నారాయణ ఉవాచ- నారాయణుని ఇట్లు పలికెను-
పుష్కరాక్షభూపతిని అతని పుత్రుని యాచించి మహాలక్ష్మీ కవచమును, దుర్గా కవచమును గ్రహించి శ్రీ మహావిష్ణువు వైకుంఠమునకు పోగా భార్గవనందనుడుగు పరశురాముడు పుష్కరాక్షుని పుత్ర సహితముగా వధించెను. ఆ సమయమున భార్గవ రాముడు బ్రహ్మాస్త్రముచే ఏడు దినములు యుద్ధము చేయగా కవచములు లేని పుష్కరాక్షుడు పుత్రులలో రణరంగమున పడిపోయెను.
సహస్రాక్షుడైన పుష్కరాక్ష మహారాజు రణంగమున పడిపోగా కార్తవీర్యార్జునుడు స్వయముగా రెండు లక్షల ఆక్షౌహిణుల సైన్యముతో యుద్ధమునకు వచ్చెను. ఆతడు బంగారు రథమునెక్కి అందు వివిధాస్త్రముల నుంచుకొని రణరంగమునకు వచ్చెను. అచ్చట పరశురాముడు రత్నాలంకారములతోనున్న రాజేంద్రులతో కలిసియున్న కార్తవీర్యుని చూచెను.
కార్తవీర్య మహారాజు రత్నములున్న ఆతపత్రము, ఆభరణములు, అవయవములందు చందనమును ధరించెను. ఆతడు భార్గవరాముని చూచి తన రథమునుండి క్రిందకు దిగి భార్గవ రామునకు నమస్కరించి తన తోటి రాజులతో రథము నెక్కెను.
భార్గవరాముడు తనకు నమస్కరించిన కార్తవీర్యార్జునకు నీ అనుచరులతో కలసి స్వర్గమునకు పొమ్మని సమయోచితమైన ఆశీస్సులనొసగెను.
తరువాత రెండు సేనల మధ్య యుద్ధము జరిగెను. కార్తవీర్యార్జునుడు ప్రయోగించిన బాణములకు తట్టుకొనలేక భార్గవ రాముని శిష్యులు. అతని సోదరుల రణరంగమునుండి పారిపోయిరి. ఆట్లే శస్త్రధారులలో శ్రేష్టుడగు భార్గవరాముడు కూడ కార్తవీర్యార్జునుని శర పరంపరలో మునిగియున్న తన సైన్యమును. కార్తవీర్యుని సైన్యమును చూడలేకపోయెను.
భార్గవరాముడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించగా రణరంగమంతయు అగ్నిమయమయ్యెను. అప్పుడు కార్తవీర్యుడు వారుణాస్త్రమును ప్రయోగించి ఆగ్నేయాస్త్రముయొక్క మంటలను చల్లార్చెను. ఆప్పుడు పరశురాముడు గుట్టలు పాములతో నున్న గాంధర్వాస్త్రమును ప్రయోగింపగా కార్తవీర్యుడు దానిని వాయవ్యాస్త్రముచే ఆవలీలగా శాంతింపజేసెను. ఆ సమయమున పరశురాముడు మహాభయంకరమైన నాగాస్త్రమును ప్రయోగించగా కార్తవీర్యార్జునుడు గరుడాస్త్రముతో దానిని శాంతింపజేసెను.
భార్గవరాముడు మహేశ్వరాస్త్రమును ప్రయోగింపగా కార్తవీర్యుడు దానిని వైష్ణవాస్త్రముతో శాంతింపజేసెను. ఆ సమయమున భార్గవ రాముడు కార్తవీర్యుని సంహరించుటకై బ్రహ్మాస్త్రమును వేయగా ఆ మహారాజు బ్రహ్మాస్త్రమునే ప్రయోగించి పరశురాముని బ్రహ్మాస్త్రమును శాంతింపజేసెను.
