భవిష్య మహా పురాణము
120. సప్తమీ కల్పమున ఆదిత్య పూజా వర్ణనము
మూ॥ విష్ణురువాచ :
భగవాన్ప్రాణినః సర్వే విషరోగాద్యుపద్రవైః దుష్టగ్రహోపఘాతైశ్చ సర్వకాలముపద్రుతా:
ఆభిచారిక కృత్యాభిః స్పర్శరోగైశ్చదారుణైః సదాసంపీడ్యమానాస్తు తిష్ఠంత్యంబుజసంభవ!
యేన కర్మవిపాకేన విషరోగాద్యుపద్రువాః ప్రభవంతి నృణాం తన్మేయథావద్వక్తుమర్హసి
బ్రహ్మోవాచ :
వ్రతోప వాసైర్యైర్భానుర్నాన్య జన్మని తోషితః తేనరా దేవశార్దూల! గ్రహరోగాది భాగినః
యైర్నతత్ప్రవణం చిత్తం సర్వదైవ నరైః కృతమ్ విషగ్రహ జ్వరాణాం తే మనుష్యాః కృష్ణ! భాగినః
ఆరోగ్యం పరమాం వృద్ధిం మనసాయద్యదిచ్ఛతి తత్తదాప్నోత్యసందిగ్ధం పరత్రాదిత్యతోషణాత్
నాధీన్ప్రాప్నోతి నవ్యాధీన్న విషగ్రహబంధనమ్ కృత్యాస్పర్శభయం వాపి తోషితే తిమిరాప హే
సర్వేదుష్టాః సమస్తస్య సౌమ్యాస్తస్య సదాగ్రహాః దేవానామపి పూజ్యోఽ సౌ తుష్టోయస్య దివాకరః
యః సమః సర్వభూతేషు యథాత్మని తధాహితే ఉపవాసాదినా యేన తోష్యతే తిమిరాపహః
తోషితేఽస్మిన్ప్రజానాథే నరాః పూర్ణమనోరథాః అరోగాః సుఖినో నిత్యం బహుధర్మసుఖాన్వితాః
న తేషాం శాత్రవోనైవ శరీరాద్యభిచారకమ్ గ్రహ రోగాదికం చాపి పాపకార్యుపజాయతే
అవ్యాహతాని దేవస్య ధన జాలాని తం నరమ్ రక్షంతి సకలా పత్సు యేన శ్వేతాధిపోఽర్చిత:
తా॥ విష్ణు భగవానుడిట్లనెను. “బ్రహ్మదేవా! ప్రాణులందఱును విషరోగములు, దుష్టగ్రహ పీడలు మున్నగునుపద్రవములచే నన్ని కాలముల యందును బాధపడుతున్నారు. అభిచార హోమాదులచే పంపబడిన దేవతల చేతను, క్రూరములైన అంటురోగముల చేతను ఎప్పుడును పీడింపబడుచుందురు. ఈ విషరోగాద్యుప్రదములు ఏకర్మపరిణామముగ మనుష్యులకు కలుగుచున్నవో యధార్థముగ నాకుఁతెలుపుడు”. అని విష్ణుదేవుడడిగిన సందేహములకు బ్రహ్మదేవుడిట్లు సమాధానము చెప్పెను. “దేవశార్దూలా! తమ పూర్వజన్మలో ప్రతోపవాసాదులచేత సూర్యభగవానుని సంతోషింపచేయని వారు గ్రహరోగాదుల పాలఁబడి బాధపడుచుందురు. కృష్ణా! ఎవరి చిత్తమెల్ల వేళల సూర్యుభగవానునాశ్రయించి యుండునట్లు చేయబడదో వారు విష, గ్రహ, జ్వరాదుల బారినఁ బడెదరు. సూర్యభగవానుని సంతోషింపఁజేయుటవలన నారోగ్యము, ఉత్తమమగునభివృద్ధి, ఇంకను, మనస్సున కోరినదెల్లయును లభించును. చీకట్లను పారద్రోలు సూర్యని తృప్తిపఱచినచో మనోవ్యధలు, శారీరక జాడ్యములు, చేతబడి శక్తులు, గ్రహముల తాకిడిమున్నగు భయములేవియునుండవు. దేవతలందఱికిని పూజ్యుడగుదివాకరుడెవని యెడ తుష్టిఁజేందియుండునో వానిని దుష్టగ్రహములుగానీ సమగ్రహములు గాని సౌమ్యగ్రహములు గాని ఎప్పుడును బాధింపవు. దుష్టగ్రహములు సమములగును, సౌమ్యములగును, తనను వలె యితరుని, సర్వభూతములను సమభావముతోఁజూచుచు నుపవాసాది వ్రతములచే సూర్యభగవానుని సంతుష్టిపఱచు వానినాదేవునుగ్రహించును. జగత్ర్పభువగు దివాకరుని ప్రసన్నునిఁజేసికొనువారు సఫల మనోరథులు, ఆరోగ్య వంతులు, సుఖజీవనులు, నిత్యమును వివిధ ధర్మముల మూలమునలభించు సౌఖ్యములు గలవారగుదురు. వారికి శత్రువులు గాని, అభిచార దోషములుగాని, గ్రహరోగాదిపీడలుగాని యుండనేరువు. పాపకారిత్వము కలుగదు. శ్వేతాధిపుడైన సూర్యభగవాను నర్చించువానిని, ఆ దేవ దేవుని సంపత్సమూహములు, సర్వకాలములందు, అన్నియాపదలందును రక్షించును”.
