భాగవత మహా పురాణము
13 - హంస గీతి
శ్రీభగవానువాచ ।
సత్త్వం రజస్తమ ఇతి గుణా బుద్ధేర్న చాత్మనః ।
సత్త్వేనాన్యతమౌ హన్యాత్సత్త్వం సత్త్వేన చైవ హి ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- సత్త్వరజస్తమోగుణములు ప్రకృతికార్యమగు బుద్దికి చెందినవే గాని, ఆత్మకు చెందినవి కావు. సత్త్వగుణముచే మిగిలిన రెండు గుణములను జయించవలెను. సత్త్వగుణమును కూడ సత్త్వగుణము (శాంతవృత్తి) తోనే జయించవలెను.
సత్త్వాద్ధర్మో భవేద్వృద్ధాత్పుంసో మద్భక్తిలక్షణః ।
సాత్త్వికోపాసయా సత్త్వం తతో ధర్మః ప్రవర్తతే ॥
సత్త్వగుణము వర్ధిల్లిన మానవునకు నాయందు భక్తి అనే ధర్మము కలుగును. సాత్త్వికమైన ఉపాసన (సాత్త్వికపదార్థములను సేవించుట) చే సత్త్వగుణము, దాని వలన ధర్మము ప్రవర్తిల్లును.
ధర్మో రజస్తమో హన్యాత్సత్త్వవృద్ధిరనుత్తమః ।
ఆశు నశ్యతి తన్మూలో హ్యధర్మ ఉభయే హతే ॥
సత్త్వగుణము వలన సర్వోత్కృష్టమైన ధర్మము వర్ధిల్లును. దానివలన రజస్తమోగుణములు నశించును. ఆ రెండు నశించగానే, వాటి మూలముగా పుట్టే అధర్మము వెంటనే నిశ్చయముగా నశించును.
ఆగమోఽపః ప్రజా దేశః కాలః కర్మ చ జన్మ చ ।
ధ్యానం మంత్రోఽథ సంస్కారో దశైతే గుణ హేతవః ॥
శాస్త్రము, జలములు, సంతానము, దేశము, కాలము, కర్మ, జన్మ, ధ్యానము, మంత్రము, సంస్కారము అనే పది గుణములకు హేతువులు. (ఇవి సాత్త్వికములైనచో సత్త్వగుణము వర్ధిల్లును. గంగాది జలములు సత్త్వగుణమును వర్ధిల్లజేయును).
తత్తత్సాత్త్వికమేవైషాం యద్యద్వృద్ధాః ప్రచక్షతే ।
నిందంతి తామసం యత్తద్రాజసం తదు పేక్షితమ్ ॥
ఈ ఆగమము మొదలగువాటిలో వేటిని వ్యాసాది మహాత్ములు ప్రశంసించెదరో, అవి సాత్త్వికములు; వేటిని నిందించెదరో, అవి తామసములు; వేటిని ఉపేక్షించెదరో, అవి రాజసములు.
సాత్త్వికాన్యేవ సేవేత పుమాన్ సత్త్వవివృద్ధయే ।
తతో ధర్మస్తతో జ్ఞానం యావత్స్మృతిరపోహనమ్ ॥
అజ్ఞానము తొలగి ఆత్మసాక్షాత్కారము కలిగే వరకు మానవుడు సత్త్వగుణము వర్ధిల్లుటకై సత్త్వగుణప్రధానమైన ఆగమాదులను (నివృత్తిశాస్త్రము, తీర్థజలములు, వివిక్త దేశము, బ్రాహ్మముహూర్తము, నిత్యకర్మ, సాత్త్వికమంత్రము ఇత్యాదులు) మాత్రమే సేవించవలెను. దాని వలన ధర్మము, ధర్మము వలన జ్ఞానము కలుగును. .
వేణుసంఘర్షజో వహ్నిర్దగ్ధ్వా శామ్యతి తద్వనమ్ ।
ఏవం గుణవ్యత్యయజో దేహశ్శామ్యతి తత్క్రియః ॥
వెదుళ్ల రాపిడినుండి పుట్టిన అగ్ని తనకు కారణమైన ఆ అడవిని తగులబెట్టి చల్లారును. ఇదే విధముగా, ఈ దేహము గుణములయందలి వైషమ్యము వలన పుట్టినది. విచారముచే పుట్టే జ్ఞానాగ్ని గుణములను భస్మము చేసి తాను కూడ ఆత్మస్వరూపమునందు విలీనమగును.