రాజగు కార్తవీర్యుడు తన గురువగు దత్తాత్రేయుడు తనకు ప్రసాదించిన ఆమోఘమైన శూలమును భార్గవరాముని సంహరించుటకై చేతబట్టెను. శతసూర్యులవంటి కాంతి గలది. ప్రళయ కాలమందలి బడబాగ్ని శిఖలవలె గొప్పనీదియు, దేవతలు కూడ జయించుటకు వీలుకాని ఆ శూలమును కార్తవీర్యార్జునుడు భార్గవరాముని సంహారమునకై మంత్ర పూర్వకముగా ప్రయోగించెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునకు ప్రసాదించిన శూలముచే భార్గవ రాముడు మూర్ఛనొందెను. అప్పుడు బ్రహ్మ విష్ణుశివాది దేవతలు భయముతో అచ్చటకు విచ్చేసిరి. వారిలో మహాజ్ఞానము కల శంకరుడు తన జ్ఞానబోధక వాక్యములచే భార్గవ రాముని పునరుజ్జీవితుని జేసెను.
భార్గవ రాముడు తెలివి తెచ్చుకొనిన తర్వాత తన కెదురుగా నున్న దేవతలను చూచి భక్తితో తలవంచుకొనెను. కార్తవీర్యార్జునుడు కూడ తనకెదురుగానున్న దేవతలను చూచి భక్తితో తలవంచుకొని వారికి నమస్కరించి దేవతలనందరను సుతించెను.
ఆసమయమున భక్తవత్సలుడగు దత్తాత్రేయస్వామి తన శిష్యుని రక్షించుకొనుటకు ఆ రణరంగమునకు వచ్చెను. అప్పుడు భార్గవరాముడు మిక్కిలి కోపముతో పాశుపతాస్త్రమును బయటకు తీసెను. అందువలన కార్తవీర్యుడు దత్తాత్రేయస్వామి ఇచ్చిన విద్యచే భార్గవరాముని స్తంభింపజేసెను. భార్గవరాముడప్పుడు అనేక అనుచరులతో అచ్చట నున్న కృష్ణునిచే రక్షింపబడుచున్న రాజును చూచెను, ఆ కృష్ణుడు జ్వలించుచున్న సుదర్శన చక్రమును చేత ధరించి బ్రహ్మాది దేవతలచే నుతింబడుచుండెను. ఇంకను ఆతడు గొల్లవాని వేషమున సహచరులగు గొల్లలు వెంటరాగా నవీన నీరద శ్యాముడై చిరునవ్వుతో మురళిని చేతబట్టుకొని మ్రోగించుచుండెను.
ఆ సమయమున ఒక ఆశరీరవాణి వినిపించినది.
మహారాజుగు కార్తవీర్యుని దక్షిణ భుజమున దత్తాత్రేయ స్వామి ప్రసాదించిన శ్రీ కృష్ణ కవచమున్నదనియు, దానిని యోగీశుడగు శంకరుడు కార్తవీర్యుని యాచన చేసి తీసికొన్నచో మాత్రమే భార్గవరాముడు కార్తవీర్యుని సంహరింపగలడని చెప్పెను. ఆ అశరీరవాణిని విన్న శంకరుడు బ్రాహ్మణ వేషమున రాజు దగ్గరకు పోయి కవచమును యాచించి ఆ శ్రీ కృష్ణ కవచమును భార్గవ రామునకిచ్చెను.
అప్పుడు దేవతలందరు తమ తమ స్థలములకు పోగా పరశురాముడు రణరంగమున నున్న కార్తవీర్యునితో ఇట్లనెను.
పరశురామ ఉవాచ- పరశురాముడిట్లు పలికెను.
