121. సప్తమీ కల్పమున విశ్వకర్మకృత తేజః శాతనము

మూ॥ శతానీక ఉవాచ :

శరీర లేఖనం భానోరుక్తం సంక్షేపతస్త్వయా విస్తరాచ్చ్రోతు మిచ్ఛామి తన్మమాచక్ష్వ సువ్రత ।

సుమంతురువాచ :

 పితుర్గృహంతు యాతాయాం సంజ్ఞాయాం కురునందన! భాస్కరశ్చింతయామాస సంజ్ఞామద్రూపకారిణీ

ఏతస్మిన్నంతరే బ్రహ్మ తత్రాగత్య దివాకరమ్ అబ్రవీన్మధురాం వాచం రవేః ప్రీతికరామ్ శుభామ్

“ఆది దేవోసి దేవానాం వ్యాప్తమేతత్త్వయా జగత్, శ్వశురో విశ్వకర్మాతే రూపం నిర్వర్త యిష్యతి”

ఏవముక్త్వా రవింబ్రహ్మా విశ్వకర్మాణ మబ్రవీత్త్వం 'నివర్తస్వ మార్తాండం స్వరూపం తత్సుశోభనమ్

 తతో బ్రహ్మసమావేశాద్భూమి మారోప్య భాస్కరమ్ రూపం నివర్తయామాస విశ్వకర్మ శనైః శనైః

 తతస్తుష్టావ తం బ్రహ్మ సర్వదేవ గణైః సహ గుహ్యైర్నానా విధైః స్తోత్రైర్వేద వేదాంగ పారగైః

“స్వస్తితేఽస్తు జగన్నాథ! ధర్మవర్ష హిమాకర! శాంతిస్తే సర్వలోకానాం దేవదేవ! దివాకర!  

తతో రుద్రశ్చ విష్ణ్వాద్యోః స్తువంతస్తందివాకరమ్ తేజస్తే వర్ధతాం దేవ! లిఖ్యతేపి దివస్పతే

ఇంద్రశ్చాగత్య తందేవం లిఖ్యమానమథాస్తువత్ జయదేవ! జయ స్వేతి తత్ప్రదోఽసి జగత్పతే!

తా॥ శతానీకుడిట్లనెను. “మునీశ్వరా! సూర్యభగవానుని శరీర శాతనము గూర్చి లోగడ సంక్షేపముగఁజెప్పియుంటిరి. ఆ విషయమును విస్తృతముగ వినదలచితిని. కావున దయయుంచి వివరించి చెప్పుడు. సుమంతుముని యిట్లు చెప్పఁదొడగెను. “కురునందనా! తండ్రి యింటికి వెడలిపోయిన సంజ్ఞాదేవియందే తన మనస్సుని నిలిపి సూర్యదేవుడు “సంజ్ఞ నా రూపమును సరిచేయునని'యాలోచించుచుండెను. అంతలో బ్రహ్మదేవుడటకేతెంచి సూర్యభగవానునకు ప్రీతికరమైనట్టి మధురమైన శుభవాక్యమునతనికి వినిపించెను. ‘భగవాన్! దేవతలందఱికిని నీవాదిదేవుడవు. ఈ జగత్తంతయు నీవు వ్యాపించి యున్నావు. మీ మామయగు విశ్వకర్మ నీరూపమును సరిదిద్దగలడు. సూర్యదేవునకిట్లు చెప్పి బ్రహ్మ, విశ్వకర్మతో సూర్యభగవానుని రూపము సౌందర్యమయమగునట్లుగ శాతనము చేయుమని యాదేశించెను. అప్పుడు బ్రహ్మదేవుని యాజ్ఞననుసరించి విశ్వకర్మ శానము నారోపించీ భాస్కరుని శరీరమును మెల్లమెల్లగా చెక్కడము చేసి యందమగు రూపమగునట్లు చేసెను. బ్రహ్మదేవుడప్పుడు సర్వదేవగణములతోను, వేద వేదాంగ పారంగతులైన మహరులతోను గూడి నానా విధములైన రహస్యస్తోత్రములతో సూర్యదేవుని సంతోషింపఁజేసెను. “హే జగన్నాథా! పుణ్యభూముల పాలిట చల్లని చంద్రుని వంటివాడా! సర్వలోకములకును దేవాధిదేవా! నీకు స్వస్తియగుగాక! శాంతికలుగుగాక! అని యిట్లు బ్రహ్మదేవుడు స్తుతింపగా. రుద్రుడు, విష్ణువు మొదలగు దేవతలు 'దేవా! దివస్పతే! ఈ లేఖన క్రియచే నీ తేజస్సు వృద్ధియగుగాక! యని యాతని స్తుతించిరి. ఇంద్రుడు కూడా అటకేతెంచి లిఖ్యమానుడైన సూర్యభగవానుని "హే జగత్పతే! నీకు జయముగుగాక! నీవు తత్వదుడవుసుమా'యని కీర్తించెను.

