నారాయణ ఉవాచ- నారాయణ ముని ఇట్లు పలికెను-
రణరంగమున మత్స్యదేశాధీశ్వరుడు చనిపోయిన పిమ్మట యుద్దమునందు ఆరితేరిన కార్తవీర్యుడు శస్త్రాస్త్ర విశారదులైన రాజశ్రేష్టులను రణరంగమునకు పంపెను. వారిలో మిక్కిలి బలము కల సోమదత్తుడు, విదర్భ దేశాధీశుడు, మిధిలా నగరాధిపతి, నీషధాధిపతి, మగధరాజు మొదలగు వారు కలరు. మహారథులైన ఆ రాజన్యులు తమ తమ సేనలతో పరశురామనెదుర్కొనుటకు వచ్చిరి, వాడియగు శస్త్రాస్త్రసంపద కలిగిన పరశురాముని సోదరులు ఆ రాజులనందరను యుద్ధమున అడ్డగించిరి. అప్పుడా రాజులు తమ తమ బాణ పరంపరచే అస్త్రములచే భార్గవరాముని సోదరులను వేరువేరుగా ఎదరుర్కొనిరి.
మహా బల పరాక్రమవంతుడగు భార్గవ రాముడు ప్రయోగించిన నాగపాశమును సోమదత్తుడు గారుడాస్త్రముచేత ఖండించెను, ఆప్పుడు పరశురాముడు శంకరుని త్రిశూలమును ప్రయోగించి ఆ మహారాజును సంహరించెను. అట్లే బృహద్బలుని గదచే, ముష్టిఘాతములచే విదర్భ దేశాధిపతిని, ముద్గరముచే మిథిలాధిపతిని, శక్త్యాయుధముచే నిషధాధిపతిని, పాదఘాతములచే మగధరాజును, ఇంకను తన అస్త్రములచే ఆయా రాజుల సైన్యమునంతయు సంహరించెను.
ఈవిధముగా రాజులనందరను సంహరించి మహా బల పరాక్రమవంతుడగు భార్గవ రాముడు కార్తవీర్యార్జుని పైకి పరుగెత్తెను.
కార్తవీర్యార్జునునితో యుద్ధము చేయుటకై వచ్చుచున్న భార్గవ రాముని చూచి కార్తవీర్యుని యుద్ధము చేయకుండ నివారించి మహారథులైన రాజులు భార్గవ రామునితో యుద్ధము సేయుటకు ముందునకు వచ్చిరి.
వారిలో కన్యాకుబ్జ దేశమునకు చెందిన వారు నూరుగురు, నూరుగురు సౌరాష్ట్రదేశమునకు చెందినవారు, నూరుమంది రాష్ట్రీయులు, నూరుగురు వీరేంద్రులు, నూరుగురు సోమదేశపువారు, నూరుగురు వంగదేశీయులు, పదిమంది మహారాష్ట్రులు, అట్లే గుర్జరదేశము కళింగదేశమునకు సంబంధించిన వారు వందలమంది ఉన్నారు.
ఆ రాజన్యులు వేసిన శరవర్షమును భార్గవరాముడు క్షణకాలమున ఛిన్నాభిన్నము చేసెను. ఆ రాజుల బాణపరంపరను తుత్తునియలు చేసిన భార్గవ రాముడు మంచును చీల్చుకొని వచ్చుచున్న సూర్యుని వలె ప్రకాశించెను.
పరశురాముడు ఆ రాజులతో వారి సైన్యముతో ఒంటరిగా మూడు దినములు పోరాడి, ఆరోజులయొక్క పన్నెండు అక్షౌహిణుల సైన్యమును తన గండ్రగొడ్డలిచే, ఖడ్గముచే అరటి చెట్లను ఖండించినట్లు తేలికగా చంపెను. వారి సైన్యమునంతయు సంహరించిన పిదప శంకరుని యొక్క శూలముచే రాజులనందరను అవలీలగా సంహరించెను.
కాన్య కుబ్జ మహారాజులు మొదలగు రాజులందరు యుద్ధమున చనిపోవుటను గమనించిన సూర్య వంశోద్భవుడగు సుచంద్రుడను రాజు లక్షమంది రాజేంద్రులతో, పన్నెండు అక్షౌహిణుల సైన్యముతో కలసి సింహము సింహముతో పోరాడినట్లు యుద్ధము చేసెను.
భార్గవరాముడు శంకరుని యొక్క శూలముచే రాజుల నందరను సంహరించి తన గండ్రగొడ్డలిచే పన్నెండు అక్షౌహిణుల సైన్యమును చంపెను.
ఈవిధముగా సుచంద్రుని సైన్యమును, ఆతని తోడి రాజన్యులను పరశురాముడు సంహరించి సుచంద్రునితో యుద్ధము సేయదలచి ఆ మహారాజు పై నాగాస్త్రమును వేసెను.
మహారాజగు సుచంద్రుడు గారుడాస్త్రముచే నాగాస్త్రమును పడగొట్టి భార్గవరాముని చూచి నవ్వెను. అప్పుడు భార్గవరాముడు నారాయణాస్త్రమును ప్రయోగించ గోరి శత సూర్యులతో సమానమైన కాంతిగల యా నారాయణాస్త్రము సుచంద్రుని చంపుటకు పోయెను. అప్పుడా మహారాజు వెంటనే తన రథమునుండి క్రిందకు దిగి తన అస్త్రశస్త్రములనన్నిటిని వదలి నారాయణాస్త్రమునకు నమస్కరించెను.
