నారాయణ ఉవాచ- నారాయణుడు నారదునితో ఇట్లు పలికెను-
ఓ నారద! రాజేంద్రులలో శ్రేష్ఠుడగు సుచంద్రుడు రణరంగమున పడిపోయినప్పుడు పుష్కరాక్షు డనువాడు మూడక్షౌహిణుల బలముతో రణరంగమునకు వచ్చెను.
పుష్కరాక్షుడు సూర్యవంశోద్భవుడగు సుచంద్రమహారాజు యొక్క పుత్రుడు. అతడు ఎల్లప్పుడు మహాలక్ష్మిని సేవించుచుండును. అతని కంఠమున నెల్లప్పుడు మహాలక్ష్మీదేవి యొక్క కవచముండును. ఆ కవచము వలన అతడెల్లప్పుడు అంతులేని ఐశ్వర్యములో ముల్లోకములను జయింప గలిగి యుండెను అని పలికెను.
రణరంగమునకు వచ్చిన పుష్కరాక్ష మహారాజును చూచి భార్గవరాముని సోదరులందరు అనేక శస్త్రాస్త్రములను ధరించి అతనితో యుద్ధము చేయుటకై బయలుదేరిరి. అప్పుడు పుష్కరాక్షుడు తన బాణములచే భార్గవరాముని సోదరులను వేధించసాగెను. భార్గవరాముని సోదరులు పుష్కరాక్ష మహారాజు ప్రయోగించిన బాణ జాలమున అవలీలగా ఛేదించిరి. అట్లే ఐదు బాణములు వేసి ఆ మహారాజయొక్క రథమును భగ్నము చేసిరి. ఇంకను ఐదు బాణములు వేసి ఆ మహారాజు యొక్క సారథిని పది బాణములతో ఆతని రథాశ్వములను చంపివేసిరి. అట్లే ఏడు బాణములతో ఆ మహారాజుయొక్క ధమస్సును ఐదు బాణములతో ఆతని అమ్ముల పొదిని భగ్నము చేసి శంకరుని యొక్క శూలమును ప్రయోగించి పుష్కరాక్షుని సోదరులను, ఆతని యొక్క మూడక్షౌహిణీల సైన్యమును సంహరించిరి. భార్గవరాముని సోదరులు ప్రయోగించిన శక్తి, పరిఘమును, భుశుండి, ముద్గరము, గద మొదలగు ఆయుధములన్నియు ఆ మహారాజ యొక్క శరీరమును తగులగనే పిండియై పోయినవి. దానిని చూచి పరశురాముని సోదరులందరు ఆశ్చర్యపోయిరి.
అప్పుడు కార్తవీర్యార్జునుడు తన రథమునెక్కి ధనువు, అస్త్రశస్త్రములను ధరించి తన సేనను వెంటనిడుకొని రణరంగమునకు బయలుదేరేను. ఆస మయమున పుష్కరాక్ష మహారాజు రథమునెక్కి బాణములచే మహాభయంకరమైన యుద్దమును చేసెను. భార్గవరాముని సోదరులు శస్త్రాస్త్రములను ధరించి పుష్కరాక్షుని బాణములన్నింటిని భగ్నము చేసిరి. అప్పుడు పుష్కరాక్షుడు నిద్రాస్త్రమును వేసి వారినందరును నిద్రపోవునట్లు చేసెను. తన తమ్ములందరు పుష్కరాక్షుని బాణములచే దెబ్బలుతిని నిద్రపోవుచుండగా మహాబలుడగు భార్గవరాముడు చూచి వారిని తత్త్వజ్ఞానముచే మేల్కొల్పి వారిని యుద్ధ రంగమునకు వెళ్ళకుండా నిరోధించి పుష్కరాక్షుని చంపుటకై తాను స్వయముగా బయలు దేరెను, పరశురాముడు తన గండ్రగొడ్డలిని ప్రయోగింపగా అది రాజుయొక్క కిరీటమును క్రింద పడవేసి భూమిపై పడిపోయినది. పరశురాముడు తన గండ్రగొడ్డలివి తిరిగి తీసికొని శంకరుని యొక్క త్రిశూలమున మంత్ర పూర్వకముగా ప్రయోగించేను. ఆది రాజుయొక్క కుండలములను చేదించి శివుని సన్నిధికి చేరుకొనెను.
పుష్కరాక్షుడు భార్గవ రాముని చంపుటకు బాణములను ప్రయోగింపగా భార్గవరాముడు వాటిని అవలీలగా ఛేదించెను. అప్పుడు రాజు మంత్ర పూర్వకముగా అనేకాస్త్రములను ప్రయోగించేను. అస్త్రశస్త్ర ప్రయోగ విశారదుడగు భార్గవరాముడు వాటినన్నీటిని అవలీలగా ఛేదించెను. అట్లే భార్గవ రాముడు మంత్రపూర్వమకముగా ప్రయోగించిన ఆ అస్త్రశస్త్రములను నన్నిటిని మహారాజు కూడ అవలీలగా శాంతింపజేసెను. అప్పుడు భార్గవరాముడు బ్రహ్మాస్త్రమును ప్రయోగింపిగా పుష్కరాక్షుడు దానిని, శాంతింపజేసెమ. భార్గవరాముడు పాశుపతాస్త్రముమ తప్ప మిగిలిన అస్త్రములను ప్రయోగింపగా మహారాజు వాటినన్నిటిని శాంతింపచేసెను. చివరకు, పరశురాముడు శివునకు నమస్కరించి పాశుపతాస్త్రమును ప్రయోగింప బూనగా శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణుని యొక్క రూపమును ధరించి అచ్చటకు వచ్చెను.
బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లు పలికెను-
ఓ భార్గవ రామా! నీవు మిక్కిలి జ్ఞానము కలవాడవు, ఆట్టినీవు ఇప్పుడు ఏమి చేయబోవుచున్నావు. నీవు కోపముతో ఒక సాధారణ మానవుని చంపుటకై పాశుపతాస్త్రమును ప్రయోగింపనున్నావు. ఈ పాశుపతాస్త్రము వలన సమస్త ప్రపంచము క్షణములో భస్మము కాగలదు. ఈ అస్త్రము పరమేశ్వరుడగు శ్రీకృష్ణుని తప్ప మిగిలిన ప్రపంచమునంతయు నాశనము చేయును, ఈ పాశుపతాస్త్రమును ప్రయోగించు తలపున మానుకొమ్ము,
నీకు పుష్కరాక్ష మహారాజును, కార్తవీర్యార్జునుని జయించు ఉపాయమున చెప్పెదను. సావధానముగా వినమని పలికేను.
ఓ పరశురామా! ముల్లోకముల యందు లభింపని మహా లక్ష్మీ దేవి యొక్క కవచము పుష్కరాక్ష మహారాజుయొక్క కంఠమున కలదు. అట్లే దుర్గతినీ నాశనము చేయు దుర్గాదేవి కవచము పుష్కరాక్షని పుత్రుని కుడి భుజమునకు కలదు. ఈ కవచముయొక్క ప్రభావము వలన వారు ఈ ప్రపంచమును జయింపగలరు. శరీరమందు ఎచ్చటనైనను ఈ కవచములుండగా ముల్లోకములలో ఎవ్వరుకూడ వారిని జయింపలేరు.
అందువలన నీ ప్రతిజ్ఞను పూర్తి చేయుటకు నేను వారి దగ్గర భిక్షమెతుకొందును అను బ్రాహ్మణ వృద్ధుని మాటలను విని భార్గవ రాముడు భయపడుచు ఆతనితో ఇట్లు పలికెను.
పరశురామ ఉవాచ: సరశురాముడిట్లు పలికెను.
ఓపండితుడా! నీవెవరవో నాకు తెలియదు. బ్రాహ్మణ వేషమును ధరించిన నీవెవరవు? ఈ విషయమును వెంటనే తెలుపుము. అటు పిమ్మట పుష్కరాక్షుని దగ్గరకు వెళ్ళుము అని పరశురాముడనగా బ్రాహ్మణుడు నవ్వి నేను స్వయముగా విష్ణుమూర్తినని చెప్పి ఆమహారాజును యాచించుటకు పోయేను.
ఆ బ్రాహ్మణుడు పుష్కరాక్షుడు, అతని పుత్రుని సమీపమునకు పోయి కవచములనిమ్మని వారిని యాచించెను.
విష్ణుమాయ వలన వారిద్దరు తమ కవచముల నీయగా వాటిని స్వీకరించి శ్రీమహావిష్ణువు వైకుంఠమునకు పోయెను.
నారద ఉవాచ- నారద మహర్షి నారాయణమునితో ఇట్లనెను-
ఓ నారాయణ మునీ! పుష్కరాక్షభూపతికి మహాలక్ష్మీ కవచమును ఎవరుపదేశించిరి. అట్లే అతని పుత్రునకు దుర్గాకవచమును ఎవరుపదేశించిరి? ఈకవచముల స్వరూపమెట్లుండును? వాటి ఫలితమెట్లుండును? ఆయా మంత్రముల స్వరూపమెట్లుండునను విషయము లన్నిటిని నాకు తెలుపుమని కోరిను.
నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను-
ఓ నారదా! పుష్కరాక్షభూపతికి మహాలక్ష్మీ కవచమును, దశాక్షరమైన తన్మంత్రమును, పూర్వము సనత్కుమారుడు ఉపదేశించెను. మహాలక్ష్మీ స్తోత్రము, ధ్యానము పూజ ఇవన్నియు చాల రహస్యమైనవి. ఇవి సామవేదమున చెప్పబడినవి.
అట్లే పుష్కరాక్షభూపతి పుత్రునకు దుర్గాకవచమును, దుర్గాస్తోత్రమును, దశాక్షరమైన దుర్గామంత్రమును, దుర్వాసమహర్షి ఉపదేశించెను. దేవాసుర మహా సంగ్రామ సమయమున ఉపదేశింపబడిన, అత్యద్భుతమైన ఈ దుర్గాకవచమును, స్తోత్రమును, మంత్రముల తరువాత నీకు వివరించెదను.
ఓ నారదా! నీకు మహాలక్ష్మీ మంత్రమును చెప్పెదను వినుము.
“ఓం శ్రీం కమలవాసిన్యై స్వాహా” అనునది మహాలక్ష్మీదేవి యొక్క దశాక్షర మంత్రము.
ఆమె యొక్క ధ్యానము, పూజా పద్ధతి సామవేదమున చెప్పబడినవి. వీటినన్నిటిని సనత్కుమారుడు పుష్కరాక్ష మహారాజునకుపదేశించెను.
వేయి రేకులు గల పద్మమున నున్నదియు, శ్రీహరి సతియు, పద్మమున నివసించునదియు, పద్మము వంటి ముఖము కలదియు, తామర రేకులవంటి కన్నులు కలదియు, పద్మములన్న మిక్కిలి మక్కువను చూపునదియు, పద్మముల శయ్యపై పరుండునదియు, చేతిలో పద్మములు ధరించునదియు, పద్మముల మాలకలదియు, పద్మ పుష్ప భూషణములు కలదియు, పద్మములకు శోభన కలిగించునదియు, పద్మవనమును చూచుచున్నదియు, చిరునవ్వుతోనున్న మహాలక్ష్మిని నేను సేవింతును. (ఇవి ధ్యాన శ్లోకములు)
మహాలక్ష్మీ దేవిని అష్టదళపద్మమున పద్మ పుష్పములచే పూజించి ఆమె గణమును కూడ పూజించి షోడశోపచారములను సమర్పించి అర్చింపవలెను. అటు పిమ్మట ఆదేవిని స్తుతించి భక్తితో నమస్కరించవలెను.
ఇక సర్వకవచసారమగు మహాలక్ష్మీ కవచమును నీకు చెప్పు చున్నాను వినుము అని నారాయణుడు పల్కెను.
ఓ నారదా! మహాలక్ష్మీ కవచము అధిక శుభములను కలిగించును. దీనిని శ్రీమహావిష్ణువు నాభిపద్మమున నున్న తన పుత్రుడగు బ్రహ్మదేవునకు తొలుత ఉపదేశించెను. బ్రహ్మదేవుడీ కవచమును పొందిన తరువాత ఈ జగత్తునంతయు సృష్టింపగల్గెను. అతడు లక్ష్మీదేవియొక్క అనుగ్రహమువలన లక్ష్మీవంతుడయ్యెను. మహాలక్ష్మీ దేవి యొక్క అనుగ్రహమును పొందిన పద్మభవుడు పద్మకల్పమున ఈ కవచమును బుద్ధిమంతుడు, తన పుత్రుడగు సనత్కుమారునకప ఉపదేశించేనప, సనత్కుమారుడీ కవచమును పుష్కర మహారాజునకు ఉపదేశించెను.
ఈ కవచమును ధరించి పఠించుచున్నందువలననే బ్రహ్మదేవుడు సమస్త సిద్దిసమన్వితుడు, పరమైశ్వర్యము, సమస్త సంపదలు కలవాడయ్యెను. కుబేరుడు దీనిని ధరించి పఠించుచున్నందువలన ధనాధిపతి కాగలెను, స్వాయంభువుడు ఈ కవచము వలననే మనువయ్యెను. అట్లే దీని ప్రభావము వలననే ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అధిక సంపత్సమేతులైరి. పృథు మహారాజు ఈ కవచము యొక్క ప్రభావము వలననే పుద్వీపతియయ్యెను. అట్లే దక్షుడు ప్రజాపతియయ్యెను. ఆదేవిధముగ ధర్మదేవత సమస్త కర్మలకు సాక్షిగా, సమస్త జీవులకు రక్షకుడుగా ఏర్పడినది. శ్రీమహావిష్ణువు కూడ ఈ కవచమును తన దక్షిణ భుజమునకు కట్టుకొని క్షీరసాగరశాయి అయ్యెను. శ్రీమన్నారాయణాంశ వలన సంభవించిన ఆదిశేషుడు. దీనిని భక్తితో ఎల్లప్పుడు తన కంఠమును ధరించును, కశ్యప ప్రజాపతి ఈ కవచమును, మహేంద్రుడు దీని వలననే సమస్త దేవతలకు ఆధిపతియయ్యెను. రాజగు, మరుతు దీనివలననే భగవంతుడయ్యెను. నగుషుడు ఈ కవచమును ధరించినందువలననే ముల్లోకములకు అధిపతియయ్యెను. ఆదేవిధముగా శంకరుడు త్రిపురములను జయించెను. మాంధాత చక్రవర్తి పుత్రుడగు ముచికుందుడు ఈ కవచమును ధరించి పఠించినందు వలననే గొప్పవాడయ్యెను అని నారాయణముని పలికెను.
సమస్త సంపదలనొసగు ఈ మహాలక్ష్మీ కవచమునకు ఋషి ప్రజాపతి, చందస్సు బృహతీఛందము, మహాలక్ష్మియే దానికి దేవత, చతుర్వర్గ ప్రాప్తికి దీనిని పఠింపవలెను. మహాపురుషులకు సైతము కవచమనదగిన ఈ కవచము పుణ్యమున కలిగించును.
ఓం హ్రీం కమలవాసిన్యై స్వాహా అమ మంత్రము నాశిరస్సును రక్షించుగాక!
శ్రీం అనునది నా కపాలమును శ్రీం శ్రియైనమః అనునది నా కండ్లను రక్షించుగాక! ఓం శ్రీం శ్రీయై స్వాహా అను మంత్రము నా కర్ణములను రక్షించుగాక!
ఓం క్లీం మహాలక్ష్యై స్వాహా అను మంత్రము నా నాసికను రక్షించుగాక!
ఓం శ్రీం పద్మాలయాయై స్వాహా అను మంత్రము నాదంతముల రక్షించుగాక! ఓం శ్రీం కృష్ణ ప్రియాయై అను మంత్రము నా దంత రంధ్రముల రక్షించుగా!
ఓం శ్రీం నారాయణి అను మంత్రము నా కంఠమును రక్షించుగాక!
ఓం శ్రీం కేశవ కాంతాయై అను మంత్రము నా స్కంథములను రక్షించుగాక!
ఓం శ్రీం పద్మ నివాసిన్యై స్వాహా అను మంత్రము నానాభిని రక్షించుగాక!
ఓం హ్రీం శ్రీం సంసారమాత్రే అను మంత్రము నా వక్షస్థలమును రక్షించుగాక!
ఓం శ్రీం మోం కృష్ణకాంతాయై స్వాహా అనునది నా పృష్టభాగమును రక్షించుగాక!
ఓం హ్రీం శ్రీం శ్రీయై స్వాహా అను మంత్రము నా హస్తముల రక్షించుగాక!
ఓం శ్రీనివాస కాంతాయై అను మంత్రము నాపాదముల రక్షించుగాక!
ఓం హ్రీం శ్రీం క్లీం శ్రియై స్వాహా అను మంత్రము నా సర్వాంగములను ఎల్లప్పుడు రక్షించుగాక!
మహాలక్ష్మి నా తూర్పు భాగమును కమలాలయ నా ఆగ్నేయ భాగమును, పద్మ నా దక్షిణ భాగమును, శ్రీహరి ప్రియ నా నైఋతీ భాగమును, పద్మాలయ నా పశ్చిమ భాగమును, మహాలక్ష్మి నా వాయవ్యభాగమును, కమల నా ఉత్తర భాగమును, సింధు కన్యక నా ఈశాన్య భాగమును, నారాయణి నా ఊర్ధ్వభాగమును, విష్ణుప్రియ నా యొక్క ఆధోభాగమును, విష్ణుప్రాణాధిక యగు మహాలక్ష్మి నన్ను అన్ని దిక్కులనుండి ఎల్లప్పుడు కాపాడుచుండుగాక!
ఓ నారదా! సమస్త మంత్రస్వరూపమైనది, సర్వైశ్వర్య ప్రదమను పేరు కలదియగు శ్రీ మహాలక్ష్మీ కవచము చాల శ్రేష్టమైనది.
బ్రాహ్మణునకు మేరు పర్వతమంత బంగారమును దానము చేసినచో లభించు పుణ్యముకంటె ఈకవచము వలన ఎక్కువ పుణ్యము లభించును. గురువును శాస్త్ర పద్దతిననుసరించి పూజించి ఆతనిచే నుపదేశము పొంది ఈ కవచమును కంఠమందున లేక కుడిరెట్టకైన కట్టుకొనువాడు ప్రతి జన్మలో శ్రీమంతుడగును. వాని ఇంట్లో లక్ష్మీదేవి నూరు తరముల వరకు సుస్థిరముగా నుండును. అతనిని దేవతలు గాని రాక్షసులుగాని సంహరింపలేరు. ఈ కవచమును ధరించువాడు సమస్త పుణ్యములను చేసిన వాడగును. సమస్త యజ్ఞములు చేసిన వాడగును, అట్లే సమస్త తీర్థములను సేవించిన వానితో సమానుడగును.
ఇట్టి కవచమును ఎట్టి పరిస్థితిలోను గురుభక్తిలేని వానికి శిష్యుడు కాని వానికి, శరణు కోరని వానికి ఇవ్వకూడదు. ఈ కవచము లేకుండ మహాలక్ష్మీ మంత్రమును కోటి పర్యాయములు జపము చేసినను ఆ మంత్రము సిద్ధిని కలిగించదని నారాయణముని నారద మహర్షికి తెలిపెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున చెప్పబడిన శ్రీలక్ష్మీ కవచమను ముప్పయి యెనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 38 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
To completely pacify Goddess Pārvatī and glorify her supreme status as the Mother of all creation, Lord Śrī Kṛshṇa recited a magnificent, soul-stirring Stotra in her honor. He praised her as the primordial Prakṛti, the source of all cosmic energies, the embodiment of forgiveness, and the loving mother without whose grace no living being can attain liberation. Hearing these exquisite words of truth from the lips of the Supreme Lord Himself, Goddess Pārvatī's anger dissolved completely, replaced by overflowing divine love and motherly affection for all living beings.