నారాయణ ఉవాచ – నారాయణ ముని నారదునితో నిట్లనెను –
కార్తికేయుడు నందికేశ్వరువీతో ఫైవిధముగానని, తన తల్లులగు కృత్తికలను ఊరడించి యోగ్యమైన మాటలను ఇంకను ఇట్లు పలికెను.
ఓ తల్లులారా! నేను కైలాసమునకు పోయి అచ్చట దేవతా గణమును తల్లియగు పార్వతిని ఇతర బంధువులను చూచెదను. కావున వారిని చూచుటకు నాకు అనుమతినిండు.
ప్రాణులయొక్క జన్మ, వారు చేయు కర్మ, సంయోగ వియోగములన్నియు దైవాధీనమైయుండును. దైవమునకంటే గొప్పనైనది ఈ లోకమున కన్పింపదు. కానీ ఆ దైవము శ్రీకృష్ణపరమాత్మకధీనమై ఉండును. ఆ పరమాత్మ దైవమునకతీతుడు. అందువలననే సజ్జనులు పరమాత్మ, ఈశ్వరుడునగు శ్రీకృష్ణుని ఎల్లప్పుడు సేవింపుచుందురు. ఆ పరమాత్మ దైవమును పెంచుటకుగాని నాశనము చేయుటకుగాని సమర్థుడు. అందువలన శ్రీకృష్ణుని భక్తుడు దైవముచే బంధింపబడడు. అట్లే అతడు నాశనమును పొందడు.
అందువలన మీరు దుఃఖమును కలిగించు పుత్ర వ్యామోహమును వదలిపెట్టి గోవిందుని సేవింపుచుండుడు. సుఖమును మోక్షమును కలిగించునది, జన్మ మృత్యు భయములను తొలగించునది, పరమానందమును కలిగించునది, మోహమను వలను ఛేదించునది అగు ఆ పరబ్రహ్మమును బ్రహ్మవిష్ణుశివాదులు ఎల్లప్పుడు సేవింపుచుందురు. ఈ సంసారసాగరమున నేనెవరు? మీరెవరు? ఈ ఆత్మీయత ఎట్టిది? ఈ ఆత్మీయతాభావము కర్మయను నదులయొక్క పుంజీభూతమైన నురగవంటిది. ఒకరినొకరు కలిసికొనుట, విడిపోవుట ఇవన్నియు ఆ శ్రీకృష్ణపరమాత్మకు అధీనమైయుండును. ఇదీ స్వతంత్రమైనది కాదని పండితులు వక్కాణింతురు. ఈ ముల్లోకములన్నియు నీటిబుడగలవలె అశాశ్వతమైనవి. మాయవలన జ్ఞానము పోగొట్టుకొనినవారు అశాశ్వతమైన ఈ ప్రపంచమున మాయాబుద్ధికలిగియుందురు. కాని శ్రీకృష్ణపరమాత్మను ఎల్లప్పుడు ధ్యానించు సజ్జనులు మాయామోహితులు కారు.
అందువలన ఓ తల్లులారా! మీరుకూడ మాయామోహితులు కాక నేను కైలాసమునకు పోవుటకై నాకు ఆజ్ఞనిండని వేడుకొనెను.
కార్తికేయుడావిధముగా తన తల్లులగు కృత్తికలతో పలికి, మనస్సులో శ్రీహరిని స్మరింపుచు శంకరుని అనుచరులతో కలపి కైలాసమునకు బయలుదేరెను.
అప్పుడు విశ్వకర్మ నిర్మించినది, అందమైనది, రత్నములు, వజ్రములు, మాణిక్యములచే అలంకరింపబడినది, పారిజాత పుష్పముల మాలలు గలది, మణుల అద్దములు, తెల్లని చామరములతో ప్రకాశించునది, అనేక మందిరములతో, చిత్రములతో శోభిల్లునది, నూరు చక్రములు కలిగి మిక్కిలి విశాలమైనది, పార్వతీదేవి యొక్క అనుచరగణముతో నున్నది అగు రథమును పార్వతీదేవి అచ్చటకు పంపించెను.
కార్తికేయుడు పార్వతీదేవి పంపిన రథమునెక్కుచున్నప్పుడు అచ్చటనున్న కృత్తికాగణము మిక్కిలి దుఃఖముతో వెంట్రుకలు విరబోసికొని మూర్ఛపడి తిరిగి తెలివికి వచ్చి ఏడ్చుచు పిచ్చిపట్టినట్లు అతనితో నిట్లనిరి.
