భృగురువాచ- భార్గవరాముడిట్లనెను-
ఓ పరమేశ్వరా! నీదయవలన సమస్తావయములను రక్షించు కవచమును నాకుపదేశించితివి, ఇది సుఖమును, మోక్షమును కలిగించును. సమస్త శత్రువులను సంహరించును. ఇక ఇప్పుడు శ్రీకృష్ణమంత్రమును, అతని సోత్రమును, పూజించు విధానమును అనాథనగు నాకు ఉపదేశింపుము అని అనెను.
మహాదేవ ఉవాచ- శంకరుడిట్లు పరశురామునితో ననెను-
“ఓం శ్రీం నమః శ్రీకృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహా” అను పదునేడు అక్షరముల మంత్రము సమస్త మంత్రములందు శ్రేష్టమైనది. ఈ మంత్రమున ఐదులక్షలమార్లు జపించినచో అది సిద్ధించును. ఆ తరువాత జపమున పదియవ వంతు హోమము చేయవలెను. హోమములో పదియవ భాగముతో అభిషేకము చేయవలెను. ఆభిషేక సంఖ్యలో పదియవ భాగముతో తర్పణము చేయవలెను. దానిలో పదియవ భాగముతో మార్జనము సేయవలెను. నూరు సువర్ణములను పురశ్చరణ దక్షిణగా నీయవలెను.
ఈ విధముగా మంత్రసిద్ధి కలిగినచో ఆతనికి ప్రపంచమే హస్తగతమై యుండును. ఆతడు సప్త సముద్రములను త్రాగుటకు గాని నమస్త ప్రపంచమును సంహరించుటకు గాని సమర్థుడగును. అతడీ పాంచభౌతికమైన దేహముతోనే వైకుంఠమునకు వెళ్ళగలుగును. ఆతని యొక్క స్పర్శవలన పాదరేణువుల వలన సమస్త పుణ్యతీర్థములు, సమస్త భూభాగము పవిత్రమగుచున్నది.
శ్రీకృష్ణ ధ్యానము సామవేదమున చెప్పబడినది. భక్తిని, ముక్తిని కలిగించు ఆ సర్వేశ్వరుని ధ్యానశ్లోకములను నీకుచెప్పుచున్నాను.
నూతనమేఘమువలె నల్లనివాడు, నీలోత్పలములవంటి కన్నులు గలవాడు, శరత్కాలపు పూర్ణిమా చంద్రునివలె గుండ్రని ముఖము కలవాడు, చిరునవ్వు కలవాడు, కోటి మన్మథుల యొక్క ఆందము కలవాడు, రత్న భూషణములు కలవాడు, రత్న సింహాసనమున నుండువాడు, చందనమును శరీరము నందదంతయు పూసికొన్నవాడు, పచ్చని పట్టు వస్త్రములు ధరించువాడు. చిరునవ్వుతో నున్న గోపికలచే పరివేష్టితుడు, వికసించిన మాలతీమాల, వనమాలలచే అలంకృతుడు, చందనము కల మల్లెపూల మాలచే చుట్టబడిన కొప్పుగలవాడు. రాధాదేవి యొక్క వక్షస్థలమున నున్నవాడు, సిద్ధులు, దేవతలు, మునులు, త్రిమూర్తులు వేదములు మున్నగు వాటిచే ఎల్లప్పుడు స్తుతులనందుకొనువాడగు శ్రీకృష్ణుని నేను సేవింతును.
పైధ్యానశ్లోకములచే శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించి, అతనికి షోడశోపచారముల నిర్వర్తించి భక్తితో పూజించిన వానికి సర్వజ్ఞత్వము తప్పక లభించును.
అర్ఘ్యము, పాద్యము, ఆసనము, వస్త్రము, భూషణములు, గోవు, మధుపర్కము, యజ్ఞోపవీతము, ధూపదీపములు, నైవేద్యము, పునరాగమనము, అనేక విధములగు పుష్పములు, చక్కని వాసనగల తాంబూలము. కస్తూరీ, అగరు, చందనము వాసన కల దివ్య తల్పము, మాలలు, ముమ్మారు పుష్పాంజలి యనునవి షోడశోపచారములు ఇది పరమాత్మను పూజించు పద్ధతి.
