1 - మన్వంతరముల వర్ణనము

రాజోవాచ

స్వాయంభువ స్యేహ గురో వంశోయం విస్తరాచ్ఛ్రుతః

యత్ర విశ్వసృజాం సర్గో మనూనన్యాన్ వదస్వ నః

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ గురుదేవా! ఈ సందర్భ ములో స్వాయంభువ మనువుయొక్క వంశమును గురించి, ప్రజాపతులు చేసిన సృష్టిని గురించి మీరు చెప్పగా నేను వినియుంటిని. ఇతర మనువు లను గురించి నాకు చెప్పుము.

యత్ర యత్ర హరేర్జన్మ కర్మాణి చ మహీయసః

గృణంతి కవయో బ్రహ్మంస్తాని నో వద శృణ్వతామ్

             ఓ మహాత్మా! ఏయే మన్వంతరములలో పురుషోత్తముడగు శ్రీహ రియొక్క అవతారములను, లీలలను మహాత్ములు వర్ణించినారో, వాటిని మాకు చెప్పడు. మేము శ్రద్ధగా వినెదము.

యద్యస్మిన్నంతరే బ్రహ్మన్ భగవాన్ విశ్వభావనః

కృతవాన్ కురుతే కర్తా హ్యతీతేనాగలేకద్య వా

             ఓ మహాత్మా! జగత్తును పాలించే శ్రీహరి భగవానుడు గడచిన మన్వంతరములో చేసిన లీలలను, రాబోయే మన్వంతరములో చేయబోవు లీలలను, ఈ మన్వంతరములో చేయుచున్నవాటిని మాకు చెప్పుము.

ఋషిరువాచ

మనవోస్మిన్ వ్యతీతాష్షట్ కల్పే స్వాయంభుపాదయః

ఆద్యస్తే కథతో యత్ర దేవాదీనాం చ సంభవః

శుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ కల్పములో స్వాయంభువుడు మొదలగు ఆర్గురు మనువులు గడచినారు. మొదటి మన్వంతరములో దేవతలు మొదలగువారి ఉత్పత్తిని గురించి నీకు చెప్పియుంటిని.

ఆకూత్యాం దేవహూత్యాం చ దుహీత్రోస్తస్య వై మనోః

ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్రతాం గతః

             అదే స్వాయంభువమనువునకు ఆకూతి, దేవహూతి అనే కుమా ర్తెలు ఉండిరి. వారియందు భగవానుడు పుత్రుడై జన్మించి, ధర్మమును జ్ఞానమును ఉపదేశించెను..

కృతం పురా భగవతః కపిలస్యానువర్జితమ్

ఆఖ్యా స్యే భగవాన్ యజ్ఞో యచ్చకార కురూద్వహ

             కురువంశ శ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! కపిల భగవానుడు చేసిన ఉపదేశమును నేనిదివరలో వర్ణించి చెప్పితిని. యజ్ఞ భగవానుడు చేసిన ఉపదేశమును గురించి చెప్పెదను.

విరక్తః కామభోగేషు శతరూపతిః ప్రభుః

విసృజ్య రాజ్యం తపసే సభార్యో వనమావిశత్

స్వాయంభువ మనువు ఇంద్రియభోగములయందు విరక్తిని చెంది, రాజ్యమును విడిచి, తన భార్యయగు శతరూపతో గూడి అడవికి వెళ్లెను. 

సునందాయాం వర్షశతం పదైకేన భువం స్పృశన్

తప్యమానస్తపో ఘోరమిదమన్వాహ భారత

భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆయన సునందా నదీ తీరమునందు ఒంటి కాలిపై నిలబడి వంద సంవత్సరములు కరమగు తపస్సును అనుష్ఠిస్తూ, ప్రతిదినము ఈ స్తోత్రమును జపించెను.

మనురువాచ

యేన చేతయతే విశ్వం విశ్వం చేతయతే న యమ్

యో జాగర్తి శయానేకస్మీన్నాయం తం వేద వేద సః

             స్వాయంభువ మనువు ఇట్లు పలికెను --- శుద్ధచైతన్యస్వరూపు డగు భగవానుని స్పర్శచే జగత్తు చేతనమగుచున్నది (సత్తా-స్పూర్తులను పొందుచున్నది). కాని, ఈ జగత్తు ఈశ్వరునకు చైతన్యమునిచ్చుట లేదు. ప్రళయములో ఈ జగత్తు (నిద్రలో ఈ దేహము) విలీనమైననూ, ఈ భగవా నుడు తెలివిగా యుండును. ఈ జగత్తు (దేహము) ఆయనను తెలియలే దు. కాని, ఆయన క్షేత్రజ్ఞరూపుడై ఈ దేహమును తెలియుచునే యుండును.

