116. సత్రాజితోపాఖ్యానమున రవి పూజా విధి వర్ణనము

బ్రహ్మోవాచ :

మూ ॥ “కృష్ణ! రాజా మహానా సీద్యయాతి కుల సంభవః సాత్రా జిదితి విఖ్యాత శ్చక్రవర్తి మహాబలః

ప్రభావై స్తేజసా కాంత్యా క్షాంత్యా బలసమన్వితః ధైర్య గాంభీర్య సంపన్నో వదాన్యో యశసాన్వితః

బుద్ధ్యా విక్రమ దక్షశ్చ సంపన్నో బ్రాహ్మణాయతః కృతీ కవిస్తథా శూరః షట్పదాఖ్యైర్న నిర్జితః

సదా పంచసు రక్తశ్చ వసుమద్భిర్న నిర్జితః రుద్రతా వసుభిర్జాతైః సత్త్వా శ్రద్ధా సమన్వితః

అంబుజ స్యాండజ స్యేవ ఆత్రేయస్య తథాచ్యుత! అంబుజా యాస్తథా కృష్ణ! వార్యపాత్రం సవైవిభో!

గాంగేయేన బలే తుల్యః పౌలస్త్యారాశ్రమో యథా గాంగేయస్య తథా కృష్ణ! ధిషణస్య హరేర్యథా

కామ్యశ్చ ద్విజ భక్తస్తు తథా వాల్మీకి వత్సదా వ్యాసస్య దేవ శార్దూల! జామదగ్న్యస్య వావిభో

ఏషాంనై కై ర్గుణేర్యుక్తః స రాజా క్ష్మా తలే విభో! శశాస స మహాబాహుః సప్తద్వీపాం వసుంధరామ్

యస్మిన్గాథాం  ప్రగాయంతి యే పురాణ విదో జనాః సత్రాజితే మహాబాహౌ కృష్ణ! ధాత్రీం సమాశ్రితే

యావత్సూర్య ఉదేతిస్మక్షయావచ్చ ప్రతితిష్ఠతి సాత్రాజితంతు తత్సర్వం క్షేత్రమిత్యభిధీయతే

తా॥ కృష్ణా! పూర్వకాలమున “సత్రాజిత్తను' పేరుగల, యయాతి కుల సంభవుడైన చక్రవర్తి యుండెను. అతడు మహాబలవంతుడు. ప్రభావములచేత, తేజస్సుచేత, కాంతిచేత, క్షమచేత శక్తి సంపన్నుడైన ఆ మహారాజు ధైర్య గాంభీర్య సంపన్నుడై మిక్కిలి యివిగలవాడై యశస్సంపన్నుడై విరాజిల్లుచుండెను. బుద్ధిచే పరాక్రమించుటలో సమర్థుడై, సంపదగలవాడై, బ్రాహ్మణుల నాదరించువాడై, నేర్పరియై, పండితుడై, శూరుడై యుండెను. కామ క్రోధాదులకు వశుడుకాక. ఎల్లవేళల ప్రాణులయందు ప్రేమ గలిగి యుండెను. ధనవంతులచే జయింపబడకుండెను. అయినను భోగసమూహముల యెడ విముఖుడై సాత్త్విక శ్రద్దా యుక్తుడై యుండెను. చంద్రసూర్యుల యొక్క, దత్తాత్రేయుని యొక్క, లక్ష్మీదేవి యొక్కయు ఆశీరభిమానములకు పాత్రుడై యుండెను. అతడు బలముచే కార్తికేయునితో సమానుడై, కుబేరునింబోలిన పూజాతపములు గలవాడై ప్రకాశించుచుండెను. కుమారస్వామి, బృహస్పతి, విష్ణువు. వాల్మీకి, వ్యాసుడు, జామదగ్ని. వీరిలోని యనేక గుణములతో నొప్పుచు సుందరాకారుడై, బ్రాహ్మణభక్తి కలిగి సత్రాజిత్తు భూమండలమును పరిపాలించుచుండెను. సప్తద్వీపమైన వసుంధర యెల్ల నా మహాబాహుని చేయుచుండిరి. ఎచ్చట సూర్యుడుదయించి, విహరించి ఎచట నస్తమించునో ఆ భూభాగమంతయు, సాత్రజితక్షేత్రమని పిలువబడుచుండెను.

మూ॥ స సర్వరత్న సంయుక్తాం సప్తద్వీపవతీం మహీయ్ శశాస ధర్మేణ పురా చక్రవర్తీ మహాబలః

నాన్యాయ కృన్నచాశక్తో వదాన్యో బలవత్తరః తస్యాభూత్పురుషా రాజ్ఞః సమ్యగ్ధర్మానుశాసినః

చత్వారః సచివాస్తస్య రాజ్ఞః సత్రాజితస్యతు బభూపు రప్రతి హతాః సదావతి బలస్యవై

తస్య భక్తి రతీ వాసిన్నిసర్గాదేవభూపతేః దివాకరే జగద్భానౌ రక్తచందనమాలిని

తస్యోర్ధ్వ మహిమానంచ విలోక్య పృథివీపతేః న కేవలం జనస్యాపి హ్యభవత్తస్య విస్మయః "

సంచింతయా మాస నృపః సమృద్ధ్యా విస్మిత స్తథా 'కథం స్యాత్సంపదేషామే పునరప్యస్య జన్మని

 ఏవంస బహుశో రాజా తదా కృష్ణ! మహాయశాః చింతయన్నపి తన్మూలం నాసదన్నిశ్చయాన్వితః

యదా న నిశ్చయం రాజా స యయౌ భార్గవీప్రియః తదా పప్రచ్ఛ ధర్మజ్ఞా న్నవిప్రాన్సముపాగతాన్

సర్వాంశ్చస సుఖాన్వీర! వివిక్తాంతః పురస్థితః ప్రణిపత్య మహాబాహుర్గ్రహీతుం శాసనక్రియాః

విశ్వాసానుగ్రహా బుద్ధి ర్భవతాం మయి సత్తమాః త దహం ప్రష్టుమిచ్ఛామి కించిత్తద్వత్తుమర్హథ

