నారాయణ ఉవాచ- నారాయణ ముని ఇట్లు పలికెను
బ్రహ్మదేవుని మాటలు విని పరశురాముడు అతనికి నమస్కరించి అతనిచే వరమును బడసి శివలోకమునకు పోయెను.
ఆ శివలోకము బ్రహ్మలోకమున కంటె లక్షయోజనముల ఎత్తున నున్నది. అది బ్రహ్మలోకమున కంటే విలక్షణమైనది. మంచి శోభకలిగి వాయువే ఆధారముగా నున్నది. ఆలోకమునకు కుడివైపు వైకుంఠము ఎడమవైపు గౌరీలోకమున్నది. దానికి క్రింద సమస్త లోకములపై భాగమున నున్న ధ్రువలోకమున్నది. వైకుంఠము శివలోకము గౌరీలోకముల కంటే పైభాగమున యాభైకోట్ల యోజనముల వైశాల్యముగల గోలోకము కలదు. ఆలోకముపైన ఏలోకము లేదు. అందువలన ఆ లోకము లోకములన్నిటిపైన నున్నట్లు పెద్దలు చెప్పుదురు.
యోగీంద్రుడైన పరశురాముడు మనోవేగముతో శివలోకమునకు పోయెను. ఆ లోకమును పోలిన లోకమేదియు ప్రపంచమున లేదు. అచ్చట పరమయోగివరేణ్యులు సిద్దవిద్యావిశారదులు, కోటి కల్పములనుండి చేయుచున్న తవస్సు వలన పరమ పవిత్రులైనవారు, పరమ పుణ్యవంతులు కలరు. అచ్చట కోరికలనన్నిటిని తీర్చు కల్పవృక్షములనేకమున్నవి. అట్లే అనేక కామధేనువులు, పారిజాత వృక్షములున్న వనములు, ఇంకను అనేక ఉద్యానవనములు కలవు. అట్లే అనేక రాజమార్గములున్న వనములు, ఇంకనూ అనేక ఉద్యానవనములు కలవు. అట్లే అనేక రాజమార్గములు కలవు. అచ్చట బాటసారులు విశ్రమించుటకై అక్కడక్కడ మణులచే నిర్మింపబడిన అరుగులున్నవి. అచ్చటి ఇండ్లన్నియు మణులచేతనే నిర్మింపబడినవి. ఆ ఇండ్లపైన చిత్ర విచిత్రములైన కలశములున్నవి.
అట్టి కైలాసము యొక్క మధ్య మణిరచితమైన కోటగోడలుగల ఆందమైన శంకరాలయమున్నది.
శంకరుని నివాసము చాల ఎత్తుగా ఆకాశమునంటుకొనుచున్నట్లున్నది. అందు పదునారు ప్రధాన ద్వారములు కలవు. నూరు గదులున్నవి. అది రత్నసోపానములతో, రత్నస్తంభములతో, రత్నద్వారములచే అలంకృతము. మాణిక్యముల మాలతో, మంచి రత్నములు గల కలశములతో, అందమైన చిత్రములతో అలంకరింపబడినది. ఆ ఆలయము ముందున్న సింహద్వారమున మంచి రత్నములున్నవి. ఆఇంటిముందు, లోపలను పద్మరాగములు, మరకతమణులతోనున్న వేదికలు కలవు. ఈవిధముగా శంకరుడుండు గృహము చాలా అందముగా వుండెను.
శంకరుని ఇంటిముందు మహాభయంకరులు, భయంకరమైన ముఖము పండ్లు కలవారు, ఎఱ్ఱని కండ్లు కలవారు, కాలిపోయిన పర్వతములవలె నల్లనివారు, మహాబలపరాక్రమములు కలవారు, విభూతి అలంకరింపబడిన అవయవములు కలవారు, పులితోలును ధరించినవారు, విశాలమైన కండ్లు కలవారు, జడలు ధరించినవారు, మూడు కన్నులు కలవారు, త్రిశూలము, పట్టిశమను ఆయుధముల ధరించినవారు బ్రహ్మతేజో విరాజితులైన ద్వార పాలకులుండిరి.
భార్గవరాముడు ఆ ద్వారపాలకులను చూచి మనస్సులో భయపడి ఇట్లు పలికెను.
మహాబలుడు పరాక్రమవంతులు, అధిక గర్వము కలవారగు ద్వారపాలకులకు వినయముతో తన వృత్తాంతము నంతయు నివేదించెను. అతని మాటలు విని ద్వారపాలకులు దయగలవారై అనుచరుని ద్వారా శంకరున కితని వృత్తాంతమును తెలిపి శంకరుని ఆజ్ఞ వడసి శంకరుని దగ్గరకు పంపించిరి. భార్గవరాముడు వారి అనుమతిని పొంది, మనస్సులో శ్రీహరిని స్మరించుకొనుచూ శంకరుని సన్నిధికేగెను.
చాలా అందమైనవి, అనేక చిత్ర విచిత్రితములైనవి, ద్వారపాలురుతోనున్న పదునారు ద్వారములనతడు ఆశ్చర్యముతో చూచెను. తరువాత నాభార్గవ రాముడు నానాసిద్ధ గణములు, మహర్షి గణములతో నిండినది, పారిజాత పుష్పముల వాసనతో నిండిన శంకరుని సభను ఆశర్యముతో చూచెను.