ఆత్మావాస్యమిదం విశ్వం యత్కించిజ్జగత్యాం జగత్

తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్దనమ్

పృథివియందలి చరాచరమగు ఈ సర్వము ఏది గలదో, అది ఆత్మచే కప్పివేయబడవలెను (సర్వము ఆత్మయేనని తెలియవలెను). అందుచేతనే, కామనలను త్యాగము చేసి సాధకుడు తన స్వరూపమును పాలించుకొనవలెను. పరధనమును గురించి తృష్ణను చేయకుము. ఈ ధన మెవ్వరిది? (ఎవ్వరిదైననూ కాదు).

యం న పశ్యతి పశ్యంతం చక్షుర్యస్య న రిష్యతి

 తం భూతనిలయం దేవం సుపర్ణముపధావత

చూసేది ఆత్మస్వరూపుడగు ఈశ్వరుడే. కాని, ఆయనను ఈ కన్ను చూడలేదు, మనస్సు తెలియలేదు. నిద్రలో మనస్సు, ఇంద్రియ ములు. విలీనమైననూ, ఆత్మయొక్క చూపు లోపించేది కాదు (ఆ స్థితికి కూడ సాక్షిగనే యుండును). సకలప్రాణులలో ఆ ఈశ్వరుడు ఆత్మ చైతన్యరూపుడై యున్నాడు. జీవుని సఖుడగు ఆ పరమాత్మను సేవించుడు (విచారముచే తెలుసుకొనుడు).

న యస్యాద్యంతౌ మధ్యం చ స్వః పరో నాంతరం బహిః

విశ్వస్యామూని యద్యస్మాద్విశ్వం చ తదృతం మహత్

పరబ్రహ్మకు ఆదిమధ్యాంతములు లేవు; తన-పరాయి గాని, లోపల-బయట గాని లేవు. జగత్తునకు ఆదిమధ్యాంతములు పరబ్రహ్మ వలననే కలుగుచున్నవి. జగత్తు పరబ్రహ్మరూపమే. ఆ పరబ్రహ్మయే సత్యము (జగత్తు మిథ్య).

స విశ్వకాయః పురుహూత ఈశః .

సత్యస్వయంజ్యోతిరజః పురాణః

ధత్తేవస్య జన్మాద్యజయాత్మశక్త్యా

తాం విద్యయోదస్య నిరీహ ఆస్తే

ఈ జగత్తు ఈశ్వరుని రూపమే. ఈ జగత్తులోని నామములన్నీ ఈశ్వరుని నామములే. అఖండసద్రూపుడు, స్వయంప్రకాశస్వరూపుడు, పుట్టుక లేనివాడు, జగత్తునకు కారణమైనవాడు అగు ఆ ఈశ్వరుడే ఈ జగ త్తుయొక్క సృష్టిస్థితిలయములను చేయుచున్నాడు. ఆయన తన విద్యాశక్తిచే మాయకు అతీతుడై నిషియుడై స్వస్వరూపమునందున్నాడు.

అథాగ్రే ఋషయః కర్మాణిహంతేకర్మ హేతవే

ఈహమానో హి పురుషః ప్రాయోనీహాం ప్రపద్యతే

             కావుననే, మహర్షులు అకర్తృ-ఆత్మస్వరూపముయొక్క జ్ఞాన మును పొంది జీవన్ముక్తులగుట కొరకై ముందుగా కర్మలను ఆచరించెదరు. ఎందుకంటే, కర్మలను చేయుచున్న వ్యక్తియే వాటిని భగవదర్పణము చేసి తరచుగా నైష్కర్మ్యసిద్ధిని బడయును.

ఈహతే భగవానీశో న హీ తత్ర విషజ్ఞతే

ఆత్మలాభన పూర్ణార్థో నావసీదంతి యేను తమ్

             సర్వేశ్వరుడగు భగవానుడు స్వరూపానుసంధానముచే పూర్ణమైన కామనలు గలవాడు. కావుననే, ఆయన సృష్టి మొదలగు కర్మలను చేసిన నూ, వాటిచే బంధించబడడు. ఎవరైతే ఆయనను అనుకరించి నిష్కామ ముగా కర్తృత్వాహంకారము లేకుండా కర్మలను చేసెదరో, వారు కర్మబంధ మునుండి విముక్తులగుదురు.

తమీహమానం నిరహంకృతం బుధం

నిరాశిషం పూర్ణమనన్యచోదితమ్

నౄన్ శిక్షయంతం నిజవర్త్మసంస్థితం

ప్రభుం ప్రపద్యేకఖిలధర్మభావనమ్

ఆ ప్రభుడు ప్రకృతిపురుషవివేకము కలవాడగుటచే సృష్టి మొద లైన కర్మలను చేయుచున్ననూ అహంకారము లేనివాడు. ఆయన పూర్ణ ఆత్మస్వరూపుడగుటచే కామనలు లేనివాడు. ఆయన రెండవది లేనివాడ గుటచే ఇతరముచే గాని, ఇతరులచే గాని ప్రేరితుడు కాని స్వతంత్రుడు. ఆయన తన స్వరూపమునందు నిలిచి సకలధర్మములను పాలించును. ఆయనను నేను శరణు వేడుచున్నాను.

