8 - దత్తాత్రేయ గీత - ఏడుగురు గురువుల వర్ణన

బ్రాహ్మణ ఉవాచ

సుఖమైంద్రియకం రాజన్ స్వర్గే నరక ఏవ చ

దేహినాం యద్యథా దుఃఖం తస్మాన్నేచ్చేత తద్బుధః  

దత్తాత్రేయ మహర్షి యదుమహారాజుతో నిట్లనెను --- ఓ రాజా! ప్రాణులకు ఇంద్రియముల వలన కలిగే సుఖము స్వర్గమునందే కాక, నరకము (పశ్వాది జన్మ) నందు కూడ లభించును; దుఃఖము వలె కోరకుండానే లభించును. కావున, వివేకి అట్టి సుఖమును కోరరాదు.

గ్రాసం సుమృష్ణం విరసం మహాంతం స్తోకమేవ వా

యదృచ్ఛయైవాపతితం గ్రసేదాజగరోఽక్రియః  

సాధకుడు ఆహారము విషయములో, తన దగ్గరకు వచ్చిన ప్రాణిని మాత్రమే తినే కొండ చిలువ వలె నుండవలెను. సాధకుడు అనుకోకుండా లభించినదానిని -- అది గొప్ప రుచి గలది కాని, రుచి లేనిది కాని కావచ్చు; సమృద్ధిగా ఉండవచ్చు; చాలీ చాలక పోవచ్చు -- తినవలెను. అంతేగాని, సమృద్ధమైన రుచ్యమైన భోజనము కొరకు ఉద్యమించరాదు.

శయీతాహాని భూరీణి నిరాహారోఽనుపక్రమః

యది నోపనమేద్గ్రాసో మహాఽహిరివ దిష్ట భుక్  

సాధకుడు తనకు ఏది లభించినా అది ప్రారబ్దమేనని స్వీకరించవలెను. తన వద్దకు ఆహారము రానిచో ఆతడు, కొండచిలువవలె, చాలా రోజులైనా ఆహారము లేకుండా, దాని కొరకు ఉద్యమించకుండా మిన్నకుండవలెను.

ఓజస్సహోబలయుతం బిభ్రద్దేహమకర్మకమ్

శయానో వీతనిద్రశ్చ నే హేతేంద్రియవానపి

ఇంద్రియశక్తి, మనశ్శక్తి, శరీరపొటవము ఉన్నా, సాధకుడు వివిధకర్మలను కట్టి పెట్టవలెను; కాని, నిద్ర పోరాదు. ఆత్మనిష్ఠుడై ఉండవలెను. కర్మేంద్రియములున్నా ఆతడు వివిధకర్మలను చేయరాదు.

మునిః ప్రసన్నగంభీరో దుర్విగాహ్యా దురత్యయః

అనంతపారో హ్య క్షోభ్యః స్తిమితోద ఇవార్ణవః

నిశ్చలమైన సముద్రము బయటకు ప్రసన్నముగా, తనలో లోతుగా నుండును. సముద్రమును అతిక్రమించుట గాని, దాని లోతును తెలియుట గాని శక్యము కాదు. సముద్రము దేశకాలముల పరిచ్చేదములకు అతీతమా యన్నట్లుండును. సముద్రమును క్షోభిల్లజేయుటయు సంభవము కాదు. మననశీలుడగు సాధకుడు అట్లు ఉండవలెను (ఉండును). ఆతడు ముఖమునందు ప్రసన్నముగా, హృదయములో గంభీరముగా నుండును. ఆతని మనఃస్థితిని అంచనా వేయుట గాని, మనస్సును కల్లోలపరచుట గాని ఎవరికీ శక్యము కాదు. దేశకాలపరిచ్ఛేదములు లేని ఆత్మ స్వరూప మునందు నిలిచి ఉండే ఆతనిని ఉల్లంఘించుటయు శక్యము కాదు.

సమృద్దకామో హీనో వా నారాయణపరో మునిః

నోత్సర్వేత న శుష్యేత సరిద్బిరివ సాగరః

మననశీలుడైన సాధకునకు నారాయణుడే పరమలక్ష్యము. ఆతడు సముద్రమువంటివాడు. నదులు వచ్చి కలిసినప్పుడు సముద్రము ఉప్పొంగదు; నదులు ఎండిపోయినప్పుడు సముద్రము ఎండిపోదు. అదే విధముగా, సాధకుడు కోరికలు తీరినప్పుడు హర్షద్రేకమును పొందడు; తీరకపోతే దుఃఖించడు.

