భాగవత మహా పురాణము
24 - ప్రకృతి పురుష వివేకము
శ్రీభగవానువాచ ।
అథ తే సంప్రవక్ష్యామి సాంఖ్యం పూర్వైర్వినిశ్చితమ్ ।
యద్విజ్ఞాయ పుమాన్ సద్యో జహ్యాద్వైకల్పికభ్రమమ్ ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- భిక్షుగీతము తరువాత నీకు ప్రకృతిపురుషవివేకమును బాగుగా వర్ణించి చెప్పెదను. దీనిని పూర్వజులైన మహర్షులు విశేషముగా నిర్ధారించిరి. దీనిని తెలుసుకొని మానవుడు వెంటనే (శత్రుమిత్రాది) భేదబుద్దిని, దాని వలన కలిగే సంసారభ్రమను తొలగించుకొనును.
ఆసీజ్జ్ఞానమథో హ్యర్థ ఏకమేవావికల్పితమ్ ।
యదా వివేకనిపుణా ఆదౌ కృతయుగేఽయుగే ॥
సృష్టికి ముందు ప్రళయమునందు దృశ్యజగత్తంతయు విజాతీయ సజాతీయ స్వగత భేదములు లేని జ్ఞానఘనమగు పరబ్రహ్మగనే ఉండెను. కృతయుగమునందలి జనులు వివేకనిపుణులై యుండిరి. అప్పుడు, వివేకవంతులకు ఏ కాలములోనైనా, అటులనే స్ఫురించెను.
తన్మాయాఫలరూపేణ కేవలం నిర్వికల్పితమ్ ।
వాజ్మనోఽగోచరం సత్యం ద్విధా సమభవద్బృహత్ ॥
శ్రుతిప్రసిద్ధమైన పరబ్రహ్మ అద్వయము, భేదములు లేనిది. వాక్కునకు, మనస్సునకు గోచరము కాని ఆ పరబ్రహ్మ సదనము (పరమార్థము). అదియే వాక్కునకు మరియు మనస్సునకు గోచరమయ్యే దృశ్యజగత్తు, ద్రష్ఠయగు జీవుడు అనే రెండుగా ప్రకటమయ్యెను.
తయోరేకతరో హ్యర్థః ప్రకృతిస్సోభయాత్మికా ।
జ్ఞానం త్వన్యతమో భావః పురుషస్సోఽభిధీయతే ॥
ఆ రెండింటిలో ఒకటి ప్రకృతి. దానికి కారణము, కార్యము అనే రెండు రూపములు గలవు. రెండవ తత్త్వము ద్రష్ట. దానికే పురుషుడని పేరు.
తమో రజస్సత్త్వమితి ప్రకృతేరభవన్ గుణాః ।
మయా ప్రక్షోభ్యమాణాయాః పురుషానుమతేన చ ॥
జీవుల ప్రారబ్ధకర్మల ప్రేరణచే కాలరూపుడనగు నేను ప్రకృతిసామ్యావస్థలో క్షోభను కలుగజేసితిని. అట్టి ప్రకృతియందు సత్త్వరజస్తమస్సులనే గుణములు ఉండును.
తేభ్యస్సమభవత్సూత్రం మహాన్ సూత్రేణ సంయుతః ।
తతో వికుర్వతో జాతోఽహంకారో యో విమోహనః ॥
ఆ గుణములనుండి సూత్రమనబడే సమష్టి క్రియాశక్తి మహత్ అనబడే సమష్టి విజ్ఞానశక్తితో గూడి (హిరణ్యగర్భతత్త్వము) ప్రకటమయ్యెను. అది వికారము జెంది సమష్టి-అహంకారము పుట్టెను. జీవునకు వ్యామోహము (దేహాద్యభిమానము) ను కలిగించేది అహంకారమే.
వైకారిక స్తైజసశ్చ తామసశ్చేత్యహం త్రివృత్ ।
తన్మాత్రేంద్రియమనసాం కారణం చిదచిన్మయః ॥
అహంకారము సాత్త్వికము, రాజసము, తామసము అని మూడు విధములు. శబ్దాది తన్మాత్రలు, ఇంద్రియములు, మనస్సు, ఇంద్రియానుగ్రాహక దేవతలు దానినుండియే పుట్టెను. అది చైతన్యాభాసను గ్రహించే జడతత్త్వము.
