శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము

Table of Contents

14 - రహూగణ జడభరత సంవాదము - దృష్టాంతముల వివరణము

ఆ శుకమహర్షి ఆనందముతో నిట్లు పలికెను --- ఆ వర్తకుల దళము ఈ జీవుల సముదాయమే. జీవులు దేహమే ఆత్మ అనే భ్రాంతితో కర్మలను చేయుచుందురు. ఈ కర్మల ఫలములు పుణ్యము, పాపము, మిశ్రమము (పుణ్యపాపముల సమపాళ్లు) అని మూడు విధములుగా నుండును. పుణ్యప్రభావముచే సత్త్వగుణప్రధానమగు దేవతాదేహములు, పాపప్రభావముచే తమోగుణప్రధానమగు చెట్టు మొదలగు దేహములు, మిశ్రమఫలముచే రజోగుణప్రధానమగు మనుష్యదేహములు జీవులకు ఒక జన్మ తరువాత మరియొక జన్మలో పరంపరగా లభించుచుండును. పుట్టినప్పుడు దేహముతో సంయోగము, మరణములో వియోగము మొదలైన సంసారముయొక్క అనుభవములు ఈ జీవులకు అనాది కాలమునుండియు కలుగుచునే యున్నవి. మనస్సుయొక్క ప్రేరణచే అయిదు జ్ఞానేంద్రియముల భోగముల కొరకై వ్యక్తి కర్మలను చేయును గనుక, ఈ ఆరే నిరంతరమగు సంసారమునకు ద్వారమని చెప్పవచ్చును. అడవిలో చోర శక్యము కాని దారి ఎట్టిదియో, ఈ సంసారయాత్ర అట్టిది. సర్వేశ్వరుడైన విష్ణు భగవానునకు వశవర్తియై ఉండే మాయచే ఈ ఆరు ఇంద్రియములే జీవుని దీనిలోనికి త్రోయును. సంపదల వెనుకబడే ఇట్టి జీవుల సమూహమే ధనార్జనాపరులగు వర్తకుల దళముతో పోల్చబడినది. జీవుడు తన దేహ ముతో కర్మలను చేసి, వాటి ఫలముల ననుభవిస్తూ, మిక్కిలి అమంగళకర మగు సంసారమనే అడవిలో పడి తిరుగుచున్నాడు. కాని, అనేకములగు ఆటంకములతో గూడిన కర్మలను చేస్తూ వైఫల్యమును చెందుచున్న ఆ జీవుడు ఈ నాటికి కూడ శ్రీహరియొక్క మరియు గురువుయొక్క పాదప ద్మముల నాశ్రయించుట లేదు. తుమ్మెద పద్మమును వలే, సాధకుడు శ్రీహరి పాదపద్మముల నాశ్రయించినచో, సంసారములోని తాపముల న్నియు ఉడుగును. ఈ సంసారమనే అడవిలో ఆర్గురు ఇంద్రియములనే దోపిడీగాండ్రు గలరు. ఈ ఇంద్రియములు చేసే పనిని బట్టియే వాటికి దోపి ఉగాండ్రతో పోలిక వచ్చినది.

వ్యక్తి చాల కష్టపడి కొంచెము ధనమును కూడబెట్టును. ఈ ధనము సాక్షాత్తుగా ధర్మమునకు హేతువు కాగల్గును. ధర్మమనగా సాక్షాత్తుగా పురుషోత్తముని ఆరాధించుటయే. ఈ ధర్మమే వ్యక్తికి పరలోకమును సంపాదించి పెట్టునని పెద్దలు ఉటంకించెదరు. కాని, వ్యక్తియొక్క బుద్ధి చేడియుండుటచే, వానికి అంతఃకరణముపై నిగ్రహము లేదు. కావుననే, కన్ను (చూచుట), చర్మము (స్పర్శ), శ్రోత్రము (వినుట), జిహ్వ (ఆస్వా దించుట), ముక్కు (ఆఘ్రాణించుట), మనస్సు (సంకల్పించుట, నిశ్చయించుట) అనే ఇంద్రియములద్వారా పురుషుడు అల్పములగు భోగములన నుభవించుచుండును. అప్పుడు, వర్తకుల దళముయొక్క ధనమును దోపి ఉగాండ్రు దోచుకునే విధముగా, ఈ ఇంద్రియములు వ్యక్తియొక్క అట్టి ధర్మమునకు తగియున్న ధనమును నశింపజేయును.