ఓ మహారాజా! సాహసముతో యుద్ధమున చేయుము. మానవులకు అప్పుడప్పుడు జయము కలుగుమ, పరాజయము కూడ కలుగుచుండును. నీవు చక్కగా వేదములను అధ్యయనము చేసితివి. సమస్త భూమిని పరిపాలించితివి. యుద్ధమును కూడ చక్కగా చేసినందువలననే నేను యుద్ధమున మూర్చపొందితివి. ఆ నీవు రాజేంద్రులందరను జయించితివి. నన్ను కూడ దత్తాత్రేయస్వామి నీకు అనుగ్రహించిన శూలముచే మూర్ఛనొందించితివి. తరువాత పరమశివుడు నిన్ను పునర్జీవితుని చేసెను.
అప్పుడు పరమ ధార్మికుడగు కార్తవీర్యుడు పరశురాముని మాటలను విని మహామునికి భక్తితో ప్రణమిల్లి యథార్థవచనముల నిట్లు చెప్పసాగెను.
రాజోవాచ- రాజగు కార్తవీర్యుడు ఇట్లు పలుకసాగెను-
ఓ భార్గవరామా! నేను చేసిన వేదాధ్యయనము గురించి దానము గురించి నేను పరిపాలించిన భూమి గురించి, నేను జయించిన రాజుల గురించి ప్రస్తావించితిని. కానీ నా బుద్ధి, తేజస్సు, పరాక్రమము వివిధములైన యుద్ధ తంత్రములు, శ్రీ ఐశ్వర్యము, జ్ఞానము, దానశక్తి, ఆచారము, వినయము, విద్య, ప్రతిష్ఠ తపస్సు ఇవన్నియు నా భార్యయగు మనోరమ యున్నంతవరకే యున్నది. ఆమె గతించిన తరువాత నా సర్వస్వము పోయినది.
ఆ మనోరమ నాకు ప్రాణములతో సమానమైనది. ఆమె పతివ్రత. లక్ష్మీయంశతో జన్మించినది. యజ్ఞములనాచరించునప్పుడు సహధర్మచారిణి, ప్రేమలో తల్లి వంటిది. నా బాల్యమునుండి శయ్యయందును, భోజన మందును, యుద్ధమునందును ఆమె నన్ను అంటిపెట్టు కొన్నది. ఆట్టి నాభార్య లేనందువలన విషములేని సర్పమువలె, నేను చైతన్యములేని వాడనైతిని. నా యుద్ధమును నీవింతవరకు చూడలేదు.
ఐనను సమస్తము కాలమునకు ఆధీనమైనది. ఒకప్పుడు సింహము నక్కమ చంపును. అట్లే ఒకప్పుడు నక్క సింహమును చంపవచ్చును. అదే విధముగా ఒకానొక కాలమున ఈగ దున్నపోతును చంపవచ్చును. పాము గరుత్మంతుని సంహరింపవచ్చును.
అట్లే భృత్యుడు రాజును పొగడినట్లు ఒక సమయములో రాజు భృత్యుని పొగడవచ్చును. మానవుడు ఇంద్రుని స్తుతింపవచ్చును. ఇవన్నియు కాలమునకు ఆధీనమైనవి.
ఆదేవిధముగా బ్రహ్మదేవుడు చనిపోవచ్చును. ప్రకృతి కూడ శ్రీకృష్ణుని యందు ఆంతర్థానము కావచ్చును. దేవతలందరు ముల్లోకములలోనున్న చరాచర ప్రపంచమంతయు కాలమందు లీనమై పోవును. అందువలన కాలము ఎవరికిని దాటరాదని నారాయణుడు పలికెను.
అట్టి కాలమునకే కాల స్వరూపుడు శ్రీకృష్ణుడు. ఆతడు సృష్టికర్తయగు బ్రహ్మదేవుని సృష్టించినవాడు. లోక సంహార కారకుడగు రుద్రుని సంహరించువాడు, ఆట్లే లోక పాలకులను పరిపాలించువాడు పరాత్పరుడు, స్థూలపదార్థముల కంటే స్థూలస్వరూపము కలవాడు. సూక్ష్మరూపములలో సూక్ష్మరూపుడు. అతడు పురాణమూర్తి, పరమకాలరూపుడు. కాలభేదమును కలిగించువాడు. విశ్వములన్నియు పరాత్పరుడైన శ్రీకృష్ణుని యొక్క రోమకూపములందు అణగి మణగి యున్నవి.