తా॥ మహాబలుడైన ఆ చక్రవర్తి సర్వరత్న సంయుక్తము సప్తద్వీపవతియునైన భూమండలమును ధర్మబద్దముగ పరిపాలించెను. అన్యాయము చేయనివాడు, అశక్తుడు కానివాడు, వదాన్యుడు, బలవత్తరుడు, ధర్మశాసకుడైన సత్రాజిత్తు మహారాజునకు. నలుగురు మంత్రులుండిరి. అతిబలుడైన యా చక్రవర్తికా నలుగురు మంత్రుల ప్రతిహతులై యుండిరి. రక్తచందనము , వంటి కిరణములతో జగత్తును ప్రకాశింపఁజేయు సూర్యభగవానుని యందా భూపతికి సహజముగానే మీక్కుటమగు భక్తి యుండెను -14. అతని మహిమౌన్నత్యములను జూచి కేవలము ప్రజలకే గాక స్వయముగ నతనికే విస్మయము కలుగుచుండెను. తన యభివృద్ధికి తానే ఆశ్చర్యపడి ఒక సమయముననాత డిల్లాలోచింపసాగెను “మఱల రాబోవు జన్మలో కూడా నా కిట్టి యైశ్వర్యము, సంపద ఎట్లు లభింపగలవో కదా” (!లభించియున్న బాగుగనుండును కదా!). అని యిట్లనేక విధములుగ చింతించినను మహాయశుడైన సత్రాజిత్తునకు దానిమూలమంతుబట్టదయ్యేను. ఏదియు పాలుపోక ధర్మతత్వజ్ఞులైన బ్రాహ్మణులను రావించి. పొరలనందఅనేకాంతప్రదేశమున నంతఃపురమున సుఖాసీనులనుజేసి నమస్కరించి, వారి యాదేశములను పాటించుటకు సిద్ధపడి యిట్లు ప్రశ్నించెను. విద్వాంసులారా! నా యందు విశ్వాసమును అనుగ్రహ బుద్ధిని కలిగి నేనడుగబోవు చిన్న సందేహమును దీర్చి నన్ను కృతార్థునిఁజేయుడు.

మూII సద్విద్యాఖిల విజ్ఞాన సమ్యగ్ధౌతాంత రాత్మభిః భవద్భిర్యద్యను గ్రాహ్యః స్యామహం వేదవిత్తమాః!

తద్యధావన్మయా పృష్ణా భవన్తో మత్ప్రసాదినః వక్తుమర్హథ విద్వాంసః సర్య స్వైవోపకారిణః

బ్రాహ్మణాఊచుః

యస్తే మనసి సందేహస్తం పృచ్ఛాద్య మహీపతే! వదిష్యామో యథాన్యాయం యత్తేమనసివర్తతే

వయం హి నృపశార్దూల! భవతా పరితోషితాః సమ్యక్ర్పజాం పాలయిత్రా దదతా భోజనం సదా

సంతుష్టో బ్రాహ్మణోఽశ్నీయాచ్ఛిద్యాద్వా ధర్మసంశయమ్ హితం చోపదిశేద్వర్త్మ అహితాద్వానివర్తయేత్

వివక్షుమథ భూపాలం భార్యా తస్యైవ ధీమతః ప్రణిపాతేన చాహేదం విన యాత్ప్రణయాన్వితమ్

 “న స్త్రీణా మవనీపాల! వక్తు మీదృగి హేష్యతే తథాపి భూపతే! వక్ష్యే సంసద్దృక్సుదుర్లభా

 భూయోపి సంశయా న్ప్రష్టుమలమిశో భవానృషీన్ నన్వహం పురుష వ్యాఘ్ర! సదాంతః పురచారిణీ

తత్ప్రసాదం యదిభవా న్కరోతి మమ పార్థివ! తన్మదీయ మృషీ న్ప్రష్టుం సందేహం పార్థివార్హసి”

సత్రాజిత ఉవాచ :

"బ్రూహి సుభ్రూర్మతం యత్తే ప్రష్టవ్యా యన్మయాద్విజాః భూయోఽహమాత్మసందేహం ప్రక్ష్యామ్యేతద్ద్విజోత్తమాన్”

తా॥ “ఓ వేదవిత్తములారా! సద్విద్యతోను, అశేష విజ్ఞానముతోను పవిత్రములైన అంతరాత్మలుగల మీచేత నేననుగ్రహిం దగిన వాడనగుదును గాక. విద్వాంసులారా! మీరందఱకును ఉపకారము చేయువారు. నేనే విషయమునడిగెదనో నన్ననుగ్రహించి యా విషయమును గూర్చి చెప్పుడు”. అని సత్రాజిత్తు వినయముగఁబలుకగనే బ్రాహ్మణులిట్లనిరి. “రాజా! నీ మనస్సున గల సందేహమును గూర్చి యడుగుము. నీ మనోగతమైన సందేహమునకు యథా న్యాయముగ సమాధానమును చెప్పెదము. చక్కగా ప్రజలను పరిపాలించువాడవు, అన్నదాతవు, అయిన నీచే మేము సంతుష్టులమై యున్నాము . సంతుష్టుడగు బ్రాహ్మణుడు చక్కగా భుజింపవలెను. థర్మసంశయములను దీర్పవలెను. ఇది బ్రాహ్మణుని కర్తవ్యము” . అని యిట్లు బ్రాహ్మణులు చెప్పబోవు చుండగనే ధీమంతుడగు నా రాజు భార్య యచటి కే తెంచి వారికి నమస్కరించి, (బ్రాహ్మణుల యెడ) వినయముగను, తన భర్త యేడ) ప్రేమగను ఇట్లనెను . “స్త్రీలీ విధముగ మాట్లాడుట తగదు. అయినను సాహసించి యీ సభలో నేనుమాటాడుచుంటిని. రాజా! మీరు మీసంశయముల నెప్పుడైన నీ ఋషుల నడిగి తెలిసికొనవచ్చును. మేమెప్పుడు నంతః పురమున నుండువారము గదా! 128. కావున నోప్రభూ! నన్ననుగ్రహింతురేని నా సందేహమునీ ఋషుల నడుగుటకనుమతింపుడు”. సత్రాజితుడు తన పట్టపురాణి మాటలు విని యిట్లనెను. “సుందరీ! ఈ భూసురవరులను నేనడుగదగిన నీ సందేహమును గూర్చి తెలుపుము, పిమ్మట నా సంశయమును గూర్చి వీరల ప్రశ్నింతును.

మూ॥ విమల వత్యువాచ :

"శ్రూయంతే పృదివీపాల! నృపా యేతు చిరంతనాః యేషాంచ సంపద్భూపాల! యథా తేద్యకిభవత్

 తదీదృక్సంపదోధామ తవాశేషం క్షితీశ్వర! యేన కర్మవిపాకేన తద్వదంతు మహర్షయః

అహంచ భవతో భార్యా సర్వసీమంతినీ వరా అతీవ కర్మణా యేన తద్విజ్ఞానే కుతూహలమ్

తథా సంపత్సమృద్ధత్వ మన్యేష్వపి హి విద్యతే నిరస్తా తి శయత్వేన నూనం నాల్పేన కర్మణా

తదస్య జన్మ చరితం నరనాథ! నిజం భవాన్ మునీన్ప్రచ్ఛ త్వయా చాహం యన్మయాచ పురాకృతమ్

బ్రహ్మోవాచ :

స తథోక్తస్తయా రాజా పత్న్వా విస్మిత మానసః మునీనాం పురతో భార్యాం ప్రశంసన్వాక్యమబ్రవీత్

 సాధు దేవి! మతం యన్మేత్వయా యదిదూరితమ్ సత్యం ముని వచః పుంసాం స్వార్థం వై గృహిణి తథా

సోఽహ మేతన్మహాభాగే! పృచ్ఛామ్యే తాన్మహామునీన్ తేషా మవిదితం కించిత్త్రి లోకేషు న విద్యతే