మూ. విష్ణురువాచ :
అనారాధిత మార్తాండా యేనరా: దుఃఖభాగినః తేకథం నీరుజః సంతు విజ్వరాగత కల్మషాః
బ్రహ్మోవాచ :
“ఆరాధయంతు దేవేశం పుష్పేణైవమనౌపమమ్ భాస్కరంతు జగన్నాథం సర్వదేవగురుం పరమ్”
విష్ణురువాచ :
దోషాభిభూత దేహైస్తు కథమారాధనం రవేః కర్తవ్యంవద దేవేశ! భక్త్యా శ్రేయోఽర్ధ మాత్మనః
అనుగ్రహ్యోస్మియదితే మమాయం భక్తిమానితి తన్మమోపదిశ త్వంచ మహదారాధనం రవేః
అనంతమజరం దేవం దుష్ట సందేహనాశనమ్ ఆరాధయితు మిచ్చామి భగవంస్త్వదనుజ్ఞయా యేవాహం త్వత్ప్రసాదేన భవేయమతి వీక్రమః
బ్రహ్మోవాచ :
అనుగ్రహ్యోఽసి దేవస్య నూన మవ్యక్త జన్మనః ఆరాధనాయతే విష్ణో! యదేతత్ప్రవణం మనః
యదిదేవపతిం భానుమారాధ యితు మిచ్ఛసి భగవంతమనాద్యంచ భవవైవస్వతోఽ చ్యుత
న హ్యవైవ స్వతైర్భానుర్జ్ఞాతుం స్తోతుంచ శక్యతే ద్రష్టుంవా శక్యతే మూడైః ప్రవేష్టుంకుత ఏవతు!
తద్భక్తి ప్రార్థితాః పూతా నరాస్తద్భక్తి చేతసః వైవస్వతా భవంత్యేవం వివస్వంతం విశంతిచ
అనేక జన్మసంసార చితే పాప సముచ్చయే నాక్షీణే జాయతే పుంసాం మార్తాండాభిముఖీ మతిః!
