131. సప్తమీ కల్పమున దారుపరీక్షా వర్ణనము

నారద ఉవాచ 

మూ ॥ అథతే సంప్రపక్ష్యామి ప్రతిమా విధి విస్తరమ్ సర్వేషామేవ దేవానామాదిత్యస్య విశేషతః

అర్చా సప్తవిధా ప్రోక్తా భక్తానాం శుభ వృద్ధయే కాంచనీ రాజతీ తామ్రీ పార్థివీ శైలజా స్మృతా

వారీ చాలేఖ్యకాచేతి మూర్తిస్థానాని సప్తవై వారీ విధానం తే వీర! వర్ణయిష్యామ్యశేషతః

కర్త్రనుకూలే దివసే సంవత్సర విశోధితే శుభైర్నిమిత్తైః శకునైః ప్రస్థానైశ్చ వనం విశేత్

క్షీరిణో వర్జితాః సర్వే దుర్బలా స్తే స్వభావతః చతుష్పథేషు నగ్రాహ్యా యేచ పుత్రక వృక్షకాః

 దేవతాయతనస్థాయే తథా వల్మీక సంభవాః ఉత్కీర్ణా దేవతా యేషు చైత్యవృక్షాశ్చయేస్మృతాః

శ్మశాన భూమిజా యేచ పక్షిణాం నిలయాశ్చయే సకోటరాశ్చయే వృక్షాః శుష్కాగ్రా యేచపాదపాః

శాస్త్రేణ నిహితా యేచ కుంజరాశాస్తథాకృతాః సామాద్యాః సరుజోఽధశ్చ వ్యాధినశ్చ తథైవచ

అకాలే పుష్పితా యేచకాలే తేచ వివర్జితాః శీర్ణ పర్ణాశ్చ తరవో రక్షధ్వాంక్ష నిషేవితాః ఏకశాఖా తీశాఖాశ్చ త్రిశాఖాశ్చ తథాధమాః

 మధూకో దేవదారుశ్చ వృక్షరాజశ్చ చందనః బిల్వశ్చామ్రాతకశ్చైవ ఖదిరోధాంజనస్తథా

నింబః శ్రీపర్ణ వృక్షశ్చ పనసః సరలోర్జునః రక్తచందన పర్యంతాః శ్రేష్టాఃస్యుః ప్రతిమాద్రుమాః

తా॥ నారద మహర్షి యిట్లు చెప్పఁదొడఁగెను. “సాంబా! ఇక సర్వదేవతల యొక్క, ముఖ్యముగా సూర్యదేవుని యొక్క ప్రతిమా విధిని గూర్చి నీకు విశదముగాఁజెప్పెదను-1. భక్తులకు శుభములను సంపాదించునట్టి ప్రతిమలేడు విధములు చెప్పబడినది. బంగారము, వెండి, రాగి, మట్టి,అయి-2. కట్టితో చేయబడినవి; చిత్తరువు రూపమున వ్రాయబడినదియు నని దేవతామూర్తులేడు విధములు. దొరువుతో నిర్మింపబడువానిని గూర్చి నీకు సాకల్యముగ వర్ణించి చెప్పెదను-3. సంవత్సర, మాస, పక్ష, తిథి, వారాదులు చక్కగ శోధించుకొని, శాస్త్రవిహితములైన శుభనిమిత్తములతో, శకునములతో నరణ్యమునకుఁబోవలెను-4. పాలుగారేడు చెట్లు స్వాభావికముగ బలహీనమైనవిగావున వానిని వదలి పెట్టవలెను. నాలుగున్రోవలు కలియుచోటనున్నవానిని, బాల వృక్షములను-5. దేవాలయముల సమీపముననున్నవానిని, పుట్టలలో పుట్టిన వానిని, దేవతలుండుచెట్లను, గుడులలో, బౌద్ధాలయములలో, ఉద్యానవనములలో నున్నవానిని-6. శ్మశాన ప్రదేశములందు పెరిగిన వానిని, పక్షులు గూళ్ళుకట్టుకొని యున్నవానిని, తొఱ్ఱలు గలవానిని, ఎండిన అగ్రములు గలవానిని-7. శస్త్ర వాయ్వగ్ని విద్యుద్దూషితములైనవానిని, ఏనుగులు మున్నగువానిచే భ్రష్టము చేయబడిన వానిని, రోగముగలవానిని, (చీడ మొదలగునవి పట్టినవానిని), తెగులుసోకిన వానిని-8. ప్రతిమా నిర్మాణమున కయోగ్యములుగావున వానిని వదిలివేయవలెను. అకాలమునందు పుష్పించువానిని, కాలమునందు వదలివేయవలెను. సన్నగిలిపోయిన ఆకులు గల చెట్లు, రాక్షసులు, కాకులు, కొంగలు నివసించు చెట్లు, ఒకేకొమ్మగలవి, మూడు కొమ్మలుగలవి, మిక్కిలి యెక్కువ కొమ్మలుగలవి, అధమజాతికి చెందినవియునైన వృక్షములు విడువదగినవి-9. ఇప్ప, దేవదారు, వృక్షరాజమగు చందనము, బిల్వవృక్షము, అంబాళము, చండ్ర, అంజన-10. వేప, టేకు, పనస, తెల్లతెగడ, ఏఱుమద్ది, రక్తచందనము-ఇవి ప్రతిమలు చేయుటకు శ్రేష్ఠమగు వృక్షములు.