మహావిరాడ్రూపము ఆ శ్రీకృష్ణ పరమాత్మయొక్క పదునారవ భాగము. ఆ మహా విరాట్స్వరూపుని నుండి ఈ విశ్వసృష్టికంతయు మూలరూపుడగు క్షుద్ర విరాట్పురుషుడు (నారాయణుడు) ఉద్భవించెను. అతని యొక్క నాభి కమలము నుండి సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు ఉద్భవించెను. ఆతడు లక్ష సంవత్సరములు తిరిగి చూచినను, క్షుద్రవిరాట్పురుషుని నాభియందలి కమలదండము యొక్క చివరను మాత్రము చూడలేకపోయెను.
ఆబ్రహ్మదేవుడు వాయువును మాత్రము ఆహారముగా గొని తపస్సుచేసి శ్రీకృష్ణుని దర్శించుకొనెను.
ఆ పరమాత్మ గోపకులు గోపికాస్త్రీలతో కలసియుండెను. ఆతడు రెండు చేతులు కలవాడు. మురళిని ధరించెను. రత్న సింహాసనమున కూర్చుండి రాధాదేవి వక్షస్థలమున నుండెను.
ఆట్టి పరమాత్మను బ్రహ్మదేవుడు దర్శించుకొని అతనికి నమస్కారములు చేసి ఆతని అనుజ్ఞను పొంది పరమాత్మయొక్క అభిప్రాయము ననుసరించి విశ్వసృష్టి చేయుటకు సంకల్పించెను.
ప్రపంచ సృష్టికారకుడగు పరమాత్మయొక్క నొసటినుండి సృష్టిసంహారకారకుడగు శివుడావిర్భవించెను, క్షుద్రవిరాడ్రూపుడగు విష్ణుమూర్తి శ్వేత ద్వీపమున నివసించు ఈలోకమును రక్షించును. ఈవిధముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టికి కారణభూతులగుచున్నారు.
ఇట్టి త్రిమూర్తులు శ్రీకృష్ణుని యొక్క ఆంశవలన జన్మనెత్తిరి. వీరు ప్రతి ప్రపంచమున ప్రత్యేకముగానున్నారు. వీరందరు ప్రాకృతుని నుండి ఉద్భవించినారు. ప్రాకృతుడు మహావిరాట్ స్వరూపుడు. ప్రకృతి సమస్త సృష్టికి కారణమగుచున్నది. ఇక శ్రీకృష్ణుడు ప్రకృతి కంటే అతీతుడు,
పరమాత్మయైనను ప్రకృతియొక్క సహాయములేక సృష్టి చేయజాలడు. మాయారూపిణియగు ప్రకృతి లేక సృష్టియే జరుగదు. ఆ ప్రకృతి సృష్టి స్థితి లయకారకుడగు శ్రీకృష్ణునిలో ఆంతర్భవించియుండి సృష్టికాలమున కనిపించుచున్నది. మహేశ్వరియగు ఆ ప్రకృతి నిత్యమైనది.
కుమ్మరివాడు మన్ను లేకుండ కుండలనెట్లు చేయజాలడో, స్వర్ణకారుడు బంగారము లేక ఆభరణముల నెట్లు చేయలేడో అట్లే పరమాత్మకూడ ప్రకృతిలేకపోయినచో సృష్టిని చేయజాలడు.
ఆ ప్రకృతి సృష్టిసమయమున రాధగా, మహాలక్ష్మిగా, సావిత్రిగా, దుర్గాదేవిగా, సరస్వతిగా ఐదు రూపములతో కనిపించుచున్నది.
శ్రీకృష్ణ పరమాత్మయొక్క ప్రాణములకు అధిష్టాన దేవత, అతనికి ప్రాణముల కంటె ప్రియురాలైనది రాధా దేవి.
