నారద ఉవాచ - నారద మహర్షి నారాయణమునితో ఇట్లనెను –
ఓ నారాయణ మునీ! లోకసాక్షియగు బ్రహ్మదేవుడు రాక్షసులకు తెల్పిన సూర్యదేవుని కవచము, స్తోత్రము ఎట్టివి? అట్లే సూర్యుని పూజించు పద్దతి, వ్యాధులనన్నీటిని తొలగించు సూర్యమంత్రమెట్టిదో వీటినన్నిటిని నాకు వివరింపగలవు.
సూత ఉవాచ - సూతమహర్షి ఇట్లు పలికెను –
నారదమహర్షి మాటలు విన్న దయాసముద్రుడైన నారాయణుడు అతనికి సూర్య దేవుని స్తోత్రమును, కవచమును, పూజా విధానమున చెప్పుటకు మొదలిడెను.
నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లనెను –
ఓ నారదమహర్షీ! నీకు సూర్యుని పూజావిధానమును, స్తోత్రమును కవచమును అంతయు తెలిపెదను. సుమాలి, మాలి, యను రాక్షసులిద్దరు సూర్యుని యొక్క శాపమువలన వ్యాధిగ్రస్తులైరి. వారిద్దరు తన్నివారణకు శివమంత్రమును ఉపదేశించు బ్రహ్మదేవుని ప్రార్థించిరి. అందువలన బ్రహ్మదేవుడు వైకుంఠమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని ప్రార్థించెను. ఆ సమయమున శివుడు కూడ ఆ శ్రీహరి సన్నిధిలోనే యుండెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడు శ్రీహరితో నిట్లు పలికెను –
ఓ మహావిష్ణూ! మాలి, సుమాలీయను రాక్షసులిద్దరు రోగగ్రస్తులైనారు. అందువలన వారు వ్యాధి వినిర్ముక్తులగుటకు ఉపాయమేమైనా ఉన్నచో తెలుపుడని ప్రార్థించెను.
విష్ణురువాచ - శ్రీమహావిష్ణువు ఇట్లు పలికెను –
సూర్యుడు నాయొక్క అంశస్వరూపుడు, అతనిని సేవించినవారు రోగముక్తులగుదురు. అట్టి సూర్యదేవుని పుష్కరక్షేత్రమున సంవత్సర పర్యంతము సేవించినచో మాలి, సుమాలీ దానవులు రోగముక్తులగుదురు అని విష్ణువనెను.
శంకర ఉవాచ - శంకరుడిట్లు పలికెను –
ఓ బ్రహ్మదేవుడా! వ్యాధులను నిర్మూలనము చేయు సూర్యదేవుని స్తోత్రమును అతని కవచమును, కల్పవృక్షమువలె అన్ని కోరికల నీడేర్చు అతని మంత్రమును ఆ రాక్షసులకుపదేశింపుము.
మనమిద్దరము సంపదను మాత్రము అనుగ్రహింతుము. శ్రీమన్నారాయణుడు సమస్త వాంఛలను తీర్చును అట్లే దీనకరుడగు సూర్యుడు సమస్త వ్యాధులను పోగొట్టును అని పలికెను.
తరువాత బ్రహ్మదేవుడు శ్రీహరి శంకరులవలన సూర్యమంత్రమును పొంది రాక్షసులగు మాలి సుమాలి యను వారి దగ్గరకు వెళ్ళాను. వారు బ్రహ్మదేవుని చూడగనే అతనికి నమస్కరించి కూర్చుండుటకై ఆసనమును సమర్పించిరి. అప్పుడు కరుణాసింధువగు బ్రహ్మదేవుడు రోగగ్రస్తులు, ఆహారమును తీసుకొనలేనివారు, దుర్వాసనవచ్చు శరీరములోనున్నవారగు ఆ దైత్యులను చూచి ఇట్లు పలికెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను –
ఓ దానవులారా! మీరిద్దరు సూర్యభగవానుని కవచమును, స్తోత్రమును, మంత్రమును, పూజా పద్దతిని తెలిసికొని పుష్కరక్షేత్రమునకు పోయి అచట సూర్యుని భక్తిపూర్వకముగా సేవింపుడు అని పలికెను.
తావూచతుః - ఆ రాక్షసులిద్దరిట్లనిరి –
ఓ బ్రహ్మదేవుడా! సూర్యభగవానుని ఏ పూజా పద్ధతిననుసరించి ఏ మంత్రముతో మేము సేవింపవలెను? అట్లే ఆ సూర్యదేవుని స్తోత్రముగాని కవచము గాని ఏ విధముగానున్నవో వాటిని మాకు విపులముగా తెలుపుము అని పలికిరి.
బ్రహ్మోవాచ - బ్రహ్మదేవు డిట్లు పలికెను –
మీరు ప్రతిదినము త్రిసంధ్యలయందు స్నానముచేసి ఈ క్రింది మంత్రముచే భాస్కరుని భక్తితో సేవించినచో రోగవిర్ముక్తులయ్యేదరని పలికెను.