తరువాత ఈ సంసారమార్గములో కుటుంబసభ్యులు, పేరును బట్టి భార్య కొడుకు కూతురు మొదలగువారే అయిననూ, వారు చేసే పనిని బట్టి తోడేళ్లు నక్కలు అగుచున్నారు. లోభియగు కుటుంబ యజమాని డబ్బు ఖర్చు అగుటకు ఇష్టపడడు. కాని, ఆతడు చూచుచుండగనే, తోడేళ్లు పొట్టేలును వలె, ఆతడు భద్రముగా దాచుకున్న ధనమును వీరు లాగి వేసెదరు.

ప్రతి సంవత్సరము పొలమును దున్నుచున్ననూ, దానిలోని బీజ ములను తగులబెట్టనిచో, విత్తనములను చల్లే కాలము వచ్చుసరికి, తీగలు గడ్డి పొదలతో ఆ పొలము అడుగు పెట్టుటకు వీలు లేకుండ నుండును. అదే తీరున, ఈ గృహాశ్రమము కర్మలకు పొలము వంటిది. దీనిలో కర్మలు. పూర్తిగా తొలగిపోవు. ఏలయన, ఈ ఇల్లు అనేది కోరికలకు పుట్టినిల్లు.

ఈ సంసారమార్గములో గృహాశ్రమమును స్వీకరించియున్న వ్యక్తులను అడవి యీగలు మరియు దోమలవంటి మనుష్యాధములు పీడించుచుందురు. మిడుతలు, పక్షులు, చోరులు, ఎలుకలు మొదలగునవి వారికి బహిఃప్రాణములైన ధనధాన్యాదులకు అప్పుడప్పుడు హానిని కలిగి చుచుండును. వారి మనస్సు అజ్ఞానము, దానినుండి పుట్టే కామనలు, వాటి వలన సంప్రాప్తమయ్యే వివిధకర్మలతో వ్యాప్తమై యుండును. కావున నే, ఈ మానవజీవనము అనిత్యమనియు, గంధర్వనగరమువలె మిథ్యయ నియు వారు గ్రహించలేరు. భ్రాంతదర్శనము గల ఆ జనులు ఇది అంతా సత్యమనే ప్రతిక్షణము తలపోయుచుందురు.

ఆ సంసారమార్గములో త్రాగుట, తినుట, సంభోగము, నృత్య ములు మొదలగు వ్యసనములకు బానిసయైన వ్యక్తి ఎండమావులవంటి ఇంద్రియభోగముల వెనుక పరుగులెత్తుచుండును.

బంగారమనగా అగ్నియొక్క మలమనియు, అదియే సకలదోష ములకు నివాసస్థానమనియు చెప్పబడినది. రజోగుణమునకు బంగారము యొక్క రంగు ప్రతీక. ఒకడు చలికి బాధపడుతూ వేడి కావాలనే కోరికచే పరవశుడై కొరివి దెయ్యము నాశ్రయించినాడట. అదే విధముగా, రజోగుణ ప్రధానమైన మనస్సు గల ఆ వర్తకుల దళము సంసారము అనే అడవి మార్గములో బంగారమును సంపాదించ గోరుచుండును.

మరియు ఒకప్పుడు ఆ జీవుడు ఈ సంసారము అనే అడవిలో నివాసము పానీయము ధనము వస్త్రము మొదలైన అనేకములగు నిత్యావ సరవస్తువులయందు నిశ్చితబుద్ధి గలవాడై ఇటునటు పరుగులెత్తును.

ఈ సంసారమనే అడవిలో ఒకచోట, ముద్ద గట్టిన అజ్ఞానమనదగిన ఈ మానవుడు, సత్పురుషుల మర్యాదను మంట గలిపి, మత్తెక్కిస్తూ సుడి గాలితో పోల్చదగియున్న యువతియొక్క ఒడిలో విశ్రమించును. అతిశయించిన రజోగుణముతో ఆతని మనస్సు నిండియుండుటచే ఆ సమయమునందలి కామవేగముచే అతనికి కన్ను మిన్ను గానరాదు. కావుననే, తన చేష్టలకు సాక్షులైయున్న దిగ్ధేవతలను కూడ ఆతడు సరకు చేయడు.