ఉద్ధవ ఉవాచ ।
వదంతి మర్త్యాః ప్రాయేణ విషయాన్ పదమాపదామ్ ।
తథాపి భుంజతే కృష్ణ తత్కథం శ్వఖరాజవత్ ॥
ఉద్దవుడిట్లు పలి కెను --- ఓ శ్రీకృష్ణా! ఇంద్రియసుఖములు ఆపదలకు నిలయమని మానవులు తరచుగా చేప్పెదరు. అయినప్పటికీ, ఛీ అన్నా వచ్చే కుక్కవలె, దెబ్బలు తిని కూడ వెంట పడే గాడిదవలె, కసాయినే నమ్మే మేక వలే, వారా భోగములను అనుభవించెదరు. ఇది యెట్లు?
శ్రీభగవానువాచ ।
అహమిత్యన్యథా బుద్ధిః ప్రమత్తస్య యథా హృది ।
ఉత్సర్పతి రజో ఘోరం తతో వైకారికం మనః ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- అవివేకికి దేహమే నేను అనే మిథ్యాబుద్ది హృదయములో కలుగును. దాని వలన దుఃఖకారణమగు రజోగుణము మనస్సును - అది సత్త్వగుణకార్యమే ఐనా - వ్యాపించును.
రజోయుక్తస్య మనసస్సంకల్పసవికల్పకః ।
తతః కామో గుణధ్యానాద్దుస్సహస్స్యాద్ధి దుర్మతేః ॥
అవివేకియొక్క మనస్సు రజోగుణప్రధానముగా నుండును. ఆ మనస్సులో భోగసంకల్పము పుట్టును. భోగ్యమునకు సంబంధించిన వికల్పములు ఆ సంకల్పమును బలపరచును. తరువాత, ఆ భోగ్యము యొక్క గుణముల ధ్యాస పెరుగును. దానిచే కామన పుట్టును. ఆ కామనను విడిచి పెట్టుట వానికి శక్యము కాకుండును.
కరోతి కామవశగః కర్మాణ్యవిజితేంద్రియః ।
దుఃఖోదర్కాణి సంపశ్యన్ రజోవేగవిమోహితః ॥
రజోగుణముయొక్క వేగముచే వ్యామోహితుడైనవానికి ఇంద్రియ జయము ఉండదు. కావుననే, అట్టివాడు కామనలకు వశవర్తియై ఉండును. కర్మలకు ఉత్తరఫలము దుఃఖమేనని తెలిసినా, ఆతడు కర్మలను చేయును.
రజస్తమోభ్యాం యదపి విద్వాన్ విక్షిప్తధీః పునః ।
అతంద్రితో మనో యుంజన్ దోషదృష్టిర్న సజ్జతే ॥
వివేకికి కూడా బుద్ధియందు రజస్తమోగుణముల విక్షేపము ఉండవచ్చును. అయిననూ, విషయభోగములయందలి దోషము ఆతనికి ఎరుకయే. కావుననే, ఆతడు సావధానుడై మనస్సును నిరోధించును. కావుననే, ఆతడు విషయభోగములయందు తగుల్కొనడు.
అప్రమత్తోఽనుయుంజీత మనో మయ్యర్పయన్ శనైః ।
అనిర్విణ్ణో యథాకాలం జితశ్వాసో జితాసనః ॥
సాధకుడు సావధానుడై ఆసనముపై పట్టు సాధించి ప్రాణాయామ మును అభ్యసిస్తూ మనస్సును నా పై అర్పించి స్థిరము చేయవలెను. ధ్యానమును తగిన కాలములో (మూడు పూటలు) చేయవలెను. ధ్యానము కుదరలేదని నిరుత్సాహపడరాదు. సాధనలో తొందరపాటు ఉండరాదు.