అచ్చట చంద్రశేఖరుడు, త్రిశూలము, పట్టిసము అను అయుధములు ధరించి యుండెను. వ్యాఘ్రచర్మమును ధరించెను. అతడు శరీరమునందంతట విభూతిని పూసికొని యుండెను. అతడు సర్ప యజ్ఞోపవీతమును ధరించెను. ఆ పరమశివుడు రత్నభూషణముల ధరించి రత్నసింహాసనముపై కూర్చొనియుండెను. అతడు మహాశివుడు, మంగళకరుడు, మంగళకారకుడు, మంగళములకు ఆశ్రయుడు, ఆత్మారాముడు కోరికలు లేనివాడు, కోటి సూర్యులవంటి కోంతి కలవాడు, చిరునవ్వు కలిగి భక్తుల నెల్లప్పుడు అనుగ్రహించుచుండువాడు, జ్యోతిస్వరూపుడు, లోకములననుగ్రహించుటకై శరీరమును ధరించినవాడు. జటాధారి, పార్వతీదేవీ సమన్వితుడు. తపఃఫలితముల నొసగువాడు. సమస్తసంపదలు కలిగించువాడు. శుద్ధమైన స్ఫటికమువంటి కాంతి కలవాడు, ఐదుముఖములు కలవాడు. మూడు కన్నులు కలవాడు. ఆ పరమశివుడు తన శిష్యులకు తత్త్వముద్రను ధరించి పరబ్రహ్మను గురించి ఉపదేశించుచుండెను. అతనిని యోగీంద్రులు, సిద్ధేంద్రులు స్తుతింపుచుండగా అనుచరగణము తెల్లని చామరములతో సేవింపుచుండిరి. అతడు పరిపూర్ణుడైన పరబ్రహ్మను ధ్యానించుచుండెను. స్వేచ్చామయుడు, గుణాతీతుడు, జరామృత్యువులను పోగొట్టువాడు, జ్యోతిరూపుడు, సర్వాద్యుడు, ప్రకృతికి అతీతుడైన శ్రీకృష్ణుని ధ్యానింపుచు పులకాంకిత శరీరుడై కన్నీళ్ళు కారుచుండగా అతని గుణవై భవమును కీర్తించు చుండెను. ఆ పరమేశ్వరుని వద్ద భూత, రుద్ర, క్షేత్రపాల గణముండెను. అతనికి ఎడమవైపు కార్తికేయుడు, కుడివైపు గణపతి, ఎదురుగా నంది, వీరభద్రుడుండిరి. అట్టి పరమశివుని పరశురాముడు చూచి భక్తితో ప్రణమిల్లి కన్నీళ్ళు రాలగా గద్గదస్వరముతో చేతులు జోడించుకొని దీనుడై ఇట్లు స్తుతింపసాగెను.
పరశురామ ఉవాచ- భార్గవ రాముడిట్లనెను –
ఓ పరమేశ్వరా! నిన్ను స్తుతింపవలెనని అనుకొనుచున్నాను. కాని నేనే విధముగాను నిన్ను స్తుతింపజాలను. నాశనములేని వాడవు కోరికలు లేని నిన్ను ఏమని స్తుతింపగలను. ఏ పనీ చక్కగా చేయలేని మూడుడను దేవేశుడవగు నిన్నేమని స్తుతింపగలను. నిన్ను వేదములే వర్ణింపలేవనినచో మహేశ్వరుడవగు నిన్ను నేనేమని స్తుతింపగలను. నీవు వాక్కునకు, బుద్ధికి, మనస్సునకు తెలియరానంత దూరముగా నున్నావు. పరాత్పరుడవు, జ్ఞానమువల్ల మాత్రమే తెలియగలవు. సిద్ధులచే సేవితుడవు. నీవు ఆకాశమువలె ఆది మధ్యాంత రహితుడవు. అవ్యయుడవు. నీవు దురారాధ్యుడవు. దయకలవాడవు. దీనులకు బంధువైన నీవు నన్ను రక్షింపుము. భక్తులు స్వప్నములో సైతము చూడజాలని నిన్ను నాకండ్లచే నిన్ను చూచుచున్నందువలన నాజీవితము సఫలమైనది.
దేవతలందరు నీ అంశమువలన జన్మించినారు. ఈ చరాచర సృష్టి. యంతయు నీయొక్క అంశాంశవలన జన్మించినది. నీవు స్త్రీరూపుడవు, పుంరూపుడవు, నపుంసక స్వరూపుడవు. అన్నీ రూపములు నీవే. నీవు అందరకు ఆధారభూతుడవు. నీవు సూర్య, చంద్ర, అగ్ని, జల వాయు రూపుడవు. నీవు అనంతమైన ఈ విశ్వమును క్షణములో సంహరింపగలవు. నీవు కాలుడవు, కాలునకే కాలరూపుడవు, కాలమునకు కాల స్వరూపుడవు. కలికి కారణమైనవాడవు. నీవు జన్మ రహితుడవు. అట్టి నీకు నమస్కారము అని చెప్పి భార్గవ రాముడు ఆ పరమేశ్వరుని పాదములపై వ్రాలగా ఆ దేవదేవుడు ప్రసన్నుడై అతనికి ఆశీస్సులనొసగెను.
పరశురాముడు చేసిన ఈ పరమేశ్వర స్తోత్రమును భక్తితో పఠించినవారు సమస్త పాపములకు దూరమై శివలోకమును తప్పక పొందెదరు.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున తెల్పబడిన పరశురాముని కైలాసగమనమను ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 29 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
Standing over his father's body, Parashurāma took a solemn and terrifying vow in the presence of all the celestial deities, swearing to rid the entire earth of corrupt, demonic Kshatriyas twenty-one times, corresponding to the twenty-one strikes upon his mother's chest. Performing his father's funeral rites with deep grief and devotion, Parashurāma picked up his divine battle-axe, his heart hardened into an immovable rock of divine retribution. He resolved to wipe out every tyrannical ruler who used martial power to oppress sages, corrupt Dharma, and bring disorder to human society.