నారాయణ ఉవాచ- నారాయణ మహా ముని ఇట్లు పలికెను –
శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి హితవు పలికిన పిదప భార్గవరామునితో నీతిసారమైన హితవాక్యములనిట్లు పలికెను.
విష్ణురువాచ- శ్రీమహావిష్ణువు ఈ విధముగా అనెను –
ఓ భార్గవ రామా! గణపతియొక్క దంతమును భంగముచేసి నీవు అపరాధము చేసిన వాడవైతివి. అట్లే అమంగళ కార్యమును చేసినట్లైతివి.
శుక్ల యజుర్వేదము నందలి కాణ్వశాఖయందు గణపతి స్తోత్రము, దుర్గాస్తోత్రము కలదు. నేను నీకు వాటిని ఉపదేశింతును. ఆ స్తోత్రములచే గణపతిని, దుర్గాదేవిని స్తోత్రము చేయుము.
ఈ దుర్గాదేవి శ్రీకృష్ణునియొక్క పరాశక్తిరూపిణి. ఆతనియొక్క బుద్ధిరూపిణి. అందువలన ఆ దేవి కోపించినచో నీ బుద్ధియంతయు నాశనము కాగలదు. ఈ దేవి సర్వశక్తి స్వరూపిణి. ఈ దేవివలననే శ్రీ కృష్ణ పరమాత్మ సహితము శక్తిని పొందుచున్నాడు. ఈ దేవి లేకపోయినచో బ్రహ్మదేవుడు లోకసృష్టిని చేయజాలడు. అట్లే త్రిమూర్తులమగు మాకు ఈ దుర్గాదేవి తల్లియగుచున్నది. దేవతలందరు రాక్షసులచే పరాజితులైయున్న సమయమున ఆ దేవతల శక్తులన్నిటిని ఒకచోట కలిపినందువలన ఈ దుర్గాదేవి ఆవిర్భవించినది. ఈమె శ్రీ కృష్ణుని యొక్క ఆజ్ఞననుసరించి రాక్షసులందరిని సంహరించి దేవతలకు వారివారి పదవులనొసగినది. పూర్వము ఈదేవి దక్షప్రజాపతి చేసికొన్న తపః ఫలితముగా అతనికి కూతురై జన్మించినది. తరువాత శంకరుని వివాహము చేసికొని తన తండ్రి భర్తను నిందించెనను రోషముతో శరీరత్యాగము చేసినది. అటు పిమ్మట హిమవంతునకు పుత్రికగా జన్మనెత్తి గొప్ప తపస్సుచేసి యోగీంద్రులకు గురువైన శంకరునికి తిరిగి ధర్మపత్నియైనది. ఆమె చేసిన తపస్సునకు ఫలితముగా, శ్రీకృష్ణుని ఆరాధన చేసినందుకు ఫలితముగా శ్రీకృష్ణునియొక్క అంశస్వరూపుడైన గణపతి ఆమెకు పుత్రుడుగా లభించెను.
ఓ భార్గవరామా! నీవు ప్రతిదినము శ్రీకృష్ణుని ధ్యానించుకొనుచున్నావు. కాని శ్రీ కృష్ణాంశభూతుడైన గణపతిని గుర్తించకున్నావు. ఈ పార్వతీ తనయుడు అంశరూపముననున్న శ్రీకృష్ణపరమాత్మయే యని బ్రాహ్మణ బాలకుడు పరశురామునితో పలికెను.
ఓ భార్గవరామా! నీవు చేతులు జోడించుకొని తలవంచుకొని శివుని భార్యయగు దుర్గాదేవిని స్తుతింపుము. ఆ దేవి మంగళ రూపిణి, మంగళముల నొసగునది, శివునకు చెందినది, మంగళ కారిణి, శివునకు ప్రియురాలు. ఈ దుర్గా స్తోత్రమును పూర్వము త్రిపురాసురుల వధించునపుడు బ్రహ్మదేవుడు ప్రేరేపింపగా శంకరుడు చేసెను అని పలికెను.
