శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము

Table of Contents

13 - రహూగణ జడభరత సంవాదము - సంసారము అనే అడవిలో ప్రయాణము

జడభరతుడిట్లు పలికెను --- ప్రసిద్ధమైన ఈ వర్తకుల దళము భగవానుని మాయకు లోబడి అడవి మార్గములో ప్రవేశించినది. ఈ గుంపు యొక్క దృష్టి సాత్త్విక రాజస తామసములనే విభాగము గల కర్మల యందు లగ్నమై యున్నది. ధనసంపాదనయే ఈ దళములోని వారల ప్రధానలక్ష్యము. ఈ విధముగా సంసారమనే అడవిలో అంతటా తిరుగాడు చున్న ఈ దళమునకు సుఖము లభించుట లేదు.

ఓ మహారాజా! ఈ వర్తకుల దళముయొక్క నాయకుడు దుష్టుడు. ఆ అడవిలో ఆర్గురు దోపిడీగాండ్రు గలరు. వారు ఆ దళమును బలాత్కారముగా దోచెదరు. అక్కడ నక్కలు ఆదమరచియున్న వర్తకుని మీదపడి, తోడేళ్లు పొట్టేలును వలే, ఇటునటు లాగును.

ఆ అడవి దట్టని తీగలు, గడ్డిదుబ్బులు, పొదలతో చోర శక్యము కాకుండనుండును. దానితో ఆ వర్తకుల దళమును గట్టి పోటు గల దోమలు, అడవి యీగలు పీడించుచుండును. వారికి ఒకచోట గంధర్వుల నగరము కానరాగా, మరియొకచోట అధికవేగము గల కొరివి దెయ్యము కనబడును.

ఓ రాజా! ఆ అడవిలో ఆ వర్తకులు నివాసము, నీరు, ధనముల యందు ఇవి నావి అనే బుద్ధి గలవారై అక్కడక్కడ పరుగులెత్తెదరు. ఒక చోట సుడిగాలి లేచి దిక్కులను బూడిదతో నింపి వేయగా, ఆ దుమ్ముతో కళ్లు నిండి, వారు దిక్కు తోచక యుందురు.

కంటికి కానరాని ఈలపురుగుల ధ్వనిచే చెవియందు పోటు గల ఆ గుంపులోని వర్తకుడు గుడ్లగూబల కూతలకు మనస్సులో చాల భయపడును. ఆకలిచే పీడించబడే ఆతడు పాపపు చెట్లను ఆశ్రయించును. ఒకచోట ఆతడు ఎండమావుల వెంట పరుగులు తీయును.

ఆ దళము ఒకప్పుడు నీరు లేని నదుల వైపు పయనించును. ఆ గుంపులోని వారలకు ఆహారము దొరకని సందర్భములలో తమ వారలకు ఆహారము లభించవలేనని వారు కోరుచుందురు. వారికి దారిలో ఒకప్పుడు కార్చిచ్చుయొక్క వేడిచే దుఃఖము కలుగును. మరియొక చోట యక్షులు ప్రాణములతో సమానమైన ధనమును అపహరించగా, వారు చాల దుఃఖం చెదరు.

తన సొత్తును ఒకచోట బలవంతులగు కొందరు అపహరించగా, ఆ వర్తకుడు నిరాశతో నిండిన హృదయము గలవాడై శోకించును. ఆతడు వ్యామోహితుడై, మూర్చను పొందును. మరియొకచోట ఆతడు గంధర్వుల నగరములో ప్రవేశించి, కొంత సేపు సుఖమును పొందినవాడు వలె చాల ఆనందించును.

ఆ వర్తకుడు ఒకచోట పర్వతమునెక్కగోరి నడచుచుండగా, ముళ్లు చిన్న రాళ్లు ఆతని పాదములకు నొప్పిని కలిగించుచుండును. ఈ విధ ముగా చెడిన మనస్సు గలవాడై నడచుచుండగా, ప్రతి అడుగులో ప్రతి క్షణము ఆకలి బాధ అధికమగుచుండును. ఈ విధముగా పీడను పొంది కుటుంబమునందు మమకారావిష్టుడై యున్న ఆ వర్తకుడు కుటుంబము లోని జనులపై కోపపడుచుండును.

ఒకచోట అడవిలో ఆతనిని అందరు విడిచి ముందుకు సాగిపోగా, ఈతనిని కొండచిలువ మ్రింగి వేయును. అపుడాతనికి దిక్కు తోచకుండును. మరియొకచోట ఆతనిని పాములు కరువగా, విషప్రభావముచే గ్రుడ్డివాడై, చీకటితో నిండియున్న గోతిలో పడి పెద్ద దుఃఖముననుభవించును.

