శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము
18 - అవతారమూర్తుల మంత్రములు - స్తోత్రములు
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శివుడు సంకర్షణదేవుని ఉపాసించిన విధముగనే, భద్రాశ్వవర్షమునందు భద్రశ్రవసుడని ప్రసిద్ధి గాంచిన ధర్ముని పుత్రుడు, ఆతని వంశములోని పెద్దలు మరియు అతని అనుచరులు కూడ సాక్షాత్తుగా వాసుదేవ భగవానుని మూర్తియగు హయగ్రీవుని ఉపాసించుచున్నారు. ధర్మపూర్ణ మైన ఈ మూర్తి భగవానునకు ప్రియమైనది. వారు తీవ్రమగు ఏకాగ్రతతో ఆ మూర్తిని మనస్సునందు స్థిరముగా నిలిపి ఈ విధముగా స్తుతించుచున్నారు.
భద్రశ్రవసుడు, ఆతని అనుచరులు ఇట్లు పలికిరి (జపించిరి) --- ఓమ్. అంతఃకరణమును (జ్ఞానముతో) పరిశుద్ధము చేసే ధర్మ భగవానుని కొరకు అనేక నమస్కారములు.
ఆహా! భగవానుని లీల విచిత్రమైనది. ఈ మానవుడు తన చుట్టూ మృత్యురూపములోనున్న భగవానుని చూస్తున్నా, చూడనివానితో సమానము. ఈతడు మిథ్యయగు సంసారములోని భోగముల కొరకై పాపముతో నిండిన సంకల్పములను చేస్తూ, తన చేతులతో తన తండ్రిని పుత్రుని శ్మశానమునకు పంపించి కూడా, తాను జీవించి ఉండాలనే కోరుచున్నాడు.
పుట్టుక లేని ఓ ఈశ్వరా! ఆత్మానాత్మవివేకముచే ఈశ్వరుని ఆత్మ రూపముగా దర్శించిన మహాత్ములు, జగత్తు అశాశ్వతమని దర్శించి, ఆ విషయమునే బోధించుచున్నారు. అయిననూ, మానవులు నీ మాయచే మోహములోనే పడియున్నారు. నీ లీల చాల ఆశ్చర్యమును కలిగించును. ఆది లేని నీకు నమస్కరించుచున్నాను.
నీకు మాయావరణము లేదు గనుక, నీయందు కర్తృత్వము లేదు. అయిననూ, జగత్తుయొక్క సృష్టిస్థితిలయములనే కర్మలను చేసేది నీవేనని వేదములు స్వీకరించుచున్నవి. దీనిలో విడ్డూరమేమియు లేదు. ఇది యుక్తియుక్తముగనే యున్నది. ఏలయనగా, కార్యము నీవే, కారణము నీవే. సర్వముయొక్క స్వరూపము నీవే. అయిననూ, సర్వముకంటే విలక్షణమైన నీ యథార్థస్వరూపమునందు సర్వము భాసించేదే గాని, వాస్తవముగా ఉన్నది కాదు.
ప్రళయములో తమోగుణప్రధానులగు రాక్షసులు వేదములనపహ రించి పాతాళములో దాచిరి. అపుడు బ్రహ్మగారు ప్రార్థించగా, నీవు మని షి-గుర్రముల సంయుక్తరూపము (హయగ్రీవ) ను దాల్చి, వాటిని తెచ్చి, ఆయనకు సమర్పించితివి. సత్యసంకల్పుడవగు అట్టి నీకు నమస్కారము అని వారు స్తుతించుచున్నారు.
హరివర్షమునందు కూడ భగవానుడు నరసింహరూపముతో నున్నాడు. ఆయన ఆ ప్రియమైన రూపమును దాల్చుటకు గల కారణ మును తరువాత వివరించెదను. గొప్పవారి గుణములకు, గొప్ప భగవద్బక్తికి ప్రహ్లాదుడు నిలయము. ఆయన శీలము మరియు ఆచరణము దితి దనువుల వంశములను పవిత్రము చేసినవి. ఆయన ఆ ఖండములోని అను చరులతో గూడి, ఇతరమునెరుంగని నిష్కామభక్తియోగముతో ఆ నరహ రిని ఉపాసిస్తూ, ఈ క్రింది మంత్రమును జపించుచున్నాడు.
