భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

59. సప్తమి కల్పమున రథసప్తమి మాహోత్మ్య వర్ణనము

 బ్రహ్మోవాచ :

మూ మాఘే మాసి తథాదేవ! సితే పక్షే జితేంద్రియః షష్ఠ్యాముపోషితో భూత్వా గంధపుష్పోప హారత:

పూజయిత్వాదినకరం రాత్రౌ తస్యాగ్రతః స్వపేత్ విబుద్ధస్త్వధ సప్తమ్యాం భక్త్యా భానుం సమర్చయేత్

బ్రాహ్మణాన్ఫోజయేత్పశ్చాద్విత్త శాఠ్యం వివర్జయేత్ ఖండవే ష్టైర్మోదకైశ్చ తథేక్షు గుడ పూపకై:

 అధ సంవత్సరే పూర్ణ సప్తమ్యాం కారయేద్బుధః దేవ దేవస్య వైయాత్రాం పూర్వోక్త విధినా హర!

 కృష్ణ పక్షేతు యః కృత్వా రథమారోహితం రవిమ్ పశ్యేద్భక్త్యా జగన్నాథం సయాతి పరమాం గతిమ్

తృతీయాయా మేక భుక్తం చతుర్థ్యాం నక్త ముచ్యతే పంచమ్యామయాచితం స్యాత్షష్ట్యాం చైవముపోషణమ్

సప్తమ్యాం పారణం కుర్యాద్దృష్ట్వాదేవం రథేస్థితమ్ పూజయిత్వాచ విధినా శక్త్యా భక్త్యా త్రిలోచన!

 సౌవర్ణంతు రథం కృత్వా తామ్రపాత్రోపరి స్థితమ్ రథ మధ్యేన్యసేద్వ్యోమ! పూజితం మణిభిర్హర !

 పద్మరాగం న్య సేన్మధ్యే మౌక్తికం పూర్వతోన్యసేత్ ఇంద్రనీల మథోయామ్యాం వారుణ్యాం మరకతం హర!

 ప్రవాలముత్తరే రుద్ర! సవజ్రం విన్య సేద్బుధః శ్వేతం పీతాసితం చాపి రక్తంచాంధక సూదన !

 ఏతాని తాత వస్త్రాణి దిక్షుసర్వాసు విన్య సేత్ పతాకా కార సంస్థానం ఘంటాభరణ భూషితమ్

పుష్పైర్దామైరలంకృత్య రథం రుద్ర! సమంతతః యథాన్యాయం పూజయిత్వా భాస్కరాయ నివేదయేత్

తా బ్రహ్మదేవుడిట్లనెను. “మాఘమాస శుక్లపక్ష షష్ఠినాడు జితేంద్రియుడై ఉపవాసముండి గంథ పుష్పనైవేద్యములతో. సూర్యదేవుని పూజించి, రాత్రి సమయమున ఆ దేవుని సన్నిధిలో పరుండవలెను. సప్తమినాడు మేలుకొని భక్తితో భానుదేవుని పూజింపవలెను. పిదప విత్తశాత్యమును విడిచి ఉదారముగ బ్రాహ్మణ భోజన సంతర్పణ చేయవలెను. శర్కరతో చేయబడిన లడ్డువములు, చెఱుకు బెల్లముతో చేయబడిన భక్ష్యవిశేషములతో భోజనములు పెట్టవలెను. ఇట్లు సంవత్సరము గడచిన పిమ్మట పూర్వోక్త విధానముగ సూర్యభగవానుని రథయాత్ర నిర్వహింపవలెను. కృష్ణపక్షము నందీ యాత్ర నిర్వహించి జగన్నాథుడైన సూర్యభగవానుని రథము పైనున్నవానిని దర్శించువాడు పరమపదమును పొందును. తృతీయ నాడు ఒక పూట భోజనము, చతుర్థినాడు రాత్రి భోజనము, పంచమినాడు అయాచిత భోజనము చేసి షష్ఠినాడు ఉపవాసము చేయవలెను. సప్తమినాడు రథస్థితుడైన సూర్యదేవుని దర్శించి ఉపవాస దీక్షను విరమింపవలెను. పారణకు ముందు శక్తికొలదిగ, భక్తియుక్తుడై దేవ దేవుని పూజింపవలెను. బంగారు రథమును సిద్దము చేసి, దానిని ఒక రాగి పాత్ర పైనునిచి రథ మధ్యమున మణులతో గూడ సూర్య ప్రతిమను నిలుపవలెను. రథ మధ్య భాగమున పద్మరాగము, తూర్పున ముత్యము, దక్షిణమున నింద్రనీలము, పశ్చిమమున మరకతము. ఉత్తరమున ప్రవాళము (పగడము) వజ్రముతో గూడనుంచవలెను. తెలుపు, పసుపు, నలుపు, ఎఱుపు వన్నెగల. వస్త్రములను అన్ని దిక్కులలోను అలంకరింపవలెను. పతాకము వంటి యాకారాముతో శోభించుచు, గంటలు ఆభరణములు మున్నగు వానితో నలంకరింపబడిన. రథమంతటను పుష్పమాలికలచేనందముగకైసేసి, యధావిధిగ పూజించి సూర్యునకు నివేదింపవలెను.

మూ భోజయిత్వాథ వా విప్రానాచార్యాయ నివేదయేత్ యోఽ ధీతే సప్తమీ కల్పం సోపాఖ్యానంచ భారత!

ఆచార్యః స ద్విజోజ్ఞేయో వర్ణానామను పూర్వశః సౌరాణాం వైష్ణవానాంతు శైవానాంపార్వతీ ప్రియ!

