నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లు పలికెను –
కార్తవీర్యుడు ఇంటికివెళ్ళి హరిని మనస్సులో స్మరించుకొని జరిగినదానికి ఆశ్చర్యపడి తిరిగి జమదగ్నియొక్క ఆశ్రమమునకు వచ్చెను. అతని వెంట నాలుగులక్షల రథములు పదిలక్షల రథికులు, అసంఖ్యాకమైన గజదళము, ఆశ్వదళము, పదాతిదళము, గొప్ప బల పరాక్రమములుగల వేయిమంది రాజేంద్రులుండిరి. ఇట్టి గొప్ప సైన్యముతో కార్తవీర్యుడు ముల్లోకములను సహితము జయింపగలిగియుండెను. కార్తవీర్యుడు తనసైన్యమునంతయు జమదగ్ని ఆశ్రమము చుట్టు నిలిపియుండెను. ఆ మహారాజు కవచమును ధరించియుండెను. అతని సైన్యఘోషవలన, అతని సైన్యమందలి వాద్యఘోషవలన జమదగ్నియొక్క ఆశ్రమమున నున్నవారందరు మూర్ఛిల్లిరి. అప్పుడతడు జమదగ్నియొక్క ఆశ్రమమును ప్రవేశించి అందున్న కపిలను బలాత్కారముగా తన పట్టణమునకు తీసికొనిపోవ ప్రయత్నించెను.
అప్పుడు జమదగ్ని మహర్షి మూర్చనుండి తేరుకొని అమ్ములతోనున్న ధనుస్సును తీసికొని కవచము ధరింపకనే ఒంటరిగా యుద్ధమునకు బయలుదేరెను. బయలు దేరుటకు పూర్వము జమదగ్ని మహర్షి కపిలకు నమస్కరించి శ్రీహరిని మనస్సులో స్మరించుకొనుచు ఆశ్రమమునందున్న సమస్తజనులను ఓదార్చి శంకలేక యుద్ధరంగమును చేరుకొనెను.
అతడు మంత్రపూర్వకమైన బాణములచే తన ఆశ్రమమును కవచము ధరించిన మానవునివలె కప్పిపుచ్చి మరియొక బాణపరంపరచే శత్రువుల సమస్తసైన్యమును కప్పివేసెను.
కార్తవీర్యుడు జమదగ్ని మహామునిని చూచి రథమునుండి దిగి తనతోటి రాజులతో కలిసి చేతులు జోడించుకొని అతనికి నమస్కరించెను. జమదగ్ని అతనికి ఆశీస్సుల నొసగిన పిమ్మట కార్తవీర్యుడు తన రథమునధిరోహించి తనతోటి రాజులతో కలిసి ముని పైన బాణవర్షమును కురిపించెను. కార్తవీర్యుడు చేసిన అస్త్రశస్త్రములను గదను శక్తిని ముని అవలీలగా ఖండించి రాజాపై దివ్యాస్త్రమును వేయగా నతడుకూడ దానిని అవలీలగా ఖండించెను. రాజు విసిరిన శూలమును ముని ఖండించి మరియొక బాణపరంపరచే శత్రుసైన్యమును కప్పివేసెను, అట్లే శత్రువులు ప్రయోగించిన అస్త్రశస్త్రములను తన శస్త్రాస్త్రములచే ముక్కలు ముక్కలుగా చేసెను. కార్తవీర్యుని యొక్క సైన్యము జమదగ్ని ప్రయోగించిన బాణములను తప్పించుకొని పారిపోవుటకు కూడ వీలు లేక పోయను. ఆ తరువాత మహర్షి ప్రయోగించిన జృంభణాస్త్రము వలన కార్తవీర్యుడు అతని సైన్యము నిద్రలో మునిగినది. కార్తవీర్యుడు నిద్రలోనున్నందువలన జమదగ్ని అతనిని చంపక శోకమున మునిగియున్న కపిలను తన ఆశ్రమమునకు తీసికొనిపోవుటకు ప్రయత్నించెను.