ఒక సందర్భములో ఒకసారి ఆ వ్యక్తికి ఇంద్రియభోగముల వెంట " బడుట వ్యర్థమనే గుర్తింపు కలుగవచ్చును. కాని, ఆతడు అసౌత్మలగు దేహాదులయందు ఆత్మభావము కలవాడగుటచే, ఆ స్మృతి కూడ వినష్టమ గును. అట్లు వినష్టమైన స్మృతి గలవాడై, ఆతడు ఎండమావులవంటి ఆ ఇంద్రియభోగముల వెంట పరుగులెత్తుచునే యుండును.

ఒకప్పుడు ఆ మానవుని కంటికి కనబడే గుడ్లగూబలవలె శత్రువులు ఎదురుగా నుండి కోపముయొక్క వేగముతో మిక్కిలి పరుషమగు వచనములతో నిందించెదరు. మరియొకప్పుడు కంటికి కనబడని ఈలపురుగువంటి రోజు పరోక్షమునందు నిందించును. ఈ నిందావచనములచే ఆతనికి చెవియందు, గుండెలయందు పోటు వచ్చును.

ఆ జీవుడు పూర్వపుణ్యమంతయు అనుభవముచే క్షయము కాగా, జీవన్మృతుడు వలె నుండును. ఇహపరములకు పనికి రాని ధనము గల లోభులు విషపు తుమ్మి చెట్టు, కాకిదొండ చెట్టు, విషపు తీగలు, విషపు నీటితో నిండిన బావి మొదలగు వాటిని పోలినవారు. అపుడా వర్తకుడు ఇట్టి జీవన్మృతులను సేవించును.

ఒకప్పుడా జీవుడు. దుష్టులతో దృఢమగు స్నేహమును చేసి, దానిచే వంచించబడిన బుద్ధి గలవాడై, వేదవిరుద్దమగు మతమును స్వీకరించును. ఇది నీటి కొరకై నీళ్లు లేని నదియొక్క లోతులోనికి దుముకుట వంటిది. తల పగులుటయే గాని, నీరు లభించదు. అదే విధముగా వేదవిరు ద్ధమగు మతమును స్వీకరించుట వలన ఇహపరములు రెండు నాశనమై దుఃఖమే మిగులును.

శత్రువుల పీడచే ఆ వర్తకునకు (జీవునకు) తినుటకై అన్నము కూడ లభించని పరిస్థితి ఏర్పడినప్పుడు తన తండ్రి లేక పుత్రుల సొత్తు గడ్డిపోచయైననూ కలిగియున్న జనులను గాని, లేదా తన తండ్రినే గాని, పుత్రులను గాని చాల పీడించును.

ఇల్లు కార్చిచ్చు వంటిది. దానిలో ప్రీతిని కలిగించే వస్తువులు శూన్యము. అది ఒకదాని తరువాత మరియొకటిగా దుఃఖరూపమగు ఫలములనే ఇచ్చుచుండును. ఆ జీవుడు అట్టి ఇంటిని చేరుకొని, శోకము అనే అగ్నిచే దహింపజేయ బడుచున్నవాడై, తీవ్రమగు నిరాశను పొందును.

ఒకప్పుడు ఆతనికి కాలము కలిసిరాక రాజవంశములోని వారే రాక్షసులుగా మారి, ఆతనికి ప్రాణములతో సమానముగా మిక్కిలి ప్రియమగు ధనమునపహరించెదరు. అపుడు బ్రతికియున్నవాని లక్షణములు ఉడిగిపోగా, ఆతడు శవము వలె పడియుండును.

వ్యక్తి మనోరాజ్యమును చేయుచూ ఏవో కొన్ని పదార్థముల గురించి ఊహలను చేయును. ఆ పదార్థములు ఆతని ఊహలో ఉన్నవే గాని, వాస్తవముగా ఉన్నవి కావు. తండ్రి, తాత మొదలగు బంధుత్వములు కూడ అట్టివియే. కాని, ఆతడు అవి యథార్థములేనని భ్రమిస్తూ, కలలో పొందే సుఖమువంటి క్షణికసుఖమును ఒకప్పుడు అనుభవించును.