అలాభేతు సువర్ణస్య రథం రాజతమాదిశేత్ తదలాభే తామమయం రథం వ్యోమ! చ కారయేత్

అభావే చాపి తామ్రస్య రథః పిష్టమయః స్మృతః స హిరణ్యే మహాదేవ! తామభాజనమాశ్రితః  

కౌశేయ యుగ్మసహితం బ్రాహ్మణాయ నివేదయేత్ పూర్వోక్తాయ మహాదేవ! వాచకాయ మహాత్మనే

పంచరత్నసమా యుక్తం శుభగంధాధి వాసితమ్ స్వశక్త్యాతు విరూపాక్ష! విత్తశాఠ్యం వివర్జయేత్

ఏషా పుణ్యా పాపహరా రథాహ్వాసప్తమి హర! కధితాతే మహారుద్ర! మహతీయం ప్రకీర్తితా

స్నానం దానమథో హోమః పూజాగ్రహపతేర్హర! శతసాహస్రం భవేదస్యాం కృతం భూధర విద్యతే

తా బ్రాహ్మణులను భుజింపఁజేసి యా రథమును ఆచార్యునకు నివేదింపవలెను. సప్తమీ కల్పమును సోపాఖ్యానముగ నధ్యయనము చేసినవాడాచార్యుడు. అట్టివానికీయవలేను: సౌర, వైష్ణవ, శైవ బ్రాహ్మణులలో నట్టివాడాచార్యుడని తెలియవలేను. సువర్ణరథము లభింపనిచో వెండిరథము, అదియును లభింపని యెడ రాగి రథము. త్రిమ రథము కూడ సాధ్యము కాని పక్షమున పిండితో రథము సిద్దము చేయవచ్చును. బంగారపు రథముతో బాటుగ రాగిపాత్ర. పట్టు వస్త్రముల జతతో సహా బ్రాహ్మణునకు సమర్పింపవలెను. బ్రాహ్మణుడన పూర్వము చెప్పబడిన సప్తమి కల్పవాచకుడైన ఆచార్యుడు. అట్టివానికే రథాదికము నీయవలేను. ఈయబడు రథము శుభగంథములతో వాసితమై, పంచరత్నసమాయుక్తమై యుండవలెను. దానమిచ్చునప్పుడు స్వశక్తిననుసరించియీయవలెను. ధనలుబ్దత్వము కూడదు. ఇట్లే రథసప్తమి పాపహరము, పుణ్యప్రదము. మహిమాన్వితమైన ఈ వ్రతమును గుఱించి నీకు చెప్పితిని. సూర్యదేవుని నిమిత్తముగ చేయబడిన స్నానము, దానము, హోమము, పూజ మున్నగునవి నూఱువేల గుణితమగ ఫలమిచ్చును.

మూ. ఏవమేషా పుణ్యతమా మాఘేప్రోక్తాతు సప్తమి యాముపోష్యనరో భక్త్యా సూర్యస్యానుచరోభవేత్

బ్రాహ్మణోయాతి దేవత్వం క్షత్రియో విప్రతాం వ్రజేత్ వైశ్యః క్షత్రియతాం యాతి శూద్రోవైశ్యత్వమేతి చ

విద్యావినయ సంపన్నం భర్తారం కన్యకా లభేత్ అపుత్రాస్త్రీ సుతం విందే త్సౌ భాగ్యంచ గణాధిప !

 విధవా చాప్యుపోష్యేమాం సప్తమిం త్రిపురాంతక! నాన్య జన్మసు వైధవ్యం ప్రాప్నుయాత్పార్వతీ ప్రియ !

బహుపుత్రా బహుధనా పత్యుర్వల్లభతాం వ్రజేత్ యావద్వై సప్త జన్మాని స్త్రీయస్తు పురుషాస్తథా

 ఏవం విధా సప్తమితే కధితా వృషభధ్వజ! యాం శ్రుత్వా మానవో భక్త్యా ముచ్యతే బ్రహ్మహత్యయా

ఇతి శ్రీ భవి ష్యే మహాపురాణే శతార్థ సాహస్ర్యాం సంహితాయాం బ్రా హ్మేపర్వణి

సప్తమి కల్పే రథ సప్తమి మాహాత్మ్యవర్ణనం నామైకోన షష్టితమోఽధ్యాయః

తా ఈ విధముగ మాఘసప్తమి పుణ్యతమమైనదిగ చెప్పబడినది. ఆదినమున భక్తితోనుపవసించిన మనుజుడు సూర్యదేవున కనుచరుడగును. బ్రాహ్మణుడు దేవత్వమును, క్షత్రియుడు బ్రాహ్మణత్వమును, వైశ్యుడు క్షత్రియత్వమును, శూద్రుడు వైశ్యత్వమును పొందును. వివాహముకానీ పడచు విద్యావినయ సంపన్నుడైన భర్తనుబడయును. సంతానము లేని స్త్రీ పుత్రుని, సౌభాగ్యమును పొందును. ఈ సప్తమినాడు విధవ ఉపవాస వ్రతము నాచరించిన యెడల తరువాతి జన్మలలో నామెకు వైధవ్యము కలుగకుండును. అనేకులను పుత్రులనుగని, మిక్కిలి ధనవంతురాలై భర్శప్రేమకు పాత్రురాలగును. ఏడు జన్మల వఱకు స్త్రీలుగాని, పురుషులుగాని. ఇహపర సౌఖ్యములనందుదురు. ఓ శివా! ఇంతటి మహత్తగల సప్తమీ గుణించి నీకు వివరించితిని. దీనిని భక్తితో వినువాడు కూడ బ్రహ్మహత్యాది ఘోర పాపమునుండి ముక్తుడగును.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందురథ సప్తమి మాహాత్మ్య వర్ణనమను ఏబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.