128. సప్తమీ కల్పమున సాంబస్తవ వర్ణనము

మూ॥ సుమంతు రువాచ :

అస్తావీచ్చతతః సాంబః కృశోధమని సంతతః రాజన్నామ సహస్రేణ సహస్రాంశుం దివాకరమ్

ఖిద్యమానం తతో దృష్ట్యా సూర్యః కృష్ణాత్మజం తదా స్వప్నే స్మై దర్శనం దత్వా పునర్వచన మబ్రవీత్

 శ్రీ సూర్య ఉవాచ :

సాంబ! సాంబ! మహా బాహో! శృణు జాంబవతీ సుత! అలంనామ సహస్రేణ పఠచేమం శుభం స్తవమ్

యాని గుహ్యాని నామాని పవిత్రాణి శుభానిచ తానితే కీర్తయిష్యామి ప్రయత్నాదవ ధారయ

 వైకర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవిః లోక ప్రకాశకః శ్రీమాన్ లోకచక్షుర్గ్రు హేశ్వరః

లోకసాక్షి త్రిలోకేశః కర్తాహర్తా తమిస్రహా తపనస్తాపనశ్చైవ శుచిః సప్తాశ్వ వాహనః

 గభస్తి హస్తో బ్రహ్మాచ సర్వదేవ నమస్కృతః ఏకవింశతి రిత్యేష స్తవ ఇష్టస్సదామమ

శరీరారోగ్యదశ్చైవ ధనవృద్ధి యశస్కరః స్తవరాజ ఇతి ఖ్యాత స్త్రీషు లోకేషు విశ్రుతః

య ఏతేన మహాబాహో! ద్వేసంధ్యేఽస్తమనోదయే సౌతిమాం ప్రణతో భూత్వా సర్వ పాపైః ప్రముచ్యతే

మానసం వాచికం వాపి కాయికం యచ్చదుష్కృతమ్ ఏక జాప్యేన తత్సర్వం ప్రణశ్యతి మమాగ్రతః

ఏష జప్యశ్చ హోమశ్చ సంధ్యోపాసన మేవచ బలిమంత్రోఽర్ఘ్య మంత్రోథ ధూప మంత్రస్తథైవచ

 అన్న ప్రదానే స్నానేచ ప్రణిపాతే ప్రదక్షిణే పూజితోఽయం మహామంత్రః సర్వపాపహరః శుభః

 ఏవముక్త్వౌస భగవాన్భాస్కరో జగతాంపతిః ఆమంత్ర్య కృష్ణ తనయం తత్రైవాంతర్హితోఽభవత్

 సాంబోపిస్తవ రాజేన స్తుత్వాసప్తాశ్వవాహనమ్ ప్రేతాత్మానీరుజః శ్రీమాంస్తస్మాద్రోగాద్విముక్తవాన్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రాహ్మే పర్వణి సప్తమీ కల్పే సాంబస్తవ వర్ణనం సౌమాష్టావింశత్యుత్తర శతతమోఽధ్యాయః

తా॥ సుమంతుముని యిట్లనెను. “రాజా! రోగమువలనను, తపః క్లేశమువలను కృశించిపోయి యున్న దేహముగల సాంబుడు సహస్రాంశుడైన దివాకరుని సహస్రనామములతో స్తుతించేను-1. సూర్య భగవానుడు, ఖేదముతో నుండిన సాంబునిఁజూచి, అతనికి స్వప్నమున సాక్షాత్కరించి తిరిగి యిట్లనెను-2. 'సాంబా! మహా బాహూ! జాంబవతీ నందనా! వినుము, సహస్ర నామస్తవము ఇక చాలును. నేను చెప్పబోవునట్టి శుభప్రదమైన స్తోత్రమును పఠింపుము.-3. రహస్యములు, మంగళకరములు, పవిత్రములునైన నా నామములను నీకు వినిపించెదను. శ్రద్ధగా వినుము-4. "వైకర్తనుడు, వివస్వంతుడు, మార్తాండుడు, భాస్కరుడు, రవి, లోక ప్రకాశకుడు, శ్రీమంతుడు, లోక చక్షువు, గ్రహేశ్వరుడు-5. లోకసాక్షి, త్రిలోకేశుడు, కర్త, హర్త, తమిస్రహుడు, తపనుడు తాపనుడు, శుచి, సప్తాశ్వవాహనుడు -6 గభస్తిహస్తుడు, బ్రహ్మ, సర్వదేవ నమస్కృతుడు', అని యిరువది యొక్క నామములుగల యీ స్తోత్రము నాకు మిక్కిలి ప్రీతికరమైనది-7. ఇది శరీరమున కారోగ్యమునొసగునది. ధనమును వృద్ధి నొందించునది. యశస్కరమైనది. ముల్లోకములందిది స్తవరాజముగ ప్రఖ్యాతి వడసినది-8. ఉదయాస్తమయ సంధ్యలందెవడీ స్తవ రాజమును నాకు నమస్కరించుచు పఠించునో వాడు సర్వపాపములనుండి విముక్తుడగును-9. నా సమక్షమున నొక పర్యాయము జపించినచో మనో వాక్కాయములకు సంబంధించిన పాపము లేవి యైనను పటాపంచలైపోవును-10. ఈ మంత్ర జపమే హోమము, సంధ్యోపాసనము, పూజా మంత్రము, అర్ఘ్య మంత్రము, ధూప మంత్రము కూడనై యున్నది -11. అన్నము నివేదించునపుడు, స్నానము చేయించునపుడు, నమస్కరించునపుడు, ప్రదక్షిణమాచరించునపుడును వినియోగింపదగిన మంత్రమిది. అందుచే నిది సర్వపాపహరము. శుభంకరము. పూజ్య భావమున నాదరింపఁదగిన మహా మంత్రమది”-12. ఇట్లు నుడివి జగత్పతియైన సూర్య భగవానుడు సాంబునకాదరముతో వీడ్కోలిచ్చి యచటనే యంతర్షితుడయ్యెను-13. సాంబుడు కూడ సప్తాశ్వ వాహనుడైన సూర్య దేవునిఇదే స్తవరాజముతో స్తుతించి తన రోగము నుండి విముక్తుడై, సంతోష సౌభాగ్యముల నొందెను.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు సాంబ స్తవర్ణనమను నూట యిరువది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.