ఏవ ముక్త్వా ప్రియాం రాజా ప్రణిపత్య చ తానృషీన్ యథా వదేత దఖిలం పప్రచ్ఛ ధరణీ ధరః

రాజోవాచ :

భగవంతో మమాశేషం ప్రసాదాదృత చేతసః కథయంతు యథావృత్తం యన్మయా సుకృతం కృతమ్

తా॥ విమలవతి యిట్లనెను. “పూర్వకాలపు రాజులను గూర్చి వినుచుందుము. భూపాలా! వారికి కూడా మికీ నాడు లభించిన సంపద వంటి సంపదయే లభించి యుండెనట!. కానీ యంతకంటెను మికిట్టి యశేష సంపదలు కలుగుట యే కర్మవిపాకము చేతనో యీ మహరులు వివరింతురుగాక. నేను స్త్రీలలో కెల్ల నుత్తమురాలినై మీకు రాజైనగు భాగ్యమును పొందగలిగితిని. దీనికేగొప్ప కర్మకారణమో తెలిసికొనవలెనని నాకు మిక్కిలి కుతూహలము కలుగుచున్నది. ఇట్టి సంపత్సమృద్ధి యితరులు కొందఱ యెడ కూడా కాననగుచున్నది. అది యనల్పమగు కర్మాతిశయత్వము చేతనే యగుట నిశ్చయము. కాబట్టి యితరులు జన్మచరిత్రము, మీ స్వీయ జన్మముల చరిత్రమును గుఱించి మునుల నడిగి తెలిసికొనుడు. అట్టి మీ ప్రశ్నలచే నేనును నాపురాకృత సుకృత మెర్షియో తెలిసికొనగలుగుదును”. బ్రహ్మదేవుడిట్లు పలికెను. “విష్ణుదేవా! తన భార్యయగు విమల 'వతి మాటలు విని సత్రాజిత్తు విస్మిత మానసుడై మునుల ముందు తన భార్యను ప్రశంసించుచు నామెతో నిట్లనెను. “దేవీ! లెస్సబలికితీవి. నా హృదయాంతర్గమైన సంశయమునేనీవు భగ్యంతరముగ ప్రకటించితివి. పురుషులకు 'గృహిణి' యనునది 'తనలోని అర్ధభాగ'మను మహరుల మాట సత్యము కదా!. మహాభాగా! నీలోని యర్ధభాగమునైన నేను ఇదే విషయమును గూర్చి యీ మునీశ్వరులను ప్రశ్నించును. వారికి తెలియనిదీ ముల్లోకములలో నేదియులేదు”. భార్యతో నిట్లు నుడివి సత్రాజిత్తు ఋషుల వంక తిరిగి వారికి నమస్కరించి తమ సంశయ స్వరూపమునంతయును వారి ముందు నివేదించెను. రాజిట్లు నుడినెను. “మహరులారా! కరుణాహృదయులై విషయము నంతయు నున్నది యున్నట్లుగఁ జెప్పుడు. నేనెట్టి సుకృతమొసరించితినో తెలుపుడు.

 మూII కోఽహమాసం పురా విప్రాః! కింస్విత్కర్మమయాకృతమ్ కిం వా నయా తు చార్వంగ్యా మమపత్న్యా కృతం ద్విజా!

యేనావయోరియం లక్ష్మీర్మర్త్యలోకే సుదుర్లభా చత్వారశ్చాప్రతిహతా అమాత్యా మమ గచ్ఛతః

అశేషా భూభృతో వశ్యా ధనస్యాంతో న విద్యతే బలం చైవా ప్రతిహతం శరీరారోగ్యమేవచ

ప్రతిభాతిచ మేకాంత్యా భార్యాయా మఖిలం జగత్ మహాపి వపుషస్తేజో న కశ్చిత్సహతే ద్విజాః

 సోఽహ మిచ్ఛామి తజ్జ్ఞాతుం తథైవేయ మనిందితా నిజానుష్టాన మఖిలం యస్యాశేషమిదం ఫలమ్”

 బ్రహ్మోవాచ :

ఇతి పృష్టా నరేంద్రేణ సమస్తాప్తే తపోధనాః పరావసు మథోచుస్తే కథ్యతా మస్య భూ భృతః

చోదితః సోఽపి ధర్మజ్ఞైర్మహా శూరో మహామతిః యోగమాస్థాయ సుచిరం యథావద్యతమానసః

జ్ఞాత వాన్నృపతేస్తస్య పూర్వదేహ విచేష్టితమ్ స తమాహ మునిర్భూవం విజ్ఞానేచ్ఛం మహామతిమ్

సత్రాజితం మహాత్మానం జితశత్రుం మనస్వినమ్ సపత్నీకం మహాబుద్ధిం బ్రాహ్మణాన్సత్యవాదినః

పరావసురువాచ :

‘శృణు భూపాల సకలం య స్యేదం కర్మణఃఫలమ్ తవ రాజ్యాదికం సుభ్రూర్యేయం చాసీన్మహీపతే!

తా॥ 'బ్రాహ్మణోత్తములారా! నేను పూర్వజన్మలో నెవరినై యుంటిని? ఎట్టి కర్మనొనరించియుంటిని? నా భార్యయగు నీ సౌందర్యవతి చేసిన పుణ్యమేమి?. మర్త్యలోకమునందు మాకీ దుర్లభమైన సిరిసంపదలు కలుగుటకు మేము చేసిన సత్కర్మలెవ్వి? అప్రతిహతులైన నలుగురు మంత్రులు నాకెట్లు లభించిరి? రాజులందఱు వశులై యుండుట, తరగనిసంపద, అప్రతిహతమగు సైన్యము, శరీరారోగ్యము  ఇవియన్నియు నాకెట్లు సమకూరినవి? సర్వ ప్రపంచమును కాంతిచే ప్రకాశించు నా భార్యయందే యున్నట్లు నాకు భాసించుచున్నది. నా శరీరకాంతియు నెవ్వడును సహింపని రీతిన నున్నది. అట్టినేను, అనిందితయగు నా భార్యయు దీనికి కారణము నెఱుంగ కోరుచున్నాము. ఏ యనుష్టాన ఫల స్వరూపముగ నీ యశేషమగు సురూ పైశ్వర్యతేజో బలాది సంపదలు మాకు సంఘటించినవో దానినంతయును తెలియగోరుచున్నాను”. బ్రహ్మదేవుడిట్లు చెప్పదొడగెను. “సత్రాజిత్తు జిజ్ఞాసువై యిట్లు ప్రశ్నింప తపోధనులగు బ్రాహ్మణులందఱు తమలో నొకడగు పరావసుని జూచి జేని సందేహమునకు సమాధానము చెప్పుమని కోరిరి. ధర్మజ్ఞులగు నా విద్వాంసులచే ప్రేరితుడై శూరుడు, మతిమంతుడునగు పరావసుడు విధిననుసరించి సంయత మనస్కుడై చాల సేపు ధ్యానయోగమున నుండీ. చివరకు సత్రాజితుని పూర్వ జన్మవృత్తాంతము నంతయును తెలిసికొనెను. అటు పై జిజ్ఞాసువు బుద్ధిమంతుడునైన అతనితో మునిపుంగవుడగు పరావసువు యిట్లు చెప్పుటకుద్యుక్తుడయ్యెను. మహాత్ముడు, జితశత్రుడు, మనస్వి, భార్యాయుక్తుడు, మహా బుద్ధిశాలియైన నత్రాజిత్తుకేగాక సత్యవాదులగు నచటి బ్రాహ్మణులందఱు వినునట్లుగా పరావసువిట్లనెను. 'రాజా! వినుము. నీ రాజ్యాది విభవములు, నీ సుందరాంగి భార్యయగుట మొదలగు నుత్తమ ఫలములన్నియు నే కర్మవలన కలిగేనో తెలిసికొనుము.