ఐశ్వర్యమునకు ఆధిష్టానదేవత, సమస్త మంగళములను కలిగించునది, పరమానంద స్వరూపయగు దేవి మహాలక్ష్మి,
విద్యకు ఆధిష్టాన దేవత, పరమేశ్వరునకు కూడ దుర్లభమైనది, వేదములకు శాస్త్రములకు తల్లిగానున్న దేవిని సావిత్రి యని పిలుతురు.
బుద్ధికి అధిష్టాన దేవత సమస్త శక్తుల యొక్క స్వరూపము, సమస్త జ్ఞాన రూపిణియగు దేవి దుర్గ. వాక్కులకు అధిష్టాన దేవత శాస్త్రజ్ఞానమునిచ్చునది, శ్రీకృష్ణుని కంఠమునుండి ఉద్భవించిన దేవత సరస్వతి,
పరమేశ్వరియగు మూల ప్రకృతి తొలుత ఐదు విధములుగా మారినది. తరువాత సృష్టిలో ఆ దేవియొక్క అంశలవలన ఆనేక స్త్రీలు కలిగిరి.
ఈ సృష్టియందున్న స్త్రీలందరు ప్రకృతి యొక్క అంశరూపము గలవారు. అట్లే పురుషులందరు పరమపురుషుని ఆంశలవలన పుట్టిరి. ఈ విధముగా మాయా రూపిణియగు ప్రకృతిలేనిచో సృష్టి యనునది జరుగదు.
ఓ నారదా! ప్రతీ ప్రపంచమునందున్న బ్రహ్మదేవుడు సృష్టిని చేయగా విష్ణువు రక్షించుచున్నాడు. ఎల్లప్పుడును మంగళముల కలిగించు శివుడు సంహార కార్యము చేయుచున్నాడు. అందువలన శరీరముపై మమత్వమవసరము లేదను ఈ జ్ఞానమును నా గురువగు దత్తాత్రేయుడు పుష్కర క్షేత్రమున మాఘ మాస మందు మునుల సన్నిధిలో ఇచ్చెనని కార్తవీర్యుడు పలికెను. తరువాత అతడు భార్గవరామునికి నమస్కరించి తన ధనుర్బాణములను తీసికొని రథమునెక్కెను.
కార్తవీర్యార్జునుడు తన గురువగు దత్తాత్రేయుడు తెలిపిన జ్ఞానమును గురించి తెలిసిన తరువాత భార్గవరాముడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించి రాజు సైన్యమును హతమార్చెను. అటుపిమ్మట శ్రీహరిని స్మరించుకొనుచు పాశుపతాస్త్రమును ప్రయోగించి కార్తవీర్యార్జునుని సంహరించెను.
ఈవిధముగా భార్గవరాముడు సంహారకారకుడగు శివుని స్మరించుచు భూమిపై నున్న రాజులందరిని ఇరువది యొక్క మార్లు సంహరించెను. చివరకు మాతృగర్భమున నున్న శిశువు, తల్లి ఒడిలోనున్న శిశువు, వృద్ధుడు, మధ్య వయస్సులోనున్నవాడు, అనుభేదములేక క్షత్రియులనందరను తన ప్రతిజ్ఞను నెరవేర్చుకొనుటకై చంపెను.
కార్తవీర్యార్జునుడు గోలోకమున నున్న శ్రీకృష్ణుని సన్నిధికి పోయెను. అప్పుడు పరశురాముడు శ్రీహరిని స్మరించుకొనుచు సంతోషముతో వెళ్ళిపోయెను. మహేశ్వరుడు పరశురాముడు ఇరువది యొక్క మార్లు భూమిపై నున్న రాజుల సంహరించిన గతిని తెలిసికొని సంతోషించేను. అట్లే మునులు, దేవతలు, దేవతాస్త్రీలు, సిద్దులు, గంధర్వులు, కిన్నరులు, అందరు పరశురాముని పై పుష్పవృష్టిని కురిపించిరి. అట్లే స్వర్గమున దుందుభులు మ్రోగినవి. అందరు సంతోషపడిరి. ఈ విధముగా పరశురాముని కీర్తి లోకమంతట ప్రసరించినది.