గృహస్థునకు విధించబడిన కర్మలనన్నింటినీ చేయబూనుట పెద్ద కొండను ఎక్కుట వంటిది. ఆ కర్మల విస్తారము అట్టిది. దానికి పూనుకున్న ఈతని మనస్సు లోకవ్యవహారములయందలి తీవ్రమగు ఆసక్తిచే పరవశమై యుండును. కావుననే, ముళ్లతో పదునైన చిన్న రాళ్లతో నిండిన నేలపై నడుచుటకు పూనుకున్నవాడు వలె, ఈతడు కూడ దుఃఖితుడగును.

శరీరములో ఆకలి రూపములోనున్న అగ్నిని తట్టుకొనుట చాల కష్టము. ఒకప్పుడు ఆ అగ్ని ఆతని ఓపికను నశింపజేయును. అపుడాతడు ఇంటిలోని వారిపై కోపమును చేయును.(ఈ వర్ణనలు దళములోని వ్యక్తు లందరికీ వర్తించును).

పగలు అనేకకార్యములలో వ్యగ్రుడైన ఆతడు రాత్రియందు నిద్ర అనే కొండచిలువకు వశుడై అజ్ఞానమనే అంధకారములో మునిగిపోయి, నిర్జనారణ్యములో విడిచి పెట్టబడిన శవము వలె, నిద్రించును. ఆ సమయములో ఆతనికి ఏమియు తెలియదు.

ఒకప్పుడు విషజంతువులవంటి దుష్టులు ఆతని గర్వము అనే కోరలను పీకివేసెదరు. అపుడు నిద్రించే అవకాశము కూడ దొరకక, ఆతని విజ్ఞానము క్షీణించిపోవును. గ్రుడ్డివాడు చీకటితో నిండిన నూతిలో పడిన విధముగా, ఆతడు అజ్ఞానము అనే నుతిలో పడిపోవును.

ఆతడు ఒక సమయములో కోరికలనే తేనె తుంపరలను వేదుక్కుంటూ, పరస్త్రీని పరధనమును ఆశించును. అపుడు రాజు గాని, లేక. ఆ ధనముయొక్క యజమానులు గాని, ఈతనికి దేహశుద్ధి (మరణదండన) చేసెదరు. ఇతడు అంతము లేని నరకము (కారాగృహము) లో పడును. .

ఇందువలననే, ఈ సంసారమార్గములో పుణ్యము పాపము అనే రెండు విధములైన కర్మ ఆత్మకు (వ్యక్తికి) సంసారమునకు పుట్టినిల్లు అని మహాత్ములు చెప్పెదరు.

ఒకచో ఆతడు పరధనమునపహరించి చెరనుండి బయట పడిన నూ, ఆ ధనమును దేవదత్తుడు (మరియొకడు) ఈతనినుండి లాగుకొను ను. దేవదత్తునినుండి ఇంకొకడు (విష్ణుమిత్రుడు) ఊడలాగును. ఈ విధము గా, ధనమునకు నిలకడ లేదు.

ఆతనికి మరియొక చోట చలి వేడి మొదలైన ఆధిదైవిక (దైవముచే ఈయబడే), ఆధిభౌతిక (ప్రకృతిచే కల్పించబడే), ఆధ్యాత్మిక (శరీరము నందు కలిగే దుఃఖావస్థలనుండి తప్పించుకొనే సామర్థ్యము ఉండదు. కావుననే, ఆతడు అంతు లేని చింతతో శోకించుచుండును.

ఒకచోట ఆ జీవుడు ఇతరులతో ధనమును ఇచ్చి పుచ్చుకొనే వ్యవహారమును చేస్తూ, ఇతరులనుండీ దమ్మిడీని గాని, అంతకంటే తక్కువ గాని ధనమును అపహరించును. ధనము విషయములో ఇట్టి మోసమును చేయుట వలన ఆతనికి వారితో అధికమగు విరోధము ఏర్పడును.

అదే విధముగా, ఈ మార్గమునందు సుఖదుఃఖములు, రాగద్వేష ములు, భయము, అభిమానము, పొరపాటు, పిచ్చి, శోకము, వ్యామోహము, లోభము, ఓర్వలేని తనము, పగ, అవమానము, ఆకలి దప్పికలు, మనోవ్యాధి, శరీరవ్యాధి, పుట్టుక, ముసలితనము, మరణము మొదలగు విఘ్నములు కూడ గలవు.