 మూII వర్ణానామాను పూర్వ్యేణ ద్వౌద్వౌవృక్షౌ ప్రకీర్తితో నింబాద్యాః సర్వవర్ణానాం వృక్షాః సాధారణాః స్మృతాః

కథ్యమానాన్విశేషణ శృణువీర! తథాపరాన్ సురదారుః శమీచైవ మధూకశ్చందన స్తథా ఏతేవై తరవస్తాత! బ్రాహ్మణానాం శుభాః స్మృతాః

క్షత్రస్యచ తథారిష్టః ఖదిరస్తిందుకస్తధా అశ్వత్థశ్చ తధాసాంబ! ద్రుమః కరకతః శుభః

వైశ్యానాం తద్వదేవ స్యుః ఖదిరశ్చందన స్తథా పుణ్యాశ్చ తరవశ్చైతే శుభదాస్తు తథైవచ

కేసరః సర్జక శ్చామ్రః శాల వృక్ష స్తథేతరః ఏతేవై తరవః పుణ్యాఃశూద్రాణాం శుభదాయకాః

లింగంచ ప్రతిమాం చైవ మవస్థాప్య యధావిధి వృక్షం చాభిమతం గత్వా పూజయేద్బలి పుష్పకైః

శుచౌదేశే వివిక్తీచ కేశాంగార వివర్జతే ప్రాగుద క్సూచకే దేశే లోకకష్టవివర్జితే

విస్తీర్ణ స్కంధ విటపః పత్రవానృజు వృద్ధిగః ఆతంక హీనో వివశః సత్త్వక్ఫర్ణః శుభస్తథా

స్వేనైవ పతితాయేచ హస్తిభిః పతితాస్తథా శుష్కాశ్చ వహ్ని దగ్దాశ్చ పక్షిభిశ్చాపి వర్జితాః

తరవో వర్జనీయాశ్చ గ్రహీతవ్యాః శుభాద్రుమాః స్నిగ్ధరూపొః సపర్ణాశ్చ సపుష్పాః సఫలాస్తథా