తా॥ విష్ణుదేవుడిట్లనెను. " సూర్యభగవానునారాధింపకుండుటచే దుఃఖముల పాలైన మానవులు రోగరహితులు, జ్వరరహితులు, పాపముక్తులునుకాగలుగుట యెట్లు?. బ్రహ్మదేవుడిట్లు చెప్పెను “దేవేశ్వరుడు, నిరుపముడు, జగన్నాథుడు, సర్వదేవతల గురువు, శ్రేష్టుడు నగు భాస్కరుని ఒక్క పుష్పముతోనైన వారు పూజింతురుగాక, దానితో వారు నీరుజులు, గత కల్మషులు నయ్యేదరు.”. మటల విష్ణుభగవానుడిట్లు ప్రశ్నించెను. “భగవాన్! దోషములచే తెగడబడిన దేహములు గల వారు సూర్యునెట్లారాధింపవలయును? అట్టివారి కర్తవ్యమేమి? నాశ్రేయస్సు కొఱకు దయయుంచి చేప్పుడు. నేననుగ్రహింపదగిన వాడనేని 'వీడు సూర్యభక్తిగలవాడ'ని యెంచి సూర్యభగవానుని మహదారాధనమును గుఱించి నాకుపదేశింపుడు. అనంతుడు, నిర్జరుడు, దుష్టసందేహనాశకుడునయిన సూర్యదేవుని ఆరాధించి నేను మీ దయవలన నమిత విక్రముడ నయ్యెదను”. బ్రహ్మదేవుడిట్లునుడివెను. 'విష్ణు దేవా! నీవనుగ్రహింపదగినవాడవే. అవ్యక్తజన్ముడైన యా సూర్యునారాధించుటకు నీ మనస్సు తహతహలాడుటయే దానికి కారణము. దేవపతి, భగవంతుడు, అనోద్యుడైన భానుదేవునారాధించుట కిచ్చయించినచో మొదట నీవు వైవస్వతుడవు (సూర్యభక్తుడవు) కావలెను. వైవస్వతులు కానివారు సూర్యభగవానుని తెలిసికొనుటకు గాని, స్తుతించుటకు గాని సమర్థులుకారు. మూడులైన వారికి సూర్యుని చూచుటకు కూడా సాధ్యము కాదనినచో నికనతని లోకమున ప్రవేశించుట మాట చెప్పనేల?. సూర్యభక్తి మనస్సున ప్రవేశించినవారు, తద్భక్తిచే పునీతులైన వారు, మనస్సునిండుగ సూర్యభక్తియే కలవాట్లు వైవస్వతులై వివస్వంతుని చేరుకొందురు. అనేక జన్మములందలి సంసార పరంపరల పాపసమూహములు నశించిపోగా పురుషులకప్పుడు సూర్యభగవానుని యెడ మనస్సుకలుగును.
ప్రద్వేషం యాతి మార్తాండే ద్విజాన్వేదాంశ్చ నిందతి యోనరస్తం విజానీయా దసురాంశ సముద్భవమ్
పాషండేషు రతిః పుంసాం హేతువాదానుకూలతా జాయతే దంభ మాయాంభః పతితానాం దురాత్మనామ్
యదా పాపక్షయః పుంసాం తదావేద ద్విజాతీషు భానౌచ యజ్ఞపురుషే శ్రద్దా భవతి నైష్ఠికీ
యదా స్వల్పావశేషష్తు నరాణాం పాపసంచయః తదా భోజక విప్రేషు భానౌ పూజాం ప్రభుర్వతే
భ్రమతా మత్ర సంసారే నరాణాం కర్మదుర్గమే కరావలంబినో హ్యేకో భక్తి ప్రీతో దీవాకరః
సత్వం వైవస్వతో భూత్వా సర్వపాపహరం హరిమ్ ఆరాధయ సమం భక్త్యా ప్రీతి మభ్యేతి భాస్కరః
విష్ణురువాచ :
“కిం లక్షణా భవంత్యేతే నరా వైవస్వతా గుణైః యచ్చవైవస్వతం కార్యం తన్మేకథయ కంజజ!”
బ్రహ్మోవాచ :
కర్మణా మనసా వాచా ప్రాణినాం యో సహింసకః భావ భక్తశ్చమార్తాండే కృష్ణ! వైవస్వతో హి సః
తా॥ ఏ మానవుడు సూర్యదేవుని యందు విద్వేషము పూనియుండునో, ఎవడు వేదములను బ్రాహ్మణులను నిందించునో అట్టివాడు రాక్షసాంశ సంభూతుడని తెలియవలేను. దురాత్ములకు, మాయాపంకజలమునఁబడినవారికి, దాంభికులకు, వేదబాహ్యులగు నాస్తికుల యందపేక్ష, హేతువాదానుకూలమైన మనఃప్రవృత్తియు కలుగును. పురుషులకు పాపము నశించినపుడు వేదములయందు, బ్రాహ్మణులయందు, యజ్ఞపురుషుడైన భానుదేవునియందును నిష్టాపూర్వకమైన శ్రద్దయేర్పడును. పాపసంచయమునకొంత శేషముండిన మనుష్యులు భోజక బ్రాహ్మణులను, సూర్యదేవుని పూజింతురు. కర్మలచే దుర్గమమైన సంసారము నందిటభ్రమించుచున్న మానవులకు, తమభక్తితో ప్రీతినందీన సూర్యభగవానుడే చేయూత నిచ్చి తరింపజేయును. నిజమైన వైవస్వతుడవై సర్వపాపహరుడగు సూర్యదేవునారాధింపుము ఆతడు ప్రీతినొందును”. బ్రహ్మదేవుని వాక్యములు విని విష్ణుభగవానుడిట్లనెను. “దేవా! గుణముల చేత వైవస్వతులను వారెట్టి లక్షణములను గలిగియుందురు? వైవస్వత కార్యమేమి? ఆ వివరము నాకు దెలుపుడు.” బ్రహ్మదేవుడిట్లు చెప్పఁదొడగెను. “మనోవాక్కాయములచే ప్రాణిహింస చేయనివాడు, సూర్యదేవుని యందు మనః పూర్వకమైన భక్తి గలవాడు వైవస్వతుం డనఁబడును.
