నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను –
గణపతి పరశురామునితో పలికిన పలుకులు వినికూడ భార్గవరాముడు చేతిలో గొడ్డలి ధరించి నిర్భయముగా శంకరుని అభ్యంతరమం దిరము లోనికి వెళ్ళసాగెను. అప్పుడు గణపతి వెంటనే లేచి పరశురాముని వెళ్ళకుండ అడ్డగించెను. ఐనను పరశురాముని ప్రేమతోనే చూచెను.
అప్పుడు భార్గవరాముడు హుంకరించుచు యుద్ధమునకు ప్రేరేపించుచు చేతులను త్రిప్పుచు వాగ్యుద్ధమును చేయనారంభించెను.
పరశురాముడు గణపతి పై తన గొడ్డలిని వేయబోగా కుమారస్వామి హాహాకారముచే యుచు పరశురాముని ఇట్లు ప్రబోధించెను.
ఓ సోదరా! అమోఘమైన అస్త్రమును గురుపుత్రుని పై ఎందుకు ప్రయోగించుచున్నావు, గురువు వలె గురు పుత్రుని చంపబూనుట మంచిదికాదు అని కుమారస్వామి పలికెను.
ఐనను కోపముతో ఎఱ్ఱనైన కండ్లతో గొడ్డలిని గణపతిపై ప్రయోగింప బోవు పరశురాముని గణపతి అడ్డగించి అతనిని వెనుకకు తిరుగుమని కోరెను. ఐనను పరశురాముడు కోపముతో గణపతిని కొట్టగా గణపతి వెంటనే క్రిందపడెను.
గణపతి వెంటనే లేచి ధర్మ దేవతను సాక్షిగా చేసి, కోపమును జయించినవాడు కావున అతడు పరశురాముని ప్రబోధింపసాగెను. ఓ భార్గవరామా! నీవు శంకరుని అంతః పురమునకు వెళ్ళకుండ వెనుదిరుగుము. ఈశ్వరుని ఆజ్ఞలేక అంతఃపురమునకు వెళ్ళుటకు నీ కెట్టి సామర్థ్యము కలదు? నీవు నాకు సోదరుని వంటి వాడవు. పైగా మా ఇంటికి వచ్చిన అతిథివి. ఈశ్వరునకు చాలా ప్రేమ గల శిష్యుడవు. అట్లే మన ఇద్దరి విద్యా గురువు ఒక్కడే యైనందువలన నీవు చేయు పనులను నేను సహింపవలసియున్నది.
ఓపరశురామా! నేను కార్తవీర్యుని వంటి వాడను కాను. అట్లే బలహీనులైన రాజుల వంటి వాడను కాను. నేను జగత్పతియగు శంకరుని పుత్రుడనను విషయము నీకు తెలియకున్నది. అందువలన ఓ బ్రాహ్మణాతిథీ ! నీవు ఈ యుద్దమును చేయక క్షణ కాలముండుము. ఈక్షణము గడిచిన పిమ్మట నీతో ఈశ్వరుని యొక్క సమీపమునకు నేను కూడ వత్తునని గణేశుడు పలికెను.
నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను –
గణపతియొక్క మాటలను విని పరశురాముడు నవ్వి శ్రీహరిని, శంకరుని నమస్కరించి తన గండ్ర గొడ్డలిని గణపతిపై ప్రయోగింపబూనెను. అప్పుడు గణపతి ధర్మదేవతను సాక్షిగా పెట్టి యోగ విద్య వలన తన తొండమును బాగుగాపెంచి దానిచే పరశురాముని పట్టుకొని చుట్టు ముట్టు త్రిప్పసాగెను. ఆ గణపతి తన తొండముచే పరశురాముని చిన్న పామును గరుత్మంతుడు ఒడిసి పట్టుకొని త్రిప్పనట్లు త్రిప్పుచు సప్త మహా ద్వీపములను, కుల పర్వతములను, మేరు పర్వతమును, సమస్త సముద్రములను భార్గవ రామునకు క్షణములో చూపించెను. అట్లే మితిమీరిన గర్వముతోనున్న భార్గవ రాముని అతని సమస్త అవయవములు కంపించునట్లు మరల అతనిని త్రిప్పసాగెను.
గణపతి భార్గవరాముని తన తొండముతో వొడిసిపట్టి అతనికి భూలోకమును, భువర్లోకమును, స్వర్లోకమును, జనోలోకమును, తపోలోకమును, ధ్రువలోకమును, అట్లే గౌరీలోకమును, శంకర లోకమును బ్రహ్మాండమును చూపించెను.
ఆ తరువాత ఏడు సముద్రములలోనున్న నీటిని త్రాగి మరల వమనము చేసెను. అట్టి సాగర జలములలో భార్గవరాముని పడవేసెను. సముద్ర జలములలో పడి కొట్టు మిట్టాడుచున్నప్పుడు అతనిని మరల ఒడిసిపట్టుకొని తన యోగమాయతో త్రిప్పుచు వైకుంఠమును చూపించెను. అచ్చట చతుర్భుజుడు, లక్ష్మీ సమేతుడైన నారాయణుడున్నాడు.
