శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము
11 - రహూగణ జడభరత సంవాదము - మనో విజయము
జడభరతుడు ఇట్లు పలికెను --- నీవు వివేకము గలవాడవు కావు. కాని, వివేకవంతుల మాటలవంటి మాటలను పలుకుచున్నావు. అయిననూ, నీవు గొప్ప వివేకము గలవారిలో అగ్రేసరుడవు కాబోవు. ఏలయనగా, తత్త్వము (సత్యవస్తువు) ను విచారించే మహాత్ములు ఈ వ్యావహారిక ప్రపంచము యథార్థమని చెప్పుట లేదు.
ఓ రాజా! వైదిక వ్యవహారము కూడ లౌకిక వ్యవహారము వంటిదే. గృహస్థాశ్రమమునకు సంబంధించిన విస్తృతమగు యజ్ఞయాగాదులను వేదము అధికముగా బోధించుచున్నది. వాటికి చెందిన అర్థవాదములు (కర్మల మహిమను స్తుతించే వాక్యములు) వేదములలో చెలరేగి యున్నవి. వాటియందు హింసాది దోషములు లేని రాగద్వేషాదులకు అతీతముగా నుండే పరమార్థముయొక్క విచారము తరుచుగా విలసిల్లుట లేదు. ఇది నిశ్చయము.
వ్యక్తి కలలో సుఖముననుభవించును. కాని, అది అనిత్యమని అనుభవమే. ఈ అనుభవమును విశ్లేషించుకొని, గృహస్థాశ్రమములో చేసే యజ్ఞాదుల వలన కలిగే సుఖము కూడ అదే విధముగా అనిత్యమనియు, కావున విడిచి పెట్ట దగినదనియు, వ్యక్తి తనంత తానుగా నిశ్చయించుకొన లేకున్నాడు. వేదాంతవచనములు గొప్పవియే. కాని, అట్టి వ్యక్తి సాక్షాత్తుగా ఆ వచనములను బట్టి తన యథార్థస్వరూపమును తెలియజాలడు.
ఎంతవరకైతే వ్యక్తియొక్క మనస్సు సత్త్వరజస్తమోగుణములకు వశమై యుండునో, అంతవరకు ఆ మనస్సుపై ఆతనికి నిగ్రహము ఉండదు. అట్టి మనస్సు జ్ఞానేంద్రియములు మరియు కర్మేంద్రియముల సహకారముతో, ఆతనిచే పుణ్యపాపములను అధికముగా చేయించుచుండును.
మనస్సు అనగా వాసనల సముదాయమే. ఇంద్రియభోగముల యందాసక్తమైన ఆ మనస్సు సత్త్వరజస్తమోగుణముల ప్రవాహమై సాగుచుండును. కామాది వికారములతో కూడిన ఆ మనస్సు, జీవునియొక్క పదునారు అంశముల (ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు) లో ప్రముఖమైనది. ఆ మనస్సు జీవుని వివిధజన్మలలో వేర్వేరు నామములతో వేర్వేరు రూపములను ఉపాధులుగా కలిగియుండును. ఆ ఉపాధులలో కొన్ని (దేవతాదేహము) మొదల గునవి గొప్పవి కాగా, మరికొన్ని (పశువు మొదలైనవి) నికృష్టములు. ఆత్మ స్వరూపుడగు జీవునకు అట్టి ఉపాధితోడి తాదాత్మ్యము వలననే లోపల, బయట అనే తేడా కలుగుచున్నది.
అంతఃకరణము సత్త్వరజస్తమోగుణాత్మికయగు మాయాశక్తి యొక్క కార్యము. జీవుడు అజ్ఞానముచే దానితో తాదాత్మ్యమును చెంది, ఆ విధముగా మోసపోయి, సంసారచక్రములో పడి తిరుగుచుండును. ఆ అంతఃకరణము జీవునకు కాలముచే పరిపక్వమైన కర్మల ఫలము రూపముగా ఒకప్పుడు సుఖము (సత్త్వగుణకార్యము) ను, మరియొకప్పుడు దుఃఖము (రజోగుణకార్యము) ను, ఇంకో సమయములో మోహము (అసత్యమును సత్యమని భ్రమపడుట, తమోగుణకార్యము) ను ప్రకటించుచుండును. ఈ కర్మల ఫలమును అజ్ఞానియగు జీవుడు తప్పించుకొనలేడు.