ఏతావాన్ యోగ ఆదిష్టో మచ్ఛిష్యైస్సనకాదిభిః ।
సర్వతో మన ఆకృష్య మయ్యద్ధాఽఽవేశ్యతే యథా ॥
మనస్సును అన్ని వైపులనుండి వెనుకకు లాగి సాక్షాత్తుగా నా పై నిలుపవలెను. నా శిష్యులైన సనకసనందనాదులు ఉపదేశించిన మనోనిగ్రహము ఇంత మాత్రమే.
ఉద్ధవ ఉవాచ ।
యదా త్వం సనకాదిభ్యో యేన రూపేణ కేశవ ।
యోగమాదిష్ట వానేతద్రూపమిచ్ఛామి వేదితుమ్ ॥
ఉద్దవుడిట్లు పలికెను --- ఓ శ్రీకృష్ణా! నీవు ఎప్పుడు ఏ రూపముతో సనకసనందనాదులకు యోగమునుపదేశించితివి? ఆ రూపమును (కాలమును) గురించి నేను తెలియగోరుచున్నాను.
శ్రీభగవానువాచ ।
పుత్రా హిరణ్యగర్భస్య మానసాస్సనకాదయః ।
పప్రచ్ఛుః పితరం సూక్ష్మాం యోగస్యైకాంతికీం గతిమ్ ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- బ్రహ్మదేవుని మానసపుత్రులగు సనకసనందనాదులు తండ్రిని, యోగము (మనోనిగ్రహము) యొక్క సూక్ష్మమైన అంతిమసీమను గురించి ప్రశ్నించిరి.
సనకాదయ ఊచుః ।
గుణేష్వావిశతే చేతో గుణాశ్చేతసి చ ప్రభో ।
కథమన్యోన్యసంత్యాగో ముముక్షో రతితితీర్షోః ॥
సనకసనందనాదులు ఇట్లు పలికిరి --- ఓ ప్రభూ! మనస్సు గుణకార్యములగు శబ్దాదులయందు, శబ్దాదులు మనస్సునందు ఆసక్తములై యున్నవి. సంసారసముద్రమును దాటి మోక్షమును కోరే సాధకునకు అవి ఒకదానిని మరియొకటి విడిచి పెట్టే ఉపాయమెయ్యది?
శ్రీభగవానువాచ ।
ఏవం పృష్టో మహాదేవస్స్వయంభూర్భూతభావనః ।
ధ్యాయమానః ప్రశ్నబీజం నాభ్యపద్యత కర్మధీః ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- బ్రహ్మదేవుడు దేవదేవుడు, స్వయంభువుడు, ప్రాణులను సృష్టించినవాడు. అయినా, ఆయన మనస్సు కర్మలచే విక్షిప్తమై యుండుటచే, ఎంత ఆలోచించినా, ప్రశ్నకు మూలములోని సంశయము ఆయనకు అంతు పట్టలేదు.
స మామచింతయద్దేవః ప్రశ్నపారతితీర్షియా ।
తస్యాహం హంసరూపేణ సకాశమగమం తదా ॥
ఆ బ్రహ్మదేవుడు ప్రశ్నకు ఉత్తరమును తెలియగోరి నన్ను తలపోసెను. అప్పుడు నేను హంసరూపముతో ఆయన వద్దకు వెళ్లితిని. (హంస నీటిని పాలను విడదీసినట్లు నేను ఆత్మను గుణములనుండి విడదీసి చెప్పితిని).
దృష్ట్వా మాం త ఉపప్రజ్య కృత్వా పాదాభివందనమ్ ।
బ్రహ్మాణమగ్రతః కృత్వా పప్రచ్ఛుః కో భవానితి ॥
ఆ సనకాదులు నన్ను చూచి దగ్గరకు వచ్చి పొదములకు నమ స్కరించి, బ్రహ్మదేవుని ఎదుట ఉంచుకొని, నీవెవరు? అని ప్రశ్నించిరి.
ఇత్యహం మునిభిః పృష్టస్తత్వజిజ్ఞాసుభిస్తదా ।
యదవోచమహం తేభ్యస్తదుద్ధవ నీబోధ మే ॥
ఉద్దవా! తత్త్వమును తెలియగోరి ఆ మహర్షులు నన్నీ విధముగా ప్రశ్నించగా, అప్పుడు నేను వారికి చేసిన బోధను నీవు నానుండి తెలీయుము.