తా॥ బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారిలో నొక్కొక్క వర్ణమువారికి క్రమమున రెండేసి చొప్పున పైన సూచింపబడిన మధూకాది వృక్షములు నిర్దేశింపబడినవి. తక్కిన నింబాది వృక్షములు సర్వవర్ణ సాధారణములుగ పేర్కొనబడినవి-12. సాంబా! నేను ముందు చెప్పబోవు తత్తద్వర్ణోద్దిష్టములగు వృక్షములను గూర్చి వినుము. దేవదారు, జమ్మి ఇప్ప, చందన వృక్షములు బ్రాహ్మణులకు శుభప్రదములు-13. క్షత్రియులకు చండ్ర,తుమ్మికి,రావి కరకత వృక్షములు శుభదాయకములు-14. వైశ్యులకు చండ్ర, చందన వృక్షములు శ్రేష్ఠములైనవి. పుణ్యప్రదములైనవి-15. నాగకేసరము, వేఁగిన, మామిడి, మద్ది యనునీ చెట్లు శుభకరములు. పుణ్యప్రదములు-16. అభిమతమగు వృక్షము కడకుఁబోయి దానిని యథావిధి పుష్పాదులతో పూజించి, గ్రాహ్యవృక్షముగ దానిని గుర్తించుటకై ప్రతిమా చిహ్నమును లిఖింపవలేను-17. కేశములు, అంగారములు(బొగ్గులు) మున్నగు కాలుష్యము లేని పవిత్రము, ఏకాంతమునైన ప్రదేశమున, ప్రాణులకు కష్టము కలిగింపని రీతిగనున్న, తూర్పు, లేక ఉత్తరదిక్కుగనున్న స్థలమునందు-18. పెరిగిన చెట్టునెన్నవలెను. అది చక్కగ చిగురించి, విస్తీర్ణమైన శాఖలుగలదియై, పుష్కలమైన యాకులు గలిగి నిటారుగఁబెరుగుచున్నదై, ప్రణాది రహితమై, మిక్కిలి పుష్టిగనేదిగి, యారోగ్యవంతమైన త్వక్కు, పర్ణములు గలిగి నిగనిగలాడుచుండవలెను-19. తమకుతాము పతనమైనవిగాని, ఏనుగులు మున్నగువానిచే పడగొట్టబడినవిగాని, ఎండిపోయినవిగాని, అగ్నిచే కాల్పబడినవిగాని, పక్షులచే ఏడువబడినవిగాని-20. ప్రతిమా నిర్మాణమునకు నిరుపయోగములుగావున నట్టి చెట్లను వదలి పెట్టవలెను. శుభప్రదములు, ఆకులు కొమ్మలతో నిగనిగలాడుచు, ఫల పుష్పాదులతో కళకళలాడు చెట్లను మాత్రమే గ్రహింపవలేను.

 మూ॥ తేషాంతు గ్రహణం చాష్ట మాసేషు కార్తికాదిషు భూత్వా శుభదినే చైవ సోపవాసోధి వాసయేత్

సమంతాదుపలిప్యాధ తస్యాధస్తాద్వసుంధరామ్ గాయత్ర్యాపరిపూతేన పరితః ప్రోక్ష్యవారిణా

 శుక్లేచ పరిధూతేచ పరిధాయ చ వాససీ పూజయేధ్గంధ మాల్యైశ్చ సధూప బలి కర్మభిః

తతః కుశైః పరిస్తీర్ణే హుత్వాగ్నౌ తస్యచాంతికే దేవదారు సమిద్భిశ్చ మంత్రేణానేన తత్త్వ విత్

 ఓం భూర్భువః సువరి'తి తతోవృక్షం చపూజయేత్ “ఓం ప్రజాపతయే సత్యసదాయ నిత్యం శ్రేష్టాంతరాత్మన

చరాచరాత్మన్ సాన్నిధ్యమస్మిన్కురు దేవ వృక్షే సూర్యావృతం మండల మావిశేశ్చ నమః

నారద ఉవాచ :

ఏవం సంపూజయిత్వాతు వాక్యైస్తం పరిసాంత్వయన్ వృక్ష!లోకస్య శాంత్యర్థం గచ్ఛదేవాలయం శుభమ్

 దేవ! త్వం స్థాస్యసే తత్రచ్ఛేద దాహ వివర్జితః కాలేధూప ప్రదానేన సుపుష్పైర్బలి కర్మభిః

లోకాస్త్వాం పూజయిష్యంతి తతోయాస్యసి నిర్వృతిమ్ వృక్షమూలేకుఠారంతు ధూపమాల్యైః ప్రపూజ్యచ