ఒక సమయములో ఆతడు తేనె కొరకు వెదుకును. అప్పుడు తేనె పట్టుల ఈగలు కుట్టగా, ఆతడు మర్యాదను పోగొట్టుకొని, పీడను పొందు ను. ఒకచో చాల కష్టము మీద తేనెను పొంది మర్యాదను నిలబెట్టుకున్న నూ, దానిని ఇతరులు ఆతనివద్ద బలాత్కారముగా లాగుకొనెదరు.

ఆతడు కొన్ని స్థానములలో చలి, ఎండ, గాలి, వరములనుండి నివారించుకొనే సామర్థ్యము లేక యుండును. ఆతడు మరియొక సందర్భ ములో ఇతరులను ఏదో ఒక చిన్నవస్తువునకు సంబంధించిన లావాదేవీలయందు ధనము విషయములో మోసము చేసి, వారితో అధికమగు ద్వేష మును కొని తెచ్చుకొనును.

ఒకానొక సమయములో ఒక్కొక్కచోట ఆతనికి మంచము, కుర్చీ, మకాము చేయుటకు చోటు మరియు ప్రయాణసాధనము లభించవు. ఆతని వద్దనున్న సొమ్ము ఖర్చు అయినది, అపుడాతడు ఇతరునినుండి ధనమును యాచించును.కాని ఆతని కోరిక తీరదు. అపుడాతని చూపు ఇతరుల సొత్తు పై ఉండును. ఈ తీరున ఆతడు అవమానమును పొందును.

ఆతడు ఈ మార్గములో వెళ్తూ, ఇతరులతో ధనమును ఇచ్చి పుచ్చుకొనుచుండును. ఆ సందర్భములలో ఆతనియందు వారి యెడల వైరము అనే దోషము పెరుగుచుండును. అయిననూ, వివాహాది సంబంధ ములను వారితో కలుపుకొనుచుండును. ఈ తీరున ఆతడు పెద్ద కష్టముల ను, ధన పీడలను, విఘ్నములను పొంది ఆపదలలో పడి మరణించును.

ఓ వీరా! ఆ వర్తకుల దళము అక్కడక్కడ ఆయా సమయములలో మరణించినవారిని విడిచి పెట్టూ, పుట్టినవారిని స్వీకరిస్తూ వెళ్లుచుండిరి. ఆ గుంపు ఇంతవరకు తిరిగి రానే లేదు. ఆ అడవిలో ఎవడో ఒకడు మాత్రము దారియొక్క అంతమును చేరే ఉపాయమును కనుగొనినాడు.

ఈ లోకములో వైరమును విడనాడి హింసను విడిచి పెట్టిన వ్యక్తి పరమపదమును పొందును. కాని, అహంకార మమకారములు గల వ్యక్తులు వైరమును కట్టి గొప్ప దిగ్గజములను జయించినా, వారు ఆఖరుగా యుద్ధములో మరణించెదరు. కాని, వారు ఆ పరమపదమును పొందలేరు.

ఆ దళము ఒకచోట లతల కొమ్మలనాశ్రయించి, ఆ కొమ్మలనే ఆశ్రయించి ఉన్న పక్షుల అస్పష్టమగు కూతలయందు కోరిక గలదియై అచటనే ఆసక్తిని పెంచుకొని యుండును. మరియొకప్పుడు ఇంకోచోట ఆ దళము సింహముల గుంపునకు భయపడి, కొంగలు - రాపులుగులు మరియు గ్రద్దలతో స్నేహమును చేయును.

ఆ దళమును ఆ పక్షులు మోసగించగా, అది హంసల గుంపులో ప్రవేశించును. కాని, ఆ దళములోని వారలకు హంసల ఆచారవ్యవహార ములు నచ్చకపోవుటచే, వారు కోతులతో జతగట్టేదరు. ఆ కోతి జాతి స్వభావమును బట్టి వారు ఇంద్రియములకు భోగములచే తృప్తిని కలిగించే దరు. ఈ విధముగా వారు స్త్రీపురుషుల జంటలలో ఒకరినొకరు చూచు కుంటూ, తమ జీవితములకు అవధి ఉన్నదనే సంగతిని విస్మరించెదరు.

చెట్లయందు క్రీడించే ఆ వర్తకుడు పుత్రులయందు, భార్యయందు అధికమగు ప్రీతిని కలిగియుండును. సంభోగమునందలి ఇచ్చచే దీనుడై యున్న ఆతడు తన బంధనమును తెంచుకొనుటకైననూ స్వాధీనత లేక యుండును. ఒకప్పుడు ఆతడు పొరపాటున పర్వతగుహలో పడిపోతూ, తీగను పట్టుకొని, అచటి ఏనుగునకు భయపడుతూ వ్రేలాడుచుండును.