 మూ. త్వ మాసీః శూద్ర జాతీయః పరహింసా పరాయణః కుష్ఠార్తో దండపారుష్యో నిః స్నేహః సర్వజంతుషు

ఇయం చ భవతో భార్యా పూర్వమప్యాయతేక్షణా నిత్యం బభూవ త్వచ్చిత్తా భవచ్ఛుశ్రూషణేరతా

పతివ్రతా మహాభాగా భర్త్య మానాపి నిష్ఠురమ్ త్వద్వాక్యేషుచ సర్వేషు వీర! కర్మసు చోద్యతా

 నైశ్వర్యాద సహాయస్య త్యాజ్యమానస్య బంధుభిః క్షయం జగామఽ యోఽర్థే భూత్సంచితః ప్రపితామ హైః

 తస్మిన్ క్షీణే కృషిపర స్తమాసీః పృధివీపతే సోపి కర్మ విపాకేన కృషిర్వఫలతాంగతా

తతో నిఃస్వం పరిక్షీణం పరేషాంభృత్యతాం గతమ్ తత్యాజ సాధ్వీ నేయం త్వాం త్యజ్యమానాపి పార్థివ!

 అనయాతు సమం సాద్వ్యా భానోరావసథే త్వయా కృతం శుశ్రూషణం వృత్త్యాభక్త్యా సమ్మార్జనాదికమ్

 నిః స్నేహః సర్వమేభ్యస్తన్మయస్త్యం తదర్పణః అహన్యహని విస్రం భాత్తస్మిన్నావసథే రవేః

కాన్యకుబ్జపురే వీర! మహాశుశ్రూషితం త్వయా దీవాకరాలయే నిత్యం కృతం తన్మార్జనం త్వయా

తథైవా భుక్షణం భూప! నిత్యం చైవానులేపనమ్ పత్న్యానయా నృప! తథా యుష్మచ్చిత్తాను వృత్తయా

తా॥  పూర్వ జన్మమున నీవు హింసా పరాయణుడవైన శూద్ర జాతీయుడవు. కుష్ఠముతో బాధపడుచు, దండ పారుష్యముగలిగి సర్వ ప్రాణులయెడ నిర్దయుడవై జీవించు చుంటివి. నీ భార్యయగు ఈ విమలమతి పూర్వ జన్మమున కూడ విశాలనేత్రయై సౌందర్యవతియై యుండెను. నిరంతరము నీ యందే మనస్సు నిలిపి నీ సేవలోనే నిమగ్నమై యుండెను పతివ్రతయై, సాధ్వియై, నిష్ఠుర వాక్యములతో బెదరింపబడినను నీ యాజ్ఞలకే విధేయురాలై, నీ కర్మలనే చేయుచుండెడిది-53. దారిద్ర్యముచే నిస్సహాయుడవై, బంధు జనములచే విడిచివేయబడిన నీ తాతలనాటి యాస్తిపాస్తులన్నియు ధ్వంసమైపోయెను. రాజా! అట్టి క్షీణదశలో నీవు వ్యవసాయము చేయదొరకొంటివి. కాని దైవానుకూల్యములేమింజేసి నీ కృషియును వైఫల్యమునందెను. సాయనువారులేక మిక్కిలి దైన్యముతో నితరులకు సేవజేయుచు జీవింపనుంకించిననిన్ను సాధ్వియగునీమె విడువక తోడునీడయై యుండెను. పతివ్రతయగు నీమెతో గూడి నీవొక సూర్య దేవాలయమున నూడ్చి శుభ్రము చేయు నుద్యోగమున నుండి సూర్య భగవానునకు భక్తి శ్రద్ధలతో సేవ చేయుచుంటివి. సర్వ కామ్యముల నుండియు నిస్సంగుడవై, సూర్య భగవానుని భక్తితో తన్మయుడవై, యంకిత భావమున అహరహమును నా దేవునియందలి విశ్వాసముతో. కన్యాకుబ్జపురమునందలి యా సూర్యదేవాలయమున శ్రద్ధగా సేవ చేయుచుంటివి. ఆలయమున కసవు చిమ్మి. నీరుజల్లి, చక్కగా నలికి, అనుకూలవతియగు నీ భార్యతో గూడి శుశ్రూష చేయు చుంటివి.

మూ॥ కారితం శ్రవణం పుణ్య మితిహాస పురాణయోః దత్త్వాంగు లీయకం రాజనితృదత్తం తు వాచకే

అహన్యహని యత్కర్మ యువయోర్నృప! కుర్వతః తత్రైవ తన్మయత్వేన పాపహాని రజాయత

ఏవ మాయతనం రమ్య మిత్యేవం చ సుఖావహమ్ సూర్య వచ్చైవమేతత్యాది త్యాసేత్తే మనస్తదా

 యోగినాం సుఖదం కర్మ తదైవ సుఖ మిత్యపి భవచ్చిత్తమ భూత్తత్ర యోగ కర్మణ్యహర్నిశమ్

ఏవం తన్మనసస్తత్ర కృతోద్యోగస్య పార్థివ! భూతాను మానినః సమ్యగ్యథోక్తాధిక కారిణః

స్మరతో గోపతిం నిత్యం చిత్తేనాపి దృఢత్మనః నిఃశేషముపశాంతం తే పాపం సూర్య నిషేవణాత్

 తతోఽధికం పురస్తస్మాదగారస్యాను లేపనమ్ సంమార్జనం చ బహుశః సపత్నీకేన యత్కృతమ్

కేవలం ధర్మమాశ్రిత్య త్యక్త్వావృత్తి మశేషతః అనయా శ్రవణం పుణ్యం కారితం వాచకాత్సదా

నానాధాతు వికారైస్తు గోమయేన మృదాతథా ఊపలేపనం కృతం భక్త్యాత్వయాపూర్వం సురాలయే

తా॥ వాచకునకు పితృదత్తమైన అంగుళీయకమునిచ్చి పురాణేతిహాస పుణ్య కథాశ్రవణముఁజేయించితివి. మీరిరువురు ప్రతి దీనమాదేవాలయమున తన్మయత్వముతో నొనరించిన పుణ్యకర్మల వలన మీ పాపమంతయు నశించిపోయెను. 'సూర్య భగవానుని సేవ నాచే చేయబడవలయును. శ్రేష్ఠములైన పురాణ శ్రవణములాదిగ భానుదేవునికి ప్రీతి కలిగించు కార్యములు నేను చేయవలెను'. అని రాత్రింబవలు నీకిదే చింత కలుగుచుండెను. ఈ సూర్య మందిరమెల్లప్పుడును సూర్య భగవానునివలెనే రమ్యముగ ప్రకాశించుచు సుఖావహమైయుండవలెనని నీ మనస్సెప్పుడును తహతహలాడుచుండెను. యోగులకు యోగకర్మ సుఖ ప్రదమైనట్లు నీ చిత్తముకూడ నహర్నిశమును సూర్య సేవా రూపమగు. యోగ కర్మయందు లగ్నమై యుండెను-65. ఇట్లు తన్మయత్వముతో వృత్తిని నిర్వహించుచు, యోగ్యమైన యూహలు సేయుచు చెప్పిన దానికన్న నెక్కుడుగ పని చేయుచు-66. దృఢమనస్కతతో నెల్లప్పుడును సూర్య భగవానుని స్మరించుచుండిన నీ పాపమంతయును, సూర్య సేవ వలన, నిశ్శేషముగ నశించిపోయెను. దానికన్న నెక్కువగా నా పురమున నుండి, సూర్య మందిరమున, లేపన సమ్మార్జనాదికములను అనేక విధములుగ నీ భార్యతో గూడి చేసినందువలన పాపక్షయమయ్యెను. కేవలము ధర్మమునాశ్రయించి తక్కిన వృత్తులను వదలి పెట్టి వాచకునితో పుణ్య కథా శ్రవణములను చేయించుట వలన పాపక్షయమయ్యెను. వివిధములైన ధాతు విశేషములచేత, గోమయముచేత, మట్టిచేత సూర్యాలయమున భక్తితో నుపలేపనము చేసినందువలన నట్టి ఫలము నీకు లభించేను.

మూ. అధాజగామ వై తత్ర కుపలాశ్వో మహీపతిః మహా సైన్య పరీవారః ప్రభూత గజవాహనః

సర్వ సంపదు పేతం తం సర్వాభరణ భూషితమ్ వృతం భార్యా సహస్రేణ దృష్ట్యా సంక్రందనోద్బలమ్ స్పృహా కృతా త్వయా తత్ర చారు మౌలిని పార్థివే

 సర్వ కామ ప్రదం కర్మ క్రియతే భాస్కరాశ్రితమ్ తేనైత దఖిలం రాజ్య మశేషం చాప్తవాన్మహీమ్

తేజశ్చైవాధికం యత్తే తథైవ శృణు పార్ధివ! యోగ ప్రభావతో లబ్ధం కథ యామ్యఖిలం తవ  

తత్రైవావసథే దీపః ప్రశాంతః స్నేహ సంక్షయాత్ నిజభోజన తైలెన పునః ప్రజ్వాలితస్త్వయా

అనయాచోత్తరీయేణ వీర! వర్త్యోప బృంహితః తవ పత్న్యా స్వయం జ్వాల్య కాంతి రస్యాస్తతోఽధికా

తవాప్యఖిల భూపాల మనః క్షోభకరం పునః తేజో నరేంద్ర! ఏతస్మాత్కిముతారాధ్య భాస్కరమ్

 ఏవం నరేంద్రః శూద్రత్వాద్భాను కర్మ పరాయణః తన్మయత్వేన సంప్రాప్తో మహిమాన మనుత్తమమ్

కింపునర్యో నరో భక్త్యా నిత్యం శుశ్రూషణాదృతః కరోతి సతతం పూజాం నిష్కామోనాన్య మానసః

సర్వా మృద్ధిమిమాం లబ్ద్వా సర్వలోకమ హేశ్వరః పూజయిత్వార్కమిశేశం తమారాధ్యనసీదతి

తా॥ ఇట్లుండ నొకనాడచటికి కువలాశ్వుడను రాజు మహాసైన్య పరివారములుగలవాడై, అధికమైన గజవాహనములు గలవాడై యేతెంచెను. ఇంద్రవైభవముతో, తనవేయిమంది భార్యలతో నావరింపబడి, సర్వాభరణ భూషితుడై, సర్వ సంపత్సమేతుడై వచ్చిన ఆ రాజును చూచి, యందమైన కిరీటమును ధరింపగల రాజును కావలెనని నీకు కోరికపుట్టెను. సర్వ కామ ప్రదమైన భాస్కర దేవునీ సేవా ఫలముగ నీ యఖిల విభవాభిరామమగు నశేష రాజ్యమును పొంది చక్రవర్తివి కాగలిగితివి. నీ విశేషమగు తేజ స్సే యోగప్రభావముతో కలిగినదో సాకల్యముగ వివరించుచున్నాను వినుము. సూర్య మందిరమునందలి దీపము, నూనె నిండుకొనుటచేత కొండకెక్కిపోయినప్పుడు నీ భోజన సంబంధమగు తైలమును బోసి మఱల వెల్డించుచుంటివి. వత్తి క్షీణించిపోయినపుడీమె తన చీర చెఱఁగుతో వత్తిని సిద్దముచేసి పూర్వపు వత్తికి కలిపి పెంచుచుండెడిది. నీ భార్య యిట్లు మిక్కిలిగ నారాధించుటచేత నీ కిట్లు రాజులందఱు నీర్యపడగల తేజస్సు కలిగెను. రాజా! శూద్రత్వమువలన సంక్రమించిన సేవా పరాయణత్వము సూర్య సంబంధముగ సంఘటించుటచేతను, దానిని నీవు తన్మయత్వముతో నిర్వహించియుండుటచేతను సర్వోత్తమమగు ఘనతను పొందగల్గితివి. ఇక తదేక మనస్కుడై, నిష్కామ భావముతో సూర్య భగవానుని పూజా సేవాదులు నిత్యము చేయగలు మానవుడు పొందు ఫలమును గుఱించి చెప్పునదేమి?. ఈశ్వరేశ్వరుడగు సూర్యుని పూజించువాడు సకల సంపత్సమృద్ధిని, సర్వ లోక మహేశ్వరత్వమును పొంది సుఖించునే గాని యెన్నటికిని నష్టము నొందడు.

 మూ. పుష్పైర్దూ పైస్తధావాన్యైర్దీ పై ర్వస్త్రానులేపనైః ఆరాధయార్కం తద్వేశ్మ తదా సమ్మార్జనాదినా

యద్య దిష్టతమం కించి ద్యద్యదన్యత్తు దుర్లభమ్ తద్దత్వాచ జగద్ధాత్రే భాస్కరాయ నసీదతి

సుగంధాగురు కర్పూర చందనాగురు కుంకుమైః వాసోభిర్వివిధైర్దూపైః పుష్పైః స్రక్చామర ధ్వజైః

అన్యోప హారైర్వివిధైః కృత క్షీరాభిషేచనైః గీత వాదిత్ర నృత్యాద్యై స్తోషయస్వార్క మాదరాత్

పుణ్య రాత్రిషు మార్తాండం నృత్య గీతై రథోజ్జ్వలమ్ భూప జాగరణేర్భక్త్యా హోమః కార్యః సదాశుచిః

ఇతిహాస పురాణానాం శ్రవణేన విశేషతః తథా వేదస్వనైః పుణ్యైః ఋక్సామ యజుభిర్నృప!