ఓమ్. తేజోమండలములగు సూర్యాదులకు కూడ తేజస్సును అనుగ్రహించే నరసింహ భగవానునకు అనేక నమస్కారములు. ఓ నరసింహా! నీ గోళ్లు, కోరలు వజ్రముల వలె వాడియైనవి సుమా! నీవు తప్పక నాకు సాక్షాత్కరించి, నా కర్మవాసనలను తప్పక దహించి, నా అజ్ఞాన మును తప్పక దూరము చేయుము. నన్ను నేను నీకు సమర్పించుచున్నా ను. నీ మంత్రమే మంచి పలుకు (స్వాహా అనగా సు-ఆహ). నీవు నా అంతఃకరణములో అభయస్వరూపుడవై నిలిచియుండుము. ఓం క్ష్రౌమ్.
జగత్తునకు మంగళమగు గాక! దుష్టులు ప్రసన్నమగు చిత్తము గలవారు అగుదురు గాక! ప్రాణులు ఒకరికొకరు మంచినే సంకల్పించును గాక! మా మనస్సులు మంగళములనే సంకల్పించు గాక! ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరుడు కాని శ్రీహరియందు మా మనస్సులలో దృడ మగు నిష్కామభక్తి నిండిపోవును గాక!
మాకు ఇల్లు, స్త్రీ (పురుషుడు), సంతానము, ధనము, బంధు వులు అనువాటియందు ఆసక్తి ఉండకుండు గాక! ఒకచో ఉన్ననూ, అది భగవద్భక్తులయందు మాత్రమే ఉండు గాక! అట్టి ఆసక్తి గల వ్యక్తి ప్రాణ ములను నిలబెట్టుకోనుటకు సరిపడే ఆహారముతో సంతుష్టుడై, ఇంద్రియ ములను వశపరచుకొని, శీఘ్రముగా జీవన్ముక్తుడగును. కాని, అట్లు గాక ఇంద్రియభోగములయందు ప్రీతి గల వ్యక్తి ఆ తీరున కృతార్థుడు కాలేడు.
అసాధారణమైన ప్రభావాతిశయము గల ముకుందుని (మోక్షముని చ్చువాని) కీర్తి మానవులను పావనము చేయును. అది భగవద్భక్తులతోడి సంగము వలన లభించును. దానిని పలుమార్లు వింటూ సేవించే వారల హృదయమునందు పుట్టుక లేని శ్రీహరి ప్రకటమై, వారి మనస్సులలోని మాలిన్యమును మరియు దేహదోషములను కూడ తొలగించి వేయును. అట్టి భగవద్భక్తులతోడి సంగమును ఎవ్వాడు చేయకుండును?
భగవంతునియందు నిష్కామభక్తి గలవానియందు అన్ని గుణము లతో బాటుగా దేవతలు కూడ నిత్యము నివసించెదరు. శ్రీహరియందు భక్తి లేక మిథ్యయగు బాహ్యసంసారమునందు కోరికలను తీర్చుకొనుటకై పరు. గులు తీయువానికి మహాత్ముల గుణములు ఎట్లు అబ్బును ?
సాక్షాత్తుగా శ్రీహరి భగవానుడే సకలప్రాణులకు, చేపలకు అభీష్ట మగు నీరు వలె, ప్రియమగు ఆత్మయై ఉన్నాడు. ఆయనను విడిచి పెట్టి దంపతులు ఎంతటి గొప్పవారైననూ, కేవలము గృహసుఖములయందు మాత్రమే ఆసక్తి గలవారైనచో, వారికి విలువ వయస్సును బట్టి మాత్రమే (అనగా, గుణములను బట్టి కాదు).
జన్మమరణపరంపరకు నిలయమైన ఈ సంసారము తృష్ణ, రాగ ము, దుఃఖము, కోపము, గర్వము, కోరికలు, భయము, దీనత మరియు మనోవ్యాధులకు మూలము. కావున, దీనిని విడిచి పెట్టి నరసింహుని పాద మును సేవించుడు. అట్లు చేయువారికి దేనివలనైననూ భయము ఉండదు అని స్తుతించుచున్నాడు.