అర్థస్తన్మాత్రికాజ్జజ్ఞే తామసాదింద్రియాణి చ ।
తైజసాద్దేవతా ఆసన్నేకాదశ చ వైకృతాత్ ॥
తామసాహంకారమునుండి పంచ తన్మాత్రలు, వాటినుండి పంచమహాభూతముల రూపములోనున్న దృశ్యజగత్తు పుట్టెను. రాజసాహంకారమునుండి ఇంద్రియములు, సాత్త్వికాహంకారమునుండి పదకొండుగురు ఇంద్రియానుహక దేవతలు పుట్టిరి.
మయా సంచోదితా భావాస్సర్వే సంహత్యకారిణః ।
అండముత్పాదయామాసుర్మమాయతనముత్తమమ్ ॥
ఈ తత్త్వములకు శక్తిని నేను అనుగ్రహించితిని. అవి అన్నీ కలిసి పని చేసి బ్రహ్మాండమును సృష్టించినవి. అది నాకు ఉత్తమమగు క్రీడాస్థానము.
తస్మిన్నహం సమభవమండే సలిలసంస్థి తౌ ।
మమ నాభ్యామభూత్పద్మం విశ్వాఖ్యం తత్ర చాత్మభూః ॥
నీటియందు స్థితి గల ఆ బ్రహ్మాండమునందు నేను నారాయణుడనై ప్రకటమైతిని. నా నాభియందు జగత్కారణమైన పద్మము ప్రకటమయ్యెను. దానియందు స్వయంభువుడగు బ్రహ్మదేవుడు ప్రకటమయ్యెను.
సోఽసృజత్తపసా యుక్తో రజసా మదనుగ్రహాత్ ।
లోకాన్ సపాలాన్ విశ్వాత్మా భూర్భువస్స్వరితి త్రిధా ॥
బ్రహ్మాండరూపుడగు ఆ బ్రహ్మదేవుడు తపస్సు చేసి నా అనుగ్రహమును పొందెను. ఆయన రజోగుణము ద్వారా లోకపాలకులతో సహా, భూమి, అంతరిక్షము, స్వర్గము అనే మూడు లోకములను (మహరాది లోకములను కూడ) సృష్టించెను.
దేవానామోక ఆసీత్స్వర్బూతానాం చ భువః పదమ్ ।
మర్త్యాదీనాం చ భూర్లోకస్సిద్ధానాం త్రితయాత్పరమ్ ॥
దేవతలకు స్వర్గము, భూతగణములకు అంతరిక్షము, మానవులు మొదలైన ప్రాణులకు భూలోకము, సిద్ధులకు ఈ మూడు లోకములకు పైన మహరాదిలోకములు నివాసస్థానములాయెను.
అధోఽసురాణాం నాగానాం భూమేరోకోఽసృజత్ప్రభుః ।
త్రిలోక్యాం గతయస్సర్వాః కర్మణాం త్రిగుణాత్మనామ్ ॥
సర్వసమర్థుడగు బ్రహ్మదేవుడు భూమికి క్రింద అసురులకు, నాగులకు నివాసమును సృష్టించేను. సత్త్వరజస్తమోగుణములచే ప్రవర్తిల్ల జేయబడే సకలకర్మల ఫలములు భూర్భువస్స్వర్లోకములు మూడింటిలోనుండును.
యోగస్య తపసశ్చైవ న్యాసస్య గతయోఽమలాః ।
మహర్జనస్తపస్సత్యం భక్తియోగస్య మద్గతిః ॥
యోగము, తపస్సు, సన్న్యాసము అనువాటికి మహః, జనః, తపః, సత్యమ్ అనే శుద్ధమైన (రాగద్వేషాదులు లేని లోకములు ఫలము. భక్తియోగమునకు నా ధామము ఫలము.
మయా కాలాత్మనా ధాత్రా కర్మయుక్తమిదం జగత్ ।
గుణప్రవాహ ఏతస్మిన్నున్మజ్జతి నిమజ్జతి ॥
కాలరూపుడను, కర్మఫలదాతను అగు నేను ఈ జగత్తును కర్మఫలము లతో కూడునట్లు చేసితిని. సత్త్వరజస్తమోగుణముల ప్రవాహమైన ఈ సంసారమునందు జీవుడు (పుణ్యముచే) స్వర్గాది ఊర్ధ్వలోకములను, (పాపముచే) భూమి మొదలగు క్రింది లోకములను పొందును.
అణుర్బృహత్కృశః స్థూలో యో యో భావః ప్రసిద్ద్యతి ।
సర్వోఽప్యుభయసంయుక్తః ప్రకృత్యా పూరుషేణ చ ॥
చాల చిన్నది గాని, చాల పెద్దది గాని, సన్ననిది గాని, లావుది గాని ఏయే పదార్థము ప్రసిద్దమై యున్నదో, ఆ సర్వము ప్రకృతిపురుషులు రెండింటిచే వ్యాపించబడి యున్నది.