కృత్తికా ఊచుః - కృత్తికలిట్లనిరి.
ఇప్పుడు మేమేమి చేయవలెను? ఎచ్చటకు పోవలెను? మేము సదా నిన్నాశ్రయించియున్నాము కదా! మమ్ములను వదలిపోవుట నీకు ధర్మముకాదు. మేము నిన్ను ప్రేమతో పెంచితిమి కావున నీవు మాకు ధర్మముననుసరించి పుత్రుడవు. ప్రేమగల పుత్రుడు మాతృగణమును వదలిపోవుట ధర్మముకాదు. అనుచు కృత్తికలు తమ రొమ్ముపై అతనినుంచుకొని మరల మూర్ఛచెందిరి. పుత్ర వియోగమతి దారుణమైనది కదా!
అప్పుడు స్కందుడు వారిని అధ్యాత్మప్రబోధముతో ఓదార్చి వారితో, శివుని అనుచరగణముతో కలసి పార్వతీదేవి పంపిన రథమునధిరోహించెను.
కార్తికేయుడు పార్వతీపంపిన రథమునెక్కి కైలాసమునకు వెళ్ళుచున్నప్పుడు అతనికి పూర్ణకుంభము, బ్రాహ్మణుడు, వేశ్య, తెల్లని ధాన్యములు, అద్దము, పెరుగు, నేయి, తేనె, పేలాలు, పూవులు, గరిక, తెల్లని అక్షతలు, వృషభము, ఏనుగు, గుఱ్ఱము, బాగుగా మండుచున్న అగ్ని, బంగారము, మంచిగా పండిన పండ్లు, భర్త, పుత్రులుగలస్త్రీ, దీపము, మణులు, ముత్యాలహారము, పుష్పములమాల, అప్పుడే చంపి ఛేదించిన మాంసము, చందనములను ఎదురుగా చూచేను నక్క, రాజహంస, కుంభము, శవములు ఎడమవైపు పోవుచుండగా చూచెను. ముంగిస, నెమలి, కాటుకపిట్ట, చిలుక, కోకిల, పావురము, శంఖచిల్లము, చక్రవాకపక్షి, కృష్ణసారము, ఆవు, చామరీ మృగము, తెల్లని చామర మృగము, దూడతోనున్న ఆవు, పతాకము మొదలగు మంగళవస్తువులను కుడివైపున చూచెను. అట్లే అనేకవిధములగు మంగళవాద్యములు, ఇం పైన సంగీతము, గంట, శంఖముల చప్పుడును వినెను.
ఇట్లు కార్తికేయుడు తాను వెళ్ళుచున్న త్రోవలో మంగళవస్తువులను, చూచుచు, మంగళవాద్యములను వినుచు మనోవేగమున పోవుచున్న రథమున తండ్రియగు శంకరుని నివాసమును చేరెను. ఆ కైలాసపర్వతమున అక్షయవటవృక్షము క్రింద తన తల్లులగు కృత్తికలతో, శివుని అనుచరగణముతో కొంత సమయముండెను.
పార్వతీదేవి రాజమార్గమును అందముగా చేయించెను. అట్లే దానిని పద్మరాగమణులలో, ఇంద్రనీలమణులతో చుట్టు అలంకరింపచేసెను. త్రోవపొడువువ అరటిస్తంభములను స్వాగతతోరణములను ఉంచెను. పూర్ణకుంభములలో శ్రీఖండవృక్షముయొక్క చిగురుటాకులనుంచినది. మార్గమునంతయు శ్రీచందనముయొక్క నీటిని చల్లించి అసంఖ్యాకములైన రత్నదీపములను మణులను నిలిపినది. అది నటులు, నర్తకులు, వేశ్యలతో సందడిగానుండెను. ఇంకను వందిమాగధులు, గఱిక, పుష్పములు చేతులలో ధరించిన బ్రాహ్మణులు పతిపుత్రులుగల సాధ్వీమణులచ్చటనుండిరి.
పార్వతీదేవి లక్ష్మి, సరస్వతి, దుర్గ, సావిత్రి, తులసి, రతి, అరుంధతి, అహల్య, దితి, తార, మనోరమ, అదితి, శతరూపి, శచీ, సంధ్య, రోహిణి, అనసూయ, స్వాహా, సంజ్ఞ, వరుణునిభార్య, ఆకూతి, ప్రసూతి, దేవహూతి, మేనక, ఏకపాటల, ఏకపర్ణ, మైనాకుని సతి, భూదేవత, మనసాదేవి మొదలగు దేవతాస్త్రీలను వెంట పెట్టుకొని కుమారస్వామిని ఎదుర్కొనుటకు బయలుదేరినది.