కేతుమాల వర్షమునందు కూడ భగవానుడు కామదేవుడగు ప్రద్యు మ్నుని రూపములో నున్నవాడై లక్ష్మీదేవికి మాత్రమే గాక, సంవత్సరాభి మానియగు ప్రజాపతికి, ఆ కేతుమాల వర్షమునకు ప్రభువులగు ప్రజాపతి పుత్రులకు, పుత్రికలకు కూడ ప్రీతిని కలిగించుచున్నాడు. పగటికీ అభిమాన దేవతలే ఆ ప్రజాపతికి పుత్రులు కాగా, రాత్రి అభిమాని దేవతలు ఆయన పుత్రికలు. మానవుని ఆయుర్దాయము వంద సంవత్సరములు, అనగా ముప్పై ఆరువేల పగళ్లు, అదే సంఖ్యలో రాత్రులు కలవు. సంవత్సర ప్రజా పతియొక్క పుత్రులు, పుత్రికల సంఖ్య కూడ అంతే. పురుషోత్తముడగు శ్రీహరికి కాలచక్రమే గొప్ప ఆయుధము. దాని తేజస్సునకు రాత్రీరూపము లోనున్న ఆ పుత్రికలకు మనస్సులో చాల భయము కలుగుచుండును. ప్రతి సంవత్సరమునకు అంతమునందు వారి గర్భములు నశించి ప్రాణములను కోల్పోయి పడిపోవుచుండును. (నిముషము, గంట, రోజు, పక్షము, నెల అనే కాలావయవములే గర్బములు. అవి పడిపోవుట యనగా, సంవత్స రము పూర్తి అగుసరికి అవి అన్నీ ఆ సంవత్సరములో విలీనమగుటయే).
శ్రీహరియొక్క అధికముగా శోభించే అందమైన చిరునవ్వుతో కూడిన చూపుయొక్క లీల, మిక్కిలి మనోహరమైన నడకయొక్క ఠీవిచే మరింత ఇనుమడించుచుండెను. ఆయన గుండ్రని అందమైన కనుబొమ లను కొంచెము పైకి విరిచినప్పుడు పద్మమువంటి ముఖముయొక్క శోభ ఇనుమడించుచుండెను. ఈ విధముగా ఆయన అచట లక్ష్మీదేవికి అధిక మగు ఉల్లాసమును కలిగిస్తూ, తాను కూడ ఇంద్రియములను రమింప జేయుచుండును.
భగవానుని మాయామయమగు ఆ రూపమును లక్ష్మీదేవి, రాత్రు లయందు సంవత్సర ప్రజాపతీయొక్క కుమార్తెలగు రాత్రిదేవతలతో, పగళ్ల యందు పగళ్లకు అభిమానులగు దేవతలతో కూడినదై, తీవ్రమగు చిత్తేకాగ్ర తను అభ్యసిస్తూ, ఉపాసించుచున్నది. ఆమె ఈ క్రింది మంత్రమును కూడ ఉచ్చరించుచున్నది.
ఓం హ్రాం హ్రీం హ్రూం (హృదయములోనుండువాడు, పాపము లను పోగొట్టువాడు అని ఈ బీజమంత్రములకు అర్థము) ఓమ్. ఓ కామ దేవా! నీవు ఈ దేహమునందలి కర్మేంద్రియములకు, జ్ఞానేంద్రియముల కు, మనస్సు బుద్ది చిత్తము అహంకారము అనే మనోవృత్తి విశేషములకు, ఆ ఇంద్రియముల ద్వారా గ్రహించబడే శబ్దస్పర్శరూపరసగంధములనే విషయములకు కూడ అధీశ్వరుడవు. నీ అఖండసత్తాస్వరూపమును త్రిగు ణాత్మికయగు మాయాకార్యములైన పంచభూతముల ద్వారా జనులు లక్షించగల్గుచున్నారు (నీ సకలకళ్యాణగుణములచే నీ సగుణస్వరూప మును భక్తులు తెలియుచున్నారు). ఈ ఉపాధియందు పదకొండు ఇంద్రి యములు, అయిదు భూతములు వెరసి పదునారు అంశములు గల జీవుని రూపములో నీవే ఉన్నావు. వేదమంత్రస్వరూపుడవు, అమృతస్వరూపుడవు అగు నీవే మేము తినే ఆహారము రూపముగా మాత్రమే గాక, సర్వము రూపముగా వున్నావు. మా మనస్సులో, ఇంద్రియములలో మరియు దేహ ములోనుండే శక్తులు అన్నీ నీవే. అతిసుందరుడవగు నీకు ఇహపరముల యందు లోపల బయట కూడ అనేక నమస్కారములు అగుగాక!
లోకములో స్త్రీలు ఇంద్రియాధిపతివగు నిన్ను స్వతంత్రముగా వ్రతములతో పూజించి, మరియొక వ్యక్తిని భర్తగా కోరెదరు. కాని, ఆ వ్యక్తులు అస్వంతత్రులగుటచే, ఆ స్త్రీలయొక్క సంతానమును, ధనము ను, ఆయుర్దాయమును, ఇతరప్రియవస్తువులను రక్షించలేరు.