ఆ సమయమున బ్రహ్మదేవుడు, భృగుమహర్షి ఇంద్రుడు, వాల్మీకి, చ్యవనమహర్షి, జమదగ్ని సంతోషముతో బ్రహ్మలోకమునుండి వచ్చిరి. వారందరు సంతోషముతో పులకించిన అవయవములు కలవారై చేతిలో దర్భలు, పుష్పములు ధరించి భార్గవరామునకు శుభాశీస్సుల నొసగిరి.
పరశురాముడు తన దగ్గరకు వచ్చిన బ్రహ్మాదులను చూచి భూమిపై వారికి సాష్టాంగ నమస్కారము సమర్పింపగా బ్రహ్మదేవుడతనిని తన దరిజేర్చుకొని తొలుత నాయనా అని పిలుచుచు వేదములయొక్క సార రూపమైనది, నీతితో కూడుకున్న మాటలనిట్లు పలికెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను-
భార్గవరామా! సమస్త సంపదలనొసగునదియు, అందరకు సమ్మతమైనదియు, సత్యమైనదియు అగు కాణ్యశాఖయందు చెప్పబడిన విషయమును నీకు చెప్పెదను. పూజ్యులందరిలో ఆందరకు సమ్మతమైన పూజ్యుని గురించి చెప్పెదను.
జన్మ నిచ్చినందువలన తండ్రిని జనకుడందురు. అన్నము, వస్త్రము మొదలగునవి ఇచ్చినందువలన ఆతనిని పితయనీ అందురు.
జన్మనిచ్చిన తండ్రి కంటె అన్నమును పెట్టి పోషించిన తండ్రి గొప్పవాడు. ఎందువలనంటే అన్నము లేనిచో తండ్రివలన జన్మించిన ఈ దేహము నశించిపోవును. జన్మనిచ్చిన తండ్రి, అన్నము పెట్టి పోషించిన తండ్రికంటె తల్లి నూరు రెట్లెక్కువగా గౌరవింపదగినది. ఆమె గర్భమున ఉంచుకొని పెంచి పోషించినందువలన మిక్కిలి గౌరవింపదగినది.
తల్లి దండ్రులకంటెను ఇష్టదేవత చాల గొప్పనిది. జ్ఞానము, విద్య, మంత్రముల నొసగు గురువు ఇష్టదేవత కంటే గొప్పవాడు, గురువుయొక్క పుత్రుని గురువు వలెనే గౌరవింపవలెను. గురువు యొక్క భార్యను గురుపుత్రుని కంటే ఎక్కువగా గౌరవింపవలెను.
ఇష్టదేవతకు కోపము వచ్చినచో గురువు తన శిష్యుని రక్షించుకొనును. కాని గురువునకు కోపము వచ్చినచో ఆ శిష్యుని ఎవ్వరు కాపాడలేరు. గురువే చతుర్ముఖ బ్రహ్మ. అతడే విష్ణుమూర్తి, ఆ గురువే మహేశ్వరుడు అతడు పరబ్రహ్మతో సమానడు. అతనిని బ్రాహ్మణుల కంటే గొప్పగా మన్నింపవలెను. గురువు జ్ఞానమును, హరిభక్తిని కలిగించు జ్ఞానమును కలిగించును. శ్రీహరి భక్తిని కలిగించు గురువుకంటే గొప్ప బంధువు ఎవరు కాజాలరు. అజ్ఞానమను చీకటిని తొలగించి జ్ఞాన దీపమున ఇచ్చు గురువును మించిన బంధువు ఎవరు కాజాలరు. గురువు ఉపదేశించిన మంత్రమును జపించి జ్ఞానము పొందవచ్చును. ఆతడు సర్వజ్ఞాడు కాగలడు. సిద్దులను పొందగలడు. గురువు నేర్పిన విద్య వలన ఆన్నీ స్థలములందు జయమును పొంది గౌరవమును పొందును. అట్టి గురువును మించిన బంధువెవ్వరు ఉండబోరు.
