవద్భక్తులలో గొప్పవాడు, ఒక కాలములో ఆయన నారద మహర్షియొక్క పాదములను సేవించి తేలి కగా పరబ్రహ్మస్వరూపమును తెలుసుకొని, ఆత్మనిష్ఠయందు జీవితమును గడుపుటకై దీక్షను స్వీకరించుటకు సిద్దపడెను. కాని, ఆతనియందు శాస్తో క్తములైన గొప్ప రాజగుణములన్నియు నిత్యనివాసముగా ఉండెడివి. ఆయనను తండ్రియగు మనువు రాజ్యమునేలుమని నియోగించెను. తం డ్రియొక్క ఆ మాట తిరస్కరించ రానిది. సందేహము లేదు. కాని, ఆయన మనస్సు నిరంతరముగా శ్రీకృష్ణ భగవానునియందు మాత్రమే ఏకాగ్రమై యుండెడిది. చూచుట, వినుట మొదలగు ఇంద్రియవ్యాపారములనన్నిం టినీ ఆయన వాసుదేవునియందు సమర్పించి వేసెను. కావుననే, రాజ్యాధి కారమును చేబట్టినచో, అనాత్మభూతములగు రాజ్యాదులచే ఆత్మస్వరూపము తిరస్కరించబడునని ఆయన తలపోసేను. కావుననే, ఆయనకు అట్టి రాజ్యాధికారము నచ్చుబాటు కాలేదు. రాజ్యము మొదలగునవి మిథ్యయే అయిననూ, ఆత్మస్వరూపమును కప్పివేయ సమర్థములని ఆయనకు తెలియును.
త్రిగుణాత్మికయగు ప్రకృతియొక్క వికారమే ఈ జగత్తు. స్వయం భువుడు, ఆదిదేవుడు అగు బ్రహ్మభగవానుడు సర్వదా ఈ జగత్తుయొక్క సమృద్ధిని గురించి ఆలోచించుచుండును. సకలజీవుల అభిప్రాయము ఆయనకు నిశ్చితముగా విదితమే. వేదములు రూపమును దాల్చి వెంటరాగా, పరిచారకులచే చుట్టువారబడియున్న ఆ బ్రహ్మగారు సత్యలోకము నుండి భూలోకమునకు విచ్చేసెను.
దేవశ్రేష్ఠులు ఆకాశములో అక్కడక్కడ విమానపంక్తులయందున్న వారై ఆ బ్రహ్మగారిని అడుగడుగునా చక్కగా పూజించిరి. మార్గమంతటా సిద్దులు, గంధర్వులు, సాధ్యులు, చారణులు మరియు మహర్షులు గుంపులు గుంపులుగా చేరి, ఆయనను కీర్తించిరి. ఆయన చంద్రుడు వలే గంధమాదన పర్వతముయొక్క లోయను ప్రకాశింపజేస్తూ, ప్రియవ్రతుని వద్దకు విచ్చేసేను.
అక్కడ ఆ సమయములో ప్రియవ్రతునితో బాటు ఆయన తండ్రి యగు మనువు, నారద మహర్షి కూడ ఉండిరి. హంస వాహనమును బట్టి ఆయన తన తండ్రియగు హిరణ్యగర్భుడే (బ్రహ్మగారు) నని నారదుడు గుర్తుబట్టెను. ఆయన వెంటనే లేచి నిలబడి, వారిద్దరితో గూడి, బ్రహ్మగారిని పూజించి స్తుతించెను.
భరతవంశములో జన్మించిన ఓ పరీక్షిన్మహారాజా! ఆదిపురుషు డగు బ్రహ్మదేవునకు వారు పూజాదికమును సమర్పించి, మంచి వాక్యము లతో ఆయన గుణగణములను, అవతార విశేషములను, ఆయనయొక్క గొప్ప ఉత్కరను అధికముగా కొనియాడిరి. ఆయన అప్పుడు దయతో గూడిన చిరునవ్వుతో ప్రియవ్రతునివైపు చూచి ఇట్లు పలికెను.