వస్తునో యద్యనానాత్వమాత్మనః ప్రశ్న ఈదృశః ।
కథం ఘటేత వో విప్రా వక్తుర్వా మే క ఆశ్రయః ॥
ఓ మహర్షులారా! ఆత్మవస్తువు అనేకము కానప్పుడు మీ ఈ (నీవెవరు?) ప్రశ్న ఎట్లు యుక్తిసంగతమగును? దేనిని (దేహాదికమును) ఆధారముగా చేసుకొని (తాదాత్మ్యమును చెంది) నేను మీ ప్రశ్నకు సమాధానమును చెప్పవలెను? (తాదాత్మ్యము లేనిదే చెప్పేవాడు, వినేవాడు అనే భేదము పొసగదు).
పంచాత్మకేషు భూతేషు సమానేషు చ వస్తుతః ।
కో భవానితి వః ప్రశ్నో వాచారంభో హ్యనర్థకః ॥
అయిదు భూతములు సకలప్రాణిదేహములలో సమానము. ఇది యథార్థము. మీరెవరు? అనే మీ ప్రశ్న నిరర్థకము. కాబట్టి, ఈ ప్రశ్నకు కేవలము వాగ్వ్యవహారమే ఆలంబనము గాని వస్తునిర్ణయము కాదు.
మనసా వచసా దృష్ట్యా గృహ్యతేఽన్యైరపీంద్రియైః ।
అహమేవ న మత్తోఽన్యదితి బుధ్యధ్వమంజసా ॥
మనస్సు, వాక్కు, చూపు, మరియు ఇతరములైన ఇంద్రియములచే గ్రహించబడే సర్వము నేనే, నాకంటె వేరుగా ఏదీ లేదు. తత్త్వవిచారము చేసి ఈ సత్యమునరయుడు.
గుణేష్వావిశతే చేతో గుణశ్చేతసి చ ప్రజాః ।
జీవస్య దేహ ఉభయం గుణాశ్చేతో మదాత్మనః ॥
ఓ పుత్రులారా! మనస్సు గుణకార్యములగు శబ్దాదులయందు, శబ్దాదులు మనస్సునందు ప్రవేశించుచున్నవి. కాని, జీవుని ఆత్మ నేనే. ఈ మనస్సు, శబ్దాదులు జీవునకు ఉపాధియే గాని స్వరూపము కాదు.
గుణేషు చావిశచ్చిత్తమభీక్ ష్ణం గుణ సేవయా ।
గుణాశ్చ చిత్తప్రభవా మద్రూప ఉభయం త్యజేత్ ॥
మరల మరల గుణకార్యములగు శబ్దాదులను సేవించుటచే చిత్తము వాటియందు ఆసక్తమగును. అప్పుడు అవి చిత్తమునందు గట్టిగా నెలకొనును. జీవుని స్వరూపమైతే నేనే. కావున, సాధకుడు ఆత్మనిష్ఠుడై (నన్ను ధ్యానించువాడై) ఈ రెండింటినీ విడిచి పెట్టవలెను.
జాగ్రత్స్వప్నస్సుషుప్తం చ గుణతో బుద్ధివృత్తయః ।
తాసాం విలక్షణో జీవస్సాక్షిత్వేన వినిశ్చితః ॥
జాగ్రత్స్వప్నసుషుపులు సత్త్వాదిగుణముల వలన బుద్దియందు కలిగే అవస్థలే. జీవుడు వీటికి సాక్షి యై ఉండును గనుక, వీటికంటే విలక్షణుడని మహాత్ములచే నిశ్చయించబడినది.
