భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

35. పంచమి కల్పమున ధాతుగత విషక్రియా వర్ణనము

 మూ.కశ్యప ఉవాచ : -

“సవిషాదంష్ట్రయోర్మధ్యే యమదూతీతువైభవేత్ న చికిత్సా బుదైః కార్యా తం గతాయుం వినిర్దిశేత్

ప్రహరార్థం దివారాత్రివేకైకం భుంజతే బహిః ఏకస్యచ సమానంచ ద్వితీయంషోడశం తథా

నాగోదయో యముద్దిశ్య హతోవిద్ధో విదారితః కాలదష్టం విజానీయాత్కశ్యపస్యవచోయథా

యన్మాత్రం పతతే బిందుర్వాలాగ్రం సలిలోద్ధృతమ్ తన్మాత్రం సవతే దంష్ట్రావిషం సర్పస్యదారుణమ్

నాడీ శతేతు సంపూర్ణ దేహే సంక్రమతే విషమ్ యావత్సంక్రామ యద్భాహుం కుంచితంతో ప్రసారయేత్

అనేన క్షణమాత్రేణ విషం గచ్ఛతి మస్తకే వేపతే విషవేగేతు శతశోఽధ సహస్రశః

వర్ధతే రక్తమాసాద్య తతో వాతైః శిఖీయధా తైలబిందుర్జలం ప్రాప్య యధావేగేన వర్ధతే

శిఖండీ ఆశ్రయం ప్రాప్య మారుతేన సమీరితః తతః స్థానశతం ప్రాప్య త్వచాస్థానం విచేష్టితమ్

 త్వచాను ద్విగుణం విద్యాచ్ఛోణితేషు చతుర్గుణమ్ పిత్రేతు త్రిగుణం యాతి శ్లేష్మేవైషోడశం భవేత్

 వాయౌ త్రింశదుణం చైవ మజ్జా షష్టిగణం తథా ప్రాణే చైకార్ణవీ భూతే సర్వగాత్రాణి సంధయేత్

తా కశ్యపుడిట్లనెను. “పాము కోఱల మధ్యగల 'యమదూతి' మను పేరుగల విషపు కోఱకాటుపడినచో నట్టివానికిక తెలిసిన వారు చికిత్సచేయనక్కఱలేదు. అతడు మరణించుననియే చెప్పవలెను. పగలు, రాత్రి, రెండవ, పదునాఱవ ప్రహరార్థము (అరజాము) పైన-ఒక జాముతో సమానమన్నను సరియే. సర్పములకు సంబంధించి అది నాగోదయవేళ అనబడును. అట్టి సమయమున సర్పముచే కొట్టబడినను, కాటువేయబడినను, చీల్చబడినను అట్టివానిని కశ్యపవాక్యముననుసరించి కాలదష్టుడనీ తెలియవలేను. నీటినుండీ బయటకు లేవనెత్తబడిన తోకకొననుండి ఎన్ని బిందువులు వెలువడునో అంతప్రమాణమున పాముకోటనుండి దారుణమైన విషము స్రవించును. మొత్తము శరీరమునందలి నూజు నాడులలోనికి ఆవిషము సంక్రమించును. చేతిని చాచినంత, లేక ముడిచినంత కాలముననే విషము ప్రసరించును. ఆక్షణమాత్రమునకే ఆ విషము నెత్తికెక్కును. అప్పుడా విషవేగప్రభావమున దష్టుడు నూఱు విధములుగ, వేయి విధములుగ వణికి పోవుచుండును. వాయువు వలన అగ్ని రగుల్కొని మంటలులేచునట్లు విషము, రక్తమున గలసి వృద్ధిపొందుచుండును. తైలబిందువు నీటఁగలిసి వ్యాపించునట్లు విస్తరించుచుండును. శరవేగమునకు వాయువేగముతోడైనట్లు శరీరమున పెక్కుచోట్లకు ప్రాకుచు చర్మములోనికి దూసుకొని వచ్చును. ఆ విషము చర్మమున రెండింతలు, రక్తమున నాలుగింతలు, పిత్తమున మూడింతలు, శ్లేష్మమున పదునాంతలు. వాతమునముప్పదింతలు, మజ్జలో అణువదింతలునై, ప్రాణమునందు ఒక కడలియంతై అవయవములన్నింట వ్యాపించును.