శ్రీమహావిష్ణువు భార్గవరామునితోనిట్లు చెప్పి లక్ష్మీ నిలయమగు తన స్థానమును చేరుకొనెను.
శ్రీహరి వైకుంఠమునకు బోయిన తరువాత భార్గవరాముడు తన మనస్సులో శ్రీహరిని స్మరించి దుర్గాదేవిని గణేశుని స్తుతింపనారంభించెను.
విష్ణుదత్తమైన యాస్తోత్రములు సమస్త విఘ్నములను హరించునవి. ధర్మార్థ కామ మోక్షములను కల్గించును.
భార్గవరాముడు గంగానదీ జలములందు స్నానముచేసి గురువునకు, భక్తులననుగ్రహించు శ్రీహరికి నమస్కరించి ఉతికి యారవేసిన బట్టలను ధరించెను. ఆ తరువాత ఆచమనము చేసి భక్తితో నమస్కారము చేసి సమస్తావయవములు పులకించగా ఆనందాశ్రువులతో ఇట్లు స్తుతింపనారంభించెను.
పరశురామ ఉవాచ- పరశురాముడిట్లు దుర్గాదేవితో పలికెను –
సర్వపూర్ణుడైన శ్రీకృష్ణుడు గోలోకముననుండి సృష్టిచేయదలచినపుడు అతని శరీరమునుండి ఒక స్త్రీ జన్మించినది. ఆ దేవి కోటి సూర్యుల కాంతితో పరిశుద్ధమైన వస్త్రముతో అలంకారములతో ప్రకాశించుచుండెను. ఆమె నవయౌవనము కలది. ఆమె యొక్క సీమంతమున సిందూరము చక్కగా ప్రకాశించుచున్నది. ఆమె సిగలో మాలతీ పుష్పముల మాల శోభిల్లుచుండెను. ఆమె ఆకారము చాల అందముగా నుండెను. ఆ దేవి మోక్షమునభిలషించు భక్తులకు మోక్షమునిచ్చును. ఆమె స్వయముగా మహావిష్ణువునకు విధియగుచున్నది.
అట్టి సర్వమోహినివగు నిన్ను చూచినంతమాత్రముననే మహావిష్ణువు మోహ పరవశుడయ్యెను. ఆ సమయమున నీవు బాలురతో కలసి చిరునవ్వు చిందించుచు అక్కడినుండి ధావనము చేసితిని (పరుగెత్తితివి). అందువలన మూలప్రకృతి, ఈశ్వరివగు నిన్ను పెద్దలు రాధ అని పిలిచిరి.
శ్రీ కృష్ణుడు భయముతో రాధయందు తన వీర్యమును ఉంచెను. అందువలన మహాడంభము ఉద్భవించగా ఆ మహాడంభము నుండి మహా విరాట్పుషుడుద్భవించెను. ఆ మహా విరాట్పురుషుని యొక్క రోమ కూపములందు ఈ బ్రహ్మాండములన్నియు ఇమిడియున్నవి. శ్రీకృష్ణుడు రాధతో రతిచేయునప్పుడు వెల్వడిన అతని నిశ్వాసము మహావాయువైనది. ఆ మహావాయువే జగత్తునకంతయు ఆధారమైనది. అట్లే అతని చెమటనీటిలో ఈ విశ్వమంతయు మునిగిపోయినది. ఆ నీరే జలరాశిగా మారినది.
నీవు ఐదు విధములగు రూపములను ధరించి ఐదుపేర్లతో విలసిల్లుచున్నావు. అవి రాధ, సావిత్రి, లక్ష్మి, సరస్వతి, దుర్గ అనునవి.
వీరిలో శ్రీకృష్ణపరమాత్మకు ప్రాణములకంటె మిన్నయైన ప్రియురాలు, అతని ప్రాణములకు అధిష్ఠాన దేవత రాధ. వేదములకు అధిష్ఠానదేవత వేదమాత, శాస్త్రములకు కూడ మాతృ స్వరూపిణియగు శుద్దరూపమును సావిత్రియని పిలుతురు. ఐశ్వర్యమునకు అధిష్ఠానదేవత, శాంతిస్వరూపిణియగు శుద్ధరూపమును లక్ష్మియని విద్వాంసులు పిలుతురు. అనురాగమునకు అధిష్టానదేవత, తెల్లని యాకారముగలిగి, విద్వాంసులకు మాతృమూర్తియగు రూపమును సరస్వతియని పిలుచుచున్నారు.
