రేణుకోవాచ - రేణుకాదేవి ఇట్లు పలికెను –
ఓ భృగు మహర్షీ! నేను నాభర్తతో సహగమనము చేయుదును. నాభర్త నా ఋతు కాలము యొక్క నాల్గవ దినమున చనిపోయెను. కావున ఇప్పుడు నేనేమి చేయవలెనో తెలుపుము. నేను ఎన్నో జన్మలనుండి చేసికొన్న పుణ్యమువలన నా కర్తవ్యమును తెలుపుటకు నీవిచ్చటకు వచ్చితి వనెను. కావున నాసందేహమును తీర్పుమని ప్రార్థించెను.
భృగురువాచ - భృగుమహర్షి ఇట్లు పలికెను –
ఓ పతివ్రతా శిరోమణి పుణ్యము చేసికొన్న నీ భర్తను అనుగమింపుము. ఋతు కాలము నుండి నాల్గవ దినము భర్తకు సంబంధించిన సమస్త కర్మలయందును పరిశుద్దమైనదే కాని దేవతలకు పితరులకు సంబంధించిన కర్మలయందు నాల్గవదినము ప్రశస్తముకాదు. ఆ కర్మలయందు ఐదవదినమే పరిశుద్ధమైనది.
పాములవాడు సర్పములను బలవంతముగా పుట్టనుండి పైకితీసినట్లే పతివ్రతయగు స్త్రీ పరలోకగతుడగు తన భర్తను తీసి స్వర్గలోకమునకు చేరును. అచ్చట మన్వంతరకాలము తనభర్తతో కలసి సుఖముగా నుండును. అటుపిమ్మట శుభా శుభ కర్మ ఫలముల ననుభవించును.
భక్తి కలిగించువాడే పుత్రుడు. భర్తతో సహగమనముచేయునదే స్త్రీ. దానమిచ్చువాడే బంధువు, గురువును గొప్పగా గౌరవించువాడే శిష్యుడు. తన భక్తుని ఎల్లప్పుడు రక్షించువాడే ఆభీష్టదేవత. తన ప్రజలను చక్కగా రక్షించువాడే మహారాజు, చక్కని ధర్మమును, శ్రీహరిభక్తిని ఉపదేశించువాడే నిజమైన భర్త. ఇట్టివారినే వేదములు, పురాణములు ప్రశంసించుచున్నవి అని పలికెను.
రేణుకోవాచ - రేణుకాదేవి ఇట్లు పలికెను –
ఓ మహర్షీ స్త్రీలలో ఎవరు తన భర్తననుగమించి పోగలరు? ఎవరుపోలేరు అను విషయమును విపులముగా తెలుపుమనెను.
భృగురువాచ - భృగుమహర్షి రేణుకా దేవితో ఇట్లుపలికెను –
చంటి పిల్లలు గల స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, ముట్టు కాని వారు, రజస్వలయైన స్త్రీ, కులట, మిక్కిలి వ్యాధితో బాధపడుచున్న స్త్రీ, పతిసేవ చేయనిది, శ్రీహరిపై భక్తిలేనిది, కటువుగా మాట్లాడు స్త్రీ వీరందరు భర్తతో సహగమనము చేయుటకు తగనివారు. అట్లే మంత్రపూతమైన అగ్నిని ముందుంచి చితిపై పండబెట్టిన భర్తతో అనుగమనము చేసిన స్త్రీలు భర్తను ఊర్ధ్వలోకములందు పొందగలుగుదురు. వారు ప్రతి జన్మయందును భర్తతో కలిసి పుణ్యముననుభవింతురు.
ఓ మహాసాధ్వి! భర్తను అనుగమించు స్త్రీల విషయమిట్లు చెప్పబడినది.
ఓ పతివ్రతా! పుణ్యతీర్థములందు జ్ఞానముతో చనిపోయిన విష్ణుభక్తుల విషయమును నీకు వివరింతును.