ఏవం సంతోష్యతే భక్త్యా భగవాన్భవ భంగకృత్ భూయోవైవస్వతో భూత్వా భవహృద్భాస్కరో నరైః

 తోషితో భగవానాను ర్ధదాత్యభిమతం ఫలమ్ దైవ కర్మ సమర్ధానాం ప్రాణినాం స్కృతి సంభవైః

తోషితో భగవాన్కామాన్ప్రయచ్ఛతి దివాకరః నైష వృత్తైర్నరత్నౌఘైః పుష్పై: ర్దూపానులేపనైః

సద్భావే నైవ మార్తాండ స్తోషమాయాతి సంస్మృతః

త్వయైకాగ్ర మనస్కేన గృహ సమ్మార్జనాదికమ్ కృత్వాల్ప మా దృశం ప్రాప్తం రాజ్యమన్యేన దుర్లభమ్

తా॥ పుష్ప ధూప దీప వస్తాను లేపనాదులచేతను, సూర్య మందిరమున సమ్మార్జనాది కర్మలచేతను ఆ దేవదేవునారాధింపుము. సూర్య దేవునకు మిక్కిలి ప్రియమైన వస్తువులను, దుర్లభములైన ప్రత్యేక వస్తువులను సర్వ జగత్కర్తయగు భాస్కర భగవానునకు సమర్పించిన వాడెవడైనను చెడడు. పరిమళ ద్రవ్యములు, అగురు, కర్పూరము, చందనము కుంకుమము, వస్త్రములు, వివిధములైన ధూపములు, పుష్పములు, మాలలు, వింజామరలు, టెక్కెములు: ఇతరములగు కానుకలు, ఘృతక్షీరాభిషేకములు, గీత వాద్య నృత్య ప్రదర్శనలు మొదలగువానిచేత సూర్య భగవానుని సంతోష పెట్టుము. పుణ్య రాత్రులందుజ్జ్వలములైన నృత్య గీతాదులతో మార్తాండుని సేవింపుము. రాజా! భక్తితో సూర్య ప్రీత్యర్థముగ జాగరణములను, శుచిర్భూతుడవై హోమ కార్యములను నిర్వహింపుము. ముఖ్యముగ నితిహాస పురాణ కథా శ్రవణములచేత, మంగళ ప్రదములైన ఋగ్యజుస్సా మాధర్వవేద ఘోషల చేతను సూర్య దేవునికి ప్రీతి కలిగింపుము. భవ భంజకుడైన భాను భగవానుడిట్లు భక్త్యుపచారములతో తుష్టినొందును. నరులచే నిట్లు సంతోషింపజేయబడి భాస్కరదేవుడు యమ ధర్మరాజై వారి పాప సంచితమును హరించివేయును ధర్మశాస్త్ర బి సులభముగించి ఈ కరుణ యులో పురుగు - రత్న సమూహములు, పుష్ప ధూపాను లేపనములు మున్నగువాని యక్కఱలేకయే, కేవలము స్వచ్ఛమైన భావముతో నాతని స్మరించిన మాత్రముననే, ప్రసన్నుడై కామ్యములనొసంగును. ఏకాగ్ర మనస్కుడవై నీవు సూర్య మందిరమున సమ్మర్జనాదికములగు నిట్టి సాధారణ కర్మల నాచరించి యుండిన మాత్రమున తత్ఫల స్వరూపముగ నేడన్యదుర్లభమగు రాజ్యమును పొందగలిగితివి.

 మూII  అనయా శ్రవణం పుణ్యం కారయిత్వా గృహేరవే: ఈదృక్ర్పాప్తా సంపదయం పూజాం కృత్వాతు వాచకే

ప్రాప్తోప కరణైర్యస్తమేకాగ్ర మతిరండజమ్ సంతోషయతి నేంద్రోఽపి భవతావై సమః క్వచిత్

తస్మాత్వమనయా దేవ్యా సహాత్యంత వినీతయా భాస్కరారాధనే యత్నం కురు ధర్మ భృతాంవర!'

 బ్రహ్మోవాచ :

ఏతన్మునేర్వచో వీర! నిశమ్యస నరాధిపః భార్యాసహాయః సతదా సంప్రహృష్ట తనూరుహః

కృతకార్యమివాత్మానం మన్య మానస్తదాభవత్ ఉవాచ ప్రణతో భూత్వా రాజా సత్రాజితో చ్యుత!

 సత్రాజిత ఉవాచ :

యథామరత్వం సంప్రాప్య యథావాయుర్బలం పరమ్ పరం నిర్వాణమాప్నోతి తథాహం వచసాతవ

కృతకృత్యః సుఖాసీనో నిర్వృతిం పరమాంగతః అజ్ఞాన తమసాచ్ఛన్నే యత్ప్రదీపస్త్వయా ఘృతః

అహమేషాచతత్వంగీ విభూతి భ్రంశ భీరుకః ద్రవ్య మాపాదితం బ్రహ్మన్నిహాద్య వచసాతవ

సంపదః కథితం బీజ మావయోర్భవతా మునే! త్వద్వక్రా దుద్యతావాచో విజ్జా తాహి ద్విజోత్తమ

 న రత్నైర్నచ విత్తౌఘైర్నచ పుష్పాను లేపనైః ఆరాధ్యశ్చ జగన్నాథ్ భావ శూన్యై ర్దివాకరః

బాహ్యార్థ నిర పేక్షైశ్చ మన సైవ మనోగతిః నిః స్వైరారాధ్యతే దేవో భానుః సర్వేశ్వరేశ్వరః