 పూర్వతస్తు శిరః కృత్వా స్థాపనీయః ప్రయత్నతః

తా॥ కార్తీకము మొదలుకొని యెనిమిది మాసములలో నేదేని యొక శుభదినమున నుపవాస దీక్షతోనుండి, పుష్పధూప సుగంధ ద్రవ్యాదులతో నధివాసనము నిర్వర్తించి వానిని గ్రహింపవలెను-22. ఎన్నిక చేసిన చెట్టు క్రింద చుట్టును నేలనరికి శుభ్రముచేసి గాయత్రీ మంత్రముతో నభిమంత్రించిన జలమునంతటయు ప్రోక్షణ చేయవలెను-23. తెల్లని పరిశుద్ద వస్త్రములు ధరించి గంధ పుష్పధూప దీపనైవేద్యములతో వృక్షమును పూజింపవలేను-24. అటు పిమ్మట సమీపముననే దర్భలు పఱచి, దేవదారు సమిధలతో నీక్రింది మంత్రముతో హవనము చేయవలెను. ఆపై 'ఓం భూర్భువస్సువః' అని వృక్షమును పూజింపవలెను. “ఓ ప్రజాపతీ! సత్యస్వరూపా! వృక్షస్వరూపా! వృక్షరాజమా నీకు నమస్కారము. శ్రేష్టాంతరాత్మా! సచరాచరాత్మా! దేవా! ఈ వృక్షమున నీవు సాన్నిధ్యము చేయుము (ఆవహింపుము) సూర్యవృతమండల మిందు ప్రవేశించునుగాక. నమస్కారము”.-26. ఇట్లు పూజించి వృక్షముననునయించుచు నిట్లు చెప్పవలెను. “వృక్షరాజమా! లోక కల్యాణము అక్క నీవు మంగళకరమైన దేవాలయమునకు వెడలిపొమ్ము!-27. దేవా! అచట నీవు ఛేదన తాపాదులు లేకుండ సుఖముగ నుందువు. ఆయా సమయములందు లోకములు నిన్ను గంథపుష్పధూపాదులతో, నైవేద్యములతో పూజింపుచుండగలవు-28. దానం జేసి నీవానందముగ నుండగలవు. ఇట్లు వృక్షము ననునయంచి వృక్ష మూలమున గంథపుష్పధూపాదులతో గొడ్డలిని పూజించి, దాని శిరస్సు తూర్పుదెసగా నుండునట్లు జాగ్రత్తగా నిలిపీ యుంచవలెను.

మూ॥ పరమాన్న మోదకౌదన పల పూపీకాదిభిర్భక్షైః

మద్యైః కుసుమైర్ధూ పైర్గంధైశ్చ తరుం సమభ్యర్చ్య సురపితృపిశాచ రాక్షస భుజంగ సురగణ వినాయకార్యానామ్

కృత్వాపూజాం రాత్రౌ వృక్షం సంస్పృశ్య చ బ్రూయాత్

అర్చాసు దేవదేవత్వం దేవైశ్చ పరికల్పితః నమస్తే వృక్ష! పూజేయం విధివత్పరి గృహ్యతామ్

యానీహభూతాని వసంతి తాని బలిం గృహీత్వా విధివత్ర్పయుక్తమ్

అన్యత్రవాసం పరికల్పయంతు క్షమంతుతే చాద్య నమోఽస్తు తేభ్యః

ప్రభాతాయాంతు శర్వర్యాం పునః సంపూజ్యతం నగమ్ బ్రాహ్మణేభ్యస్తతో దత్వా భోజకేభ్యశ్చ దక్షిణామ్ ఛింద్యాద్వనస్పతీంస్త జ్ఞైస్తైః కృతస్వస్తి వాచనైః

 పూర్వస్యాం దిశి పాతోఽస్య ఐశాన్యాం చాపి యోభవేత్ అథవా ఉత్తరస్యాంతు తథాఛింద్యాత్తు నాన్యథా

 ఐంద్ర్యై శాన్యోరుదీచ్యాంచ పాతస్తిసృషు శస్యతే నైరృత్యాగ్నేయ యామ్యాసు దిక్షుపోతో నశోభనః  వాయువ్యాంచైవ వారుణ్యాం తస్యపాతస్తు మధ్యమ:

 యస్య బాహ్యస్థితా శాఖా దీక్షు నష్టాచతుసృషు వాస్తు పూర్వం తతః స్థిత్వా తతః పశ్చాదవస్థితా

 అవీలగ్నమశబ్దంతు పతనం తు ప్రశస్యతే ఉత్పత్యేద్ద్విదలం యస్యద్రావశ్చ మధురోభవేత్

సర్పి స్తైలం క్షరేద్యస్య పాదపం తం వివర్జయేత్ శుభదం యదుశార్దూల! శృణుత్వం కథయే శుచి

వృక్షం ప్రభాతే సలిలైర్నిషిక్తం పూర్వోత్తరస్యాం దిశి సన్నికృత్య

మధ్వాజ్యదిగ్ధేన కుఠారకేణ ప్రదక్షిణం శోష మభిప్రహణ్యాత్

పూర్వోత్తరేఽప్యుత్తర దిగ్విభాగే పాతోయదా వృద్ధికరక్తదాస్యాత్

ఆగ్నేయకోణ క్రమశోగ్నిదాహ ఉద్రోగ్రరోగాః సుధనక్షయశ్చ

గారుడే దిశి పాషాణం కపోతో గృహగోధికా సిత వర్ణం జలంజ్ఞేయం మంగుష్ఠాభం భవేత్కృమి:

 దోషైరేతైర్వినిర్ముక్తం ముదాకాలం సముద్ధరేత్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి సప్తమీకల్పే దారు పరీక్షా వర్ణనం

నామైక త్రింశదుత్తర శతతమోఽధ్యాయః

తా॥ పాయసము, లడ్డువములు, చిత్రాన్నములు, మాంసములు, పిండివంటలు, భక్ష్యములు-30. మద్యములు, గంధ పుష్పధూపములు మున్నగువానిచే చెట్టును పూజించి, దేవతలను, పితృదేవతలను, పిశాచములను, రాక్షసులను, సర్పములను, సురగణ వినాయకాదులను-31. పూజించి రాత్రివేళ వృక్షమును స్పృశించి దానితో నిట్లు చెప్పవలేను-32. “వృక్షరాజమా! నీవు దేవతలచే ప్రతిమల కొఱకు కల్పింబడియున్నావు. నీకు నమస్కారము. విధి విధానముగ మాచే నొనర్పబడు పూజను స్వీకరింపుము-33. విధి పూర్వకమైన యీ బలిని స్వీకరించి యిచట నివసించు ప్రాణులన్నియు మఱియొకచోటికి తమతమ నివాసములను మార్చుకొను గాక అవి మమ్ముక్షమించును గాక! వానికి నమస్కారము.”-34. తెలతెలవారుచుండగ చెట్టును మయొకసారి పూజించి, బ్రాహ్మణులకు, భోజకులకు దక్షిణనిచ్చి, పండితులచే స్వస్తి వాచనములను చెప్పించి, అప్పుడు ఆ వృక్షమును ఛేదింపవలెను-35 తూర్పునకు గాని, ఈశాన్యమునకు గాని, లేక ఉత్తర దిక్కునకు గాని యది పడిపోవునట్లు కొట్టవలెను కాని యన్యథా చేయరాదు-36. ఈ మూడు దిక్కులలో నేదేని యొక్క దిక్కునకు పడుటయే శ్రేష్ఠము. నైరృతికిగాని, ఆగ్నేయమునకుగాని, దక్షిణమునకు గాని చెట్టుపడుట శుభముకాదు. వాయువ్యమునకు పశ్చిమమునకు పడుట మధ్యమము-37. నలువైపుల బయటకు విస్తరించియున్న కొమ్మలన్నియు నజీకివేసి వానిని వెనుక భాగముననుంచి, అటుపిమ్మట వాస్తుననుసరించి నిలబడి వృక్షమును ఛేదింపవలెను-38. చేట్టు దేనీ నంటక నిశ్శబ్దముగా పడిపోవుట ప్రశస్తము. పడిన పిదప విఱిగినను, దానినుండి మధుర ద్రవముగానీ-39 నేయిగాని, నూనెగాని స్రవించుచుండినయెడల నట్టి వృక్షమును విసర్జింపవలెను. సాంబా! ఎట్లు ఛేదించిన శుభప్రదమో చెప్పుచున్నాను. వినుము-40. ఉదయకాలమున చెట్టును నీటితో తడిపి, పూర్వోత్తర దిక్కుగ సమీపించి, తేనె, నేయియుఁబూసిన గొడ్డలితో ప్రదక్షిణ క్రమమున చుట్టును కొట్టుచుఁబోవలెను-41. తూర్పునకుగానీ, ఈ శాన్యమునకు గానీ ఉత్తరమునకు గాని చెట్లు పడుట అభివృద్ధిని కలిగించును. ఆగ్నేయ కోణాదిగ పడినచో క్రమముగ నగ్ని ప్రమాదములు, మిక్కిలి భయంకరమగురోగములు, ధననాశము కలుగును-42. ఆగ్నేయ దిశయందు పడినచో యజమాని మఱుజన్మలో శిలయగును. దక్షిణమునకు పడినచో పావురమై పుట్టును. నైరృతి దిక్కున పతనమయ్యెనేని బల్లిగ జన్మించును. పశ్చిమమున పడేనేని (హిమశిల) తెల్లనీరగును.వాయువ్యమునకుఁగూలినచో బొట్టనవ్రేలు వంటి కీటకమగును. ఇట్టి దోషములెవ్వియును కలుగకుండ మంచి ముహూర్తమున చెట్టును నతికి కాష్ఠసంగ్రహణము చేయవలెను.

శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు దొరు పరీక్షా వర్ణనమను నూట పదునైదవ అధ్యాయము సమాప్తము.