మూ॥ ఋషయస్తు తతఃసప్త విశ్వామిత్ర పురోగమాః తుష్టువుర్వివిధైః స్తోత్రైః స్వస్తి స్వస్తీతి వాదినః

వేదోక్తాభిరధా శీర్భిర్వాల ఖిల్యాశ్చ తుష్టువు: త్వంనాథ! మోక్షిణాం మోక్ష ధ్యేయస్త్వం ధ్యానినామపి

 త్వంగతిః సర్వభూతానాం త్వయి సర్వం ప్రతిష్ఠితమ్ ప్రజాభ్యశ్చైవ దేవేశ! శంనోఽస్తు జగతః పతే!

 త్వత్తో భవతి వైనిత్యం జగత్సంలీయతే త్వయి త్వమేకస్త్వం ద్విధాచైవ త్రిథా చత్వం నసంశయః

 త్వయైకేన జగత్సృష్టం త్వయైకేన ప్రబోధితమ్ తతో విద్యాధర.గణా యక్షరాక్షస పన్నగా:

కృతాంజలి పుటాః సర్వే శిరోభిః ప్రణతా రవిమ్ ఊచురేవం విధానాచో మనఃశ్రోత్ర సుఖ ప్రదాః

సహ్యం భవతు తే తేజో భూతానాం భూతభావన! హా హా హూహూస్తతశ్చైవ తుంబురుర్నారదస్తథా

ఉపగాతుం సమారభ్దా గాముచ్చైః కుశలా రవిమ్ షడ్జ మధ్యమ గాంధార గ్రామత్రయ విశారదాః

మూర్ఛనాభిస్తతశ్చైవ తథా ధైవత పంచమైః నానానుభావ మంద్రైశ్చ అర్ధమంద్రైస్తథైవచ

త్రిసాధనైః ప్రకారైస్తు వాద్యతాల సమన్వితైః విశ్వాచీ చ ఘృతాచీచ ఊర్వశీచ తిలోత్తమా

మేనకా సహజన్యాచ రంభా చాప్సరసాం వరా హావభావ విలాసైశ్చ కుర్వత్యోఽ భినయాన్బహూన్

తా॥ అంతలో విశ్వామిత్రుడు మున్నుగా సప్తర్షులటకేతెంచి 'దేవా! నీకు స్వస్తియగు గాక! స్వస్తియగుగాకఁ యని పలుకుచు వివిధస్తోత్రములచే నాదేవేశుని సంతుష్టి పఱచిరి. వాలఖిల్యులు వేద మంత్రములతో నాశీర్వదించి యాసూర్యభగవానుని సంతోషపఱచిరి. “హే లోకనాథా! ముక్తినొందువారికి నీవే ముక్తివి. ధ్యానము చేయువారికి ధ్యేయము నీవే. సర్వభూతములకు గతియునీవే. సర్వము నీయందే ప్రతిష్ఠితమైయున్నది. జగత్పతీ! మా ప్రజలకందఱకును సుఖము కలుగుగాక!. ఈ జగత్తంతయు నీ వలననే యుద్భవించుచున్నది. నీ యందే లయమగుచున్నది. నీవొక్కడవే రెండుగను, అనేకములుగను పరిణమించితివి. నిస్సంశయముగ. ఈ జగత్తునీ యొక్కని చేతనే సృజింపబడెను. నీ చేతనే మేలుకొల్పబడును” అని వాలఖిల్యులు స్తుతింపగా నంతలో విద్యాధరగణము, యక్షులు, రాక్షసులు, పన్నగులేతెంచి, శిరసువంచి, అంజలి ఘటింపుచు. శ్రోత్రములకు మనస్సునకు సుఖమును కలిగించెడి వాక్యముల నిట్లు పలికిరి. “హే భూతభావనా! నీ తేజస్సు సర్వభూతములకును సహింపఁదగినది యగునుగాక. హాహాహూహూ యనెడు గంధర్వులు, తుంబురుడు, నారదుడు.అనుగానకుశలుడు సూర్యభగవానుని స్తుతింపుచు నుచ్చెస్స్వరమున గానమునారంభించిరి. షడ్జ, గాంధార, మధ్యమ స్వరములను శ్రుతులుగ గ్రహము మార్చి రాగములు పాడుటయందు విశారదులగు వారు మూర్ఛనల చేతను (ఒక స్వరమునుండీ మజియొక స్వరమునకు క్రమారోహణావరోహనలు చేయుచు) మంద్ర, అర్ధమంద్రస్థాయిలోని ధైవత పంచమ స్వరస్థానములలో రాగ సంచారములు చేయుచు, తదనుగుణమున భావస్ఫోరక ముఖ వికాసాదులతో. మంద్ర, మధ్య, తారస్థాయులలో షడ్జ, గాంధార, మధ్యమములను స్వరత్రయమునందు శ్రుతి త్రయ గ్రహణముచే నేర్పడు రాగభేద ప్రకారమును గమక విన్యాసములతో వినిపించుచు రాగతాళ వాద్యములతో గూడి పాడిరి. విశ్వాచి, ఘృతాచి, ఊర్వశి, తిలోత్తమ,. మేనక, అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలగు రంభ తమ హావభావ విలాసములతో వివిధములగు నాట్యములను చేయుచుండిరి.

