3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)

Table of Contents

57 - వరుణుఁడు భార్గవుని దర్శించుట 

జైమినిరువాచ :-

జైమిని ఇట్లనెను :

అంత, ప్రశంసార్హమయిన ప్రతులు శుష్కుడు సుమిత్రుఁడు మొదలయిన మహర్షులు, భార్గవరాముని దర్శింపగోరి మహేంద్రాచలమున కరిగిరి, బహుదేశములను, వనములను, నదులను దాటి ఆ మునిపుంగవులు క్రమముగా ఆ పర్వత శ్రేష్ఠమును చేరుకొనిరి. మెల్లగా నా పర్వతము నధిరోహించిరి; అయ్యది ప్రశాంత స్వభావము నొందిన క్రూర మృగములతో కూడినది, శుంభకరమైనది, మధ్య తపోవనము కలది, సర్వ ఋతువుల యందు లభించు ఫల పుష్పములు ఎల్లప్పుడు లభించునట్టిదీ, తరు సమూహములచే మీక్కిలి మనోహరమయినది, చల్లని నీడలతో నొప్పినది, ఆనందమును గలిగించు సుఖకరమయిన వాయువులతో నొప్పినదియు ప్రఖ్యాతాశ్రమ మండలమయిన దానిని ఆ ఋషులు చేరిరి. అందు వేద ఘోష వినిపించు చుండెను. పెద్దలు మహరులు ముందు నడువగా, హృష్ట మనస్కులయిన ఆ తపోవనమును ప్రవేశించిరి. ప్రవేశించి, మెత్తదైన కృష్ణచర్మము పరచిన, బ్రహ్మాసనము నందు, శిష్యులచే పరివృతుడు శాంతుడు, తపోధనుఁడు నయిన వానీని తపోధనులు చూచిరి. అతఁడు పూర్వము కాలాగ్నివలె నిజేచ్చచే మూడు లోకములను దగులబెట్టిన పాపముయొక్క విమోచనము కొఱకు తపస్సాచరించుచున్న వానీవలె నుండెను. వారందరు వినయాచారశాలురు భక్తిచే భుజములువంచి వారు మహామౌనియై భృగుకులశ్రేష్ఠుఁడయిన రామునికి నమస్కరించిరి.  అంత ఆగతులయిన వారిని భృగుకులోద్భవుఁడు. చూచెను. వారిని అర్ఘ్యపాద్యాదులచే సాదరముగా పూజించెను. కృతాతిథ్యులు, దేశాంతరము నుండి వచ్చినవారు, ఆసీనులయినవారు అయిన ఋషులను భృగుశార్దూలుఁడు, నవ్వు మొగముతో ఇట్లు పలికెను. “ఓ మహానుభావులారా ! మీరందరు దయచేసినారు. మీకెల్లరకు స్వాగతము. మేమేమి చేయవలయునో సంశయ రహితముగా వచింపుఁడు. అంత, ఆ మునులు రామునకు నమస్కరించి ఇట్లు పలికిరి. ఓమునిశ్రేష్టా ! మమ్ములనందరను గోకర్ణ వాసులమయిన ఋషులనుగా నెఱుంగుఁడు.

రామ ఉవాచ :-

 శుష్క ఉవాచ :-

ఏదియో యొక కారణమున భూమిని త్రవ్వు సాగరులచే ఆ తీర్థము తన్మహాక్షేత్రము సాగరజలములలో మునిగిపోయినది. సర్వపావనమయిన ఆ క్షేత్రమును మీ వలన తిరిగి అసంశయముగా పొందకోరుచున్నాము. మీరో భృగు కులమున ఈ భూతలమున విష్ణునంశమున జన్మించితిరి. అందుచే మీ కశక్యమైనది మూఁడు లోకముల నేదియును లేదు. మీరే యీ లోకమున వాంఛితార్థ ప్రదులరనీ వినియుంటిమి. అందుచే మేమందరము రాముఁడవయిన మిమ్మభియాచించుటకు వచ్చితిమి ఆ యీ క్షేత్ర రాజమును సత్త్వగుణప్రభావమాత్రముచే, సముద్రోదకములను వెనుకకు తోడి మాకు ప్రసాదించుట కరులరు. రాముఁడిట్లనెను. ఓ తపోధనులారా ! ఆ వృత్తాంతమంతయు సంపూర్ణముగా అలకించియుంటిని. మీ కార్యము నాచే కరణీయము. అందు సంశయము లేదు. కాని, మీరు తలపోసిన అభిలషించిన కర్మ లోకమున సుదారుణమయినది, ఇయ్యది శస్త్రముల దాల్చియే సాధింపఁ దగినది, అంతియేకాని ఇతరత్ర సాధ్యము కాదు. నేను సర్వాభయపూర్వక వరమిచ్చితినీ. శమాన్వితుండనై శస్త్రముల వీడిచితినీ. పూర్వమే పితృ శాసనమున తపస్సమాధిస్థితుఁడనై యుంటిని. ఇంక నెన్నడు శస్త్రమును ముట్టను అనీ పూర్వము సజ్జనుల వద్ద శపథ మాచరించి, ఓ పూజ్యులారా ! శస్త్ర గ్రహణము చేతనే సాధ్యమగు యుష్మదీప్సిత వస్తువునకై, ఇప్పుడేమి నేను చేయవలయునని, డోలాయిత మానసుఁడనయితిని అన శుషుఁడను ఋషి ఇట్లనెను - పూర్వము బ్రహ్మచెప్పినట్లు, సజ్జనుల సంరక్షణము కొలకు శస్త్ర గ్రహణము సత్యవచనదూరము కాఁజాలదు. అందుచే మా యందరి హితము కొఱకు శస్త్రగ్రహణము ధర్మమే యగును. తన్మూలమున ఒక మహాకార్యము నీపోచరించి నట్లగును”.