కుమారా! నేను సత్యమును చెప్పుచున్నాను. నీవీ విషయమును తెలుసుకొనుము. శ్రీహరి ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరుడు కాడు. ఆయనను నీవు దోషదృష్టితో చూచుట తగదు. నేను, శివుడు, నీ తండ్రి యగు మనువు, ఈ నారద మహర్షి మేమందరము అస్వతంత్రులము. మేము ఆయన ఆదేశమును పాలించుచుండెదము.
ఏ జీవుడైననూ ఆ శ్రీహరియొక్క విధానమును తపస్సుచే, విద్య చే, యోగశక్తి చే, బుద్ధిశక్తిచే, ధనముచే, లేదా ధర్మకార్యములచే, స్వయ ముగా గాని, లేదా ఇతరుల ఆశ్రయముతో గాని, తప్పించుటకు సమర్థుడు కానే కాడు.
ఓయీ! ప్రతి జీవుడు ఇంద్రియగోచరుడు కాని ఈశ్వరునిచే ఈయ బడిన దేహమును ధరించి, కర్మలను చేస్తూ, అన్ని కాలములలో శోకమును మోహమును భయమును అనుభవిస్తూ, సుఖదుఃఖములననుభవించి, మర ణించును. ఈ సర్వము ఈశ్వరాధీనమై యున్నది.
ఓ కుమారా! భగవానుని వేదరూపమగు వాక్కు మనలనందరిని నడిపించుచున్నది. వేదోక్తములగు సత్త్వరజస్తమోగుణాత్మకములైన కర్మ లను చేసే మనము అందరము, కర్మలు అనే త్రాళ్లచే వేదము అనే త్రాటికి కట్టి వేయబడి, ఈశ్వరుని ఆదేశమును పాలిస్తూ, ఆయనను పూజించుచు న్నాము. మనము ముక్కు త్రాడు వేసి బండికి కట్టబడి మనుష్యుల కొరకై బరువులను మోసే ఎద్దుల వంటి వారము.
జీవులమగు మనము సత్త్వాది గుణములే మూలముగా గల కర్మ లయందు ఆసక్తి గలవారమై యుండెదము. ఆ కర్మలకనురూపముగా ఈశ్వరుడు మనకు ఆయా దేహములనొసగును. అట్టి దేహములను దాల్చిన మనము, చూపు గలవానిచే నడిపించబడే గ్రుడ్డివారు వలె, ఈశ్వ రునిచే ఈయబడే సుఖదుఃఖములను స్వీకరించెదము.
జీవన్ముక్తుడు కూడ ప్రారబ్ద (జన్మనారంభించిన) కర్మ ఉన్నంతవ రకు దానికి అనురూపముగా సుఖదుఃఖములననుభవిస్తూ, దేహాదుల యందు నేను-నాది అనే అభిమానము లేనివాడై, దేహమును ధరించి యుండును. దీనిని నిద్ర మేల్కాంచినవాడు స్వప్నములో తాను అనుభవిం చిన విషయములను స్మరించే స్థితితో పోల్చవచ్చును. కాని, అట్టి జ్ఞాని మరల దేహమునారంభించే విధముగా (అనగా, కర్తృత్వభావనతో) కర్మలను చేయడు. దేహారంభకములగు వాసనలు ఆతనియందు ఉండవు.
విషయభోగములయందు మదించి యున్నవాడు అడవిలో ఉన్నా సంసారభయమును కలిగియే యుండును. ఏలయనగా, అడవికి వెళ్లినా ఆర్గురు అంతశ్శత్రువులు (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు, లేదా అయిదు జ్ఞానేంద్రియములు మరియు మనస్సు) ఆతనిని వెన్నాడి యుండును. దీనికి భిన్నముగా, ఇంద్రియములను జయించి ఆత్మారాముడై యున్న జ్ఞాని గృహస్థాశ్రమములో ఉన్నా, దోషమేమి కలుగును? రాగాది దోషమేమియు ఆతనికి కలుగదు.
