భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

87. ఆదిత్య వార కల్పమునందు జయంత విధి వర్ణనము

బ్రహ్మోవాచ :-

మూll జయంతో హ్యుత్తరే జ్ఞేయశ్చాయనే గణనాయక! వారే దేవస్య యః స్యాద్వై తత్రపూజ్యో దివాకరః

పూజితస్తత్ర దేవేశః సహస్ర గుణితం ఫలమ్ దదాతి దేవ శార్దూల! స్నానదానాది కర్మణామ్

ఘృతేన పయసాయత్ర స్నానమిక్షుర సేనతు విలేపనం కుంకుమంతు ప్రశస్తం భాస్కరప్రియమ్

 ధూప క్రీయా గుగ్గులేన నైవేద్యే మోదకః స్మృతః ఇత్తం సంపూజ్య దేవేశం కుర్యాథోమం తతస్తిలైః బ్రాహ్మణాన్ఫోజయే త్పశ్చాన్మోద కాంస్తిల శష్కులీ:

 ఇత్థం యః పూజయేద్భానుం మంత్రేణేవ గణాధిప! సహస్ర గుణితం తస్య ఫలం దేవో దదాతివై

స్నానదాన జపాదీనా ముపవాసస్య వై విభో!

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మే పర్వణ్యాదిత్య కల్పే జయంత. విధివర్ణనం నామ సప్తాశీతి తమోఽధ్యాయః

తా దక్షిణాయనమునందలి ఆదిత్యవారము జయవారము ఉత్తరాయణమునందలి ఆదిత్యవారము జయంతవారమని యెఱుంగవలెను. ఆదినమున సూర్యదేవుని పూజింపవలెను. అటులపూజించిన వేయిరెట్లు ఫలము కలుగును. ఆనాడాచరింపబడు స్నానదానాదీకర్మలకు సూర్యభగవానుడట్టి ఫలమిచ్చును. నేతితోను, పాలతోను, చెఱకు రసముతోడను దేవదేవునకు స్నానము చేయింపవలెను. కుంకుమ విలేపనము ప్రశస్తమైనది. సూర్యునకు ప్రియమైనది. ధూపమునకు గుగ్గులు, నైవేద్యమునకు లడువములునుపయోగింపవలేనని చెప్పబడినది. ఇట్లు పూజించిన పిదప నువ్వులతో హోమము చేయవలెను. హోమానంతరము, లడ్డువములు, నువ్వులతో చేయబడు చక్కిలములతో బ్రాహ్మణ భోజనము సాగింపవలెను. ఇట్లు సమంత్రకముగ సూర్యారాధన చేయువానికి ఆ దేవదేవుడు వేయిరెట్లు ఫలమునిచ్చును. ఆ దినమున చేయబడు స్నానదానజపాదులు, ఉపవాస దీక్ష మున్నగువానికి ప్రీతుడై సూర్యదేవుడట్టి ఫలితము నొసంగును

శ్రీ భవిష్య మహాపురాణము నందలి బ్రహ్మపర్వమున, ఆదిత్యవార కల్పమునందు జయంత విధి వర్ణనమను ఎనుబది యేడవ అధ్యాయము సమాప్తము.