నారాయణ ఉవాచ - నారాయణముని నారదునితో ఇట్లనెను.
పార్వతీ దేవి శని యొక్క మాటలు విని శ్రీహరిని మనసులో తలచుకొని ఈ ప్రపంచమంతయు ఈశ్వరుని యొక్క అభీష్టముననుసరించి ప్రవర్తించునని పలికి దైవమునకు వశమై శనితో నన్ను నాపుత్రుని నీవు చక్కగా చూడుమని పలికెను.
పార్వతీదేవి పలికిన పలుకులు విని శనైశ్చరుడు ఇట్లు చింతించెను. నేను పార్వతీదేవి పుత్రుని చూడవలెనా? చూడకూడదా? నేను శిశువును చూచినచో అతనికి తప్పక ఆపదలు కలుగును. శిశువును నేను చూడకపోయినచో పార్వతీదేవి కోపించి శపించునేమో! ఈ రెండింటిలో మొదలు ఆత్మ రక్షణ చేసికొనుట చాలామంచిదని తలపోసి తాను చేయబోవు పనిలో తన తప్పు లేశమైన లేదని భావించి దానికి ధర్మదేవతను సాక్ష్యముగా ఉంచి మనస్సు పరితాపము చెందుచుండగా కంఠము. పెదవులు, నాలుక ఎండిపోవుచుండగా పార్వతీదేవిని వదలి ఆమె పుత్రుని మాత్రము చూచెదనని తలపోసి కడకంటిచూపులో శిశువు ముఖమును వీక్షించెను.
శనైశ్చరుని చూపుపడగానే బాలుని శిరస్సు తెగిపోగా శనైశ్చరుడు తలవంచుకొని కండ్లుమూసికొనెను, పార్వతీదేవియొక్క ఒడిలో ఆ శిశువుయొక్క మొండెము రక్తముతో నిండిపోయినది. ఆతని శిరస్సు గోలోకమునకుపోయి అచ్చటనున్న శ్రీకృష్ణునిలో విలీనమైపోయినది.
అప్పుడు పార్వతీదేవి తన పుత్రునికై ఏడ్చి ఏడ్చి ఆతని శరీరమును రోమ్మునకదుముకొని మృతురాలివలె మూర్ఛనందినది. ఆ దృశ్యమును చూచి కైలాసముననున్న దేవతా స్త్రీలు శైలములు గంధర్వులందరు చిత్తరువులోని బొమ్మలవలె నిశ్చేష్టులైరి.
కైలాసముననున్న దేవతా స్త్రీలందరు మూర్చితులై పడియుండుటను గమనించిన శ్రీహరి గరుత్మంతున ధిరోహించి ఉత్తర దిక్కులో నున్న పుష్ప భద్రా నదీ తీరమునకు వెళ్ళెను. ఆ పుష్ప భద్రా నదీ తీరమున నున్న ఆడవిలో ఒక గజరాజు తన భార్యతో పిల్లలతో కలసి నిద్రించుచుండెను. ఉత్తరదిశవైపు తలపెట్టి నిద్రపోవుచున్న ఆ గజరాజు శిరస్సును శ్రీహరి తన సుదర్శన చక్రముచే వెంటనే ఖండించి ఆ గజరాజు శిరస్సును తీసికొని గరుత్మంతునిపై నుంచుకొనెను.
సుదర్శనచక్రముచే తెగిపడిన అవయవములు ఇటునటు పడిపోవుటను గమనించిన ఆడ ఏనుగు తన పిల్లలకు తండ్రి చనిపోయిన వృత్తాంతమును చెప్పుచు వాటినన్నిటిని లేపి దుఃఖించుచుండెను. తనకు ఎదురుగా శ్రీమహావిష్ణువు శంఖ చక్ర గదా పద్మములను తన నాలుగు చేతులలో ధరించి పీతాంబర వస్త్రధారియై సుదర్శన చక్రమును తప్పుచు గరుత్మంతునిపై కనిపించెను. చిరునవ్వుతోనున్న ఆ పరమేశ్వరుని ఆడ ఏనుగు ఇట్లు స్తుతించినది.
