3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)

Table of Contents

55 - అంశుమంతునికి రాజ్యప్రాప్తి

జైమినిరువాచ :-

 జైమిని ఇట్లనెను :-

ప్రేమ విహ్వలుఁడయిన సగరుఁడు, తన మనుమనీ కౌగలించుకొనెను అభినందించెను. ఆశీర్వదించెను. ప్రశంసించెను. లాలించేను. ఋత్విక్కులతో, సదస్సులతో గూడి రాజసత్తముఁడు, వేదపారగులచే వీధివంతముగా ఆ యజ్ఞము సర్వసంసద్గుణాన్వితము ఆరంభీంపఁబడెను. ఔర్వ మహర్షి వసిష్ణుఁడు మున్నగు మునులచే నది సంప్రవర్తితము. యజ్ఞవేది సువర్ణమయము. యజ్ఞపాత్రలు పెద్దవి చిన్నవి సకలము సుసమృద్ధము. యజ్ఞము నందంతయు యథాశాస్త్రముగా జరిగెను. ఇట్లు ఆరంభింపఁబడిన యజ్ఞమును ఋత్విక్కులు యజమాన పురస్సరులై క్రమముగా సమాప్తము చేసిరి. విధి వంతులలో శ్రేష్ఠుఁడయిన రాజు యజ్ఞమును సమాప్త మొనరించి, ఋత్విక్కులకు, సదస్సులకు, బ్రాహ్మణులకు, ఆగతులయిన అర్ధులకు, పోరు కాంక్షించిన దానికంటే నభ్యధికముగా నెల్లరకు సువర్ణమును ధనమును రాజొసంగెను.  యథాక్రమము విప్రులను దక్షిణలతో సంతృప్తిచేసి, గురువులకు, సదస్సులకు సాష్టాంగ ప్రణామమాచరించి వారియందరిని యజ్ఞమునందు జరిగిన తప్పొప్పులకు క్షమింపుఁడని అభ్యర్థించెను. అంత బ్రాహ్మణాదులతో, సర్వ వర్ణముల వారితో, ఋత్విక్కులతో అంతః పురజనముతో, సూతులతో మాగధులతో, మందులతో అనుసరింపఁబడి, స్త్రీలతో, శ్వేతచ్చత్ర విరాజితుఁడై చమరములు వీవబడుచుండ, వాలవ్యజనములతో ప్రకాశితుఁడై, నానా విధములయిన మంగళ వాయిద్యముల ఘోషలతో, దిక్కులు బధిరీకృతములు కాగా, రాజు, సరయూ తీరమునకు యథాశాస్త్రము, యథావీధి అరిగి, సంతుష్టాంతరంగుఁడై బంధువులతో, స్నేహితులతో, బ్రాహ్మణులతో సపత్నీకముగా అవబ్బధస్నానము (యజ్ఞాంతస్నానమును), ఆచరించి వీణాపేణు మృదంగములు మొదలయిన వాని ధ్వనులతో విప్రజనులాచరించిన మంగళకరములయిన వేద ఘోషములతో, సంస్తుతింపఁబడుచు, సూతమాగధవందులచే పరిషృతుఁడయి, తిరిగి సంతుష్టులై పరిపుష్టులయిన జనులతో గూడినది రమ్యమైనది, తెల్లని వ్యజనములు, సచ్ఛత్రములు పతాకములు, ధ్వజముల మాలికలతో కలకల లాడునది, చక్కగా నీటిచే తడుపబడి, సర్వ వస్తు సమృద్ధమైన అంగడుల ప్రకాశముతో కూడినట్టిదియు,

            కైలాస పర్వత ప్రకాశముచే మెఱుంగులీను సౌధ పంక్తితో గూడినదియు, అగరు ధూప వాసనలతో దిక్కులను గుబాళించునదియు, పౌర సారీ జనములచే మాటిమాటికి చల్లఁబడు లాజు వర్షమున కలిగిన ఆనందమున మునిగినట్టి నగరవాసులు కలిగినదియు, అందందు వణిగ్టనములచే అనేకమయిన కానుక లొసంగబడుచుండ, ఎల్లరు గౌరవించుచుండ మెల్లగ రాజు స్వపురమునకగను. రాజు. సర్వమండల మండితము (రత్నమణిశోభితము) అయిన గృహమును ప్రవేశించెను. స్నేహితులను, బ్రాహ్మణులను గౌరవించెను, సర్వదేశముల నుండి వచ్చిన దేశాధిపతు లయిన రాజులచే రాజు సంసేవింపఁబడెను. సభాసీనుఁడై రాజశార్దూలుఁడు రెండవ ఇంద్రునివలె ప్రకాశించెను. ఈ విధముగా తన స్నేహితులతో సహితముగా తన మనోభీష్టమును పరిపూర్ణము గావించుకొనీ, నృపవరోత్తముఁడయిన సగరుఁడు తన భార్యలతో సర్వభోగము లందెను. అంత సంతోషముతో, వినయశాలియు మనుమడునయిన అంశుముతునీ, వసిష్ఠుల వారి యనుమతితో యౌవరాజ్యమున నభిషేకించెను,(22) మహారాజు స్వకీయమైన ఉదారగుణములచే, పౌరజానపదులకు, బంధువులకు, స్నేహితులకు, అత్యంత ప్రియుతముఁడయ్యెను. శుక్లపక్షమున నవముగా ఉదయించిన చంద్రునీవలె, బాలుఁడయినను అమీతశక్తిమంతుఁడయిన అంశుమతుని ప్రజలాతని రంజింపఁ జేసిరి. నృపోత్తముఁడయిన సగరుండు, స్నేహితులతో గూడికొని, అనురూపవతులయిన భార్యలతో చిరకాలము సంప్రీతుడై వసించేను, రాజ శార్దూలుఁడయిన సగరుడు యువకునివలె సాక్షార్దర్మమునకు ప్రతిరూపునివలె, సశైల వన కాననమయిన భూమిని పాలించేను. ఈ విధముగా సూర్యవంశ మౌళి రత్నము ఉత్తర కోసలాధిపతియునైన రాజు, పూర్ణచంద్రునివలె సకల లోకమనోభిరాముఁడయ్యెను. తన ప్రజలతో కలిసి రాజు ఆనంద మొందెను.

ఇది వాయు ప్రోక్తమయిన బ్రహ్మాండపురాణమున మధ్యభాగమున తృతీయ ఉపోద్ఘాతపాదమున సాగరోపాఖ్యానమున అంశుమతుని రాజ్యప్రాప్తియను ఏబదియైదవ అధ్యాయము.