3 - మాయను తరించే ఉపాయము - కర్మయోగము

రాజోవాచ

పరస్య విష్ణోరీశస్య మాయినామపి మోహినీమ్

మాయాం వేదితుమిచ్ఛామో భగవంతో బ్రువంతు నః

నిమి మహారాజు ఇట్లు పలి కెను --- పరమేశ్వరుడగు శ్రీహరియొక్క మాయాశక్తి మాయను చేసే ఇంద్రాదులను కూడ మోహపెట్టును. దానిని మేము తెలియగోరుచున్నాము. పూజనీయులగు తమరు మాకు చెప్పడు.

నానుతృప్యే జుషన్ యుష్మద్వతో హరికథాఽమృతమ్

సంసారతాపనిస్తపో మర్త్యస్తత్తాప భేషజమ్

నేను సంసారమునందలి తాపములచే వేయంచబడు చున్న మర్త్యుడను. శ్రీహరి గాథలను వర్ణించే అమృతతుల్యములగు తమరి వాక్కులు ఆ సంసారదుఃఖమునకు మందు వంటివి. వాటిని సేవించుచున్న నాకు తృప్తి కలుగుట లేదు.

అంతరిక్ష ఉవాచ

ఏభిర్భూతాని భూతాత్మా మహాభూతైర్మహాభుజ ససర్జోచ్చావచాన్యాద్యస్స్వమాత్రాత్మప్రసిద్ధయే

అంతరిక్షుడిట్లు పలికెను --- గొప్ప భుజశక్తి గల ఓ రాజా! జగత్కారణు డగు శ్రీహరి తన అంశలైన జీవులకు శబ్దాది విషయముల భోగము మరియు మోక్షము సిద్ధించుట కొరకై ఈ ప్రసిద్ధములైన పంచమహాభూత ములతో ప్రాణుల దేహములను సృష్టించెను. ఆ ప్రాణులలో దేవతలు మొదలగు గొప్పవి, పశుపక్ష్యాది తక్కువ జీవోపాధులు కూడ గలవు.

ఏవం సృష్టాని భూతాని ప్రవిష్టః పంచధాతుభిః

ఏకధా దశధాఽఽత్మానం విభజఞ్జుష తే గుణాన్

పరమాత్మ ఈ విధముగ పంచభూతములతో ప్రాణుల దేహములను సృష్టించి, వాటిలో ప్రత్యగాత్మరూపముగా ప్రవేశించినాడు. ఆ పరమాత్మ తననే అంతఃకరణాభిమానియగు ఒక నేను-గా, పది (జ్ఞాన-కర్మ) ఇంద్రియ శక్తులుగా విభజించుకొని, సత్త్వాదిగుణముల కార్యములగు శబ్దాదులను అనుభవించుచున్నాడు.

గుణైర్గుణాన్ స భుంజాన ఆత్మప్రద్యోతితైః ప్రభుః

మన్యమాన ఇదం సృష్టమాత్మానమిహ సజ్జతే

ఆ పరమాత్మ సర్వశక్తిమంతుడు. అయిననూ, సృష్టించబడిన ఈ దేహమునందు ఆత్మాభిమానముతో, తనచే శక్తిమంతములుగా చేయబడిన గుణకార్యములగు ఇంద్రియములతో గుణకార్యములే అయిన శబ్దాది విషయములను భోగించును. ఈ విధముగా పరమాత్మయే ఈ సంసారములో దేహమునందు తగుల్కొనియున్నాడు.

కర్మాణి కర్మభిః కుర్వన్ సనిమిత్తాని దేహభృత్

తత్తత్కర్మఫలం గృహ్ణన్ భ్రమతీహ సుఖేతరమ్

పరమాత్మ దేహాభిమానముచే జీవుడై కర్మేంద్రియములతో కర్మలను చేయును. ఆ కర్మల వలన పుట్టే వాసనలే తరువాతి జన్మలోని దేహమునకు నిమిత్తములగును. ఆ జీవుడు సుఖదుఃఖరూపమగు కర్మఫలములననుభవిస్తూ ఈ సంసారములో పరిభ్రమించుచున్నాడు.

ఇత్థం కరగతీర్గచ్చన్ బహ్వభద్రవహాః పుమాన్

ఆభూతసంప్లవాత్సర్గ ప్రలయావశ్నుతేఽవశః

జీవుడు కర్మఫలరూపముగా కలిగే జన్మలనెత్తుతూ అనేకదుఃఖముల ననుభవించును. ఆతడీ విధముగా కర్మలకు పరవశుడై జగత్తుయొక్క మహాప్రళయము వరకు జన్మమరణములను పొందుచునే యుండును.

ధాతూపప్లవ ఆసన్నే వ్యక్తం ద్రవ్యగుణాత్మకమ్

అనాదినిధనః కాలో హ్యవ్య క్తాయాపకర్షతి

మహాప్రళయములో పంచభూతములు విలీనమయ్యే సమయము వచ్చినప్పుడు ఆది-అంతములు లేని కాలము నామరూపాత్మకమగు జగత్తును మాయాశక్తిలోనికి వీలీనము చేయును. అప్పుడు పృథివ్యాది స్థూలభూతములు, గుణకార్యములైన శబ్దాది విషయములు విలీనమగును.

శతవర్షా హ్యనావృష్టిర్భవిష్యత్యుల్బణా భువి

తత్కాలోపచీతోష్ణార్కో లోకాంస్త్రీన్ ప్రతపిష్యతి

ఆ కాలమునందు భూలోకములో వంద సంవత్సరములు సుతరాము భయమును గొల్పే అనావృష్టి కలుగును. అప్పుడు బాగా పెరిగిన వేడి గల సూర్యుడు ముల్లోకములను అధికముగా తపింప జేయగలడు.

పాతాలతలమారభ్య సంకర్షణముఖానలః

దహన్నూర్ధ్వశిఖే విష్వగ్వర్ధతే వాయునేరితః

ఆది శేషుని నోటియందలి అగ్ని పైకి జ్వాలలను కలిగియుండును. వాయువుచే ప్రేరేపించబడిన ఆ అగ్ని పాతాళలోకమునుండి మొదలు పెట్టి తగులబెడుతూ అంతటా విస్తరించును.

సాంవర్తకో మేఘగణో వర్షతి స్మ శతం సమాః

ధారాభిర్హస్తిహస్తాభిర్లీయతే సలిలే విరాట్

సాంవర్తకమనే (ప్రళయమునందలి) మేఘముల గుంపు వంద సంవత్సరములు నిరంతరముగా ఏనుగు తుండములను పోలిన ధారలను వర్షించును. బ్రహ్మాండము నీటిలో మునిగిపోవును.

తతో విరాజముత్సృజ్య వైరాజః పురుషో నృప

అవ్యక్తం విశ తే సూక్ష్మం నిరింధన ఇవానలః

రాజా! ఉపాధి లయమగుట వలన బ్రహ్మాండాభిమానియగు హిరణ్య గర్భుడు బ్రహ్మాండదేహమును విడిచి పెట్టి, ఇంధనము లేని అగ్ని మహాగ్ని యందు వలె, నామరూపములకతీతమైన పరబ్రహ్మయందు విలీనమగును.

వాయునా హృతగంధా భూస్సలిలత్వాయ కల్పతే

సలిలం తద్ధృతరసం జ్యోతిష్ట్యాయోపకల్పతే

వాయువు గంధమును హరించగా పృథివి జలములో విలీనమగును. అదే వాయువు రసమును హరించగా జలము అగ్నిలో విలీనమగును.

హృతరూపం తు తమసా వాయౌ జ్యోతిః ప్రలీయతే

హృతస్పర్శోఽవకాశేన వాయుర్నభసి లీయతే

ప్రళయాంధకారము రూపమును హరించగా అగ్ని వాయువునందు విలీనమగును. ఆకాశము స్పర్శగుణమును హరించగా వాయువు ఆకాశమునందు విలీనమగును.

కాలాత్మనా హృతగుణం నభ ఆత్మని లీయతే

ఇంద్రియాణి మనో బుద్ధిస్సహ వైకారి కైర్నృప

ప్రవిశంతి హ్యహంకారం స్వగుణైరహమాత్మని

కాలరూపుడగు ఈశ్వరుడు శబ్దగుణమునపహరించగా ఆకాశము తామసాహంకారమునందు విలీనమగును. సమష్టి ఇంద్రియములు, సమష్టిబుద్ధి సమష్టి రాజసాహంకారమునందు, సమష్టి మనస్సు ఇంద్రియాధిష్ఠానదేవతలతో సహా సాత్త్వికాహంకారమునందు విలీనమగును. అహంకారము తన సత్త్వరజస్తమోగుణములతో బాటుగా పరబ్రహ్మయందు విలీనమగును.

ఏషా మాయా భగవతస్సర్గ స్థిత్యంతకారిణీ

త్రివర్ణ వర్ణితాఽస్మాభిః కిం భూయశ్శ్రోతుమిచ్ఛసి

భగవానుని సత్త్వ (తెలుపు) రజస్ (ఎరుపు) తమస్ (నలుపు) అనే గుణములు గల ఈ మాయయే జగత్తు యొక్క సృష్టి స్థితిలయములను చేయునని మేము వివరముగా చెప్పితిమి. నీవింకనూ ఏమి వినగో రెదవు?

రాజోవాచ

యథైతామైశ్వరీం మాయాం దుస్తరామకృతాత్మభిః

తరంత్యంజః స్థూలధియో మహర్ష ఇదముచ్యతామ్

నిమి పలి కెను --- ఓ మహర్షీ! ఈశ్వరుని ఈ మాయను అతిక్రమించుట చాల కష్టము. దేహమే ఆత్మయనే నిశ్చయము గల జనులు మనస్సునకు పరవశులై యుందురు. వారికి తెలిసినది కర్మ మాత్రమే. వారీ మాయను ఏ ప్రకారముగా తరించెదరో, అట్టి ఉపాయమును చెప్పుడు.

ప్రబుద్ద ఉవాచ

కర్మాణ్యారభమాణానాం దుఃఖహత్యై సుఖాయ చ

పశ్యేత్పాకపర్యాసం మిథునీచారిణాం నృణామ్

ప్రబుద్దుడిట్లు పలి కెను -- మానవులు స్త్రీపురుషుల జంటలుగా ఏర్పడి కర్మలను చేసెదరు. దుఃఖములను దూరము చేసి సుఖమును పొందాలని వారి ఆకాంక్ష. కానీ, వారు సుఖములకు దూరమై దుఃఖభాజనులగుచుందురనే విషయము గమనించదగ్గది.

నిత్యార్తిదేన విత్తేన దుర్లభేతాత్మమృత్యునా

గృహాపత్యాప్తపశుభిః కా ప్రీతిస్సాధితశ్చలైః

మానవులు కష్టపడి కర్మలను చేసి సంపాదించే సంపద, ఇల్లు, సంతానము, బంధువులు, పశుసంపదలు నిరంతరముగా పీడను కలిగించును. చంచలములగు ఈ ధనాదులు వ్యక్తియొక్క మృత్యువునకు కూడ హేతువులగుచుండును. వీటితో ఏమి సుఖము దక్కును?

ఏవం లోకం పరం విద్యాన్నశ్వరం కర్మనిర్మితమ్

సతుల్యాతిశయధ్వంసం యథా మండలవర్తినామ్

ఈ విధముగా జీవుడు కర్మలను చేసి నిర్మించుకున్న స్వర్గలోకము నశించే శీలము గలది. మండలాధిపతుల అధికారము వలె, స్వర్గసుఖములో తారతమ్యములుండుటయే గాక, ఏదో ఒకనాడు అంతమయ్యేదేనని తెలియవలెను.

తస్మాద్గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్శ్రేయ ఉత్తమమ్

శాబ్ధే పరే చ నిష్ణాతం బ్రహ్మణ్యుపశమాశ్రయమ్

ఆత్మజ్ఞానము వలన కలిగే మోక్షమే సర్వోత్తమమైన శ్రేయస్సు. కావున, సాధకుడు ఆ జ్ఞానమును పొందగోరి గురువును శరణు వేడవలెను. గురువు వేదమునందు నిపుణుడు, పరబ్రహ్మతత్త్వమునరసినవాడు, శమదమాదులయందు నిష్ఠ గలవాడు అయి ఉండవలెను.

తత్ర భాగవతాన్ ధర్మాన్ శిక్షేధుర్వాత్మ దైవతః

అమాయయాకనువృత్త్యా యైస్తు ష్యేదాత్మాఽఽత్మదో హరిః

సాధకుడా గురువునే ఇష్ట దైవముగా భావించి నిష్కపటమైన సేవను చేస్తూ, భగవద్భక్తికి చెందిన ధర్మములను నేర్వవలెను. వాటిచే ఆత్మస్వరూపుడగు శ్రీహరి ప్రీతి చెందును. శ్రీహరి భక్తునకు తననే ఇచ్చివేయును.

సర్వతో మనసోఽసంగమాదౌ సంగం చ సాధుషు

దయాం మైత్రీం ప్రశ్రయం చ భూతేష్వద్ధా యథోచితమ్

మొదట మనస్సులో సర్వమునందు అనాసక్తిని అభ్యసించి, సాధువులతో సంగమును చేయవలెను. ప్రాణులలో యథోచితముగా, అనగా తక్కువ ప్రాణులయందు దయను, సమానమైన ప్రాణుల యెడల మైత్రిని, ఉత్తముల యెడల వినయమును, నిష్కపటముగా నేర్వవలెను.

శౌచం తపస్తితిక్షాం చ మౌనం స్వాధ్యాయమార్జవమ్

బ్రహ్మచర్యమహింసాం చ సమత్వం ద్వంద్వసంజ్ఞయోః

పరిసరములు, దేహము, మనస్సు శుచిగానుండవలెను. సాధకుడు తపస్సు చేస్తూ సహనశక్తిని, మౌనమును అభ్యసించవలెను. తిన్నని స్వభావము గల సాధకుడు బ్రహ్మచర్యమును పాటిస్తూ వేదమునధ్యయనము చేయవలెను. అహింసను పాటిస్తూ, సుఖదుఃఖములు మొదలైన ద్వంద్వములయెడల సమత్వము (హర్షవిషాదములు లేకుండుట) ను కలిగియుండవలెను.

సర్వత్రాత్మేశ్వరాన్వీక్షాం కైవల్యమని కేతతామ్

వివిక్తచీరవసనం సంతోషం యేన కేనచిత్

సాధకుడు సకలప్రాణులయందు ఆత్మరూపుడైన ఈశ్వరుని భావిస్తూ ఏకాంతముగా నుండవలెను. గృహమునందు స్వత్వభావన లేకుండా, శుద్ధమైన ముతక వస్త్రాన్ని ధరించి, ఆహారం ఏది లభిస్తే దానితో సంతుష్టుడు కావలెను.

శ్రద్దాం భాగవతే శాస్త్రేఽనిందామన్యత్ర చాపి హి

మనోవాక్కర్మదండం చ సత్యం శమదమావపీ

సాధకుడు భగవతతిపాదకమైన శాస్త్రమునందు శ్రద్దను కలిగి ఉంటూనే, ఇతరశాస్త్రములను నిందించరాదు. మనస్సును ప్రాణాయామముతో, వాక్కును మౌనముతో, కర్మను ఫలత్యాగముతో నియమించవలెను. సత్యమును పలుకవలెను. మనస్సును, బా హ్యేంద్రియములను నియంత్రించవలెను.

శ్రవణం కీర్తనం ధ్యానం హరేరద్బుతకర్మణః

జన్మకర్మగుణానాం చ తదర్థేఽఖిలచేష్టితమ్

సాధకుడు అద్భుతములైన శ్రీహరి అవతారములను, లీలలను, గుణములను విని, కీర్తించి, ధ్యానించవలెను. సాధకుడు సకలచేష్టలను శ్రీహరి కోరకే సమర్పించవలెను.

ఇష్టం దత్తం తపో జప్తం వృత్తం యచ్చాత్మనః ప్రియమ్

దొరాన్ సుతాన్ గృహాన్ ప్రాణాన్ పరస్మై చ నివేదనమ్

యజ్ఞాది కర్మలు, దానము, తపస్సు, జపము, నడవడి అనువాటిని సాధకుడు పరమాత్మకు సమర్పించవలెను. సాధకుడు తనకు ఇష్టమైన సర్వమును, భార్యను,, సంతానమును, ఇంటిని, ప్రాణములను కూడ పరమాత్మకు నివేదించవలెను.

ఏవం కృష్ణాత్మనాథేషు మనుష్యేషు చ సౌహృదమ్

పరిచర్యాం చోభయత్ర మహత్సు నృషు సాధుషు

ఇంతేగాక, సాధకుడు శ్రీకృష్ణుడే ఆత్మనాథుడుగా గల భక్తులను, భగవానుని, కదిలే మరియు కదలని (చెట్టుచేమలు) ప్రాణులను, గొప్పవారిని, సాధుజనులను సేవించవలెను.

పరస్పరానుకథనం పావనం భగవద్యశః

మిథో రతిర్మిథస్తుష్టిర్నివృత్తిర్మిథ ఆత్మనః

భక్తులు పావనమగు భగవత్కీర్తిని ఒకరితోనొకరు చర్చించవలెను. దాని వలన పరస్పరము ప్రేమ వర్ధిల్లి, సంతోషము కలిగి, అహంకారము (జీవభావము) తొలగును.

స్మరంతస్మారయంతశ్చ మిథోఽమౌఘపరం హరిమ్

భక్త్యా సంజాతయా భక్త్యా బిభ్రత్యుత్పులకాం తనుమ్

సాధనభక్తిని అభ్యసించిన సాధకులకు శ్రీహరియందు ప్రేమ అనే భక్తి కలుగును. వారు ప్రేమతో శ్రీహరిని స్మరిస్తూ ఇతరులచే స్మరింపజేసెదరు. శ్రీహరి స్మరణము పాపముల గుట్టలను పోనాడును. ఆ స్మరణముచే అట్టి భక్తులకు దేహమునందు రోమాంచము కలుగుచుండును.

క్వచిద్రుదంత్యచ్యుతచింతయా క్వచి-

దసంతి నందంతి వదంత్యలౌకీకాః

గాయంతి నృత్యంత్యనుశీలయంత్యజం  

భవంతి తూష్ణీం పరమేత్య నిర్వృతాః

లోకవ్యవహారమునకు దూరముగానుండే ఆ భక్తులు జన్మరహీతుడగు శ్రీహరిని స్మరిస్తూ ఒకప్పుడు కళ్ల నీళ్లు పెట్టెదరు; ఒకప్పుడు నవ్వేదరు; ఆనందిస్తూ కీర్తించెదరు; ఒకప్పుడు గానము చేసి నాట్యమాడెదరు; మరియొకప్పుడు ధ్యానించెదరు. వారు పరమాత్మను సాక్షాత్కరించుకొని మౌనముగా నుండెదరు.

ఇతి భాగవతాన్ ధర్మాన్ శిక్షన్ భక్త్యా తదుత్థయా

నారాయణపరో మాయామంజస్తరత దుస్తరామ్

ఈ విధముగా సాధకుడు నారాయణుడే పరమార్థముగా గలవాడై భాగవత ధర్మములనభ్యసించి భక్తిని అలవరచుకొనును. తరించ శక్యము కాని మాయను ఆతడా భక్తిచే తేలికగా తరించును.

రాజోవాచ

నారాయణాభిధానస్య బ్రహ్మణః పరమాత్మనః

 నిషామర్హథ నో వక్తుం యూయం హి బ్రహ్మవిత్తమాః

నిమి_మహారాజు ఇట్లు పలికెను --- నారాయణుడనే పేరుతో నిర్దేశించబడే పరబ్రహ్మ ప్రాణులలో ఆత్మరూపుడై ఉన్నాడు. ఆ పరబ్రహ్మయొక్క స్వరూపమును తమరు మాకు చెప్పడు. ఎందుకంటే, బ్రహ్మవేత్తలలో తమరు శ్రేష్ఠులు.

పిప్పలాయన ఉవాచ

స్థిత్యుద్బవప్రలయ హేతుర హేతురస్య

యత్స్వప్నజాగరసుషుప్తిషు సద్బహిశ్చ

దేహేంద్రియాసుహృదయాని చరంతి యేన

సంజీవితాని తదవేహి పరం నరేంద్ర

పిప్పలాయనుడు పలి కెను -- ఓ రాజా! స్వయముగా కారణరహితమైన పరబ్రహ్మ ఈ జగత్తుయొక్క సృష్టి స్థితిలయములకు కారణమగుచున్నది. వ్యక్తియొక్క జాగ్రత్స్వప్నసుషుపులనే మూడు అవస్థలయందు మాత్రమే గాక, వాటికి అతీతమైన సమాధియందు కూడ పరబ్రహ్మయే చైతన్యరూప ముగా కొనసాగుచున్నది. దేహము, ఇంద్రియములు, ప్రాణాపానాదులు, అంతఃకరణము జీవంతములై ప్రవర్తిల్లేది పరబ్రహ్మవలనేనని తెలియుము.

నైతన్మనో విశతి వాగుత చక్షురాత్మా

ప్రాణేంద్రియాణి చ యథావనలమర్చిషస్స్వాః

శబ్దోఽపీ బోధకని షేధతయాఽఽత్మమూల-

మర్థోక్తమాహ యదృతే న నిషేధసిద్ధిః

అగ్నిని తననుండి పుట్టిన మిణుగురులు ప్రకాశింప జేయలేవు. అదే విధముగా, ఈ పరబ్రహ్మను మనస్సు ఊహ చేయ లేదు, వాక్కు వర్ణించలేదు, కన్ను చూడలేదు, జీవుడు తెలియలేడు, క్రియాశక్తి పొందలేదు, జ్ఞానేంద్రియములు విషయముగా చేయ లేవు. వేదవాక్కునకు మూలము పరబ్రహ్మయే. వేదవాక్కు తాను పరబ్రహ్మను ఇదమిత్తముగా నిరూపించలేను అని నిషేధించి, తద్ద్వారా పరబ్రహ్మకు లక్షకము (ని షేధశేషముగా నిర్దేశించునది) మాత్రమే అగుచున్నది. నిషేధమునకు అవధియగు పరబ్రహ్మ లేనిదే, నిషేధమైననూ ఘటిల్లదు.

 సత్త్వం రజస్తమ ఇతి త్రివృదేకమాదౌ

సూత్రం మహానహమితి ప్రవదంతి జీవమ్

జ్ఞానక్రియాఽర్థఫలరూపతయోరుశక్తి

బ్రహ్మైవ భాతి సదసచ్చ తయోః పరం యత్

సృష్టికి ముందు సత్త్వరజస్తమస్సులనే మూడు గుణముల సమాహారమైన మాయాశక్తి మాత్రమే ఉండెను. దానినుండి మహత్తత్త్వము ఆవిర్భవించెను. ఆ మహత్తత్త్వము ఉపాధిగా గల జీవతత్త్వమే హిరణ్యగర్బుడని మహాత్ములు చెప్పెదరు. దానినుండి అహంకారము, దానినుండి ఇంద్రియాధిష్టానదేవతలు, ప్రాణాపానాదులు, పంచభూతములు, సుఖదుఃఖాత్మకమగు జగత్తు ప్రకటమైనవి. ఈ తత్త్వములన్నీ పరబ్రహ్మరూపములే. పరబ్రహ్మయే కార్యకారణముల రూపముగా మాత్రమే గాక, వాటికి అతీతముగా కూడ ఉన్నది.

నాత్మా జజాన న మరిష్యతి నైధతేఽసా

న క్షీయతే సవనవిద్వ్యభిచారిణాం హి

సర్వత్ర శశ్వదనపాయుపలబ్దిమాత్రం

ప్రాణో యథేంద్రియబలేన వికల్పితం సత్

బ్రహ్మాత్మకు పుట్టుక, మరణము, వర్ధిల్లుట, క్షీణించుట మొదలైన భావవికారములు లేవు. ఎందుకంటే, ఆత్మ బాల్యస్వప్నాద్యవస్థలయందు ఆయా కాలములలో వచ్చి పోయే సకలవికారములకు సాక్షి. ప్రాణులు వేరైనా ప్రాణము ఒక్కటే. అదే విధముగా, ఆత్మ సర్వదేశకాలములలో కేవలము జ్ఞానఘనమై ఉన్నది. కన్ను మొదలైన ఇంద్రియవ్యాపారములను బట్టి ఘటాది వివిధజ్ఞానములుగా కల్పించబడే ఆత్మ సదనము.

అండేషు పేశీషు తరుష్వవినిశ్చితేషు

ప్రాణో హీ జీవముపధావతి తత్ర తత్ర

సన్నే యదింద్రియగణేహమి చ ప్రసుప్తే

కూటస్థ ఆశయమృతే తదనుస్మృతిర్నః

గ్రుడ్డునుండి పుట్టినవి (పక్షులు), జరాయువు (గర్బవేష్టనచర్మ) నుండి పుట్టినవి (మానవులు, పశువులు), విత్తునుండి పుట్టినవి (చెట్టుచేమలు), మురికినుండి పుట్టినవి ( పేలు మొదలైనవి) అని ప్రాణులు నాలుగు రకములు. ఆ సకలప్రాణులను అనుసరించి ఉండే ప్రాణశక్తి ఒక్కటే గదా! అదే విధముగా, సకలప్రాణులలోని ఆత్మ ఒక్కటే. వ్యక్తి నిద్రించినప్పుడు ఇంద్రియసముదాయము, నేను అనే వృత్తి, అంతఃకరణము కూడ విలీనమగును. కాని, నిద్ర లేచిన తరువాత మనకు కలిగే సుఖస్మృతి సుషుప్తిసాక్షియగు ఆత్మను బోధించును.

యర్ఘ్యజ్జనాభచరణేషణయోరుభక్త్యా

చేతోమలాని విధమేద్గుణకర్మజాని

                             తస్మిన్ విశుద్ధ ఉపలభ్యత ఆత్మతత్త్వం

సాక్షాద్యథాస్మలదృశోస్సవితృప్రకాశః

సత్త్వాది గుణములు, కర్మలు మనస్సును మలినము చేయును. భక్తుడు పద్మనాభుని పాదములను ప్రేమించుట వలన గొప్ప భక్తి ఉదయించి మనస్సులోని మాలిన్యములను కడిగివేయును. స్వచ్చమగు కన్నులకు సూర్యప్రకాశము వలె, అట్టి స్వచ్చమగు హృదయమునందు ఆత్మతత్త్వము సాక్షాత్కారించును.

రాజోవాచ

కర్మయోగం వదత నః పురుషో యేన సంస్కృతః

విధూయేహాశు కర్మాణి నైష్కర్మ్యం విందతే పరమ్

నిమి మహారాజు ఇట్లు పలికెను --- మాకు కర్మయోగమును బోధించుడు. దానిని అనుష్ఠించే వ్యక్తి అంతఃకరణము శుద్ధమగును. ఆతడు ఈ జన్మలోనే కర్మబంధమును పోరాడి సర్వోత్తమమైన ఆత్మనిష్ఠ (జీవన్ముక్తి) ను పొందును.

ఏవం ప్రశ్నమృషీన్ పూర్వమపృచ్ఛం పితురంతికే

నాబ్రువన్ బ్రహ్మణః పుత్రాస్తత్ర కారణముచ్యతామ్

పూర్వము తండ్రి ఇక్ష్వాకువు ప్రక్కనే ఉండగా నేను బ్రహ్మదేవుని పుత్రులగు సనకాదులను ఈ ప్రశ్నను అడిగితిని. కాని, వారు చెప్పలేదు. అట్లు చెప్పకుండుటకు గల కారణమును కూడ చెప్పడు.

ఆవిర్హో త్ర ఉవాచ

కర్మాకర్మ వికర్మేతి వేదవాదో న లౌకికః

వేదస్య చేశ్వరాత్మత్వాత్తత్ర ముహ్యంతి సూరయః

ఆవిర్ఘ త్రుడిట్లు పలికెను --- కర్తవ్యకర్మ, కర్మను చేయకుండుట, నిషిద్ధకర్మను చేయుట అనేది వేదప్రతిపాద్యమే గాని, లౌకికము కాదు. ఆ వేదము ఈశ్వరునినుండి ఆవిర్భవించినదగుట వలన ఈ కర్మ విషయమై పండితులు కూడ మోహపడెదరు.

పరోక్షవాదో వేదోఽయం బాలానామనుశాసనమ్

కర్మమోక్షాయ కర్మాణి విధత్తే హ్యగదం యథా

ఈ వేదము తత్త్వమును గుప్తముగా నుంచి చెప్పను. అజ్ఞానులను కర్మబంధమునుండి విముక్తులను చేయుటయే వేదతాత్పర్యము. పిల్లలకు రోగనివృత్తి కై మందును తాయిలముతో బాటు ఇచ్చినట్లుగా, వేదము అజ్ఞానులకు ఫలమునందభిరుచి కలిగించి కర్మలను విధించుచున్నది. ఈ కర్మల తాత్పర్యము నైష్కర్మ్యమే గాని, కర్మఫలము కాదు.

నాచరేద్యస్తు వేదోక్తం స్వయమజ్ఞోఽజితేంద్రియః

వికర్మణా హ్యధర్మేణ మృత్యోర్మృత్యుము పైతి సః

ఎవడైతే తాను అజ్ఞానియై ఉండి ఇంద్రియపరవశుడై వేదవిహితకర్మను ఆచరించడో, ఆతడు నిషిద్దకర్మ అనే అధర్మమును చేయును. దానిచే, ఆతడు జననమరణప్రవాహములో పడిపోవును.

వేదోక్తమేవ కుర్వాణో నిస్సంగీఽర్పితమీశ్వరే

నైష్కర్మ్యాం లభతే సిద్ధిం రోచనార్థా ఫలశ్రుతిః

సాధకుడు వేదవిహితమైన కర్మను మాత్రమే ఫలాసక్తి లేకుండా ఈశ్వరార్పణబుద్దితో చేయవలెను. దాని వలన ఆతడు తత్త్వజ్ఞానమును పొందును. ఆత్మస్వరూపమునందు క్రీయాసంబంధము లేదు. కర్మఫలమును చెప్పే శ్రుతివాక్యము (ఫలశ్రుతి) నకు తాత్పర్యము సాధకునకు విహితకర్మయందు అభిరుచిని కలిగించుట మాత్రమే.

య ఆశు హృదయగ్రంథిం నిర్జిహీర్షుః పరాత్మనః

విధానోపచరేద్దేవం తంత్రోక్తేన చ కేశవమ్

పరమాత్మకు నేను-నాది అనే అజ్ఞానగ్రంథి వలననే జీవభావము కలిగినది. ఆ గ్రంథిని శీఘ్రముగా పోగొట్టుకొన గోరే సాధకుడు నిత్యకర్మ లను చేస్తూ, ఆగమవిధానముతో కూడ శ్రీహరిదేవుని ఆరాధించవలెను.

లబ్ధానుగ్రహ ఆచార్యాత్తేన సందర్శితాగమః మహాపురుషమభ్యర్చేన్మూర్త్యాఽభిమతయాఽఽత్మనః

సాధకుడు ఆచార్యుని అనుగ్రహముతో మంత్రదీక్షను పొందవలెను. ఆయన వానికి పూజావిధిని ఉపదేశించును. అపుడాతడు తనకు నచ్చిన మూర్తి ద్వారా పురుషోత్తముని ఆరాధించవలెను.

శుచిస్సంముఖమాసీనః ప్రాణసంయమనాదిభిః

పిండం విశోధ్య సన్న్యాసకృతరక్షోఽర్చయేద్దరిమ్

అర్చాదౌ హృదయే చాపి యథాలబ్ధాపచార కైః

సాధకుడు శుచియై మూర్తికి ఎదురుగా కూర్చుని భూతశుద్దిని, ప్రాణాయామముచే నాడీశోధనమును చేయవలెను. తరువాత అంగన్యాస కరన్యాసములతో రక్ష చేయవలెను. తరువాత దేశకాలాదులకనుగుణముగా లభించే ద్రవ్యములతో శ్రీహరిని మూర్తియందు ఆరాధించవలెను. హృదయమునందు కూడ శ్రీహరిని ధ్యానించవలెను.

ద్రవ్య క్షిత్యాత్మలింగాని నిష్పాద్య ప్రోక్ష్య చాసనమ్

పాద్యాదీనుపకల్యాథ సన్నిధాప్య సమాహితః

హృదాదిభిః కృతన్యాసో మూలమంత్రేణ చార్చయేత్

సాధకుడు పూజాద్రవ్యములను, పూజాస్థానమును, తన మనస్సును పవిత్రము చేసుకొని, మూర్తిని నీటితో శుభ్రము చేయవలెను. తరువాత ఏకాగ్రమగు చిత్తము గలవాడై ఆసనమును సంప్రోక్షించి, అర్ఘ్యపాద్యాదుల నిచ్చి, హృదయమునందలి శ్రీహరిని భావన ద్వారా మూర్తిలో స్థాపించి, హృదయాదిన్యాసములను చేసి మూలమంత్రముతో పూజించవలెను.

సాంగోపాంగాం సపార్షదాం తాం తాం మూర్తిం స్వమంత్రతః పాద్యాద్ఘ్యాచమనీయాద్యైస్నానవాసోవిభూష ణైః

పాదములు మొదలైన అంగములతో, సుదర్శనము మొదలైన ఉపాంగములతో, అనుచరులతో కూడిన ఆయా (అభీష్ట మైన) మూర్తిని మూలమంత్రముతో పూజించవలెను. పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రములు, అలంకారము, ధూపము మొదలగువాటిని సమర్పించవలెను.

గంధమాల్యాక్షతస్రగ్బిర్దూపదీపోపహారకైః

సాంగం సంపూజ్య విధివత్ స్తవైః స్తుత్వా నమ్ఛేరిమ్

పరివారముతో కూడిన శ్రీహరిని గంధము, పుష్పములు, అక్షతలు, మాలలు, ధూపము, దీపము, నైవేద్యములతో యథావిధిగా చక్కగా పూజించి, స్తోత్రములతో స్తుతించి నమస్కరించవలెను.

ఆత్మానం తన్మయం ధ్యాయన్మూర్తిం సంపూజయేద్ద రేః

శేషామాధాయ శిరసి స్వధామ్న్యుద్వాస్య సత్కృతమ్

సాధకుడు తనను భగవద్రూపునిగా ధ్యానిస్తూ, శ్రీహరి మూర్తిని చక్కగా పూజించవలెను. నిర్మాల్యమును తల పై దాల్చి, సత్కరించబడిన శ్రీహరిని తన హృదయమునందు (మందిరమునందు) స్థాపించవలెను.

ఏవమగ్న్యరతోయాదావతిధౌ హృదయే చ యః

యజతీశ్వరమాత్మానమచిరాన్ముచ్యతే చ సః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ఏకాదశస్కంధే తృతీయోఽధ్యాయః

ఎవడైతే ఈ విధముగా అగ్ని, సూర్యుడు, నీరు, పృథివి మొదలగువాటియందు, అతిథియందు, హృదయమునందు కూడ ఆత్మ రూపుడగు శ్రీహరిని ఆరాధించునో, ఆతడు శీఘ్రముగా విముక్తుడగును.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో మూడవ అధ్యాయము ముగిసినది (3).