పతివ్రతయగు స్త్రీ వైష్ణవుడగు భర్తను అనుగమించిపోయినచో ఆమె తనభర్తతో కలసి వైకుంఠమున శ్రీహరి సన్నిధికి పోవును. శ్రీకృష్ణుని తమ మనస్సులలో ధ్యానించు భక్తులు పుణ్య తీర్థములలో చనిపోయినను, ఇతరత్ర చనిపోయినను భేదమేమియు కనిపించదు. వారికి మహాప్రళయమున సహితము పునర్జన్మ ఉండదు. అందువలన పురుషుడైనను స్త్రీయైనను లక్ష్మీదేవిని, నారాయణుని సేవింపుచుండవలెను.
పుణ్యతీర్థములందు జ్ఞానవంతుడై చనిపోయినచో అతడు తనభార్యతో కలిసి శతబ్రహ్మలయొక్క కాలమువరకు వైకుంఠమున తప్పక నివసించును.
ఈవిధముగా భృగు మహర్షి రేణుకతో పలికి భార్గవరామునితో సమయోచితమైన మాటలను ఇట్లు పలికెను.
ఓ పరశురామా! నా దగ్గరకు రమ్ము. అమంగళకరమైన శోకమును వదలిపెట్టుము. దక్షిణ దిక్కునకు శిరసు పెట్టియున్న మీతండ్రి శిరస్సును కొద్దిగా లేపుము. అతనికి నూతన వస్త్రమును నూతన యజ్ఞోపవీతమును ధరింపజేయుము. కంటిలో నీళ్ళుపెట్టుకొనక దక్షిణ దిక్కునకు అభిముఖుడవై నిలబడి అరణిలో పుట్టిన అగ్నిని ధరించి భూమి పైనున్న తీర్థములనన్నిటిని స్మరించుకొనుము.
గయ మొదలగు పుణ్యతీర్థములు, పవిత్రమైన పర్వతములు, కురుక్షేత్రము, గంగ, యమున, కౌశికి, చంద్రభాగ, గండకీనది, కాశి, పనస, సరయూనది, పుష్పభద్ర, భద్ర, నర్మద, సరస్వతి, గోదావరి, కావేరీ, స్వర్ణరేఖ, పుష్కరక్షేత్రము, రైవతము, వరాహక్షేత్రము, శ్రీశైలము, గంధ మాదనము, హిమాలయ పర్వతము, కైలాసము, సుమేరువు, రత్నపర్వతము, వారణాసి, ప్రయాగ, బృందావనము, హరిద్వారము, బదరి మొదలగు పుణ్యక్షేత్రములను మాటిమాటికి స్మరింపవలయునని పలికెను.
చందనము, అగరు, కస్తూరీ, సువాసనగల పుష్పములను మృతుని శరీరము పైనుంచి నూతనవస్త్రముచే అతనిని కప్పి చితి పైన ఉంచవలెను. అతని కండ్లు, చెవులు, ముక్కురంధ్రములు నోటిలో బంగారుపుల్లతో తిప్పి నూవులతోనున్న రాగిపత్రమును, ఆవును, ఎండిని, దక్షిణతో సహా బంగారమును బ్రాహ్మణులకు దానముచేసి భయపడక మృతుని శరీరమునకు నిప్పంటించవలెను. ఆ సమయమున ఓంకారమును చదివి తెలిసి లేక తెలియక తప్పులు చేసినవాడును, మృత్యుకాలము ననుసరించి చనిపోయినవాడును, ధర్మా ధర్మ కార్యములు చేసినవాడును, లోభ మోహాది గుణములు కల ఈ చనిపోయిన మానవుని సమస్తా వయవములను అగ్నిదహించుగాక యను మంత్రమును చదువుచూ “ఓం అస్మత్కులేజాతోఽసి త్వదీయో । జాయతాం పునః ఆసౌస్వర్గాయ లోకాయ స్వాహా ॥” (నీవు నా కులమున జన్మించితివి. నీకు సంబంధించిన వాడు మరల పుట్టునుగాక! నీవు స్వర్గలోకమునకు పొమ్ము) అను మంత్రమును చదువుచు శ్రీహరిని స్మరించుచు చనిపోయిన నీతండ్రి శరీరమునకు నిప్పునంటింపుము.