దుర్గమునాశ్రయించి ఉన్న రాజు బలవంతులగు శత్రువులనైననూ జయించగల్గును. అదే విధముగా వివేకవంతుడగు సాధకుడు ముందుగా గృహస్థాశ్రమములోనుండి సాధన చేయవలెను. అట్లు చేయుట వలన ఆతడు ఆరు అంతశ్శత్రువులను జయించి, జితేంద్రియుడగును. అప్పుడాతడు గృహస్టుగా ఉన్నా, లేక అడవికి వెళ్లినా (సన్న్యసించినా), తేడా ఉండదు గాన, తనకు నచ్చిన విధముగా చేయవచ్చును.
నీవైతే పద్మనాభుని పాదపద్మముయొక్క గర్భమునే దుర్గముగా ఆశ్రయించి (అనగా, పద్మనాభుని పాదములను స్మరించి మనోబలమును పొంది), ఆర్గురు లోపలి శత్రువులను (కామక్రోధాదులను, లేదా అయిదు ఇంద్రియములను మనస్సును) జయించుము. ఈ లోకములో ఈశ్వరుడి చ్చిన భోగములను భోగాసక్తి లేకుండా అనుభవించుము. ఆ విధముగా ఆత్మస్వరూపనిష్ఠను సాధించుము.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ముల్లోకములకు తండ్రియగు బ్రహ్మదేవుడు గొప్ప భగవద్భక్తుడగు ప్రియవ్రతునకు ఈ విధముగా చక్కని ఉపదేశమును చేసెను. తాను బ్రహ్మగారికంటే పిన్న యగుటచే, ప్రియవ్రతుడు ఆయన యెదుట వినయముతో మెడను వంచి, సరే అంటూ, ఆ ఉపదేశమును ఆదరముతో స్వీకరించెను.
బ్రహ్మదేవుని మనువు చక్కగా పూజించెను. అపుడాయన, ప్రియ వ్రత నారదులు ప్రసన్నమగు మనస్సుతో తనవైపే చూచుచుండగా, తన లోకమునకు వెళ్లాను. ఆ సమయములో ఆయన పరబ్రహ్మను ఆత్మరూపముగా ధ్యానించుచుండెను. హిరణ్యగర్భునకు అధిష్ఠానమగు ఆ పరబ్రహ్మ మాటలకు గాని, ఊహలకు గాని అందేది కాదు. సర్వవ్యవహారములు ఆ పరబ్రహ్మయందే కల్పించబడుచున్ననూ, అవి ఆ పరతత్త్వమును స్పృశించజాలవు.
మనువుయొక్క మనోరథమును జగద్గురువగు బ్రహ్మగారు ఈ విధముగా సంపాదించి పెట్టెను. అపుడాయన సకలభూమండలముయొక్క మర్యాదను రక్షించుట కొరకై, దేవర్షివర్యుడగు నారదుని అనుమతిచే ప్రియ వ్రతుని రాజ్యమునందు ప్రతిష్ఠించెను. ఇంద్రియభోగములకు నిలయమగు గృహాశ్రమము విషము కలిసిన జలాశయము వంటిది. భోగేచ్చను అధిగ మించుట దుర్ఘటము. కాని, ఆ మనువు అట్టి భోగేచ్ఛను పరిత్యజించెను.
ఈ విధముగా ప్రియవ్రత మహారాజు ఈశ్వరసంకల్పముచే రాజ్య పాలనము అనే కర్మయందు నియుక్తుడాయెను. సకలజగత్తుయొక్క బంధ మునుండి విముక్తిని కలిగించే మహిమ సకలజగత్కారణుడగు శ్రీహరి భగ వానునకు గలదు. ఆ మహారాజు అఖండచైతన్యస్వరూపుడగు అట్టి శ్రీహరి యొక్క పొదముల జంటను నిరంతరముగా ధ్యానించెడివాడు. ఆ ధ్యాన ముయొక్క ప్రభావముచే ఆయన హృదయములో రాగద్వేషముల మాలిన్యము తొలగిపోయి, ఆయన శుద్దుడాయెను. ఇంకనూ కర్తవ్యకర్మలను చేయవలసిన ఆవశ్యకత ఆయనకు లేదు. అయిననూ, పెద్దల మర్యాదను నిలబెట్టువాడై, ఆయన రాజ్యమును పాలించెను.
