శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము

Table of Contents

9 - జడభరతుని భద్రకాళి రక్షించుట

            శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆంగీరస గోత్రమునకు చెందిన ఒక గొప్ప బ్రాహ్మణుడుండెను. తన వేదశాఖను అధ్యయనము చేసి యున్న ఆయన మనోనిగ్రహము, ఇంద్రియనిగ్రహము, తపస్సు, దానము, సంతోషము (ఉన్నదానితో తుష్టుడగుట), సహనము, వినయము మరియు ఆత్మజ్ఞానములను కలిగియుండెను. ఈశ్వరోపాసకుడగు ఆయన ఇతరుల యందు దోషములను ఎత్తి చూ పెడివాడు కాదు. ఆయనకు పెద్ద భార్య యందు తొమ్మండుగురు కొడుకులు కలిగిరి. వారు ఆయనతో సమాన ముగా విద్య, సచ్చీలము, ఆచరణము, రూపము, పెద్ద మనస్సు అనే గుణములను కలిగియుండిరి. ఆయనకు చిన్న భార్యయందు ఒక కొడుకు, కూతురు (కవలలు) కూడ కలిగిరి.

గొప్ప భగవద్భక్తుడు, రాజర్షులలో శ్రేష్ఠుడు అగు భరతుడు లేడి జన్మ అంతమైన పిదప బ్రాహ్మణునిగా జన్మించెననియు, ఆ భరతుడే ఈ కవల పిల్లలలోని  మగ పిల్లవాడనియు, భరతునకు ఇది ఆఖరి జన్మ అనియు మహాత్ములు చెప్పిరి.

ఆ జన్మలో కూడ భరతుడు తనకు బంధువులయందు ఆసక్తి కలుగునేమోయని అధికముగా వెరచెడివాడు. ఆయన మనస్సులో భగవానుని పాదపద్మముల జంటను విశేషముగా ధారణ చేసెడివాడు. భగవానుని పాదములను గురించి వినుట, స్మరించుట, గుణములను వివరించుట అను సాధనల వలన భక్తునకు సంసారబంధము దూరమగును. ఆయనకు భగవానుని అనుగ్రహముచే తన పూర్వజన్మలన్నియు గుర్తులో నుండెను. కావుననే, ఆయన మోక్షమునకు మరల విఘ్నము కలుగునేమోయను ఆశంకతో, తనను జనులు పిచ్చివాడు, వెర్రివాడు, గ్రుడ్డివాడు, చెవిటివాడు అని తలచే విధముగా ప్రవర్తించేడి వాడు.

ఆ బ్రాహ్మణునకు తన పుత్రుడగు భరతునియందు ప్రీతి మెండు. కావుననే, భరతుడు ఆ విధముగా జడుడుగనే ఉన్ననూ, ఆయన ఆతనికి సమావర్తన (వివాహమునకు గురువుయొక్క అనుజ్ఞను పొంది తిరిగి గృహ మునకు వచ్చుట అనే) సంస్కారము వరకు వైదిక సంస్కారములను యథావిధిగా చేస్తూ వచ్చాను. ఆయన ఆతనికి అభీష్టము కాకున్ననూ, అదే వరుసలో ఉపనయనము చేసి, స్నానాదులచే శుద్దిని పొందుట ఆచమనము మొదలగు వైదికకర్మల నియమములను చక్కగా నేర్పెను. ఏలయ న, పుత్రుడు తండ్రి వద్దనుండి శిక్షణను పొందియే తీరవలెను గదా!

ఆ భరతుడు వైదికకర్మలను తండ్రి సన్నిధిలో మాత్రమే చేసెడివాడు. అది కూడ ఖచ్చితముగా చేసెడివాడు కాదు. తండ్రి భరతుని వర్షాకాలములో వేదములను చదివించగోరి, ముందుగా సవితృదేవతాకమైన గాయత్రీమంత్రమును ఉపదేశించెను. వసంత గ్రీష్మఋతువులలోని చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢమాసములయందు నిరంతరముగా వల్లింప జేసిననూ, శిరో మంత్రమగు ఓంకారముతో మరియు భూః భువః సువః అనే వ్యాహృతులతో కూడియున్న గాయత్రీమంత్రమును ఆతడు సరిగ్గా నేర్వలేకపోయెను.

