పరశురామ ఉవాచ - పరశురాముడు గణపతితో ఇట్లు పలుకసాగెను –
ఓ సోదరా! ఈశ్వరునకు, తల్లియగు పార్వతీదేవికి నమస్కరించుటకై శంకరుని అంతఃపురమునకు వెళ్ళుచున్నాను.
ఆ పరమేశ్వరుని అనుగ్రహమువలన ఈ భూమి పై నున్న క్షత్రియులనందరను ఇరువదియొక్కమార్లు తిరిగి సంహరించితిని. అట్లే కార్తవీర్యార్జునుని, సుచంద్రుని సంహరించితిని.
ఆ దేవదేవుని అనుగ్రహమువలన అనేకవిధములైన విద్యలు, అనేక శాస్త్రములను నేర్చుకొంటిని. జగన్నాథుడగు నా గురువును చూడవలెనని పోవుచున్నాను.
అతడు సగుణస్వరూపుడు, నిర్గుణస్వరూపుడు, భక్తులను అనుగ్రహించుటకై మూర్తిని ధరించినవాడు. సత్యస్వరూపుడు, పరబ్రహ్మరూపుడు, జ్యోతిస్వరూపుడు, సనాతనుడు, స్వేచ్చామయుడు, కరుణాసముద్రుడు, దీనబంధుడు, ఆత్మారాముడు, పూర్ణకాముడు, వ్యక్తావ్యక్తుడు, పరాత్పరుడు, పురాణరూపుడు, పరమాత్ముడు, ఈశ్వరుడు, ఆద్యంతరహితుడు, అవ్యయుడు, సమస్తమంగళములకు కారణభూతుడు, సమస్తశుభములను కలిగించువాడు, సమస్తైశ్వర్యములని చ్చువాడు, అల్పసంతోషి శరణు కోరిన వారి పై దయగలవాడు, భక్తులకు అభయమునిచ్చువాడు, భక్తులపై దయకలవాడు. అట్టి నా గురువును చూచుటకు పోవుచున్నావని పరశురాముడు పలికెను.
పరశురాముడీవిధముగా గణపతితో పలికి ఊరకుండెను. అప్పుడు గణనాథుడు మధురముగా ఇట్లు మాట్లాడసాగెను.
ఓసోదరా! క్షణకాలము ఆగుము. నామాటలను శ్రద్దగా వినుము, రహస్య స్థలము నందు భార్యతోనున్న పురుషుని చూడకూడదు. రహస్య స్థలము నందున్న స్త్రీ పురుషులను చూచి వారి కామకేళికి భంగము కలిగించిన దుష్టుడు కాల సూత్రమను నరకమునకు పోవును. అతడు ఆ నరకము నందు సూర్య చంద్రులున్నంత కాలముండును.
ఓ బ్రాహ్మణుడా! విజ్ఞానవంతుడు తండ్రిని, గురువును, రహస్యస్థలమున సురతమునందుండగా చూడకూడదు. ఉద్దేశ్యములేకుండనో, కోపముతోనో సురతమునందున్న పురుషుని చూచినచో అతడు ఏడు జన్మలలోను భార్యావిహీనుడగును. పరస్త్రీయొక్క పిరుదులను, వక్షస్థలమును, ముఖమును చూచిన పురుషుడు తప్పక అధోగతినిపొందును.
ఫైవిధముగా గణపతి పలికిన మాటలను విన్న పరశురాముడు అధికకోపముతో నిష్ఠురముగా వెక్కిరించుచు పలికెను.
పరశురామ ఉవాచ- పరశురాముడిట్లు పలికెను –
ఓ గణపతీ! నీవు మీక్కిలి గొప్పవైన నీతివాక్యములను పలుకుచున్నావు. ఇట్టి మాటలను నేనెప్పుడు నా గురువగు పరమేశ్వరుని నోట వినలేదు.