ఈవిధముగా తనకు నమస్కరించుచున్న మహారాజును వదలి పెట్టి నారాయణాస్త్రము నారాయణుని చేరుకొనగా భార్గవరాముడు చాలా ఆశ్చర్యపడెను. వెంటనే భార్గవ రాముడు సుచంద్రుని చంపుటకై శక్తిని, ముసలమును, తోమరమును, పట్టిశమును, గదను, గొడ్డలిని ప్రయోగించగా ఆ మహారాజుయొక్క రథములో ఉన్న కాళికాదేవి భార్గవరాముడు ప్రయోగించిన శస్త్రములనన్నిటిని గ్రహించి పారవేసెను. అప్పుడు పరశురాముడు శివ శూలమును విసిరివేయగా నది యా మహా రాజు మెడలో మాలయైనది. ఆప్పుడు కూడ భార్గవరాముడు ఆశ్చర్యపడి చూడగా నా మహారాజు యొక్క రథముపై జగన్మాతయు, పుఱ్ఱెల పేరును మెడలో ధరించినదియు, మహాభయంకరమైన నోరుగలదియగు భద్రకాళి కనిపించినది. అప్పుడా భార్గవరాముడు తన శస్త్రాస్త్రములను, ధనుస్సును వదిలి పెట్టి ఆ మహామాయను భక్తితో తలవంచుకొని నమస్కరించెను.
పరశురామ ఉవాచ- పరశురాముడు భద్రకాళితో నిట్లనెను-
శంకరుని భార్యవు, సారరూపిణి యగు నీకు నమస్కారము. అట్లే దుఃఖములను దూరము చేయు మాయా స్వరూపిణి యగు నీకు నమస్సులు. జగములన్నిటికి ఆధారభూతవు. జగములకన్నిటికి సృష్టికర్తవు, జగన్మాతవు, కారణరూపిణివి అగు నీకు నమస్కారము. లోకములనన్నిటిని, సృష్టించుచు సంహరింపుచున్న ఓ జగన్మాతా! నీవు శాంతింపుము. నేను నీ పాదములను శరణు వేడుచున్నాను. నీవు నా ప్రతిజ్ఞను సఫలము చేయుము.
జగన్మాతవగు నీవే కోపించినచో నమ్న రక్షించువారెవ్వరు? భక్తవత్సలవగు నీవు భక్తుడనగు నాపై ప్రసన్నురాలవుకమ్ము, శివలోకమున మీరు నాకిచ్చిన వరమును సఫలము చేయుమని భార్గవ రాముడు భద్రకాళిని ప్రార్థించెను.
భార్గవరాముడు చేసిన స్తుతిని విని భద్రకాళి చాలా సంతోషించి నీవు భయపడకుమని చెప్పి అక్కడనే అంతర్ధానమయ్యెను.
భార్గవరాముడు చేసిన ఈ స్తోత్రమును భక్తితో చదివిన వాడు అవలీలగా మహాభయములనన్నిటిని తప్పించుకొనును. అతడు త్రైలోక్య పూజితుడగను. విజయములనన్నిటిని పొందును. అతడు మిక్కిలి జ్ఞానము కలవాడై శత్రువులనందరను నాశనము చేయగలుగును.
ఆ సమయమున ధర్మిష్ఠులలో శ్రేష్టుడగు బ్రహ్మదేవుడు అచ్చటకు వచ్చి భార్గవరామునకు ఒక రహస్యమునిట్లు చెప్పిను,
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను-
ఓ భార్గవ రామా! నీవు సుచంద్రుని జయింపగ లుగునది, నీ ప్రతిజ్ఞ ఫలించు రహస్యమొకటి విమము.
దుర్వాసమహర్షి సుచంద్రునకు దశాక్షరీ మహామంత్రముమ, భద్రకాళీ కవచమును ఉపదేశించెను. భద్రకాళీ కవచము దేవతలకు కూడ లభ్యము కానిది. ఆ కవచము ఏవరియొక్క కంఠమునుండునో అతనికి విజయము తప్పక లభించును. ఆ కవచము నీ దగ్గర యుండినచో నిన్ను ఎవరును జయింపజాలరు.
ఓ భార్గవరాముడా! నీవు సుచంద్రుని దగ్గరకు వెళ్ళి ఈ కవచమును యాచింపుము. సూర్య వంశ మందు పుట్టిన ఆ రాజు పరమధార్మికుడు, దానము చేయు స్వభావము కలవాడు. ఆతని యాచించినచో కవచమును, మంత్రమునే కాక ప్రాణములను సహితము దానము చేయును అని చెప్పగా భార్గవరాముడు సన్న్యాసి వేషమున ఆ మహారాజునొద్దకు వెళ్ళి భద్రకాళియొక్క కవచమును, మంత్రమును దానము సేయుమని కోరెను.
అప్పుడు సుచంద్రుడు కూడ సంకోచ పడక మిక్కిలి యాదరముతో అతనికి భద్రకాళి యొక్క కవచమును, మంత్రమును దానము చేసెమ.
అప్పుడు పరశురాముడు శంకరుని హలమును ప్రయోగించి ఆ మహారాజును చంపెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణ మునుల సంవాద సమయమును తెలుపబడిన కార్తవీర్య పరశురాముల యుద్ధవర్ణనమను ముప్పయ్యారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 36 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
Hearing the thunderous crash and the fall of the tusk, Goddess Pārvatī rushed out of her inner chambers to find her beloved son Gaṇeśa standing bleeding with a broken tusk. Beholding her child injured once again, the Divine Mother fell into agonizing grief and intense cosmic anger, her eyes flashing like blazing cosmic fire. Assuming Her fierce form as Durgā, She threatened to consume the entire cosmos and destroy Parashurāma along with all the Devas who stood silently by. Trembling with fear, Parashurāma, Lord Śiva, and the Devas offered humble prayers of surrender, seeking to pacify the Mother of the Universe.