దృష్ట్వా స్త్రియం దేవమాయాం తద్భావైరజితేంద్రియః

ప్రలోభితః పతత్యంధే తమస్యగ్నౌ పతంగవత్

జితేంద్రియుడు కానివాడు దేవుని మాయయనదగిన యువతి యొక్క హావభావములచే ప్రలోభితుడగును. అట్టివాడు, మిడత నిప్పయందు వలె, అజ్ఞానరూపమైన నరకమునందు పడును.

యోషిద్దిరణ్యాభరణాంబరాదిద్రవ్యేషు మాయారచితేషు మూడః

 ప్రలోభితాత్మా హ్యుపభోగబుద్ధ్యా పతంగవన్నశ్యతి నష్టదృష్టిః

యువతి, బంగారము, ఆభరణములు, వస్త్రములు, రుచ్యమగు ఆహారము మొదలైన వస్తువులు ఈశ్వరుని మాయాశక్తిచే నిర్మించబడినవి. ఇవి భోగ్యములనే బుద్ధితో వాటియందు ప్రలోభముతో కూడిన మనస్సు గల మూర్ఖుడు వివేకబుద్దిని కోల్పోయి, నిప్పుయొక్క ప్రకాశమునందు ఆకర్షణ గల మిడత వలె, నిశ్చయముగా నశించును.

స్తోకం స్తోకం గ్ర సేద్గ్రాసం దేహో వర్తేత యావతా

గృహానహింసన్నాతి ష్ఠద్వృత్తం మాధుకరీం మునిః  

మననశీలుడగు సాధకుడు దేహమును నిలబెట్టుటకు ఎంత సరిపడునో అంత ఆహారమును మాత్రమే కొంచెము కొంచెము తినవలెను. తేనెటీగ పువ్వులకు ఇబ్బంది కలుగకుండా కొంచెము కొంచెము తేనెను సంగ్రహించినట్లుగా, సాధకుడు గృహస్థులను పీడించకుండా ఆహారమును వేర్వేరు గృహములనుండి కొంచెము కొంచెము సంగ్రహించుకొనవలెను.

అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్యః కుశలో నరః

సర్వతస్సారమాదద్యాత్పుష్పేభ్య ఇవ షట్పదః

తుమ్మెద చిన్న- పెద్ద పువ్వులన్నింటినుండి సారభూతమైన తేనెను గ్రహీంచును. అదే విధముగా, నిపుణుడైన మానవుడు సంగ్రహమైన మరియు విపులమైన శాస్త్రములన్నింటినుండి సారమును గ్రహించవలెను.

సాయంతనం శ్వస్తనం వా న సంగృహ్ణిత భిక్షితమ్

పాణిపాత్రాదరామక్రో మక్షి కేవ న సంగ్రహీ  

తేనెటీగ భవిష్యత్తు కొరకు తేనెను సంగ్రహించి భద్రము చేయును. సాధకుడు అట్లు చేయరాదు. సాధకునకు చేయి, ఉదరము మాత్రమే పాత్రలు కావలెను (అంటే, అవి పట్టినంత ఆహారమును మాత్రమే స్వీకరించవలెను). ఈ భోజనము సాయంకాలానికి, ఇది రేపటికి అంటూ భిక్షాన్నమును ప్రోగు చేయరాదు.

సాయంతనం శ్వస్తనం వా న సంగృహ్ణిత భిక్షుకః

మక్షికా ఇవ సంగృహన్ సహ తేన వినశ్యతి

భిక్షాటనము చేసే సన్న్యాసి ఈ భోజనము సాయంకాలానికి, ఇది రేపటికి అంటూ భిక్షాన్నమును ప్రోగు చేయరాదు. తేనెటీగలు వలె ప్రోగు చేయువాడు ఆ ప్రోగు చేసినదానితో సహా వినాశమును పొందును. (తేనె కొరకు జనులు తేనెటీగలను చంపెదరు. అదే విధముగా, సంపదను పోగు చేయువాడు దాని కారణముగా వినాశమును పొందును).

పదాఽపి యువతీం భిక్షుర్న స్పృశేద్దారవీమపి

స్పృశన్ కరీవ బధ్యత కరిణ్యా అంగసంగతః  

సన్న్యాసి యువతియొక్క చెక్క బొమ్మనైననూ కాలితోనైనా స్పృశించ రాదు. ఆడు యేనుగు బొమ్మను చూచి ఆకర్షించబడి మగ యేనుగు బంధించబడును. యువతిని స్పృశించే సన్న్యాసికి అట్లే యగును.