ఎవడైతే స్వయముగా దేనివలనైననూ భయపడడో, అట్టివాడు మాత్రమే భయముతో కంగారు పడుచున్న జనుని అన్ని విధములుగా రక్షిం చి, రక్షకుడు అగును. అట్టి రక్షకుడు ఆత్మరూపుడవగు నీవు మాత్రమే. ఇత రులనాశ్రయించినచో, ఒకరి వలన మరియొకనికి భయము కలుగుచునే యుండును. ఆత్మను జ్ఞానముచే పొందుటకంటె గొప్ప పురుషార్థము మరి యొకటి గలదని మహాత్ములు పరిగణించుటనే లేదు.
ఓ భగవానుడా! అట్టి రక్షకుడవగు నీ పాదపద్మములను నిష్కాము ముగా పూజించే స్త్రీ అన్ని కామనలను పొందును. అట్లు గాక, ఏదో ఒక ఫలమును కోరి పూజించే వ్యక్తికి నీవు ఆ ఫలమును మాత్రమే ఇచ్చెదవు. కాని, భోగముతో ఆ ఫలము అంతమైనప్పుడు, ఆ వ్యక్తి అధికమగు దుఃఖ మును పొందును.
ఓ భగవానుడా! నీవు పరాజయమునెరుంగవు. బ్రహ్మగారు, రుద్రు డు, దేవతలు, రాక్షసులు మొదలగువారు ఇంద్రియభోగములయందు తగు ల్కొన్న మనస్సులు గలవారై, నన్ను పొందగోరి, కఠినమగు తపస్సును చేయుచుందురు. కాని, నీవే పరమపురుషార్థముగా గల భక్తుడు మాత్రమే నన్ను పొందగల్గును. ఇతరులు నన్ను పొందలేరు. ఏలయనగా, నా హృద యములో నీవే ఉన్నావు.
ఓ అచ్యుతా! (పూర్ణస్వరూపమునుండి జారుట లేనిపోడా!) నీవు నీ పూజనీయమగు పద్మమువంటి చేతిని సత్వగుణప్రధానులగు భక్తుల (సాత్వతవంశీయుల, అనగా యాదవుల) శిరస్సు పై నుంచి అనుగ్రహించి తివి. ఆ చేతిని నా శిరస్సుపై కూడ ఉంచి అనుగ్రహించుము. ఓ పురుషో త్తమా! నీవు నీ మాయాశక్తిచే నన్ను వక్షఃస్థలముపై చిహ్నముగా ధరించు చున్నావు. నీ ఆశయమును (నీవు మాయచే చేసే లీలలను) తెలుసుకొనే సామర్థ్యము ఎవరికి గలదు? అని స్తుతించుచున్నది.
భగవానుడు పూర్వము (చాక్షుష మన్వంతరము తరువాత) రమ్య కవర్షమునందు మత్స్య (చేప) రూపముగా అవతరించి, ఆ అవతారమును ఆ వరమునకు ప్రభువగు శ్రాద్ధదేవ మనువునకు చూపినాడు. ఆ మనువు ఇప్పటికీ అచట తనకు మిక్కిలి ప్రియమైన ఆ రూపమును గొప్ప భక్తియో గముతో ఆరాధిస్తూ, ఈ క్రింది మంత్రమును జపించుచున్నాడు.
ఓమ్. సకలజగత్తు శక్తిస్వరూపుడగు పరమేశ్వరుని (సూత్రాత్మ) విలాసయే. ఆ సూత్రాత్మయే మా ముఖమునందలి ప్రాణవాయుసంచార రూపముగా ప్రకటమగుచున్నాడు. సత్త్వగుణప్రధానుడగు ఆ పరమేశ్వరుడే మా మనస్సులో, ఇంద్రియములలో మరియు దేహములోనుండే శక్తులను అనుగ్రహించుచున్నాడు. పెద్ద చేపగా అవతరించిన ఆ భగవానునకు అనేక నమస్కారములు.