హే భగవాన్, ! నీవు కర్మ ఫలములను ఖండింపశక్తుడవు. అట్లే కర్మఫలములకు కారణభూతుడవు. కర్మ ఫలము నివ్వగలిగిన వాడవు. ఆ ఫల భోగమునుండి తప్పించ నీవే సమర్థుడవు అని స్తుతింపగా భగవంతుడు సంతోషించి ఆ ఏనుగునకు వరమునిచ్చెను. ఆతడు ఇంకొక ఏనుగు తలను ఛేదించి ఈ గజరాజు శరీరమునకు బ్రహ్మజ్ఞానముచే అతికించెను. తరువాత ఆ గజరాజును కల్పపర్యంతము తన పరివారముతో సహ జీవించియుండుమనీ వరమునిచ్చి మనోవేగమున కైలాసపర్వతమును చేరుకొనెను.
శ్రీమహావిష్ణువు గజశిరస్సును తీసికొనివచ్చి, పార్వతీదేవియొక్క చేతిలోనున్న మృతుడైన శిశువును చేతిలోనికి తీసికొని, ఆ శివువును తన రొమ్మునకు హత్తుకొని, తన దగ్గరనున్న గజశిరస్సును బాలకునకు చక్కగా, అమర్చెను. పర బ్రహ్మ స్వరూపుడు భగవంతుడునైన శ్రీహరి బ్రహ్మజ్ఞానముచే హుంకారోచ్చారణమాత్రమున ఆ శిశువునకు ప్రాణము పోసెను. అట్లే ఆ శిశువును తన ఒడిలోనుంచుకొని మూర్ఛపడియున్న పార్వతిని తట్టిలేపి ఆధ్యాత్మికబోధనలచే ఆమెమ ఓదార్చేను.
విష్ణురువాచ - శ్రీమహావిష్ణువిట్లు పలికెను.
ఓ పార్వతీ! బ్రహ్మమొదలుకొని కీటకమువరకున్న ఈ ప్రాణులన్నియు తాము చేసికొన్న ఫలముననుభవించుచున్నవి. ఆ తాము చేసికొన్న శుభాశుభఫలముల ననుసరించి ఆయా యోనులయందు పుట్టుచున్నవి. ఇంద్రుని వంటివాడు కీటకముగా జన్మనెత్తవచ్చును. ఆట్లే పూర్వజన్మలో చేసికొన్న కర్మననుసరించి కీటకమైనను ఇంద్రుడు కావచ్చును. తాను పూర్వము చేసికొన్న కర్మననుసరించి. దోమ కూడా ఏనుగును చంపగలుగుచున్నది. ఆట్లే సింహము ఈగను కూడా చంపలేకపోవచ్చును. సుఖము, దుఃఖము, భయము, శోకము ఆనందము మొదలగునవన్నియు ప్రాణులు తాము చేసికొన్న కర్మవలననే జరుగుచున్నవి. ప్రాణి సత్కర్మనాచరించినచో సుఖము, సంతోషము కలుగుచున్నవి. దుష్కార్యములనాచరించినచో దుఃఖము, భయము, శోకము మొదలగునవి ఏర్పడును.
సుకృత దుష్కృతములయొక్క ఫలితమును ఈజన్మలోను తరువాత జన్మయందును తప్పక అనుభవించి తీరవలెను. పుణ్యక్షేత్రమైన ఈ భారతదేశము సత్కర్మాచరణకు అనుకూలమైనది. అందువలన ఇచట సత్కర్మ తప్పక చేయవలెను. ఓ పార్వతీ! నీవు బుద్ధిస్వరూపపు, అందువలన నీకు తెలియని దేదియులేదు.
ప్రాణులు చేయు కర్మలకన్నిటికి ఫలితమునిచ్చువాడు. సృష్టికర్తకి కారణభూతుడు, మృత్యువునకే మృత్యువైవవాడు. కాలునకే కాలుడనదగిన శ్రీకృష్ణుడు పరాత్పరుడు. అతడు గోలోకముననుండును, బ్రహ్మ విష్ణు శివాదులమగు మేము ఆ గోలోకనాథునియొక్క ఆంశ స్వరూపులము. ఈ బ్రహ్మాండములన్నిటిని తన రోమ కూపములందుంచుకొనిన మహావిరాట్స్వరూపుడు కూడ ఆ పరిపూర్ణతముని ఆంశస్వరూపమే. మిగిలినవన్నియు ఆ పరమపురుషునియొక్క అంశాంశలు లేక కళాంశాంశలు. అట్టి పరాత్పరుని అంశగా వినాయకుడున్నాడనెను.
