శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము
2 - ఆగ్నీధ్రుని చరితము
శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా ప్రియవ్రతుడు చక్కగా భగవద్భజనమునందు ప్రవర్తిల్లగా, తండ్రి ఆజ్ఞను పాలించే ఆగ్నీ ధ్రుడు జంబూద్వీపనివాసులగు జనులను ధర్మబద్దముగా సంతానమును వలె అన్ని విధములుగా రక్షిస్తూ, రాజ్యమునేలెను.
ఒకనాడు ఆ ఆగ్నీధ్రుడు పితృలోకమును (సంతానమును) పొంద గోరి, మందరపర్వతముయొక్క లోయలో ఉండి తపస్సును చేసెను. ఆ లోయలో దేవశ్రేష్ఠుల భార్యలు విహరించుచుందురు. అచట ఆయన పూజాసామగ్రిని సమకూర్చుకొని, ప్రజాపతులకు ప్రభువగు బ్రహ్మదేవుని ఏకాగ్రమగు చిత్తముతో ఆరాధించేను.
జగత్కారణుడగు బ్రహ్మదేవుడు ఆ విషయమును తెలుసుకొని, తన సభలో గానము చేసే పూర్వచిత్తి అనే అప్సరసను ఆగ్నీధ్రుని వద్దకు పంపించెను.
ఆమె ఆ ఆగ్నీధ్రుని మిక్కిలి సుందరమగు ఆశ్రమమునకు దగ్గరగా నున్న ఉద్యానవనములో సంచరింప జొచ్చెను. ఆ ఆశ్రమములో పలురక ముల చెట్లు దట్టముగా నుండెను. బంగరు తీగలను కౌగిలించియున్న వాటి కోమ్మల గుంపులపై నెమలి మొదలగు భూపక్షుల జంటలు కూర్చుండి, స్వరములను పలుకుచుండెను. అక్కడి స్వచ్చమగు సరస్సులలోని నీటి కోళ్లు, కారండన పక్షులు, రాజహంసలు మొదలగునవి ఆ కూతలను సావ ధానముగా వినుచుండెను. ఆ పక్షుల రొదలతో ప్రతిధ్వనిస్తూ ఆశ్చర్యమును గొలిపే ఆ సరస్సులలో కమలములు సమృద్ధముగా నుండెను.
ఆమె అందము ఉట్టిపడునట్లుగా అడుగులను వేస్తూ విలాసగా నడుస్తూ ఉంటే, అందమగు కాలియందేలు ఖణఖణ ధ్వనిని చేయుచుండే ను. మహారాజపుత్రుడగు ఆగ్నీధ్రుడు చిత్తముయొక్క ఏకాగ్రతను అభ్యసి స్తూ, కన్నులను మూసుకొని యుండెను. ఆ ధ్వనిని విన్న ఆయన కన్ను లను కొద్దిగా తెరిచి చూచెను.
ఆమె తుమ్మెదవలె పుష్పములనాఘ్రాణించుచుండెను. ఆమె నడక, విహారము, సిగ్గు, వినయముతో కూడిన చూపులు, చక్కని పలుకులు మరియు అవయవములు దేవతలకు మానవులకు కూడ మనస్సునకు కళ్లకు అధికముగా ఆహ్లాదమును కలిగించుచుండెను. ఆమె సౌందర్యము మానవుల హృదయములలో మన్మథునకు ప్రవేశమును కల్పించుచుండె ను. ఆమె చిరునవ్వుతో పలికే పలుకులు అమృతాసవమువలె మధుర ముగా మాదకములై యుండెను. ఆమె మాటలాడునప్పుడు వెలువడే నిశ్శ్వాసవాయువుయొక్క సుగంధమునాఘ్రాణించిన తుమ్మెదల గుంపులు మత్తుచే గ్రుడ్డివి అయి ఆమె ముఖమును కప్పివేయుచుండెను. ఆమె తొందరగా నడుచునప్పుడు కలశములవంటి స్తనములు, దట్టని జుట్టు ముడి మరియు చిరుగంటల వడ్డాణము కొద్దిగా కదలాడుచుండెను. ఆమెను తన సమీపములో చూచిన ఆగ్నీధ్రుని హృదయములో పూజ్యు డగు మన్మథునకు ప్రవేశము లభించేను. మన్మథునకు వశుడైన ఆగ్నీ ధ్రుడు మొద్దుబారినవాడు (పిచ్చివాడు) వలే ఆమెతో నిట్లనెను.