నాధిగచ్ఛేత్ స్త్రీయం ప్రాజ్ఞః కర్హిచిన్మృత్యుమాత్మనః

బలాధి క్రైస్స హన్యేత గజైరన్యైర్గజో యథా

వివేకి యువతి తనకు మృత్యువు అని తెలియవలెనే గాని, ఆమెయందు ఆసక్తిని కలిగి యుండరాదు. ఏనుగును అధికబలము గల ఇతరములైన యేనుగులు హింసించును. యువతి వెంట బడువాడు అదే విధముగా ఇతరపురుషులచే హింసించబడును.

న దేయం నోపభోగ్యం చ లుబైర్యద్దుఃఖసంచితమ్

భుంక్తే తదపి తచ్చాన్యో మధుహేవార్థవిన్మధు

తేనెటీగలు కష్ట పడి ప్రోగు చేసిన తేనెను వాటి మర్మము తెలిసిన ఆటవికుడు అపహరించి అనుభవించును. అదే విధముగా, లోభులు తాము తినకుండా, ఇతరులకు పెట్టకుండా చాల కష్టపడి ధనమును పోగు చేసెదరు. ఆ ధనముయొక్క మర్మము తెలిసినవాడు దానిని అపహరించును. వానినుండి మరియొకడు అపహరించి అనుభవించును.

సుదుఃఖోపార్జి తైర్వితైరాశాసానాం గృహాశిషః

మధు హేవాగ్రతో భుంక్తే యతిర్వై గృహమేధినామ్  

తేనెటీగలు కష్టపడి తేనెను ప్రోగు చేయును. కాని, ఆ తేనెను వాటికంటే ముందు తేనెను పట్టువాడు అనుభవించును. అదే విధముగా, గృహస్థులు ఇంటిలో భోగములను కోరి చాల కష్టపడి సంపదను ప్రోగు చేయుదురు. కాని, వారికంటే ముందు రుచ్యములగు ఆహారము మొదలైన ఆ భోగములను సన్న్యాసి అనుభవించును. (గృహస్థుకు అన్నదానము విధి).

గ్రామ్యగీతం న శృణుయాద్యతిర్వనచరః క్వచిత్

శిక్షేత హరిణాద్బద్ధాన్మృగయోర్గీతమోహితాత్  

ప్రయత్నశీలుడైన సాధకుడు ఏకాంతములో ఆత్మనిష్ఠుడై (వనము) ఉండవలెనే గాని, భోగములకు చెందిన పాటలను వినరాదు. వేటగాడు ఆడు లేడి స్వరముతో మోహ పెట్టి లేడిని బంధించును. ఆ సన్నివేశమునుండి ఈ సందేశమును మనము నేర్చుకొనవలెను.

నృత్యవాదిత్రగీతాని జుషన్ గ్రామ్యాణి యోషితామ్

ఆసాం క్రీడనకో వశ్య ఋష్యశృంగో మృగీసుతః  

ఋష్యశృంగుడు లేడి గర్బమునుండి పుట్టిన మహర్షి. యువతులు చేసే భోగవిషయసంబంధి నాట్యములు, వాద్యములు, పాటలను సేవిస్తూ, ఆయన వారికి ఆటబొమ్మ వలె వశుడయ్యెను.

జిహ్వయాఽతిప్రమాథిన్యా జనో రసవిమోహితః

మృత్యుమృచ్ఛత్యసద్బుద్ధిర్మీతస్తు బడి శైర్యథా

అనిత్యములగు భోగములయందు తగుల్కొన్న బుద్ది గల మానవుని, రుచులను కోరే నాలుక అధికముగా హింస పెట్టి వ్యామోహితుని చేయును. లోహపు కొక్కెమునకు మాంసపు ముక్కను గ్రుచ్చి నీటిలో ఉంచగా, ఆ మాంసమునందలి లోభము చే చేప కొక్కెమునకు తగుల్కొని మరణించును. జిహ్వాచాపల్యము గల వ్యక్తి అటులనే మరణించును.

ఇంద్రియాణి జయంత్యాశు నిరాహారా మనీషిణః

వర్జయిత్వా తు రసనం తన్నిరన్నస్య వర్ధతే

ధీరులు భోజనమును మానివేయుట ద్వారా, జిహ్వేంద్రియమును మినహాయించి, మిగిలిన ఇంద్రియములను జయించెదరు. భోజనమును మానివేసినచో, రసనేంద్రియము మరింత వృద్ధి జెందును.