యో భోజక ద్విజాన్దేవా న్నిత్యమేవ నమస్యతి నచ భోక్తా పురస్వాదేర్విష్ణో! వైవస్వతో హిసః
సర్వాన్దేవాన్రవిం వేత్తి సర్వాన్లో కాంశ్చ భాస్కరమ్ తేభ్యశ్చానన్యమాత్మానం కృష్ణ! వైవస్వతోహిసః
దేవం మనుష్యమన్యంవా పశుపక్షి పిపీలికమ్ తరుపాషాణ కాష్ఠాది భూమ్యంబోధిం దివంతథా
ఆత్మానంచాపి దేవేశాద్వ్యతిరిక్తం దివాకరాత్ యోనజానాతి తం విద్యాత్కృష్ణ! వైవస్వతం నరమ్
సర్వోవైవస్వతో భాగో యద్భూతం యద్వ్యవస్థితమ్ ఇతివై యో విజానాతి సతు వైవస్వతో నరః
భవ భీతిం హరత్యేష భక్తి భావేన భావితః వివస్వానితి భావోయః సతువైవస్వతో నరః
భావం న కురుతే యస్తు సర్వభూతేషు పాపకమ్ కర్మణా మనసావాచా సచ వైవస్వతో నరః
బాహ్యర్థ నిరపేక్షో యః క్రియాం భక్త్యా వివస్వతః భావేన నిష్పాదయతి జ్ఞేయో వైవస్వతో హిసః
నారయో యస్య న స్నిగ్ధా న భేదాధీన వృత్తయః వీక్షతే సర్వమేవేదం భానుం వైవస్వతో హిసః
సుతస్తేనేహ తపసా యజ్ఞైర్వా బహుదక్షిణైః తాం గతిం న నరాణాంతి యాంతు వైవస్వతో గతః
తా॥ భోజక ద్విజులకు నిత్యము నమస్కరించువాడు, పరద్రవ్యమును భుజింపనివాడు. దేవతలందఱిని సూర్యభగవానునిగ తెలియువాడు, సూర్యదేవుడే సర్వలోకములని యెఱుంగువాడు, తనను తాను వానికంటే నన్యుడుగ భావింపని వాడు వైవస్వతుడని తెలియవలెను. దేవతను, మనుష్యునీ, ఇతర ప్రాణిని, పశువులు, పక్షిని, చీమను, చెట్టును, జయిని, కఱ్ఱను, భూమిని, సముద్రమును, ఆకాశమును. తనను, దేవేశ్వరుడగు దివాకరుని కంటే భిన్నముగ భావింపని వానిని వైవస్వతుడని గుర్తింపవలెను. గతము, వర్తమానము, (భావి) అంతయును సూర్యభగవానుని యంశమని భావించునరుడు వైవస్వతుడు. భక్తి భావమున భావించినచో భానుదేవుడు భవ భయమును భంజించునను భావముగలవాడు వైవస్వతుడు. సర్వభూతము లందును త్రికరణ శుద్ధిగ, పాపభావమునుంచక సద్భావము కలిగియుండు వాడు వైవస్వతుడు. బాహ్యార్థములన పేక్షింపక భక్తితో సూర్యభగవానుని పూజాదిక్రియలను నిర్వర్తించువాడు వైవస్వతుడని చెప్పనగును. శత్రువులుగాని, స్నేహితులుగాని లేనివాడు, భేదవర్తనము లేకుండ సర్వమును సమబుద్ధితో సూర్యభగవానునిగ దర్శించువాడు వైవస్వతుడని తెలియనగును. బహుక్లేశములకోర్చి చేసిన గొప్పతపస్సుచే గాని, భూరి దక్షిణలతో సంపన్నము చేసిన యజ్ఞములచే గాని, వైవస్వతునకు. లభించునుత్తమగతి లభింపదు
మూ॥ యేన సర్వాత్మనా భానౌ భక్త్యా భావో నివేశిత: దేవశ్రేష్ఠ! కృతార్థత్వాచ్చ్లాఘ్యో వైవస్వతో హిసః