శ్రీకృష్ణుని షోడశోపచారములతో పూజించిన తరువాత షడంగ పూజను చేయవలెను. అటుపి మ్మట శ్రీరాముడు, సుదాముడు, వసుదాముడు, హరిభానుడు, చంద్రభానుడు, సూర్యభానుడు, సుభానుడను శ్రీకృష్ణ పరమాత్మయొక్క అనుచరులను భక్తితో పూజించి, గోపేశ్వరి, మూలప్రకృతిరూపిణ, కుశక్తి స్వరూపియగు రారాదేవిని భక్తితో పూజచేయవలెను. అటుపిమ్మట గోకులను, గోపికాగణమును, బ్రహ్మదేవుని, పార్వతిని, లక్ష్మిని, సరస్వతిని, భూమిని, అనుచర వర్గసహితమైన సమస్తదేవతలను, గణపతిని, సూర్యుని, అగ్నిని, విష్ణువును, శివుని, దుర్గాదేవిని అర్చించిన పిదప ఇష్టదేవతను మరల పూజింపవలెను.
గణపతిని విఘ్నములు తొలగిపొవుటకై, ఆరోగ్యమునకై సూర్యుని, ఆత్మశుద్దికై అగ్నిదేవుని, ముక్తి కలుగుటకు శ్రీమహావిష్ణువుమ, జ్ఞానసిద్ధికై శంకరుని, పరమైశ్వర్యము లభించుటకు దుర్గాదేవిని పూజింపవలెను. దైవషట్కమును ఆరాధించినచో పై ఫలితము కలుగును. లేనిచో విపరీతపు ఫలితములు కలుగును. ఇట్లు పూజించి, పరిహారమును నిర్వర్తించి ఇష్టదైవమును భక్తితో పూజించవలెను. తరువాత భక్తితో సామవేదము నందు చెప్పబడిన స్తోత్రమును పఠింపవలెను.
మహాదేవ ఉవాచ- శంకరుడిట్లు పలికెను-
పర బ్రహ్మ స్వరూపుడు, పరంధాముడు, పరంజ్యోతి స్వరూపుడు, సనాతనుడు, నిర్లిప్తుడగు పరమాత్మకు నమస్కారము. స్థూలవస్తువులలో కెల్లను స్థూలరూపుడు, సూక్ష్మములలో కెల్లను సూక్ష్మరూపుడు, అందరకు కనిపించువాడు, ఆదృశ్యరూపుడు,
స్వేచ్చాచారుడగు దేవుని నేను నమస్కరింతును. సాకారుడు, నిరాకారుడు, సగుణుడు, వరుణుడు, సమస్త సృష్టికి ఆధారభూతుడు స్వేచ్చా రూపుడగు ఆ కృష్ణ పరమాత్మను నమస్కరింతును, అతని రూపము చాల అందమైనది. సాటిలేనిది, మిక్కిలి భయంకరమైనది. అట్టి దేవుని నమస్కరింతును. కర్మస్వరూపుడు, సమస్త కర్మలకు సాక్షీభూతుడు, సర్వకర్మఫల స్వరూపుడు, సమస్త కర్మలయొక్క ఫలమును ఇచ్చువాడు సర్వరూపుడు తనయొక్క అంశ భేదముచే ఆ పరమాత్మ సృష్టికర్తగా, రక్షకుడుగా, సంహారకర్తగా కనిపించువాడు, అనేక రూపములు కలవాడు తనయొక్క అంశాంశముచే పురుషరూపమును ధరించిన ఆ దేవదేవునికి నమస్కారము. స్వయముగానతడు ప్రకృతి స్వరూపుడు, తన మాయవల్ల పురుషమూర్తిగా నున్న వాడు, ప్రకృతి పురుషులకంటే అతీతుడు, తనమాయవల్ల స్త్రీ, పుం, నపుంసక రూపములను ధరించువాడు, స్వయముగా మాయారూపుడు, మాయావంతుడు అగు ఆ దేవదేవునకు నమస్కరించుచున్నాను. సమస్త దుఃఖములను పోగొట్టువాడు, సమస్త సృష్టికి కారణభూతుడు, సమస్త ప్రపంచములను ధరించువాడు, ఆగు పరమాత్మకు నమస్కారము.