పార్వతీదేవి వెంబడి కార్తికేయుని ఎదుర్కొనుటకు రంభ, తిలోత్తమ, మేన, ఘృతాచి, మోహిని. ఊర్వశి, రత్నమాల, సుశీల, లలిత, కళ, కదంబమాల, సురస, వనమాల, మొదలగు అప్సర స్త్రీలు పాటలుపాడుచు, నాట్యములు చేయుచు, అనేక వేషములతో చప్పట్లు కొట్టుచు సంతోషముతో వెళ్ళిరి. ఇంకను బ్రాహ్మణులు, దేవతలు, మునులు, శైలాధిదేవతలు, గంధర్వులు, కిన్నరులు, మొదలగు వారందరు కుమార స్వామి యొక్క పట్టాభిషేకమహోత్సవమునకై సంతోషములో బయలుదేరిరి.
శంకరుడు అనేకవిధములైన పాద్యములతో, తన రుద్రగణము, అనుచరులు, భైరవులు, క్షేత్రపాలురు వెంటరాగా కుమారస్వామినెదుర్కొనుటకు బయలుదేరెను.
అప్పుడు కుమారస్వామి పార్వతీదేవిని సమీపమునుండి చూచి సంతోషముతో రథమునుండి దిగి ఆమెకు నమస్కరించెను. ఆ తర్వాత అతడు లక్ష్మీదేవి మొదలగు దేవతాస్త్రీలను, మునిపత్నులను, శివుని పరమభక్తితో నమస్కరించెను.
పార్వతీదేవీ కార్తికేయుని ఒడిలోనికి తీసికొని అతని ముఖమును ముద్దుపెట్టుకొనెను. శంకరుడు దేవతలు, పర్వతరాజులు, దేవతాస్త్రీలు, పర్వతరాజుల భార్యలందరు అతనిని దగ్గరకు తీసికొని లాలించిరి.
తరువాత పార్వతీదేవి మొదలగు దేవతా స్త్రీలు, శంకరుడు, పర్వతరాజులు, మునులందరు కుమారస్వామికి ఆశీర్వచనముల నొసగిరి. కుమారస్వామి శివగణముతో అచ్చటకువచ్చి కైలాసమునందలి సభలో శేషశాయియగు శ్రీమహావిష్ణువును దర్శించెను.
అటుపిమ్మట రత్నసింహాసనముపై రత్నభూషణభూషితుడై ధర్మదేవత, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు మొదలగు దేవతలు పరివేష్టించి యుండగా చిరునవ్వుతో భక్తులననుగ్రహించు వాడు, మునిశ్రేష్టులు, దేవతా శిరోమణులచే సేవింపబడినవాడు, అగు శ్రీమహావిష్ణువును కుమారస్వామి చూచి భక్తిచే తలవంచుకొని పులకాంకిత శరీరుడై అతనికి నమస్కరించెను. తరువాత బ్రహ్మదేవుని, ధర్మదేవతను ఇతర దేవతలను, ముని శ్రేష్టులను వేరువేరుగా నమస్కరించి వారి ఆశీస్సులను పొంది వారి అనుమతితో కనకాసనమున కూర్చుండెను.
అప్పుడు పార్వతీపరమేశ్వరులు సంతోషముతో బ్రాహ్మణులకందరకు అపరిమితమైన దానము లు చేసిరి.
శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణమున మూడవదగు గణపతిఖండమున నారద నారాయణముమల పంపద పమయమున చెప్పబడిన కార్తికేయుడు కైలాసపర్వతమునకు వచ్చుటయను విషయముగల పదునారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 16 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
This chapter recounts the historical dialogue and sacred union between the reclusive, deeply austere Sage Jaratkāru and Goddess Manasā. Guided by the mandate of his ancestors who required a descendant to liberate them from pitṛ-loka, Sage Jaratkāru agreed to marry Goddess Manasā on the strict condition that he would abandon her if she ever committed an offense against him. They lived together in peaceful asceticism until one evening, when Goddess Manasā gently woke the sleeping sage to prevent him from missing his mandatory evening prayers. Viewing her action as an interruption of his rest, the stern sage invoked his vow and departed for the forest, leaving the pregnant goddess under the divine protection of Lord Śiva.