ఆపినః సకులే ధన్యో జాయతే కులపావనః భాస్కరం భక్తిభావేన యస్తువై పూజయిష్యతి
యః కారయతి దేవార్చాం హృదయాలంబినీం రవేః స నరోఽర్క మవాప్నోతి ధర్మధ్వజమనౌపమమ్
యశ్చదేవాలయం భక్త్యా భానో: కారయతే స్థిరమ్ స సప్త పురుషాన్లోకాన్భానోర్నయతి మానవః
యావంతోబ్ధాన్హి దేవార్చారవేస్తిష్ఠతి మందిరే తావద్వర్ష సహస్రాణి పుష్పోత్తర గృహే వసేత్
దేవార్చాలక్షణో పేతా యద్గృహే సంతతో విధిః నిష్కామంచ మనో యస్య న యాత్యక్షర సామ్యతామ్
పుష్పాణ్యతి సుగంధీని మనోజ్ఞానిచ యఃపుమాన్ ప్రయచ్ఛతి జగన్నాథే సప్తాశ్వే జ్యోతిషాం పతౌ స యాతి పరమం స్థానం యత్రజ్యోతిః సనాతనమ్
యస్య యస్య విహీనో యో దేశో యద్వర్జితం చ యత్ ధూపాంశ్చ వివిధాంస్తాంస్తాన్గంధాఢ్యం సువిలేపనమ్
దీప వర్త్యుప హారాంశ్చ యచ్చాభీష్టమథాత్మనః నరఃసోనుదినం యజ్ఞాన్కరోత్యారాధనాద్రవేః
యజ్ఞేశో భగవాన్భానుర్మఖైరపి నతోష్యతే బహూపకరణా యజ్ఞా నానా సంభార విస్తరా సంప్రాప్యంతే ధనయుతైర్మను ష్యైర్నాల్పసంచః
తా॥ సర్వాత్మనా భానుదేవుని యందే తన భక్తి భావమునుంచువాడు కృతార్థుడు. అందుచే శ్లాఘింపదగినవాడు. అట్టివాడే వైవస్వతుడు. భాస్కరుని భక్తి భావముతో పూజించువాడు కులమునందు, తాను ధన్యుడగుటయేగాక కులమునం తను పావనమొనర్చును. మనః పూర్వకముగ సూర్యదేవుని పూజచేయించువాడు లోక ధారణకై నిరంతరము సంచరించుచుండు సూర్యభగవానుని యనుపమస్థానమున జేరును. భానుదేవునకు స్థిరమైన దేవాలయమును నిర్మింపజేయు మానవుడేడుతరముల పురుషులను సూర్యలోకమునకుఁజేర్చును. సూర్యదేవాలయముననెన్ని సంవత్సరముల వఱకు సూర్యపూజ జరుగుచుండునో అన్నివేల సంవత్సరములు సూర్యలోకమున నివసించును. ఎవని యింట లక్షణ యుక్తమైన దేవతార్చన సంతత విధిగనుండునో, ఎవని మనస్సు నిష్కామముగనుండునో వాడు బ్రహ్మసమానుడగును. సుందరములు, మిక్కిలి పరిమళము గలవియైన పుష్పములను సప్తాశ్యుడు జగన్నాథుడైన సూర్యభగవానునకు సమర్పించువాడు సనాతన జ్యోతిఃస్థానమగు శ్రేష్ఠమగు సూర్యలోకమునకుఁబోవును. ఏయే దేశమున నేయవి తఱచుగ లభింపవో అట్టి వివిధములైన ధూపములను, పరిమళభరిత ములైన విలేపన ద్రవ్యములను . దీపములను తన కిష్టములైన యుపహారములను సమర్పించుచు ప్రతిదినము సూర్యభగవానుని పూజారూపమునయజించుచుండు మానవుని యెడ. ప్రీతిఁజెందునట్లు యజ్ఞేశ్వరుడైన ఆ దేవ దేవుడు యజ్ఞయాగాదులతో గూడ సంతోషింపడు యజ్ఞములకనేకములగు నుపకరణములు కావలెను. నానా సంభారములు కావలెను. మిక్కిలి ధనవంతులైనవారికి మాత్రమే యవి చేయుటకు సాధ్యమగును.
