శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము
17 - సంకర్షణ స్తుతి
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- బలియొక్క యజ్ఞములో సాక్షాత్తుగా విష్ణు భగవానుడు వామనమూర్తియై అవతరించి, మూడు అడుగులు వేసి బ్రహ్మాండమును కొలిచెను. అప్పుడు ఆయన ఎడమకాలి బొటనవేలి గోరు తగిలి గంగాళమువంటి బ్రహ్మాండముయొక్క పై భాగము పగిలేను. అపుడా చిల్లు గుండా బ్రహ్మాండమునకు బయటనుండే నీరు లోపలికి ప్రవేశించి, ఆ భగవానుని పద్మములవంటి పాదములను కడిగి, ఆ పాదముల కుంకుమచే ఎర్రనయ్యెను. ఆ నీటి ధారకు సాక్షాత్తుగా భగవత్పది అని పేరు వచ్చెను. గంగ మొదలగు పేర్లు తరువాతి కాలములో వేర్వేరు లక్షణ ములను బట్టి వచ్చినవియే గాని, అసలు పేరు భగవత్పది (భగవానుని పాదముతో సంబంధము గలది) యే. ఆ నీటిని స్పృశించినచో సకలప్రాణులకు బయటనుండే మాలిన్యముతో బాటు అంతఃకరణమునందుండే పాపములు కూడ తొలగిపోవును. ఆ నీరు వేయి మహాయుగముల పరిమాణము గల చాల పెద్ద కాలమునకు స్వర్గముయొక్క శిరస్సు అనదగిన ధ్రువమండలమును చేరెను. ఆ ధ్రువమండలమునకు విష్ణుపదము అనే ప్రసిద్ధి కూడ గలదని మహాత్ములు చెప్పుచున్నారు.
ధ్రువలోకమునందు దృఢసంకల్పుడు, ఉత్తానపాదుని పుత్రుడు అగు ధ్రువుడు ఆ గంగను, తమ కులదైవమగు శ్రీహరి పాదపద్మముల నుండి వెలువడిన కారణముగా, ఈ నాటికీ నిశ్చయముగా మూడు పూటలా అతిశయించిన ఆదరముతో తలపై దాల్చుచున్నాడు. భగవద్భక్తులలో గొప్పవాడగు ఆ ధ్రువునకు భగవంతునియందలి భక్తియొక్క అభ్యాసము దినదినప్రవర్ధమానమగుచుండును. అందువలననే, ఆయన హృదయ ములో అతిశయించిన ఆర్ద్రత ఉదయించి, వేగిరపాటుడే స్వాధీనత తప్పి, కొంచెము మూయబడిన మొగ్గలవంటి కన్నుల జంటనుండి స్వచ్చమగు కన్నీరు ధారగా ప్రవహించును. ఆ సమయములో ఆయనకు దేహమంతటా పుట్టలు పుట్టలుగా రోమముల గగుర్పాటు కలుగును.
తరువాత ఆ గంగయొక్క మహిమ బాగా తెలిసిన సప్తర్షులు ఆ గంగను, తపస్సునకు పూర్ణమగు సిద్ధి ఈ గంగ లభించుట మాత్రమే అంటూ, జటల ముడులయందు ఇప్పటికి కూడ ధరించుచునే యున్నారు. నడచి వచ్చిన మోక్షమును మోక్షకాములు ఆదరించే విధముగా, వారు ఆమెను ఆదరించుచునే యున్నారు. ఆత్మజ్ఞానులగు ఆ మహర్షులు సర్వ ప్రాణులలో ఆత్మరూపముగా విలసిల్లే వాసుదేవ భగవానునియందు నిరం తరమగు భక్తియోగమును పొంది, తొవన్మాత్రముచే ఇతరపురుషార్థము లను నిరాకరించినారు.
తరువాత గంగ ఆ సప్తర్షిమండలమునుండి అనేకవేల కోట్ల విమాన ముల గుంపులతో రద్దీగానుండే దేవలోకమార్గముగుండా క్రిందకు దిగుతూ, మధ్యలో చంద్రమండలమును ముంచెత్తి, మేరుపర్వతశిఖరముపై నుండే బ్రహ్మపురియందు పడును.