విద్యామదము కలవాడు లేక ధనమదము కల మూర్ఖుడు గురువును గౌరవింపనిచో అతనికి బ్రహ్మహత్యాది పాపములు తప్పక సంభవించును. గురువు దరిద్రుడైనను, పతితుడైనను, అల్పుడైనను ఆతడు మానవమా త్రుడని భావించి గౌరవించనిచో అతడు ఎన్నీ పుణ్యతీర్థములందు స్నానము చేసినను పవిత్రుడు కాజాలడు. అట్లే ఆతనికి పుణ్యకర్మలు చేయునధికారముండదు.
ఓ పరశురామా! నీఇష్టదేవత శ్రీకృష్ణుడు అట్లే నీ గురువు శంకరుడు. అందువలన దేవతలందరు గౌరవించు నీ గురువును నీవు శరణు వేడుము. నీవు ఈ భూమినంతయు తిరిగి ఇరువది యొక్క మార్లు ఇచట రాజులు లేకుండునట్లు చేసితివి. ఇదియంతయు నీ గురువును శరణు జొచ్చినందువలననే జరిగినది. అట్లే నీ గురువుయొక్క అనుగ్రహమువ లన శ్రీహరి భక్తిని పొందితివీ, ఆ విధముగా శ్రీహరియొక్క భక్తిని ప్రసాదించిన నీ గురువగు శివుని శరణు వేడుము.
అతడు మంగళరూపుడు. మంగళమును కలిగించువాడు, మేలు కలిగించువాడు. శాంతరూపుడగు ఆ పరమశివుని సేవింపుము. అట్లే అతడు గోలోకనాథుడగు శ్రీకృష్ణుని యొక్క అంశస్వరూపుడు. నీయొక్క ఇష్టదేవత. అట్టి శంకరుని నీవు శరణువేడుము..
శ్రీకృష్ణుడు ఆత్మరూపుడు, శివుడు జ్ఞాన స్వరూపుడు, నేను (బ్రహ్మదేవుడు) మనోరూపుడను, విష్ణువునకు ప్రాణ స్వరూపురాలు ప్రకృతి సమస్తశక్తులు గలది. వీరిలో గురువు జ్ఞానమును కల్గించును. జ్ఞానస్వరూపుడు, జ్ఞానకారణుడు, సనాతనుడు, కాలమునకు కాలరూపుడు, బ్రహ్మజ్యోతి స్వరూపుడు, భక్తానుగ్రహరూపుడు. ప్రకృతి లక్ష సంవత్సరములు తపస్సు చేసి శంకరుని భర్తగా పడసినది. అట్టి గురు రూపుడగు శంకరుని నీవు శరణువేడుము.
ఈ విధముగా బ్రహ్మదేవుడు పరశురామునితో పలికి మునులతో కలసి బ్రహ్మలోకమునకు పోయెను. అట్లే పరశురాముడు తన గురువగు శంకరుని దగ్గరకు పోవుటకు నిశ్చయించెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండములో సారద నారాయణుల సంవాద సమయమున చెప్పబడిన భార్గవరాముని కైలాసగమనోపదేశమను నలుబదియవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 40 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
In this illuminating chapter, Lord Śrī Kṛshṇa explained the deep esoteric meanings behind the primary names of Lord Gaṇeśa, particularly the revered title Ekadanta. He revealed that the syllable Eka signifies the single, supreme Parabrahman, while Danta signifies the mighty power that shatters all illusions and demonic tendencies, making Ekadanta the supreme symbol of non-dual spiritual truth. The text outlines the eight principal names of Gaṇeśa—Vighnanāsha, Ekadanta, Heramba, Lambodara, Gajanana, Vināyaka, Gaṇādhyaksha, and Bhālachandra—promising that whoever recites these holy names daily becomes free from all obstacles, poverty, and fear.