యస్తు యస్యాదిరంతశ్చ స వై మధ్యం చ తస్య సన్ ।
వికారో వ్యవహారార్థో యథా తైజసపార్థివాః ॥
మట్టియొక్క వికారము కుండ. బంగారముయొక్క వికారము నగ. ఆది-అంతములలో మట్టి, బంగారము మాత్రమే ఉన్నాయి (సత్). కుండ, నగ లేవు. కాబట్టి, కుండ-నగ అనుకునే మధ్యావస్థలో కూడ ఉన్నది మట్టి, బంగారము మాత్రమే. కుండ, నగ అనేవి జగద్వ్యవహారమునకు పనికి వచ్చే నామరూపములు మాత్రమే. కార్యము కారణముకంటే భిన్నముగా లేదు. జగత్తు పరమాత్మకంటే భిన్నముగా లేనే లేదు. ఉన్నది ఆత్మయే.
యదుపాదాయ పూర్వస్తు భావో వికురుతేఽపరమ్ ।
ఆదిరంతో యదా యస్య తత్సత్యమభిధీయతే ॥
మట్టి అనే సత్యవస్తువును ఉపాదానముగా చేసుకొని పిండము ఘటమును సృష్టించును. అంటే ఉన్నది మట్టి మాత్రమే. అదే విధముగా, దేనిని ఉపాదానముగా చేసుకొని పూర్వరూపము పరరూపమును సృష్టించునో, ఆ ఉపాదానమే ఉన్న వస్తువు. కార్యము కారణమునుండి పుట్టి కారణములోనే విలీనమగును. కావున, కారణమే యథార్థము (కార్యము మిథ్య) అని మహాత్ములు చెప్పుచున్నారు.
ప్రకృతిర్హ్యస్యోపాదానమాధారః పురుషః పరః ।
సతోఽభివ్యంజకః కాలో బ్రహ్మ తత్ప్రితయం త్వహమ్ ॥
సత్కార్యమగు ఈ జగత్తునకు ఉపాదానము ప్రకృతి, అధిష్ఠానము పురుషోత్తముడు. ఈ జగత్తును ప్రకృతినుండి - కాలము అభివ్యక్తము చేయును. ఆ మూడు (ప్రకృతి, పురుషుడు, కాలము) పరబ్రహ్మనగు నేనే.
సర్గః ప్రవర్తతే తావత్పౌర్వాపర్యేణ నిత్యశః ।
మహాన్ గుణవిసర్గార్థః స్థిత్యంతో యావదీక్షణమ్ ॥
పరమేశ్వరుడు సంకల్పించి స్థితి అంతమయ్యే వరకు ఈ విస్తృతమైన సృష్టి ముందు-వెనుక తరముల రూపములో నిరంతరముగా ప్రవర్తిల్లుచుండును. గుణకార్యములగు వివిధదేహములతో జన్మించే జీవుల భోగమే దీని ప్రయోజనము.
విరాణ్మయాఽఽసాద్యమానో లోకకల్పవికల్పకః ।
పంచత్వాయ విశేషాయ కల్పతే భువనైస్సహ ॥
లోకముల నానాత్వమును తనయందు ప్రకటించే విరాట్ పురుషుని కాలరూపుడనగు నేను ఆవరించెదను. అప్పుడాయన లోకములతో బాటు పంచభూతములుగా విడిపోయి ప్రళయములో లీనమగుటకు అర్హుడగును.
అన్నే ప్రలీయతే మర్త్యమన్నం ధానాసు లీయతే ।
ధానా భూమౌ ప్రలీయంతే భూమీర్గంధే ప్రలీయతే ॥
మరణశీలమగు దేహము ఆహారమునందు, ఆహారము విత్తులయందు, విత్తులు భూమియందు, భూమి గంధతన్మాత్రయందు విలీనమగును.
ఆప్సు ప్రలీయతే గంధ ఆపశ్చ స్వగుణే రసే ।
లీయతే జ్యోతిషి రసో జ్యోతీ రూపే ప్రలీయతే ॥
గంధతన్మాత్ర జలములయందు, జలములు తమ గుణమగు రసము నందు, రసము అగ్నియందు, అగ్ని రూపతన్మాత్రయందు విలీనమగును.