ఓ గొప్ప మహర్షీ! నీవెవరు? ఈ పర్వతముపై నీవు ఏమి చేయగో రుచున్నావు? నీవు పరమేశ్వరుడగు శ్రీహరియొక్క మాయవా యేమి? మిత్రమా! నీవు నారిత్రాడు లేని రెండు ధనస్సులను (కనుబొమలు) ధరించి యున్నావు. అవి ఆత్మరక్షణ కొరకా? లేక, అడవిలో బాగా మదించి యున్న మృగములను వేటాడుచున్నావా యేమి? (కాముకులే సంసార మనే అడవిలో బాగా మరిగించి యున్న మృగములు).
పూజ్యుడవగు నీ ఈ శాంతములగు బాణములు (చూపులు) కలువ కన్నులే రెక్కలుగా గలవి. మిక్కిలి వాడి కొనలు గల ఈ బాణములు తోక లేకున్ననూ, అందముగా నున్నవి. నీవు అడవిలో సంచరిస్తూ, వీటిని ఎవనిపై ప్రయోగించ గోరుచున్నావు? నీ పరాక్రమము మందబుద్ధులమగు మాకు క్షేమమును కలిగించు గాక!
పూజ్యుడవగు నీ ఈ శిష్యులు (తుమ్మెదలు) నీ చుట్టూ చేరి వల్లిం చుచున్నారు; (రహస్యములను చెప్పుచున్నారా యన్నట్లు) మంత్రములతో కూడిన సామవేదమును గానము చేయుచున్నారు. నీ జుట్టుముడినుండి జారి నలువైపులా పడిన పూలవానను, మహర్షుల గుంపులు వేదశాఖలను అనుసరించే విధముగా, వీరందరు సేవించుచున్నారు.
ఓ మహాత్మా! నీ నూపురములయందలి మణులు (పంజరముల లోని తిత్తిరిపక్షులు అని వ్యంగ్యార్థము) నీ కొరకై ధ్వనించుచున్నవి. కేవ లము ధ్వని మాత్రము మాకు వినబడుచున్నది. కాని, వాటి ముఖము కానవచ్చుట లేదు. నీ నడుముయొక్క సుందరమగు మండలమునందు కడిమిపువ్వుల కాంతి ఎక్కడిది ? దానికి చుట్టూ నిప్పుల కైవారము గలదు సుమా! (పచ్చని దేహకాంతికి ఆకుపచ్చని చీర, బంగరు వడ్డాణము జోడైన వని ధ్వని). నీకీ వస్త్రము ఎక్కడిది?
ఓ మహర్షీ! నీ సుందరములగు శిఖరముల (స్తనముల) లో ఏమి నిండియున్నది? సన్నని నడుము గల నీవు ఈ శిఖరములను మోయుచున్నావు. నా చూపు అచ్చటనే నిలిచియున్నది సుమా! ఓ భాగ్యవంతుడా! నీ ఈ శిఖరములపై అపూర్వమగు ఎర్రని లేపము (చందనపు పూత) గలదు. ఈ లేపముయొక్క పరిమళముచే నా ఆశ్రమము పరిమళభరితమైనది.
ఓయీ! నీవు గొప్ప మిత్రుడవు. నీవు నివసించే స్థానమును నాకు చూపుము. మీ ఊరిలోని జనులు ఈ విధముగా వక్షఃస్థలముపై నావంటివా రల మనస్సునకు క్షోభను కలిగించే అపూర్వములగు అవయవములను మాత్రమే గాక, ముఖముపై తియ్యని పలుకులు, హావభావములు, అధరా మృతము మొదలగు అనేకములైన అద్బుతములను కలిగియుండెదరు.
ఓ మిత్రమా! నీ ఆహారమేమి? నీవు నములుచున్న పదార్థము (తాంబూలము) యొక్క సుగంధము నావరకు గాలిచే ప్రసరించుచున్నది. నీవు శ్రీహరియొక్క అంశవు. నీ చెవులకు గల గొప్ప మకరకుండముల రత్నములు రెప్పపాటు లేని కన్నులవలె మెరియుచున్నవి. చంచలమగు కన్నుల జంటతో, శోభిల్లే దంతముల వరుసలతో, తుమ్మెదల గుంపు వంటి జుట్టుముడితో కూడియున్న నీ ముఖము -- ఇటునటు కదిలే చేపలతో, రాజహంసల వరుసలతో, తుమ్మెదల గుంపులతో కూడియున్న సరస్సును పోలియున్నది.