యర్హి సంసృతిబంధోఽయమాత్మనో గుణవృత్తిదః ।
మయి తుర్యే స్థితో జహ్యాత్త్యాగస్తద్గుణచేతసామ్ ॥
ఆత్మకు సంసారములో తిరుగాడే ఈ బుద్ధితోడి తాదాత్మ్యమే బంధము. దానివలననే గుణముల వ్యాపారములు ఆత్మకు వచ్చుచున్నవి. ఆత్మ మూడు అవస్థలకు అతీతమై వాటికి సాక్షిగా ఉండే నాల్గవది. కావున, సాధకుడు ఆత్మయందు నిష్ఠను అభ్యసించవలెను. అప్పుడు గుణకార్య ములగు శబ్దాదులు, చిత్తము అనువాటినుండి ఒకేసారి విముక్తి కలుగును.
అహంకారకృతం బంధమాత్మనోఽర్థవిపర్యయమ్ ।
విద్వాన్నిర్విద్య సంసారచింతాం తుర్యే స్థితస్త్యజేత్ ॥
తనకు అహంకారము (దేహాభిమానము) పురుషార్థమును చెడగొట్టే బంధమని సాధకుడు గుర్తించవలెను. సాధకుడు విరక్తిజెంది అవస్థాత్రయ
సాక్షియగు ఆత్మస్వరూపమునందు నిలిచి, సంసారమును కలిగించే (భోగ) సంకల్పములను విడిచి పెట్టవలెను.
యావన్నానాఽర్థధీః పుంసో న నివర్తేత యుక్తిభిః ।
జాగర్త్యవీ స్వపన్నజ్ఞస్స్వప్నే జాగరణం యథా ॥
జగత్తులోని నానాత్వము సత్యమనే బుద్ది ఎంతవరకైతే తొలగిపోదో, అంతవరకు మానవుడు అజ్ఞానియే. అజ్ఞాని జాగ్రదవస్థలో కూడ స్వప్న ములోనున్నట్లే. అది యెల్లాగంటే, స్వప్నములో కూడ తెలివిగా ఉన్నట్లే అనుభవము కలుగుచుండును గదా!
అసత్త్వాదాత్మనోఽన్యేషాం భావానాం తత్కృతా భిదా ।
గతయో హేతవశ్చాస్య మృషా స్వప్నదృశో యథా ॥
ఆత్మకంటే భిన్నముగా దేవమనుష్యాదిభేదములేవియు వాస్తవముగా లేవు. కాబట్టి, కర్మలను చేయుట, కర్మఫలములైన స్వర్గాదిలోకములను పొందుట అనేవి ఈ ఆత్మకు, స్వప్నపురుషునకు వలే, కల్పితములే. స్వప్నపదార్థములు స్వప్నద్రష్టకంటె భిన్నముగా లేవు.
యో జాగరే బహిరనుక్షణధర్మినోఽర్థాన్
భుంక్తే సమస్తకరణైర్హృది తత్సదృక్షాన్ ।
స్వప్నే సుషుప్త ఉపసంహరతే స ఏకః
స్మృత్యన్వయాత్త్రిగుణవృత్తిదృగింద్రియేశః ॥
ఇంద్రియములకు సత్తాస్ఫూర్తులననుగ్రహించే ఆత్మ మూడు గుణముల వలన కలిగే జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థలకు సాక్షి. జాగ్రదవస్థ యందు ప్రతిక్షణము నశించే స్వభావము గల పదార్థములను (బాల్యా దులను) సకలములైన ఇంద్రియములతో బాహ్యజగత్తునందు భోగించేది విశ్వుడు. స్వప్నములో హృదయమునందు జాగ్రత్సదార్థములను పోలిన వాటినే భోగించేది తైజసుడు. ఈ సర్వమును నిద్రావస్థలో తనలోనికి ఉపసంహరించేది ప్రాజ్ఞుడు. ఈ మూడింటియందు స్మరణ (నిద్ర పోయి కల గన్న నేను ఇప్పుడు తెలివిగా ఉన్నాను) రూపముగా అనుగతమయ్యే ఆత్మతత్త్వము అద్వయము.