ఈ విధముగా మనస్సుతోడి తాదాత్మ్యము ఉన్నంతవరకు, ఈ లోకవ్యవహారము ప్రకాశించుచునే యుండును. జాగ్రదవస్థయందు ఈ వ్యవహారము స్థూలము (ఇంద్రియగోచరము) గను, స్వప్నావస్థలో సూక్ష్మము (కేవలము మనస్సుయొక్క విలాస మాత్రమే) గను ఉండును. కాని, ఆత్మ సర్వావస్థలయందు దృశ్యమగు ఈ లోకవ్యవహారమునకు సాక్షిగనే నిలిచియుండును. కావున, జీవుడు ఉత్కృష్ట నికృష్టములగు జన్మలను పొంది త్రిగుణాత్మికయగు ప్రకృతితోడి తాదాత్మ్యము వలన సంసారబంధ ములో నుండుటకు కారణము ఈ మనస్సే. ఈ మనస్సే పరిశుద్దమై తన స్వరూపమగు ఆత్మయందు విలీనమైనప్పుడు జీవుడు గుణసంబంధము నుండి విముక్తుడై మోక్షమును పొందును. ఈ విధముగా మోక్షమునకు కూడ మనస్సే కారణమగుచున్నది. గుణములతోడి తాదాత్మ్యమే ఆత్మ యొక్క అపర (నికృష్ట) భావము. గుణాతీతమగు స్థితియే ఆత్మకు స్వత స్సిద్ధమగు పర (ఉత్కృష్ట) భావము.
అందువలన, త్రిగుణాత్మికయగు ప్రకృతియొక్క కార్యములగు భోగములయందు ఆసక్తి గల వ్యక్తికి వాని మన స్సే దుఃఖ హేతువు అగు ను. అదే మనస్సు గుణములకు అతీతముగా తన స్వరూపమగు ఆత్మ చైత న్యమునందు విలీనమై మోక్ష హేతువు అగును. నేతివత్తిలోని నేతిని పీల్చే దీపము పొగతో గూడిన జ్వాలలను సృష్టించును. అదే దీపము నేతిని గ్రహించుట మానివేసినచో, తన స్వరూపమగు మహాభూతాగ్నిలో విలీనమ గును. అదే విధముగా, గుణకార్యములగు విషయభోగములయందు, దానిని బట్టి వివిధకర్మలయందు తగుల్కొన్న మనస్సు నిరంతరముగా ఆలోచనలను సృష్టించుచునే యుండును. అదే మనస్సు విషయభోగము లను విడిచి పెట్టినచో, పరమపదమగు ఆత్మతత్త్వమును పొంది యుండును.
ఓ వీరా! అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు, అహంకారము అనే పదకొండు మనస్సుయొక్క వ్యాపారములు. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనే జ్ఞానేంద్రియములకు క్రమముగా శబ్దస్పర్శరూపరసగంధములనే తన్మాత్రలు (ఇతరభూతముల సమ్మేళ నము లేకుండా కేవలము ఒకే లక్షణము ప్రకటమగుట) విషయములు. చేతులు, కాళ్లు, నోరు, జననేంద్రియము, విసర్జనేంద్రియము అనే అయిదు కర్మేంద్రియములకు క్రమముగా ఇచ్చి పుచ్చుకొనుట, నడచుట, మాటలాడుట, సంభోగము, విసర్జనము అనే అయిదు క్రియలు విషయములు. అహంవృత్తికి పురము అనే శరీరముందు నేను, నాది అనే దేహాభిమానమే విషయము. ఈ విధముగా విషయములు కూడ వెరసి పదకొండు అని మహాత్ములు చెప్పుచున్నారు. దేహమునందు నేను అనే అభిమానము (అ హంకారము) ను, నాది అనే అభిమానము (మమకారము) ను విడిగా లెక్కించి కొందరు పన్నెండు వృత్తులను, పన్నెండు విషయములను చెప్పు చున్నారు.
గంధాదిద్రవ్యములను బట్టి, వ్యక్తియొక్క స్వభావమును బట్టి, సంస్కారములను బట్టి, కాలము కర్మల ప్రభావముచే కూడ ఈ మానసవికారములు వందల, వేల, కోట్ల రకములుగా నుండును. క్షేత్రము (దేహేంద్రీయమనస్సంఘాతము) ను సాక్షిగా దర్శిస్తూ ఉండే ఆత్మ చైతన్యము వలననే, ఈ వికారములకు సత్త (ఉనికి) మరియు స్పురణము (ప్రకాశము) గలవు. అంతే గాని, ఈ మనోవికారముల సత్తాస్పూర్తులకు ఆత్మ-అనా త్మల వాస్తవమగు కలయిక హేతువు కాదు. మరియు, అవి స్వతంత్రమగు సత్తాస్పురణములు కలవి కూడ కావు.