ఆసమయమున కార్తవీర్యుడు తెలివికి వచ్చి ధనుర్బాణములను తీసికొని మహర్షిని అడ్డగించగా కామధేనువు భయపడి తానుండిన ప్రదేశమునకు పోయెను. జమదగ్ని మహర్షికూడ నిర్భయముగా ధనుర్బాణములను తీసికొని నిలుచుండెను. అప్పుడు రాజు మునిపై బ్రహ్మాస్త్రమున వేయగా మహర్షి ఆ బ్రహ్మాస్త్రము చేతనే దానిని నివారించెను. పైగా రాజుయొక్క రథమును, సారథిని, కవచమును అన్నిటినీ ఛేదించెను. అందువలన రాజు పరమకృద్దుడై దత్తాత్రేయ మహర్షి తనకిచ్చిన ఏక పురుష సూతిని యగు శక్తిని ప్రయోగించెను. ఆ శక్తి నూరుగురు సూర్యుల కాంతిగలది. యోగియగు కార్తవీర్యుడు సమస్త దేవతల తేజస్సును, బ్రహ్మ, విష్ణు, శంకరుడు, మాయాదేవియొక్క తేజస్సును మంత్రపూర్వకముగా ఆ శక్తియందు ఆవాహనచేసి మహర్షిపై ప్రయోగించెను. ఆ శక్తి ఆకాశమును దశదిశలను ప్రకాశింప జేయుచుండెను. ఆ సమయమున ఆకాశమున నున్న దేవతలు దుఃఖించుచు హాహాకారములు చేయసాగిరి. ఆ శక్తి జ్వలించుచు మహర్షి రొమ్మునకు తగిలి ఆతని వక్ష స్థలమును భేదించుచు హరి సన్నిధికి పోయెను. ఆ శక్తిని శ్రీహరియే శస్త్రాస్త్ర విశారదుడగు దత్తాత్రేయునకిచ్చెను. అందువలన అది తిరిగి శ్రీహరిసన్నిధికి పోయినది. ఆ శక్తి తగిలినందువలన ముని మూర్చను పొంది వెంటనే ప్రాణములను వదిలెను. అతని ప్రాణములు ఆకాశమున క్షణకాలము తిరిగి బ్రహ్మలోకమునకు పోయినవి.
యుద్ధరంగమున మహర్షియగు జమదగ్ని చనిపోయిన వృత్తాంతమును తెలిసికొన్న కపిల తండ్రీ! తండ్రీ! యని పిలుచుచు గోలోకమునకుపోయి గోలోకమున గోపీగోపకులతో రత్న సింహాసనము పైనున్న శ్రీకృష్ణునితో జరిగిన విషయమునంతయు వివరించినది.
ఆ కామధేనువును శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునకివ్వగా, అతడు భృగుమహర్షికిచ్చెను. ఆ భృగుమహర్షి పుష్కరక్షేత్రమున తన పుత్రుడగు జమదగ్ని మహర్షికిచ్చెను. ఆ కామధేనువు గోలోకమందలి కామధేనువులకు నమస్కరించి వాటివద్దకుపోయెను.
ఆ కామధేనువుయొక్క కన్నీళ్ళనుండి రత్నసంధుడను వాడు పుట్టగా, కార్తవీర్యుడు అతనిని కూడ సంహరించి తన సైన్యమును ఓదార్చి ప్రాయశ్చిత్తమును కూడ చేసికొని తన పట్టణమునకు తిరిగిపోయెను.
తనభర్త చనిపోయేనను విషయమును విన్న రేణుకాదేవి జమదగ్నిని తన ఎదపైనుంచుకొని క్షణకాలము మూర్ఛపొందెను. ఆ దుఃఖమున ఓ భార్గవ రామా రమ్ము రమ్మని పిలవగా భార్గవ రాముడు తక్షణమే పుష్కర క్షేత్రము నుండి మనోవేగముతో అచ్చటకు వచ్చి భక్తితో తల్లికి నమస్కరించేను.
భార్గవ రాముడు తన తండ్రి చనిపోయిన విషయమును తెలుసుకొని తల్లియొక్క దుఃఖమును చూచి కపిల గోలోకమునకు పోవుచున్న వృత్తాంతమును తెలిసికొని అతిగా ఏడ్చెను. యోగీంద్రుడగు భార్గవరాముడు చందనపు కట్టెలతో, నేతితో తండ్రికి చితిని ఏర్పాటుచేసెను. తల్లియగు రేణుకాదేవి తన పుత్రుడగు రాముని అక్కునకు చేర్చుకొని అతని చెక్కిళ్ళను శిరస్సును ముద్దిడుకొని మాటిమాటికి ఏడ్చుచు ఇట్లు పలికెను.
ఓ భార్గవరామ నిన్ను వదలి నేనెక్కడికి పోయెదను నీవునాయొక్క ప్రాణములకంటే మిన్నయైనవాడవు. నాయనా నీతల్లియగు నామాటలు వినుము. నీవు నీపితరులయొక్క అంత్యక్రియను నిర్వర్తింపుము. యుద్దమును మాత్రము చేయవద్దు. ఇంటిలోనే ఉండి తపస్సును చేసికోనుచుండుము. క్రూరులైన క్షత్రియులతోడి యుద్ధము సుఖమున కలిగింపదు అని రేణుక ఏడ్చుచు పుత్రునితోననెను. కానీ భార్గవరాముడు తల్లిమాటలు వినిపించుకొనక ఈ భూమినీ ఇరువది యొక్క మార్లు క్షత్రియ రహితముగా తప్పక చేయుదునని క్షత్రియాధముడగు కార్తవీర్యుని సంహరింతునని, క్షత్రియుల రక్తముచే నా పితృదేవతలకు తర్పణమును చేయుదునని దృఢమైన ప్రతిజ్ఞచేసెను.
భార్గవ రాముడీ విధముగా నని తల్లిముందు వెక్కి వెక్కి ఏడ్చుచు సత్యము, హితవు, నీతిసారమైన మాటలనిట్లు పలుకసాగెను.
రామ ఉవాచ - భార్గవరాముడిట్లు పలికెను –
తండ్రియొక్క ఆజ్ఞను తీరస్కరించువానిని, తండ్రిని చంపువానిని, చంపని మహా మూఢుడు రౌరవ నరకమునకు పోవును.
ఇంటికి నిప్పుపెట్టువాడు, విషమును పెట్టువాడు, శస్త్రమును ధరించువాడు, ధనమును అపహరించువాడు, భూమిని, భార్యను అపహరించువాడు, పితరులను, బంధువులను హింసించువాడు, జాడ్యముగా ప్రవర్తించువాడు, ఇతరుల నిందించువాడు, కటువుగా మాట్లాడువాడు అను పదకొండుమంది పాపులనియు, వారు మరణదండనకు అర్హులనియు వేదము సహితము చెప్పుచున్నది. ఈ సమయమున బ్రాహ్మణులీ వధార్హమైన పనిచేసినచో వారి ధనమును స్వాధీనము చేసికొనుట, ఊరినుండి. బహిష్కరించుట, తలకొరిగించుట, కొట్టుట, అనునవి వధతో సమానమైన శిక్షలని పెద్దలందురు.
ఆ సమయమున విజ్ఞాడగు భృగుమహర్షి బాధపడుచు అచ్చటకు వచ్చెను. అతనిని చూచి రేణుక, భార్గవరాముడు విసయముతో లేచి నమస్కరించిరి. వారిని చూచి భృగుమహర్షి పరలోకహితమునకై వేదసమ్మమైన మాటలను ఇట్లు పలికెను.
భృగురువాచ - భృగుమహర్షి ఇట్లు పలికెను –
ఓ భార్గవరామా! నీవు నావంశమున పుట్టినవాడవు. జ్ఞానవంతుడవగు నీ విట్లు ఏడ్వవచ్చునా? ఈప్రపంచమున చరా చర ప్రాణికోటి యంతయు నీటిబుడగవలె క్షణములోనే పుట్టును. క్షణములోనే నశించును. నీవిప్పుడు సత్యరూపుడైన కృష్ణుని మనస్సులో స్మరించుకొనుము.