నీవు చెప్పిన విషయము మోహ వికారము గల కాముకులకు సంబంధించినది. మోహవికారము లేని శిశువునకు నీవు చెప్పిన దోషమంటదు. నేను పరమేశ్వరుని యొక్క అంతఃపురములోనికి పోవుచున్నాను. బాలకుడవగు నీకు దీనిని గురించిన మీమాంస అనవసరము. నేను సమయోచితముగా నాకు తెలిసినట్లు చేయుదును
పార్వతీప రమేశ్వరులు నీకే తల్లిదండ్రులని ఎచ్చట చెప్పలేదు. వారు ప్రపంచమునకంతయు తల్లిదండ్రులు. ఇంకను సర్వరూపుడగు పరమేశ్వరుడు, సర్వ రూపిణియగు పార్వతీదేవి స్త్రీ పురుషులని ఎచ్చటను నిరూపింపబడలేదు. అందువలన గుణాతీతుడైన ఆ పరమేశ్వరుడు క్రీడించుట, ఆ క్రీడ భంగమగుట అనునవి లేనేలేవు. రతిక్రీడయందు సిగ్గుపడుట, ఆ క్రీడకు భంగమగుట అనునవి సాధారణ మానవునకే కాని పరమేశ్వరునకు సంబంధించినవికావు. చంటి పిల్లవాడనగు నన్ను చూచి జగత్పతరులగు పార్వతీ పరమేశ్వరులెందుకు సిగ్గుపడెదరు?
ఓగణపతీ! సిగ్గుకు సిగ్గుఉండునా? అగ్ని తాపమును పొందునా? శీతము శైత్యమును, వేసవికాలము దప్పికను, భయము భయమును పొందునా? అట్లే మృత్యువునుండి మృత్యువు భయపడునా? జ్వరము జ్వరమును, వ్యాధి ఆవ్యాధిని పోగొట్టునా? సంహారము చేయు వానిని చూచి సంహార కారకుడు, కాల పురుషుని జూచి కాలపురుషుడు భయపడునా? నీ అభిమతముననుసరించి సృష్టికారకుడు సృష్టికారకుని సృష్టించునా? లోకరక్షకుడు తన్ను రక్షించుకోనునా? ఆకలి ఆకలిని, దప్పి దప్పికను, నిద్ర నిద్రను, శోభ శోభను, శాంతి శాంతిని, పుష్టి వుష్టిని, తుష్టి తుష్టిని, క్షమ క్షమను పొందునా?
కామము, క్రోధము, లోభము, మోహము అనునవి ఆత్మచే బాధింపబడవు. దయ దయాబద్ధము కాజాలదు. అట్లే ఇచ్చకూడ. చింత చింత్రాగ్రస్తము కాదు. కన్ను తన యొక్క ఇంకొక కన్నును చూడలేదు. హర్షమువలన సంతోషము కలుగునా? శోకము వలన శోకము, ఆపదవలన ఆపద, సంపద వలన సంపద, అనునవి ప్రత్యేకముగా ఏర్పడవు. అట్లే బుద్దికి ధారణాశక్తి, స్మతీకి స్మరించుగుణము, సూర్యునకు ఇతరులను దహించు గుణము స్వభావసిద్ధములు. కాని నీ ప్రవర్తన స్వభావ సిద్ధముగా లేదు. నీవు చెప్పిన విషయమును నాకు గురువు ఎన్నడును చెప్పలేదు. ఆట్లే ఏ గ్రంథమునను చూడలేదు అని పల్కెను.
పరశురాముడీ విధముగా నవ్వుచూ పలికి శంకరుని అంతఃపురములోనికి తొందరగా వెళ్ళబోయెను.
భార్గవరాముని పలుకులను విన్న గణపతి క్రోధము లేని వాడు, శుద్ధ సత్వ స్వరూపుడు కావున పరశురామునితో ఇట్లు పలికెను.
గణపతీ రువాచ- గణపతి ఇట్లు పలికెను –
ఓ పరశురామా! జ్ఞానము కల తండ్రి వలన లేక సోదరుని వలన అదృష్టము కల అజ్ఞాని జ్ఞానమును పొందును. నీవు జ్ఞానులకు సహితము లభించని విశిష్టజ్ఞానమును పొందినట్లు విన్నాను. ఐనను తెలివి తక్కువ గల నాయొక్క విన్నపమును సహితము కొంత వినుమని వేడుకొనెను.
నిర్గుణుడగు పరబ్రహ్మ నిర్లిప్తుడుగానుండును. అతనికి శక్తి యొక్క తోడ్పాటు అక్కరలేదు. కానీ ఆ నిర్గుణ పరబ్రహ్మమే జగత్తును సృష్టించుటకై శక్తితో కలసి సగుణుడుగా మారును. భోగములననుభవించు ప్రాణుల శరీరములన్నియు శ్రీకృష్ణుడు లేనిచో సామాన్యమైనవి అగును.