శ్రీశుక ఉవాచ

ఇతి మంత్రోపనిషదం వ్యాహరంతం సమాహితమ్

దృష్ట్వాసురా యాతుధానా జగ్గుమభ్యద్రవన్ క్షుధా

             శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా మంత్రరూపము లోనున్న ఆత్మతత్త్వమును పఠిస్తూ ఏకాగ్రచిత్తుడైయున్న ఆ మనువును చూచి, అసురులు (భోగపరాయణులు), రాక్షసులు (క్రూరకర్ములు) ఆక లితో ఆయనను తినివేయుటకై మీదకు ఉరికిరి.

తాంస్తథావసీతాన్ వీక్ష్య యజ్ఞస్సర్వగతో హరిః

యామైః పరివృతో దేవైర్హత్వాకశాసత్త్రివిష్టపమ్

             ఆ విధముగా మనువును తినుటకు నిశ్చయించుకున్న ఆ రాక్షసు లను యజ్ఞుడు అనే రూపములోనున్న సర్వవ్యాపకుడగు శ్రీహరి చూచెను. ఆయన తన పుత్రులగు యాములు అనే దేవతలతో చుట్టుపొరబడి యున్న వాడై, ఆ రాక్షసులను సంహరించి తానే ఇంద్రుడై స్వర్గమును పాలించెను.

స్వారోచిషో ద్వితీయస్తు మనురగ్నేస్సుతోభవత్

ద్యుమత్సు షేణరోచిష్మత్ప్రముఖాస్తస్య చాత్మజాః

అగ్నిపుత్రుడగు స్వారోచిషుడు రెండవ మనువు - ఆయేను. ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు మొదలగువారు ఆయన పుత్రులు.

తత్రేంద్రో రోచనస్త్వాసీద్దేవాశ్చ తుషితాదయః

ఊర్జస్తంభాదయస్సప్త ఋషయో బ్రహ్మవాదినః

             ఆ మన్వంతరములో రోచనుడు ఇంద్రుడు. తుషితులు, పారావ తులు మొదలగువారు దేవతలు. ఊర్జస్తంభుడు, ఊర్జుడు మొదలగు బ్రహ్మవేత్తలు సప్తర్షులుగా నుండిరి.

ఋషేస్తు వేదశిరసస్తుషితా నామ పత్న్యభూత్

తస్యాం జజ్ఞే తతో దేవో విభురిత్యభివిశ్రుతః

వేదశిరసుడు అనే మహర్షికి తుషిత అని ప్రసిద్ధి గాంచిన భార్య ఉండెను. ఆయనకు ఆమెయందు భగవానుడు అవతరించి విభుడు అనే పేరుతో ప్రసిద్ధి గాంచెను.

అష్టాశీతిసహస్రాణి మునయో యే ధృతవ్రతాః

అన్వశిక్షన్ వ్రతం తస్య కౌమారబ్రహ్మచారిణః

             ఆ విభుడు బాల్యమునుండియు నైష్ఠిక బ్రహ్మచారిగనే ఉండెను. ఎనభై ఎనిమిది వేలమంది మహర్షులు ఆయననుండి ఆ బ్రహ్మచర్యవ్రత మును నేర్చుకొని పాటించిరి.

తృతీయ ఉత్తమో నామ ప్రియవ్రతసుతో మనుః

పవనస్సృంజయో యజ్ఞహోత్రాద్యాస్తత్సుతా నృప

            ఓ మహారాజా! ఉత్తముడని ప్రసిద్ధి గాంచిన ప్రియవ్రతుని పుత్రుడు మూడవ మనువు. పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు, ఊర్జుడు మొదలగువారలు ఆయన పుత్రులు.

వసిష్ఠతనయాస్సప్త ఋషయః ప్రమదాదయః

సత్యా వేదశ్రుతా భద్రా దేవా ఇంద్రస్తు సత్యజిత్

             వసిష్ఠుని పుత్రులగు ప్రమదుడు, ద్యుమంతుడు మొదలగువారలు ఆ మన్వంతరములోని సప్తర్షులు. సత్యులు, వేదశ్రుతులు, భద్రులు అను. వారలు దేవతలు కాగా, సత్యజిత్తు ఇంద్రుడాయెను.