త్రిగుణాత్మికయగు మాయయొక్క కార్యమైన ఈ మనస్సే జీవుని ఉపాధి. ఇదియే సంసారబంధమునకు కారణమైన కర్మలను చేయును. దీని యందు జాగ్రత్స్వప్నములలో ప్రకటమై నిద్రలో అంతర్ధానమయ్యే వృత్తి (ఆలోచన) ప్రకాశములను అసంగుడగు క్షేత్రజ్ఞుడు సాక్షిగా దర్శించుచుండును. క్షేత్రమనగా దేహేంద్రియమనస్సంఘాతము. దానిని తెలుసు కుంటూ ఉండే ఆత్మ చైతన్యమే క్షేత్రజ్ఞుడు. .
ఈ దేహేంద్రియమనస్సంఘాతమునకు సాక్షియై ఉండే చైతన్యమే వ్యక్తియొక్క ఆత్మ. కాలాతీతుడు, సర్వేశ్వరుడు అగు నారాయణుడే అట్టి ఆత్మరూపముగా అపరోక్షుడై ఈ దేహమునందు ప్రకటమగుచున్నాడు. తన మాయాశక్తిచే సకలప్రాణుల బుద్ధియందు అంతర్యామియై స్వయంప్రకాశస్వరూపుడుగా వీరాజిల్లే ఆ భగవానునకు పుట్టుక లేదు.
కదిలే మరియు కదలని ప్రాణులలో వాయువు ప్రాణశక్తిరూపముగా ఉంటూ, వాటిని నియమించును. అదే విధముగా, ప్రకృతికి అతీతుడగు వాసుదేవ భగవానుడు ఈ జగత్తును సృష్టించిన పిదప, సకలప్రాణులలో క్షేత్రమునకు సాక్షియగు ఆత్మ చైతన్యము రూపముగా ప్రవేశించినాడు (అనగా, ఆ రూపముగా ఉపలభ్యమగుచున్నాడు).
ఓ మహారాజా! దేహధారియగు వ్యక్తి సంసారమునందలి ఆసక్తిని విడిచి పెట్టి, కామక్రోధలోభమోహమదమాత్సర్యములనే ఆర్గురు అంతశ్శత్రువులను జయించవలెను. అట్టి సాధకుడు ఆత్మజ్ఞానమును పొంది, ఈ అజ్ఞానమును తొలగించుకొనవలెను. ఆత్మస్వరూపమునకు ఉపాధి (సమీపములోనుండి తన ధర్మములను ఇతరమునకు సంక్రమింపజేసినట్లు కన్నట్టునది) యగు మన స్సే సంసారములో దుఃఖములను పండించే పొలము అని సాధకుడు తెలియవలెను. మనస్సే మానవునకు మమకారమును పెంచి, శోకము వ్యామోహము చింతలు ఆసక్తి లోభము మరియు వైరము లతో ఎడతెగనీ సంబంధమును కలిగించును. ఎంతవరకైతే సాధకుడు ఆత్మ విచారమును చేసి తన స్వరూపమును తెలియకుండునో, అంతవరకు ఈ సంసారములో తిరుగాడుచుండును.
కావున, ఈ మనస్సే నీకు శత్రువు. ఇది తనంత తానుగా మిథ్యయే అయిననూ, దీని బలము చాల పెద్దది. దీనిని ఉపేక్ష చేయుటచే, దీని బలము మరింత పెరిగి, ఇది ఆత్మస్వరూపమును కప్పివేయుచున్నది. గురువుయొక్క మరియు శ్రీహరియొక్క పాదములను సేవించుటయే దీనిని నాశము చేసే గొప్ప ఆయుధము. దీనికి సాక్షియై నిలిచియుండుట కూడ దీని వినాశమునకు తోడ్పడును. నీవు జాగరూకుడవై ఈ మనస్సును నాశము చేయుము.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో రహూగణ జడభరత సంవాదములో మనోవిజయము అనే పదకొండవ అధ్యాయము ముగిసినది (11).