ఏవం విమృశ్య గుణతో మనసస్త్ర్యవస్థా
మన్మాయయా మయి కృతా ఇతి నిశ్చితార్థాః ।
సంఛిద్య హార్దమనుమానసదుక్తితీక్ ష్ణ
జ్ఞానాసినా భజత మాఽఖిలసంశయాధిమ్ ॥
ఈ విధముగా విచారించి, త్రిగుణాత్మకమగునా మాయచే మనస్సునందు జాగ్రత్తు మొదలైన అవస్థలు కల్పించబడుచున్నవనే తత్త్వమును నిశ్చయము చేసుకొనుడు. సత్పురుషుల బోధలను వింటూ ఆత్మానాత్మవివేకమునభ్యసించుట వలన వివేకజ్ఞానమనే కత్తికి పదును వచ్చును. దానితో మనోవ్యాధులనదగిన సంశయములనన్నింటినీ ఛేదించుడు. హృదయమునందున్న నన్ను భజించుడు.
ఈ క్షేత్ర విభ్రమమిదం మనసో విలాసం
దృష్టం వినష్టమతిలోలమలాతచక్రమ్ ।
విజ్ఞానమేకమురుధేవ విభాతి మాయా
స్వప్నస్త్రిధా గుణవిసర్గకృతో వికల్పః ॥
దృశ్యము, క్షణభంగురము, గిర గిర తిరిగే కొరివి వలె మిక్కిలి చంచలము అగు జగత్తు మనస్సుయొక్క విలాస మాత్రమే. ఈ జగత్తు గట్టి భ్రమ మాత్రమే అని తెలియవలెను. రెండవది లేని ఆత్మచైతన్యమే అనేకరూపములుగా కన్పట్టుచున్నది. శరీరము, ఇంద్రియములు, అంతఃకరణము అనే మూడు విధముల భేదము సత్త్వరజస్తమోగుణముల పరిణామమే. ఈ భేదము స్వప్నము వలె అజ్ఞానకల్పితము.
దృష్టిం తతః ప్రతినివర్త్య నివృత్తతృష్ణః
తూష్ణిం భవేన్నిజసుఖానుభవో నిరీహః ।
సందృశ్యతే క్వ చ యదీదమవస్తుబుద్ధ్యా
త్యక్తం భ్రమాయ న భవేత్స్మృతిరా నిపాతాత్ ॥
ఆత్మానందమును అనుసంధానము చేసే సాధకుడు భోగములపై ఆశను విడిచి పెట్టి, ఆ దేహేంద్రియసంఘాతమునుండి దృష్టిని వెనుకకు మళ్లించ (నేను-నాది అనే అభిమానమును విడిచి పెట్ట) వలెను. ఆతడు ఫలతృష్ణ లేనివాడగుటచే ఫలాపేక్షతో చేసే కర్మలు ఉండవు. ఒకచో భిక్షాటనము ఇత్యాదిసందర్భములలో దేహాభిమానము ఉండవచ్చును. కాని, పరమార్థము కాదనే నిశ్చయబుద్దితో అభిమానము విడిచి పెట్టబడిన ఆ దేహము ఆతనికి ఆత్మభ్రమను కలిగించలేదు. ఆ దేహము కేవలము పడిపోయేవరకు సంస్కారరూపముగా స్మరణమునకు వచ్చును.
దేహం చ నశ్వరమవస్థితముత్థితం వా
సిద్ధో న పశ్యతి యతోఽధ్యగమత్స్వరూపమ్ ।
దైవాద పేతముత దైవవశాదు పేతం
వాసో యథా పరీకృతం మదిరామదాంధః ॥
మద్యము మత్తులో తనను విస్మరించినవాడు తాను కట్టిన వస్త్రము ఉన్నదా, ఊడినదా? అని పట్టించుకోడు. అదే విధముగా, స్వరూపసాక్షా త్కారమును పొందినవాడగుటచే ఆత్మనిష్ఠుడు దేహమును పట్టించుకోడు. నశించే స్వభావము గల దేహము ప్రారబ్ధకర్మాధీనమై ఒకచోట ఉన్నా, నిలబడినా, ఎక్కడికైనా వెళ్లినా, తిరిగి వచ్చినా ఆయన సరకు చేయడు.