అచట గంగ నాలుగు పాయలుగా విడిపోవును. సీత, అలకనంద, చక్షువు, భద్ర అని ఆ నాలుగు పాయల పేర్లు. ఆ పాయలు నాలుగు దిక్కులవైపు ప్రవహించి సముద్రమును చేరును. నదములకు, నదులకు గమ్యము సముద్రమే గదా!
సీత అనే పాయ బ్రహ్మపురినుండి మేరుపర్వతమునకు కేసరస్థాన ములోనుండి పర్వతములలో మొదటిదాని శిఖరముల మీదుగా క్రింద క్రిందకు తూర్పు వైపు ప్రవహిస్తూ, గంధమాదన శిఖరములపై పడి, భద్రా శ్వఖండమునకు మధ్యగా ప్రవహించి ఉప్పు సముద్రములో కలియును. .
ఇదే విధముగా, చక్షువు అనే పాయ మాల్యవత్పర్వత శిఖరము నుండి పడి, తగ్గని వేగముతో కేతుమాల ఖండమునకు అభిముఖముగా పడమర దిక్కునందు ప్రవహించి, సముద్రమును చేరును.
భద్ర అనే పాయ కూడ మేరుశిఖరమునుండి ఉత్తరముగా పడి ఒక పర్వతశిఖరమునుండి మరియొక శిఖరముమీద పడుతూ, వాటిని దాటి శృంగవత్పర్వతముయొక్క శిఖరమునుండి క్రిందకు జారుకుంటూ, ఉత్తరదిక్కునకు అభిముఖముగా ఉత్తరకురుదేశమునందు ప్రవహించి సముద్రములో కలియును.
అదే విధముగా, అలకనంద బ్రహ్మపురినుండి దక్షిణాభిముఖముగా ప్రవహించి, అనేక పర్వతశిఖరములను దాటుకుంటూ హేమకూట పర్వతమును చేరును. అక్కడనుండి దక్షిణముగా ప్రవహిస్తూ, హిమాలయ శిఖరములను దాటి, మహావేగముతో సుడులు తిరుగుతూ భారతదేశమున కభిముఖముగా ప్రవహించి, సముద్రమును చేరును. దానిలో స్నానమును చేయుటకై వచ్చే వ్యక్తికి తాను వేసే ప్రతి అడుగునకు అశ్వమేధము, రాజ సూయము మొదలగు యజ్ఞములను చేస్తే వచ్చే ఫలము లభించుట అసం
భవము కాదని చెప్పెదరు.
ఇంతే గాక, మేరువు మొదలగు పర్వతములనుండి పుట్టిన రకరక ముల నదులు, నదము (పడమరగా పారే యేరు) లు ప్రతి ఖండమునందు వందల సంఖ్యలో గలవు.
జంబూద్వీపమునందలి ఈ వర్షములన్నింటిలో భారతవర్షము మాత్రమే కర్మభూమి. మిగిలిన ఎనిమిది వర్షములు భోగభూములు. స్వర్గ వాసులు తమకు మిగిలిన పుణ్యమును అచట అనుభవించుచుందురు. అవి భూమిపై ఉండే స్వర్గధామములని మహాత్ములు చెప్పుచున్నారు.
ఈ ఖండములలో పురుషులు ఇంచుమించుగా దేవతల వలె మనుష్యమానముచే పదివేల సంవత్సరముల ఆయుర్దాయమును కలిగి యుందురు. పదివేల ఏనుగుల బలము గల వారి దేహము వజ్రము వలె దృఢముగా నుండును. బలము, వయస్సు, ఉల్లాసము ఉండుటచే వారు భార్యలతో గూడి దీర్ఘకాలము అధికముగా భోగములననుభవించెదరు. ఆయుర్దాయములో ఒకే ఒక సంవత్సరము మిగిలియుండగా, వారి భార్యలు ఒకే సారి గర్బమును దాల్చెదరు. వారికి అచట కాలము త్రేతాయుగముతో సమానముగా గడుచును.