మూ. శ్రోత్రేనిరుధ్యమానేచ యాతి దష్టస్త్వసాధ్యతామ్ తతోఽసౌ ప్రియతే జంతుర్ని:శ్వాసోచ్చ్వాస వర్జితః

నిష్క్రాంతేతు తతో జీవే భూతే పంచత్వమాగతే తాని భూతాని గచ్ఛంతి యస్యయస్య యథాతథమ్

పృథివ్యాపస్తథా తేజో వాయురాకాశమేవచ ఇత్యేషామేవ సంఘాతః శరీరమభిధీయతే

పృథివీ పృథివీం యాతి తోయంతోయేషులీయతే తేజో గచ్ఛతి చాదిత్యం మారుతో మారుతం వ్రజేత్

ఆకాశం చైవమాకాశే సహతేనైవ గచ్ఛతి స్వస్థానంతే ప్రపద్యంతే పరస్పర నియోజితాః

 న జీవేదాగతః కశ్చిదిహ జన్మని సువ్రత! విషార్తం న ఉపేక్షేత త్వరితంతు చికిత్సయేత్

ఏకమస్తి విషం లోకే ద్వితీయంచోపపద్యతే యథానానా విధం చైవ స్థావరంతు తథైవచ

ప్రథమే విషవేగేతు రోమ హర్షోఽభిజాయతే ద్వితీయే విషవేగేతు స్వేదో గాత్రేషుజాయతే

తృతీయే విషవేగేతు కంపోగాత్రేషు జాయతే చతుర్థ విషవేగేతు శ్రోత్రాంతర నిరోధ కృత్

పంచమే విషవేగేతు హిక్కాగాత్రేషు జాయతే ష షేచ విషవేగేతు ప్రాణేఽభ్యోపి ప్రముచ్యతే సప్తధాతు వహా హ్యేతే వైనతేయేన భాషితాః

 తా  శ్రవణ శక్తి నిరోధింపబడుటతో దష్టుడు చికిత్సకు లొంగని ప్రమాదమున పడిపోవును. అప్పుడు ఉచ్చ్వాస నిశ్వాసలు ఆగిపోయి అతడు మరణించును. ప్రాణములు పోయిన తరువాత భూతములు పంచత్వమునొందును. అవి తమతమ స్థానములు చేరుకొనును. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము-వీని కలయికయే శరీరమనబడును గదా!. భూమి భూమిని, చేరును, నీరు నీటఁగలయును, అగ్నిసూర్యునిలో లీనమగును. గాలి గాలిని చేరును. ఆకాశమాకాశమున వానితోడనే లీనమగును. అవియన్నియు పరస్పర నియోగమున తమతమ తావులనొందును. అంత్యకాలము దాపురించినవాడు బ్రతుకజాలడు. పాము విషముచే బాధనొందువానిని ఉపేక్షింపక వెంటనే చికిత్సచేయింపవలెను. లోకమున విషమంతయునొకటియే. మఱియొకటి ఆ ఒకదాని నుండియే కలుగును. సర్పాదీ ప్రాణుల విషము ప్రాణాంతకమైనట్లుగ నితర విషములు కూడా అదేధర్మము కలిగియుండును. మొదటి విషవేగమున రోమాంచము కల్గును. రెండవ వేగమున అవయవములు చెమట పట్టును. మూడవ వేగమున అంగములలో కంపము పుట్టును. విషము యొక్క నాల్గవ వేగమున చెవులు వినబడకపోవును. ఐదవ వేగమున ఎక్కిళ్ళు; అవయములుండియుండి చలించుట కలుగును. ఆఱవవేగమున ప్రాణములు వేరగుచుండును. ఏడవవేగమున మరిణించును. శరీరమునందలి సప్తధాతువులలో విషము వ్యాపించుటను గూర్చి గరుడుడు చెప్పెను.