ఆ వర్తకుడు (వ్యక్తి) ఒక సమయమునందు దేవమాయ (అవిద్య) అనే స్త్రీచే లతలవంటి భుజములచే కౌగిలించుకొనబడి, ఇది చేయదగిన పని ఇది చేయకూడనిది అనే వివేకజ్ఞానమును కోల్పోవును. ఆ స్త్రీకి విహారగృహమును కట్టే తొందరపాటుతో ఆతని హృదయము వ్యాకులమై యుండును. ఆమె గృహమును ఆశ్రయించుకొనియే ఈతని కొడుకు, కూతురు, కోడలు కూడ గలరు. ఈతని హృదయము వారి మాటలకు, చూపులకు, చేష్టలకు మురిసిపోవుచుండును. మనోనిగ్రహము లేని ఈ వ్యక్తి అంతము లేని దట్టమైన అజ్ఞానము అనే నరకములోనికి తాను పడి పోవుటలో తానే కారణమగుచున్నాడు.

అత్యంతము అల్పమైన పరమాణుప్రమాణముతో మొదలిడి వెయ్యి కల్పములు అనే బ్రహ్మగారి ఆయుర్దాయము వరకు కాలము విస్తరించి యున్నది. చక్రాకారముగా తిరిగే ఈ కాలమే సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు అగు శ్రీహరి భగవానునీ చక్రాయుధము. ఆగుట యెరుగని ఆ కాలచక్రము వేగముగా తిరుగుతూ బ్రహ్మగారినుండి గడ్డిపోచ వరకు గల సకలప్రాణులు చూచుచుండగనే వారి వయస్సును వేగముగా హరించివే యుచుండును. ఈ 'కాలము వలన భయపడిన ఆ వ్యక్తి సాక్షాత్తు యజేశ్వరుడగు ఆ శ్రీహరి భగవానుని కాదని, రాపులుగులు గ్రద్దలు కొంగలు గవ్వ పిట్టలతో పోల్చదగిన వేదవిరుద్దములగు దేవతలనాశ్రయించును. శిష్టాచార సంపన్నులచే తిరస్కరించబడే ఈ మతములకు వేదప్రమాణము. లేని తంత్రములే మూలము.

తమను తామే మోసగించుకొనే పాఖండులు ఈ వ్యక్తిని అధికముగా మోసగించినారు. అపుడీతడు బ్రహ్మవేత్తల బస్తీలో చేరి వారితో నివసించ మొదలిడెను. ఉపనయనము మొదలగు శ్రుతిస్మృతివిహితములైన కర్మలను చేస్తూ, యజ్ఞేశ్వరుడగు శ్రీహరి భగవానుని ఆరాధించుటయే వారి నిత్యకృత్యము. అది ఈతనికి నచ్చుబాటు కాకపోవుటచే, ఒకానొక శూద్రుల సముదాయమును చేరి, వారిని సేవించును. వారు వేదోక్తమగు ధర్మమును విడిచి పెట్టి పవిత్రత లేనివారై, కేవలము కుటుంబపోషణము మరియు స్త్రీపురుషుల సమాగమము మాత్రమే జీవితలక్ష్యములుగా గల వారై పశుప్రాయమగు జీవితమును గడుపుచుందురు.

మిక్కిలి దీనమగు బుద్ధి గల ఆ వ్యక్తి అక్కడ కూడ హద్దులు లేకుండా యథేచ్ఛగా విహరించుచుండును. స్త్రీపురుషులు ఒకరి ముఖమును మరియొకరు చూచుచుండుట మొదలగు విషయభోగములకు సంబంధించిన కర్మలతోడనే ప్రొద్దు పుచ్చే ఆతడు తనకు మృత్యుకాలము ఆసన్నమైనదనే విషయమును కూడ గుర్తించలేదు.

ఒకచో ఆతడు ఇహలోకఫలములే ప్రధానముగా గలవాడై గృహమునందు రమించుచుండును. ఇట్టి స్థితిలో ఆతనిని చెట్టు పై పళ్లను తింటూ తిరుగాడే కోతితో పోల్చవచ్చును. భార్యాపుత్రులయందు ప్రేమ మెండుగా గల ఆతనికి ఇంద్రియభోగములే ఉత్సవఘడియలు అగును. .

ఈ విధముగా జీవుడు సంసారమార్గమునందు విషయభోగముల ననుభవిస్తూ, కొండగుహతో పోల్చదగిన అజ్ఞానమనే చీకటిలో పడియుండును. ఆతడు అచట మరణము అనే ఏనుగు వలన భయపడుచుండును.