అందువలననే యోగులు ఆ శ్రీ కృష్ణ పరమాత్మను శుద్ధ జ్యోతి స్వరూపుడుగా, అవయవ రహితుడుగా, ప్రకృతికి అతీతమైన నిర్గుణ స్వరూపుడుగా భావింతురు, వైష్ణవులు మాత్రము భక్తులననుగ్రహించు ఆ శ్రీ కృష్ణ పరమాత్మను సగుణుడుగా భావింతురు. వారు జ్యోతి లోపలనున్న మూర్తి శ్యామ సుందర మూర్తియని, రెండుభుజములు, హస్తమున మురళి, పట్టు వస్త్రములు ధరించి అమూల్యమైన రత్నాభరణములచే అలంకృతుడైన మూర్తిగా భావింతురు.
ఆ వైష్ణవులు పరమాత్ముని కోరికననుసరించి శ్రీకృష్ణ దాస్యముననుష్ఠింతురు. శ్రీ కృష్ణదా స్యము చాలాగొప్పది. యోగము, తపస్సు అనునవి దానికి పదునారవవంతైనను కాజాలవు.
ఆ శ్రీకృష్ణుడు సృష్టిచేయదలచి తొలుత ప్రకృతిని సృష్టించెను. ఆ పరమాత్మ వీర్యము వలన ప్రకృతి గర్భమును దాల్చెను. ఆమె ఆ గర్భమును దివ్య లక్ష వత్సరములు ధరించిన పిదప శిశువు ఉదయించెను. ఆ పరమాత్మ యొక్క నిశ్వాసమునుండి వాయువేర్పడినది. ఆ నిశ్వాసముతో పాటు ఆ పరమాత్మ ముఖమున ఏర్పడిన చెమట చుక్క ఆతని ముందే సముద్రముగా మారినది.
ఆ సముద్రమున ప్రకృతినుండి ఉద్భవించిన శిశువు లక్ష దివ్య సంవత్సరములుండినది. ఆ శిశువే ప్రపంచమునకు ఆధారభూతుడైన మహా విరాట్పురుషుడయ్యెను. ఆ మహా విరాట్పురుషుని రోమ రోమమున బ్రహ్మాండములేర్పడినవి, అట్లే ప్రతి బ్రహ్మాండమునను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవతలు, మునులు ఇంకను చరా చర పాణి సృష్టియు జరిగినది. పరమాత్మ వదలిన నిశ్వాస వాయువు మహా విరాట్పురుషుని ఆశ్రయించుకొని సమస్తజీవులకు నిశ్వాస వాయువయ్యెను.
మహా విరాట్పురుషుని అంశ వలన క్షుద్ర విరాట్పురుషుడు ఆవిర్భవించెను. మహా విష్ణువు యొక్క నాభి కమలమున చతుర్ముఖ బ్రహ్మ, ముఖమున శంకరుడు అతని ఆంశవలన విష్ణువు ఉద్భవించిరి. ఈ విధముగా ప్రతి బ్రహ్మాండమునను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులేర్పడిరి.
శ్రీహరి స్వయముగా తనయొక్క అంశలవలన, అంశాంశలవలన అనేక విధములైన శరీరముల ధరించెను. ఈవిధముగా ఆ పరమాత్మ సగుణుడు, సర్వ శక్తి యుక్తుడయ్యెను. స్వేచ్చా రూపుడు సమస్త భోగములకు అర్హుడు, సమస్త శక్తి సమేతుడైన ఆ పరమాత్మ లజ్జాది భోగరహితుడెట్లగును. నీవనినట్లు లజ్జాబుద్ది లజ్జారహితమే, దీనిని ఆందరు ఆమోదింతురు. కాని సగుణాత్మకమైన ఆ పార్వతీ దేవికి లజ్జ ఉండుట సహజమే కదా! స్వభావముతో సర్వశక్తులుగల యా దుర్గా దేవియే పార్వతీదేవి. ఆదేవికి లజ్జా భావములుండుటలో ఎవరికిని వ్యతిరేకతయుండదు.
శ్రీకృష్ణుని ఆంశరూపయైన ప్రకృతీ దేవి రాధ. లక్ష్మి, సావిత్రి, దుర్గాదేవి, సరస్వతి అను పేర్లతో ఐదు విధములుగా మారినది. వారిలో రాధా దేవి శ్రీ కృష్ణ పరమాత్మకు ప్రాణముల కంటె మిక్కిలి ప్రియమైనది. అతని ప్రాణములకు ఆమె అధిష్టాన దేవత. ఆ రాధాదేవి ఎల్లప్పుడును శ్రీ కృష్ణ పరమాత్మ వక్ష స్థలముననే ఉండును.