పార్వతీదేవి శ్రీమహావిష్ణువు చెప్పిన మాటలు విని ఓదార్పు చెందినదై శ్రీమన్నారాయణునకు నమస్కరించి తన శిశువునకు స్తన్యమునిచ్చినది. ఇంకనూ శంకరుడు బోధింపగా నామె భక్తితో శ్రీమహా విష్ణువును స్తుతించి నమస్కరించినది.
ఆప్పుడు శ్రీమన్నారాయణుడు పార్వతిని, ఆమె పుత్రుని ఆశీర్వదించి తన మెడలోనున్న కౌస్తుభరత్నమును శిశువు మెడలో వేసెను. తరువాత బ్రహ్మదేవుడా శిశువునకు తన కిరీటమునీయగా ధర్మదేవత తన రత్నభూషణములనొసగెను. అట్లే దేవతాస్త్రీలందరు యథోచితముగా రత్నహారములను కానుకగా నిచ్చిరి.
తన పుత్రునకు పునర్జన్మనిచ్చిన శ్రీమహావిష్ణువును శంకరుడు మిక్కిలిసంతోషముతో స్తుతించెను. అట్లే దేవతలు, ముసులు, శైలములు, గంధర్వులు, అచ్చటనున్న సమస్త స్త్రీలందరు శ్రీమహావిష్ణువును స్తుతించిరి.
తమ పుత్రుడు తిరిగి బ్రతికినందువలన పార్వతీపరమేశ్వరులు చాలా సంతోషించి బ్రాహ్మణులకు కోటిరత్నములమ దానము చేసిరి. అట్లే భట్టుమూర్తులకు అనేక గజములను, గుఱ్ఱములను దానము చేసిరి.
పార్వతీదేవి తండ్రియగు హిమవంతుడు, దేవతలు సంతోషముతో బ్రాహ్మణులకు, భట్రాజులకు అనేక దానములు చేసిరి. శ్రీహరి ఆ సమయమున బ్రాహ్మణులకు మృష్టాన్నభోజనమునొసగి. పుణ్యాహమును చేసెను. అట్లే బ్రాహ్మణులచే వేదములను పురాణములను చదివించెను.
ఆ సమయమున దీనికంతయు తానే కారకుడనైతినన్నట్లు శని సిగ్గుపడుచు తలవంచుకొనగా చూచి పార్వతీదేవి కోపమును పట్టలేక ఆ సభయందే అతనిని అంగహీనుడవు కమ్మని శపించినది.
పార్వతీదేవీ శనైశ్చరుని శపింపగా చూచి అచ్చటనున్న సూర్యుడు, కశ్యపుడు, యముడు కోపముతో కైలాసమునుండి వెళ్ళిపోవలెనని లేచినిలబడిరి. కోపముతో ఎఱ్ఱబడిన ముఖములతో పెదవులు వణకుచుండగా వారు ధర్మదేవతను సాక్షిగా చేసి శనైశ్చరుని పార్వతీ మందిరమునకు పొమ్మని ప్రేరేపించిన విష్ణుమూర్తిని శపించుటకై యత్నించిరి. అప్పుడు విష్ణువు, దేవతలు ప్రేరేపించగా బ్రహ్మదేవుడు కోపముతో ఊగిపోవుచున్న సూర్యాదులను, పార్వతీదేవిని ఓదార్చ సాగెను. దేవతలు, మునులు, శైలములు భయపడిపోయి మిన్నకుండిరి.
ఆసమయమున కశ్యపుడు మొదలగువారు వరుసగా బ్రహ్మదేవునితో ఇట్లనిరి.
కశ్యప ఉవాచ - కశ్యప ప్రజాపతి ఇట్లు పలికెను-
శనైశ్చరుడు పూర్వము తన భార్య పెట్టిన శాపమువలననే దుష్టమైన చూపుకలవాడయ్యెను. ఐనను బాలుని తల్లియగు పార్వతీదేవి యొక్క ఆజ్ఞననుసరించియే ఆతడు బాలుని ముఖమును ప్రయత్నపూర్వకముగా చూచెను. కావున శని యొక్క తప్పు ఇందేమి కలదన్నట్లు పలికెను.