మూ. త్వచఃస్థానే విషేప్రాప్తే తస్యరూపాణిమే శృణు అంగాని తిమిరాయంతే తపంతే చ ముహుర్ముహుః

ఏతాని యస్య చిహ్నాని తస్య త్వచి గతం విషమ్ తస్యాగదం ప్రవక్ష్యామి యేన సంపద్యతే సుఖమ్

అర్కమూల మపామార్గం ప్రియంగుం తగరం తథా ఏతదాలోడ్య దాతవ్యం తతః సంపద్యతే సుఖమ్

 తతస్తస్మిన్కృతే విప్ర ననివర్తేత చేష్టితమ్ త్వచఃస్థానం తతో భిత్వా రక్తస్థానం ప్రధావతి

విషేచ రక్తం సంప్రాస్తే తస్యరూపాణి మేశృణు దహ్యతే ముహ్యతే

చైవ శీతలం బహు మన్యతే

 ఏతాని యస్యరూపాణి తస్యరక్తగతం విషమ్ తత్రాగదం ప్రవక్ష్యామి యేన సంపద్యతే సుఖమ్

ఉశీరం చందనం కుష్ఠముత్పలం తగరం తథా మహాకాలస్య మూలాని సిందువారనగస్యచ హింగులం మరచంచైవ పూర్వవేగేతు దాపయేత్

 బృహతీ వృశ్చికాకాలీ ఇంద్రవారుణి మూలకమ్ సప్తగంధ ఘృతంచైవ ద్వితీయే పరికీర్తితమ్

 సిందువారం తథాహింగుం తృతీయే కారయేద్బుధః తస్యపానం చ కుర్వీత అంజనం లేపనం తథా

 ఏతేనైవో పచారేణ తతః సంపద్యతే సుఖమ్ రక్తస్థానం తతో గత్వా పిత్తస్థానం ప్రధావతి

తా చర్మమునందు విషము వ్యాపించిన వాని లక్షణములను చేప్పెదను. వినుము. అవయములు పట్టుదప్పును. చీకట్లు గ్రమ్మును. మాటిమాటికీ శరీరమున మండినట్లుండును. ఇవి విషము చర్మమున వ్యాపించిన వాని లక్షణములు. ఈ బాధ తొలగి సుఖము కలుగుట కొఱకు ఔషధమును చెప్పెదను వినుము. జిల్లేడు వేరు, ఉత్తరేను, పిప్పనందివర్ధనము ఇవియన్నియు నొక్కచోబాగుగా నూరి దష్టున కీయవలెను. బాధ ఉపశమించును. బాధానివారణ కాని యెడల విషము చర్మస్థానమును భేదించుకొని రక్తములోనికి పరుగెత్తినదని యెంచవలేను. విషము రక్తగతమైనప్పటి లక్షణములు వినుము దాహమెక్కువగును. మూర్చవచ్చినట్లుండును. శీతల పదార్థము లిష్టమగుచుండును. ఈ లక్షణములగుపడినచో విషము రక్తమున చేరినదిగా భావింపవలెను. అట్టి స్థితిలో నీయవలసిన ఔషధమును చెప్పెదను, ఆ ఔషధముతో రోగికి ఉపశమనము కలుగును. వట్టివేరు, చందనము, చెంగల్వకోష్టు, నందివర్ధనము, మహాకాల మూలములు, వావిలివేళ్ళు, ఇంగిలీకము, మిరియములు ఇవి నూరి త్వరితముగా నీయవలెను. ఆ పిదప రెండవ తడవ వాఁకుడు, తేలుకోండి, జటామాంసి, పెద్దపాపర, వేరు, సప్తగంధ ఘృతము ఈయవలెను. మూడవ పర్యాయము వావిలి, ఇంగువ ప్రయోగింపవలెను. దానినే త్రాగించి, కాటుకగా కన్నులకు రాచి, గాయముపై ఒంటికి రాయవలేను. ఈ ఉపచారముచే పాము కఱచిన వానికి ఉపశమనము కలుగును. విషము రక్తస్థానమునుండి పిత్తస్థానమునకు పరుగెత్తును.