"ఓం హ్రీం నమో భగవతే సూర్యాయ పరమాత్మనే స్వాహా" అను మంత్రముతో సూర్యుని భక్తితో పూజించుచు షోడషోపచారములను ప్రతిదినము సమర్పించవలెను. ఇట్లు సంవత్సర కాలమా సూర్య భగవానుని సేవించినచో తప్పక రోగ నిర్ముక్తులగుదురని పలికెను.
అట్లే ఇంద్రుడు అహల్యను హరించి గౌతముని శాపమునకు గురియైనప్పుడు బృహస్పతి అతనికి ఆ పాపవిమోచనమునకై సూర్య కవచమును ఉపదేశించియుండెను. అపూర్వమైన ఆ సూర్యకవచమును మీకు నేనుపదేశింతునని బ్రహ్మదేవుడనెను.
బృహస్పతిరువాచ - బృహస్పతి ఇట్లు పలికెను –
ఓ ఇంద్రుడా! మిక్కిలి ఆశ్చర్యకరమైన సూర్యకవచమును నీకు ఉపదేశించుచున్నాను. ఈ కవచమును ధరించినందువల్లనే. మునులందరు పరమపవిత్రులు, జీవమ్మక్తులైనారు.
ఈ కవచమును ధరించినవారికి రోగములు ఎట్టి పరిస్థితిలోను దరిజేరవు. పైగా గరుత్మంతుని చూచి పారిపోవు సర్పములవలె రోగములు ఈ కవచధారిని చూచి పరుగెత్తుకొని పోవును.
ఈ కవచమును పరమపవిత్రుడు, పెద్దవారిపై భక్తిప్రపత్తులుకల తన శిష్యునకు మాత్రముపదేశింపవలెను. లేక దుష్టుడు, ఇతరులకు శిష్యుడగు వానికి దీనిని ఉపదేశించినచో ఆ గురువు మృత్యువునకు గురియగునని పలికెను.
ఈ సూర్యకవచమునకు ఋషి ప్రజాపతి. ఛందస్సు గాయత్రీ ఛందస్సు దేవత సూర్య భగవానుడే. ఈ కవచమువలన వ్యాధులు తొలగిపోవును. అట్లే సౌందర్య సంరక్షణము జరుగును. ఈ కవచము వ్యాధులను వెంటనే రూపు మాపగలదు, అట్లే సమస్త పాపములను వెంటనే తొలగించును.
ఓం క్లీం హ్రీం శ్రీం శ్రీసూర్యాయస్వాహా అను మంత్రము నా శిరస్సు నెల్లప్పుడు రక్షించుగాక, పదునెనిమిది అక్షరముల సూర్యమంత్రము నా కపాలమును రక్షించుగాక. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం సూర్యాయస్వాహా అను మంత్రము నా నాసికను. సూర్యదేవుడు నా కండ్లను, వికర్తనుడు కనుపాపలను, భాస్కరుడు నా పెదవులను. దినకరుడు నా దంతములను, ప్రచండుడు నా చెక్కిళ్ళను, మార్తాండుడు నా చెవులను, మిహిరుడు నా భుజములను, పూష నా యొక్క పిక్కలను, రవి నాయొక్క రొమ్మును, సూర్యుడు నా నాభిని, సమస్త దేవతా నమస్కారముల నందు కొనుచున్న సూర్యుడు నా ఎముకలగూడును, బ్రద్నుడు నా చేతులను, ప్రభాకరుడు నా పాదములను, ఈశ్వరుడగు విభాకరుడు నా సమస్తావయవములను ఎల్లప్పుడు రక్షించుచుండునుగాక.
ఇంద్రా! ముల్లోకములలో ఎవరికి లభింపని జగద్విలక్షణమను పేరుగల ఈ సూర్యకవచమును నీకు తెల్పితిని. ఈ కవచమును పూర్వము పులస్త్య మహర్షి మనువునకు తెల్పగా (మనువు నుండి పరిగ్రహించిన) నేను నీకు తెల్పితిని. దీనిని అర్హతలేని వారికి ఉపదేశింపవద్దు,
ఈ కవచముయొక్క ప్రభావమువలన నీవు గౌతమ మహర్షి శాపమువలన కలిగిన వ్యాధి నుండి నిర్ముక్తుడవగుదువు. అట్లే లక్ష్మీ సంపన్నుడవు కూడ కాగలవు. లక్ష సంవత్సరములు యాగము చేసినవానికి ఎంతఫలము లభించునో ఈ కవచమును ధరించిన వానికంత ఫలము లభించును. అట్లే ఈ సూర్యకవచమును వదలి సూర్యమంత్రమును పది లక్షల మార్లు జపించిననూ మంత్రసిద్ధి కలుగజాలదులని బృహస్పతి పలికెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడు మాలి, సుమాలురతో ఇట్లు పలికెను –
ఈ సూర్యకవచమును బాహువుయందు లేక కంఠమందు ధరించి అతనిని స్తుతించినచో మీరిద్దరు తప్పక రోగనిర్ముక్తులగుదురు.
సూర్యస్తోత్రము సామవేదమున చెప్పబడినది. ఇది సమస్తవ్యాధులను, సమస్తపాపములను హరించి ధనసంపదలను. చక్కని ఆరోగ్యమును కలిగించును.
ఆ సూర్యదేవుడు పరబ్రహ్మస్వరూపుడు, పరంధాముడు, జ్యోతిస్వరూపుడు, భక్తులనెల్లప్పుడు అనుగ్రహించువాడు, ముల్లోకములకు నేత్రమువంటివాడు, లోకనాథుడు, పాపములను తొలగించువాడు, తపఃఫలితము నొసగువాడు, పాపాత్ములకు కష్టములను కలిగించువాడు, తమతమ కర్మలకు అనురూపమైన ఫలితములనొసగువాడు, కర్మలకు కారణరూపుడు, దయానిధి, కర్మరూపుడు, క్రియారూపుడు, రూపరహితుడు, కర్మకారణుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తుల అంశ స్వరూపుడు, సత్వ, రజస్తమో గుణాత్మకుడు, వ్యాధులను కలిగించువాడు, వ్యాధులను పోగొట్టువాడు, దుఃఖము, మోహము, భయములను తొలగించువాడు, సుఖమును, మోక్షమును, భక్తిని సమస్త కోరికలను ఇచ్చువాడు, సర్వేశ్వరుడు, సమస్తరూపుడు. సర్వకర్మలకు సాక్షీభూతుడు, సర్వలోకములకు ప్రత్యక్షమగువాడు, ప్రత్యక్షము కానివాడు, ఎల్లప్పుడూ నీటిని పీల్చువాడు, పిదప నీటిని ఇచ్చువాడు, సమస్త సిద్ధులను ఇచ్చువాడు, సిద్ధిస్వరూపుడు, సిద్ధులకు ఈశ్వరుడు, సిద్ధులకు పరమ గురువు అగు సూర్యదేవుని స్తోత్రము చేయుచున్నాను అని బ్రహ్మదేవుడు పలికెను.
పరమ రహస్యమైన ఈ సూర్యస్తోత్రమును మీకు తెల్పితిని. దీనిని మూడు సంధ్యలయందు ప్రతిదినము చదివినచో గుడ్డితనము, కుఘ్ఠరోగము, దారిద్ర్యము, శోకము, భయము అనునవి శ్రీసూర్యదేవుని అనుగ్రహమువలన దరిచేరవు, అట్లే మహాకుష్టుతో బాధపడుచున్ననూ, కండ్లుపోయిననూ, అనేకరకములైన పుండ్లచే బాధలుపడుచున్ననూ, క్షయవ్యాధితో బాధపడుచున్ననూ, విపరీతమైన కడుపునొప్పిచే బాధపడుచున్ననూ, అనేక వ్యాధులు ఉన్ననూ ఈస్తోత్రమును నెలరోజులు చదివినచో వాటినుండి ముక్తి తప్పకపొందును. అట్లే ఈస్తోత్రమును విన్నవాడు సహితము సమస్త పుణ్యతీర్థములలో స్నానము చేసిన ఫలితమును తప్పకపాందును.
అందువలన మీరు వెంటనే పుష్కర క్షేత్రమునకు వెళ్ళి సూర్యదేవుని ఆరాధింపుడని మాలి, సుమాలురకు బ్రహ్మదేవుడు చెప్పి బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయెను.
మాలి, సుమాలురను రాక్షసులు సూర్యుని పై స్తోత్రముతో ప్రతిదినము సేవించి రోగ నిర్ముక్తులైరి.
ఈవిధముగా నీకు సూర్యస్తోత్రమును, సూర్యకవచమును చెప్పితిని. ఇది సమస్త విఘ్నములను తొలగించును. ఈస్తోత్రముచే సూర్యుని స్తుతించినచో తప్పక రోగములు తొలగిపోవును అని నారాయణముని పలికెను.
బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదైన గణపతి ఖండమున నారద నారాయణ మునుల సంవాద సమయమున చెప్పబడిన విఘ్నకారణమను పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 19 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
To relieve the earth of the unbearable burden caused by tyrannical Kshatriya kings who had strayed from the path of Dharma, the Supreme Lord Śrī Vishṇu descended into the house of Sage Jamadagni and Reṇukā as their fifth son, named Parashurāma. From his very infancy, the child displayed extraordinary divine effulgence, martial inclinations, and unyielding devotion to Lord Śiva. Recognizing the transcendent nature of his youngest son, Sage Jamadagni initiated him into the sacred Vedic scriptures, while Parashurāma felt an irresistible inner calling to undertake severe penance to acquire the divine strength necessary to fulfill his cosmic mission.