నీవు పద్మమువంటి చేతితో బంతిని కొట్టుచుండగా, అది నలువై పులా ఎగురుతూ, చంచలమగు చిత్తము గల నా కళ్లను ఇటునటు త్రిప్పు చున్నది. నీ గిరజాల జుట్టు ముడి విడిపోయినా, నీవు గమనించనే లేదు. ఈ ధూర్తుడగు చపల వాయువు నీ వస్త్రమును తొలగించుచున్నాడు.
తపస్సే ధనముగా గల ఓ మిత్రమా! నీ ఈ రూపము తపస్సును చేయువారల తపస్సునకు విఘ్నమును కలిగించ జాలియున్నది. నీవీ రూపమును ఏ తపస్సు చేసి సంపాదించితివి? నీవు నా కోసం నాతో గూడి తపస్సును చేయవలెను సుమా! ఆ సృష్టికర్త (నీతో జతను గూర్చుట ద్వారా) నాపై అనుగ్రహమును చూపునా?
ప్రియుడవగు నిన్ను బ్రహ్మదేవుడు నాకు ఒసగినాడు. నేను నిన్ను విడిచిపెట్టను. నీయందు నా మనస్సు, చూపు కూడ లగ్నమై, వెను దిరు గుట లేదు. ఓ సుందరస్తనీ! నేను నీ వెంట వచ్చుచున్నాను. నీ మనస్సు నకు నచ్చిన చోటికి నన్ను గొనిపొమ్ము. మంగళకారులగు ఈ నీ సఖు రాండ్రు మన వెంట ఉండెదరు గాక!
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- దేవతలవలె చురుకైన బుద్ధి గల ఆగ్నీధ్రుడు సుందరిని వశము చేసుకొనుటలో నేర్పరి. ఆయన ఈ తీరున ఇంద్రియభోగములయందు పాటవము గల పలుకులతో ఆ అప్సర సను తనకు అనుకూలము చేసుకొనెను.
తరువాత వీరుల గణములకు ప్రభువు మరియు జంబూద్వీపము నకు అధిపతి అగు ఆ ఆగ్నీధ్రునియొక్క బుద్ది, శీలము, రూపము, వయ స్సు, సంపద మరియు ఔదార్యములచే ఆ పూర్వచిత్తి మనస్సు ఆకర్షిత మయ్యేను. ఆయనతో గూడి ఆమె పది కోట్ల సంవత్సరముల కాలము నిరంతరముగా భూలోకమునందు మరియు స్వర్గలోకమునందు భోగముల ననుభవించెను.
ఆ ఆగ్నీధ్ర మహారాజునకు పూర్వచిత్తియందు నాభి, కింపురుషు డు, హరివరుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనే తొమ్మండుగురు పుత్రులు కలిగిరి.
ఆ పూర్వచిత్తి సంవత్సరమునకు ఒకరు చొప్పున తొమ్మండుగురు కొడుకులను కనెను. ఆమె వారిని రాజభవనములోనే విడిచి పెట్టి, మరల బ్రహ్మదేవుని సేవించెను.
ఆ ఆగ్నీధ్రుని పుత్రులకు పుట్టుక తోడనే తల్లి అనుగ్రహము వలన దృఢమగు శరీరము, బలము ఉండెను. ఆగ్నీధ్రుడు జంబూద్వీపమును విభాగము చేసి, వారికి ఆయా భాగములయందు రాజ్యాధికారమును అప్పజెప్పెను. ఆ భాగములకు వారి పేర్లే ఏర్పడెను. వారు తమ తమ భాగములను అతిక్రమించకుండగా పాలించిరి.
ఆగ్నీధ్ర మహారాజునకు భోగముల యెడల తృప్తి కలుగలేదు. ఆయన ప్రతిదినము అప్సరసయగు పూర్వచిత్తిని అధికముగా స్మరించెడి వాడు. ఆయన వేదోక్తకర్మలను చేసి, పూర్వచిత్తియొక్క లోకమును పొందేను. అది పితృదేవతలు ఆనందముగా నివసించే లోకము.
తండ్రి మరణించిన తరువాత ఆ తొమ్మండుగురు సోదరులు మేరు ప్రజాపతియొక్క తొమ్మండుగురు కుమార్తెలను వివాహమాడిరి. మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంష్ట్రా, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర మరియు దేవవీతి అనునవి వారి పేర్లు.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమ స్కంధములో ఆగ్నీధ్రుని చరితము అనే రెండవ అధ్యాయము ముగిసినది (2).