మూ. పిత్తస్థాన గతే విప్ర! విషరూపాణి మే శృణు ఉత్తిష్ఠతే నీపతతే దహ్యతే ముహ్యతే తథా

గాత్రతః పీతకః స్యాద్వై దిశః పశ్యతి పీతికాః ప్రబలాచ భవేన్మూర్చానచాత్మానం విజానతే విషక్రియాం తస్య కుర్యాద్యయా సంపద్యతే సుఖమ్

 పిత్తస్థాన మతిక్రమ్య శ్లేష్మస్థానంచ గచ్ఛతి

 పిప్పల్యో మధుకం చైవ మధుఖండం ఘృతం తధా మధుసారమలాబూంచ జాతీం శంకర వాలుకామ్ ఇంద్ర వారుణికా మూలం గవాం మూత్రేణ పేషయేత్

 నస్యం తస్య ప్రయుంజీత పానమాలేపనాంజనమ్ ఏతేనైవోపచారేణ తతః సంపద్యతే సుఖమ్

 శ్లేష్మస్థానం తతః ప్రాప్తే తస్య రూపాణి మే శృణు గాత్రాణి తస్యరుధ్యంతే నిఃశ్వాసశ్చన జాయతే లాలాచ స్రవతే తస్య కంతో ఘురుఘురాయతే

 ఏతాని యస్యరూపాణి తస్యశ్లేష్మగతం విషమ్ తస్యాగదం ప్రవక్ష్యామి యేన సంపద్యతే సుఖమ్

 త్రికటుకీ శ్లేష్మాతకో లోధ్రశ్చ మధుసారకమ్ ఏతాని సమభాగాని గవాం మూత్రేణ పేషయేత్

తస్య పానంచ కుర్వీత అంజనం లేపనం తథా ఏతేనైవోప చారేణ తతః సంపద్యతే సుఖమ్

శ్లేష్మస్థాన మతిక్రమ్య వాయుస్థానంచ గచ్ఛతి తత్రరూపాణి వక్ష్యామి వాయుస్థాన గతే విషే

తా పిత్త స్థానమును చేరిన విషలక్షణములను గూర్చి చెప్పెదను వినుము. పాముకాటుకు గుజియైనవాడు పడుచు లేచుచునుండును. ఒడలంతయు మంటగానుండును. మూర్చపడిపోవును. శరీరము పసుపు వన్నెకు మారును. దిక్కులన్నియు పచ్చగా కనబడుచుండును. మూర్ఛబలీయమై తనను తాను మఱచిపోవును. ఇట్టి విషచర్యకు ప్రతిక్రియ చేసినచో రోగికి కొంత బాధ తీరి సుఖము కలుగును. పిత్తస్థానము నుండి విషము శ్లేష్మస్థానమునకు చేరును. పిప్పళ్లు, అతిమధురము, పులకండము, నేయి, తేనే, సొరకాయ, జాజి, నూఁగుదోస, పెద్దపాపర-వీనిని గోమూత్రములో నూరిపిండీగా చేయవలెను. దానిని నస్యముగా పీల్పించవలెను. దానినే నీటఁగలిపి త్రాగింపవలెను. ముద్దగఁజేసి కన్నులకుఁబూయవలెను. ఒంటికి రాయవలెను. ఈ ఉపచారముచేత రోగికి సుఖము కలుగును. ఇక విషము శ్లేష్మస్థానము చేరిన వాని లక్షణములను వినుము. అంగములు మొద్దుబారి పోవును. ఊపిరి విడుచుట అసాధ్యమగును. చొంగకారును. గొంతులో గురగుర శబ్దము వినిపించును. ఈ లక్షణములు గలవానికి, విషము శ్లేష్మమున చేరినదని గ్రహింపవలెను. దానినుండి ఉపశమనమును కలుగుటకు ఔషధమును చేప్పెదను, సొంటి, పిప్పలి, మిరియాలు, విరిగిచెట్టు, లోద్దుగుచేట్లు, తేనే-వీనిని సమభాగములుగా తీసికొని ఆవు మూత్రములో మెత్తగా నూరవలేను. దానిని రోగి చేత త్రాగింపవలెను. దానినే కాటుకగా (కండ్లకు) లేపనముగా (శరీరమునకు) వాడవలెను. ఈ ఉపచారముచే దష్టుడు తేలికపడును. శ్లేష్మస్థానమును దాటి విషము వాతస్థానమును చేరును. ఆ లక్షణములను చేప్పెదను. వినుము.

 మూ. ఆధ్మాయతేచ జఠరం బాంధవాంశ్చన పశ్యతి ఈ దృశం కురుతే రూపం దృష్టిభంగశ్చజాయతే

ఏతాని యస్యరూపాణి తస్యవాయు గతం విషమ్ తస్యాగదం ప్రవక్ష్యామి యేన సంపద్యతే సుఖమ్

శోణా మూలం ప్రియాలంచ రక్తంచ గజ పిప్పలీమ్ భార్జీంవచాం పిప్పలించ దేవదారుం మధూకకమ్

మధూకసారం సహసిందువారం హింగుంచపిష్ట్యా గుటికాంచకుర్యాత్ దద్యాచ్చ తస్యాంజన లేపనాది ఏషోఽగదః సర్పవిషాణి హన్యాత్

 అంజనం చైవ నస్యంచ క్షిప్రం దద్యాద్విషాన్వితే వాయుస్థానం తతో ముక్త్వా మజ్జాస్థానం ప్రధావతి

విషేమజ్జ గతే విప్ర! తస్యరూపాణి మే శృణు దృష్టించ హీయతే తస్య భృశమంగాని ముంచతి

ఏతాని యస్య రూపాణి తస్య మజ్జిగతం విషమ్ తస్యాగదం ప్రవక్ష్యామి యేన సంపద్యతే సుఖమ్

 ఘృత మధు శర్కరాన్విత ముశీరం చందనం తథా ఏతదాలోడ్య దాతవ్యం పానం నస్యంచ సువ్రత!

తతః ప్రణశ్యతే దుఃఖం తతః సంపద్యతే సుఖమ్ ఆధ తస్మిన్కృతే యోగే విషం తస్య నివర్తతే

తా కడుపు ఉబ్బిపోవును. దృష్టిమందగించుటచే బంధువులను చూడజాలకుండును. దృష్టి భంగమగును. ఈ లక్షణములు కనబడినచో విషము వాత గతమైనదిగా నెంచవలెను. ఇట్టి బాధనుండి తప్పించి రోగిని సుఖిని చేయుటకు ఔషధమును చెప్పెదను. దుండిగపువేరు, మోరటి, కుంకుమపువ్వు, గజపిప్పలి, చొరంగి, వస, పిప్పలి, దేవదారు, ఇప్ప. ఇప్పమూలగ, వావిలి, ఇంగువ. వీనిని ఒక్కచోట నూరి మాత్ర(లు) చేయవలెను. అది దష్టునిచే మ్రింగింపవలేను. అంజనముగ, లేపనముగ కూడా దానిని ఉపయోగింపవలెను. ఈ ఔషధము సర్పముల విషమును హరించును. విషయుక్తునకు అంజనము, నస్యము త్వరితముగ నీయవలెను. వాయుస్టానమునుండి విషము మజ్జాస్టానము చేరును. విషము మజ్జ (ఎముకలలోని నేయి)లో చేరిన వాని లక్షణములను చేప్పెదను వినుము. అతని చూపు నశించును. అవయములు మిక్కిలిగా పట్టుదప్పును. ఈ లక్షణములు గలవానికి విషము మజ్జిగతమైనదిగా భావింపవలెను. ఇట్టివానికి సుఖము కలిగించునౌషధమును తెలుపుచున్నాను. నేయి, తేనే, శర్కరతో కూడిన వట్టివేరు, చందనము-వీనిని బాగుగా నూరి పొడిచేసి నీటఁగలిపి త్రాగింపవలెను. పొడిని ముక్కుద్వారా పీల్పించవలెను. దష్టుని బాధ తగ్గి హాయిగా నుండును. ఈ ఔషధప్రయోగమున అతని విషము నివర్తించును.

మూ. మజ్జాస్థానం తతోగత్వా మర్మస్థానం ప్రధావతి వి షేతు మర్మసంప్రాస్తే శృణు రూపం యధాభవేత్

నిశ్చేష్టః పతతే భూమౌ కర్ణాభ్యాం బధిరోభవేత్ వారిణా సిచ్యమానస్య రోమహర్షీ నజాయతే

 దండేన హన్యమానస్య దండరాజీ నజాయతే శస్త్రేణచ్ఛిద్య మానస్యరుధిరం నప్రవర్తతే

కేశేషు లుచ్యమానేషు నైవ కేశాన్ప్రవేదతే యస్య కర్ణాచ పార్శ్వేచ హస్తపాదంచ సంధయః శిధిలాని భవంతీహ స గతాసురితి శ్రుతిః