ఆ పరమాత్మ తేజోవంతులలో సూర్యుడుగాను, సమస్తజాతులలో బ్రాహ్మణుడుగాను, నక్షత్రములలో చంద్రుడుగాను, రుద్రులలో, వైష్ణవులలో, జ్ఞానవంతులలో శంకరుడుగాను, సర్పములలో శేషుడుగాను, ప్రజాపతులలో బ్రహ్మదేవుడుగాను, సిద్దులలో కపిల మహర్షిగాను, మునులలో సనత్కుమారుడు గాను దేవతలలో విష్ణువు గాను, దేవతాస్త్రీలలో ప్రకృతిగాను, మనువులలో స్వాయంభువ మనువుగాను, మానవులలో విష్ణుభక్తుడుగసు, స్త్రీలలో శతరూపాదేవిగాను, ఋతువులలో వసంతఋతువుగాను, మాసముల యందు మార్గశిర మాసముగాను, తిథులలో ఏకాదశీ తిథిగాను. నదులకు సముద్రముగాను, పర్వతములలో హిమాలయ పర్వతముగాను, ఓర్పు కలవారి లో భూమిగాను, పత్రములలో తులసీపత్రముగాను, వృక్షములలో కల్పవృక్షముగాను, సస్యములలో ధాన్యముగాను, తిను వస్తువులలో అమృతముగాను, ఏనుగులలో ఐరావతముగాను, పక్షులలో గరుత్మంతుడుగాను, తేజస్సుకల వస్తువులలో బంగారముగాను, ధాన్యములలో యవలుగాను, జంతువులలో సింహముగాను, యక్షులలో కుబేరుడుగను, గ్రహములలో బృహస్పతిగాను, దిక్పాలురలో దేవేంద్రుడుగా నున్నాడు, ఆట్టి పరమాత్మకు నమస్కారము,
శాస్త్రములలో వేదములుగాను, పండితులలో సరస్వతిగాను, అక్షరములలో అకారముగాను, మంత్రములలో విష్ణుమంత్రముగాను, తీర్థములలో గంగానదిగాను, ఇంద్రియములలో మనస్సుగాను, శస్త్రములయందు సుదర్శన చక్రముగను, వ్యాధులలో వైష్ణవజ్వరముగాను, తేజస్సులలో బ్రహ్మ తేజస్సుగను, శీఘ్రముగా పోవు వారిలో మనస్సుగాను, గురువులలో జ్ఞానదాతగాను, బంధువులలో తల్లిగాను, మిత్రులలో తండ్రిగాను, శిల్పాచార్యులలో విశ్వకర్మగాను రూపవంతులలో మన్మథుడుగాను, స్త్రీలలో పతివ్రతగాను, ప్రియమైన వారిలో పుత్రుడుగాను, మానవులలో ధర్మడుగాను, వేదములలో సామవేదము గాను, ధర్మముల యందు సత్యముగాను, ఆ పరమాత్మయున్నాడు.
అట్లే అతడు జలములయందు శైత్యస్వరూపుడు, భూమియందు భూగుణమైన గంధస్వరూపుడు, ఆకాశమున ఆకాశగుణమైన శబ్దస్వరూపుడు, ఆతడు యజ్ఞములందు రాజసూయయాగము. ఛంధస్సులలో గాయత్రీ ఛందము. గంధర్వులలో చిత్రరథుడు గవ్యములలో పాలు, పవిత్రమైన వస్తువులలో అగ్నిదేవుడు, తృణములలో దర్భ, శత్రువులందు వ్యాధిరూపుడు, గుణములలో శాంతగుణస్వరూపుడు. అదే విధముగా ఆ పరమాత్మ తేజస్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, సమస్త రూపుడు, వాయురూపుడు, ఆత్మస్వరూపుడు, ఆకాశరూపుడు. అట్టి పరమాత్మను నేను నమస్కరించుచున్నాను.