తరువాత ఆయన విశ్వకర్మ ప్రజాపతియొక్క కుమార్తెయగు బర్షి ష్మతిని వివాహమాడెను. ఆమెయందు ఆయనకు పదిమంది కొడుకులు, ఆఖరుగా ఊర్జస్వతి అని పేరు గాంచిన ఒక కూతురు కలిగిరి. ఆహా! ఆ కొడుకులు అందరు చాల గొప్పవారు. వారు ప్రియవ్రతునితో సమానమైన శీలమును, గుణములను, కర్మలను, రూపమును, పరాక్రమమును కలిగి యుండిరి.
ఆగ్నీధ్రుడు (అగ్నిని ప్రజ్వరిల్లజేయు ఋత్విక్కు), ఇద్మజిహ్వుడు (సమిదెల కట్టయే నాలుకగా గలవాడు), యజ్ఞబాహువు (యజ్ఞములే చేతు లుగా గలవాడు), మహావీరుడు (గొప్ప వేడి గలవాడు), హిరణ్యరేతసుడు (తేజస్సే సారముగా గలవాడు), ఘృతకృష్ణుడు (నేయియే ఆధారముగా గలవాడు), సవనుడు (సోమమును పానము చేయువాడు), మేధాతిథి, వీతిహోత్రుడు (హవిసే ఆహారముగా గలవాడు), కవి (జ్ఞాన స్వరూపుడు) అనునవి వారి పేర్లు. ఇవి అన్నీ అగ్ని పేర్లే.
వీరిలో కవి, మహావీరుడు, సవనుడు అనువారలు ముగ్గురు నైష్ఠిక బ్రహ్మచారులు. వారు బాల్యమునుండియే ఆత్మవిద్యను అభ్యసించి, పర మహంసలకు సంబంధించిన సన్న్యాసాశ్రమమునే స్వీకరించిరి.
ఆహా! ఆ సన్న్యాసాశ్రమమునందు వారు ముగ్గురు మహర్షులు సర్వకర్మసన్న్యాసులై సర్వోత్కృష్టమగు భక్తిని సాధన చేసిరి. సకలజీవ సమూహములకు నివాసస్థానమగు శ్రీకృష్ణ భగవానుడు శరణు పొందిన వారి భయములను పోగొట్టును. వారాయనయొక్క శోభాయుక్తములగు పాదపద్మములను అఖండితముగా ధ్యానించిరి. దాని ప్రభావముచే వారి హృదయము శుద్దమై, సకలప్రాణులకు అంతరతమమగు స్వరూపమైన ఆత్మయే అయి ఉన్న భగవానుడు ఆ హృదయములో సాక్షాత్కరించెను. వారు అహంకారమును నిరాకరించి ఆత్మరూపుడగు భగవానునిలోనే ఐక్య మును పొందిరి.
ప్రియవ్రతునకు మరియొక భార్యయందు ఉత్తముడు, తామసు డు, రైవతుడు అనే ముగ్గురు కొడుకులు కూడ కలిగిరి. వారు మన్వంతర ములకు అధీశ్వరులు.
ఈ విధముగా ప్రియవ్రత మహారాజుయొక్క ముగ్గురు కుమారులు సర్వకర్మసన్న్యాసపరాయణులైరి. అపుడా పెద్ద మనస్సు గల మహారాజు పదకొండు కోట్ల సంవత్సరముల కాలము భూమిని పాలించెను. ఆయన బలముతో నిండిన భుజదండముల జంటతో అన్ని పురుషకారములను నిరాఘాటముగా సాధించెను. ఆయన ఆ భుజములతో నారిత్రాడు లాగిన ప్పుడు కలిగిన శబ్దము ధర్మద్రోహులను తరిమివేయుటకు చాలియుండే ను. ఆయన అంతఃపురమునకు వచ్చినప్పుడు బర్హిష్మతి హర్షముతో ఎదు రేగి, ప్రేమను ఒలకబోస్తూ, సిగ్గు పడుతూ, ముసిముసి నవ్వులతో నిండిన చూపులను విసురుతూ, ఉల్లాసమును కలిగించే పరిహాసవచనములను పలుకుతూ ఆయనను రమింపజేసెను. ప్రతిదినము వర్ధిల్లుచున్న ఈ శృంగారచేష్టలచే ఆయన వివేకమును కోల్పోయినాడా యన్నట్లు, ఆత్మవి స్మృతిని పొందినాడా యన్నట్లు, ఆమెతో గూడి భూలోకములో భోగముల ననుభవించెను.
