నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లు పలికెను –
జగన్నాయకుడైన శ్రీమహావిష్ణువు సంతోషముతో కార్తికేయునకు ఆశీస్సులనొసగి అతనిని రత్నసింహాసనముపై కూర్చుండబెట్టెను. తాళములు మొదలైన అనేక వాద్యములు, జంత్రములు మ్రోగుచుండగా అతనిని వేదమంత్ర ఘోషలమధ్య సమస్త పుణ్య తీర్థముల నుండి రత్నకలశములందు తీసికొని రాబడిన నీటిచే అతనిని అభిషేకము చేసెను.
అటు పిమ్మట కుమారస్వామికి మంచి రత్నముల కిరీటమును, అంగదములను, అమూల్య రత్నాభరణములను, పరిశుద్ధమైన వస్త్రములను, పాలసముద్రమున పుట్టిన కౌస్తుభమణిని, వనమాలను, చక్రమును సంతోషముతో నొసగెను.
కుమారస్వామిని పట్టాభిషేకము చేసిన తరువాత బ్రహ్మదేవుడు వేదములు సంధ్యా మంత్రమును, శ్రీకృష్ణ మంత్రమును, స్తోత్రమును, కవచమును, కమండలువును, బ్రహ్మాస్త్రమును, శత్రువులను సంహరించు విద్యను ఇచ్చెను, ధర్మదేవత ధర్మజ్ఞానమును, సర్వభూతదయను, పరమశివుడు మృత్యుంజయ జ్ఞానమును, సమస్త శాస్త్రములను అవగాహన చేయు శక్తిని, ఎల్లప్పుడు సుఖమైన తత్త్వజ్ఞానమును, యోగతత్త్వమును, సిద్ధి తత్త్వమును, బ్రహ్మజ్ఞానమును, శూలము, పినాకము, గొడ్డలి, శక్తి, శివ ధనుస్సును అస్త్ర ప్రయోగ విధిని, వాటి సంహారవిధిని ఇచ్చెను.
వరుణుడు తెల్లని ఛత్రమును రత్నములు గల మాలనిచ్చెను. చంద్రుడు మంచి ఏనుగను, మంచి గుఱ్ఱమును, అమృతకుంభమునిచ్చెను. సూర్యుడు మనోజవముగల రథమునీయగా యముడు యమదండమును, అగ్నిదేవుడు మహాశక్తినిచ్చేను. అట్లే ఇతరదేవతలు కూడ వివిధములైన అస్త్రములను, ఇతరకానుకలనిచ్చిరి.
మన్మథుడు కామ శాస్త్రజ్ఞానమునీయగా, క్షీరసముద్రము ఆమూల్యములైన రత్నములను, నూపురములను ఇచ్చెను. పార్వతీదేవి సంతోషముతో కార్తికేయునకు మహావిద్యను, మేధను, దయను, స్మృతిజ్ఞానమును, నిర్మలమైనబుద్ధినీ, శాంతిని, తుష్టిని, పుష్టిని, క్షమాభావమును, ధృతిని, శ్రీహరిభక్తిని శ్రీహరి దాస్యమునొసగెను. ప్రజాపతి రత్నాలంకారభూషిత, చక్కని వినయము కలది, మంచి నడవడికలది, సుందరి. అగు దేవసేనయను కన్యను వేద మంత్రముల నడుమ ఇచ్చి వివాహము చేసెను. ఆ దేవసేననే పండితులు మహాషష్ఠియని, శిశుపాలికయని పిలుతురు.
కుమారస్వామిని ఆభిషేకించిన పిదప దేవతందరు తమ తమ ఇండ్లకు పోయిరి. ఆట్లే మునులు గంధర్వులు జగదీశ్వరుడగు శివునికి నమస్కరించి తమ తమ నెలవులకు వెళ్ళిరి. శంకరుడు శ్రీహరినీ, బ్రహ్మను, ధర్మదేవతను స్తుతించి వారిలో శ్రీహరిని నమస్కరించి. సాగనంపెను. ధర్మదేవతను ఆలింగనము చేసికొని సాగనంపెను. అట్లే శంకరునిచే సమ్మానములనందుకొన్న పర్వతరాజగు హిమవంతుడు తన అనుచరులతో కలసి, తన ఇంటికి పోయెను. ఇంకను కుమారస్వామి యొక్క అభిషేక మహోత్సవమునకు వచ్చినవారందరు సంతోషముతో తమతమ స్థానములు చేరుకొనిరి.
మిక్కిలి ఆనందముతో తన భార్య పుత్రులతో కాలము గడుపుచున్న శంకరుడు కొంతకాలము తరువాత దేవతలనందరిని మరల పిలిపించి గణపతికి పుష్టియనెడు కన్యనిచ్చి వివాహము చేసెను.
పార్వతీదేవి తన పుత్రులతో కలసి సంతోషముతో అన్నీ కోరికలను తీర్చు తన భర్తను సేవించుచు కాలము గడపసాగెను.
ఓ నారదమునీ! నీకీవిధముగా కుమారస్వామియొక్క ఆభిషేక వృత్తాంతమును వివాహము మొదలగు విషయములను, గణపతియొక్క వివాహ వృత్తాంతమునంతయు తెలిపితిని. అట్లే పార్వతీదేవికి తనపుత్రుడగు కుమారస్వామి లభించిన విషయమును దేవతలందరు కైలాసపర్వతమున సమాగమమైన విషయమునంతయు వివరించితిని. ఇంకను నీవేదేని వృత్తాంతము వినదలచినచో నాకు తెలుపుమని నారాయణముని అనెను.
శ్రీబ్రహ్మావైవర్త మహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణ సంవాద సమయమున పేర్కొనబడిన కుమారస్వామి, గణపతుల వివాహము, కుమారస్వామియొక్క అభిషేక వృత్తాంతము గల పదునేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 17 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
Following the departure of Sage Jaratkāru, Goddess Manasā gave birth to a radiant son named Āstīka, who was raised in the hermitage of Maharshi Gautama and trained in the highest Vedic lore. Years later, when King Janamejaya organized a massive, fiery snake sacrifice to annihilate the entire serpent race in revenge for his father Parīkshit's death, the young sage Āstīka intervened with profound eloquence and Vedic reasoning. Pleased by the boy's unmatched wisdom and moral purity, King Janamejaya stopped the sacrifice, saving the remaining serpents from extinction. Goddess Manasā and her son Āstīka were glorified across all worlds as the eternal protectors of the serpent race.