ఆతనికి ఆయా సందర్భములలో చలి, గాలి మొదలగు అనేకములైన ఆధిదైవిక-ఆధిభౌతిక-ఆధ్యాత్మికములగు దుఃఖములను నివారించే శక్తి ఉండదు. ఆతనికి విషయభోగముల గురించి ఉండే చింత అంతు లేనిది. ఈ విధముగా ఆతడు ఖిన్నుడై యుండును.

ఆతడు ఒకప్పుడు ఇతరులతో వ్యవహారములను నడిపి, వారిని ధనము విషయములో మోసగించి, ఏదో కొద్ది ధనమును సంపాదించును.

సంసారమార్గములో పయనించుచున్న ఆ జీవుడు ఆ దారిలో ఒక చోట ధనమును కోల్పోయి, మంచము కుర్చీ భోజనము మొదలగు భోగ సామగ్రి లేనివాడగును. తాను పొందలేకపోయిన అభీష్టవస్తువును ఏ విధముగనైననూ పొందవలెననే నిశ్చయముతో ఆతడు ప్రయత్నించి, ఆయా సందర్భములలో జనుల వలన అవమానము మొదలగువాటిని పొందును.

ఈ విధముగా ధనమునందు అధికమగు ఆసక్తి గల జీవుడు సర్వదా వైరభావన గలవాడగును. కాని, పూర్వసంస్కారముల బలముచే ఇతరులతో వివాహాది సంబంధములను కలుపుకొని, మరల విడిచి పెట్టును.

ఈ సంసారమార్గమునకు అంతిమమగు అవధి శ్రీహరియేనని మహాత్ములు ఉపదేశించుచున్నారు. మనుష్యలోకమునందలి ఈ జీవసమూహము ఆయననుండియే ఉద్భవించినది. వర్తకుల దళమువంటి ఈ జీవసమూహము ఈ సంసార హేతువగు ప్రవృత్తిమార్గములో పయనిస్తూ అనేకములగు కష్టములచే మరియు విఘ్నములచే పీడించబడుచున్నది. ఈ జీవుల గుంపు జీవనయాత్రను చేస్తూ ఉండగా, యాత్ర మధ్యలో ఆప దను పొందినవారివి మరియు మరణించినవారిని విడిచి పెట్టి ఇతరులు ముందుకు సాగుచుందురు. ఈ గుంపులో కొత్తగా జన్మించిన జీవులు అప్పుడప్పుడు వచ్చి చేరుచుందురు. అజ్ఞానముచే వ్యామోహితులై యున్న వీరందరు శోకిస్తూ, మూర్చపోతూ, భయపడుతూ, కలహిస్తూ, రోదిస్తూ, అప్పుడప్పుడు బిగ్గరగా హర్షముతో పాడుకుంటూ, మరియొకప్పుడు బంధమును పొందుతూ సాగెదరు. వీరు సాధుసంగమును దూర ముగా పెట్టుటచే, ఈ నాటికి కూడ వీరు యాత్రను పూర్తి చేసి, ఆ శ్రీహరి వద్దకు చేరలేక పోవుచున్నారు.

ఆ జీవుల సమూహము ఈ యోగము (జ్ఞానము, భక్తి లేక సాధన) యొక్క శాస్త్రోపదేశమును చేస్త్రపట్టలేకనే సంసారమునందు పడియున్నారు. శాంతస్వభావులు, మననశీలురు అగు సాధకులు సాంసారికభోగములను ప్రక్కన బెట్టీ, భూతహింసను విడనాడి, శ్రీహరిని ఆత్మరూపముగా పొందు చున్నారు.

దిగ్గజములను జయించి, యజ్ఞములననుష్ఠించిన రాజర్షులు సైతము ఈ భూమి నాది అని నిరంతరమగు వైరమును పూని, యుద్దరంగ ములో నేలపై పడి మరణించుచున్నారే గాని, ఆ శ్రీహరిని పొందలేకున్నా రు. భూమి కొరకై కలహించు వారలు ఆ భూమిని విడిచి తాము పరలోక మునకు పయనమగుచున్నారు.