సూర్య భగవానుడు మేరు పర్వతమును ప్రదక్షిణము చేస్తూ భూమండలమును ప్రకాశింప జేయుచున్నాడు. కాని, ఆయన భూమండల ములో సగమును మాత్రమే ప్రకాశింప జేస్తూ, మిగిలిన సగమును చీకటితో కప్పివేయుచున్నాడు. ఇది ప్రియవ్రతునకు నచ్చలేదు. ఆయన శ్రీహరి భగవానుని ఉపాసించి మానవాతీతమగు మహిమను సంపాదించినవాడు. అపుడాయన సూర్యునితో సమానమగు వేగము గలది, కాంతిపూర్ణము అగు రథమునెక్కి, రెండవ సూర్యుని వలె సూర్యుని వెంట మేరువును ఏడు సార్లు ప్రదక్షిణము చేసెను.
ఆయన రథచక్రముల వంచలు చేసిన అగడ్తలే ఏడు సముద్రము లైనవి. ఆ సముద్రముల వలననే భూమండలము ఏడు ఖండములుగా విభాగము చేయబడినది.
జంబూ, ప్లక్షము, కుశము, క్రౌంచము, శాకము, పుష్కరము అను నవి ఆ ద్వీపముల పేర్లు. వాటి పరిమాణమును గురించి చెప్పెదను. వాటిలో ముందుదానికంటే తరువాతిది రెండు రెట్లు పరిమాణమును కలిగి యున్నది. అవి సముద్రమునకు బయట చుట్టూ వ్యాపించి యున్నవి.
ఉప్పు, చెరుకు రసము, మధిర, నేయి, పాలు, పెరుగు, మంచి నీరు అనే ఏడు సముద్రములు ఏడు ద్వీపములకు అగడ్తలవలె నున్నవి. అవి వాటిలోపలనున్న జంబూ మొదలగు ద్వీపములతో సమానమగు పరి మాణమును కలిగియున్నవి. అవి క్రమముగా జంబూ మొదలగు ఏడు ద్వీపములకు బయట వేర్వేరుగా చుట్టువారి యున్నవి. బర్హిష్మతికి భర్తయగు ప్రియవ్రతుడు తన ఆజ్ఞను పాలించే పుత్రులనేగ్గురిని క్రమముగా ఒక్కొక్కరిని ఒక్కొక్క ద్వీపమునకు మాత్రమే అధిపతిగా చేసెను. ఆగ్నీధ్రుడు, ఇద్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ణుడు, మేధాతిథి, వీతిహోత్రుడు అనునవి వారి పేర్లు.
ప్రియవ్రతుడు ఊర్జస్వతి యని ప్రసిద్ధిని గాంచిన తన కుమార్తెను శుక్రాచార్యునకు ఇచ్చి వివాహమును చేసెను. శుక్రాచార్యునకు ఆమె యందు దేవయాని అని ప్రసిద్ధిని బడసిన కుమార్తె కలిగెను.