శత్రువులను శాసించే ఓ రాజా! ఈ ఆపదనుండి ఆతడు కష్టము మీద విముక్తుడై, మరల దళమును చేరుకొనును. ఆ మార్గమునందు భగ వానుని మాయచే ప్రవేశ పెట్టబడి తిరుగాడుతున్న జీవుడు ఒక్క డైననూ ఈ నాటికి కూడ దానినుండి బయట పడే ఉపాయము నెరుగడు.

ఓ రహూగణా! నీవు ప్రాణులకు పీడను కలిగించుటను మాని, ప్రాణులయందు ప్రేమను పెంచుకొనుము. భోగములయందలి ఆసక్తిని విడిచి, శ్రీహరిని సేవించుము. తద్ద్వారా జ్ఞానము అనే కత్తికి పదును పెట్టి, దానితో ఈ సంసారమార్గమును దాటివేసి, నీవు కూడ శ్రీహరిని చేరుము.

రహూగణుడిట్లు పలికెను --- ఆహా! మానవజన్మ సకలజన్మలలో మంగళకరమైనది. స్వర్గాదిలోకములయందలి ఇతరజన్మల వలన ప్రయోజనమేమున్నది? ఆ జన్మలలో మీవంటి మహాత్ములతోడి సమాగమము తరచుగా సిద్ధించదు గదా! మీ మనస్సు ఇంద్రియవ్యాపారములకు అధీశ్వరుడగు శ్రీహరియొక్క కీర్తియందు లగ్నమై యుండును.

నీ పాదపద్మముల ధూళిచే సాధకుల పాపములన్నియు నశించి, వారికి సకలప్రమాణములకు అందని శ్రీహరియందు నిష్కామభక్తి కలుగుటలో ఆశ్చర్యము లేనే లేదు. ఏలయనగా, నాకు కూడ మీతోడి గంట సేపు సమావేశము వలన అవివేకము తొలగిపోయినది. అవివేకమునకు మూలము చేడు తర్కమే.

పెద్దలకు, పిల్లలకు, యువకులకు, ఆటలాడుకునే బ్రహ్మచారులకు కూడ నమస్కారము. తిరస్కారయోగ్యమగు వేషముతో బ్రహ్మవేత్తలు భూమిపై సంచరించెదరు. వారి వలన రాజులకు మంగళము కలుగుగాక!

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ ఉత్తరాపుత్రా! బ్రహ్మర్షి పుత్రుడు, మహానుభావుడు అగు ఆ జడభరతుడు ఈ విధముగా, రహూగణునకు ఆత్మతత్త్వమునుపదేశించెను. ఆయన పరమకారుణికుడగుటచే తనను అవమానము చేసినవానికి జ్ఞానము నుపదేశించెను. రహూగణుడు దైన్యముతో ఆయన పాదములకు నమస్కరించెను. విషయములనుండి ఇంద్రియములు నివృత్తములగుటచే శాంతమైన అంతఃకరణము గల ఆయన పరిపూర్ణమగు సముద్రమువంటి వాడు. తరువాత ఆయన ఈ భూమిపై సంచరించెను.

అజ్ఞానముచే మానవులు దేహమే ఆత్మయనే భ్రాంతిని కలిగి యుందురు. సుజనుడగు జడభరతునిచే బోధించబడిన పరమాత్మతత్వము గల రహూగణుడు దేహమే ఆత్మయనే ధారణను విడిచి పెట్టెను. ఓ రాజా! భగవద్భక్తులనాశ్రయించిన వ్యక్తులకు ఇట్టి ప్రభావము ఉండును సుమా!

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! గొప్ప భగవద్బక్తుడవగు నీవు అన్నీ తెలిసినవాడవు. నీవు జీవసమూహము పయనించే సంసారమార్గమును పరోక్ష (విషయమును రూపకము చేసి దాచి పెట్టుట) పద్ధతిలో చెప్పినావు. ఈ రూపకములోని దృష్టాంతములు వివేకవంతుల బుద్దిచే కల్పించబడినవి. కావున, పరిపక్వమగు బుద్దిశక్తి లేని జనులకు ఈ రూపకదృష్టాంతములు తిన్నగా చక్కగా అవగాహనకు రావు. కావున, మీరు అవే విషయములను దృష్టాంతములు చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పుడు. ఆ విషయములను ఊహించుట సరళము కాదు.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో రహూగణ జడభరత సంవాదములో సంసారము అనే అడవిలో యాత్రను వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది (13).