29 - భాగవత ధర్మములు - ఉద్ధవుని బదరికాశ్రమ యాత్ర

ఉద్ధవ ఉవాచ

సుదుష్కరామిమాం మన్యే యోగచర్యామనాత్మనః

 యథాఽoజసా పుమాన్ సిద్ధ్యేత్తన్మే బ్రూహ్యంజసాఽచ్యుత

ఉద్ధవుడు పలికెను - శ్రీకృష్ణా! ఇంద్రియజయము లేనివాడీ యోగము ననుష్ఠించుట చాల కష్టమని నా అభిప్రాయము. వ్యక్తి సునాయాసముగా విముక్తిని పొందే ఉపాయమును తేలికగా తెలియునట్లు నాకు చెప్పుము.

ప్రాయశః పుండరీకాక్ష యుంజంతో యోగినో మనః విషీదంత్యసమాధానాన్మనోనిగ్రహకర్శితాః

పద్మములవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! మనస్సును నిగ్రహించుచున్న యోగులు తరచుగా ఆ మనస్సును నిగ్రహించే ప్రయత్నములో అలసిపోయెదరు. మనస్సు ఏకాగ్రము కాకుండుటచే వారు విషాదమును పొందెదరు.

అథాత ఆనందదుఘం పదాంబుజం హంసాశ్ర్శయేరన్నరవిందలోచన,

 సుఖం ను విశ్వేశ్వర యోగకర్మభిః

త్వన్మాయయాఽమీ విహతా న మానినః

పద్మములు వంటి కన్నులు గల ఓ జగన్నాథా! ఇందువలననే, వివేక వంతులు ఆనందమును నింపే నీ పద్మమువంటి పాదమును సుఖముగా ఆశ్రయించెదరు. ఇది నిశ్చయము. కాని, మేము యోగనిపుణులము, కర్మనిపుణులము అనే అహంకారము గల ఈ సాధకులు కొందరు నీ పాదములను సేవించరు. వారిని నీ మాయ విఘ్నములతో హింస పెట్టును.

కిం చిత్రమచ్యుత తవైతదశేషబంధో

దాసేష్వనన్యశరణేషు యదాత్మసాత్త్వమ్

యోఽరోచయత్సహ మృగ్రెస్స్వయమీశ్వరాణాం

 శ్రీమత్కిరీటతటపీడితపాదపీఠః

సకలప్రాణులకు హితమును చేసే ఓ శ్రీకృష్ణా! నీవు తప్ప వేరు శరణు లేని నీ భక్తులకు నిన్ను నీవే సమర్పించెదవు. ఇది నీకు చిత్రమా యేమి? కాదు. ఏలయనగా, బ్రహ్మాదులు తాము ప్రభువులై ఉండి కూడా నీకు మొక్కుచుండగా, వారి శోభాయుక్తములైన కిరీటముల కొనలు నీవు పాదములు పెట్టే పీఠమును నొక్కుచుండును. అట్టి నీవు పశువులతో (రామావతారములో వానరాదులతో శ్రీకృష్ణావతారములో కోతులు, గోవులు, లేళ్లతో) మైత్రిని ఇష్టపడితివి.

తం త్వాఽఖిలాత్మదయితేశ్వరమాశ్రితానాం

సర్వార్థదం స్వకృతవిద్విసృజేత కో ను

 కో వా భజేత్కిమపి విస్మృతయేఽను భూత్యై

కిం వా భవేన్న తవ పాదరజోజుషాం నః

సకలజగత్తునకు ఆత్మవు, ప్రియుడవు, అంతర్యామివి నీవే. నిన్ను ఆశ్రయించినవారలకు నీవు సకలపురుషార్థములనిచ్చెదవు. తనకు చేసిన ఉపకారమును స్మరించే కృతజ్ఞుడెవడైననూ అట్టి నిన్ను విడిచి పెట్టునా? విడిచి పెట్టడు. ఏదో ఒకదానిని సేవించినచో సంపద కలిగిననూ, ఆ సంపద వలన మానవుడు నిన్ను విస్మరించును. అట్టి భజనమును ఎవడైనా చేయునా? చేయడు. నీ పాదముల ధూళిని సేవించే మాకు లభించనిది ఏమి గలదు? ఏమీ లేదు.

నైవోపయంత్యపచితిం కవయస్తవేశ

బ్రహ్మాయుషాఽపి కృతమృద్ధముదస్స్మరంతః

యోఽoతర్బహిస్తనుభృతామశుభం వీధున్వన్

ఆచార్యచైత్యవపుషా స్వగతిం వ్యనక్తి

ఓ ఈశ్వరా! నీవు దేహధారులకు బయట గురురూపముగా, లోపల అంతర్యామిరూపముగానుండి అమంగళములను పారద్రోలి నీ స్వరూప మును ప్రకటము చేయుచున్నావు. అట్టి నీకు సర్వజ్ఞులు కూడ బ్రహ్మ దేవుని ఆయుర్దాయకాలముచేనైననూ ప్రత్యుపకారమును చేయలేరు. కాని, నీ ఉపకారమును స్మరించి వారు మహానందమును పొందెదరు.

శ్రీశుక ఉవాచ

ఇత్యుద్దవేనత్యనురక్తచేతసా పృష్టో జగత్క్రీడనకస్స్వశక్తిభిః

గృహీతమూర్తిత్రయ ఈశ్వరేశ్వరో జగాద సప్రేమమనోహర స్మితః

శ్రీ శుక మహర్షి పలికెను - తన మాయాశక్తియొక్క గుణములచే మూడు మూర్తులను స్వీకరించిన దేవదేవుడైన శ్రీకృష్ణునకు జగత్తు ఆటబొమ్మ. ప్రేమతో నిండిన హృదయము గల ఉద్దవుడీ విధముగా ప్రశ్నించగా, ఆయన ప్రేమతో మనస్సును దోచివేసే చిరునగవుతో నిట్లు పలికెను.

శ్రీభగవానువాచ

హంత తే కథయిష్యామి మమ ధర్మాన్ సుమంగలాన్

యాన్ శ్రద్ధయా చరన్మర్త్యో మృత్యుం జయతి దుర్జయమ్

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- బాగుంది! చాల మంగళకరములైన నా ధర్మములను చెప్పగలను. వాటిని శ్రద్ధగా అనుష్ఠించే మానవుడు మరణశీలుడే అయినా, మృత్యువును (సంసారమును) జయించుట దుర్ఘటమే అయినా, అట్టివాడు మృత్యువును జయించును.

కుర్యాత్సర్వాణి కర్మాణి మదర్థం శన కైస్స్మరన్

మయ్యర్పితమనశ్చిత్తో మద్ధర్మాత్మమనోరతిః

సాధకుడు మనస్సుతో నన్నే భావన చేసి చిత్తమునందు నన్నే స్మరించవలెను. సాధకుడు తన మనస్సులో నా ధర్మములయందు ప్రేమను కలిగియుండవలెను. ఆతడు నన్నే స్మరిస్తూ క్రమక్రమముగా కర్మలనన్నింటినీ నా కొరకు చేయవలెను.

దేశాన్ పుణ్యాన్ సంశ్రయేత మద్భక్తైస్సాధుభిశ్ర్శితాన్

దేవాసురమనుష్యేషు మద్భక్తాచరితాని చ

దేవతలు, రాక్షసులు, మనుష్యులలో నా భక్తులు ఆచరించిన కర్మలను, నా భక్తు లైన సజ్జనులు నివసించే స్థానములను ఆశ్రయించవలెను.

పృథక్ సత్రేణ వా మహ్యం పర్వయాత్రామహోత్సవమ్

కార యేద్గీతనృత్యాద్యైర్మహారాజవిభూతిభిః

భక్తుడు స్వయముగా గానీ, పదిమందితో కలిసి గాని, పర్వదినముల యందు, జనసమ్మేళనములయందు నా కొరకు గొప్ప ఉత్సవమును చేయించవలెను. దానిలో గానము, నాట్యము, కళాప్రదర్శనలు మొదలగునవి, ఛత్రచామరాదిమహారాజవిభూతులు ఉండవలెను.

మామేవ సర్వభూతేషు బహిరంతరపావృతమ్

ఈ క్షేతాత్మని చాత్మానం యథా ఖమమలాశయః

ఆకాశము వలె లోపల బయట నిండి ఉన్న నాకు ఆవరణము లేదు. శుద్ధమైన చిత్తము గల సాధకుడు సకలప్రాణులయందు మరియు నయందు కూడ ఆత్మరూపునిగా నన్నే దర్శించవలెను.

ఇతి సర్వాణి భూతాని మద్బావేన మహామతే

సభాజయన్మన్యమానో జ్ఞానం కేవలమాశ్రితః

గొప్ప బుద్ది గల ఓ ఉద్దవా! సాధకుడీ విధముగా సకలప్రాణులను నా రూపముగా దర్శిస్తూ సత్కరించవలెను. కేవలము ఆత్మజ్ఞాననిష్ఠను ఆశ్రయించవలెను.

బ్రాహ్మణే పుల్క సే స్తేనే బ్రహ్మణ్యేఽర్కే స్ఫులింగకే

అక్రూరే క్రూరకే చైవ సమదృక్ పండితో మతః

వేద వేత్త, అధముడు, చోరుడు, బ్రాహ్మణభక్తుడు, సూర్యుడు, నిప్పురవ్వ, శాంతుడు, క్రూరుడు అనువారిలో ఒకే ఆత్మను సమముగా దర్శించువాడే పండితుడు.

నరేష్వభీక్ష్ణం మద్బావం పుంసో భావయతోఽచిరాత్ స్పర్ధాఽసూయాతిరస్కారాస్సాహంకారా వియంతి హి

జనులయందు సర్వదా నా ఉనికిని భావన చేసే వ్యక్తికి తొందరలోనే (సములయెడల) పోటీ తత్త్వము, (గొప్పవారి యెడల) అసూయ (గుణమునందు దోషమునారోపించుట), (తక్కువవారి యెడల) చిన్న చూపు, అహంకారము అనే దోషములు నిశ్చయముగా తొలగిపోవును.

విసృజ్య స్మయమానాన్ స్వాన్ దృశం వ్రీడాం చ దైహికీమ్ ప్రణమేద్దండవద్భూమావాశ్వచాండాలగోఖరమ్

సాధకుడు దేహమును బట్టి గొప్ప-తక్కువ అనే దృష్టిని చేయరాదు. తనవారు నవ్వుచున్నా సిగ్గును విడిచి పెట్టి కుక్కలు, అధములు, గోవులు, గాడిదలతో సహా సకలప్రాణులకు సాష్టాంగనమస్కారమును చేయవలెను.(పశువులకు తిండి పెట్టుటయే నమస్కారము).

యావత్సర్వేషు భూతేషు మద్బావో నోపజాయతే

తావదేవముపాసిత వాజ్మనఃకాయవృత్తిభిః

సాధకుడు సకలప్రాణులలో నన్ను భావన చేసే జ్ఞానము కలిగే వరకు ఈ విధముగా దేహము, వాక్కు, మనస్సుల చేష్టలతో ఉపాసించవలెను.

సర్వం బ్రహ్మాత్మకం తస్య విద్యయాఽఽత్మమనీషయా

పరిపశ్యన్నుపరమేత్సర్వతో ముక్తసంశయః

ఈ విధముగా ఉపాసించువానికి సర్వము బ్రహ్మరూపమే. ఆత్మసాక్షా త్కారమనే విద్యచే ఆతడు అంతటా బ్రహ్మను చూచును. ఆతని సందేహ ములన్నీ పటాపంచలగును. ఆతడు సకలకర్మలనుండి నివృత్తుడగును.

అయం హి సర్వకల్పానాం సధ్రీచీనో మతో మమ

మద్భావస్సర్వభూతేషు మనోవాక్కాయవృత్తిభిః

మనోవాక్కాయముల వ్యాపారములచే సకలప్రాణులలో నన్ను భావిం చుట అనునది యే ఉపాయములన్నింటిలో సమీచీనమని నా సిద్ధాంతము.

న హ్యంగోపక్రమే ధ్వంసో మద్దర్మస్యోద్దవాణ్వపి

మయా వ్యవసితస్సమ్యక్ నిర్గుణత్వాదనాశిషః   

ఓ ఉద్దవా! నన్ను నిష్కామముగా ఉపాసించుట అనే ఈ ధర్మమును ఒకసారి ఆరంభించినచో, దానికి లేశమైననూ వినాశము లేదు. ఎందుకంటే, ఇది గుణాతీతము. దీనిని ఈ విధముగా సరిగా నేనే నిశ్చయించితిని.

యో యో మయి పరే ధర్మః కల్ప్యతే నిష్పలాయ చేత్

తదాయాసో నిరర్థస్స్యాద్భయాదేరివ సత్తమ

సత్పురుషులలో శ్రేష్ఠుడవగు ఓ ఉద్ధవా! భయము, శోకము ఇత్యాది సందర్భములలో వ్యక్తి చేసే పలాయనము, ఆక్రందనము మొదలైన ఏయే ప్రత్యేకఫలము లేని శ్రమ గలదో, దానిని కూడ పరమాత్మనగు నాకు నిష్కామముగా సమర్పించినచో, అది కూడ ధర్మమే యగును.

ఏషా బుద్ధిమతాం బుద్ధిర్మనీషా చ మనీషిణామ్

యత్సత్యమనృతేనేహ మర్త్యేనాప్నోతి మాఽమృతమ్

ఈ లోకములో ఈ జన్మలో మరణించే శీలము గల మిథ్యాదేహముతో సత్య-అమృతస్వరూపుడనగు నన్ను పొందవచ్చును. ఇదియే బుద్ధిశాలుర బుద్ధి, నేర్పరుల నేర్పు.

ఏష తేఽభిహితః కృత్స్నో బ్రహ్మవాదస్య సంగ్రహః

సమాసవ్యాసవిధినా దేవానామపి దుర్గమః

నేనీ విధముగా నీకు సకలవేదాంతసిద్ధాంతముయొక్క సంగ్రహమును సంక్షేపవిస్తారపద్ధతిలో చెప్పితిని. ఇది దేవతలకు కూడ దుర్లభము.

అభీక్ష్ణ శస్తే గదితం జ్ఞానం విస్పష్టయుక్తిమత్

ఏతద్విజ్ఞాయ ముచ్యేత పురుషో నష్టసంశయః

నీ కొరకు సుస్పష్టమైన యుక్తులు గల ఆత్మజ్ఞానమును పలు మార్లు చెప్పితిని. దీనిని తెలుసుకున్న మానవుడు సంశయములను పోగొట్టుకొని జీవన్ముక్తిని పొందును.

సువివిక్తం తవ ప్రశ్నం మయైతదపి ధారయేత్

సనాతనం బ్రహ్మగుహ్యం పరం బ్రహ్మాధిగచ్ఛతి

నీ ప్రశ్నకు నేను చక్కగా వివేకపూర్వకముగా సమాధానమును చెప్పితిని. దీనిని చింతన చేయు సాధకుడు వేదములో కూడ రహస్యమైన పరబ్రహ్మను (ఆత్మరూపముగా) పొందును. పరబ్రహ్మ కాలాతీతము.

య ఏతన్మమ భక్తేషు సంప్రదద్యాత్సుపుష్కలమ్

తస్యాహం బ్రహ్మదాయస్య దదామ్యాత్మానమాత్మనా

ఎవడైతే ఈ జ్ఞానమును నా భక్తులకు చాల పుష్కలముగా (సుస్పష్టముగా) నేర్పునో, బ్రహ్మజ్ఞానమునుపదేశించే అట్టివానికి నన్ను నేను నాచే వశము చేసుకొనెదను (ఆత్మరూపుడనై ప్రకాశించెదను).

య ఏతత్సమధీయీత పవిత్రం పరమం శుచి

స పూయేతాహరహర్మాం జ్ఞానదీపేన దర్శయన్

ఈ సంవాదము పవిత్రము, పావనము చేయువాటిలో సర్వోత్తమము. దీనిని బాగుగా అధ్యయనము చేయు వ్యక్తి జ్ఞానమనే దీపముతో నన్ను ఇతరులకు చూపిస్తూ, తాను పవిత్రుడగును.

య ఏతచ్చ్రద్దయా నిత్యమవ్యగ్రశ్శృణుయాన్నరః

మయి భక్తిం పరాం కుర్వన్ కర్మభిర్న స బధ్యతే

ఏ మానవుడైతే ప్రతిదినము ఈ సంవాదమును సావధానుడై శ్రద్దతో వినునో, అట్టిపాడు నాయందు పరా(నిష్కామ)భక్తిని చేయును. ఆతనిని కర్మలు బంధించవు.(జీవన్ముక్తుడగును).

అప్యుద్దవ త్వయా బ్రహ్మ సఖే సమవధారితమ్

అపి తే విగతో మోహశ్శోకశ్చాసౌ మనోభవః

మిత్రుడవగు ఓ ఉద్దవా! నీకు బ్రహ్మస్వరూపము చక్కగా తెలిసినదా? నీ మోహము, మనస్సునందు పుట్టే ఈ శోకము కూడ తొలగిపోయినవా?

నైతత్త్వయా దాంభికాయ నాస్తికాయ శఠాయ చ

 అశుశ్రూషోరభక్తాయ దుర్వినీతాయ ధీయతామ్

నీవీ జ్ఞానమును డాంబీకుడు, నాస్తికుడు, మోసగాడు, సేవ చేయనివాడు, భక్తి లేనివాడు, గర్విష్టి అనువారలకు ఈయరాదు.

ఏతైర్దో షైర్విహీనాయ బ్రహ్మణ్యాయ ప్రియాయ చ

సాధవే శుచయే బ్రూయాద్భక్తిస్స్యాచ్ఛూద్రయోషితామ్

ఈ దోషములు లేని బ్రాహ్మణభక్తునకు, ప్రియమైన వ్యక్తికి, 'పకారికీ, శౌచము గలవానికి, భక్తి ఉన్న శూద్రులకు, స్త్రీలకు ఈ నమునుపదేశించవలెను.

నైతద్విజ్ఞాయ జిజ్ఞాసోర్జ్ఞాతవ్యమవశిష్యతే

 పీత్వా పీయూషమమృతం పాతవ్యం నావశిష్యతే

తత్త్వమును తెలియగోరువాడీ సంవాదమును తెలుసుకున్నచో, తెలియదగినది ఇంకేమీ మిగిలియుండదు. మధురమైన అమృతమును త్రాగిన తరువాత త్రాగదగినది మరేదీ మిగిలి ఉండదు.

జ్ఞానే కర్మణి యోగే చ వార్తాయాం దండధారణే

యావానర్థో నృణాం తాత తావాంస్తేఽహం చతుర్విధః

నాయనా! మానవులు జ్ఞానముచే మోక్షమును, కర్మచే ధర్మమును, యోగముచే కామనాసిద్ధిని, వర్తకము, దండనీతి మొదలగువాటిచే అర్థమును పొందెదరు. కాని, నీకు ఆ నాలుగు ప్రయోజనములు నేనే.

మర్త్యో యదా త్యక్తసమస్తకర్మా నివేదితాత్మా విచికీర్షితో మే

తదాఽమృతత్వం ప్రతిపద్యమానో

మయాఽఽత్మభూయాయ చ కల్పతే వై

మరణధర్ముడగు మానవుడు ఎప్పుడైతే సకలకర్మలను (కర్తృత్వ మును) విడిచి పెట్టి నాకు ఆత్మసమర్పణము చేయునో, అప్పుడాతడు నాకు విశేషించి సమ్మాన్యుడగును. ఆతడు అమృతత్వము (జీవన్ముక్తి) ను పొందును. ఆతడు నిశ్చయముగా నాలో ఐక్యమగుటకు యోగ్యుడు,

శ్రీశుక ఉవాచ

 స ఏవమాదర్శితయోగమార్గస్తదోత్తమశ్లోకవచో నిశమ్య

 బద్ధాంజలిః ప్రీత్యుపరుద్ధకంఠో న కించిదూచేఽశ్రుపరిప్లుతాక్షః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- పవిత్రకీర్తియగు శ్రీకృష్ణుడీ వీధముగా

యోగమార్గమును చక్కగా నిరూపించెను. శ్రీకృష్ణుని ఆ వచనమును విని ఉద్ధవుడు చేతులు కట్టుకొని నిలబడెను. ప్రేమతో ఆయన కంఠము గద్గదము కాగా, కన్నులు నీటితో నిండిపోయెను. ఆయన ఏమీ పలుకలేదు.

విష్టభ్య చిత్తం ప్రణయావఘూర్ణం ధైర్యేణ రాజన్ బహు మన్యమానః,

కృతాంజలిః ప్రాహ యదుప్రవీరం శీర్ష్ణా స్పృశంసచ్చరణారవిందమ్

ఓ పరీక్షిన్మహారాజా! ఉద్దవుడు ప్రేమతో కల్లోలితమైన తన మనస్సును ధైర్యముతో నిగ్రహించెను. తాను కృతార్థుడనైతినని తలపోస్తూ ఆయన దోసిలి యొగ్గి యాదవవీరుడగు శ్రీకృష్ణుని పద్మమువంటి పాదమునకు తల ఆన్చి నమస్కరించెను. అపుడాయనతో ఉద్ధవుడిట్లనెను.

ఉద్దవ ఉవాచ

 విద్రావీతో మోహమహాఽoధకారో య ఆశ్రితో మే తవ సన్నిధానాత్

 విభావసోః కిం ను సమీపగస్య శీతం తమో భీః ప్రభవంత్యజాద్య

ఉద్దవుడిట్లు పలి కెను --- స్వయంభువుడగు బ్రహ్మదేవుని తండ్రివగు ఓ శ్రీకృష్ణా! నేను మోహమనే గాఢమైన అంధకారమునాశ్రయించితిని. నీ సన్నిధి, ఉపదేశము దానిని పారద్రోలినవి. అగ్నికి సమీపములోనున్నవానికి చలి, చీకటి, భయము అనునవి పీడను కలిగించ సమర్థములగునా? కావు.

ప్రత్యర్పితో మే భవతాఽనుకంపినా భృత్యాయ విజ్ఞానమయః ప్రదీపః

 హిత్వా కృతజ్ఞస్తవ పాదమూలం

కోఽన్యత్సమీయాచ్ఛరణం త్వదీయమ్

దయామయుడవగు నీవు నీ మాయాశక్తిచే అపహరించబడిన విజ్ఞానరూపమగు దీపమును తిరిగి సేవకుడనగు నాకు ఇచ్చితివి. నీవు చేసిన ఉపకారమును గుర్తించిన ఎవ్వాడు నీ పాదమూలమును విడిచి పెట్టి మరియొకదానిని శరణు పొందును?(ఎవ్వడూ అట్లు చేయడు).

వృక్ణశ్చ మే సుదృఢ స్స్నేహపాశో దాశార్హవృష్ణ్యంధకసాత్వతేషు

 ప్రసారితస్సృష్టి వివృద్దయే త్వయా

 స్వమాయయా హ్యాత్మసుబోధ హేతినా

దాశార-వృష్టి-అంధక-సాత్వతవంశీయులగు యాదవులపై నాకు మిక్కిలి దృఢమైన ఆసక్తి అనే పాశము ఉండెను. ఇప్పుడది ఆత్మజ్ఞానమనే శస్త్రముచే (నీ చేతనే) ఛేదించబడినది. సృష్టి వర్ధిల్లుట కొరకై నీవే ఆ పాశమును ప్రసరింపజేసితివి. ఇది నిశ్చయము.

నమోఽస్తు తే మహాయోగిన్ ప్రపన్నమనుశాధి మామ్

యథా త్వచ్చరణాంభోజే రతిస్స్యాదనపాయినీ

ఓ మహాయోగీ! నీకు నమస్కారము. నేను నిన్ను శరణు వేడుచున్నాను. నీ పద్మమువంటి పాదమునందు శాశ్వతమైన ప్రీతి. ఉండే విధముగా నన్ను అనుగ్రహించుము.

 శ్రీభగవానువాచ

గచ్ఛోద్ధవ మయాఽఽదిష్టో బదర్యాఖ్యం మమాశ్రమమ్

 తత్ర మత్పాదతీర్థాదే స్నానోపస్పర్శనైశ్శుచిః

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ ఉద్దవా! నా ఆదేశముచే నీవు నా బదరికాశ్రమమునకు వెళ్లుము. అచట నా పాదములనుండి పుట్టిన పవిత్రమైన గంగ నీటిలో స్నానమును, ఆచమనమును చేసి శుచివి కమ్ము.

ఈక్షయాఽలకనందాయ విధూతాశేష కల్మషః

 వసానో వల్కలాన్యంగ వన్యభుక్ సుఖనిస్స్పృహః

ఓయీ ఉద్దవా! అలకనందను దర్శించి సకలపాపములను కడిగివేయుము. నారబట్టలను ధరించి, అడవిలో దొరికే పళ్లు మొదలగువాటిని తింటూ భోగములయందు తృష్ణ లేకుండ నుండుము.

తితిక్షుర్ద్వంద్వమాత్రాణాం సుశీలస్సంయతేంద్రియః

శాంతస్సమాహితధియా జ్ఞానవిజ్ఞానసంయుతః  

శీతోష్ణాదిద్వంద్వముల రూపములోనుండే ఇంద్రియవిషయములను సహించుము. చక్కని శీలముతో జితేంద్రియుడవై శాంతముగా నుండుము. ఏకాగ్రచిత్తముతో శాస్త్రార్థపరిజ్ఞానమును, స్వానుభవమును పొందుము.

మత్తోఽనుశిక్షితం యత్తే వివిక్తమనుభావయన్

మయ్యా వేశితవాక్చిత్తో మద్ధర్మనిరతో భవ

 అతివ్రజ్య గతీస్తిస్రో మామేష్యసి తతః పరమ్

నీవు నానుండి నేర్చిన తత్త్వమును చక్కగా విచారము చేసి అనుసంధానము చేయుము. నీవు వాక్కును, చిత్తమును నాయందు ప్రవేశ పెట్టుము. నా ధర్మములయందు నిష్ఠను కలిగియుండుము. ఈ విధముగా, నీవు సత్త్వరజస్తమోగుణములను మూడింటిని అతిక్రమించి, ఆ గుణములకతీతుడనగు నన్ను (ఆత్మరూపముగా) పొందగలవు.

శ్రీశుక ఉవాచ

 స ఏవముక్తో హరిమేధసోద్ధవః ప్రదక్షిణం తం పరిసృత్య పాదయోః,

శిరో నిధాయాశ్రుకలాభిరార్ర్దధీర్న్యషించదద్వంద్వపరోఽప్యపక్రమే

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను -- శ్రీకృష్ణుని తత్త్వమును తెలియుటచే సంసారబంధము తొలగిపోవును. ఆయనచే ఈ విధముగా ఉపదేశించబడిన ఆ ఉద్దవుడు ఆయన చుట్టూ ప్రదక్షిణముగా తిరిగి సాష్టాంగనమస్కారము చేసెను. ఆ ఉపదేశముచే ఉద్ధవునకు సుఖదుఃఖాదిద్వంద్వములయందు సమత్వము నెలకొనెను. అయిననూ, ఆయన వెళ్లిపోయే సమయములో ఆర్ద్రమగు హృదయము గలవాడై భగవానుని పాదములను కన్నీటి బిందువులతో అభిషేకించెను.

సుదుస్త్యజస్నేహవియోగకాతరో న శక్నువంస్తం పరిహాతుమాతురః

కృచ్చ్రం యయౌ మూర్ధని భర్తృపాదుకే

బిభ్రన్నమస్కృత్య యయౌ పునః పునః

ఉద్దవునకు శ్రీకృష్ణుని పై గల ప్రేమ సుతరాము విడిచి పెట్ట శక్యము కానిది. ఆయన ఈ వియోగమునకు భయపడిపోయెను. ఆయనను విడిచి పెట్టుట ఉద్ధవునకు శక్యము కాకుండెను. ఈ విధముగా ఉద్ధవుడు వ్యాకులుడై కష్టమును పొందెను. ఆయన శ్రీకృష్ణ ప్రభుని పాదుకలను తలపై దాల్చి మరల మరల నమస్కరించి వెళ్లాను.

తతస్తమంతర్హృది సంనివేశ్య గతో మహాభాగవతో విశాలామ్

 యథోపదిష్టాం జగదేకబంధునా తపస్సమాస్థాయ హరేరగాద్గతిమ్

ఉద్ధవుడు గొప్ప భగవద్బక్తుడు. ఆయన అప్పుడా శ్రీకృష్ణుని హృద యమునందు నిలుపుకొని బదరికాశ్రమమునకు వెళ్లి తపస్సు చేసెను. జగ త్తునకు నితాంతము హితకారియగు శ్రీకృష్ణుడు ఉపదేశించిన విధముగా ఆయన శ్రీహరిని ఆత్మరూపముగా పొందెను (జీవన్ముక్తుడాయెను).

య ఏతదానందసముద్రసంభృతం

 జ్ఞానామృతం భాగవతాయ భాషితమ్

కృష్ణేన యోగేశ్వర సేవితాంఘ్రిణా

సచ్చ్రద్ధయాఽఽసేవ్య జగద్విముచ్యతే

భగవానుడు ఆనందస్వరూపుడు. వేదము ఆయనయొక్క సముద్రము. దాని సారమే ఈ ఉపదేశము. యోగేశ్వరులచే సేవించబడే పాదములు గల శ్రీకృష్ణుడు దీనిని భగవద్భక్తుడగు ఉద్దవుని కొరకు ఉపదేశించెను. ఈ జ్ఞానమనే అమృతమును కొంచెమైనా మంచి శ్రద్ధతో సేవించే వ్యక్తి విముక్తుడగుటయే గాక, వాని సంగముచే జగత్తు కూడ విముక్తమగును.

భవభయమపహంతుం జ్ఞానవిజ్ఞానసొరం

నిగమకృదుపజహ్రే భృంగవద్వేదసారమ్

 అమృతముదధితశ్చాపాయయద్భృత్యవర్గాన్

పురుషమృషభమాద్యం కృష్ణసంజ్ఞం నతోఽస్మి

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ఏకాదశస్కంధే

 ఏకోనత్రింశోఽధ్యాయః

వేదకర్తయగు భగవానుడు సంసారభయమును పోగొట్టుటకై తుమ్మెదవలె వేదముల సారమును పైకి తీసి జ్ఞాన (శాస్త్రార్థపరిజ్ఞానము)-విజ్ఞానము (ఆత్మానుభవము) ల సారమును తన భక్తుల సముదాయములకు అనుగ్రహించెను. ఆయనయే సముద్రమునుండి అమృతమును పైకి తీసి దేవతలకు అనుగ్రహించెను. జగత్కారణుడగు ఆ పురుషోత్తముడే శ్రీకృష్ణుడనే పేరుతోనున్నాడు. ఆయనకు నేను నమస్కరించుచున్నాను.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో ఆత్మతత్త్వమును నిరూపించే

ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29).