దేహోఽపి దైవవశగః ఖలు కర్మ యావత్
స్వారంభకం ప్రతి సమీక్షత ఏవ సాసుః ।
తం సప్రపంచమధిరూఢసమాధియోగః
స్వాప్నం పునర్న భజతే ప్రతిబుద్ధవస్తుః ॥
ప్రాణాపానాదులు, ఇంద్రియములతో కూడిన దేహమును ప్రారబ్ధకర్మ ఉత్పన్నము చేసినది. ఆ కర్మ ఉన్నంతవరకు దేహము ఎదురుచూస్తూ కదలుచుండును. చిత్తేకాగ్రత అనే యోగమునధిష్టించి ఆత్మతత్త్వమును సాక్షాత్కరించుకున్న జ్ఞాని స్వప్నతుల్యమైన ప్రపంచమునందు మమ కారమును, దేహమునందు నేను-అనే అభిమానమును తిరిగి పొందడు.
మయైతదుక్తం వో విప్రా గుహ్యం యత్సాంఖ్యయోగయోః ।
జానీత మాఽఽగతం యజ్ఞం యుష్మద్ధర్మవివక్షయా ॥
ఓ మహర్షులారా! జ్ఞానయోగకర్మయోగముల రహస్యమును నేను మీకు ఉపదేశించితిని. నేను మీకు మోక్షధర్మమునుపదేశించగోరి వచ్చిన యజ్ఞరూపుడనగు శ్రీహరినని తెలియుడు.
అహం యోగస్య సాంఖ్యస్య సత్యస్యర్తస్య తేజసః ।
పరాయణం ద్విజశ్రేష్ఠాశ్శ్రియః కీర్తీర్ధమస్య చ ॥
ఓ మహర్షులారా! కర్మయోగము, జ్ఞానయోగము, సత్యము, వేదవిహిత ధర్మము, మధురభాషణము, అనుంచే ధర్మము, తేజస్సు, సంపద, కీర్తి, ఇంద్రియనిగ్రహములకు నేను గొప్ప ఆశ్రయము. వాటి ఫలము కూడ నేనే.
మాం భజంతి గుణాస్సర్వే నిర్గుణం నిర పేక్షకమ్ ।
సుహృదం ప్రియమాత్మానం సామ్యాసంగాదయో గుణాః ॥
నిర్గుణుడనగు నాకు అపేక్ష ఏదీ లేదు. హితకారినగు నేను ప్రీతికి నిధానమగు ఆత్మరూపుడను. సమత్వము, అసంగత్వము, సత్యము మొదలగు సకలగుణములు నన్ను సేవించుచున్నవి.
ఇతి మే చ్ఛిన్నసందేహా మునయస్సనకాదయః ।
సభాజయిత్వా పరయా భక్త్యాఽగృణత సంస్త వైః ॥
ఈ విధముగా సనకసనందనాది మహర్షులకు నా వలన సందేహములు పటాపంచలయ్యెను. వారు గొప్ప భక్తితో నన్ను పూజించి చక్కగా స్తుతించిరి.
తైరహం పూజితస్సమ్యకృంస్తుతః పరమర్షిభిః ।
ప్రత్యేయాయ స్వకం ధామ పశ్యతః పరమేష్ఠినః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ఏకాదశస్కంధే
త్రయోదశోఽధ్యాయః ॥
ఆ మహర్షులు నన్ను బాగుగా పూజించి స్తుతించిరి. అప్పుడు నేను బ్రహ్మదేవుడు చూచుచుండగా నా ధామమునకు తిరిగి వచ్చితిని.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో
హంసగీతిని వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది .
Summary of chapter 13 of the Bhāgavata Mahā Purana is as follows:
Uddhava inquired how a practitioner can disentangle his mind from the attractive objects of sense gratification when the senses naturally flow toward material objects. In response, Śrī Kṛshṇa narrated the historical account of His descent as **Haṁsa-avatāra** (the divine swan incarnation). When Lord Brahmā's mental sons, the Sanat-kumāras, asked Brahmā how to sever the connection between the mind and sense objects, Brahmā was unable to answer and meditated upon Bhagavān Vishṇu. Bhagavān manifested before them as a radiant swan and delivered a profound discourse: He explained that both the mind and sense objects are physical manifestations of the three Guṇas, whereas the spirit soul is entirely transcendent. By fixing one's intelligence upon the Supreme Soul, the mind naturally detaches from material objects.