శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము

Table of Contents

22 - జ్యోతిశ్చక్రము - గ్రహముల గతి

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఈ సూర్యభగవానుడు రాశు లకు ఎదురుగా మేరు పర్వతము, ధ్రువమండలము తనకు ఎడమవైపు ఉండునట్లు చుట్టివచ్చుననియు, కాని వాస్తవములో ఆయన గమనము ఎడ మవైపు చుట్టివచ్చుట కాదనియు పూజనీయులగు మీరు వర్ణించితిరి. ఈ విషయము మాకు నిశ్చయముగా తెలియుట యెట్లు?

శ్రీశుకమహర్షి స్పష్టముగా ఇట్లు పలికెను --- కుమ్మరివాని చక్రము తిరుగుచుండగా దానిపై నుండి దానికి ఎదురుగా తిరిగే చీమలు మొదలగువాటి గమనము చక్రమునకు బయట నిలబడి యున్నవారికి విప రీతముగనే కానవచ్చును. అదే విధముగా, ధ్రువమండలమును మేరు పర్వ తమును ప్రదక్షిణముగా కాలచక్రము చుట్టి వచ్చుచుండును. ఆ కాలచక్ర మునాశ్రయించియున్న సూర్యుడు మొదలగు గ్రహములు కూడ దానితో బొటే తిరుగుచుండును. కాని, వాటి గమనము తూర్పు దిక్కునందలి నక్ష త్రములయందు, రాశులయందు విపరీతముగా కానవచ్చును. కాలచక్రము యొక్క గతిని నిర్ధారించేది నక్షత్రములు, రాశులే గదా! ....

జగత్కారణుడు, పూర్ణుడు అగు నారాయణుని మహాత్ములు మరియు వేదము తెలియగోరుచుండును. అట్టి ఈ నారాయణుడే సాక్షా త్తుగా (సూర్యరూపములో ప్రత్యక్షుడై) వైదికకర్మల శుద్ధి కారణముగా తద్ద్వారా లోకముల కల్యాణము కొరకై, వేదమయమగు తన కాలరూప మును పన్నెండు విధములు (మాసములు) గా విభజించెను. జీవులకు కర్మ ఫలముల భోగమునకు అనుకూలముగా ఉండే విధముగా ఆయన వసం తము మొదలగు ఆ ఆరు ఋతువుల లక్షణములను ఏర్పాటు చేసెను. 

            వేదవిద్య చిన్న పెద్ద కర్మలను, యోగసాధనలను బోధించుచున్న ది. వాటి ద్వారా ఈ లోకములో మానవులు ఈ సూర్యనారాయణుని శ్రద్ధతో ఆరాధిస్తూ, వర్ణాశ్రమధర్మముల ననుష్ఠిస్తూ తేలికగా మోక్షమును చక్కగా పొందుచున్నారు.

సకలప్రాణులకు ఆత్మయగు ఆ ఈ సూర్యుడు స్వర్గలోక భూలోక ములకు మధ్యలో అంతరిక్ష మండలమునందలి కాలచక్రమును పొందినవా డై, పన్నెండు నెలలను అతిక్రమించుచున్నాడు. ఆయన అతిక్రమించే (దాటి ముందుకు సాగే) రాశుల పేర్లే సంవత్సరమునకు అవయవములగు ఈ నెలలకు వచ్చినవి. చంద్రమానమును బట్టి రెండు పక్షములు నెల అని యు, పితృమానమును బట్టి పగలు రాత్రి కలిపి నెల అనియు, సౌరమాన మును బట్టి రెండు నక్షత్రముల ఒక పాదమును సూర్యుడు అతిక్రమించే కాలము నెల అనియు జ్యోతిశ్శాస్త్రజ్ఞులు బోధించుచున్నారు. సూర్యుడు ఈ సంవత్సరకాల పరిభ్రమణములో ఆరవ వంతు పూర్తి చేసిన కాలము నకు ఋతువు అని పేరు. అది కూడ సంవత్సరమునకు అవయవమే.

 సూర్యుడు ఆకాశవీథిలో ఒక పరిభ్రమణము (సంవత్సరము) లో సగమును అతిక్రమించే కాలమును అయనమని పెద్దలు వ్యవహరించెదరు.

మరియు, ఆ సూర్యుడు స్వర్గలోక భూలోకముల మండలములతో సహా అంతరిక్ష మండలమును పూర్తిగా అతిక్రమించే కాలమునకు, సూర్యుని మెల్లని, వేగమైన మరియు సమానమైన గమనములను బట్టి, సంవత్సరము, పరివత్సరము, ఇడావత్సరము, అనువత్సరము, వత్స రము అని అవాంతర భేదముతో కూడిన వ్యవహారమును జ్యోతిశ్శా స్త్రజ్ఞులు చేయుచున్నారు.

ఇంతే గాక, చంద్రుడు సూర్యమండలమునకు పైన లక్షయోజన ముల దూరములో నుండును. చంద్రుడు రాశులన్నిటికీ ముందు ఉండును. చంద్రుని వేగము సూర్యుని వేగము కంటే అధికము. సూర్యుడు సంవత్సర కాలములో పయనించిన మార్గమును చంద్రుడు నెలలో, నెలలో పయనిం చిన మార్గమును రెండు రోజుల పూటలో, పక్షములో పయనించిన దూర మును ఒకే రోజులో అతిక్రమించును. 