తావజ్జితేంద్రియో న స్యాద్విజితాన్యేంద్రియః పుమాన్

న జయేద్రసనం యావజ్జీతం సర్వం జితే రసే

మానవుడు రసనేంద్రియమును విడిచి పెట్టి మిగిలిన ఇంద్రియములను జయించినా, జితేంద్రియుడు కానేరడు. రసనేంద్రియమును జయించినప్పుడు మాత్రమే జితేంద్రియుడగును.

పింగలా నామ వేశ్యాఽసీద్విదేహనగరే పురా

తస్యా మే శిక్షితం కించిన్నబోధ నృపనందన  

యదూ! పూర్వము విదేహ (దేహాభిమానము లేని) పురములో పింగళ యని ప్రసిద్ధి జెందిన వేశ్య ఉండెను (ఇప్పుడు వేశ్య కాదు). నేను ఆమె నుండి ఒక విషయము (వైరాగ్యము) ను నేర్చుకొంటిని. దానిని తెలుసుకో.

సా స్వైరిణ్యేకదా కాంతం సం కేత ఉపనేష్యతీ

అభూత్కాలే బహిర్ధ్వారి బిభ్రతీ రూపముత్తమమ్  

యథేచ్చగా తిరిగే ఆ పింగళ గొప్ప రూపసి. ఆమె ఒకనాడు సాయంకాలము ప్రియుని ఏకాంతస్థానమునకు తీసుకువెళ్లగోరి, ఇంటి బయట ద్వారము వద్ద నిలబడెను.

మార్గ ఆగచ్చతో వీక్ష్య పురుషాన్ పురుషర్షభ

తాన్ శుల్కదాన్ విత్తవతః కాంతాన్మేనేకార్థకాముకా  

ఓ పురుషశ్రేష్టా! ఆమెకు ధనమునందు ఆశ మెండు. మార్గమునందు వచ్చే పురుషులను చూచి, వారు తనకు మూల్యమును చెల్లించే ధనవంతులైన ప్రియులనియే ఆమె తలచుచుండెను.

ఆగతేష్వపయాతేషు సా సంకేతోపజీవినీ

అప్యన్యో విత్తవాన్ కోఽపీ మాము పైష్యతి భూరిదః

ఆమె ఏకాంతములో విటులను కలిసి ధనమును సంపాదించును. వచ్చినవారు వెళ్లిపోగా, మరియొకడు ధనవంతుడు ఎవడైనా తన దగ్గరకు వచ్చి అధిక ధనము నీయగలడని ఆమె తలపోసెను.

ఏవం దురాశయా ధ్వస్తనిద్రా ద్వార్యవలంబినీ

నిర్గచ్ఛంతీ ప్రవిశతీ నిశీథం సమపద్యత

ఈ తీరున చెడు తలపులు గల పింగళ నిద్ర చెడగొట్టుకొని, ద్వారము వద్ద వ్రేలాడుతూ, లోపలికి వెళ్లి బైటకు వస్తూ, అర్ధరాత్రి వరకు గడిపెను.

తస్యా విత్తాశయా శుష్యద్వక్తాయా దీన చేతసః

నిర్వేదః పరమో జజ్ఞే చింతా హేతుస్సుఖావహః  

ధనమునందలి ఆశచే ఆమె ముఖము ఎండిపోయి, మనస్సులో దైన్యము నిండెను. అపుడామెకు గొప్ప వైరాగ్యము కలిగెను. వైరాగ్యము మనిషిని ఆత్మవిచారము వైపునకు నడిపి ఆనందమునిచ్చును.

తస్యా నిర్విణ్ణచిత్తాయా గీతం శృణు యథా మమ

నిర్వేద ఆశాపాశానాం పురుషస్య యథా హ్యసిః  

వైరాగ్యముతో నిండిన మనస్సు గల ఆమె ఒక గీతమును గానము చేసెను. దానిని నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పెదను, వినుము. ఎందుకంటే, వైరాగ్యము మనిషి యొక్క కోరికలనే త్రాళ్లకు కత్తివంటిది.

న హ్యంగాజాతనిర్వేదో దేహబంధం జిహాసతి

యథా విజ్ఞానరహితో మనుజో మమతాం నృప  

ఓ మహారాజా! వివేకజ్ఞానము లేని మానవుడు మమకారమును విడువలేడు. అదే విధముగా, వైరాగ్యము లేనివాడు దేహాభిమానమనే సంసారబంధమును విడుచుటకు ఇచ్చగించడు.

పింగలోవాచ

అహో మే మోహవితతిం పశ్యతావిజితాత్మనః

యా కాంతాదసతః కామం కామయే యేన బాలీశా

పింగళ ఇట్లు పలికెను --- అయ్యో! మనోజయము లేని నా మోహముయొక్క విస్తారమును గనుడు. వివేకము లేని నేను అయోగ్యుడగు ప్రియునినుండి భోగమును కోరుచున్నాను.

సంతం సమీపే రమణం రతిప్రదం విత్తప్రదం నిత్యమిమం విహాయ

అకామదం దుఃఖభయాధిశోకమోహప్రదం తుచ్ఛమహం భజేఽజ్ఞా

వినోదమును, ఆనందమును, సంపదలను ఇచ్చే పరమాత్మ హృదయములో దగ్గరగా నున్నాడు. అజ్ఞానురాలనగు నేను అవినాశియగు ఈ పరమాత్మను కాదని, అభీష్టములనిచ్చే శక్తి లేని అయోగ్యుని సేవించుచున్నాను. అయోగ్యుడగు ఈ విటుడు ఇచ్చేవి దుఃఖము, భయము, మనోవ్యాధి, శోకము, వ్యామోహము మాత్రమే.

అహో మయాఽఽత్మా పరితాపితో వృథా

సాం కేత్యవృత్త్యావతివిగర్హ్యవార్తయా

స్రైణాన్నరాద్యాఽర్థతృషోఽనుశోచ్యాత్

క్రీతేన విత్తం రతిమాత్మనేచ్ఛతీ

అయ్యో! పరపురుష సంగమునే బ్రదుకు దెరువుగా చేసుకున్న నా జీవిక సుతరాము ఏవగించుకొనదగినది. దానిచే నా దేహము, మనస్సు వ్యర్థముగా పరితాపమును పొందినవి. స్త్రీలంపటుడు, ధనమునందు తృష్ణ గలవాడు, నిందనీయుడు అగు పురుషుడు నా దేహమును కొనెడివాడు. అట్టి దేహముతో నేను ధనమును, సుఖమును పొందగోరితిని.

యదస్థిభిర్నిర్మితవంశవంశ్యస్థూణం త్వచారోమనఖైః పినద్ధమ్ క్షరన్నవద్వారమగారమేతద్విణ్మూత్రపూర్ణం మదు పైతి కావన్యా

ఈ దేహము ఇల్లు వంటిది. దీనికి దూలములు, వాసములు, స్తంభములు ఎముకలే. చర్మము, రోమములు, గోళ్లు దీని పై కప్పు. మలమూత్రములతో నిండియున్న దీని తొమ్మిది ద్వారములనుండి ద్రవము స్రవించుచుండును. నేను తప్ప మరియొకతె ఎవతే దీనిని సేవించును?

విదేహానాం పురే హ్యస్మిన్నహమే కైవ మూడధీః యాఽన్యమిచ్ఛంత్యసత్యస్మాదాత్మదాత్కామమచ్యుతాత్  

ఈ విదేహ (దేహాభిమానము లేని జ్ఞానుల) నగరములో నా ఒక్కతేయొక్క బుద్ధి మాత్రమే మోహితమై యున్నది. ఎందుకంటే, దుష్టురాలనగు నేను తనను ఇచ్చే ఈ (ఆత్మరూపుడైన) శ్రీహరిని కాదని మరియొక భోగ్యమును కోరుచున్నాను.

సుహృత్ప్రేష్ఠతమో నాథ ఆత్మా చాయం శరీరిణామ్

తం విక్రీయాత్మ నైవాహం రమేఽనేన యథా రమా

ఈ శ్రీహరి దేహధారులకు హితకారి, ప్రియతముడు, రక్షకుడు, ఆత్మ కూడా. నేను నన్ను సమర్పించుకొని ఆయనను స్వంతము చేసుకొని, లక్ష్మీదేవి వలె, ఆయనతో మాత్రమే రమించెదను.

కీయత్ప్రియం తే వ్యభజన్ కామా యే కామదా నరాః

ఆద్యంతవంతో భార్యాయా దేవా వా కాలవిద్రుతాః  

కామములు గాని, వాటిని ఇచ్చే మానవులు గాని, దేవతలు గాని ఒక కాలములో ఆరంభమై ఇంకో కాలములో అంతమగును. వారు తమ తమ భార్యలకు ఎంత ప్రియమును చేసిరి? (విషయసుఖములు అల్పములు).