మూ॥ భక్త్యాతు పురు షైః పూజా కృతా దూర్వాంకురైరపి రవేర్దదాతిహి ఫలం సర్వయజ్ఞైః సుదుర్లభమ్
యాని పుష్పాణి హృద్యాని ధూప గంధానులేపనమ్ దయితం భూషణం యచ్చ తధా రక్తేచవాససీ
ఆద్యం తం యజ్ఞపురుషం యథాభక్త్యా ప్రసాదయ ఆరాధ్యయాతి తందేవం యత్తద్ర్బహ్మపరం స్మృతమ్
పుణైస్తీర్దోదకైః పుష్పైర్మధునా సర్పిషా తథా క్షీరేణ స్నాపయేద్దేవమచ్యుతం జగతాంపతిమ్
దధిక్షీర హ్రదాన్పుణ్యాంస్తతో లోకాన్మధు చ్యుతః ప్రయాస్యసి యదుశ్రేష్ఠ! నిర్వృతించాపి ఐశ్వరీమ్
స్తోత్రైర్హృద్యైర్యథా వాద్యైర్బాహ్మణానాంచ తర్పణె: మనసశ్చైకతా యోగాదారాధయ దివాకరమ్
ఆరాధ్యతం మహాదేవో మహచ్ఛబ్దమవాప్తవాన్
అహంచాపి సమస్తానాం లోకానాం సృష్టికారకః తమారాధ్య వివస్వంతం తత్ప్రసాదాజ్జనార్దన!
త్వమప్యేతం హృషీకేశ! తత్ప్రసాదాన్న సంశయః సమర్థో దేవ శత్రూణాం దైత్యానాం నాశనే సదా
తా॥ భక్తిగలిగి గడ్డి పరకలతో పూజించినను భానుదేవుడు సర్వయజ్ఞములచే కూడ లభింపజాలని ఉత్తమ ఫలమునిచ్చును. అందమైన పూవులు, ధూపము, గంధానులేపనములు, ఆదేవునకిష్టమైన యాభరణములు, ఎఱ్ఱని వస్త్రముల జత. వివిధములగు నాహారపదార్థములు, భక్ష్యములు, ఫలములు సూర్యదేవునకు సమర్పింపుము. అతనినే మనస్సున భావింపుము. ఆద్యుడు, యజ్ఞపురుషుడునైన ఆ దేవుని భక్తితో ప్రసన్నుని చేసికొనుము. అతనినారాధించినవాడు పరబ్రహ్మమును పొందునని చెప్పబడినది. పుణ్యతీర్థములందలి జలముల చేతను, పుష్పములచేతను, తేనె, నేయి, పాలుమున్నగువాని చేతను జగత్పతియైన. సూర్యభగవానునకభిషేకము చేయవలెను. విష్ణుదేవా! సూర్యభగవానునకట్లు స్నానము చేయించినచో దధి క్షీరహద్రములు, గల పుణ్యలోకములను, ఐశ్వర్య సుఖమునా మధుచ్యుతుడిచ్చును. హృద్యములైన స్తోత్రములచేతను, నృత్యగీతవాద్యములచేతను, బ్రాహ్మణ సంతర్పణములచేతను సూర్యదేవునేకాగ్రచిత్తముతో నారాధింపుము. అతనినారాధించియే మహాదేవుడు మహచ్చబ్దమును పొందెను. ఆ వివస్వంతునారాధించియే-అతని యనుగ్రహముతో నేను సమస్త లోకములకు సృష్టికర్తనైతిని, ఓ హృషీకేశా! నీవు కూడ ఆ దేవదేవునారాధింపుము, అతని యనుగ్రహముతో. నిస్సంశయముగ దేవతలకు శత్రువులగు రాక్షసులను నాశనము చేయుటయందు సమర్థుడవయ్యెదవు.
