శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము
7 - భరతుని చరితము
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- గొప్ప భగవద్భక్తుడగు భర తుడు రాజ్యము నేలవలేనని ఋషభదేవుడు సంకల్పించేను. భరతుడు ఆయన ఆదేశమును పాటించి, విశ్వరూపుని కుమార్తెయగు పంచజనిని వివాహమాడెను.
మహత్తత్త్వమునుండి పుట్టిన అహంకారము పృథివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనే అయిదు సూక్ష్మభూతములను ప్రకటించేను. అదే విధముగా, ఆ భరతుడు తన భార్యయందు తనకు తగియున్న అయి దుగురు కొడుకులను కనెను.
సుమతి, రాష్ట్రభృతుడు, సుదర్శనుడు, ఆథర్వణుడు, ధూమ్రకే తువు అనునవి వారి పేర్లు. భరతునకు పూర్వమునందు అజనాభమని ప్రసి ద్దిని గాంచిన ఈ దేశమునకు ఆయన తరువాత ఆయన పేరుతో భారతదే శము అనే పేరు వచ్చెను.
గొప్ప పండితుడగు ఆ మహారాజునకు ప్రజలయందు, ప్రేమ మెండు. తమ తమ పనులను చేసుకొనే ప్రజలను ఆయన తన ధర్మ మును పాలిస్తూ, తన తండ్రి తాత పాలించినట్లే, పరిపాలించేను.
యజ్ఞము (యూపము లేని వేదోక్తకర్మ), క్రతువు (యూపముతో కూడియున్న కర్మ) ల రూపములో శ్రీహరియే ఉన్నాడు. ఆ భరతుడు ఆయా కాలములలో అగ్నిహోత్రము, దర్శ, పూర్ణమాస, చాతుర్మాస్యము, పశుయాగము, సోమయాగము అనే చిన్న మరియు పెద్ద యాగములను చేబట్టి వాటిని శ్రద్దగా చేసి, ఆ విధముగా శ్రీహరిని ఆరాధించేను. ఆయన ప్రకృతి (పూర్తి అంగములతో కూడియున్న క్రతువు) మరియు వికృతి (పూర్తి అంగములు లేని క్రతువు) అనే రెండు రకముల యాగములనాచరించెను. హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే నాల్గు రకముల ఋత్విక్కులు ఆయనకు ఆ యాగములలో సహకరించిరి.
అధ్వర్యులు హవిస్సులను స్వీకరించి కర్మాంగములలోని హోమా దిక్రియలనాచరిస్తూ, వివిధములగు యాగములను చక్కగా నిర్వర్తించు చుండిరి. వేదోక్తమగు కర్మను చేస్తూనే, దానినుండి పుట్టే అపూర్వము అనే క్రియాఫలము పుణ్యము రూపములో నుండును. యజ్ఞమును చేయుచున్న ఆ భరతుడు అట్టి క్రియాఫలమును పరబ్రహ్మస్వరూపుడగు వాసుదేవ భగ వానునకు సమర్పించుచుండెను. ఈశ్వరునకు కర్మఫలమును సమర్పిం చుట అనే ఈ కుశలతచే ఆయన బుద్దియందలి రాగద్వేషాది దోషములు నశించెను. మంత్రములు వివిధదేవతల లక్షణములను స్మరింపజేయును. ఈ విధముగా ఆయా మంత్రములు ఆయా దేవతలను ప్రతిపాదించునట్లుగా, భగవానుడే వ్యవస్థను చేసెను. కావున, యజ్ఞమునకు ప్రధానకర్త యజ్ఞేశ్వరుడగు శ్రీహరియే. భరతుడు యజ్ఞభోక్తలగు ఆయా దేవతలను దేవదే వుడగు శ్రీహరి అవయవములయందు భావన చేయుచుండెను.
ఈ విధముగా భరతుడు నిష్కామముగా కర్మలను చేయుటచే, ఆయన అంతఃకరణము పరిశుద్ధమయ్యెను. పరబ్రహ్మస్వరూపుడగు వాసు, దేవ భగవానుడు ప్రాణుల హృదయము లోపలి చిదాకాశమే స్వరూప ముగా గలవాడు. ఆ పురుషోత్తముడు పుట్టుమచ్చ రూపములోనున్న లక్ష్మీ దేవిని, కౌస్తుభమాణిక్యమును, అడవిపువ్వుల మాలను, శంఖచక్రములను, గద మొదలగువాటిని దాల్చియున్న గొప్ప పురుషాకారములో తన భక్తుల హృదయములయందు స్థిరముగా నిలిచియుండును. భరతునకు కూడ తన హృదయములో ప్రకాశించుచున్న ఆ పురుషోత్తమునియందు గొప్ప భక్తి కలిగెను. ఆ భక్తియొక్క వేగము దినదినము చాల అధికముగా పెరిగెను.