జరిగినదేదియో జరిగిపోయినది. జరిగిన విషయము తిరిగిరాదు. అట్లే జరుగవలసినదీ తప్పక జరుగును. పూర్వ జన్మార్జితమైన తన కర్మ ఫలితము నెవ్వరు తప్పింపలేరు. భూత భవిష్యద్వర్తమానము లన్నియు శ్రీకృష్ణునివలన నిశ్చయింపబడినవి. అట్లు పరమాత్మచే నిర్ణయింపబడిన వాటిని ఎవ్వరు నివారింపగలరు?
మాయకు కారణమైన అశాశ్వతులయొక్క ఈ శరీరము పాంచభౌతికమైది. ఇది ఒక సంకేతమువంటిది కాని స్థిరమైనదికాదు. ఈ శరీరమునుండి పరమాత్మబయలుదేరగనే ఆకలి, నిద్ర, దయ, శాంతి, ఓర్పు, కాంతి, ప్రాణములు, మనస్సు, జ్ఞానము మొదలగునవన్నియు రాజును అనుచరులు అనుసరించిపోవునట్లు బయలుదేరిపోవును. ఇవన్నియు కృష్ణుననుసరించి శరీరమున ప్రవేశించును. కృష్ణుననుసరించి శరీరమునుండి వెడలిపోవును కావున నీవు శ్రీకృష్ణుని ఎల్లప్పుడు సేవించుచుండుము. తండ్రి, కొడుకు అనుబంధము ఈ అగాధమైన సంసారసాగరమున కర్మలవల్ల ఏర్పడినది. అందువలన జ్ఞానవంతులు ఎన్నడును మృతిచెందిరనుబాధకు లోనుకారు. బంధువులు మృతునికొరకు ఏడ్చి కన్నీరు కార్చినందువలన ఆ మృతునికి నరకము తప్పక లభించును. బంధువర్గము మృతుని పేరుపెట్టి ఎన్ని సంవత్సరములేడ్చినను అతడు తిరిగిరాడు. మృతునియొక్క పార్థివాంశమైన చర్మము, ఎముకలు మొదలగువాటిని భూమీగ్రహించగా, జలాంశమును జలమును, ఆకాశాంశమును ఆకాశము, వాయ్వంశమ వాయువు, తేజోఽoశమును తేజస్సు గ్రహించును. ఈవిధముగా పంచభూతముల యందు విలీనమైన మృతునిగూర్చి దుఃఖించినచో అతడు తిరిగి వచ్చునా? మృతుని పేరు, కీర్తి, సత్కర్మలు మాత్రము మిగిలిపోవును? అందు వలన వేదోక్తమైన పారలౌకిక కర్మను నీవు విర్వహింపుము. పరలోకమునకు సంబంధించిన కర్మ చేయువాడే బంధువు, పుత్రుడు అని పలికిన భృగు మహర్షి మాటలు విన్న రేణుకాదేవి శోకమును వదిలి పెట్టి కుమారునితో ఇట్లనెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణములో మూడవదైన గణపతిఖండమున నారద నారాయణుల సంవాదసమయమున పేర్కొనబడిన జమదగ్నిమహర్షి సంహారము, పరశురాముని ప్రతిజ్ఞలు కల ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 27 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
A earth-shaking duel commenced between the thousand-armed King Kārtavīryārjuna and the divine warrior Parashurāma. The king hurled mountain peaks, heavy maces, and celestial missiles at his opponent, but Parashurāma effortlessly neutralized every attack with his bow Vijayadhanus. Raising his glowing battle-axe Parashu, Parashurāma charged forward and systematically severed all thousand arms of Kārtavīryārjuna before striking off the arrogant king's head. Having destroyed the tyrant and his royal army, Parashurāma reclaimed the divine cow Kāmadhenu and her calf, returning triumphantly to his father's hermitage to restore peace.