బుద్ధికి, విద్యకు, సమస్త శక్తులకు అధిదేవత, సమస్త మంగళ స్వరూపిణి, సర్వమంగళ మాంగళ్య, సమస్త మంగళములకు కారణభూతుడగు శివునియొద్ద ఉన్న నీవు దుర్గగా కీర్తింపబడుచున్నావు.
నీవు శివునియొద్దనున్నావు. లక్ష్మీదేవి నారాయణుని దగ్గర ఉన్నది. వేదమాతయగు సావిత్రి బ్రహ్మదేవునకు భార్యగానున్నది.
దేవతాస్త్రీలందరు నీ అంశవలన, అంశాంశలవలన, అంశాంశాంశలవలన జన్మించినవారే అని దుర్గాదేవిని స్తుతించెను.
ఓ దుర్గాదేవీ! నీవే విద్యవు. నీవే ఈ ప్రపంచమందలి స్త్రీ రూపిణివి. అందరకు నీవే మాతృమూర్తివి.
దేవేంద్రుని శచీదేవి, మన్మథుని రతీదేవి, జలేశుడగు వరుణుని వరుణానీ, వాయువు భార్య, అగ్నిదేవుని స్వాహాదేవి, కుబేరుని ధర్మపత్ని, యమధర్మరాజు యొక్క సుశీల, నిఋతియొక్క కైటభి ఈశానుని శశికళ, మనువుయొక్క శతరూప, కర్దమ ప్రజాపతి దేవహూతి, వసిష్ఠుని అరుంధతీదేవి, అగస్త్యమహాముని లోపాముద్ర, గౌతమ మహర్షి అహల్య, దేవమాతయగు అదితి, సమస్త ప్రాణికోటికి ఆధారభూతయగు ఈ భూమి, గంగ, తులసి, ఇంకను భూమి పైనున్న ఇతర నదీనదములు, ఇవన్నియు నీయొక్క అంశరూపములే.
అదేవిధముగా మానవుల ఇండ్లలోనుండు గృహలక్ష్మి, రాజులయొక్క ఇండ్లలోనుండు రాజలక్ష్మి, తపస్వుల తపస్సు, బ్రాహ్మణుని గాయత్రి, ఇవి అన్నియు నీ రూపములే.
అట్లే సజ్జనులకు సత్యస్వరూపగా, దుర్మార్గులకు కలహకారణముగా, నిర్గుణ పరమాత్మకు జ్యోతిస్వరూపగా, సగుణరూప పరమాత్మకు శక్తిగా, సూర్యునిలో కాంతిగా, అగ్నిలో దాహికాశక్తిగా, నీటిలో శైత్యస్వరూపగా చంద్రునిలో శోభగా, భూమియందు గంధరూపముతో, ఆకాశమున శబ్దరూపముతో నీవున్నావు. ఇంకను ఆకలి దప్పులు మొదలగునవి ప్రాణులకుగల సమస్త శక్తులు, నీ రూపములే.
నీవు అన్నిటికి కారణభూతవు. సంసారమున సారరూపిణివి. స్మృతి, మేధ, బుద్ధి, జ్ఞానము, అన్ని కూడ నీ స్వరూపములే. సమస్త జ్ఞానములనొసగు విద్యను శ్రీ కృష్ణుడు శంకరునకొసగెను. ఆ జ్ఞానము వలననే శంకరుడు మృత్యుంజయుడు కాగలిగెను.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులగు సృష్టి, పాలనము, సంహారము అను మూడు శక్తులును నీ స్వరూపములే. అట్టి నిన్ను నేను నమస్కరింతునని భార్గవరాముడు పలికెను.