ఓ భార్గవరాముడా! నీ అనుజులతో కలసి శిరఃప్రదేశమున అగ్నిని పెట్టుమని అనగా భృగుమహర్షి ఆజ్ఞననుసరించి తన సగోత్రీకులతో కలసి భార్గవరాముడు తనతండ్రికి అగ్నిసంస్కారమును చేసెను.
రేణుకాదేవి తనపుత్రుడగు భార్గవరాముని కౌగలించుకొని ఇట్లు పలికేను.
ఈ సంసార సాగరమున ఎవ్వరితోను విరోధము పెట్టుకొనక ఉండినచో అది సమస్తశుభములను కలిగించును. విరోధము పెట్టుకొనినచో అది సమస్తమైన ఉపద్రవములకు కారణమగును. అందువలన నామాటను విని దుర్మార్గులైన క్షత్రియులతో విరోధము పెట్టుకొనుట తగనిది. చక్కని ఆలోచనలు చెప్పు భృగుమహర్షితో, బ్రహ్మదేవునితో సంప్రదించి యథోచితముగ ప్రవర్తింపుము. మంచివారితో ఆలోచించి పనిచేయుట మిక్కిలి శుభమైనది. అని పలికి పుత్రుని వదలి భర్తను కౌగలించుకొని అతనినే చూచుచు శ్రీహరిని మనస్సులో స్మరించుకోవచు చితిపై పరుండెను.
భార్గవరాముడు తన అనుజులతో కలసి చితికి నిప్పంటించి తన తమ్ములతో తండ్రియొక్క శిష్యులతో కలసి దుఃఖించెను. రామ రామ రామ అనుచు రేణుకాదేవి భార్గవ రాముని ముందు భస్మమయ్యెను.
తమ నాయకుని పేరు విన్న శ్రీహరి యొక్క భృత్యులు అచ్చటకు వచ్చిరి. వారు నీలాంబుదశ్యాములు, చతుర్భుజములు కలవారు, శంఖము, చక్రము, గద, పద్మములమ ఆయుధములను ధరించియున్నారు. కిరీటము, కుండలములు, పీతాంబరములు ధరించి రథములపైయుండిరి. వారు రేణుకను, జమదగ్ని మహర్షిని రథముపై నెక్కించుకొని శ్రీ హరి సన్నిధికి తీసికొనిపోయిరి. ఆదంపతులు వైకుంఠమున శ్రీహరిసన్నిధిలో ఆపరమాత్మకు సేవచేయుచుండిరి.
భార్గవరాముడు, భృగుమహర్షి, బ్రాహ్మణులతో కలసి తన పితరులకు పితృకార్యమును నిర్వహించి, బ్రాహ్మణులకు గోవులు, భూమి, బంగారము, బట్టలు, అందమైన పరుపును, సువర్ణమును క్రిందపెట్టి జలమును, అన్నమును, చందనమును, రత్నదీపములను, వెండివస్తువులను, బంగారపు ఆసనము సువర్ణాధారముగ మంచివాసనగల తాంబూలమును, ఛత్రిని, పాదుకలను, ఫలములను, పుష్పమాలలను ఇంకను ధనమును దానము చేసి బ్రహ్మ లోకమునకు పోయెను.