మరియు, చంద్రుడు శుక్లపక్షములో పూరించబడుచున్న కళలతో దేవతలకు పగళ్లను, కృష్ణపక్షములో క్షీణించుచున్న కళలతో పితృదేవత లకు రాత్రులను వ్యవస్థ చేయుచున్నాడు. ( శుక్లపక్షములో దేవతలను, కృష్ణ పక్షములో పితృదేవతలను పూజించుట శ్రేష్టము అని యర్థము), సకలప్రా ణులకు అన్నము రూపములో ప్రాణములను నిలబెట్టేది అమృతమయు డగు చంద్రుడే. ఆయన ఒక్కొక్క నక్షత్రమును ముప్పై ముహూర్తముల (ఒక రోజు) కాలములో అతిక్రమించును.

 పూజనీయుడగు ఈ చంద్రుని రూపములో. ఆ పురుషోత్తముడే ఉన్నాడు. పదునారు కళల ఈ చంద్రుడు మనస్సునకు అధిష్టాన దేవత. రసస్వరూపుడగు ఈ చంద్రుడే ఆహారము రూపములో నున్నవాడై దేవత లు, పితృదేవతలు, మానవులు, ప్రేతములు, పశువులు, పక్షులు, ప్రాకెడి జంతువులు మరియు చెట్టు చేమల ప్రాణములకు తృప్తిని, పుష్టిని కలిగించే స్వభావము కలిగియున్నాడు. ఈ విధముగా సర్వము రూపములో చంద్రుడే ఉన్నాడని మహాత్ములు వర్ణించుచున్నారు.

ఆ చంద్రమండలమునకు మూడు లక్షల యోజనముల పైన అభి జిత్తుతో కలిసి ఇరవై ఎనిమిది నక్షత్రములు గలవు. ఈశ్వరునిచే కాలచక్ర మునందు నియోగించబడిన ఈ నక్షత్రములు మేరు పర్వతము తమకు కుడివైపు ఉండే విధముగా కాలచక్రములో పరిభ్రమించుచుండును. ( కాలచ క్రముతో బాటుగా మేరువునకు ప్రదక్షిణము చేయుచుండును).

నక్షత్రమండలమునకు రెండు లక్షల యోజనముల పైన శుక్రుడు కనబడును. శుక్రుడు సూర్యుని శీఘ్రమైన, మెల్లని మరియు సమానమైన గమనములతో బాటుగా సూర్యునకు ముందు గాని, వెనుక గాని, సమాన ముగా గాని సూర్యుని వలెనే సంచరించును. శుక్రుడు సర్వకాలములలో ప్రాణులకు అనుకూలుడు. ఏలయన, శుక్రుడు తరచుగా వర్షములను కలి గించును. శుక్రుడు తన గమనముచే వర్షమును స్తంభింపజేసే గ్రహ ములను ఉపశమింప జేయునని ఊహించ వచ్చును.

శుక్రునకు రెండు లక్షల యోజనముల పైన చంద్రపుత్రుడగు బుధుడు కానవచ్చును. బుధుని గమనము శుక్రుని గమనమునే పోలియుం డును. బుధుడు తరచుగా శుభకరుడు. కాని, బుధుడు సూర్యుని దాటి ముందుకు వెళ్లిన సందర్భములలో పెనుగాలిని, ఆకాశము మేఘావృతమ గుటను, అనావృష్టి మొదలగు భయములను సూచించును.

బుధునకు రెండు లక్షల యోజనములకు పైన అంగారక గ్రహము కానవచ్చును. అది వంకరయగు గమనములో లేనప్పుడు పన్నెండు రాశు లను ఒక్కొక్కదానిని మూడేసి పక్షముల కాలములో అతిక్రమించును. తర చుగా అశుభమును చేసే ఈ గ్రహము దుఃఖమును సూచించును.

అంగారక గ్రహమునకు రెండు లక్షల యోజనములకు పైన గురు గ్రహము గలదు. పూజనీయుడగు గురువు వక్రగతిలో లేనప్పుడు ఒక్కొక్క రాశిని ఒక్కొక్క సంవత్సరకాలములో అతిక్రమించును. గురువు వేదవేత్తల సముదాయమునకు తరచుగా అనుకూలముగా నుండే గ్రహము.

గురుగ్రహమునకు రెండు లక్షల యోజనముల పైన శని కన బడును. శని మెల్లమెల్లగా పయనిస్తూ, ఒక్కో రాశిలో ముప్పై మాసములు గడుపును. కావుననే, శనికి రాశులనన్నింటినీ దాటుటకు ముప్పై సంవత్సర ములు పట్టును. శని సాధారణముగా అందరికి అశాంతిని కలిగించును.

శనికి పదకొండు లక్షల యోజనముల పైన ఉత్తరమునందు సప్త రులు కానవచ్చెదరు. వారు ప్రాణుల సుఖమును మాత్రమే కోరుతూ, విష్ణు భగవానుని పరమపదమగు ధ్రువమండలమును ప్రదక్షిణము చేయుదురు.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో జ్యోతిశ్చక్రమును, గ్రహముల గతిని వర్ణించే ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది .