నారాయణ ఉవాచ – నారాయణ ముని ఇట్లు పలికెను –
దేవేంద్రుడు శ్రీహరి మాటలకు సంతసించి తన గురువుతో, తోటి దేవతలతో కలిసి మహాలక్ష్మీదేవి కొరకు క్షీర సముద్ర తీరమునకు బయలు దేరేను. శ్రీహరి ఇచ్చిన కవచమును రత్నఘుటీకయందుంచుకొని తన కంఠమున కట్టుకొని లక్ష్మీదేవిని మాటిమాటికి స్తుతించెను. అట్లే దేవతలందరు భక్తితో తలలు వంచుకొని కన్నీళ్ళుకారగా దీన వదనములతో లక్ష్మీదేవిని స్తుతించిరి.
ఇంద్రాది దేవతలు చేసిన స్తోత్రమును విన్న లక్ష్మీదేవి నూరు చంద్రుల వంటి కాంతి కలదై వేయి దళములు కల వద్మములోనుండి వారికి ప్రత్యక్షమాయెను. ఆ దేవియొక్క కాంతివలన లోకమంతయు నిండిపోయినది. అట్టి లక్ష్మీదేవి దేవతలతో హితవైన మాటలు ఇట్లు పలికినది.
శ్రీమహాలక్ష్మీ రువాచ - శ్రీమహాలక్ష్మి ఇట్లు పలికినది –
ఓ దేవతలారా! మీ ఇండ్లకు వచ్చుటకు నాకు ఇప్పుడు ఇష్టములేదు. మీరు బ్రాహ్మణ శాపము వలన భ్రష్టులైనారు. నేను కూడ బ్రాహ్మణ శాపమునకు భయపడుదును. బ్రాహ్మణులు నాకు ప్రాణముల వంటి వారు. వారు నాకు నాపుత్రులకంటే ప్రియమైన వారు. విప్రులొసగినదానిచే జీవించుట మంచిది. అట్టి బ్రాహ్మణుల యనుమతి యున్నప్పుడే సంతోషముగా మీ ఇంటికి వత్తును. భాగ్యము లేని వారు గురువులు, బ్రాహ్మణులు, భిక్షుకులు వైష్ణవులు మొదలగు వారిచే శాపమును పొందుదురు. సమస్తలోకకారకుడై, జగన్నాయకుడై, సనాతనుడైన నారాయణుడు కూడ బ్రాహ్మణుల శాపమన్నచో భయపడును. అందువలన ప్రస్తుతము మీ ఇండ్లకు వచ్చుటకు భయపడుచున్నానని పలికెను.
ఆ సమయమున బ్రహ్మ తేజో విరాజితులైన బ్రాహ్మణులు సంతోషముతో అచ్చటికి వచ్చిరి. వారిలో అంగీరసుడు ప్రచేతసుడు, క్రతువు, భృగువు, పులహుడు, పులస్త్యుడు, మరీచి, అత్రి, సనక, సనంద, సనాతన, సనత్కుమారులు, కపిలుడు, ఆసురి, వోఢువు, పంచశిఖుడు, దుర్వాసుడు, కశ్యపుడు, అగస్త్యుడు, గౌతముడు, కణ్వుడు, ఔర్వుడు, కాత్యాయనుడు, కణాదుడు, పాణిని, మార్కండేయుడు, లోమశుడు, వసిష్ఠుడు మొదలైనవారుండిరి. ఆ బ్రాహ్మణులు నానావిధ ద్రవ్యములతో, అడవిలో లభించు వస్తువులను నైవేద్యముగా పెట్టి భక్తిపూర్వకముగా జగజ్జననిని పూజించిరి. అట్లే ఆదేవిని అనేకములైన స్తోత్రములచే ఆరాధించి ఓ జగన్మాతా! నీవు దేవతల ఇండ్లకు, మానవుల ఇండ్లకు స్వేచ్ఛగా పొమ్మని కోరిరి.
బ్రాహ్మణులమాటలను విన్న లక్ష్మీదేవి నిర్భయముగా ఇతరుల ఇండ్లకు వెళ్ళదలచి సంతోషముతో నిట్లనెను.
శ్రీమహాలక్ష్మీరువాచ - మహాలక్ష్మి ఈవిధముగా పలికెను –
ఓ బ్రాహ్మణులారా! మీ ఆజ్ఞననుసరించి నేను దేవతల ఇండ్లకు పోయెదను. నీతిమార్గమున పోవు పుణ్యవంతుల ఇండ్లలో నేను స్థిరముగా ఉందును. అట్టి గృహస్థులను, రాజులను నా సంతానమును చూచుకొన్నట్లు రక్షించును.
ఇక నేను ప్రవేశింపని స్థలముల గూర్చి మీకు చెప్పెదను. గురువు, దేవత, తల్లిదండ్రులు, బంధువులు, పితృవర్గము, అతిథి కోపించి పోవు వారి ఇండ్లకు నేను పోను, అట్లే అబద్దములు మాట్లాడువాడు, వేదాధ్యయనము చేయనివాడు, సత్వహీనుడు, చెడు ప్రవర్తన కలవాడు, తనను నమ్మి తన దగ్గరుంచిన ధనమును అపహరించువాడు, కూటసాక్ష్యములను చెప్పువాడు, విశ్వాసములేనివాడు, కృతఘ్నుడు, పిసినారి. దీక్షలేనివాడు, భార్యాదాసుడు, దుశ్శీలయగు స్త్రీ కలవాడు, ఎల్లప్పుడు కలహము పెట్టుకొనువారు, శ్రీహరి పూజ చెయ్యని వాడు, శ్రీహరి కల్యాణ గుణములు కీర్తించనివాడు, అతని కల్యాణ గుణ ప్రశంస నొల్లని వాడు, కన్యను, అన్నమును, వేదమును అమ్ముకొని బ్రదుకువాడు, సాటి మానవుల చంపువాడు, హింసించువాడు, తల్లిని, తండ్రిని, భార్యను, గురుపత్నిని, గురువును, పుత్రుని, అనాథలను, అక్కాచెల్లెండ్లను, కూతురును, ఏగతిలేని బంధువులను పోషించనివాడు, పండ్లు చక్కగా తోముకొననివాడు, మూత్రమును, మలమును విసర్జించిన తరువాత రహాస్యాంగమును చూచుకొనువాడు, కాళ్ళు కడుగు కొనక నిద్రపోవువాడు, నగ్నముగా పరుండువాడు, సంధ్యా సమయమున, పగటి పూట నిద్ర పోవువాడు, నూనెతో తలనంటుకొని తర్వాత మర్మావయవమును ముట్టుకొనువాడు, మర్మావయవమును ముట్టుకొన్న తరువాత శరీరమునకు నూనె పూసికొనువాడు, తలంటుకొనిన పిదప మలమూత్రములు విసర్జించువాడు, గోళ్ళతో భూమిపై రాయువాడు, అట్లే గోళ్ళతో తృణమును గిల్లువాడు, శరీరమున మలము కలవాడు, తాను ఇచ్చిన లేక పరులోసగిన దేవ బ్రాహ్మణ వృత్తులన పహరించువాడు, దక్షిణ లేని పూజా కర్మలు చేయువాడు, మంత్ర ప్రయోగము చేసి బ్రతుకువాడు. వైద్యము చేసి బ్రతుకువాడు, వంటలు వండి బ్రతుకువాడు, దేవాలయమున అర్చనాదులు చేసి బ్రదుకువాడు, వివాహమువంటి ధర్మకార్యముల చెడగొట్టువాడు, పగటిపూట మైథునము చేయువాడు మొదలగు వారి ఇండ్లకు నేనెప్పుడు పోనని లక్ష్మీదేవి పలికెను.
లక్ష్మీదేవి ఫైవిధముగా పలికి దేవతలు మానవుల ఇండ్లలో ఉండుటకు సమ్మతించి అంతర్ధానము చెందెను. దేవతలు మునులందరు ఆ లక్ష్మీదేవిని నమస్కరించి తమ తమ నెలవులకేగిరి. అప్పుడు దేవతల నిలయమగు స్వర్గమును శత్రువులు పరిత్యజించిరి. దేవతల స్నేహితులచ్చటకు చేరిరి. దుందుభి వాద్యము మ్రోగుచుండగా పుష్పవ ర్షము కురియుచుండగా దేవతలు చాంచల్యములేని లక్ష్మిని పొంది తమ రాజ్యమును (స్వర్గమును) తిరిగి పొందిరి.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణుల సంవాదమున పేర్కొనబడిన గణపతికి గజముఖమేర్పడుటకు కారణమైన లక్ష్మీ చరిత్రకల ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 23 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
The narrative introduces the formidable monarch Kārtavīryārjuna, the king of the Haihaya dynasty who ruled from his grand capital of Māhishmatī. Endowed with a thousand arms through the grace of his preceptor Maharshi Dattātreya, Kārtavīryārjuna was a ruler of matchless physical strength and martial accomplishment who had conquered the entire earth and even defeated the demon king Rāvaṇa. However, despite his noble qualities and initial adherence to justice, the king gradually became intoxicated with absolute power and martial pride, setting the stage for his downfall through an offense against a holy sage.