ఆ తండ్రికి తనకు తన పుత్రునకు తేడా లేదు. ఆయన హృదయము పుత్రప్రేమతో నిండియుండెను. తన పుత్రుడు సుశిక్షితుడు కావలెనని ఆయనకు తగని పట్టుదల ఉండెడిది. బ్రహ్మచారియగు తన పుత్రునకు ఇష్టము కాకున్ననూ, శౌచము (స్నానాదులచే పరిశుద్ధముగా నుండుట), వేదాధ్యయనము, వేదోక్తములగు వ్రతములననుష్ఠించుట, బ్రహ్మచారి నియమములు, గురుశుశ్రూష, అగ్ని సేవ మొదలగు వేదోక్తకర్మలయందు ఆయన భరతునకు శిక్షణనిచ్చుచుండెడివాడు. కాని, ఆ విషయములో ఆయన కోరిక తీరనే లేదు. ఈ విధముగా, ఆయన గృహకార్యములలో తలమున్కలై యుండగనే మరణసమయము ఆసన్నమైనది. ఆయన మరణించినాడు. మృత్యువునకు మరుపు గాని, సోమరితనము గాని ఉండవు.

అప్పుడు ఆ బ్రాహ్మణుని చిన్న భార్య తన కవల పిల్లలను సవతికి అప్పజెప్పి, తాను భర్తతో బాటే మరణించి, భర్త పొందిన లోకమును పొందెను.

భరతుని సోదరులకు ఆయన మహిమ తెలియదు. వారి బుద్ధి కేవలము వేదముయొక్క కర్మకాండయందు మాత్రమే నిశ్చితమై యుండెను. సర్వాతిశాయియగు ఆత్మజ్ఞానమునందు వారికీ అభిరుచి లేదు. వారి దృష్టిలో భరతుడు జ్ఞానము లేని వెర్రివాడు. కావుననే, తండ్రి మరణించిన తరువాత, ఆయనకు వైదికమగు కర్మకాండయందు శిక్షణను కొనసాగించుట వారికి సమ్మతము కాలేదు.

రెండు కాళ్ల పశువులు అనదగిన మూర్ఖజనులు ఆ భరతుని, ఓరీ పిచ్చివాడా! వెర్రీ! చెవిటివాడా! అని పలకరించెడివారు. ఆయన ఆ పిలుపునకు తగిన విధముగనే మాటలాడెడివాడు. వారు ఆయనచే బలాత్కారముగా పనులను చేయించినప్పుడు, వారి ఇచ్చకు అనురూపముగా ఆయన పనులను చేసెడివాడు. చాకిరీ చేయించుకొని కొందరు తిండి పెట్టెడివారు. మరికొందరు కూలి ఇచ్చెడివారు. ఆ విధముగా ఆయనకు కొన్ని సందర్భములలో ఆహారము లభించెడిది. మరియొకప్పుడు బిచ్చమెత్తిడి వాడు. ఒకప్పుడు అనుకోకుండా (ఈశ్వరేచ్చచే) ఆహారము లభించెడిది. లభించిన ఆహారము తనకు సరిపడినా, సరిపడక పోయినా, రుచిగా ఉన్నా, లేక చెడిపోయినా, ఆయన దానిని తినెడివాడు. ఆయన తినేది ప్రాణములను నిలబెట్టుకొనుట కొరకు మాత్రమే గాని, రుచులను ఆస్వాదించుట కొరకు కాదు.

ఆత్మ ఆనందఘనము. ఆ ఆనందము ఏ కాలమునందైననూ బాహ్యమగు నిమిత్తములచే కొత్తగా పుట్టేది కాదు. స్వయంసిద్దమగు ఆ ఆనందమునందు భోక్త-భోగ్యము మొదలగు భేదములు ఉండవు. అది ఆత్మజ్ఞానరూపముగా అనుభవమునకు వచ్చును. అది భరతునియందు గలదు. కావుననే, ఆయనకు చలి-వేడి, సమ్మానము-అవమానము మొద లగు ద్వంద్వముల (పరస్పరవిరుద్ధములగు స్థితులు) చే కలిగే సుఖదుఃఖ ములయందు, నాది అనే అభిమానము గాని, దేహమునందు నేను అనే అధ్యాస (అది కానిదానిని అది అని పొరబడుట) గాని ఉండెడిది కాదు.

జడభరతుడు చలిలో, ఎండలో, గాలిలో, వర్షములో ఎద్దు వలె దేహము పై వస్త్రమును కప్పుకోకుండానే తిరిగెడివాడు. ఆయన కుదురైన అవయవములతో పుష్టిగా నుండెడివాడు. నేలపై పరుండే ఆయనకు తలంటు ఉండేది కాదు. అప్పుడప్పుడు స్నానము కూడ సున్నయే. కావుననే ఆయన, మట్టిలోని మాణిక్యము వలె, బ్రహ్మతేజస్సు ప్రకటము కాకుండా, మలినముగా నుండెడివాడు. నడుమునకు చినిగి మాసియున్న వస్త్ర మును కట్టుకున్న ఆయనకు జందెము కూడ అతిమలినముగా నుండెడిది. ఆయన మహిమనెరుంగని జనులు ఆయనను బాపడని, బ్రాహ్మణాధముడని వ్యవహరిస్తూ అవమానించెడివారు.