అక్కడ దేవనాయకులకు తమ తమ గణముల నాయకులు గొప్ప ఉపచారములను చేయుచుందురు. అచటి వర్షపర్వతముల లోయలు అడవులతో నిండి శోభిల్లుచుండును. ఆ అడవులలోని చెట్ల కొమ్మలు అన్ని ఋతువులయందు అధికమగు పువ్వుల గుత్తులతో పళ్ల బరువుతో నేలదాక వంగియుండును. ఆ కొమ్మలను చిగుళ్లతో నిండిన తీగలు పెనవేసుకొని యుండును. అట్టి అందమైన అడవులలోని ఆశ్రమములలో మరియు అచటి భవనములలో ఆ దేవనాయకులు మిక్కిలి అందమగు దేవయువతు లతో గూడి రకరకముల వినోదములతో యథేచ్ఛగా విహరించుచుందురు. ఆ దేవయువతులు కామనచే కలిగిన శృంగారచేష్టలతో చిరునవ్వులను హోయలుతోడి చూపులను విసురుచుందురు. ఆ చూపులచే ఆ దేవనాయ కుల మనస్సులు మాత్రమే గాక చూపులు కూడ ఆకర్షించబడును. అచటి సరస్సులు వికసించిన రకరకముల పద్మముల సుగంధము కలిగియుండు ను. రాజహంసలు, నీటి కోళ్లు, కారండవ పక్షులు, బెగ్గురు జక్కవ మొద లగు పక్షులు ఆ సుగంధమునకు ఆనందించి అధికముగా కూతలను కూయుచుండును. వివిధజాతుల తుమ్మెదల గుంపులు ఝంకారములను చేయుచుండును. ఆ దేవనాయకులు దేవస్త్రీలతో గూడి వాటిలో జలకము లాడుచుందురు.
ఆ తొమ్మిది ఖండములయందు కూడ పురుషోత్తముడగు నారాయణ భగవానుడు తన గుణమయములగు విభిన్నరూపములతో సన్నిహితుడై, అచటి వ్యక్తులపై తన అనుగ్రహమును బరపుచుండును. .
ఇలావృత ఖండమునందైతే శివభగవానుడొక్కడు మాత్రమే పురుషుడు. మరియొక పురుషుడు లేడు. అక్కడ ప్రవేశించిన పురుషుడు స్త్రీరూపమును పొందునని పార్వతి శపించెను. ఈ సంగతి తెలిసిన వాడు ఎవడైననూ అచటకు పోడు. ఈ విషయమును నేను తరువాత వివరముగా చెప్పెదను.
అచట పార్వతీదేవి నాయకత్వములో కోట్లాది స్త్రీల గణములు శివుని సేవించుచుండును. ఆయన నారాయణ భగవానుని నాల్గవ రూపమును ఏకాగ్రమగు చిత్తమునందు నిలిపి, ఈ క్రింది విధముగా స్తుతిస్తూ ఉపాసించును. పురుషోత్తముడగు నారాయణుని నాల్గవ మూర్తికి సంకర్షణుడు అని పేరు. శివునకు కారణము తమోగుణప్రధానమగు ఆ మూర్తియే.
శ్రీశివభగవానుడిట్లు పలికెను --- ఓమ్ (ఇది భగవానుని పేరు, లేక శబ్దాత్మకమగు ప్రతీక). పురుషోత్తముడగు సంకర్షుణుడే త్రిగుణకార్య మగు జగత్తునకు చైతన్యప్రకాశము ననుగ్రహించుచున్నాడు. అనంతుడగు ఆయన ఇంద్రియములకు గోచరము కాడు. ఆయనకనేక నమస్కారములు.
ఓ ఈశ్వరా! సేవించదగిన నిన్ను నేను సేవించుచున్నాను. భక్తులకు శరణునిచ్చే పద్మములవంటి నీ పాదములు సేవించ దగినవి. ఈశ్వర భావము, రక్షణశక్తి, కీర్తి, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అనే ఆరు గుణములు నీయందు పూర్ణముగా నున్నవి. పురుషోత్తముడవగు నీవే భక్తులకు అలంకారము. నీవు సకలప్రాణులను రక్షించే నీ రూపమును భక్తులకు ప్రకటము చేసెదవు. భక్తులకు సంసారబంధమును తొలగించే నీవు అభక్తులను సంసారములో పడవేయుచున్నావు.