బ్రహ్మలోకమున భవనములన్నియు బంగారముచే నిర్మింపబడినవి. ఆలోకముయొక్క కోటగోడలు, స్తంభములన్నీయు బంగారముచేతనే నిర్మింపబడినవి. అట్టి బ్రహ్మలోకమున బ్రహ్మదేవుడు బ్రహ్మతేజస్సుచే ప్రకాశించుచుండెను. అతడు రత్నాలంకారములచే అలంకృతుడై రత్నసింహాసనమున కూర్చొనియుండెను. అతనిని సమస్తసిద్ధులు, తపస్సులు, చాంద్రాయణాది వ్రతములు మునీంద్రులు పరివేష్టించియుండిరి. అతని సభలో గంధర్వులు గానము చేయుచుండగా అతడు విద్యాధర స్త్రీల యొక్క నృత్యమును దర్శించుచుండెను. ఆ బ్రహ్మదేవుడు చందనము, అగరు, కస్తూరీ, కుంకుమ మొదలగు సుగంధ ద్రవ్యములను అలంకరించుకొనియుండెను. అతడు సమస్త తపోఫలములనొసగువాడు, సమస్త సంపదలనిచ్చువాడు సమస్త జగత్సృష్టిచేయువాడు, పరమేశ్వరుడు. ఐనను పరబ్రహ్మస్వరూపుడగు శ్రీ కృష్ణ మంత్రమును ఎల్లప్పుడు జపించుచు తన శిష్యులకు అతిరహస్యమైన యోగమును గూర్చి చెప్పుచు వారి శంకలకు సమాధానము లిచ్చుచుండెను. అట్టి బ్రహ్మదేవుని పరశురాముడు చూచి బిగ్గరగా నేడ్చుచూ తన వృత్తాంతమునంతయు నివేదించెను.
భృగురువాచ- భృగువంశమున పుట్టిన పరశురాముడిట్లనెను –
ఓ బ్రహ్మదేవుడా! నేను నీవంశమునకు చెందినవాడు. జమదగ్ని మహర్షి పుత్రుడనగు పరశురాముడను. నీవు నాకు పితామహుడవు. సమస్తము తెలిసిన నీకు ప్రత్యేకముగా ఏమి చెప్పవలెను. ఐనను నా తండ్రియగు జమదగ్ని మహర్షి వేటకై వచ్చి తిండి తిప్పలు లేకయున్న కార్తవీర్యునకు కపిలయొక్క అనుగ్రహమువలన లభించిన వస్తువులతో అతనికి భోజనము పెట్టెను. కాని కార్తవీర్యుడు కామధేనువున కాశపడి నాతండ్రిని చంపెనని చెప్పుచు వెక్కి వెక్కి ఏడ్చెమ. పరశురాముడు తన కన్నీళ్ళమ బలవంతంముగా ఆపుకొని తిరిగి ఇట్లు పలికెను.
ఓజగద్గురూ! నాతల్లీ కూడ నన్ను వదలిపెట్టి నా తండ్రిని అనుగమించిపోయినది. అందువలన ఇప్పుడు నేను అనాథుడనైతిని. నీవే నాకు తల్లివి, తండ్రివి, గురువు, కర్తవు, రక్షకుడవు అన్నియు నీవే కావున నిమ్న శరణు పొందిన నన్ను రక్షింపుము. వేవిచ్చటకు నాతల్లి యొక్క ఆజ్ఞననుసరించి వచ్చితిని కావున నా శత్రువులను చంపు ఉపాయమును నాకు బోధింపుమనెను.
ధర్మము నాచరించువాడు, దయగలవాడు, కీర్తిమంతుడగువాడు మాత్రమే రాజవతగును. దీనుల పరిపాలించు రాజు మాత్రమే గౌరవింపదగినవాడు. ధనవంతులను, దీనులను సమానముగా పరిపాలింపకున్నచో ఆ రాజుయొక్క రాజ్యము నశించును. లక్ష్మీదేవి కూడా అతనిని వదలి వెళ్ళును.