నూనం మే భగవాన్ ప్రీతో విష్ణుః కేనాపి కర్మణా

నిర్వేదోఽయం దురాశాయా యన్మే జాతస్సుఖావహః  

ఏదో ఒక కర్మచే శ్రీహరి భగవానుడు నిశ్చయముగా నా కొరకు ప్రీతి జెందినాడు. ఎందుకంటే, దుష్టమైన తృష్ణ గల నాకు సుఖమునిచ్చే ఈ విరక్తి కలిగినది.

మైవం సుశర్మందభాగ్యాయాః క్లేశా నిర్వేద హేతవః

యేనానుబంధం నిర్హృత్య పురుషశ్శమమృచ్ఛతి

నేను అల్పమగు భాగ్యము గలదాననైనచో, నాకీ విధముగా విరక్తిని కలిగించే కష్టములు కలిగిడివి కావు (కావున, నేను భాగ్యవతినే). మానవుడు విరక్తిచే ఇల్లు మొదలైన బంధములను వీడి శాంతిని పొందును.

తేనోపకృతమాదాయ శిరసా గ్రామ్యసంగతాః

త్యక్త్వా దురాశాశ్శరణం ప్రజామి తమధీశ్వరమ్  

ఆ సర్వేశ్వరుడు అనుగ్రహించిన వైరాగ్యమును నేను శిరసా స్వీకరించి, విషయభోగములయందు సంలగ్న మైన దురాశలను విడిచి పెట్టుచున్నాను. నేనా ఈశ్వరుని శరణు పొందుచున్నాను.

సంతుష్టా శ్రద్దధత్యేతద్యథాలాభైన జీవతీ

విహరామ్యమునైవాహమాత్మనా రమణేన వై

ఆమె అనుకోకుండా లభించినదానితోనే సంతోషముగా జీవిస్తూ ఈ ఆత్మతత్త్వమునందు శ్రద్ధ కలిగియుండెను. నేను నిశ్చయముగా ఈ ప్రియ మైన ఆత్మయందు మాత్రమే రమించెదను, అని ఆమె నిశ్చయించెను.

సంసారకూపే పతితం విషయైర్ముషి తేక్షణమ్

గ్రస్తం కాలాహినాత్మా నం కోఽన్యస్త్రాతుమధీశ్వరః  

జీవుడు సంసారమనే నూతిలో పడి, కాలమనే కొండచిలువ నోటికి చిక్కినాడు. ఇంద్రియభోగములు వాని వివేకమునపహరించినవి. వానిని రక్షించుటకు (ఈశ్వరుడు తప్ప) మరియొకడు సమర్థుడు ఎవడు గలడు?

ఆత్మైవ హ్యాత్మనో గోప్తా నిర్విద్యేత యదాఽఖిలాత్

అప్రమత్త ఇదం పశ్యేద్గ్రస్తం కాలాహినా జగత్  

ఈ జగత్తు కాలమనే కొండచిలువ నోటికి చిక్కి యున్నదని గుర్తించి, సాధకుడు సావధానుడై సర్వమునుండి విరక్తిని చేందవలెను. అప్పుడాతనికి రక్షకుడు ఆత్మయే (ఆత్మరూపుడగు ఈశ్వరుడే).

బ్రాహ్మణ ఉవాచ

ఏవం వ్యవసితమతీర్దురాశాం కాంతతర్షజామ్

జిత్వోపశమమాస్థాయ శయ్యాముపవివేశ సా

దత్తాత్రేయ మహర్షి ఇట్లు చెప్పెను --- ఆమె మనస్సులో ఈ విధముగా నిశ్చయించుకొని, ప్రియునియందలి అభిలాషనుండీ పుట్టిన దురాశను జయించెను. అపుడామె శాంతముగా శయ్య పై పరుండెను.

ఆశా హి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖమ్

యథా సంఛిద్య కాంతాశాం సుఖం సుష్వాప పింగలా

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ఏకాదశస్కంధే

అష్టమోఽధ్యాయః

తృష్ణయే పెద్ద దుఃఖము. వైరాగ్యము గొప్ప సుఖము. పింగళ ప్రియుడగు విటునియందలి తృష్ణను పూర్తిగా విడిచి పెట్టి సుఖముగా నిద్రించెను.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో  దత్తాత్రేయగీతలో ఏడుగురు గురువులను వర్ణించే  ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).