శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము
4 - ఋషభదేవుని చరితము
శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! ఆ బాలునియందు పుట్టుక, తోడనే భగవానుని లక్షణములు (అరికాలియందలి పద్మము మొదలగు గురుతులు) స్పష్టముగా ప్రకటమయ్యెను. ఆ బాలకు నియందు సమచిత్తమును కలిగియుండుట, శాంతస్వభావము, వైరాగ్యము, అలౌకిక సామర్థ్యము, తేజస్సు అనే గొప్ప విభూతులు (మహిమలు) దిన దినాభివృద్ధి చెందుచుండెను. మంత్రులు మొదలగు రాజాధికారులు, ప్రజలు, మహర్షులు మరియు దేవతలు కూడ ఆ బాలకుడు మహారాజు కావలెనని గట్టిగా కోరుచుండిరి.
ఆ బాలకుని దేహము మిక్కిలి శ్రేష్ఠముగా నుండుటచే గొప్పగా కీర్తించబడుచుండెను. ఆతని తేజస్సును, బలమును, అందమును, కీర్తిని, గొప్ప ప్రభావమును మరియు ఉత్సాహమును చూచి, తండ్రి ఆతనికి ఋషభుడు (శ్రేష్ఠుడు) అని పేరు పెట్టెను.
పూజ్యుడగు ఇంద్రునకు ఋషభదేవునిపై అసూయ కలిగి, ఆయన దేశమగు అజనాభమునందు వర్షములు లేకుండా చేసెను. యోగు లలో శ్రేష్ఠుడు, పూజ్యుడు అగు ఋషభదేవుడు ఈ సంగతిని గమనించి నవ్వుకొనెను. అప్పుడాయన తన యోగశక్తిచే దేశమునందు వర్షములు సమృద్ధిగా కురియునట్లు చేసెను.
నాభి మహారాజుయొక్క బుద్ది మాయచే వ్యామోహితమై యుండె ను. ఆయనకు తాను కోరిన విధముగా కొడుకు లభించెను. ఆ ఆనందము హృదయములో నిండి, ఆయన వివశుడై తడబాటు పడుచున్న పలుకులతో ఋషభుని, బాబూ!, నాయనా! అంటూ ప్రేమపూర్వకముగా లాలిస్తూ గొప్ప ఆనందమును పొందుచుండెను. ఆదిపురుషుడగు శ్రీహరి భగవా నుడు ఈ విధముగా స్వతంత్రముగా మానవులతో సమానమగు వ్యవహార మును స్వీకరించి యుండెను.
పౌరులతో మొదలిడి మంత్రులు రాజాధికారుల వరకు జనులం దరు ఋషభునియందు అనురాగము కలిగియున్నారనే విషయమును నాభి మహారాజు గమనించెను. ఆయనకు జనుల అభీష్టమే ప్రమాణము. ఆయన ధర్మమర్యాదను రక్షించుట కొరకై తన కుమారుని రాజ్యమునందు అభిషేకించి, బ్రహ్మవేత్తల అదుపాజ్ఞలలో ఉంచెను. ఆయన తన భార్య యగు మేరుదేవితో గూడి బదరికాశ్రమమును చేరి, శాంతముగా. మరియు తీవ్రముగా తపస్సును చేసెను. ఆయన ఏకాగ్రమగు చిత్తముతో నరనారా యణరూపములో అవతరించిన వాసుదేవ భగవానుని ఉపాసించేను. కొంత కాలమునకు ఆయన జీవన్ముక్తుడాయెను.
పాండవవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! నాభికి సంబంధించి ఆర్యులు రెండు శ్లోకములనుదహరించెదరు. వాటి యర్థమేమనగా --- రాజర్షియగు నాభి చేసిన యజ్ఞమువంటి యజ్ఞమును మరియొక వ్యక్తి ఎవరు చేయగల్గును? ఆయన చేసిన ఆ పవిత్రమగు యజ్ఞముయొక్క ప్రభావముచే శ్రీహరి ఆయనకు పుత్రుడై అవతరించెను.
నాభీయొక్క యజ్ఞములో దక్షిణాదులచే సత్కరించబడిన వేదవే త్తలు తమ మంత్రశక్తిచే యక్షేశ్వరుడగు శ్రీహరి దర్శనమిచ్చునట్లు చేసిరి. బ్రహ్మవేత్తలయెడల అట్టి నాభికంటే గొప్ప, లేక సమానమైన భక్తి గలవాడు ఎవరు ఎక్కడ ఉన్నారు? (లేరు)
తండ్రి అడవికి వెళ్లిన తరువాత పూజ్యుడగు ఆ ఋషభదేవుడు తన దేశము కర్మభూమియని తెలుసుకొనెను. ఆయన మానవులకు ఆదర్శ మును నేలపుటకొరకై గురుకులవాసమును చేసెను. గురువులకు దక్షిణనిచ్చి, వారి అనుమతిని పొంది, ఇంద్రునిచే ఈయబడిన జయంతిని వివాహ మాడెను. ఆయన జనులకు శిక్షణనిచ్చుటకై గృహస్థధర్మములనాచరిస్తూ, శాస్త్రవిహితములైన శ్రాత స్మార్తములనే రెండు రకముల కర్మలను అను ష్ఠించెను. ఆయనకు జయంతియందు తనతో సమానమైన వందమంది కొడుకులు కలిగిరి.