ఆటు పిమ్మట భార్గవరామునకు తన తొండమును పెంచి గోలోకమును, ఆలోకమందున్న విరజానదిని, బృందావనమును, శత శృంగ పర్వతమును, రాసమం డలమును చూపెను. ఆ గోలోకమున రెండు భుజములతో, చేతిలో మురళిని పట్టుకొని, రత్న భూషణాలంకృతుడై రత్న సింహాసనమున రాధాదేవి వక్షస్థలము పైనున్న శ్రీ కృష్ణ పరమాత్మను చూపెను.
సర్వపాపహరుడు ఇష్టదేవుడగు శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనము వలన భార్గవరాముడు చేసిన భ్రూణహత్యాది పాపములన్నియు నశించిపోయినవి. చేసిన పాపములు అనుభవించక తీరిపోవు. భార్గవరాముడు తాను చేసికొన్న పాపముల ఫలితమును కొంత అనుభవించెను. మిగిలిన పాపము శ్రీకృష్ణుని దర్శించినందువలన సంపూర్ణముగా నశించినది. అతడు క్షణకాలము చైతన్యము పొందగా వేగముగా అతనిని క్రింద పడవేసెను.
భార్గవ రాముడు తనయొక్క అభీష్ట దేవుడగు శ్రీకృష్ణుని, గురువగు శంకరుని స్మరించుకొనుచు తన గురువగు శంకరుడు తనకు ప్రసాదించిన శ్రీ కృష్ణ కవచమును శ్రీ కృష్ణ స్తోత్రమును చదువుచు అమోఘమైన తన గండ్ర గొడ్డలిని గణపతిపై ప్రయోగించెను. ఆ గండ్రగొడ్డలి ప్రభావమున శంకరుని వంటిది. గ్రీష్మ కాలమందలి మధ్యాహ్న సూర్యుల వంటి కాంతి గలది.
అమోఘమైన, తన తండ్రి యొక్క ఆ గొడ్డలిని గణపతి చూచి తన యొక్క ఎడమ దంతమునకు తగిలించి ఆ శస్త్రము వ్యర్థము కాకుండ చేసెను. ఆ గొడ్డలి వేగముగా గణపతి యొక్క ఎడమ ప్రక్కనున్న దంతమునకు తగిలి దానిని సమూలముగా పెకలించి శంకరుని మహిమవలన తిరిగి పరశురాముని చేతికి చేరెను. అప్పుడు అధికమైన భయముచే వీరభద్రుడు, కుమారస్వామి, ఇతర క్షేత్రపాలకులు, అనుచరులు మొదలగు దేవతలందరు హాహాకారములు చేసిరి. అప్పుడు గణపతి యొక్క దంతము రక్తముతో, గైరిక ధాతువుతోనున్న స్ఫటిక పర్వతమువలె పెద్ద చప్పుడు చేయుచు భూమిపై పడిపోయెను.
నారదా! గణపతియొక్క దంతము క్రిందపడినప్పుడు కలిగిన శబ్దము వలన భూమియంతయు భయముతో కంపించెను. కైలాస నగరమున ఉన్న జనులందరు భయముతో క్షణకాలము మూర్ఛనొందిరి. ఆ శబ్దమునకు జగత్ర్పభువగు శంకరునకు నిద్రా భంగమై పార్వతీదేవితో కలసి తన భవనము నుండి బయటకు వచ్చెను. అప్పుడాతనికి తన దంతము పోయినందువలన ఎఱ్ఱనైన ముఖముతో, కోపమును జయించిన వాడు కావున సిగ్గుతో తలవంచుకొనియున్న గణపతి కన్పించెను.
అప్పుడు పార్వతీదేవి అచ్చటనున్న కుమార స్వామిని ఏమి జరిగెనో వివరింపుమని కోరగా ఆ సుబ్రహ్మణ్య మూర్తి జరిగిన విషయమునంతయు ఆమూలాగ్రముగ వినిపించెను. అందువలన దుర్గాదేవికి భార్గవరా ముని పై కోపము కలిగినది. తన పుత్రుని దీనావస్థను చూచి దుఃఖించినది. ఆ దేవి తన పుత్రుడగు గణపతిని అక్కున చేర్చుకొని భక్తజ నుల యొక్క ఆర్తిని పోగొట్టు తన భర్తకు నమస్కరించి అతనితో ఇట్లు పలికెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున పేర్కొనబడిన గణపతియొక్క దంత భంగ కారణమను నలుబది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 43 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
Having received the highest spiritual initiation, divine Kavacha, and ultimate blessings from Lord Śrī Kṛshṇa, Lord Śiva, Goddess Pārvatī, and Lord Gaṇeśa, Parashurāma offered his final prostrate obeisances to the divine assembly on Mount Kailāsa. Taking leave of his spiritual preceptors, the great warrior sage retired to the quiet solitude of the Mahendra mountains to perform uninterrupted Tapas and meditation upon Lord Śrī Kṛshṇa. The text notes that Parashurāma resides there eternally as a Chiranjīvī or immortal sage, radiating spiritual light and maintaining peace across the subtle realms.