వేదమనే గొప్ప ధ్వని గల ఈశ్వరుడవు నీవే. నీవు ప్రాణులకు లోపల (ప్రాణము), బయట (వాయువు) కూడ శక్తిస్వరూపుడవై సంచరిం చుచున్ననూ, నీ రూపమును లోకపాలకులందరు కూడ కనుగొనలేకున్నా రు. అనేకరూపములతో కూడియున్న ఈ జగత్తును నీవు ఆయా పేర్లతో నీ వశములో నుంచుకొని, చెక్కబొమ్మను మనిషి ఆడించే విధముగా, నియ మించుచున్నావు. (జగత్తు నామరూపములు మాత్రమే. నామరూపములు మిథ్య. వాటి వాస్తవిక స్వరూపము అధిష్టానమగు ఈశ్వరసత్తయే).
రెండు కాళ్లు గలవి (మానవులు), నాలుగు కాళ్లు గలవి, పాకేవి, కదలనివి అని ఈ జగత్తులో పలు రకముల ప్రాణులు కనబడుచున్నవి. ఈర్య అనే జ్వరము గల లోకపాలకులు వేర్వేరుగా గాని, కలిసి గాని ప్రయత్నము చేసిననూ, ఈ ప్రాణులను రక్షించలేరు. ఈ ప్రాణులను అన్నింటినీ రక్షించేది ప్రాణస్వరూపుడవగు నీవు మాత్రమే (ప్రాణికి రక్షణని చ్చేది ప్రాణమే గాని, ఇంద్రియములు కావు. ఆ ప్రాణము ఈశ్వరుడే).
పుట్టుక లేని ఓ ప్రభూ! పెద్ద కెరటముల పంక్తులతో నిండియున్న ప్రళయకాలసముద్రములో మునిగిపోవుచున్న ఈ భూమిని నా (మనువు) తో సహా కాపాడుతూ, నీవు మత్స్యరూపములో గొప్ప బలముతో వేగ ముగా ముందుకు సాగినావు. పంటమొక్కలకు, తీగలకు ఈ భూమి ఆశ్ర యము. జగత్తులోని ప్రాణుల సమూహమునకు సర్వశక్తిస్వరూపుడవగు నీవే (సూత్రాత్మ) ఆత్మవు. నీకు నమస్కారము అని మనువు స్తుతించెను.
హిరణ్మయ వర్షమునందు కూడ భగవానుడు తాబేలు రూప మును దాల్చి నివసించుచున్నాడు. మిక్కిలి ప్రియమైన ఆ రూపమును పితృగణములకు అధిపతియగు అర్యముడు, ఆ ఖండములోని జనులతో గూడి సేవిస్తూ, ఈ మంత్రమును కూడ నిరంతరముగా జపించుచున్నాడు.
ఓమ్. ఓ ఆదికూర్మ భగవానుడా! పూర్ణసత్త్వస్వరూపుడవగు నీవు నీటిలో కానరాకుండ దాగియుందువు. కాలాతీతుడవగు నీవు సర్వవ్యాపకు డవు, సర్వమునకు అధిష్ఠానమవు. నీకు అనేక నమస్కారములు.
సర్వపదార్థముల రూపములో నున్న ఈ జగత్తు నానా నామరూప ములుగా భాసించుచున్నది. ఇది నీ మాయాశక్తి చేతనే ప్రకాశింప జేయబ డుచున్నది. వస్తునిశ్చయము చేసినచో ఇది మిథ్య యని తేలును గనుక, దీనిలోని నానాత్వమునకు వాస్తవమగు పరిగణనము పొసగదు. ఈ తీరున అనిర్వచనీయమగు జగద్రూపముగా ప్రకటమైన నీకు నమస్కారము.
గర్బాశయమునుండి పుట్టే మానవులు మొదలగు ప్రాణులు, చెమ టనుండి పుట్టే నల్లులు మొదలగునవి, గ్రుడ్డునుండి పుట్టే పక్షులు మొదలగు నవి, నేలను చీల్చుకొని పుట్టే చెట్టుచేమలు, కదిలేవి మరియు కదలనివి అగు సకలప్రాణులు, దేవతలు, మహర్షులు, పితృదేవతలు, పంచభూతము లు, ఇంద్రియముల సమూహము, స్వర్గము, అంతరిక్షము, భూమి, పర్వత ములు, నదులు, సముద్రములు, ద్వీపములు, గ్రహములు, నక్షత్రములు అంటూ వివిధనామములతో నిర్దేశించబడే సర్వము వాస్తవములో అద్వితీ యమగు పరబ్రహ్మ మాత్రమే.