వామనావతారములో పెద్ద పెద్ద అంగలతో ముల్లోకములను కొలి చిన భగవానునియందు ఈ విధముగా ఏడు సముద్రములను, ద్వీపము లను రచించే సామర్థ్యము గలదు. ఆయన పాదపద్మములను కొలిచే భక్తు లకు ఇట్టి సామర్థ్యము ఆశ్చర్యమును కలిగించదు. భగవంతుని పాదపద్మ ములను కొలిచే భక్తులు అయిదు జ్ఞానేంద్రియములను, మనస్సును జయించెదరు. ఆకలి-దప్పికలు, శోకమోహములు, జరామృత్యువులు అనే ఆరు ప్రకృతివికారములకు వారు అతీతులై యుండెదరు. ధర్మమునుండి దూరముగా తొలగిపోయిన వ్యక్తియైననూ ఆ భగవానుని నామమును ఒక్కసారి ఉచ్చరించినచో, ఆ క్షణమునందే ఆతడు సంసారబంధమునుండి విముక్తుడగును.
ఈ విధముగా ప్రియవ్రతుడు హద్దు లేని బలపరాక్రమములు గల వాడే. కానీ, ఆయన దేవర్షియగు నారదుని పాదములను సేవిస్తూ, రాజ్యాధికారమును, విషయభోగములను పొంది యుండెను. అందువలన, ఆయ నకు మనస్సులో ఒక అసంతోషము మిగిలియున్నదా యన్నట్లు ఉండెను. వైరాగ్యపూర్ణమగు మనస్సు గల ఆ మహారాజు ఒకనాడు ఇట్లు పలికెను.
ఆశ్చర్యము! చాల చెడ్డ పనిని చేసితిని! అజ్ఞానము దుఃఖ హేతువు లగు ఇంద్రియభోగములను చక్కగా తీర్చిదిద్ది ఆకర్షణను కలిగించును. ఇంద్రియములు నాకు దుఃఖ హేతువువగు విషయభోగములయందు పట్టు దలను కలిగించి, చీకటితో నిండియున్న కూపమువంటి సంసారములోనికి పడద్రోసినవి. ఈ భోగములింక చాలును! నేను స్త్రీ చేతిలో కోతివలె నాట్య మాడితిని. నా ప్రవృత్తి చాల నిందించ దగినది, అని ఆ మహారాజు తనను నిందించుకొనెను.
పరమేశ్వరుని అనుగ్రహముచే ప్రియవ్రతుని హృదయములో వివే కము ఉదయించి, వైరాగ్యము దృఢమయ్యెను. ఆయన ఈ భూమిని యోగ్యతననుసరించి తనను అనుసరించియున్న పుత్రులకు పంచియిచ్చేను. ఆయన భార్యతో గూడి గొప్ప సామ్రాజ్యలక్ష్మిని, భోగములను అనుభ వించెను. ఇపుడాయన ఆ సామ్రాజ్యమును మృతదేహమును వలె విడిచిపె ట్టెను. ఆయన హృదయములో శ్రీహరియొక్క లీలల మహిమను భావన చేస్తూ, మరల పూజ్యుడగు నారదమహర్షి ఉపదేశించిన మార్గమునే అనుసరించెను.
ప్రియవ్రతుని మహిమను చెప్పే ప్రసిద్ధములగు శ్లోకములు ఈ విధముగా నున్నవి --- ప్రియవ్రతుడు చేసిన కార్యమును భగవంతుడు తప్ప మరియెవ్వరు చేయగలరు ? ఆయన చీకట్లను పోగొడూ, తన రథచ క్రముల అంచుల దాడులచే ఏడు సముద్రములను రచించెను.
ప్రియవ్రతుడు ప్రాణుల సుఖజీవనము కొరకై ద్వీపముల ద్వారా భూమియొక్క రచనను, ప్రతి ద్వీపమునందు వేర్వేరుగా నదులు, పర్వత ములు, అడవులు మొదలగు వాటిచే హద్దులను ఏర్పాటు చేసెను.
ప్రియవ్రతునకు భగవద్భక్తులయందు ప్రీతి మెండు. జీవులు కర్మలను చేసి పాతాళమునందు, భూలోక స్వర్గలోకములయందు పొందే వైభవము ఆయనకు నరకమువంటిదిగనే భాసిల్లెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమ స్కంధములో ప్రియవ్రతోపాఖ్యానము అనే మొదటి అధ్యాయము ముగిసినది (1).