మధుకైటభ రాక్షసుల భయముతో వణికిపోవుచున్న బ్రహ్మదేవుడు నిన్ను స్తుతించి భయమునకు దూరమయ్యెను.
మధుకైటభ రాక్షసులతో లోకపాలకుడగు విష్ణుమూర్తి యుద్ధము చేయునపుడు పరమేశ్వరివగు నిన్ను స్తుతించి శక్తిని సంపాదించుకొనెను.
త్రిపురాసురులతో యుద్ధము చేయునపుడు శంకరుడు తన రథముతో భూమిపై పడిపోయిన సమయమున దేవతలందరు తమ భయము తొలగిపోవుటకు నిన్ను స్తుతించిరి. ఆ సమయమున విష్ణుమూర్తి వృషభరూపమున శంకరుని లేవనెత్తగా అతడు నిన్ను స్తుతించి త్రిపురాసురులను సంహరించెను.
నీయొక్క ఆజ్ఞననుసరించి గాలివీచును. సూర్యుడు ఎండకాయును, ఇంద్రుడు వర్షించును. అగ్ని దహించును. అట్లే నీ ఆజ్ఞవలన కాలము వేగముగా తిరుగుచున్నది. ప్రాణులకు మృత్యువు కలుగుచున్నది. సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు విశ్వసృష్టి చేయగలుగుచున్నాడు. సృష్టిరక్షకుడగు విష్ణుమూర్తి నీ యాజ్ఞవలననే లోకమును రక్షింపగలుగుచున్నాడు. సృష్టి సంహర్తయగు శంకరుడు విశ్వసంహారము చేయలుగుచున్నాడు.
నిర్గుణుడగు శ్రీ కృష్ణ భాగవానుడు జ్యోతిస్వరూపుడు. అట్టి భగవంతుడు సహితము నీవులేక సృష్టికార్యము చేయలేకపోవుచున్నాడు. అంతటి మహిమ గల నీకు అనేక నమస్కారములు చేయుదును.
ఓ జగన్మాతా! నన్ను రక్షింపుము. నాయొక్క తప్పులనన్నిటిని క్షమింపుము. శిశువులు తప్పు చేసినచో తల్లి ఎక్కడైనను కోపించునా? అందువలన నన్ను క్షమింపుమని భార్గవరాముడు దుర్గాదేవిని స్తుతించెను.
ఈ విధముగా పరశురాముడు దుర్గాదేవిని స్తుతించి నమస్కరించి ఏడ్వసాగెను. అందువలన దుర్గాదేవి సంతోషించి భార్గవ రామునకు ఆశీస్సులను వరమును ఇచ్చెను.
పుత్రా! నీకు మరణము కలుగక ఉండుగాక. సుస్థిరుడవై శోభిల్లుము. సమస్త దేవతల యొక్క అనుగ్రహము వలన నీకు అంతట జయము కలుగుగాక. అన్ని జీవులకు అంతరాత్మయగు శ్రీహరి నీ యెడ ఎల్లప్పుడు సంతుష్టుడగును. అట్లే నీకు మంగళప్రదుడైన శ్రీకృష్ణునిపై, గురువగు శంకరునిపై భక్తి కలుగుగాక. నీవు శ్రీకృష్ణ పరమాత్మయొక్క భక్తుడవు. అట్లే శంకరుని శిష్యుడవు. ఇష్టదేవతయందు గురువునందెల్లప్పుడు భక్తి యున్న వానిని సమస్త దేవతలు కోపగించినను ఏమియు చేయలేరు. అట్లే గురుపత్నిని స్తుతించు నిన్ను ఎవ్వరు ఏమియు చేయలేరు. శ్రీకృష్ణుని భక్తులకెన్నడును అశుభము జరుగదు.