విద్యకు అధిష్టాన దేవత యగు సావిత్రి బ్రహ్మదేవుని భార్య. సమస్త సంపదలకు రూపమైన లక్ష్మీదేవి నారాయణుని భార్య.
శ్రీ కృష్ణుని ముఖము నుండి ఉద్భవించిన సరస్వతి రెండు విధములైన రూపులను ధరించినది. సరస్వతీ దేవి నారాయణునకు భార్య కాగా సావిత్రీదేవి బ్రహ్మదేవుని భార్యయైనది.
బుద్ధికి అధిష్టాన దేవతయగు దుర్గాదేవి జ్ఞానమును ప్రసాదించునది. సమస్త శక్తులు గలది. ఆదేవి శంకరునకు భార్యయైనది. అట్టి పార్వతీ దేవికి లజ్జ ఎందుకుండదని గణపతి పరశురామునితో పలికెను.
ఓ సోదరా! ఈ విధముగా గోలోకమున ప్రకృతి ఐదు విధములుగా మారినది. పైన పేర్కొన్న స్త్రీలు ప్రకృతియొక్క ప్రధానాంశలు. ఇంకను ఆ ప్రకృతి యొక్క అంశాంశలవలన అనేక స్త్రీ మూర్తులుద్భవించిరి.
భార్గవ రామా! బ్రహ్మాండములకు ఊర్ద్వ భాగముననున్నది వైకుంఠ లోకము. ఆది ప్రాకృతిక లయమందును నశింపనిది. ఆచ్చట శ్రీ కృష్ణుని అర్ధాంశమగు నారాయణుడుండును. అతడు నాలుగు భుజములు కలవాడు, వనమాలను ధరించినవాడు లక్ష్మీ దేవితో కలిసి పీత వస్త్రములను ధరించియుండును.
గోలోకమున ద్విభుజూడగు శ్రీకృష్ణుడుండును, అతడు శ్యామ సుందర మూర్తి కలవాడు. ఆతడెల్లప్పుడు మురళీహస్తుడై రాధా దేవి యొక్క వక్షః స్థలమున నుండును. అతడు గొల్లవాని వేషమున గోవులు, గోపికలు, గోపాలురు వెంటనుండగా గోలోకముననుండును.
ప్రకృతికంటె విశిష్టుడైన ఆ శ్రీకృష్ణపరమాత్మయే సంపూర్ణముగా పరిపూర్ణుడు, స్వేచ్ఛారూపి, స్వతంత్రుడు, పరమానంద స్వరూపుడు నిర్గుణుడుకూడ.
దేవతలందరు ఆ శ్రీకృష్ణప రమాత్మ యొక్క అంశాంశలవలన పుట్టినవారు. మహావిరాట్పురుషుడు ఆ పరమాత్మ యొక్క పదునారవ యంశ. ఈ స్థూల సూక్ష్మ విశ్వములన్నియు మహా విరాడ్రూపుని వలననే ఉద్భవించుచున్నవి. అతని యందే ప్రళయకాలమున విలీనమగుచున్నవి.
గోలోకము వైకుంఠ లోకమున కంటే ఏబది యోజనముల ఎత్తుననున్నది. గోలోకము కంటె పై భాగమున ఎట్టిలోకములు లేవు. అట్లే శ్రీకృష్ణుని కంటే గొప్ప దైవము లేదని చెప్పెను.
భార్గవరామా! దీనినంతయు నేను శంకరునివలననే నేర్చుకొంటిని. శంకరుడు సురలోన్ముఖుడై యున్నందువలన శంకరుని అంతఃపురములోనికి వెళ్ళక క్షణకాలముండుమని కోరెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాదసమయమున చెప్పబడిన గణపతి పరశురాముల సంభాషణయను నలుభై రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 42 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
Filled with profound inspiration and devotion following his spiritual reconciliation, Parashurāma composed and recited the exquisite Ekadanta Stotra in praise of Lord Gaṇeśa. This sublime hymn glorifies Lord Gaṇeśa as the uncaused cause of the cosmos, the protector of devotees, the destroyer of pride, and the personification of supreme bliss. Lord Gaṇeśa was deeply pleased by Parashurāma's prayers and declared that anyone who recites this Ekadanta Stotra with pure devotion will be blessed with flawless wisdom, righteous progeny, freedom from obstacles, and unshakeable devotion to Lord Śrī Kṛshṇa.