బ్రాహ్మణవటువగు పరశురాముని మాటలు విన్న బ్రహ్మదేవుడు దయాసముద్రుడై అతనికి ఆశీస్సులనొసగి, కౌగిలించుకొనెను. పరశురాముడు చేసిన ఘోర ప్రతిజ్ఞమ విని బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోయి, ఆ ప్రతిజ్ఞ మహాభయంకరమైనదని, దానివలన చాలామంది చనిపోవుదురని భావించి సమస్తము కర్మ ననుసరించి పోవునని తలచి, పరశురామునితో హితము నిట్లు పలికెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను –
నాయనా! నీవు చేసిన ప్రతిజ్ఞవలన అధికజీవులు నశించును. అట్లే నీ ప్రతిజ్ఞ చాలా కష్టమైనది. ఈసృష్టిని నేను మిక్కిలి కష్టపడి పరమాత్మ ఆజ్ఞననుసరించి నిర్మించితిని. ఈ సృష్టిని నాశనము చేయు నీ ప్రతిజ్ఞ మిక్కిలి భయంకరమైనది. దయలేనిది. నీవు భూమియందు రాజులు లేకుండ ఇరువదియొక్క మార్లు తిరిగి నిఃక్షత్రియముగా చేయదలచితివి. ఒక క్షత్రియుడు చేసిన తప్పువలన నీవు ఆ జాతినంతయు నశింప చేయ దలచుచున్నావు. ఈ సృష్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను నాల్గుభేదములచే నిండియున్నది. ఆ శ్రీహరి సృష్టి కొన్ని నాళ్ళు కనిపించక మరికొన్ని నాళ్ళు కనిపించుచుండును.
ఇతరుల సహాయము వల్ల నీ ప్రతిజ్ఞ నెరవేరదు. అది మిక్కిలి యాయాసముచే మాత్రమే సిద్ధించును. అందువలన నీవు శివలోకమునకు వెళ్ళి శంకరుని శరణువేడుము. ఈ భూమిపైనున్న రాజులలో అనేకులు శివుని అనుచరులే. అతని అనుగ్రహము లేనిచో ఎవ్వరునూ వారిని సంహరింపలేరు. దుర్గ, శంకరులయొక్క కవచమును ధరించినవారికి శంకరుని అనుగ్రహము కలుగును. అందువలన నీ జయమునకు కారణమగు ఉపాయమును యత్నముతో నిర్వర్తింపుము. ఉపాయమువలననే సమస్త కార్యములు సిద్ధించుచున్నవి.
అందువలన నీవు శంకరుని అనుగ్రహము వలన శ్రీ కృష్ణ మంత్రమును కవచమును స్వీకరింపుము. దుర్లభమైన వైష్టవ తేజస్సును మించిన ఏ తేజస్చు ఈభూమిపై కనిపించదు. నీకు జగన్నాథుడైన పరమశివుడు ప్రతి జన్మయందున గురువుగా నున్నాడు. నీవు అతనినుండే శ్రీకృష్ణమంత్రము పొందుట మంచిది. నానుండి నీవు కృష్ణ మంత్రమును పొందుటతగనిది. కర్మననుసరించియే మంత్రము, గురువు అనువారు లభింతురు. నీవు త్రైలోక్య విజయమను శ్రీకృష్ణ కవచమున శంకరుని నుండి ఉపదేశముగా పొంది ఈభూమిపై రాజాలు లేకుండ ఇరువది యొక్క మార్లు తిరుగుదువు. ఆ శంకరుడు అనుగ్రహించి నీకు పాశుపత మంత్రమును కూడ ఇవ్వవచ్చును. ఆ మంత్రముయొక్క ప్రభావమువలన నీవు క్షత్రియుల నందరనూ జయింతువని చెప్పెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున పేర్కొనబడిన పరశురాముని బ్రహ్మలోక గమనము, బ్రహ్మదేవుడు చెప్పిన ఉపాయము గల ఇరవై ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 28 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
While Parashurāma was away from the hermitage, the revengeful sons of King Kārtavīryārjuna seized the opportunity to attack the defenseless forest ashram. Finding Sage Jamadagni deep in silent meditation, the cowards brutally murdered the peaceful sage, striking him twenty-one times with their swords before fleeing into the forest. Returning to find her husband dead in a pool of blood, Mother Reṇukā fell into agonizing grief, beating her chest twenty-one times and weeping bitterly. When Parashurāma returned and beheld his father's martyred body and his mother's agony, his heart burned with terrifying spiritual anger.