వేదములు కూడా నిర్వచింపలేని ఆ పరాత్పరుని పండితుడు స్తుతింపగలడా? నిర్వచించుటకు వీలులేని ఆ పరబ్రహ్మను ఎవరు స్తుతింపగలరు? ఆ పరమేశ్వరుని స్తుతించుటకు వేదములు అ సమర్థములు. ఆతనిని స్తుతించు విషయములో సరస్వతీదేవి కూడ అసమర్ధురాలు. ఆతడు వాజ్ఞ్మనస్సులచే స్తుతింప వీలులేని వాడు, శుద్ద తేజ స్వరూపుడు. భక్తుల ననుగ్రహించుటకు రూపముమ ధరించినవాడు. మిక్కిలి అందమైనవాడు. నల్లని రూపుకలవాడు. రెండు భుజములు కలవాడు. మురళిని మోగించువాడు. బాలరూపుడు. చిరునవ్వుతోనుండువాడు. గోపకులు, గోపికలచే ఎల్లప్పుడు సేవింపబడుచున్నవాడు. రాధాదేవి ఇచ్చు తాంబూలమును భుజించుచు రత్న సింహాసనమున కూర్చున్నవాడు, రత్నభూషణ భూషితుడు. ఆతని అనుచరులు అతనికి శ్వేతచామరములు వీయుచుండగా గోపకుమారులచే సేవింపబడుచున్నవాడు.
ఆ శ్రీకృష్ణుడు బృందావనమున రాసక్రీడకై రాస మండలమున నుoడును. అతడు గోలోకమునందలి రత్న పర్వతము యొక్క సమీపమున నున్న విరజా నదీ తీరములో సుఖముగా విహరించుచుండును. ఆతడు మిక్కిలి పరిపూర్ణుడు, రాధాకాంతుడు, మనోహరుడు, బ్రహ్మస్వరూపుడు. సత్యస్వరూపుడు నిత్యమైనవాడు. అట్టి శ్రీకృష్ణుని నేనెల్లప్పుడు నమస్కరింతును.
ఈ శ్రీ కృష్ణ స్తోత్రమును మూడు పూటలందు చదివినచో ఆతడు చతుర్వర్గములను కలిగించుటకు సమర్థుడగును, ఈస్తోత్రముయొక్క అనుగ్రహము వలన శ్రీహరి సేవను భక్తిని తప్పక పొందును. ఈలోకమున అతడు జగత్పూజ్యూడై విష్ణువుతో సమానుడగను. అతడు సమస్త సిద్దులను పొంది మరణ సమయమున వైకుంఠమును పొందును. సూర్యుడీ లోకమున తేజస్సుతో ప్రకాశించుచున్నట్లు కీర్తి కలిగి ప్రకాశించును. శ్రీకృష్ణభక్తుడు తప్పక జీవన్ముక్తుడగును. ఆరోగ్యవంతుడై సకల సద్గుణ సంపన్నుడై విద్యావంతుడు, పుత్రవంతుడు, ధనవంతుడగును షడబిజ్ఞుడు, దశబలుడునై మనోవేగము కలవాడగును. సర్వజ్ఞుడై కల్పవృక్షమువలె శ్రీకృష్ణుని అనుగ్రహము వలన సమస్త సంపదలను ఇచ్చువాడగును.
పరశురామా! నీకీ విధముగా శ్రీకృష్ణస్తోత్రమును తెల్పితిని. నీవు పుష్కర క్షేత్రమునకు వెళ్ళి అచ్చట మంత్రమును జపించి మంత్రసిద్ధిని పొంది నీ కోరికను తీర్చుకొవగలవు, నా యొక్క ఆశీర్వచనము వలన శ్రీకృష్ణుని అను గ్రహమువలన ఈ భూమి పై ఇరువది యొక్క మార్లు తిరిగి రాజులు లేకుండునట్లు వారినందరనూ అంత మొందించగలవని శంకరుడు పరశురామునితో పల్కెను
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమువ మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణ మునుల సంవాద సమయమున తెలుపబడిన శ్రీ కృష్ణుని స్తోత్రము గల ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 32 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
Arriving at the inner gate, Parashurāma respectfully requested Lord Gaṇeśa to grant him immediate entry so that he could offer his prostrate obeisances to Lord Śiva. Lord Gaṇeśa gently but firmly barred the way, explaining with polite words that his parents were resting in private and had issued strict commands that no one be permitted inside at that moment. Eager to see his preceptor and unaccustomed to being halted by anyone, Parashurāma urged Gaṇeśa to step aside, but the elephant-headed deity stood immovable, asserting his duty as the guardian of his parents' residence.