ధర్మస్య సూనృతాయాం తు భగవాన్ పురుషోత్తమః

సత్య సేన ఇతి ఖ్యాతో జాతస్సత్యవ్రతైస్సహ

పురుషోత్తమ భగవానుడు ధర్మునకు సూనృతయందు జన్మించి సత్య సేనుడని ప్రసిద్ధి గాంచేను. ఆయనకు తోడుగా సత్యవ్రతులనే దేవగణము ఉండెను.

సోనృతవ్రతదుశ్శీలానసతో యక్షరాక్షసాన్

భూతద్రుహో భూతగణాంస్త్వవధీత్సత్యజిత్సఖః

             సత్యజిత్తు అనే ఇంద్రునకు మిత్రుడై ఆ సత్య సేనుడు దుష్టులగు యక్షులను, రాక్షసులను సంహరించెను. వారు అసత్యమునందు నిష్ట గల దుష్టస్వభావులు. అంతేగాక, ఆయన ప్రాణులకు ద్రోహమును చేసే భూత ముల గణములను కూడ సంహరించెను.

చతుర్థ ఉత్తమభ్రాతా మనుర్నామ్నా చ తామసః

పృథుః ఖ్యాతిర్నరః కేతురిత్యాద్యా దశ తత్సుతాః

             ఉత్తముని సోదరుడు తామసుడు అనే ఆయన నాల్గవ మనువు. ఆయనకు పృథువు, ఖ్యాతి, నరుడు, కేతువు, శాంతుడు మొదలగు పది మంది పుత్రులు గలరు.

సత్యకా హరయో వీరా దేవాస్త్రిశిఖ ఈశ్వరః

జ్యోతిర్ధామాదయస్సప్త ఋషయస్తామ స్వేంతరే

             తామస మన్వంతరములో సత్యకులు, హరులు, వీరులు అనువా రలు దేవతలు కాగా, త్రిశిఖుడు వారికి ప్రభువగు ఇంద్రుడు. జ్యోతిర్గాము డు, కావ్యుడు మొదలగువారు సప్తర్షులు.

దేవా వైధృతయో నామ విధృతేస్తనయా నృప

నష్టాః కాలేన యైర్వేదా విధృతా స్స్వేన తేజసా

             ఓ మహారాజా! ఆ తామస మన్వంతరములో వైధృతులని ప్రసిద్ధి గాంచిన దేవతలు కూడ గలరు. వారు విధృతి సంతానము. వారు కాలప్ర భావముచే లుప్తమైన వేదములను కాపాడినారు.

తత్రాపి జజ్ఞే భగవాన్ హరిణ్యాం హరిమేధసః

హరిరిత్యాహృతో యేన గజేంద్రో మోచితో గ్రహాత్

             ఆ మన్వంతరమునందే భగవానుడు హరిమేధసుడు-హరిణి అనే దంపతులకు పుత్రుడై జన్మించి, హరి అని పిలువబడినాడు. ఆయన గజేం ద్రుని మొసలి బారినుండి విడిపించెను.

రాజోవాచ

బాదరాయణ ఏతత్తే శ్రోతుమిచ్ఛామ హే వయమ్

హరిర్యథా గజపతిం గ్రాహగ్రస్తమమూముచత్

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- బాదరాయణ వ్యాసుని పుత్రు డవగు ఓ శుక మహర్షి! హరి మొసలికి చిక్కిన గజేంద్రుని ఏ విధముగా విడిపించెనో, మేము నీనుండి విన గోరుచున్నాము.

తత్కథాసు మహత్పుణ్యం ధన్యం స్వస్థ్యయనం శుభమ్

యత్ర యత్రోత్తమశ్లోకో భగవాన్ గీయతే హరిః

శ్రీహరి భగవానుని కీర్తి ఉత్తమమైనది. దానిని గానము చేసే గాథ సకలగాథలలో గొప్పది. పావనమైన శ్రీహరి గాథ సంపదలనిచ్చును. మంగళకరమగు అట్టి గాథ కల్యాణములకు నిధానము.

సూత ఉవాచ

పరీక్ష తైవం స తు బాదరాయణిః

ప్రాయోపవిష్టన కథాసు చోదితః

ఉవాచ విప్రాః ప్రతినంద్య పార్థివం

ముదా మునీనాం సదసి స్మ శృణ్వతామ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే మన్వంతర

వర్ణనం నామ ప్రథమోధ్యాయః

ఓ మహర్షులారా! ప్రాయోపవేశమును చేసియున్న పరీక్షిత్తు ఈ . విధముగా గాథలను చెప్పడని బాదరాయణ వ్యాసుని పుత్రుడగు శుక మహర్షిని ప్రేరేపించేను. అపుడాయన ఆ రాజును అభినందించి, సభలోని మహర్షులు ఆనందముతో వినుచుండగా ఆ గాథను చెప్పెను. 

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో మన్వంతరములను వర్ణించే మొదటి అధ్యాయము ముగిసినది (1) .