మూ॥ దక్షిణః కిరణస్తస్వ యోదేవస్య వివస్వతః అహం తస్మాత్సముత్పన్నో వేదవేదాంగ సమ్మితః
వామో యః కిరణః కృష్ణ! రశ్మిమాలాకులః సదా తస్మాదీశః సముత్పన్నః పార్వతీదయితోఽచ్యుత!
వక్షసస్త్వం సముత్పన్నః శంఖచక్రగదాధరః తథాంబుజ కరాదేవీ అంబుజానన వల్లభా
తమారాధ్య బలం కీర్తిం శ్రియం చావాప్తవానహమ్ తథాత్వమపి రాజేంద్ర! తమారాధ్య దివాకరమ్ యాన్యానిచ్ఛసి కామాంస్త్వం తాంస్తాన్సర్వానవాప్స్యసి
య ఇదం శ్రుణుయాన్నిత్యం సంవాదం విధీకృష్ణయోః సోఽపి కామానవాప్యాగ్ర్యాంస్తతో లోకమవాప్నుయాత్
గైరికం యాన మారూఢో యుక్తం కుంజర వాజిభిః తేజసాంబుజ సంకాశః ప్రభయాండజ సన్నిభః
కాంత్యాచంద్రసమో రాజనందారక గుజైర్యుతః గంధర్వైర్గీయమానస్తు తథా చాప్సరసాం గజైః
ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే బ్రా హ్మేపర్వణి సప్తమీ కల్పే ఆదిత్య పూజా
వర్ణనం నామ వింశోత్తర శతతమోధ్యాయః
తా॥ దేవదేవుడగు వివస్వంతుని కుడివైపున గల కిరణమునుండి వేదవేదాంగ స్వరూపడనగు నేను జన్మించితిని. ఆతని యెడమ భాగమునందలి వెలుగుల సమూహములతో నిండిన కిరణము నుండి పార్వతీ వల్లభుడగు శంకరుడుదయించెను. ఆ దేవుని వక్షః స్థలము నుండి శంఖచక్ర గదా ధరుడవైన నీవు, పద్మహస్తయయిన లక్ష్మీదేవియును జన్మించితిరి. ఆ సూర్యదేవునారాధించియే నేను బలమును, కీర్తిని, సంపదను పొందగలిగితిని. రాజా! నీవుకూడ ఆ దివాకరు నారాధించి కోరిన కోరికలన్నియు పొందగలవు-. ఈ బ్రహ్మ విష్ణు సంవాదరూపమైన సూర్యప్రశంస వినినవాడు కూడ సఫల మనోరథుడై యాపిమ్మట సూర్యలోకమును జేరును. తేజస్సుచేత పద్మసన్నిభుడై, ప్రభచేత సూర్యసంకాశుడై కాంతిచేత చంద్రసమానుడై, దేవతల స్వభావము గలవాడై, గంధర్వులగానముతో, అప్సరస్సమూహములనాట్యములతో, ఏనుగులు గుఱ్ఱములు కట్టబడిన బంగారపురథము నధిరోహించి సూర్యలోకమును జేరుకొనును.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు ఆదిత్యపూజా వర్ణనమను నూట యిరువదియవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 120 of the Bhavishya Mahā Purana is as follows:
The fruits associated with each specific type of offering made in Sūrya pūjā are catalogued in exhaustive detail. Red lotus flowers grant sovereignty; red hibiscus grants health; jasmine grants beauty; champaka grants fame; bilva leaves grant liberation; tulasī grants mokṣa and is the most beloved of all plant offerings to Sūrya. Sandalwood paste grants coolness and peace; saffron grants prosperity; fragrant incense (aguru, guggulu) grants the removal of negative forces. Each food offering has its fruit: rice with ghee grants longevity; sesame grants freedom from ancestral curse; jaggery grants sweetness of speech and relationship. The chapter constitutes a complete reference guide for the devotee seeking to customise Sūrya pūjā toward a specific intention.