 ఏతాని యస్యరూపాణి విపరీతాని గౌతమ! మృతంతు న వీజానీయా త్కశ్యపస్య వచోయధా

 వైద్యాస్తస్య న పశ్యంతి యే భవంతి కుశిక్షితాః విచక్షణాస్తు పశ్యంతి మంత్రౌషధి సమన్వితాః

తస్యాగదం ప్రవక్ష్యామి స్వయం రుద్రేణ భాషితమ్ మయూర పిత్తం మార్జారపిత్తం గంధనాడీ మూలమేవచ

 కుంకుమం తగరం కుష్ఠం కాస మర్దత్వచం తథా ఉత్పలస్యచ కింజల్కం పద్మస్య కుముదస్యచ ఏతాని సమభాగాని గోమూత్రేణ తు పేషయేత్ ఏషోఽoగధో యస్యహస్తే దఙ్ఞానప్రియతే సవై

 కాలాహినాపి దష్టేన క్షిప్రంభవతి నిర్విషః

 క్షిప్రమేవ ప్రదాతవ్యం మృత సంజీవనౌషధమ్ అంజనంచైవ నస్యంచ క్షిప్రం దద్యాద్విచక్షణః

ఇతిశ్రీ భవిష్యే మహాపురాణే శతార్ధ సాహస్ర్యాం సంహితాయాం బ్రా హ్మేపర్వణి

పంచమికల్పే ధాతుగత విషక్రీయా వర్ణనం నామ పంచత్రింశోఽధ్యాయః

 తా మజ్జాస్థానము నుండి విషము మర్మస్థానమునకుఁబోవును. అది మర్మస్థానమును చేరిన వెంటనే సర్పదష్టుడెట్లగునో వినుము. చేష్టలు దక్కే క్రింద పడును చెవులు వినబడక చెవిటి వాడగును. పైన నీళ్లు చల్లినను చలింపడు. కఱ్ఱతో కొట్టినను ఒంటిపై దండముద్రపడదు. శస్త్రముతో శరీరము పై గాటు వేసినను రక్తము స్రవింపదు. వెంట్రుకలు లాగినను నొప్పి కలుగదు. చెవులు, ప్రక్కలు, కాళ్ళు, చేతులు, సంధులు శిథిలమై వ్రాలిపోవును. అతడు మరణించెనని వినబడుచుండును. గౌతమా! ఇట్టి విపరీత లక్షణములేర్పడినను-కశ్యపవాక్యముననుసరించి-అతడు మరణించలేదని యెఱుంగవలెను. వైద్య శాస్త్రమున సరియైన శిక్షణలేని వైద్యులు ఈ విషయమును గమనింపజాలరు. మంత్రోషధ ప్రయోగ నైపుణ్యము గల చికిత్సకులు మాత్రమే ఇది గమనింతురు. సర్పదష్టుడట్లు మృతప్రాయుడైయున్న సమయముననుపయోగింపవలసిన ఔషధమును గూర్చి స్వయముగ రుద్రుడు చెప్పిన దానిని నేను చెప్పుచున్నాను. మయూర పిత్తము (నెమలిధాతువు), మార్జాలపిత్తము (పిల్లిధాతువు), గంధనాడి వేరు, కుంకుమ పువ్వు, నందివర్ధనము, చెంగల్వ కోష్టు, కసింద (కాసమర్ధము) పై బెరడు, కలువ, తామర, తెల్లగలువ కేసరములు (ఆకరువు) . వీనిని సమభాగములుగా తీసికొని గోమూత్రమున మెత్తగా మర్దించి దానిని సర్పదష్టునికీయవలెను. ఈ ఔషధము చేతనుండగా సర్పదష్టుడు మరణింపడు. కాల సర్పముచే కాటు వేయబడినను ఈ మందు అతనిని వెంటనే విషరహితునిగఁజేయగలదు. ఈ మృత సంజీవిని సత్వరమే రోగికి ఈయవలెను. బుద్ధిమంతుడైన వాడు అదే ఔషధమును అంజనముగను, నస్యముగను ఆలస్యముగాకుండనీయవలెను.

శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున - పంచమీ కల్పమునందు ధాతుగత విషక్రియావర్ణనమను ముప్పది యైదవ అధ్యాయము సమాప్తము.