జైమినీరువాచ :

జైమిని ఇట్లనెను. మేధావి, భృగుపుంగవుఁడీ విధముగా మునులచే నభ్యర్థింపఁబడి, కేవలము ధర్మమునుద్దేశించి, వారి కార్యమంగీకరించి, పారితోఁగలనీ, దక్షిణ పశ్చిమాభిముఖముగా సరిత్పతియైన సముద్రుని చూడనరిగెను. భృగూద్వహుఁడు అచలశ్రేష్ఠమయిన సహ్య పర్వతము నుండి దిగి, తరువాత మహామనస్వి సముద్రతీరమును చేరెను. తన చుట్టును వాయువుచే ఆకులమై యున్న సముద్రమును మహర్షి చూచాను. అయ్యది సర్వరత్నములకును ఆకారము స్థానము. అనారతము నీటిచే నింపఁబడుచున్నది. తెలిసికొనుటకు శక్యముకాని అపరిశ్లేయ గాంభీర్యవంతము; అనవగాహ్యమైన మహాత్ముల మనస్సు వంటిది. జనులచే దాటుటకు వీలుకానీ దుష్పారమయినది; వీవీధములయిన మొసళ్లచే సంకులము; లోకమున బ్రహ్మనువలె అప్రధృష్యమైనది; సర్వవ్యాపకమయిన ఆత్మవంటిది; ఉద్ధతులనెల్లర ధిక్కరించినది; సర్వస్వములకు ఆశ్రయము, సర్వనదీనదములకు రాజు. అత్యంతమచపలములయిన యుత్తుంగ తరంగశతమాలికలు కలది. తారమందలి శీలసంఘాతములయిన గుహల యొక్క సంశ్రయము వలనను, విరిగి చీలి విశీర్ణములయిన ప్రవాహముల వలన గలిగిన నురగల సమూహముతో సంశోభితము. గంభీరమయిన ఘోష గలిగినదియు నైన సముద్రమును మునీగణ సహితుడై రాముఁడు చూచేను. అయ్యది తరలములైన లహరీ కణశీతలముచే సంసేవ్యమానుఁడు. నదనదీపతియైన ఆ సముద్రతీరమున, ప్రచేతసుని (వరుణుని) చూడఁగోరి మహాబాహువయిన రాముఁడు క్షణకాలము విశ్రాంతి వహించెను. అంత రాముఁడు లేచెను. దక్షిణాభిముఖస్థితుడయ్యెను. గంభీరమయిన వాక్కులతో వరుణుని గూర్చి ఇట్లు పలికెను. నిన్ను చూడదలఁచి మునులతో సహితము వచ్చితిని. అందుచే ఓ వరుణ ! నీవు రూపమును ధరించి నాకు దర్శన మొసంగుము.

అను రాముని వాక్యములను వినియు యాదసాంపతియయిన వరుణుఁడు తన స్థానము నుండి కదలనైన లేదు. ఆతఁడో స్వయముగా ధీరతరుఁడయ్యెను. మరల మరల రామునిచే సమాహూతుఁడైనను సాగరుఁడు (జలాధిపతి) దర్శనమీయలేదు. సరి. ప్రతివాక్యము కూడ నొసంగలేదు. అలంఘనీయమయిన రాముని వాక్యమును సముద్రుఁడు తిరస్కరించేను, అవధ్గీత మొనర్చెను. ఆతఁడత్యంత కార్యార్ధియై యాచకుఁడై వచ్చెననీ సముద్రుడెఱుంగును. అంత తన వాక్యములు ప్రచేతసునీచే అవమానింపఁబడినవని తలంచి, శస్త్రధారులలో శ్రేష్ఠుఁ డయిన రాముఁడు ఆ సముద్రమును, అభివీక్షించి అధికముగా క్రుద్ధుఁడయ్యెను. రాముఁడు సంక్షుణ్ణ సాగరాకారుఁడై, స్వదిలాశ్రయమున కోపముతో సముద్రమును నిస్తోయముగా (నీరులేనట్టిదీగా)జేయ గోరెను. రాముఁడు జలమును సంస్పృశించెను. (అచమన మొనరించెను). 'విజయ' ధనువును సమీపించెను. రాముఁడు మనసా శర్వునకు ప్రణామమాచరించెను. ఆవిజయ మహద్దనువును గ్రహించెను. క్రోధముచే నెట్టబడ్డ నేత్రములతో, ధనుశ్రేష్టమును చేపట్టి భృగు సత్తముడు సర్వభూతములు చూచుచుండ, దానికి గుణము నారోపించెను. జ్యోఘోష మొనరించెను. ఆ జ్యాఘోషమతనిష్ఠురమై ఆకాశము నంటి వినిపించెను. సప్త ద్వీపార్ణవ సహితయైన భూమి చలించెను. అంత వెంటనే రాముడు కాలానలోపమము సువర్ణపుంఖవిశిఖమును చాపమున సందధాన మొనర్చెను. ఆ యస్త్రము మహాఘోరము, భార్గవము, వహీదైవతమునయినది. సంమత్రాభ్యాస మోక్షణమయిన దానిని జ్యాయుత మొనర్చెను. అంత సశైల వనకాననయైన భూమి కంపించిపోయేను. దేవతలు, అసురులు, మహోరగులు అత్యంత సంక్షోభము నొందిరి. క్రోధ సంరక్తలోచనుఁడు భృగుశ్రేష్ఠుఁడు అస్త్రమును సంధింప చూచి సచరాచరప్రపంచము సంభ్రమ మొందెను. దిక్కులు దహించున భ్రపటలములచే ఆవరింపఁబడెను.

రజోవ్యాప్తములై గొప్ప ధ్వని కలిగి తీవ్ర జంఝా మారుతములు వీచెను సూర్యుఁడు మందరశ్మి మంతుఁడయ్యెను. సూర్యమండలము రక్తవర్ణమయ్యెను. ఉల్కలతో గూడి, రక్తోదకములతో పిడుగుల వాన పడెను. “ఇదియేమి విపత్తని’ అందరు సంభ్రాంతులయిరి. వర్షము వడగళ్లతో నిండి, ధూమవంతమయి భయంకరముగ నుండెను. రాముఁడు దివ్యాస్త్రమును సంధించి ప్రకర్షించెను. సాయకము స్ఫురజ్జ్వలాగ్ర మయ్యెను. అట్లు శరము నధిరోహించి ఆకర్షించిన రాముని కల్పాంతాగ్ని తుల్యునివలె మహర్షులు చూచిరి. రాముఁడు ఆకర్ణాంతము అస్త్రము నాకర్షింప, ప్రతిభయాకారమయిన యాతని శరీరము దుప్తాపమయ్యెను. ఆతని రూపము రవి తేజమువలె నుగ్రమయ్యెను. ఆకృష్టధనుర్మండమలము కల్పాంతమందు ఏర్పడు పరివేషితమండలము వలె కల్పాంతాన్ని సముజ్జ్వలాభీషణ స్ఫూర్తికి ఆతని శరీరము ఆకరమయ్యేను.  రాముఁడు క్రోధానల, జ్వాలా పరీతమయిన యతి రౌద్రత్వమున కంపింప, కల్పాంత కాలమందలి అగ్ని యొక్క జ్వాలలవలె భయంకరమై ఆతని శరీరము విష్ణుని యొక్క చక్రము యొక్క మండలము వలె ఉదోచెను. క్రోధానల జ్వాలాపరీతుఁడయిన రాముఁడు రుద్రత్వముతో విష్ణుని నారసింహాకృతి యొక్క భీకరత్వము వహించెను. ఆతఁడు చాపము నాకర్షింప నాతని భృకుటీ కుటిలాలకముతోడి ముఖము పూర్వము త్రిపురముల దహింపగోరినట్టి . శివుని ఆకృతి యయ్యెను. జాజ్వల్యమానమయిన యాతని శరీరమును చూచి, వెంటనే భయముతో మునులందరు “ప్రసీద, జయ” జయ అని - స్తోత్రపాఠ మొనర్చిరి. అంత అస్రాగ్ని నుండి రేగిన ప్రకాశవంతమయిన ధూమపటలములచే సముద్ర గర్భాంతరాళమంతయు, శకలీకృతమై అవచ్ఛిన్నమయ్యెను. ఆవరింపబడెను. జ్వలించు అస్త్రాగ్ని జ్వాలాపరీతమై సముద్రాపఃపరాహతమై సముద్రుఁడు సంభాంతసలిలౌఘముచే పరీవృతుఁడయ్యెను. సముద్రమందుండెడి తిమింగిలములు, నక్రములు, మత్స్యములు కచ్ఛపములు మిక్కిలి ఆర్తినొందెను. కెరటములు విజృంభించి రేగ జలజీవములన్నియును గెంతి క్రిందపడి సొమ్మసిల్లెను. సముద్రుఁడు వెంటనే అధికముగా క్షోభిల్లెను.

వెంటనే సముద్ర మధిక సంక్షోభమును పొందెను. నీటియందలి భూత జాలము కల్లోలమయిన సముద్ర శరీరముతో భయమొంది యాక్రోశించేను. శరము నుండి బహిర్గమించిన జ్వాలలు తమ ఫూత్కారరవమున అశేషభీషణములయ్యెను. సలిలాంతశ్చారిణులయిన భూతములు తప్త సలిలముతో ఉద్వేలత్వము వహించెను. ఆ ఫూత్కారములన్నిదెసల క్రమ్మెను, అంత ప్రచండ పవనములు సర్వత్ర పరివర్తించెను. అస్రాగ్నిచే వ్యాకులమైన నీరు ప్రళయకాలాబినీరమువలె అగ్నిజ్వాలామయమై, రక్త వీతానము వలె ఆకాశమగుపించెను. ఆ యస్త్ర సంబంధమయిన ఉద్రిక్తతచే తరంగములు ఒడ్డునకు తాకెను. వానితోపాటు అస్త్ర సంబంధాగ్నిచే విధమయి ఆకులమయిన అత్యంత జలహోషము వ్యాపించేను. దిక్కులు బధిరీభూతములయ్యెను. సముద్రమగుపించుట మానెను. సర్వత్ర అస్త్రానల జ్వాలలచే పరివృతమైన జలముల సంబంధముచే ఆవిలమై సహ్యపర్వతము తదాశ్రయులతో సహా ఫరవర్తినీ వహించెను. చెవి వఱకు ఆకర్షించి యుంచిన రాముని యొక్క కోదండమును సముద్రుఁడు చూచి, యముని చూచిన పాతకి పొందు విషాదము వలె నధిక విషాదమును పొందెను. అంత నదనదీపతియైన సముద్రుడు భయకంపితసర్వాంగుఁడయ్యెను. తన సహజ గాంభీర్యమును వదలి, భీరుత్వము నందెను. అంత కొంత సేపటికి స్వస్థతతోడి స్వరూపమును పొంది, సర్వాభరణ భూషితుఁడై, తన జలము నుండి ఉత్తరించుచు వరుణుఁడు కనీపించెను. సార్వహస్తకృతాంజలియై ప్రచేతసుఁడయిన వరుణుఁడు భార్గవ సమీపమునకు, తీవ్రమయిన రాముని ఆస్త్రము వలన మీకీలీ భీతుఁడై త్వరగా బయలుదేరెను. రామ సమీపమునకు వచ్చి, ఆకృష్టమయిన ధనువుతో గూడిన రాముని చరణాబ్జములయందు, పడి, సంభ్రమముచే ఆకులితాక్షరములతో మిక్కిలి భీతుఁడై “ఓ భృగుశార్దూల! నిన్ను శరణుపొందీతి నన్ను రక్షించు”మని ఆర్తుఁడై పలికెను. “ఓ రామ ! ఈ అపరాధము తెలియకచేసితిని. - ఇదిగో నీదగ్గర పాదములంటియుంటిని. నీ నిర్దేశమును నీవు ఆజ్ఞాపింపుము. ఏమి చేయవలెనో సెలవీయుము”. అనెను.

ఇది మహాపురాణమయిన బ్రహ్మాండపురాణమున మధ్యమభాగమునందు తృతీయ ఉపోద్పోతపాదమున భార్గవుని కడకు వరుణాగమమను, ఏబది ఏడవ అధ్యాయము.