ఇతరులకు కూలిని చేసి పొట్ట నింపుకొన గోరే జడభరతుని, ఆయన సోదరులు కూడ పొలము పనులలో నియోగించెడివారు. ఆయన ఆ పనులను కూడ చేసెడివాడు. కాని, పొలము సమముగా ఉన్నదని గాని, ఎగుడు దిగుడుగా నున్నదని కాని, ఆయనకు తెలిసేది కాదు. విత్తనములు మొదలగునవి తక్కువ గాని, ఎక్కువ గాని కావచ్చును. ఆ సంగతిని కూడ ఆయన గమనించెడిపోడు కాదు. నూకల జావ, తెలకపిండి, తవుడు, ముక్కి పోయిన మినుములు, గిన్నె అడుగున మాడిన అన్నము మొదలగు ఆహారమును కూడ ఆయన అమృతమును వలే భక్షించెడి వాడు.

కొంత కాలము తరువాత ఒకనాడు ఒకానొక బందిపోటు దొంగల నాయకుడు సంతానమును పొందగోరి, మనిషినీ భద్రకాళికి బలిని ఈయవలేనని సంకల్పించెను.

ఆ చోరనాయకుడు ఒక వ్యక్తిని బలి యిచ్చుటకై నిర్బంధించెను. కాని, ఆ వ్యక్తి దైవానుగ్రహముచే తప్పించుకొని పారిపోయెను. ఆ నాయకుని కింకరులు పారిపోయిన వ్యక్తిని వెదుక్కుంటూ పరుగెత్తిరి. ఇంతలో వారు వెదుకుచుండగనే అర్ధరాత్రము ఆయెను. అంతటా చీకట్లు అలుము కొని యుండెను. వారికి ఆ వ్యక్తి దొరకలేదు. అదే సమయములో ఆంగీరస గోత్రీకులలో శ్రేష్ఠుడగు బ్రాహ్మణుని కన్న కొడుకైన జడభరతుడు వీరాసనములో కూర్చుండి, పొలములోని పంటను పశువులు, పందులు మొదలగు వాటినుండి కాపలా కాయుచుండెను. ఆకస్మికమగు విధివిధానముచే ఆ కింకరులు ఆయనను చూచిరి.

అప్పుడు అన్ని మంచి లక్షణములతో కూడియున్న ఆ జడభరతుని పరిశీలించగానే ఆ కింకరుల ముఖములు ఆనందముతో విచ్చుకోనేను. తమ నాయకుని పని కోరిక సిద్దించినట్లేనని వారు తలపోసిరి. వారు ఆయనను త్రాటితో కట్టి చండికాలయమునకు తీసుకొని పోయిరి.

తరువాత ఆ చోరులు మనిషిని బలి యిచ్చే తమ పద్దతిని అనుసరించి, ఆ జడభరతుని అభిషేకించి, కొత్త వస్త్రములను కట్టి, భూషణము లతో అలంకరించి, గంధముల నలమి, పుష్పమాలలను వేసి, తిలకము పెట్టి, పలు విధములుగా అలంకరించిరి. ఆయనకు భోజనము కూడ పెట్టిరి. అపుడు వారు భద్రకాళికి ధూప దీపములను అర్పించి, పుష్పమాలలు, పేలాలు, చిగుళ్లు, లేత ఆకులతో పూజించి, పళ్లను నైవేద్యమిడిరి. వారు అపుడు బిగ్గరగా పాటలను పాడుతూ, స్తోత్రములను పఠిస్తూ, మద్దెళ్లను భేరీలను పెద్ద ధ్వని కలుగునట్లుగా వాయిస్తూ, బలిపశువగు ఆ జడభర తుని భద్రకాళీ యెదుట కూర్చుండ బెట్టిరి.

అప్పుడు చోరుల నాయకుని అనుచరుడు ఒకడు బలినీయవలసిన ఈ జడభరతుని రక్తముతో భద్రకాళీ దేవికి తృప్తిని కలిగించగోరెను. ఆతడు దేవీమంత్రముతో మిక్కిలి వాడిగానున్న భయంకరమగు కత్తిని అభిమంత్రించి పైకి యెత్తెను.