లెక్కించ శక్యము కాని వేర్వేరు పేర్లు, రంగులు, ఆకారములు గల ఈ జగత్తు రూపముగా నీవే ప్రకటమైనావు. అట్టి నీ అద్వయస్వరూప మునందు సాంఖ్యాచార్యులు తత్త్వములను కల్పించి లెక్కించుచున్నారు. నీ యథార్థస్వరూపమును తెలుసుకున్నప్పుడు ఈ భేదదృష్టి తొలగిపోవు ను. ఆ సాంఖ్య సిద్ధాంతము కూడ నీ స్వరూపమే. నీకు నా నమస్కారము అని అర్యముడు స్తుతించుచున్నాడు.
ఉత్తరకురువర్షమునందు కూడ యక్షేశ్వరుడగు శ్రీహరి భగవా నుడు వరాహరూపమును దాల్చియున్నాడు. ఆయనను ఈ భూదేవి కురు ఖండములోని జనులతో గూడి, విచలితము కాని భక్తియోగముతో ఉపాసి స్తూ, ఈ క్రింది గొప్ప మంత్రమును జపించుచున్నది.
ఓమ్. ఓ భగవానుడా ! పురుషోత్తముడవగు నీ స్వరూపము వేద మంత్రముల ద్వారా తెలియబడుచున్నది. యూపములు లేని యజ్ఞములు, యూపములు గల క్రతువులు నీ రూపములే. గొప్ప యజ్ఞములే నీ అవయ వములు. కలియుగము మినహా మిగిలిన మూడు యుగములలో స్పష్ట ముగా ప్రకటమయ్యే నీవు కర్మలకు శుద్దమైన ఫలములననుగ్రహించెదవు. సత్త్వగుణప్రధానమగు కర్మలు నీ రూపమే. నీకు అనేక నమస్కారములు.
కట్టెలలో నిప్పువలె శ్రీహరి త్రిగుణాత్మికయగు మాయయొక్క కార్యములైన దేహములయందు క్రియాశక్తి (కర్మలు) మరియు విజ్ఞానశక్తి (కర్మఫలముల అనుభవము) రూపముగా దాగియున్నాడు. వివేకవంతు లగు మహాత్ములు శ్రీహరిని దర్శించగోరి, మన స్సే చిలికే కవ్వము కాగా హృదయమును మథించెదరు. అప్పుడు వారికి శ్రీహరి ఆత్మరూపముగా సాక్షాత్కరించును.
ఆత్మవిచారము, మరియు యమునియమాది యోగాంగముల అభ్యాసములచే సాధకుల బుద్ధి అతిశయించి సూక్ష్మమగును. అట్టి బుద్ధి గల మహాత్ములు మాయాశక్తి కార్యములగు భోగ్యవస్తువులు, ఇంద్రియము లు, వాటి దేవతలు, దేహము, కాలము మరియు అహంకారములను పరిశీ లించి, పరమేశ్వరుని వాస్తవస్వరూపమును నిశ్చయించెదరు. ఈ ఆకార ములన్నియు పరమేశ్వరునియందు మాయచే కల్పించబడినవియే గాని, వాస్తవముగా లేవు. అట్టి పరమేశ్వరుని కొరకు అనేక నమస్కారములు.
ఓ ఈశ్వరా! అయస్కాంత శిల సన్నిధిలోనున్న ఇనుప ముక్క ఆ శిల కారణముగా కదులును. అదే విధముగా, నీ సంకల్పమాత్రముచే మాయాశక్తి తన గుణముల ద్వారా జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను చేయుచున్నది. సర్వసాక్షివగు నీ సంకల్పములో స్వార్థకామన లేదు. ప్రకృ తిగుణములకు, జీవుల కర్మాదృష్టములకు సాక్షివగు నీకు నమస్కారము.
నీటిలో క్రీడిస్తూ తనకు అడ్డు వచ్చిన ఏనుగును ఢీకొన్న పెద్ద ఏనుగు వలె, జగత్కారణమగు వరాహమూర్తి ప్రళయసముద్రములో పాతా ళమునుండి నన్ను పైకి లేవదీసి, తన కోరల కొనపై నుంచుకొని, ఏనుగు వలె అడ్డు వచ్చిన హిరణ్యాక్షుని యుద్ధములో మట్టుబెట్టి, నన్ను బయటకు తీసుకువచ్చెను. ఆ సర్వసమర్థుడగు శ్రీహరికి నమస్కరించుచున్నాను అని భూదేవి స్తుతించెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో అవతారమూర్తుల మంత్రములను, స్తుతులను వర్ణించే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది .
