భాగవత మహా పురాణము
11 - భక్తి లక్షణములు
శ్రీభగవానువాచ ।
బద్ధో ముక్త ఇతి వ్యాఖ్యా గుణతో మే న వస్తుతః ।
గుణస్య మాయామూలత్వాన్న మే మోక్షో న బంధనమ్ ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- బద్ధుడు, ముక్తుడు అనే వర్ణనము నాకు సత్త్వరజస్తమోగుణముల ఉపాధిని బట్టియే గాని వాస్తవముగా లేదు. గుణములు కూడ మాయనుండి ఆవిర్భవించినవియే గనుక వాస్తవములు కావు. కావున, నాకు బంధమోక్షములు లేవు.
శోకమోహౌ సుఖం దుఃఖం దేహోత్పత్తిశ్చ మాయయా ।
స్వప్నో యథాఽఽత్మనః ఖ్యాతిస్సంసృతిర్న తు వాస్తవీ ॥
ఆత్మ చైతన్యమునందు స్వప్న ప్రపంచము యథార్థముగా లేకున్నా భాసించును (వివర్తము, బుద్ధిపరిణామము). అదే విధముగా శోక మోహములు, సుఖదుఃఖములు, దేహము పుట్టుట అజ్ఞానముచే ఆత్మ స్వరూపమునందు భాసిల్లుచున్నవి. ఈ సంసారము సత్యము కాదు.
విద్యాఽవిద్యే మమ తనూ విద్ధ్యుద్ధవ శరీరిణామ్ ।
మోక్షబంధకరీ ఆద్యే మాయయా మే వినిర్మితే ॥
ఓ ఉద్దవా! నా మాయచే నిర్మించబడిన జ్ఞాన-అజ్ఞానములు నా శక్తులే. అనాదులగు అవి దేహధారులకు క్రమముగా మోక్షమును, బంధమును కలిగించునని తెలియుము.
ఏక స్యైవ మమాంశస్య జీవ స్యైవ మహామతే ।
బంధోఽస్యావిద్యయాఽనాదిర్విద్యయా చ తథేతరః ॥
గొప్ప బుద్ధిశాలివగు ఓ ఉద్దవా! జీవుడు నా అంశయే. ఈ జీవునకే అజ్ఞానముచే ఆది లేని బంధము. ఈ జీవునకే జ్ఞానముచే మోక్షము..
అథ బద్ధస్య ముక్తస్య వైలక్షణ్యం వదామి తే ।
విరుద్ధధర్మిణోస్తాత స్థితయోరేకధర్మిణి ॥
నాయనా! ఒకే దేహమునందు బద్దుడగు జీవుడు, ముక్తుడగు పరమాత్మ గలరు. వారి ధర్మములు పరస్పరవిరుద్దములు. వారికి గల తేడాను నేను నీకు చెప్పుచున్నాను.
సుపర్ణావేతౌ సదృశౌ సఖాయౌ యదృచ్చయైతౌ కృతనీడౌ చ వృక్షే ।
ఏకస్తయోః ఖాదతి పిప్పలాన్నమన్యో నీరన్నోఽపి బలేన భూయాన్॥
ఈ జీవేశ్వరులు ఒకరినొకరు పోలియున్న మిత్రులు. ఇద్దరు చేతనులు, విడదీయ శక్యము కానివారు. వీరిద్దరు అనాదిమాయచే చెట్టువంటి ఒకే దేహమునాశ్రయించి ఉన్నారు. వారిలో జీవుడు చెట్టువంటి దేహము యొక్క ఫలమైన సుఖదుఃఖములననుభవించుచుండగా, పరమాత్మ వాటికి అతీతుడు. అయినా, జీవునికంటే పరమాత్మయొక్క శక్తి గొప్పది.
ఆత్మానమన్యం చ స వేద విద్వానపిప్పలాదో న తు పిప్పలాదః ।
యోఽవిద్యయా యుక్ స తు నిత్యబద్ధో
విద్యామయో యస్స తు నిత్యముక్తః ॥
చెట్టుయొక్క ఫలమువంటి సుఖదుఃఖములను భోగించని ఆ సాక్షి చైతన్యము దేహేంద్రియాదిప్రకృతివర్గమునంతనూ ప్రకాశింపజేస్తూ దర్శించుటయే గాక, తాను స్వయముగా ప్రకాశించును. సుఖదుఃఖములయందు భోక్త యై తగుల్కొన్న జీవునకు తన స్వరూపము తెలియదు. కాబట్టి, జ్ఞానముతో నిండిన అభోక్తయే నిత్యముక్తుడు. జ్ఞానము లేని భోక్త సర్వదా బద్ధుడే.
దేహస్థోఽపి న దేహస్థో విద్వాన్ స్వప్నాద్యథోత్థితః ।
అదేహస్థోఽపి దేహస్థః కుమతిస్స్వప్నదృగ్యథా ॥
స్వప్నమునుండి లేచినవానికి స్వప్నదేహముతో తాదాత్మ్యము ఉండదు. అదే విధముగా, ఆత్మజ్ఞానీ దేహధారిగా కనబడినా, ఆయనకు దేహముతో తాదాత్మ్యము ఉండదు. స్వప్నమును చూచుచున్నవానికి స్వప్నదేహముతో తాదాత్మ్యము ఉండును. అదే విధముగా, ఆత్మకు దేహముతో సంసర్గము లేకున్నా, ఆ జ్ఞానము లేనివాడు దేహముతో తాదాత్మ్యము కలిగియుండును.
ఇంద్రియైరింద్రియార్థేషు గుడైరపి గుణేషు చ ।
గృహ్యమాణేష్వహం కుర్యాన్న విద్వాన్ యస్త్వవిక్రియః ॥
గుణకార్యములైన చెవి మొదలగు ఇంద్రియములు గుణకార్యములే అయిన శబ్దాది విషయములను గ్రహించుచునే యుండును. అయిననూ, జ్ఞానియందు సుఖదుఃఖాది వికారములు గాని, తాను కర్తననే అహంకారము గాని ఉండవు.
దైవాధీనే శరీ రేఽస్మిన్ గుణభావ్యేన కర్మణా ।
వర్తమానోఽబుధస్తత్ర కర్తాఽస్మీతి నిబధ్యతే ॥
ఆత్మానాత్మవివేకము లేనివాడు ప్రారబ్దమునకు వశమై యుండే ఈ దేహములో దానితో తాదాత్మ్యమును చెందియుండును. కావుననే, గుణకార్యములగు ఇంద్రియములు చేసే కర్మకు తానే కర్తనని భ్రమించి ఆ దేహమునందు నేను అనే బుద్ధితో సంసారమునందు బద్ధుడగుచున్నాడు.
ఏవం విరక్తశ్శయన ఆసనాటనమజ్జనే ।
దర్శనస్పర్శనఘాణభోజనశ్రవణాదిషు ॥
న తథా బధ్యతే విద్వాంస్తత్ర తత్రాదయన్ గుణాన్ ।
ప్రకృతిస్థోఽప్యసంసక్తో యథా ఖం సవితాఽనిలః ॥
జ్ఞాని ఈ విధముగా పరుండుట, కూర్చుండుట, సంచరించుట, స్నానము చేయుట, చూచుట, స్పృశించుట, ఆఘ్రాణించుట, భుజించుట, వినుట, పట్టుకొనుట మొదలగు ఇంద్రియకార్యములయందు రాగము లేక యుండును. సద్రూపుడగు ఆయన సన్నిధిలో ఇంద్రియములు తమ తమ విషయములయందు ప్రవర్తిల్లుచుండును. ఆయనకు దేహమునందున్ననూ దేహము పై నేను-నాది అనే అభిమానము లేదు. కావుననే, ఆయన ఆకాశసూర్యవాయువులవలె బద్దుడు అగుట లేదు. ఆకాశము సర్వవ్యాపకమైనా దేనితోనైననూ తగుల్కొనదు. సూర్యుడు సకలమును ప్రకాశింపజేసినా, దేనితోనైననూ తగుల్కొనడు. వాయువు అంతటా సంచరించినా, దేనితోనైననూ తగుల్కొనదు.
వైశారద్యే క్షయాఽసంగశితయా ఛిన్నసంశయః ।
ప్రతిబుద్ధ ఇవ స్వప్నాన్నానాత్వాద్వినివర్తతే ॥
సాధకుడు నిపుణమైన ఆత్మానాత్మవివేకబుద్దికి వైరాగ్యముచే పదును పెట్టవలెను. అప్పుడాతని సంశయములు తొలగును. స్వప్నమునుండి మేల్కొన్నవానికి వలె ఆతనికి భేదబుద్ధి దూరమగును.
యస్య స్యుర్వీతసంకల్పాః ప్రాణేంద్రియమనోధియామ్ ।
వృత్తయస్స వినిర్ముక్తో దేహస్థోఽహి తద్దుణైః ॥
ఎవ్వాని కర్మేంద్రియ-జ్ఞానేంద్రియ-మనోబుద్దుల వ్యాపారములకు మూలములో కామనలు లేవో, అట్టివాడు దేహమునందే ఉన్నా జన్మమరణాది దేహధర్మములాతనిని స్పృశించవు.
యస్యాత్మా హింస్యతే హింస్రైర్యేన కించిద్యదృచ్చయా ।
అర్చ్యతే వా క్వచిత్తత్ర న వ్యతిక్రియతే బుధః ॥
హింసించే జనులు జ్ఞానియొక్క దేహమునొకప్పుడు హింసించ వచ్చును. ఈశ్వరేచ్చచే అనుకోకుండా ఎవరైనా ఆయనను కొంచెమైనా పూజించ వచ్చును. ఆయనలో ఈ మానావమానములు వికారమును కలిగించవు.
న స్తువీత న నిందేత కుర్వతస్సాధ్వసాధు వా ।
వదతో గుణదోషాభ్యాం వర్జితస్సమదృఙ్మునిః ॥
సమ (పరమాత్మ) దర్శనము గల జ్ఞాని మంచిని పలికి చేసే వారిని స్తుతించడు, చెడును పలికి చేసేవారిని నిందించడు. గుణదోషములకు అతీతుడగు ఆయన మౌనముగా నుండును.
న కుర్యాన్న వదేత్కీంచిన్న ధ్యాయేత్సాధ్వసాధు వా ।
ఆత్మారామోఽనయా వృత్త్యా విచరేజ్జడవన్మునిః ॥
మననశీలుడగు సాధకుడు తన స్వరూపమునందు రమిస్తూ మంచి-చెడులను చేయరాదు, పలుకరాదు, సంకల్పించరాదు. ఆతడీ పైన చెప్పిన విధముగా దేహమునందు నేను-నాది అనే అభిమానము లేకుండా, జడుడు వలె సంచరించవలెను.
శబ్దబ్రహ్మణి నిష్ణాతో న నిష్ణాయాత్పరే యది ।
శ్రమస్తస్య శ్రమఫలో హ్యధేనుమివ రక్షతః ॥
వేదము రూపములో నున్నది పరబ్రహ్మయే. దానియందు నిష్ణాతుడైనా పరబ్రహ్మయందు నిష్ఠ లేనివాడు చేసే పరిశ్రమకు, పాలివ్వని ఆవును పాలించువానికి వలే, ఫలము శ్రమయే యగును (పురుషార్థము లేదు).
గాం దుగ్ధదోహామసతీం చ భార్యాం దేహం పరాధీనమసత్ప్రజాం చ,
విత్తం త్వతీర్థీకృతమంగ వాచం హీనాం మయా రక్షతి దుఃఖదుఃఖీ।
ఓ ఉద్దవా! ఇచ్చే పాలను ఇచ్చేసిన (ఇప్పుడు పాలివ్వని) ఆవును, దుష్టురాలగు భార్యను, ఇతరులచే పోషించబడే శరీరమును, దుష్టులైన సంతానమును, సత్పురుషులకు దానము చేయని అపవిత్రమైన ధనమును, నన్ను (భగవానుని) కీర్తించని వాగింద్రియమును పాలించువానికి దుఃఖము మీద దుఃఖము కలుగుచుండును.
యస్యాం న మే పావనమంగ కర్మ స్థిత్యుద్బవప్రాణనిరోధమస్య ।
లీలాఽవతారేప్సితజన్మ వా స్యాత్
వంధ్యాం గిరం తాం బిభృయాన్న ధీరః ॥
ఓ ఉద్దవా! పావనమైన నా చేష్ట యే ఈ జగత్తుయొక్క సృష్టి స్థితిలయ ములకు హేతువు. నేను లీలచే స్వీకరించే అవతారములయందలి నా జన్మను భక్తులు కోరెదరు. అట్టి నా కర్మను గాని, జన్మను గాని వర్ణించని వాక్కు నిష్ఫలము. వివేకవంతుడు అట్టి వాక్కును కలిగి యుండరాదు.
ఏవం జిజ్ఞాసయాఽపోహ్య నానాత్వభ్రమమాత్మని ।
ఉపారమేత విరజం మనో మయ్యర్వ్య సర్వగే ॥
ఈ విధముగా ఆత్మవిచారము చేసి ఆత్మ అనేకమనే భ్రమను పోనాడవలెను. మనస్సును శుద్ధము జేసి సర్వవ్యాపకుడనగు నా (పరమేశ్వరుని) యందు సమర్పించవలెను. అపుడు సాధకుడు సకలకర్మలనుండి ఉపరతిని జేయవలెను.
యద్యనీశో ధారయితుం మనో బ్రహ్మణి నిశ్చలమ్ ।
మయి సర్వాణి కర్మాణి నిరపేక్షస్సమాచర ॥
మనస్సును పరబ్రహ్మయందు నిశ్చలముగా నిలుపుము. అట్లు చేయలేకపోయినచో, సకలకర్మలను ఫలాపేక్ష లేకుండా నాయందు సమర్పించి బాగా చేయుము.
శ్రద్ధాలుర్మే కథాశ్శృణ్వన్ సుభద్రా లోకపావనీః ।
గాయన్ననుస్మరన్ కర్మ జన్మ చాభినయన్ముహుః ॥
సాధకుడు పరమకల్యాణకరములై లోకములను పావనము చేసే నా గాథలను శ్రద్ధతో విని, కీర్తించి, నిరంతరముగా స్మరించవలెను. నా అవతారములను, లీలలను నాటకాదుల ద్వారా అభినయింపజేయవలెను.
మదర్థే ధర్మకామార్థానాచరన్మదపాశ్రయః ।
లభతే నిశ్చలాం భక్తిం మయ్యుద్ధవ సనాతనే ॥
ఓ ఉద్దవా! నేనే ఆశ్రయముగా గల సాధకుడు ధర్మమును నా ప్రీతి కొరకు, భోగములను నా ప్రసాదముగా, సంపదను నా ఆరాధన కొరకు వినియోగిస్తూ సేవించవలెను. అట్టి సాధకుడు కాలాతీతుడనగు నాయందు నిశ్చలమగు భక్తిని పొందును.
సత్సంగలబ్ధయా భక్త్యా మయి మాం య ఉపాసితా ।
స వై మే దర్శితం సద్భిరంజసా విందతే పదమ్ ॥
ఎవడైతే సత్పురుషులతో సంగము వలన నాయందు భక్తిని పొంది నన్ను ఉపాసించునో, అట్టివానికి నా పరమపదమును సత్పురుషులే చూపించేదరు. ఆతడు నన్ను నిశ్చయముగా సునాయాసముగా పొందును.
ఉద్ధవ ఉవాచ ।
సాధుస్తవోత్తమశ్లోక మతః కీదృగ్విధః ప్రభో ।
భక్తిస్త్వయ్యుపయుజ్యేత కీదృశీ సద్భిరాదృతా ॥
ఉద్ధవుడిట్లు ప్రశ్నించెను --- ఓ ప్రభూ! నీ గొప్ప కీర్తిని మహాత్ములు కీర్తించెదరు. నీ దృష్టిలో సత్పురుషుడనగా యెవరు? సత్పురుషులు ఆదరముగా స్వీకరించే ఎట్టి భక్తిని నీయందు చేయదగును?
ఏతన్మే పురుషాధ్యక్ష లోకాధ్యక్ష జగత్ప్రభో ।
ప్రణతాయానురక్తాయ ప్రపన్నాయ చ కథ్యతామ్ ॥
ఓ జగన్నాథా! సకలలోకములకు అధ్యక్షుడవగు నీవు సకలప్రాణులలో సాక్షి చైతన్యమవై ఉన్నావు. నేను భక్తితో శరణు వేడి ప్రణమిల్లుచున్నాను. నాకీ విషయమును చెప్పుము.
త్వం బ్రహ్మ పరమం వ్యోమ పురుషః ప్రకృతేః పరః ।
అవతీర్ణోఽసి భగవన్ స్వేచ్ఛోపాత్తవృథగ్వపుః ॥
ఓ భగవానుడా! పరబ్రహ్మవగు నీవు ఆకాశము వలె అసంగుడవు, ప్రకృతికి అతీతుడవు. అయిననూ, నీవు భక్తుల కోర్కెను తీర్చుటకై పరిచ్ఛిన్నమైన దేహమును స్వీకరించి అవతరించితివి.
శ్రీభగవానువాచ ।
కృపాలురకృతద్రోహస్తితిక్షుస్సర్వదేహినామ్ ।
సత్యసారోఽనవద్యాత్మా సమస్సర్వోపకారకః ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- భగవద్భక్తుడు దయామయుడు. ఆతడు ఏ ప్రాణీ కైననూ ద్రోహము చేయడు. సహనశీలుడగు ఆయనయొక్క గొప్ప బలము సత్యమే. భక్తుడు నిర్మలమగు అంతఃకరణము గలవాడై శత్రుమిత్రుల యెడల సమచిత్తముతో నుండును. ఆతడు సర్వులకు ఉపకారమును చేయును.
కామైరహతధీర్దాంతో మృదుశ్శుచిరకీంచనః ।
అనీహో మితభుక్ శాంతః స్థిరో మచ్ఛరణో మునిః ॥
భక్తుని బుద్ది కోరికలచే కల్లోలితము కాదు. ఆతడు ఇంద్రియనిగ్రహము తో మెత్తని శాంతమైన స్వభావమును కలిగియుండును. శుద్దమైన నడవడి తో పరిగ్రహము (భోగసామగ్రిని ప్రోగుచేయుట) లేకుండ నుండును. ఆయన ఇహపరఫలములను కోరి కర్మలను చేయడు. మితముగా భోజనము చేసే ఆతడు నిశ్చలమగు భక్తితో నన్నే శరణువేడి ధ్యానించును.
అప్రమత్తో గభీరాత్మా ధృతిమాన్ జితషడ్గుణః ।
అమానీ మానదః కల్పో మైత్రః కారుణికః కవిః ॥
భక్తుడు గంభీరమగు హృదయముతో సావధానుడై యుండును. ఆకలిదప్పికలు, శోకమోహములు, వృద్దాప్యమరణములు అనే ఆరు జీవనతరంగములనాతడు ధైర్యముతో జయించును. ఆతడు అహంకారము లేనివాడై ఇతరులను సమ్మానించును. సమర్థుడగు ఆతడు స్నేహశీలి, దయామయుడు. ఆతడు ఆత్మతత్త్వమునరయును.
ఆజ్ఞాయైవం గుణాన్ దోషాన్మయాఽదిష్టానపి స్వకాన్ ।
ధర్మాన్ సంత్యజ్య యస్సర్వానాం భజేత స సత్తమః ॥
నేను అనేకధర్మములను ఉపదేశించితిని. వాటిని అనుష్ఠించుటయందు అంతఃకరణశుద్ధి మొదలైన గుణములు, చేయకపోవుటయందు నరకము మొదలగు దోషములు గలవు. అయినప్పటికీ, ఈ సకలధర్మములను విడిచి కూడ ఎవడైతే నన్ను భజించునో, వాడు సత్పురుషులలో శ్రేష్ఠుడు.
జ్ఞాత్వాఽజ్ఞాత్వాఽథ యే వై మాం యావాన్ యశ్చాస్మి యాదృశః।
భజంత్యనన్యభావేన తే మే భక్తతమా మతాః ॥
నేను ఎంతటివాడను? ఎవ్వాడను? ఎటువంటివాడను? అనే విషయము తెలిసి గాని, తెలియక గాని ఎవరైతే నన్ను రెండవది లేని భక్తితో సేవించెదరో, వారు భక్తులలో శ్రేష్ఠులని నా అభిమతము.
మల్లింగమద్భక్తజనదర్శనస్పర్శనార్చనమ్ ।
పరిచర్యా స్తుతిః ప్రహ్వగుణకర్మానుకీర్తనమ్ ॥
నా మూర్తులను, సాలగ్రామములను, నా భక్తులను దర్శించుట, స్పృశించుట, పూజించుట, సేవించుట, స్తుతించుట, నమస్కరించుట, నా గుణములను లీలలను నిరంతరముగా కీర్తించుట భక్తిలక్షణములు.
మత్కథాశ్రవణే శ్రద్ధా మదనుధ్యానముద్ధవ ।
సర్వలాభోపహరణం దా స్యేనాత్మనివేదనమ్ ॥
ఓ ఉద్దవా! నా కథలను వినుటయందు శ్రద్ద, నన్ను నిరంతరముగా ధ్యానించుట, లభించిన సర్వమును నాకు సమర్పించుట, దాసభావముతో తనను తాను సమర్పించుకొనుట అనేవి భక్తిలక్షణములు.
మజ్జన్మకర్మకథనం మమ పర్వానుమోదనమ్ ।
గీతతాండవవాదిత్రగోష్ఠిభిర్మధృహోత్సవః ॥
నా అవతారములను లీలలను చెప్పుట, నా పర్వదినములలో పాటలు, నాట్యములు, వాద్యములు, గోష్ఠులను చేసి చేయించుట, నా మందిరములయందు ఉత్సవములను చేసి చేయించుట భక్తిలక్షణములు.
యాత్రా బలివిధానం చ సర్వవార్షికపర్వసు ।
వైదికీ తాంత్రికీ దీక్షా మదీయవ్రతధారణమ్ ॥
తీర్థయాత్ర, ప్రతిసంవత్సరము వచ్చే సకలపర్వదినములయందు పూజలను చేయుట, వైదికపద్దతిలో లేక తాంత్రికపద్దతిలో దీక్ష, నాకు చెందిన వ్రతములను పాలించుట అనేవి భక్తిలక్షణములు.
మమార్చాస్థాపనే శ్రద్ధా స్వతస్సంహత్య చోద్యమః । ఉద్యానోపవనాక్రీడపురమందిరకర్మణి ॥
నా మూర్తిని స్థాపించుటయందు శ్రద్ద భక్తిలక్షణము. భక్తుడు పూదోట, పళ్ల తోట, విహారస్థానము, మందిరములను నిర్మించే ప్రయత్నమును తనంత తాను గాని, నలుగురితో కలిసి గాని చేయవలెను.
సంమార్జనోపలేపాభ్యాం సేకమండలవర్త నైః ।
గృహశుశ్రూషణం మహ్యం దాసవద్యదమాయయా ॥
నిష్కపటముగా (ఫలతృష్ణ లేకుండా) సేవకుని వలే నా మందిరమునందు తుడుచుట, అలుకుట, నీరు చల్లుట, సర్వతోభద్రము మొదలైన మండలములను చేయుట మొదలగు సేవ భక్తికి లక్షణము.
అమానిత్వమదంభిత్వం కృతస్యాపరికీర్తనమ్ ।
అపీ దీపావలోకం మే నోపయుంజ్యాన్నివేదితమ్ ॥
అభిమానము, ఆత్మజ్ఞాఘనము, డాంబీకము, తాను చేసిన పనిని కీర్తించుట అనేవి భక్తునియందు ఉండరాదు. నాకు సమర్పించిన దీపమును కూడ ఇతరకార్యములకు వాడరాదు. కావుననే, రెండు వత్తులను వెలిగించవలెను. ఇతరులకు నివేదించినదానిని నాకు సమర్పించరాదు.
యద్యదిష్టతమం లోకే యచ్చాతిప్రియమాత్మనః ।
తత్తన్నివేద యేన్మహ్యం తదనంత్యాయ కల్పతే ॥
లోకమునందు ఎయ్యది చాల ప్రియమైనదో, ఏది తనకు చాల ప్రియమో, దానిని నాకు నివేదించవలేను. అది అనంతఫలమునిచ్చును.
సూర్యోఽగ్నిర్బ్రాహ్మణో గావో వైష్ణవః ఖం మరుజ్జలమ్ ।
భూరాత్మా సర్వభూతాని భద్ర పూజాపదాని మే ॥
మంగళకరుడవగు ఓ ఉద్దవా! సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, గోవులు, విష్ణుభక్తుడు, ఆకాశము, వాయువు, నీరు, భూమి, ఆత్మ చైతన్యము, సకలప్రాణులు అనునవి నన్ను పూజించే స్థానములు.
సూర్యే తు విద్యయా త్రయ్యా హవిషాఽగ్నౌ యజేత మామ్ ।
ఆతిథ్యేన తు విప్రాగ్ర్యే గోష్వంగ యవసాదినా ॥
ఓ ఉద్దవా! వైదికమంత్రములతో ఉపస్థానము అర్ఘ్యమునిచ్చుట ఇత్యాదులచే సూర్యునియందు, హవిష్ణును హోమము చేయుటచే అగ్నియందు, అతిథిపూజచే శ్రేష్ఠుడగు బ్రాహ్మణునియందు, గడ్డి-నీరు మొదలగువాటిచే ఆవులు-ఎద్దులయందు నన్ను ఆరాధించవలెను.
వైష్ణవే బంధుసత్కృత్యా హృది మే ధ్యాననిష్ఠయా ।
వాయౌ ముఖ్యధియా తోయే ద్రవ్యైస్తోయపురస్కృతైః ॥
విష్ణుభక్తుని బంధువును వలె సమ్మానించుటచే, హృదయమునందు నన్ను నిష్ఠతో ధ్యానించుటచే, వాయువునందు ముఖ్యప్రాణమైన హిరణ్యగర్భుడనే భావనచే, నీటియందు నీరు-పుష్పములు మొదలైన ద్రవ్యములను సమర్పించుటచే, నన్ను ఆరాధించవలెను.
స్థండిలే మంత్రహృదయైర్భోగైరాత్మానమాత్మని ।
క్షేత్రజ్ఞం సర్వభూతేషు సమత్వేన యజేత మామ్ ॥
ప్రతిమ గల భూమియందు రహస్యమంత్రములతో, ఆత్మరూపుడనగు నన్ను దేహమునకు యోగ్యమైన భోగములనిచ్చుటచే, సకలప్రాణులలో సాక్షి చైతన్యరూపుడనగు నన్ను సర్వప్రాణులపై సమచిత్తముచే మరియు సుఖదుఃఖములయందు సమచిత్తముతో ఆరాధించవలెను.
ధిష్ణ్యే ష్యేష్వితి మద్రూపం శంఖచక్రగదాఽoబుజైః ।
యుక్తం చతుర్భుజం శాంతం ధ్యాయన్నర్చేత్సమాహితః ॥
శంఖము, చక్రము, గద, పద్మములతో కూడిన నా శాంతమైన రూపమును సాధకుడు ఏకాగ్రచిత్తముతో ఈ అధిష్టానములయందు ధ్యానిస్తూ, ఈ (పైన చెప్పిన విధముగా ఆరాధించవలెను.
ఇష్టాపూర్తేన మామేవం యో యజేత సమాహితః ।
లభతే మయి సద్భక్తిం మత్స్మృతిస్సాధు సేవయా ॥
ఎవడైతే ఏకాగ్రచిత్తము గలవాడై నన్నీ విధముగా వైదికకర్మలతో, సత్రములను నిర్మించుట మొదలైన పూర్త (ప్రజోపకార) కర్మలతో ఆరాధించునో, ఆతడు మంచి భక్తిని పొందును. సత్పురుషులను సేవించుటచే ఆతనికి నిరంతరము నా స్మరణము కలుగును.
ప్రాయేణ భక్తియోగేన సత్సంగేన వినోద్ధవ ।
నోపాయో విద్యతే సధ్ర్యజ్ ప్రాయణం హి సతామహమ్ ॥
ఓ ఉద్దవా! సంసారమును తరించుటకు సత్సంగము వలన కలిగే భక్తియోగము మినహా మంచి ఉపాయము ఇంకోటి నిశ్చయముగా లేదు. ఎందుకంటే, సత్పురుషుల జీవితలక్ష్యము నేనే.
అథైతత్పరమం గుహ్యం శృణ్వతో యదునందన ।
సుగోప్యమపి వక్ష్యామి త్వం మే భృత్యస్సుహృత్సఖా ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ఏకాదశస్కంధే ఏకాదశోఽధ్యాయః ॥
యదువంశనందనుడవగు ఓ ఉద్దవా! తరువాత నీకీ గొప్ప రహస్యమును చెప్పెదను, వినుము. నీవు నాకు సేవకుడవు, హితకారివి, మిత్రుడవు. కావుననే, నేనీ గొప్ప రహస్యమును నీకు చెప్పెదను.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో
భక్తలక్షణములను వర్ణించే
పదకొండవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 11 of the Bhāgavata Mahā Purana is as follows:
Śrī Kṛshṇa detailed the contrasting characteristics of conditioned and liberated living entities. A conditioned soul considers himself the doer of physical activities, becoming entangled in domestic attachments, wealth, and societal prestige, whereas a liberated soul views his physical body as an external vehicle, remaining undisturbed by praise or insult. Bhagavān explained that a pure devotee (*Sādhu*) exhibits thirty-two saintly qualities: mercy, truthfulness, cleanliness, austerity, simplicity, humility, self-control, and total surrender to Śrī Kṛshṇa. Kṛshṇa declared that pure devotional service (*Bhakti-yoga*) performed in the company of saintly devotees (*Sādhu-saṅga*) is superior to dry philosophical speculation or ritualistic work.