మేము కోపముయొక్క వేగమును జయించినవారము కాము. కావుననే, మేము చిత్తవృత్తులతో తాదాత్మ్యమును చెంది యుండెదము. కాని, శ్రీహరి అట్టివాడు కాదు. ఆయన ఆత్మరూపుడై సర్వమును సాక్షిగా చూస్తూ సర్వమును నియంత్రించుచునే యుండును. కాని, త్రిగుణాత్మిక యగు మాయాశక్తియొక్క గుణముల కార్యములగు మనోవృత్తులు సాక్షి తన్యమునకు లేపమును లేశమైననూ కలిగించలేవు. దేహేంద్రియాదుల యందు ఆత్మాభిమానము కలిగి వాటిపై జయమును మనోనిగ్రహమును పొందగోరే ఏ వ్యక్తి అట్టి ఈశ్వరుని సేవించకుండును?
మాయచే వ్యామోహితమైన బుద్ధి గలవారలకు నీవు మధువును, ఆసవమును సేవించుటచే ఎర్రని కన్నులతో మత్తెక్కి యున్నవాని వలె కన బడెదవు. నాగకన్యలు నీ పాదములను స్పృశించినంత మాత్రాన వ్యామో హమును పొందిన ఇంద్రియములు గలవారై, సిగ్గుచే నిన్ను పూజించుటకు సమర్థులు కాకుండిరి.
ఈ జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను చేయువాడు అనంతుడే ననియు, అయిననూ ఆయన సత్త్వరజస్తమోగుణములకు అతీతుడనియు మహర్షులు (మరియు దేవమాతయగు అదితి) చెప్పుచున్నారు (లేదా, వేదమంత్రములు చెప్పుచున్నవి). ఆయన వేయి పడగలపై ఏదో ఒక మూల భూమండలము ఆవగింజ వలె నున్నది. అది ఉన్న సంగతియైననూ ఆయనకు తలపునకు రాదు.
భగవానుని మాయాశక్తి సత్త్వరజస్తమోగుణాత్మకము. దాని మొట్ట మొదటి కార్యమే మహత్తత్త్వము (సమష్టి బుద్దిశక్తి). అది ఉపాధిగా గల చైతన్యమే పూజనీయుడైన బ్రహ్మగారు. విజ్ఞానశక్తికి ఆశ్రయమగు ఆ బ్రహ్మగారినుండియే నేను పుట్టితిని. సాత్త్విక రాజస తామసరూపమైన అహంకారమే నా శక్తి. నేను ఆ శక్తితో సత్త్వగుణప్రధానమగు దేవతావర్గము ను, రజోగుణప్రధానమగు ఇంద్రియవర్గమును, తమోగుణప్రధానమగు పంచభూతముల వర్గమును సృష్టించుచున్నాను.
మహత్తత్త్వము (బ్రహ్మగారు), నేను, దేవతావర్గము, పంచభూతవ ర్గము, ఇంద్రియవర్గము అనే ఈ మేము పమష్టి క్రియాశక్తిచే ఆ పరమేశ్వ రునకు కట్టివేయబడి, త్రాటిచే కట్టివేయబడిన పక్షులు వలె నున్నాము: ఆయన అనుగ్రహముచేతనే మేమందరము ఈ జగత్తును సృష్టించెదము.
నీచే నిర్మించబడిన అవిద్య జీవునకు కర్మలు అనే గ్రంథులను కలి గించి బంధించుచున్నది. సత్త్వరజస్తమోగుణముల కార్యములగు దేహాదు లయందు వ్యామోహముచే ఆత్మభావము కలిగియున్న ఈ మానవుడు ఏ కాలమునందైననూ ఆ మాయను గాని, దానిని తరించే ఉపాయమును గాని తేలికగా తెలియలేకున్నాడు. ఈ జగత్తు నీ స్వరూపమునుండి పుట్టి, నీయందే విలీనమగుచున్నది. అట్టి నీకు నమస్కారము.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో సంకర్షణ స్తుతి అనే పదునేడవ అధ్యాయము ముగిసినది (17),