తా॥ నీ భార్యయగు నీమె సూర్య దేవాలయమున పుణ్య కథా శ్రవణమును నిర్వహించి, వాచకుని పూజించిన ఫలముగ నీ విధమగు సంపదను పొందగలిగినది. లభించిన యుపకరణములతో సేవించి, నిశ్చలమైన మనస్సుతో నా భానుదేవుని, నీవు సంతోషింపఁజేసినట్లుగ నా యింద్రుడు కూడ సంతోషింపఁజేసియుండలేదు. కాబట్టి ఓ రాజా! అత్యంత పవిత్రురాలగు నీ భార్యతో గూడి యీ జన్మలో కూడ సూర్య భగవానునారాధించుటకు ప్రయత్నింపుము. భవిష్యత్తు సుఖావహమై యుండగలదు”. బ్రహ్మదేవుడిట్లు నుడివెను. “విష్ణు దేవా! సత్రాజత్తు చక్రవర్తి యా మునిపుంగవుని వాక్యములు విని భార్యతో సహా సంతుష్టాంతరంగుడై పులకించిపోయెను. తనను తాను కృతకృత్యుడుగ భావించుకొని మునిశ్రేష్ఠునకు నమస్కరించి యిట్లనెను. "మునివర్యా! మీ వాక్యములచే నా ప్రాణ వాయువులు కొత్త బలమును సంతరించుకొని యమృతత్వమును పొంది బ్రహ్మానందము నొందినట్లైనవి. కృతార్థుడనైతిని. మనస్సూట పొందినది. ఇక నిశ్చింతగనుందును. అజ్ఞాన తమస్సుచే నావరింపబడియున్న నేను, మా యుపదేశముతో జ్ఞాన తేజమును బడసితిని. నేను, నా భార్యతో సహా, ఐశ్వర్య భంగ భయమున నుంటిని. కాని బ్రహ్మన్! మీ వాక్యములచే ద్రవ్యమాపాదింపబడినది సుమీ!. ద్విజోత్తమా! మీ ముఖ నిర్గతమైన వాక్కులచే, మా సంపదలకు బీజము చెప్పబడినదని గ్రహించితిమి. రత్నములచే, ధన సమూహములచే, పుష్పాను లేపనములతోగాక ఆదేవదేవుడు స్మరణ మననాదులచే పూజలందుకొనునని తెలిసికొంటిమీ. సర్వేశ్వరేశ్వరుడైన ఆ భానుదేవుడు బాహ్య వస్తు నిరపేక్షముగ, కేవలము మనస్సుచే మాత్రమే, తన వికానివి, అతనివేయైనట్టివియునైన భక్తి భావనలచే పూజింపబడదగియు నుండును.

 మూII సర్వ మేతన్మయాజ్ఞాతం యత్వమాత్థమహామునే! యచ్చ పృచ్ఛామి తన్మేత్వం ప్రసాద సుసుఖోవద 

 కథ మారాధితో దేవో నరైః స్త్రీభిశ్చ భాస్కరః తోష మాయాతి విప్రేంద్ర! తద్వదస్య మహామునే

రహస్యానిచ దేవస్య ప్రీతయే యా తిథిః సదా చాన్య శేషాని యే బ్రూహి అర్కారాధన కాంక్షిణః

పరావస్తు రువాచ :

 “శృణు భూపాల! యైర్భాను ర్గృహేష్వారాధ్యతే జనైః నారీభిశ్చాతి ఘారేస్మిన్పతితా భిర్భవార్ణవే

 సమభ్యర్చ్య జగన్నాథం దేవకర్మ సమాధినా ఏకమశ్నాతి యోభక్తం ద్వితీయం బ్రాహ్మణార్పణమ్

 కరోతి భాస్కర ప్రీత్యై కార్తికం మాసమాత్మనా పూర్వే వయసి యత్నేన జానతాఽజానతా పివా

పాపమాచరితం తస్మాద్భిద్యతే నాత్ర సంశయః అనేనైవ విధానేన మాసి మార్గశిరేపునః

 సమభ్యర్చ్య మరకతం విప్రేభ్యోయః ప్రయచ్ఛతి భగవత్ర్పీణనార్థాయ ఫలం తస్య శృణుష్వమే

మధ్యే వయసి యత్పాపం యోషితా పురు షేణవా కృతమస్మాచ్చ తేనోక్తో విమోక్షః పరమాత్మనా

తా॥ మీరు చెప్పుచుండిన దానిని బట్టి నాకీ విషయములన్నియు తెలిసినవి. నాపై యనుగ్రహముంచి యిటు పై నేనడుగబోవు విషయమును గూర్చి సుముఖులరై చెప్పవేడుచున్నాను. విప్రేందా! స్త్రీలుగానీ, పురుషులుగాని సూర్య దేవునెట్లు పూజించిన నాతడు సులభముగ ప్రసన్నుడగును? దయచేసి చెప్పుడు. ఆ దేవ దేవుని ప్రీతి కొఱకునైన రహస్యములు, తిథి, ఇంకను విశేషములేవైననున్నచో వానినన్నంటినీ సూర్యారాధన పై నపేక్షగలనాకు దేలియజేయుడు”. సత్రాజిత్తు జిజ్ఞాసనుగమనించి పరావసుముని యిట్లనెను “రాజా! మిక్కిలి భయంకరమగు సంసార సముద్రమునఁబడి యున్న పురుషులు, స్త్రీలు దానిని తరించుటకై తమ తమ గృహములలో సూర్య భగవానునేట్లారాధింపవలయునో చెప్పుచున్నాను వినుము. జగన్నాథుడైన సూర్య భగవానుని మిక్కిలి భక్తి శ్రద్ధలతో తదేక మనస్కతతో నారాధించి యొక 'భోజనము తాను చేసిన రెండవ భోజనము బ్రాహ్మణునకు సమర్పింపవలెను. అనగా ప్రతి యైనవాడు ప్రతి పర్యాయమును బ్రాహ్మణ భుక్త శేషమునారగింపవలెను. భాస్కర ప్రీత్యర్థమై కార్తిక మాసమంతయు నిట్లు ప్రతాచరణముచేసినచో తాను పూర్వ వయస్సున తెలిసియో, తెలియకయో. చేసియున్న పాపములన్నియు పటాపంచలై పోవుననుటలో సందియములేదు. ఇట్లే మఱల మార్గశిర మాసమున చేయవలెను. సూర్యు నారాధించి, బ్రాహ్మణులకు గారుత్మతమును (పచ్చజాయిని) భగవత్రీత్యర్థముగ దానముచేయువానికి కలుగు ఫలమును వివరింతును వినుము. స్త్రీగాని, పురుషుడుగాని తమ మధ్య వయస్సున చేసిన పాపము దీనివలన నశించిపోవునని పరమాత్మయే చెప్పియున్నాడు.

 మూ॥ తథాచైవేక భక్తంతు యస్తు విప్రాయ యచ్ఛతి దివాకరం సమభ్యర్చ్య పౌషే మాసి మహీపతే!

తత్తచ్చ ప్రీణయత్యర్కం వర్ధికేనైవ యత్కృతమ్ స తస్మాన్ముచ్యతే రాజ న్పుమాన్యోషిదథాపివా

 త్రిమాసికం వ్రతమిదం యః కరోతి నరేశ్వర! సభాను ప్రీణనాత్పాపై ర్ల ఘుభిః పరిముచ్యతే

ద్వితీయే వత్సరే రాజన్ముచ్యతే చోపపాతకైః తద్వత్తృతీయేపీకృతం మహాపాతక నాశనమ్ 

వ్రతమేతన్నరైఃస్త్రీభిస్త్రీభిర్మాసైరనుష్ఠితమ్ త్రిభిః సంవత్సరైశ్చైవ ప్రదదాతి ఫలం నృణామ్

 త్రిభిర్మాసైరనుష్టానాత్రి విధాత్పాతకాన్నృప! త్రీణి నామాని దేవస్య మోచయంతిచ వారికైః

యతస్తతో వ్రతమిదం వివిధం సముదాహృతమ్ సర్వ పాపప్రశమనం భాస్కరారాధనే పరమ్”

సత్రాజిత ఉవాచ :

 “కతమాయతు విప్రాయ దాతవ్యం భక్తితో మునే! ద్వితీయే ద్విజశార్దూల! కథయ స్వాభిలంమమ”

పరావసురువాచ :

“దేయే పురాణ వీదు షే వస్త్రే విప్రోత్తమాయచ శ్రూయతాం చాపి వచనం యదుక్తం భాస్కరేణచ  అరుణాయ మహాబాహో! పృచ్ఛతే యత్పురా నృప!