ఇతర దేవతా భక్తులు, దేవతలను భక్తితో సేవింపక నిరంకుశులుగా నుండువారు సహితము శ్రీకృష్ణుని భక్తితో సేవించినచో అన్య దేవతలు కోపముతో అతనిని ఏమియు చేయలేరు. ఎట్లనగా బలవంతుడగు చంద్రుడు సంతోషపడినచో దుర్బలమైన తారాగణము కోపించినను అతనిని ఏమియు చేయలేదు కదా! అట్లే గొప్పవాడగు రాజు సంతుష్టుడైనచో దుర్బలురైన అతని భృత్యులు కోపించినను ప్రయోజనముండదు కదా! అట్లే అభీష్టదేవుడగు శ్రీకృష్ణుడు సంతోషించినచో దుర్బలురైన అన్యదేవతలు కోపపడినను ప్రయోజనముండదు.
పార్వతీదేవి భార్గవరామునితో పై విధముగా పలికి సంతోషముతో అతనికి ఆశీస్సులనొసగెను. తరువాత ఆదేవి తన అంతఃపుర మందిరమును ప్రవేశించెను.
ఈ దుర్గాస్తోత్రము కాణ్వశాఖ యందు కనిపించును. దీనిని ప్రతిదినము పూజాకాలమున చదివినను, ఇతర స్థలములకు వెళ్ళునప్పుడు ఉదయము చదివినను అతని వాంఛితములన్నియు సిద్దించును. ఈస్తోత్రమును భక్తితో చదివినచో పుత్రులు కావలెనని అనుకొన్నవానికి పుత్రులు, పుత్రిక కావలెనన్నచో పుత్రిక, విద్య కావలెనన్నచో విద్య లభించును.
రాజ్యభ్రష్టుడైన వానికి ఈస్తోత్రము యొక్క మహిమవలన రాజ్యము లభించును. ధనము పోయినచో ధనము లభించును. అభీష్టదేవత, గురువు, రాజులేనిచో బంధువులు కోపగించినను ఈస్తోత్ర రాజము యొక్క అనుగ్రహమువలన వారందరు సంతోషపడి కోరికలను తీర్చెదరు.
దొంగలు బందిపోట్లు చుట్టుముట్టినను, మహాసర్పము కరచినను, శత్రువులు మీద బడి రాజ్యమునాక్రమించినను, వ్యాధిగ్రస్తుడైనను, భక్తితో ఈస్తోత్రమును స్మరించినంతనే అన్నియు పటాపంచలగును. అట్లే రాజసన్నిధిలో, శ్మశానమందు, కారాగారమున, నీటిలో నిమగ్నుడైనప్పుడు ఈ స్తోత్రమును స్మరించినంతమాత్రమున విజయము లభించును. అదేవిధముగా ఒక సంవత్సరము దుర్గాదేవికి పూజనుచేసి ఈ స్తోత్రమును విన్నచో మహావంధ్య సహితము సంతానమును పొందగలదు. ఆ పుత్రుడు మహాజ్ఞాని చిరకాల జీవియగును.
ఆరు మాసములు దుర్గాదేవిని పూజించుచు ఈస్తోత్రమును విన్నచో సౌభాగ్యము లభించును. తొమ్మిది నెలలు ఈస్తోత్రమును భక్తితో విన్నచో సంతానము పోవుచున్న స్త్రీ సహితము సంతానమును పొందును. అట్లే ఐదు నెలలు ఈస్తోత్రమును భక్తితో చదివినచో పుత్ర సంతానము తప్పక లభించునని దుర్గాదేవి పలికెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండము నారద నారాయణుల సంవాదమున తెల్పబడిన పరశురాముడు చేసిన దుర్గాస్తోత్రము కల నలుబది ఐదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 45 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
This soul-nourishing chapter outlines the boundless spiritual merits, material benefits, and purifying potency earned by studying, reciting, or listening to the sacred discourses of the Gaṇesha Khaṇḍa. Śrī Sūta Gosvāmī declared that a householder who listens to this holy scripture overcomes all family discord, financial distress, fear of premature death, and childlessness, attaining righteous children, long life, and prosperity. For the renounced spiritual seeker, reading this Khaṇḍa grants profound dispassion, intellectual clarity, eradication of all karmic debts, and pure, unalloyed Bhakti at the lotus feet of Lord Śrī Kṛshṇa.