మూ॥ తతోఽ తీవ కలం గేయం మధురంచ ప్రవర్తతే సర్వేషాం దేవసంఘానాం మనఃశ్రోత్ర సుఖప్రదమ్

ప్రవాద్యం తు తతస్తత్ర వీణావంశాది సువ్రత! పణవాః పుష్కరాశ్చైవ మృదంగాః పటహాస్తథా

దేవ దుందుభయః శంఖః శతశోఽథ సహస్రశః గాయద్భీశ్చైవ గంధర్వై రృత్యదిశ్చాప్సరో గణైః

తూర్యవాదిత్ర ఘోషైశ్చ సర్వం కోలాహలీకృతమ్ తతః కృతైః కరపుటైః పద్మకుట్మల సన్నిభైః

లలాటోపరి విన్యస్తైః ప్రణేముః సర్వదేవతాః తతః కోలాహలే తస్మిన్సర్వదేవ సమాగమే తేజసః శాతనం చక్రే విశ్వకర్మా శనైః శనైః

ఇతిహిమజల ధర్మకాల హేతోర్హర కమలాసన విష్ణు సంస్తుతస్య

తదుపరి లిఖనం నీశమ్యభానోర్ర్వజతి దివాకర లోకమాయుషోఽతే

ఇతి శ్రీ భవిష్యే మహా పురాణే బ్రా హ్మేపర్వణి సప్తమీ కల్పే

విశ్వకర్మ కృతసూర్యతేజః శాతనం నోమైక వింశోత్తర శతతమోఽధ్యాయః

            తా॥ అప్పుడు సర్వదేవ సమూహములకును వీనుల విందుగ, మనస్సుల కొహ్లాదకరముగ నవ్యక్త మధుర గానము వెల్లివిరిసెను. వీణలు, వేణువులు, ఉడుక వాద్యములు, మద్దెలలు, మృదంగములు, తప్పెటలు. దేవ దుందుభులు, శంఖములు మొదలగు వాద్యములు వందలుగ, వేలుగ మ్రోగింపబడెను. గానము చేయుచున్న గంధర్వుల చేతను, నాట్యములాడుచున్న అప్సరోగణములచేతను. తతానదసుషిరఘనములనెడి వాద్యముల మ్రోతలచేతను అచటి వాతావరణమంతయు కోలాహలముగ చేయబడెను. ఆ సమయమున దేవతలందఱును తమ చేతుల నరవిరిసిన తామర మొగ్గలవలె ముగిడ్చి. తమ తమ ఫాలభాగములందుంచి సూర్యభగవానునకు నమస్కరించిరి. దేవతలందఱును సమావేశమైన యాకోలాహలమునందు. విశ్వకర్మ మెలమెల్లగా సూర్యతేజమునకు మెఱుగు పెట్టెను.హిమమునకు, జలమునకు, ధర్మమునకు, కాలమునకు కారణమైనవాడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులచే స్తుతింపబడినవాడు నైన భానుదేవుని తేజశ్శాతనము నిట్లు వినినవాడు ఆయుష్యము తీరిప పిదప సూర్యలోకమునకుఁబోవును.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు విశ్వకర్మ కృత సూర్య తేజశ్శాతనమను నూట యిరువది యొకటవ అధ్యాయము సమాప్తము.