ఆపదను లేక నరకమును పొందిన జీవుడు ప్రారబ్ధకర్మ అనే తీగను పట్టుకొని వ్రేలాడుతూ, ఆ ఆపదనుండి లేక నరకమునుండి చాల కష్టము మీద విడుదల అగును. అపుడా జీవుడు మరల మనుష్యలోకము లోని ఈ జీవుల సముదాయమును చేరుకొని, మరల సంసారమునకు హేతువగు కర్మమార్గమునందు ముందుకు సాగును. పుణ్యముచే స్వర్గ మును పొందిన జీవుడు కూడ ఆ పుణ్యము ఖర్చు కాగానే, మరల నరలోకములో జన్మించి, ఆ జీవసమూహమును చేరుకోనును.

ఆ భరతుని మహిమను ఉటంకించే ఈ శ్లోకములను పెద్దలు గానము చేయుదురు --- ఋషభుని పుత్రుడు, రాజర్షి, మహాత్ముడు అగు భరతుడు నడచిన మార్గములో నడచుట ఇతరరాజులకు ఊహకైననూ అందని విషయము. ఈగ గరుత్మంతుని దారిలో పయనించలేదు గదా!.

పవిత్రకీర్తియగు శ్రీహరిని పొందాలనే తహతహ గల భరతుడు యువకుడుగ నుండగనే, మనస్సును హరించివేసే భార్యను, పుత్రులను, మిత్రులను, రాజ్యమును మాలిన్యమును వలె విడిచి పెట్టెను. ఇట్లు విడిచిపెట్టుట దుర్ఘటము.

భరత మహారాజు భూమి, పుత్రులు, తన వారు, ధనము, భార్య అనువాటిని కోరలేదు. వీరిని విడిచి పెట్టుట చాల కష్టము. పైగా, ఆయన లక్ష్మిని కూడ కోరలేదు. లక్ష్మీదేవియొక్క దయతో కూడిన చూపును దేవతలలో గొప్పవారు కూడ ప్రార్థించుచుందురు.(ఈయన తనవైపు దయతో చూడాలని లక్ష్మీదేవి అపేక్షించినా, ఆయన లెక్క చేయలేదు). ఈ త్యాగము భరతుని విషయములో యోగ్యముగనే యున్నది. ఏలయనగా, మధువైరియగు శ్రీహరియొక్క సేవయందలి ప్రీతితో నిండిన మనస్సు గల మహాత్ములకు పునర్జన్మ లేని మోక్షము కూడ అల్పమైనదియే.

భరతుడు లేడి శరీరమును విడువబోతూ కూడ, బిగ్గరగా చక్కగా ఇట్లు ఉచ్చరించెను --- యజ్ఞస్వరూపుడగు శ్రీహరి ధర్మమును పాలించును. వైదికకర్మలను ప్రవర్తిల్ల జేసే ఆయనయే యజ్ఞమును చేసే యజమానుని రూపములో నున్నాడు. ఆయనను సాధకులు జ్ఞానముచే పొందెదరు. ఆ జ్ఞానము కూడ ఆయన స్వరూపమే. ప్రకృతిని తన వశమునందుంచు కొనే ఆ శ్రీహరిని సాంఖ్య (ఆత్మజ్ఞాన) శాస్త్రము (ఉపనిషత్తులు) ప్రతిపాదించుచున్నది. సకలప్రాణుల హృదయములో ఆత్మరూపముగా విరాజిల్లే ఆ శ్రీహరికి నమస్కారము.

భగవద్భక్తులు రాజర్షియగు భరతుని శుద్దములగు గుణములను, కర్మలను ప్రశంసించుచుందురు. ఆయనయొక్క ఈ మంగళనిధానమగు వృత్తాంతము దీర్ఘాయుష్షును, ధనమును, కీర్తిని, స్వర్గమును, మోక్షమును కూడ అనుగ్రహించును. దీనిని మహాత్ములు చెప్పగా ఎవడైతే వినునో, ఎవ డైతే ప్రవచించునో, మరియు కొనియాడునో, వానికి తన స్వరూపమునుండియే సకలకామనలు సిద్ధించి తీరును. అట్టివాడు కామనల సిద్ధి కొరకై ఇత రముల నాశ్రయించ బని లేదు.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో రహూగణ జడభరత సంవాదములో సంసారమార్గములోని దృష్టాంతములను వివరించే పదునాల్గవ అధ్యాయము ముగిసినది (14).