తా॥  సూర్య భగవాను నర్చించి, ఒక భోజనము చేసిన నొక భోజనము బ్రాహ్మణున కర్పించుచు వుష్య మానమునందీ " వ్రతమాచరించి. సూర్య దేవునకు ప్రీతి కలిగించినచో ముసలి తనమున చేసిన ఆయా పాపములన్నియును - పురుషునవియైనను, స్త్రీవి యైనను నశించిపోవును. రాజా! మూడు మాసము లీవ్రతమునోచరించినవాడు సూర్యప్రీతి కలిగించిన పోడగుటవలన నట్టి వాడు లఘుపాపములనుండి ముక్తుడగును. రెండవ సంవత్సరమున చేసినచో నుపపాతకములనుండీ ముక్తుడగును. అట్లే మూడవ సంవత్సరమునకూడ చేసినచో మహా పాపములు నశించిపోవును. పురుషులుగాని, స్త్రీలుగాని యీ వ్రతమును ప్రతి సంవత్సరము మూడేసి మాసముల చొప్పున మూడు సంవత్సరములనుష్ఠించినచో నా దేవుడు గొప్ప ఫలమునిచ్చును. మూడు మాసములుగా మూడు సంవత్సరములీ వ్రతాచరణము చేయువారి మూడు విధములైన పాతకముల నుండి, సూర్య భగవవానుని మూడు నామములు వారిని ముక్తులను జేయును. భాస్కరారాధన విషయమై శ్రేష్టములు, సర్వ పాపప్రశమనములగుటం జేసి ఈ వ్రత విధానములన్నియును నీకుఁజెప్పబడినవి". సత్రాజితుడిట్లనెను. “మునీశ్వరా! రెండవ మాసమున (సంవత్సరమున) బ్రాహ్మణులలో నెట్టి వానికి భక్తితో దానము లాదిగ చేయవలెనో నాకు వివరించి చెప్పుడు”. పరావసుముని యిట్లు చెప్పసాగెను “పురాణముల జ్ఞానముగల విద్వాంసునకు వస్త్రముల జత యీయవలెను. పూర్వ మరుణుడడిగినప్పుడు స్వయముగ సూర్య భగవానుడే చెప్పిన విషయము వినుము.

మూ. ఉదయాచల మారూఢం భాస్కరం తిమిరాపహమ్ ప్రణమ్య శిరసా నూనమిదం వచన మబ్రవీత్ 

“కాని ప్రియాణితే దేవ! పూజనే సంతి సర్వదా పుష్పాదీనాం సమస్తానా మారాధన విధౌ సదా ఉపరాగాది వస్త్రాదౌ బ్రాహ్మణానాం తథా రమే!

భాస్కర ఉవాచ :

“పుష్పాణాం కరవీరాణి తథా రక్తంచ చందనమ్ గుగ్గులశ్చాపి ధూపానాం నైవేద్యే మోదకాః ప్రియాః

పూజాకరో భోజకస్తు ఘృత దీప స్తథా ప్రియః దానం ప్రియం ఖగశ్రేష్ఠ!వాచకాయ ప్రదీయతే

 మాముద్దిశ్యచ యద్దానం దీయతే మానవైర్భువి వాచకాయతు దాతవ్యం తన్మమ ప్రీతయే ఖగ!

 ఇతిహాస పురాణాభ్యామభిజ్ఞో యస్తు వాచకః బ్రాహ్మణోపై ఖగ శ్రేష్ఠ! సంపూజ్యః ప్రీతయేమమ

పూజితేఽ స్మిన్సదా విప్రే పూజితోహం న సంశయః భవామి ఖగ శార్దూల! యతస్త్విష్టః సమేసదా

వేద వీణామృదంగైశ్చ నాతి గంధ విలేపనైః తథామే జాయతే ప్రీతిర్యథా శ్రుత్వా ఖగోత్తమ! 

ఇతిహాస పురాణాని వాచ్యమానాని వాచకై: అతః ప్రియో వాచకోమే పూజాకర్తాచ భోజకః

ఇతి శ్రీ భవి షే మహాపురాణే బ్రాహ్మే పర్వణి సప్తమీ కల్పే సత్రాజితో పాఖ్యానే

 రవి పూజా విధి వర్ణనం నామ షోడశోత్తర శతతమోఽధ్యాయః

తా॥ ఉదయాద్రి నధిరోహించిన తిమిరాపహుడైన భాస్కరునకు శిరసు వంచి నమస్కరించి అరుణుడిట్లనెను. దేవో! పుష్పాది పూజా ద్రవ్యములలో తమకు మిక్కిలి ప్రియమైనవేవి? ఎల్లప్పుడును మి పూజలో వినియోగింపదగిన వస్తువులేవి? గ్రహణాది పర్వకాలములందు బ్రాహ్మణులకీయదగిన వస్త్రాది దానములెవ్వి?” అనూరుని ప్రశ్నలు విని భాస్కరదేవుడిట్లనెను "పువ్వులలో గన్నేరు పువ్వులు, చందనములలో ఎట్టి చందనము, ధూపములలో గుగ్గిలము, నైవేద్యములలో లడ్డువములు, నాకు ప్రియమైనవి. పూజకులలో భోజకుడు, దీపములలో నేతి దీపము, దానములలో వాచకునికిచ్చు దానము నాకిష్టము. నన్నుద్దేశించి మానవులు చేయుదానములలో నొక్కువ ప్రీతి కలిగించునది పురాణ వాచకున తీయబడుదానమే. వాచకుడన నితిహాస పురాణాదులను చక్కగా నేజింగియున్న బ్రాహ్మణోత్తముడు, నా ప్రీతి కొఱకతనిని పూజింపవలెను. ఈ వ్రతానుష్టానమున బ్రాహ్మణుని పూజించినచో నన్ను పూజించినయట్లే సందేహములేదు, ఏలయన నాతడేల్లప్పుడు నా కిష్టమైన వాడు. వేద ఘోషలు, వీణా మృదంగాది వాద్యమధురిమలు, సుగంధ విలేపనములు కూడ ఇతిహాస పురాణముల ప్రవచనములు కలిగించునంత ప్రీతిని నాకు కలిగింపజాలవు. అవి వాచకులు చెప్పుచుండ వినినప్పుడు నాకు మిక్కిలి యానందము కలుగుచుండును. కావున నాకు వాచకుడన్నను, పూజకులలో భోజకుడన్నను మిక్కిలి యిష్టము.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్యమున, సప్తమీ కల్పమునందు సత్రాజితోపాఖ్యానమున రవి పూజావిధి వర్ణనమను నూట పదునాఱవ అధ్యాయము సమాప్తము.