రూపం వాయౌ స చ స్పర్శే లీయతే సోఽపి చాంబరే ।
అంబరం శబ్దతన్మాత్రే ఇంద్రియాణి స్వయోనిషు ॥
రూపతన్మాత్ర వాయువులో, వాయువు స్పర్శతన్మాత్రయందు, స్పర్శ తన్మాత్ర ఆకాశమునందు, ఆకాశము శబ్దతన్మాత్రయందు, ఇంద్రియములు తమ కారణములైన అధిష్ఠానదేవతల (రాజసాహంకారము)లో లీనమగును.
యోనిర్వైకారికే సౌమ్య లీయతే మనసీశ్వరే ।
శబ్ధో భూతాదిమప్యేతి భూతాదిర్మహతి ప్రభుః ॥
ప్రియదర్శనుడవగు ఉద్దవా! కారణదేవతలు తమను నియంత్రించే సమష్టి మనస్సునందు, అది సాత్త్వికాహంకారమునందు, (మిగిలియున్న) శబ్దతన్మాత్ర తామసాహంకారమునందు విలీనమగును. సర్వ (మోహన) సమర్థమగు అహంకారము మహత్తత్త్వమునందు విలీనమగును.
స లీయతే మహాన్ స్వేషు గుణేషు గుణవత్తమః ।
తేఽవ్యక్తే సంప్రలీయంతే తత్కాలే లీయతేఽవ్యయే ॥
సమష్టి క్రియాజ్ఞానశక్తుల సమాహారమైన ఆ మహత్తత్త్వము తనకు కారణమైన సత్త్వాది గుణములయందు, ఆ గుణములు ప్రకృతి (సొమ్యా వస్థ) యందు, ఆ ప్రకృతి అవినాశియగు కాలమునందు విలీనమగును.
కాలో మాయామయే జీవే జీవ ఆత్మని మయ్యజే ।
ఆత్మా కేవల ఆత్మస్థో వికల్పాపాయలక్షణః ॥
కాలము మాయను ప్రవర్తిల్ల జేసే ప్రాణస్వరూపుడగు (సగుణ) ఈశ్వరునియందు, ఈశ్వరుడు పుట్టుక లేని పరమాత్మనగు నాయందు లీనమగును. పరమాత్మ అద్వయము, తనయందే ఉండునది (లీనము కానిది). పరమాత్మను ఉత్పత్తిప్రళయములకు అధిష్ఠానము (అవధి) గా మాత్రమే తెలియదగును. సాక్షాత్తుగా పరమాత్మ తెలియబడదు.
ఏవమన్వీక్షమాణస్య కథం వైకల్పికో భ్రమః ।
మనసో హృది తిష్ఠేత వ్యోమ్నీవార్కోదయే తమః ॥
ఈ విధముగా అనుసంధానము చేయువాని మనస్సులో భేదము నిమిత్తముగా గల (అహం-మమకారముల) భ్రమ -- సూర్యోదయమైన తరువాత ఆకసమునందు చీకటి వలె -- ఎట్లు నిలిచియుండును?(నిలిచియుండదు).
ఏష సాంఖ్యవిధిః ప్రోక్తస్సంశయగ్రంథిభేదనః ।
ప్రతిలోమానులోమాభ్యాం పరావరదృశా మయా ॥
ఇతి శ్రీమద్భాగవతమహాపురాణే ఏకాదశస్కంధే చతుర్వింశోఽధ్యాయః॥
కార్యకారణముల తత్త్వమునెరింగిన (సర్వజ్ఞుడనగు) నేనీ విధముగా ఉత్పత్తి ప్రళయక్రమముల ద్వారా ఆత్మానాత్మవివేకప్రకారమును చెప్పితిని. దీని వలన సంశయములనే ముడులు విడిపోవును.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో ప్రకృతిపురుష వివేకమును వర్ణించే
ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది (24).
Summary of chapter 24 of the Bhāgavata Mahā Purana is as follows:
Śrī Kṛshṇa provided a detailed exposition of the cycle of cosmic creation and dissolution (*Pralaya*). He described how, at the dawn of creation, the Supreme Being disturbs the equilibrium of the three Guṇas within unmanifest Prakṛti, initiating the evolution of the material universe. Conversely, during cosmic dissolution, the physical elements collapse into their subtle causes in reverse order: earth dissolves into water, water into fire, fire into air, air into ether, ether into the senses, senses into false ego, and false ego into the unmanifest Prakṛti, which merges back into the Supreme Being. Understanding the impermanence of the material creation enables the seeker to cultivate absolute detachment.