శ్రీసూర్య ఉవాచ - సూర్యుడిట్లు పలికెను-
నా పుత్రుడగు శని, ధర్మదేవతాసాక్షిగా తల్లియైన పార్వతీదేవియొక్క ఆజ్ఞననుసరించియే ఆమె పుత్రుని అతి ప్రయత్నముతో చూచెను. అతనిలో తప్పేమీలేకున్నను పార్వతీదేవి నా పుత్రుని ఆంగహీనుడవు కమ్మని శాపమిచ్చినది. నా పుత్రుడేవిధముగా ఆంగహీనుడగునో పార్వతీదేవి పుత్రుడుకూడ అవయవరహితుడు కాగలడనెను.
యమ ఉవాచ – యమధర్మరాజిట్లనెను-
పార్వతీదేవి తాను స్వయముగా తన పుత్రుని చూడవచ్చునని ఆజ్ఞనిచ్చి తనకు చెడు జరిగినదని తానే శపించుట న్యాయమేనా? చంపదలచిన వానిని హింసించుటలో తప్పులేనట్లే మేమందరము ఈమెను శపించెదమనెను.
బ్రహ్మోఽవాచ - బ్రహ్మదేవు డిట్లనెను-
ఓ కశ్యపాదులారా! పార్వతీదేవి తన స్త్రీ స్వభావమువలన తొందరగా కోపించి శనిని శపించినదేకాని వేరుకాదు. పూజ్యులైన మీరు మా అందరి ప్రార్థనపై ఆమెను క్షమింపుడు.
ఓ దుర్గాదేవీ! నీవుకూడ నీ పుత్రుని చూచుటకై ఆజ్ఞనొసగి తరువాత నీకు చెడు కలిగినదని శనైశ్చరుని శపించితివి. ఆతని తప్పేమియులేదు పైగా ఆతడు నీకు అతిథిగా నీఇంటికి వచ్చెను. అట్టివ్యక్తిని శపించుట న్యాయమేనా? అని బ్రహ్మదేవుడు పార్వతికి నచ్చజెప్పి శనియొక్క శాపనివృత్తి చేయుమని అతనిని పార్వతికి సమర్పించెను.
బ్రహ్మదేవుడు పలికిన మాటలకు పార్వతీదేవి సంతోషపడినది. అట్లే సూర్య, యమ, కశ్యపులు కూడ శాంతించిరి. అప్పుడు పార్వతీదేవిని శంకరుడుకూడ శాంతింపచేసెను. అందువలన సంతోషించిన దుర్గాదేవి శనైశ్చరుని తోనిట్లనెను.
పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను-
ఓ శనైశ్చరా! నా వరప్ర భావము వలన నీవు గ్రహములన్నిటికి ఆధిపత్యము వహింతువు. అట్లే శ్రీహరికి అత్యంతమిష్టమైనవాడవగుదువు. ఇంకను చిరంజీవివి, యోగీంద్రుడవు కూడ అగుదువు. నేటినుండి నీకు శ్రీహరిపై భక్తి ఇంకను దృడముకాగలదు అని వరములిచ్చి నా శాపమమోఘము కావున నీవు సర్వాంగహీనుడవు కాక కొద్దిగా కుంటి వాడవగుదువని శనితో పలికి ఆతనికి ఆశీస్పులొసగి తనపుత్రుని ఎత్తుకొని స్త్రీలమధ్య ఉండిపోయెను.
శనైశ్చరుడుకూడ జగన్మాతయగు పార్వతికి భక్తితో నమస్కరించి సంతోషముతో దేవతల దగ్గరకుపోయెను.
శ్రీ బ్రహ్మ వైవర్తమహాపురాణములో మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణ సంవాదసమయమున పేర్కొనబడిన శని వృత్తాంతమను పన్నెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 12 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
Explaining the cosmic background behind Shani's curse and the loss of the child's original head, Śrī Sūta Gosvāmī narrated an ancient history involving Sage Kashyapa and the Sun God Sūrya. In a former age, Sage Kashyapa had become deeply enraged by an offense and had cursed Sūrya's son Shani, while Sūrya Himself had once been struck by the anger of Lord Śiva. This intricate web of past curses and karmic interconnections demonstrated that every event in the material universe, including the loss of Gaṇeśa's original head, unfolds in strict accordance with divine justice and the ultimate will of the Supreme Lord Śrī Kṛshṇa to bring about a higher spiritual purpose.