ఆ చోరుల స్వభావములో రజస్తమోగుణముల పాలు ఎక్కువ. ధనగర్వముచే వారి వివేకము కప్పివేయబడెను. వారి మనస్సులలో మిడిసిపాటు ఎక్కువగా నుండెను. కావుననే, హింసయందు విహరించే ఆ చోరులు భగవంతుని అంశతో కూడిన (భగవత్స్వరూపమగు వేదములను నిరంతరముగా అధ్యయనము చేసే) తేజశ్శాలురగు వేదవేత్తల వంశమును కూడ తిరస్కారము చేసి, తప్పు దారిన ఇచ్చవచ్చిన రీతిగా విహరిస్తూ, ఈ విధముగా మిక్కిలి దారుణమైన పనిని చేయుటకు పూనుకొనిరి. జడభర తుడు ఆత్మసాక్షాత్కారముచే సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడై యుండెను. ఆయన తండ్రి బ్రహ్మర్షి సకలప్రాణుల హితమును గురించి చింతిల్లే ఆయనకు ఎవ్వరితోనైననూ వైరము లేదు. అట్టి మహాత్ముని హింసించుట హింసకు అనుమతి ఉండే ఆపత్కాలములో కూడ తగదు. అట్టి అకృత్య మును చూచిన భద్రకాళీదేవి స్వయముగా విగ్రహమునుండీ ఒక్క ఉదు టున బయటకు వచ్చెను. మిక్కిలి సహించ శక్యము కాని బ్రహ్మతేజస్సుచే (బ్రహ్మవేత్తయొక్క తేజస్సు) ఆమె శరీరము అధికముగా మండి పోవుచుండెను.  

ఆ అపరాధమును భద్రకాళి సుతరాము సహించలేకపోయెను. కోపావేశముయొక్క వేగముచే, కోమ్మలవంటి ఆమె కనుబొమలు పైకి సాగి ముడివడెను. భయమును గొల్పే వంకరయైన కోరలతో, ఎర్రని కన్నుల హడావుడితో ఆమె ముఖము మిక్కిలి భీతిని గొల్పెను. ఈ జగత్తును సంహరించ గోరుచున్నదా యన్నట్లు ఆమె పెద్ద నాదముతో దీర్ఘముగా నవ్వుచుండెను. ఆమె అపుడా విగ్రహమునుండి పైకి యెగిరి అదే కత్తితో పాపిష్టులు, దుష్టులు అగు ఆ చోరుల తలలను నరికి, కంఠములనుండి కారుచున్న మిక్కిలి వేడియైన నెత్తురును త్రాగుచుండెను. తన పరివారముతో గూడి ఆ నెత్తురు అనే మాదకద్రవమును అతిగా త్రాగుటచే మత్తు కలిగి ఆమెకు స్వాధీనత తప్పుచుండెను. ఆమె తన అనుచరులతో గూడి బిగ్గరగా పాడు తూ, నాట్యము చేస్తూ, తలలనే బంతులుగా ఆడుతూ విహరించెను. 

మహాత్ముల యెడల బలి యిచ్చుట అనే అపరాధమునకు పూనుకున్నచో, అది ఆ అపరాధమును చేయువాని పైననే పూర్తి ఫలమును చూపును గదా!

శ్రీహరి అనుగ్రహమును పొందియున్న ఓ పరీక్షిన్మహారాజా! చోరులు తన తలను నరుకుటకు సంసిద్ధమైనప్పుడు కూడ జడభరతుడు కలవరపడలేదు. ఇది పెద్ద ఆశ్చర్యము కాదు. ఏలయనగా, మానవుల హృదయములో దేహమే నేను, దేహమునకు సంబంధించినవి నావి అనే ధారణరూపములో అజ్ఞానమనే ముడి బిగుసుకొని యుండును. కాని, భగవద్భక్తులైన ఆత్మజ్ఞానులకు ఈ అజ్ఞానము ఉండదు. తమ అంతఃకరణములో వైరము నెరుంగక సకలప్రాణుల హితమును గురించి చింతించే అట్టి మహాత్ములను సాక్షాత్తుగా శ్రీహరి భగవానుడే, ఆగిపోవుట యెరుంగని కాలము అనే చక్రమే గొప్ప ఆయుధము కాగా, భద్రకాళి మొదలగు ఆయా రూపములలో ప్రకటమై రక్షించును. శ్రీహరి పాదమూలమును శరణు వేడిన అట్టి మహాత్ములకు దేనివలనైననూ భయము ఉండదు.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో జడభరతుని భద్రకాళి రక్షించుటను వర్ణించే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).