వారిలో పెద్దవాడు భరతుడు. ఆయన శ్రేష్ఠమగు గుణములు గల గొప్ప యోగి. ఆయన పేరుతోనే ఈ దేశమునకు భారతదేశము అనే పేరు వచ్చినది.
కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, మలయుడు, కేతువు, భద్ర సేనుడు, ఇంద్రస్పృక్కు, విదర్భుడు, కీకటుడు అనే తొమ్మిదిమంది భరతుని తరువాతి సోదరులు. మిగిలిన తొంభై మంది వీరి తరువాతి వారు.
కీకటుని తరువాతి వారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్దుడు, పిప్పలాయనుడు, ఆవిర్ఘ త్రుడు, ద్రుమిలుడు, చమసుడు మరియు కరభా జనుడు. గొప్ప భగవద్బక్తులగు వీరు భగవద్బక్తుల ధర్మములను ప్రచారము చేసిరి. భగవంతుని మహిమచే వర్ధిల్లే శాంతిపూర్ణమగు వీరి. గొప్ప వృత్తాంతము నారద వసుదేవ సంవాద రూపముగా మున్ముందు (11 వ స్కంధము) వర్ణించబడగలదు.
కవి మొదలగువారి తమ్ముళ్లు, జయంతి పుత్రులు ఎనభై ఒక్క మంది గొప్ప వినయముతో తండ్రి ఆదేశమును పాలిస్తూ నిరంతరముగా యజ్ఞములను చేసే స్వభావమును కలిగియుండిరి. గొప్ప వేదవేత్తలగు వారు పుణ్యకర్మలచే పవిత్రులై, వేదపరాయణులైరి.
భగవంతుని అవతారమగు ఋషభుడు కర్మలకు అధీనుడు కాని స్వతంత్రుడు, అద్వయము ఆనందఘనము పూర్ణము అగు ఆత్మయందు నిష్ఠ గల ఆయనకు జన్మమరణములు మొదలగు అనర్థముల పరంపర సర్వకాలములలో దూరముగా నుండును. సర్వసమర్థుడగు ఆయన సమచి తము గలవాడు, రాగద్వేషరహితుడు, స్నేహశీలి అగు ఋషభుడు దయా మయుడు. ఆయన అనాదికాలమునుండి సంప్రాప్తమై కాలప్రభావముచే మరుగున పడిపోవుచున్న ధర్మమును ఆదర్శముగా నిలిచి ధర్మజ్ఞానము లేని జనులకు నేర్పుట కొరకై, పరిచ్ఛిన్నుడగు జీవుని వలె విహితకర్మలనా చరించెడివాడు. ఆయన గృహస్థుడుగా ఉంటూ ధర్మమును, సంపదను, కీర్తిని, సంతానమును, ఐహికసుఖములను మరియు మోక్షమును కూడ సాధించి, తద్ద్వారా జనులను గృహస్థధర్మమునందు నిలబెట్టెను.
శ్రేష్ఠపురుషుడు దేనిని ఆచరిస్తే, లోకము కూడ దానినే అనుసరీంచును గదా!
సకలధర్మములకు నిలయము వేదము కాగా, ఆ వేదరహస్యములు ఋషభునకు తెలిసినవే. అయినా, ఆయన వేదవేత్తలు చూపిన మార్గ ములో జనులను శాసించెను. సామము (మంచిగా చెప్పుట), దానము (సంపదనిచ్చి వశము చేసుకొనుట), భేదము (శత్రువుల మధ్య విరోధ మును కలిగించి వశము చేసుకొనుట), దండము (శిక్ష వేసి దారిలో పెట్టు ట) అనే నాలుగు విధముల రాజనీతితో ఆయన పాలించెను.
ఆయన మంచి వయస్సులోనుండగనే యోగ్యమగు కాలముల యందు పుణ్యతీర్థములలో యథావిధిగా వివిధదేవతలకు పురోడాశము మొదలగు ద్రవ్యములను ఋత్విక్కుల సాహాయ్యముతో శ్రద్ధగా సమర్పించి, వంద పర్యాయములు అన్ని విధముల క్రతువులను సుసంపన్నము చేసెను.
ఈ దేశమును ఋషభదేవుడు పాలించుచుండగా, ఏ వ్యక్తియే ననూ ఎన్నడైననూ ఇతరుల సొమ్మును ఏదో విధముగా తనకు రావాలనే కోరికతో కన్నెత్తియైననూ చూడలేదు. ఇతరుల సొమ్ము జనులకు లేనిదా నితో సమానము. కాని, ఈ నియమము ఆ జనులకు దినదినము తమ ప్రభువగు ఋషభునియందు వర్ధిల్లిన ప్రేమాతిశయమునకు వర్తించదు.
ఋషభదేవుడు ఒకప్పుడు సంచారము చేస్తూ, బ్రహ్మావర్తము చేరెను. అచట బ్రహ్మరుల సభలో జనులు వినుచుండగా, ఆయన సావధా నమనస్కులైన తన పుత్రులతో నిట్లనెను. వారి హృదయములు ఆయనయేడల వినయముతో, ప్రేమతో నిండియుండెను. అయిననూ, వారికి శిక్షణ నీయవలెనని ఆయన తలపోసి ఇట్లు పలికెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమ స్కంధములో ఋషభదేవుని చరితము అనే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).