ఈ విధముగా భరతుడు కోటి సంవత్సరములు రాజ్యమును పాలిస్తూ భోగములననుభవించెను. ఈ భోగములననుభవింపజేసిన ప్రారబ్ద కర్మఫలము పూర్తి అయ్యే సమయము వచ్చినదని ఆయన అపుడు నిర్దా రించుకొనెను. అప్పుడాయన తండ్రితాతలనుండి తనకు వచ్చిన ఆ సంప దను తన కొడుకులకు యథాస్యాయముగా పంచియిచ్చి, తాను సన్న్యసించెను. అన్ని సంపదలకు నిలయమైన తన గృహమునుండి నిర్గమించి, ఆయన పులహుని ఆశ్రమమునకు వెళ్లాను.
శ్రీహరి భగవానునకు ఆ పులహాశ్రమమునందు ఉండే తన భక్తుల యెడల వాత్సల్యము మెండు. ఈ నాటికీ ఆయన వారికి తాము ఉపాసించే రూపములో దర్శనమిచ్చుచుండును.
అక్కడ చక్రనది (గండకీ) అనే గొప్ప నది గలదు. దానియందలి రాళ్లయందు క్రింద పైన తూములు గల చక్రముల గుర్తులు (శాలగ్రామములు) ఉండును. వాటి వలన అక్కడి ఆశ్రమములు అన్ని విధములుగా పవిత్రములగుచుండును.
పరిశుద్దమగు అంతఃకరణము గల ఆ భరతుని మనస్సులోని భోగ వాసనలన్నియు తొలగిపోయి శాంతి వర్ధిల్లెను. ఆయన పులహాశ్రమము యొక్క ఉద్యానవనమునందు ఒంటరిగా భగవానుని పలురకముల పుష్ప ములు, చిగుళ్లు, తులసి దళములతో పూజించి, నీటితో అభిషేకించేను. ఆయన భగవానునకు దుంపలను, వ్రేళ్లను, పళ్లను నైవేద్యమిడెను. ఈ విధ ముగా ఆయన ఈశ్వరారాధనచే పరమానందమును పొందెను.
ఈ విధముగా అట్టి పురుషోత్తముని నిరంతరమగు ఆరాధనచే భర తుని హృదయములో అనురాగము బాగా పెరిగి, దాని వేగముచే హృదయము కరిగి శాంతమాయెను. గొప్ప ఆనందముయొక్క వేగముచే ఆయన దేహమంతటా గగుర్పాట్లు పొడసూ పెను, హృదయమునందలి తహతహచే ప్రేమాశ్రువులు పైకి ఉబికి కన్నుల చూపునకు ఆటంకము కలి గెను. ఈ విధముగా తన హృదయమునకు ప్రీతిని కలిగించే భగవానుని ఎర్రని పాదపద్మములను నిరంతరముగా ఆయన ధ్యానించగా, ఆ భక్తి యొక్క అభ్యాసము పరిఢవిల్లి, ఆయన హృదయమనే లోతైన సరస్సు అంతటా పరమానందముచే వ్యాప్తమయ్యెను. అట్టి హృదయమునందు నిమగ్నమైన బుద్ధిగల ఆ భరతుడు తాను చేయుచున్న ఈశ్వరపూజను కూడ మరిచి యుండెను.
ఈ విధముగా భరతుడు ఈశ్వరవ్రతములను చేబట్టి, లేడిచర్మ మునే వస్త్రముగా దాల్చి ప్రకాశించెను. మూడు పూటల స్నానముచే ఆయన దట్టని జుట్టు తడిసి బూడిదరంగు కలిగి గిరజాలు తిరిగియుండెను. ఆయన ఉదయించుచున్న సూర్యునకు ఎదుట నిలిచి సూర్యమండలము నందు తేజోమయుడు మరియు పూర్ణుడు అగు భగవానుని సూర్యమంత్ర ముతో స్తుతిస్తూ, ఈ వాక్యమును పలికెను.
చైతన్యప్రకాశమే స్వరూపముగా గల సర్వజగత్కారణుడగు పర బ్రహ్మ (సూర్యదేవుడు) యొక్క స్వరూపభూతమగు చిచ్ఛక్తి ప్రకృతికి అతీతమైనది. కర్మఫలములనొసంగే ఆ చిచ్ఛక్తిస్వరూపుడగు పరబ్రహ్మయే సంకల్పమాత్రముచే ఈ జగత్తును సృష్టించి, మరల దానియందు ఆవేశంచి, ఇంద్రియభోగములను కోరే జీవుని సాక్షిరూపుడై దర్శించుచున్నాడు. ప్రాణులయందలి ఇంద్రియశక్తులను ప్రవర్తిల్లజేసే భగవానుని ఆ చిచ్చక్తిని మేము శరణు వేడుచున్నాము.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో భరతుని ఉపాఖ్యానము అనే ఏడవ అధ్యాయము ముగిసినది (7).
